top of page

ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Prema Viluva Thelusukunna Chiluka ' New Telugu Story Written By Pendekanti Lavanya Kumari


రచన: పెండేకంటి లావణ్య కుమారి




ప్రేమకు విలువ కట్టడం ఎవరి వల్లా కాదు. అలా విలువ కట్టవలసి వస్తే మాత్రం, మనకు ప్రేమ ఇచ్చిన వారికి తిరిగి అంతకంటే ఎక్కువ ప్రేమను ఇచ్చినప్పుడే విలువ కట్టినట్టవుతుంది. ఇంక మంచి తల్లిదండ్రుల ప్రేమైతే వెల కట్ట లేనిది. వారి రుణం తీర్చుకోవాలంటే, తిరిగి వారిని బిడ్డలుగా కడుపున మోసి కని మాత్రమే తీర్చుకోగలము. (సామాన్యంగా తల్లిదండ్రులందరూ మంచిగానే వుంటారులెండి, అయినా ఏ కొందరో బాధ్యతారహితంగా వుండి పిల్లలను కష్టాల పాలు చేస్తుంటారు. అలాంటి వారి రుణం గురించి కాదని చెప్పటానికే మంచి తల్లిదండ్రులు అన్నాను.) నాకు తెలిసి, నిస్వార్థమైన ప్రేమకు కానీ సహాయానికి కానీ, సేవలకు కానీ విలువ కట్టలేము. నిస్వార్థంగా ఎవరైనా సహాయం చేస్తే దానికి వెలకట్టడమంటే మనం వారికో, వేరేవారికో అంతే నిస్వార్థంగా సహాయం చేయడంతోనే సాధ్యం. ప్రేమ విలువ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక రావి చెట్టు మీద ఒక రామచిలుకల గుంపుండేది. ఆ గుంపులో వాటికవి జతలు కట్టేవి. జత కట్టడానికి మగ చిలుకలు ఆడ చిలుకల ముందు రకరకాల వేషాలు వేసి ఆకట్టుకునేవి. అలాగే ఒక ఆడ చిలుక ఒక మగచిలుక వేషాలు చూసి జత కట్టి సావాసం చేయసాగింది. ఆ మగ చిలుక మొదట్లో భార్యతో బాగా వుండేది, తర్వాత్తర్వాత అది ఆడ చిలుకను చాలా ఇబ్బందులు పెట్టసాగింది. నిజానికి ఆ మగ చిలుక చాలా మొరటుది. ఎప్పుడూ ఈ ఆడచిలుకను కొరకడం, కాళ్ళగోళ్ళతో బరకడం లాంటివి చేసేది. అప్పుడప్పుడూ... పాపం! ఆడచిలుకకు రక్తాలు కూడా వచ్చేవి. అది చూసిన గుంపులోని కొన్ని పెద్ద చిలుకలు ఈ మగచిలుకను కొన్ని సార్లు దండించటం కూడా జరిగింది. అప్పటికి ఆ మగచిలుక వింటుంది, ఇంక చేయనంటుంది, కానీ మళ్ళీ అప్పుడప్పుడూ అలానే ప్రవర్తిస్తుండేంది. ఆడచిలుక అలాగే భరిస్తూ గుడ్లను పెట్టింది. గుడ్లను పొదిగేప్పుడు భార్యను బాగానే చూస్కునేది, అలాగే పిల్లలు పుట్టాక వాటిని చూస్కోటం, వాటికి ఆహారం తీసుకు రావటం అలా అన్నిటికి మగచిలుక బాగానే బాధ్యత నిర్వహించేది. కానీ అప్పుడప్పుడూ మొరటుగా ప్రవర్తించడం మాత్రం ఆపలేదు. ఆడచిలుక తన భర్త మొరటుగా ప్రవర్తించినా బాధ్యతలు చూస్కుంటున్నాడు కదా అని అలాగే భరించసాగింది. పిల్లలు పెద్దవై గూటి నుండి వెళ్ళి పోయి వాటి పాటికవి జీవించటం మొదలెట్టాయి. ఆ తర్వాత, మళ్ళీ ఒకరోజు మగచిలుక, ఆడచిలుక మీద దాడి చేసి బాగా గోళ్ళతో రక్కి, ముక్కుతో కొరికి మొరటుగా ప్రవర్తించే సరికి, ఈ సారి పాపం!.. ఆడచిలుక రెక్క బాగా కోసుకుని రక్తం కారి ఎగరను కూడా ఎగరలేక పోయింది. ఇంక అది ఆహారం కోసం వెళ్ళలేక గూట్లోనే వుండిపోయింది. అది చూసి అన్ని చిలుకలు, ఆ మగచిలుకను చీవాట్లేసాయి. దానికి మగచిలుక కూడా కొంచెం సిగ్గుపడి, బాధపడి వాటితో, "ఇంకెప్పుడూ చేయనని" చెప్పింది. ఎగరలేని ఆడచిలుకతో, "గూటిలోనే వుండమని" చెప్పి ఆ రోజటికి ఆహారం తానే తెచ్చిచ్చింది. మళ్ళీ మరుసటి రోజు కూడా మగచిలుక ఆహారం తానే తెస్తానని ఆడచిలుకను గూట్లోనే వుండమని చెప్పి, వెళ్ళి వచ్చే సరికి గూట్లో ఆడచిలుక కనిపించలేదు. ఎక్కడికెళ్ళిందోనని, అక్కడే వున్న కొన్ని చిలుకలని అడుగగా, అవి "నీ భార్యను వేటగాడు పట్టుకెళ్ళాడు, అంతా నీ మూలంగానే జరిగింది," అని బాధపడ్తూ చెప్పాయి. "నీవేమో దాని రెక్కకు గాయం చేసి ఎగరలేకుండా చేసావు, దానితో అది వేటగాడు దాన్ని పట్టుకుంటుంటే, ఎగర లేక అతడికి దొరికిపోయింది," అని చెప్పాయి. అది విని మగచిలుక కూడా బాధ పడింది. కొన్ని రోజులయ్యాక ఒంటరిగా వుండలేక వేరే ఆడచిలుకలతో జత కట్టడానికి ప్రయత్నించిందా మగ చిలుక. దీని గురించి బాగా తెలిసిన ఆ గుంపులోని చిలుకలేవీ దాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. అప్పుడు కానీ దానికి దాని భార్య విలువ, మంచితనం తెలిసిరాలేదు. తను దాని మీద చూపిన అమానుషత్వం గుర్తొచ్చి తను చేసిన తప్పు తెలుసుకుని బాధపడి ఎలాగైనా తన భార్యను వేటగాడి దగ్గర నుండి రక్షించి తీస్కొచ్చి, ఇద్దరమూ సంతోషంగా వుండాలని నిర్ణయించుకుని వేటగాడి రాక కొరకు ఎదురు చూడసాగింది. ఎవరమైనా అంతే, మన దగ్గరే వుండి అన్నీ చేసిపెట్టేవారి విలువ, వాళ్ళు మన దగ్గర వున్నంత వరకూ గుర్తించము. వారు దూరమయ్యాకనే గుర్తిస్తాము. ఇక్కడా అదే జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాక... మళ్ళీ అదే వేటగాడు అక్కడికే వేటకొచ్చాడు. ఎదురు చూస్తూ వున్న మగచిలుక అతని వెంటే అతని ఇంటిదాకా వెళ్ళింది. అతడు గుడిసె లోకి వెళ్ళగానే అక్కడే బయట వేలాడి దీసిన పంజరాల్లో తన భార్యుందేమోనని చూసింది, కానీ కనపడలేదు. అక్కడున్న పంజరాల్లోని పక్షులను విషయం తెలుసేమోనని అడిగింది. వాటిలో ఒకటి, "ఇతడు చివరి సారిగా తెచ్చిన చిలుకను ఒక ఇంద్రజాలికుడికి (అంటే మ్యాజిక్ చేసే అతనికి) అమ్మాడు. అతను ఇంకొన్ని చిలుకలు కావాలి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు," అని అంది. ఇంక చేసేదిలేక అక్కడికి దగ్గరలోనే ఒక చెట్టు మీద వుండి ఆ ఇంద్రజాలికుడు వచ్చేంత వరకు ఎదురు చూడాలనుకుందా మగచిలుక. "నేనా చెట్టు మీదుంటాను, ఆ ఇంద్రజాలికుడు వచ్చినప్పుడు నాకు గట్టిగా కూతేసి చెప్పు," అని ఆ పక్షికి చెప్పి వెళ్ళి పోయింది. అలా మూడు రోజులు ఎదురు చూసాక ఇంద్రజాలికుడు మళ్ళీ వచ్చాడన్న సందేశంతో మగచిలుక అతడిని అనుసరించి అతడి వెంట వాళ్ళింటి దాకా వెళ్ళింది. అక్కడ అతను లేని సమయంలో కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తే దాని భార్యైన ఆడచిలుక లోపల ఒక పంజరంలో కనిపించింది. ఎలాగైనా దాన్ని తప్పించాలనుకుని దానితో మాట్లాడింది. దానికా ఆడచిలుక, "నేను తప్పించుకోలేను, నా రెక్కలలోని పెద్ద ఈకలన్నీ తీసేసాడు, నేనిప్పుడు ఎత్తుకు ఎగరలే"నని చెప్పి, "వీళ్ళింతే! వీళ్ళ దగ్గరకు వచ్చాక తప్పించుకోలే"మంది. అయినా నీ హింసను భరించే దానికన్నా, స్వేచ్ఛ లేకపోయినా ఇక్కడే బాగుంది," అని కూడా చెప్పింది. అప్పుడు మగచిలుక ఎంతో బాధపడి, ఆడచిలుకతో, "తన తప్పును క్షమించమని అడిగి, నేనూ నీతోనే ఇక్కడే వుంటాను, నీవు లేకపోతే నేనుండలేకపోతున్నానీ, నీవు లేనప్పుడు కానీ నీ విలువ నాకు తెలియలేదనీ, అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను, నేను ఇతనికి దొరికిపోయి ఇక్కడే వుంటాను," అని అంది మగచిలుక. అప్పుడా ఆడచిలుక, "ఇక్కడ వుంటే నీకు స్వేచ్ఛనేదే వుండదు, నీవు నీకు ఇష్టమై ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళేందుకుండదు, వీళ్ళు ఏది చెప్తే అది చేస్తూ వుండాలి, లేకపోతే తిండి పెట్టరు, నీవుండలేవు వెళ్ళిపో," అంది. అప్పుడా మగచిలుక, "అయినా, నిన్ను బాధ పెట్టిన దానికి నేను కూడా ఇలాంటి శిక్ష అనుభవించాలి," అని చెప్పి ఆ పంజరం చుట్టూనే తిరుగుతూ ఆ ఇంద్రజాలికునికి దొరికి పోయింది. ఆ మగచిలుక అలా పంజరం చుట్టూ తిరుగుతూ వుండటం చూసినతడు ఇది దాని జతదై వుంటుంది అందుకే వెతుక్కుంటూ వచ్చిందనుకున్నాడు. తర్వాత దాన్ని కూడా పట్టుకొని, దాని పెద్ద ఈకలు సైతం పీకి ఆడచిలుకతో పాటు ఆ పంజరంలోనే బంధించాడు. అక్కడ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా వుండ సాగారు. మీకు తెలుసా, బయట స్వేచ్ఛగా తిరిగే రామచిలుకలు యాబై ఏండ్ల దాకా బ్రతకగలవు. అదే పంజరపు చెరలో వుంటే వాటి ఆయుష్షు సగానికి పడిపోయి ఇరవై అయిదేళ్ళ కంటే ఎక్కువ బ్రతకలేవు. అక్కడే ఆ ఇంద్రజాలికుడు ఈ రెండు చిలుకలకు రకరకాల ట్రైనింగులు ఇవ్వసాగాడు. మగచిలుకకు అగ్గిపుల్ల గీచేది కూడా నేర్పించసాగాడు. అప్పుడు ఆ మగచిలుకకు ఒక ఆలోచన వచ్చి ఆడచిలుకతో ఇలా చెప్పింది. "నీవు ఈసారి నీ ఈకలు పీకుతున్నప్పుడు నొప్పయినట్టు చేసి పడిపో ఇంక నీ ఈకలు అప్పటికి పీకరు, అంతలో నా ఈకలు కూడా కొంచెం పెరుగుతాయని" చెప్పింది. అది అలాగే చేసింది. నిజంగానే అతడు ఆ రోజుటికి ఈకలు పీకకుండా, దాని జతగాడు లేకుండా ఎక్కడికి వెళ్తుందిలే, ఇద్దరి ఈకలు ఒకేసారి పీకొచ్చులే అని అప్పటికి వదిలేసాడు. ఇద్దరికీ ఎగరగలిగేంత ఈకలొచ్చాకొకరోజు... ఇంద్రజాలికుడు యథావిధిగా మగచిలుకతో అగ్గిపుల్ల గీచే ఫీటు చేయిస్తుండగా, అగ్గిపుల్ల వెలిగాక, మగచిలుక దాన్ని దగ్గరలో వున్న గడ్డి కుప్ప మీద పడేలా వేసింది. ఆ కుప్ప అంటుకునే సరికి దాన్ని ఆర్పే ప్రయత్నంలో ఇంద్రజాలికుడు వుండగా, ఈ రెండు చిలుకలు తప్పించుకుని అడవికి పారిపోయాయి. ఆ రెండూ మళ్ళీ కలిసి తిరిగి అడవికి రావడం చూసిన మిగతా చిలుకలు ఎంతో సంతోషపడి మగచిలుకను మెచ్చుకున్నాయి. అప్పటినుండి ఆ చిలుకలు రెండూ ఎంతో అన్యోన్యంగా వుండ సాగాయి. ఇలాంటి అవకాశం వీటికైతే దొరికింది కానీ నిజానికి ఒక్కసారి ఎవరినైనా కోల్పోతే వారు తిరిగి లభించడం కష్టమే. అందుకే వున్నప్పుడే అందరితో ప్రేమగా వుండాలి, ప్రేమ విలువ తెలుసుకుని మెలగాలి. మగచిలుక మళ్ళీ ఎంతో ప్రేమను ఆడచిలుక పైన చూపాకనే తిరిగి ఇద్దరూ కలుసుకోగలిగారు, సంతోషంగా ఉండ గలిగారు. అంతేకాక ఆడచిలుక నిస్వార్థమైన ప్రేమతో వుంది కాబట్టి తిరిగి మగచిలుక ప్రేమను ఆశించి ఇంకో అవకాశాన్నిచ్చింది. అదే మగచిలుక చేసే ఆగడాలకు ఆ ఆడచిలుక కనుక విసిగిపోయి, అసహ్యం పెంచుకుని వుంటే, ఈ మగచిలుకను దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. అలా కాక ఇంకా కోపం వచ్చి వుంటే వేరే మగచిలుకతో వెళ్ళిపోయినా పోయుండేది. అలా చేసివుంటే ఇంక ఈ మగచిలుక జీవితాంతం ఒంటరిగా ఎవ్వరి సహాయం అందక జీవించాల్సి వచ్చేది. మనుషులకు సైతం ఇదే వర్తిస్తుంది, అది ఎవ్వరైనా, భర్తైనా, భార్యైనా సరే. పిల్లల్లో కూడా ఇలాగే వుంటుంది, మనం చూస్తుంటాము కదా, సాటి పిల్లల్లో ఒకరెవరైనా అనవసరంగా వేరేవారిని కొట్టటం, తిట్టటం లాంటివి చేస్తుంటే మిగిలిన పిల్లలు ఆ ఒకరిని దూరంగా పెట్తారే కానీ స్నేహం చేయరు. మనుషులలో చేతలతోనే కాదు మాటలతో కూడా హింసించే వారుంటారు. అది ఎలాంటి హింసైనా కానీ ఎవ్వరూ ఎంతో కాలం భరించలేరనేది గుర్తుంచుకోవాలి. అందుకే ప్రేమకు విలువ లేని చోట ఎంతో కాలం ఎవ్వరూ కూడా ఇష్టపూర్వకంగా వుండలేరు. ప్రేమకు, ప్రేమను మాత్రమే విలువగా కట్టగలమని గుర్తించిన వారు మాత్రమే ప్రేమను పొంది సాటి వారితో హాయిగా జీవించగలరు. ---సమాప్తం---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


44 views0 comments

Comments


bottom of page