top of page

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 15


'Amavasya Vennela - Episode 15 - New Telugu Web Series Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 14/10/2023

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.


నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.


మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ. సాగర డ్రైవింగ్ బాగా నేర్చుకుంటుంది. శ్రీరమణకు సెకండ్ హ్యాండ్ కారు కొనిస్తానంటాడు మధుసూదన్.


హంస అనే ఆవిడను హాస్పిటల్ లో చేర్చడంలో సహాయం చేస్తాడు శ్రీరమణ. తనను కలవమని ఫోన్ చేస్తుంది ఆమె. హంస తన తల్లి అనీ, ఆమెకు కాన్సర్ అనీ తెలుస్తుంది శ్రీరమణకి.

ఇంద్రజకి, గిరికి పెళ్లి కుదురుస్తాడు శ్రీరమణ.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 15 ( చివరి భాగం) చదవండి.

మర్నాడు..

సావిత్రి ఇంటికి వచ్చాడు శ్రీరమణ.

అప్పటికి ఇంద్రజ ట్యూషన్స్ చెప్పడానికి వెళ్లి ఉంది.

సావిత్రి.. చంద్రికలకు గిరి విషయం చెప్పి..

"మళ్లీ చెప్పుతున్నాను. నాకు ఎప్పటి నుండో గిరి తెలుసు. మంచోడు. ఉద్యోగంతో పది వేలు సంపాదన ఉంది. తనకు తన వాళ్ల బాధ్యత అంతగా ఏమీ ఉండదు." చెప్పాడు.

ఆ వెంబడే..

"వెంటనే మన ఇంద్రజకు అతడితో పెళ్లి జరిపిద్దాం." చెప్పేసాడు.

సావిత్రి జంకుతుంది.

శ్రీరమణ వాళ్ల జవాబుకై చూస్తున్నాడు.

"మా స్థితి నీకు తెలుసు. పెళ్లి పేరుతో ఎంత కూడా ఇచ్చుకో లేం." అంటుంది సావిత్రి..

అడ్డై..

"అబ్బే. అట్టివేమీ ఉండవు. గిరి అట్టివి ఆశించడం లేదు. పెళ్లి జరిపించి.. అమ్మాయిని అప్పగిస్తే చాలు. వాడు ఇంద్రజను చక్కగా చూసుకుంటాడు. మన పిల్ల మంచిదే కనుక.. వాళ్ల కాపురం బాగుంటుంది." భరోసాగా మాట్లాడేడు శ్రీరమణ.

సావిత్రి తేలకవుతుంది.

"రమణ.. నీ మంచితనం మాకు తెలుసు. నువ్వు చూపుతున్న సంబంధం కనుక.. మేము కాదనడానికి వీలే లేదు. నీ ఇష్టమే." అంది చంద్రిక.

ఆ వెంబడే..

"కానీ.. పెళ్లి జరిపించడమంటే.. ఆ ఖర్చు కూడా పెట్టలేం. నీకు తెలియందా." నసిగింది.

"అట్టాసం అస్సలు వద్దు.. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అవ్వనిద్దాం. ఇరు కుటుంబాల పెద్దల కలయిక.. చిన్నపాటి విందు.. అంతంత మాత్రంతో సరిపుచ్చుకుందాం. నేను వాటిని చూసుకుంటాను. సరేనా." చెప్పేసాడు శ్రీరమణ.

కుర్చీలో కూర్చున్న చంద్రిక లేచింది.

రెండు చేతులు ముందుకు చాచి.. "రమణ." అంది.

"నేను నీకు ఎదురుగానే ఉన్నాను. చెప్పు." చెప్పాడు శ్రీరమణ.

చంద్రిక రెండు చేతులు జోడించి.. నమస్కరిస్తూ..

"నువ్వు ఇంత మంచోడివా రమణ.. నా చూపు పోయినందుకు.. నువ్వు ఇంతగా మమ్మల్ని ఆదుకోవడమేమిటి. మా అదృష్టం కాకపోతేను." కన్నీళ్లు కారుస్తుంది.

సావిత్రి లేచి నిల్చుంది.

రమణ చేతులు పట్టుకొని.. "నువ్వు మా పాలిటి దేవుడువే అయ్యా." అంది. తనూ కన్నీరు కార్చేస్తుంది.

"అరరె. ఏమిటీ ఇదంతా. ఇలాంటివి వద్దు. కూర్చొండి." అన్నాడు శ్రీరమణ.

వాళ్లు కూర్చునేక..

"ఇంద్రజతో మాట్లాడండి." చెప్పాడు శ్రీరమణ.

"అమ్మో. తను నిన్ను మెడ్డడమే. మా కంటే తనే నిన్ను తొలి నుండి నమ్ముతుంది." చెప్పింది సావిత్రి.

"దాని మొహం. రమణ.. నీకు నచ్చినట్టే కానీ." అనేసింది చంద్రిక.

కొద్ది సేపు తర్వాత..

"మళ్లీ కలుస్తాను." చెప్పి, అక్కడి నుండి కదిలాడు శ్రీరమణ.

***

రాత్రి తొమ్మిది దాటుతుంది.

భోజనం ముగించాడు శ్రీరమణ.

సామాన్లు సర్దడంలో పార్వతమ్మకు సాయపడ్డాడు.

పావు గంటలోపే ఆ పనులు పూర్తయ్యిపోయాయి.

"అమ్మా.. పడుకో.. నేనూ పడుకుంటాను." చెప్పాడు శ్రీరమణ.

పార్వతమ్మ పడుకోడానికి వెళ్లిపోయింది.

క్రమేణా రాత్రి కిరాయిలకు కారును తిప్పడం మానుకున్నాడు శ్రీరమణ.

పక్క మీద నడుము వాలుస్తుండగా.. అతడి ఫోన్ మోగింది.

హంస ఫోన్ నుండి కాల్ వస్తుంది.

కనెక్ట్ ఐ.. "చెప్పమ్మా." అన్నాడు.

"రమణేనా." అటు నుండి వాకబు.

"ఆఁ." అనేసాడు శ్రీరమణ. అటు గొంతు హంసది కాదని గుర్తించాడు. తికమక పడుతున్నాడు.

"నేను.. లక్ష్మిని." అటు నుండి బొంగురుగా వినిపించింది.

"చెప్పమ్మా." శ్రీరమణ ఆత్రమవుతున్నాడు.

"రమణ.. హంస.. హంస.. చనిపోయింది." అటు నుండి లక్ష్మి చెప్పింది.

హడలిపోయాడు శ్రీరమణ.

"రా. రమణ." లక్ష్మి కోరుతుంది.

"ఆఁ. వస్తాను." వ్యాకులపడుతున్నాడు శ్రీరమణ.

ఆ కాల్.. లక్ష్మిచే కట్ చేసేయబడింది.

శ్రీరమణ అవస్త పడుతూనే.. పార్వతమ్మను పిలిచాడు.. ఆవిడ పక్కేసుకున్న గది తలుపు తట్టుతూ.

పార్వతమ్మ తలుపు తీసి వచ్చింది.

ఆవిడ ఏదో అడగబోతుండగానే..

"అమ్మా.. హంసమ్మ చనిపోయిందట." చెప్పేడు శ్రీరమణ.

పార్వతమ్మ గతుక్కుమంది. వెంటనే మాట్లాడలేక పోతుంది.

"నేను వెళ్తాను." చెప్పిన శ్రీరమణతో..

"నేను వస్తాను." అంది పార్వతమ్మ.

"ఇప్పుడా.. వద్దులే. నీ ఆరోగ్యం అంతంతే. నీకు అలసట వద్దు. నేను వెళ్తాను. ఐతే.. రేపు తీసుకు వెళ్తాను. నేను వెళ్లాక.. కుదురుగా పడుకో. ఈ రాత్రికి అక్కడ ఏమీ చేయలేంగా." చెప్పగలిగాడు శ్రీరమణ.

పార్వతమ్మ ఏమీ అనలేక పోయింది.

శ్రీరమణ.. హంస ఇంటికి కారుతో కదిలాడు.

***

పది రోజులు తర్వాత..

ఉదయం..

పార్వతమ్మ వండి పెట్టిన పదార్థాలతో.. శ్మశాన ప్రాంతంలో.. ధర్మ శాస్త్రం ప్రకారం హంస కర్మ కాండల్ని నిర్వహించాడు శ్రీరమణ.

కాశిం, అబ్దుల్, గిరి.. శ్రీరమణకి తోడయ్యారు.

శిరిడి సాయి మందిరంలో రమారమీ పాతిక మంది పేదలకు భోజనాలు పెట్టాడు.

సావిత్రి కుటుంబంకి.. హంస సంగతి.. శ్రీరమణ ఇప్పటికీ తెలియ పర్చలేదు.

సాయంకాలం.. హంస ఉన్న ఇంటి ముందు.. లక్ష్మితో..

"హంసమ్మను ఆదరించినందుకు మీకు థాంక్సమ్మా." అన్నాడు.

"అయ్యో. మనిషికి మనిషి తోడవ్వకపోతే ఎలా. మరి నువ్వూ అంతేగా. తను నిన్ను చూసాక నుంచి.. నువ్వు బాగా తనకై తిరిగావు.. తనను బాగా చూసుకున్నావు." చెప్పింది లక్ష్మి.

ఆ వెంబడే..

"మీ బంధం ఏమిటో.. అంతా ఆ పై వాడి ఆట. మనం ఒట్టి వాళ్లం." అంది.

శ్రీరమణ నిర్వికారంగా నవ్వేడు. అక్కడ నుండి కదిలాడు.

***

మరి కొన్ని రోజులు గడిచాయి.

ఆ లోగా..

ఇంద్రజ, గిరిల పెళ్లి.. చక్కగా జరిగిపోయింది..

ముందు అనుకున్నట్టే.. సావిత్రి ఇంటిన చేరి.. ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాడు గిరి..

సావిత్రి కుటుంబంకి చేదోడు అవుతున్నాడు..

వీటికి శ్రీరమణ చొరవే కారణం.

ఇంద్రజ ఎప్పటిలానే ట్యూషన్స్ కొనసాగిస్తుంది.

ఇంద్రజ, గిరిల సంరక్షణలో.. సావిత్రి, చంద్రికలకు స్వస్థత అందుతుంది.

***

ఉదయం..

శ్రీరమణ..

పార్వతమ్మను.. మార్కెట్ కు తీసుకు వెళ్లాడు.

వారం రోజులకు సరిపడే వంటకై సరుకులను.. పార్వతమ్మ సూచనల మేరకు.. కొని పెట్టాడు.

ఆ మధ్య వరకు.. పార్వతమ్మ వంటకై సరుకులను.. రోజు వారీగా కొనుక్కొనేది. శ్రీరమణ చొరవతో అది ఇప్పుడు మారింది.

ఈ మధ్య లగాయితు.. కూరల సరుకులు.. శ్రీరమణే.. రోజు వారీగా.. తాజావి తెచ్చి పెడుతున్నాడు.

మార్కెట్ అయ్యాక.. పార్వతమ్మను ఇంటి వద్ద దింపేసి.. తను పనికి బయలుదేరాడు శ్రీరమణ.

రాత్రి..

భోజనం వడ్డిస్తున్న పార్వతమ్మ.. శ్రీరమణతో..

"చీకటి బతుకులకు వెలుగు అవుతున్నావు. సంతోషం." అంది సడన్ గా.

ఆ వెంబడే..

"మెప్పుకో.. స్వార్థంకో అంటే కానే కాదు. ఏమిటి నాయన నువ్వు. నువ్వు కొవ్వొత్తి మాదిరి మాత్రం కాకూడదు. నీ కోసం నువ్వు ఆలోచించుకో నాయనా." చెప్పింది గద్గదికగా.

శ్రీరమణ భోజనం ఆపి.. తెలెత్తి.. చూసాడు.

చీర కొంగుతో కళ్లొత్తుకుంటుంది పార్వతమ్మ.

శ్రీరమణ చలించాడు.

========================================================================

సమాప్తం

అమావాస్య వెన్నెల ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ బివిడి ప్రసాదరావు గారి గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









114 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Oct 14, 2023

శ్రీ బివిడి ప్రసాదరావు గారికి అభినందనలు. కథ బావుందండి.

Edited
Like
bottom of page