అంతులేని ఆశ !
- A . Annapurna
- Jul 28, 2021
- 2 min read

'Anthuleni Asa' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
చిన్నిపాపలను హృదయానికి హత్తుకుని పొదువుకోవాలని తనివి తీరని మగువ ఆశ
ఆటపాటలతో మురిపించు చిన్నారులను చూస్తూ మైమరిచి పోవాలని అంతులేని ఆశ
పసితనపు చేష్టలు మురిపాల పంతాలు ముద్దులొలుకు మాటలు వింటూనే ఉండాలని ఆశ !
అమ్మగా అనురాగాన్ని గుండెనిండా నింపుకుని తన బాధ్యతగా ప్రయోజకుడిని చేస్తుంది
చెల్లిగా ఆటాపాటలకు పేచీలకు పంతాలకు వేడుకలకు బహుమానాలకు పోటీ వస్తుంది
అర్ధాంగిగా అనురాగ వల్లి గ జీవితాన్ని కష్ట సుఖాలను పంచుకునే కల్పవల్లి ఆమె !
మాతృమూర్తిగా పిల్లలకు జన్మఇచ్చి భార్య భర్తల బంధాన్ని పెంచి ప్రాణంలో ప్రాణంగా మెలిగి
తన యావద్శక్తిని ధారపోసి కుటుంబం కోసం జీవితకాలం కష్టపడే మగువకు సాటి రారు ఎవ్వరు
ఆ మహిళా మణిని ఏమని పొగడాలీ....ఆమె విలువతెలిసి మసలుకొనడమే మగవానికి బాధ్యత !
ఒకజంట పెళ్లితో ఏకమై ప్రేమతో మమేకమై కుటుంబానికి ఆసరా ఇచ్చి కష్ట సుఖాలలో
సేద దీర్చు స్త్రీ మూర్తి విలువ అనంతమైనది అలాగే భర్తగా మగవాడు తన బాధ్యతను
పంచుకుంటూ తోడు నీడగా ఉండాలి.... పరస్పరం గౌరవించుకోవాలి అదే రక్షణ కావాలి ! .
వ్యసనాలకు లోనుకాక సులువుగా వక్ర మార్గంలో డబ్బు సంపాదనే ధేయంగా కుటుంబాన్ని
నిర్లక్ష్యం చేయద్దు వివేకాన్ని కోలుపోవద్దు అపురూపమైనది దాంపత్యం -అందమైన పొదరిల్లు
కుటుంబం. పిల్లలు కావాలి ఆనందాలకు పట్టు కొమ్మలు వంశ వృక్షానికి పూచిన పూలు!
విరబూసిన పూలతోటకు వసంతం వచ్చినట్టు వసంత యామిని లో కోయిలలు పాడినట్టు
గూటిలోని బుల్లి చిలుక కూనలకు అందమైన రెక్కలువచ్చినట్టు అమ్మ నాన్న పక్షులు
సంతానాన్ని ప్రాణప్రదంగా కాపాడుకున్నట్టు మనిషి కూడా మసులుకోవాలి వివేకంతో!
***శుభం ***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comentarios