మనసుల బంధం... కట్నాల సంబంధం!
- Munipalle Vasundhara Rani

- 1 hour ago
- 3 min read

Manasula Bandham Katnala Sambandham - Telugu Love Marriage Story | Vasundhara Rani Munipalle
మనసుల బంధం... కట్నాల సంబంధం! - తెలుగు లవ్ మ్యారేజ్ కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 08/08/2026
**ప్రేమించుకున్న కార్తీక్, శ్రుతి తమ పెళ్లికి పెద్దలను ఒప్పించగలిగామని సంతోషించారు. కానీ లవ్ మ్యారేజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కట్నం, బంగారం, కుటుంబ హోదా గురించి పెద్దలు లెక్కలు మొదలుపెట్టడంతో వారి ఆనందం ఆందోళనగా మారింది. ప్రేమతో కలవాల్సిన రెండు కుటుంబాలు పెళ్లిని ఒక బిజినెస్ డీల్‌లా మార్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నవ్విస్తూనే కట్నం, కుటుంబ ప్రతిష్ఠ, ఆధునిక ప్రేమ వివాహాలపై ఆలోచింపజేసే కథే “మనసుల బంధం... కట్నాల సంబంధం!”.
కార్తీక్, శ్రుతి గత ఐదేళ్లుగా ఒకే ఐటీ కంపెనీలో పనిచేస్తూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో చెబితే ఒప్పుకుంటారో లేదో అనే భయం ఇద్దరినీ వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా కార్తీక్ వాళ్ల నాన్న రాఘవయ్య గారు అంటే ఊళ్లో పెద్ద వ్యాపారి, పైగా పాత కాలపు మనిషి. ఆయన ముందు లవ్ మ్యారేజ్ ప్రస్తావన తెస్తే ఫ్యూజులు ఔట్ అయిపోతాయని కార్తీక్ భావించాడు.
చివరకు ఒక రోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇద్దరూ రాఘవయ్య గారి ముందు నిలబడ్డారు. కార్తీక్ వణికిపోయే గొంతుతో— "నాన్నా.. మేము ఐదేళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం" అని గట్టిగా కళ్లు మూసుకున్నాడు.
కానీ, రాఘవయ్య గారు ఎలాంటి కోపమూ ప్రదర్శించకుండా, చాలా సాధారణంగా పేపర్ మడతపెట్టి పక్కన పెట్టి నవ్వుతూ అన్నారు:
"అంతేనా? మీ ఇద్దరూ లవ్వా? పోనీలేండి, నాకేదో కులం గోల, మతం గొడవ వస్తుందనుకున్నాను. ఈ రోజుల్లో పిల్లల ఇష్టమే ముఖ్యం కదా! నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను!"అన్నారు
కార్తీక్, శ్రుతికి ఆకాశంలో తేలినంత పనైంది. "నిజమేనా నాన్నా? మాకు ఎలాంటి షరతులు లేకుండా ఒప్పుకున్నారా?" అని ఆనందంతో గెంతులేశారు. లవ్ మ్యారేజ్ కదా, పెద్ద ఖర్చులు లేకుండా సింపుల్‌గా అయిపోతుందని ఇద్దరూ మనసులో ఊహాలోకాల్లో విహరించడం మొదలుపెట్టారు.
కానీ అసలు తుఫాను ఇప్పుడే మొదలైంది!రాఘవయ్య గారు కూడా తగ్గేదేలే అన్నట్లు తన టేబుల్ డ్రాయర్ తెరిచి, ఒక పెద్ద లెక్కల పుస్తకం తీసి— వధువుకి అరవై తులాలు బంగారం, డైమండ్ నెక్లెస్, బంధువులందరికీ వెండి నాణ్యాలు అంటూ బాధ్యతాయుతంగా ఒక పెద్ద లిస్ట్ చదవడం మొదలుపెట్టారు.
అందుకు రాఘవయ్య గారు ఒక పెద్ద కార్పొరేట్ బాస్ లా నవ్వుతూ:
"ప్రేమ మీ ఇద్దరిది, పెళ్లి ఏర్పాట్లు మావి! లవ్ మ్యారేజ్ అయినా సరే... ఇది పక్కా ట్రెడిషనల్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగే జరగాలి కదా!" అన్నారాయన.
రాఘవయ్య గారు ఓకే చెప్పిన మరుసటి క్షణమే, కార్తీక్ వాళ్ల అమ్మ సుశీలగారు వెంటనే శ్రుతి వాళ్ల అమ్మ గౌరిగారికి ఫోన్ కలిపింది.
కాస్త గర్వంగా, హుందాగా గొంతు సవరించుకుని:
"హలో గౌరిగారూ! మీ అమ్మాయి మా కార్తీక్ లవ్ నడుపుతున్నారటగా! సరే, మావారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక అసలు మ్యాటర్ కి వద్దాం... పెళ్లికి మీ అమ్మాయికి ఎంత బంగారం పెడతారు? మా ఫ్యామిలీ స్టేటస్‌కి తగినట్లు ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి?"
అది విన్న శ్రుతి వాళ్ళ అమ్మ గౌరిగారికి ఒక్కసారిగా చిర్రెత్తిపోయింది.
ఫోన్‌ను వెంటనే లౌడ్‌స్పీకర్‌లో పెట్టి ఘాటుగా బదులిచ్చింది:
"ఏంటండీ సుశీలగారూ! ఇదేమైనా మీరు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? ఇది స్వచ్ఛమైన లవ్ మ్యారేజ్! మీ అబ్బాయే మా అమ్మాయి వెనుక పడి తిరిగితే చివరికి కరిగి ఒప్పుకున్నాం. ఇలా కట్నాలు, బంగారాలు అని ఎలా అడుగుతారండీ?"
వెంటనే సుశీలగారు ఏమాత్రం తగ్గకుండా, వ్యంగ్యంగా
“ఓహో! అదేనండి... అదే నేను అంటున్నది. అదేదో అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మా హోదాకి తగ్గట్టు మీరే స్వయంగా దండిగా కట్నాలు, బంగారాలు అన్నీ కుప్పలు కుప్పలుగా తెచ్చి మా ఇంట్లో పోసేవారు కదా! లవ్ మ్యారేజ్ అనగానే ఇలా చేతులు ఎత్తేస్తే ఎలాగండీ?”అంది.
అది విన్న గౌరిగారి రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. మాటలు వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వకుండా అచ్చమైన కోస్తా యాసలో మాటల తూటాలు పేల్చింది:
"ఏంటండీ మీ మాటలు! అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మీ ఇష్టానుసారంగా కట్నాలు తీసుకోవచ్చు
అనుకుంటున్నారా? మా అమ్మాయి ఏడాది సంపాదన ఎంతో చూసారా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అది సంపాదించే జీతం ముందు... మీరు ఆశించే కట్నం లెక్కలు అసలు ఏ మూలకూ సరిపోవు!"అంది.
ఫోన్ అవతల సుశీలగారికి దిమ్మ తిరిగిపోయింది. ఏం మాట్లాడాలో తోచక అలా ఫోన్ పట్టుకుని విగ్రహంలా నిలబడిపోయింది.
కార్తీక్, శ్రుతి ఆ పెద్దల వార్ విన్న తర్వాత ఒకచోట కలుసుకుని తీవ్రంగా చర్చించుకున్నారు.
ఇద్దరి మొఖాలూ డీలా పడిపోయి ఉన్నాయి.
శ్రుతి నిట్టూర్పు విడిచి, బాధగా అంది:
"చూశావా కార్తీక్! మనం ఏమనుకున్నాం? మ్యారేజ్ అంటే అనవసర ఖర్చులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా చేసుకుందాం అనుకున్నాం! కానీ మన ఇంట్లో వాళ్లేమో దీన్ని ఒక బిజినెస్ డీల్ లా మార్చేస్తున్నారు."అంది.
కార్తీక్ తల పట్టుకుంటూ, నిస్సహాయంగా
"అవును శ్రుతి! మనమేమో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆ డబ్బుతో హనీమూన్‌కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ చూస్తే మా నాన్న ఏమో పెద్ద పెద్ద లెక్కలు వేస్తున్నారు, మా అమ్మ ఏమో కట్నాల కోసం ఫోన్లలో గొడవ పతున్నారు.
పెద్దవాళ్ల ఆలోచనలు చూస్తుంటే మనకైతే పిచ్చిపట్టేలా ఉంది!"అన్నాడు.
తాము ప్రేమ వివాహం చేసుకుంటున్నది ఇద్దరు వ్యక్తుల మధ్యనా, లేక రెండు కార్పొరేట్ కంపెనీల విలీన ఒప్పందమా (Merger & Acquisition) అని ఆ జంటకు అర్థం కాలేదు.
ఎవరినీ నొప్పించకుండా ఇద్దరి తరపున పెద్దల అంగీకారంతో, అందరి ఆశీస్సులతో, అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ, ఒప్పుకున్నట్తే ఒప్పుకుని ఇలా మాట్లాడితే ఏం చేస్తాం? మనకు ఇష్టం లేకపోయినా ఇంక రిజిస్టర్డ్ మ్యారేజ్ తప్పేట్టు లేదు"
అనుకుంటూ స్లాట్ బుక్ చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ వైపు అడుగులు వేశారు!
***
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.









Comments