top of page
Original.png

సుమధుర భాషణమే సుభూషణం

మంచి మాట, సుమధుర భాషణం, వ్యక్తిత్వ వికాసం, భర్తృహరి, నీతి శతకం, సుమతి శతకం, సంభాషణ నైపుణ్యం, స్వామి వివేకానంద, ప్రేరణ, జీవన విలువలు

సుమధుర భాషణం విలువను ప్రతిబింబించే తెలుగు ప్రేరణాత్మక దృశ్యం.
సుమధుర భాషణం విలువను ప్రతిబింబించే తెలుగు ప్రేరణాత్మక దృశ్యం.

 

Sumadhura Bhashaname Subhushanam - Telugu Inspirational Article | R C Kumar

సుమధుర భాషణమే సుభూషణం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 21/07/2026


మంచి మాట మనిషికి ధరించే బంగారు ఆభరణాల కంటే విలువైనది. భర్తృహరి నీతి శతకం, సుమతి శతకం, స్వామి వివేకానంద బోధనలు చెబుతున్నట్లుగా మృదువుగా, ఆలోచించి, సందర్భానుసారంగా మాట్లాడడం వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సుమధుర భాషణం ఎందుకు సుభూషణమో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.


భర్తృహరి రచించిన నీతి శతకంలో "కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలాః" అనే శ్లోకంలో మంచి మాటే మనిషికి అలంకార భూషణం అని చక్కగా వివరించారు. వంటి నిండా బంగారు ఆభరణాలు, తలలో పూల మాలలు, సుగంధ స్నానాలు, విలేపనాలు - ఇవేవీ అలంకారాలు కావు. స్వచ్ఛమైన, నిర్మలమైన, సంస్కారంతో కూడిన మాటలే అసలైన అలంకారాలు. 


కనుక పైపై మెరుగుల కన్నా మంచి మాట అనేది ముఖ్యం. అదే అసలు సిసలైన ఆభరణం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సంస్కారవంతంగా మాట్లాడడం మనిషికి అలంకారం అయితే, ఆకట్టుకునేలా మాట్లాడడం ఒక కళ. ఎందుకంటే అర్థవంతంగా, సందర్భానుసారంగా ఉన్న మాట, మౌనం మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి.


మాటే మంత్రము అని సినీ గీత రచయిత అనడానికి కారణం మాట మంత్రం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది. 


అగ్గిపుల్లతో దీపం వెలిగించవచ్చు, ఇల్లు తగలబెట్టవచ్చు; ఎలా వాడుకుంటాము అనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది.


"నోరు బాగుంటే ఊరు బాగుంటుంది" అనే నానుడికి అర్థం ఏమిటంటే, మాట్లాడే తీరు బాగుంటే సమాజంలో అందరితో సత్సంబంధాలు ఉంటాయి. నోటి దురుసుతనం వల్ల లేనిపోని గొడవలు, శత్రుత్వాలు పుట్టుకొస్తాయి. అదే మంచి మాట తీరు ఉంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. 


ఆలోచించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడడం గురి చూడకుండా వదిలిన బాణం లాంటిది. ఆ విధంగా నోరు జారితే వచ్చే నష్టాలు ఎక్కువ. సుమతి శతకంలో చెప్పినట్లు "నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు". ఎదుటివారి మనసు నొప్పించకుండా, తాను కూడా బాధపడకుండా, సమయానికి తగినట్లుగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకునేవాడే ఈ లోకంలో ధన్యుడు. 


మాటలు చాలా ఖరీదైనవి కాబట్టి పొదుపుగా వాడాలి, మాటలు చాలా బలమైనవి కాబట్టి సున్నితంగా వాడాలి. మనిషికి భావవ్యక్తీకరణ అనేది గొప్ప ఆస్తి. అది ఎంత సౌమ్యంగా ఉంటే అంత మహత్తరంగా ఉంటుంది. 


ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. ఆ దశరథ నందనుడే మనకు ఆదర్శ పురుషుడు.


ఒకానొక సందర్భంలో గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "గురువుగారు! మీకీ సంగతి తెలిసిందా?" అంటూ ఎవరిమీదో ఏదో చెప్పబోయాడు. 


వెంటనే ఆపాడు ఆ గురువు. "ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పు. నువ్వు విన్నదంతా నిజమేనని స్వయంగా తేల్చుకున్నావా? చెప్పబోయే విషయం మంచిదేనా? దాన్ని చర్చించడం వల్ల మేలు ఏదైనా ఉందా?" అని ప్రశ్నించాడు. 


శిష్యుడు బిక్కమొహం వేశాడు. చెప్పుడు మాటల ప్రచారంలో, సామాజిక మాధ్యమాల్లో కంటపడిందల్లా ముందూ వెనకా ఆలోచించకుండా అందరికీ పంచడంలో మనలో చాలామంది అలాగే ఆత్రుత పడతాం. 


"వినదగు నెవ్వరు చెప్పిన" అనేసి ఊరుకోలేదు కదా బద్దెన గారు. 


"వినినంతనే వేగపడక వివరింపదగున్! కని, కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు" అన్నాడు సుమతీ శతకంలో. 

విన్న సమాచారాన్ని పరిశీలించి, నిజ నిర్ధారణ చేసి, విచక్షణతో సత్యాన్ని తెలుసుకునేవాడే ఈ భూమిపై నిజమైన నీతిపరుడు. అందుకే అన్నారు స్వామి వివేకానంద - "తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు".


మన మాట తీరు మృదువుగా, స్పష్టంగా, ఇతరులను గౌరవించే విధంగా ఉండాలి. మాట్లాడే విధానాన్ని బట్టే మన సంస్కారం, స్వభావం బయటపడతాయి. మాట్లాడుతుంటే అది ఎదుటివారికి ఆనందాన్ని, గౌరవాన్ని కలిగించాలి. మరికొంత సేపు మాట్లాడితే బాగుండు అని శ్రోతకి అనిపించాలి. మృదువుగా, స్పష్టంగా మరియు అర్థవంతంగా మాట్లాడటం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. 


ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినాలి. తొందరపడి మధ్యలో అడ్డు తగలకూడదు. వెంటనే రియాక్ట్ అయ్యే స్వభావం పోవాలి. వాదనలు చేయాలనే ఆసక్తి తగ్గి, వాదనల్లో గెలవడం కంటే బంధాలను నిలబెట్టుకోవడమే ముఖ్యం అనిపించాలి. 


ఎవరితో, ఎక్కడ, ఎలా సందర్భానుసారంగా మాట్లాడాలో తెలుసుకోవాలి. కోపం వచ్చినప్పుడు లేదా విషయం తెలియనప్పుడు మౌనంగా ఉండడమే ఉత్తమం. ఇతరుల మనసును నొప్పించే మాటలు కాకుండా, వారిని ప్రోత్సహించే మంచి మాటలు మాట్లాడితే స్నేహ సౌభ్రాతృత్వాలు పెరుగుతాయి. 


మాట్లాడేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమం ఏమిటంటే ముఖంలో చిరునవ్వు, ఆప్యాయత కనబడాలి. మాట చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి మాటను ఆలోచించి, ఆచితూచి పలకాలి. ఎవరైనా రెచ్చగొట్టాలని చూసినా, వెంటనే ఆవేశపడకుండా ప్రశాంతంగా స్పందించాలి. 


ఇతరుల మనస్సు నొచ్చుకునేలా లేదా వారి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడకూడదు. కాలక్షేపానికి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం, పరనింద చేయడం మానుకోవాలి.


చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పకపోతే అవతలి వాళ్ళు పెడచెవిన పెడతారు. ఎక్కువ సొల్లు కబుర్లు చెప్పకుండా సూటిగా విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముందొక మాట, వెనకొక మాట మాట్లాడే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తే వ్యక్తిత్వ హననం చేసుకున్నట్లే. 


రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి కానీ మనిషికి ఉన్న ఒక్క నాలుక మాత్రం వ్యక్తులను బట్టి ఒకే విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడుతుంది. ఒకే మనిషి, ఒకే విషయం గురించి ఇద్దరి దగ్గర రెండు రకాలుగా మాట్లాడడం తెలివితేటలకు నిదర్శనం కాదు. వ్యక్తిత్వంలో స్థిరత్వం లేదనడానికి అది సంకేతం. 


మూడు అంగుళాల నరం లేని నాలిక ఆరు అడుగుల మనిషిని కూడా బాధపడేట్టు చేస్తుంది. సుభాషితాలలో చెప్పబడిన ఒక శ్లోకం విషయం లేకుండా అతిగా వాగే వారి స్థానం ఎక్కడ ఉంటుందో చూపిస్తుంది. 


"మౌఖర్యం లాఘవకరం మౌనమున్నతికారకం! ముఖరం నూపురం పాదౌ కంఠేహార విరాజితే!!" - అతిగా వాగడం వల్ల చులకనయ్యే అవకాశం ఉంది. మౌనం ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. ఎలాగంటే చప్పుడు చేసే అందియలు పాదం మీద ఉంటాయి, చప్పుడు చేయని ముత్యాల హారం కంఠంలో విరాజిల్లుతుంది.




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ఆర్.సి. కుమార్
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


bottom of page