top of page

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 9


'Raghupathi Raghava Rajaram Episode 9' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar

'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ


కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు లెక్చరర్ రఘుపతి. ఆ యువతిని, గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది ఐన శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు.


స్పృహ వచ్చిన ఆ యువతి- తన పేరు కమల అనీ, తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారనీ చెబుతుంది. కమలకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.


కాలేజీలో అవయవ దానం గురించి కల్యాణి చేసిన ప్రసంగానికి ఆకర్షితుడవుతాడు రాజారామ్. వాళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది. తన గతం గురించి చెబుతుంది కల్యాణి. కల్యాణిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంట్లో చెబుతాడు రాజారామ్.


కోవిడ్ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తాడు రఘుపతి. సీతయ్య కూతురు లలితకు కోవిడ్ అని తెలుస్తుంది. ఆమెకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు రఘుపతి.


ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 9 చదవండి..


రాఘవ అన్నకు, తమ్ముడికి చెప్పాడు. కుటుంబ సభ్యులకు తప్ప గ్రామంలో ఎవరికీ ఈ సంగతి తెలియనీయలేదు రఘుపతి.


సీతయ్య వచ్చి అడిగితే రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని, అయితే కొద్ది రోజుల పాటు క్వారెంటైన్ లో వుండాలని చెప్పాడు.


లలితకు టిఫిన్, భోజనం, మందులు అందీయటం అన్నీ రాఘవ చూస్తున్నాడు. రాఘవ గది బయటనుండే అన్నీ అందించేవాడు.


ప్రతీ రోజూ రెండుసార్లు 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో గదిని శుభ్రపరచుకోమని లలితకు చెప్పాడు.


లలిత గదికి ఉన్న అటాచెడ్ బాత్ రూం లో గీజర్ వుంది.

రెండు పూటలా వేడినీళ్ళతో బట్టలను ఉతికి ఆరేసుకొమ్మని చెప్పేవాడు.


తాను కూడా నిరంతరం చేతులు సబ్బుతో శుభ్రం చేసుకునేవాడు.


లలిత థెర్మామీటర్‌ ద్వారా జ్వరం రోజుకు ౩ సార్లు చూసుకునేది. మూడు రోజులకి జ్వరం తగ్గి లలిత కొంచెం తేరుకుంది. ఆక్సిజన్‌ పల్స్‌ రేట్‌ పల్స్‌ఆక్సీమీటర్‌ ద్వారా రోజుకు ౩ సార్లు చూసుకునేది.


నాలుగు రోజుల తరువాత ఆక్సిమీటర్‌లో రక్తంలో ఆక్సిజన్ స్థాయి 95 కంటే ఎక్కువగా సూచించింది. లలిత సంతోషంతో ఈ సంగతిని రాఘవకు చెప్పింది.


"వెరీ గుడ్" అంటూ రాఘవ అభినందించాడు.


"ఊపిరి బిగవట్టగల సమయం 20 సెకన్లకు మించి ఉండాలి. దీనిని సాధన చేయి" అని చెప్పాడు.


లలిత రోజులో అయిదారు సార్లు ప్రాక్టీస్ చేసేది.


మరొక పని చెప్పాడు లలితకు. రూం లో అటూఇటూ నడవమనేవాడు.


" ఆరు నిమిషాల పాటు నడిచినా అయాసం రాకూడదు " అని చెప్పాడు.


రాఘవ చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించేది లలిత.


లలితను చూడటానికి ఎవరినీ రానీయలేదు రాఘవ. సీతయ్య వచ్చినా తనే మాట్లాడి పంపించేశాడు. ఆ రెండు వారాలు తాను తప్ప లలిత ను యింట్లో వారిని కూడా చూడనీయలేదు.


లలితకు విసుగు రాకుండా ఎన్నో కబుర్లు చెప్పేవాడు.

తెలుగు సాహిత్యం లో మంచిమంచి పుస్తకాలను తెచ్చి ఇచ్చి వాటిని చదవ మనేవాడు.


లలిత మొబైల్ లో సుడోకు యాప్ ఇంస్టాల్ చేసి మైండ్ ఫ్రెష్ గా వుండటం కోసం సుడోకులను చేయమని చెప్పేవాడు. లలితకు ఇష్టమైన పాత పాటలను ఒక పెన్ డ్రైవ్ లో ఎక్కించి ఇచ్చాడు. ఒక CD ప్లేయర్ తీసుకొచ్చి ఇచ్చాడు. దానికి పెన్ డ్రైవ్ కూడా పెట్టి వినవచ్చు.


మాటల సందర్భం లో తన పెళ్ళిచూపుల విషయం కూడా చెప్పాడు.


"నేను నా అన్నను, ఈ ఇంటినీ వదిలి వుండలేను. నాచదువు అంతంత మాత్రమే. ఈ పల్లెటూరి పిలగాడిని ఎవరు ఇష్టపడతారు. నన్ను కాకుండా నా కుటుంబాన్ని ఇష్టపడి వచ్చిన వారితోనే నా పెళ్ళి" అన్నాడు.


లలితకు ఈ పదిరోజుల సావాసంలో రాఘవ అంటే ఇష్టం, ప్రేమ ఏర్పడింది.

తన తండ్రి సరిహద్దు విషయంలో చేసిన గొడవకు తండ్రి తరఫున క్షమాపణ కోరింది. పిన్ని రెచ్చగొట్టటం వల్లే తండ్రి కావాలని గొడవ పెట్టుకున్నా డని అన్నది.


రాఘవ తానా సంగతి ఎప్పుడో మరచిపోయానని చెప్పాడు.


పదిహేను రోజుల క్వారంటైన్ తరువాత లలితను హాస్పిటల్ కు తీసుకెళ్ళి కోవిద్ పరీక్ష చేయించాడు. రెండురోజుల్లో నెగిటివ్ అని వచ్చింది. అందరూ సంతోషించారు. లలిత ఇంటికి వెళ్లటానికి ఇష్టపడక గాంధీ గారి ఇంటిలోనే ఉంటానన్నది.


తండ్రి సీతయ్య వచ్చి బ్రతిమిలాడినా పోలేదు. రాజాకి అనుమానం వచ్చింది. లలిత, రాఘవను ఇష్టపడుతుందనీ.

వదినకు తన అనుమానం చెప్పాడు.


విశాల నవ్వుతూ "అలా అయితే మంచిదేగా. లలిత చాలా నెమ్మదైన పిల్ల. మన రాఘవ దూకుడికి ఆ అమ్మాయి నెమ్మదితనం సరిపోతుంది. నీకూ ఒక లైన్ క్లియర్ అవుతుంది కదా. నువ్వేం మాట్లాడకు. వారి నోటినుండే రావాలి ఈ సంగతి" అంది.


రెండు రోజులకు లలితే బయటపడి చెప్పింది రఘుపతితో

"బావగారూ, మీ కుటుంబాన్ని చూస్తుంటే నేనూ మీ కుటుంబ సభ్యురాలిని కావాలని వుంది. మీరంతా ఒప్పుకుంటె రాఘవను పెళ్ళి చేసుకోవాలని వుంది."


రఘుపతి చిరునవ్వుతో "మరి, రాఘవ కూడా ఇష్టపడాలిగా" అన్నాడు రాఘవ వేపు చూస్తూ.


"చిన్నన్నకు లలిత వదినంటే చాలా ప్రేమ పుట్టింది ఈ మధ్యన" రాజా అన్నాడు చిలిపిగా.


"నీకు ఇష్టమైతేనే నాకు ఇష్టం అన్నయ్యా" రాఘవ నెమ్మదిగా అన్నాడు.


రఘుపతి తల్లి, తండ్రి వైపు చూపు సారించాడు. ఇద్దరూ నవ్వుతూ తలలు ఆడించారు సరే అన్నట్లుగా.


"సాయంత్రం సీతయ్య గారిని రమ్మని చెప్పు రాజా" అన్నాడు రాజాతో.


సీతయ్య వచ్చి గాంధీగారి కాళ్ల మీద పడి క్షమించమని అడిగాడు. రాఘవతో లలిత పెళ్ళికి సంతోషంతో ఒప్పుకున్నాడు.


అయితే లలిత అగ్రికల్చర్ బి. యస్సీ చివరి సంవత్సరంలో వుంది కనుక ఫైనల్ పరీక్షల తరువాతే పెళ్ళి ముహుర్తం అని రఘుపతి అన్నాడు.


"పనిలో పనిగా కమలకు కూడా పెళ్ళి చేద్దామండి. సాంబయ్య తమ్ముడి భార్య ఒక ఆడపిల్లను కని కాన్పు కష్టమై పుట్టింట్లోనే చనిపొయిందట. పిల్లకోసమని సాంబయ్య తమ్ముడి కి మళ్ళీ పెళ్ళి చేయాలని చూస్తున్నాడు. కమల గురించి సాంబయ్యకు తెలుసు. కమల ఒద్దికతనం చూసి ముచ్చటపడుతున్నాడు.


చూచాయగా తన తమ్ముడికి కమలను ఇచ్చి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి అభిప్రాయం వెళ్లబుచ్చాడు. మీరు సాంబయ్య తమ్ముడితో మాట్లాడండి" అంది విశాల.


"మరి కమలను అడిగావా?" అడిగాడు రఘుపతి.


" అడిగా. ముందు ఒప్పుకోలేదు. మన ఇంట్లోనే తనకు హాయిగా వుందని చెప్పింది. మన ఇంటిని విడిచిపోనని అన్నది. తనకంటూ ఒక కుటుంబం ఉండాలని నచ్చచెప్పా. పెళ్ళి అయినా మన ఇల్లు వదిలిపోనక్కరలేదని అంటే సరేనన్నది. సాంబయ్య తమ్ముడు కి కూడా మన దగ్గరే ఎదో ఒక పని చూడండి. ఇద్దరూ మనకళ్ల ముందే వుంటారు. "


"వదినా మన ఫాక్టరీకి ఎలాగూ ఒక వాచ్ మ్యాన్ కావాలి. ఇతన్నే పెట్టుకుందాం" రాజా అన్నాడు.


"సరే. సాంబయ్యను, వాడి తమ్ముడిని పిలిచి మాట్లాడుతా" అన్నాడు రఘుపతి.


లలిత, కళ్యాణి మంచి స్నేహితులై పోయారు. ఆ యింట్లో ఇద్దరు ఆడపిల్లలు ముచ్చటగా తిరుగుతుంటే అందరికీ కన్నులపండుగగా వుంది. ఇక చిన్నపిల్లల అల్లరి, ఆటలు సరేసరి. రాజా, రాఘవ కూడా ఒక్కోసారి పిల్లలతో కలసి పెద్దగా అల్లరి చేసేవారు.

ఇళ్ళంతా పిల్లలతో, పెద్దలతో కళకళ లాడుతున్నది.


సహజంగా జనాలను ఆకట్టుకునేలా మాట్లాడే వాక్చాతుర్యం గల కళ్యాణి రోజుకో వీధిలో ప్రసంగించేది.


"మొదటిగా మనము భయపడకూడదు. ఈ వైరస్ లను చూసి మనము భయపడితే అది మనలను మరింత భయపెడుతుంది.


కరోనాకు అసలైన మందు మనోబలమే అని చెబుతున్నారు.

కాబట్టి కరోనా గురించి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగితే తేలికగా బయటపడొచ్చు.


ఈ కరోనా వైరస్ మన శరీరములో ఉన్న ఆరోగ్యాన్ని హైజాక్ చేయగలదేమో కానీ మన హృదయములో ఉన్న ధైర్యాన్ని అది హైజాక్ చేయలేదు.


కరోనా వచ్చినవారిలో 3. 4 శాతము మంది మృత్యువాత పడుతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.


అంటే 96 శాతము మంది ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాలతో బయటపడగలుగుతున్నారు.


ఆందోళనే ప్రమాదకరం.


కరోనా బారిన పడినవారు ధైర్యంగా తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ల సూచనలతో అత్యధిక మంది కోలుకుంటున్నారు.


కొంతమంది మాత్రం కరోనా పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే ఆందోళన చెందుతూ మానసికంగా కుంగిపోతున్నారు.

ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.


ధైర్యంగా ఎదుర్కోగలిగితే కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని కోలుకున్నవారు చెబుతున్నారు. దానికి మీ కళ్ళ ముందున్న సాక్ష్యం ఈ లలిత" అంటూ లలితను చూపించింది.


లలిత చెప్పసాగింది.

"జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి రాగానే తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ల సలహా మేరకు పరీక్షలు చేయించుకుని మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చు.


అలా కాకుండా జ్వరం వచ్చిన తర్వాత కూడా అశ్రద్ధ చేసి డాక్టర్‌ని సంప్రదించకుండా ఉండేవారు తీవ్రఇబ్బందులు పడతారు. నన్ను చూసి మీరు మరింత ధైర్యం తెచ్చుకోండి.


అంతేకాకుండా పౌష్టికాహారం తీసుకుంటూ మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా వచ్చిన ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు.


మన ధైర్యమే మనకు రక్ష."


ఆ రోజు పాలేరు సాంబయ్య వచ్చి హరిజన వాడలో ఇద్దరికి వాంతులు, విరోచనాలు అవుతున్నాయని చెప్పాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
28 views0 comments

Comments


bottom of page