ద్రోహం
- Srinivasarao Jeedigunta

- 10 hours ago
- 5 min read
ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Droham - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao
ద్రోహం - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 18/04/2026
“నిజాయితీని ఓడించాలనుకున్న కుట్ర… చివరికి ఎలా బట్టబయలైంది?”
జీడిగుంట శ్రీనివాస రావు గారి ఉత్కంఠభరితమైన ద్రోహం కథ చదవండి.
శ్రీరామ్ ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్. ఇరవై ఏళ్ల సర్వీసులో తన జీతం తప్ప ఒక్క రూపాయి కూడా ఇతరుల నుంచి ఆశించని వ్యక్తి. రోజూ తన చేతి మీదుగా ఎన్నో ముఖ్యమైన ఫైల్స్ సంతకం అయి వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితిలోనూ తన నడవడిక మార్చుకోకుండా నిజాయితీ తన ప్రాణం అనుకునేవాడు.
తోటి ఉద్యోగస్తులు, "ఎందుకు సార్ మీ నియమాలు? మీ సంతకంతో కోట్లు సంపాదిస్తున్న కాంట్రాక్టర్లు మీ నిజాయతీని చూసి నవ్వుకుంటున్నారు. ‘డబ్బులు పడేస్తే ఒక్క రోజులో పనిచేసే వాళ్లు ఉండగా, మీ నిజాయితీ వలన నాలుగు రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది’ అని అంటున్నారు. మారండి సార్, అవకాశం దొరికినప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి" అనేవాళ్లు.
శ్రీరామ్ వాళ్ళ మాటలకి నవ్వుతూ, "నన్ను ఇలా ఉండనివ్వండి" అనేవాడు.
శ్రీరామ్ భార్య శ్రావణి, కొడుకు కార్తీక్.
భర్త శ్రీరామ్ నిజాయితీకి ఎంతో విలువ ఇచ్చేది శ్రావణి.
కొడుకు కార్తీక్ ఇంజనీరింగ్ చదవటానికి డొనేషన్ కట్టడం ఇష్టం లేక, అంత పెద్ద పేరులేని కాలేజీలో చేరిపించి కొడుక్కి ఒకటే మాట చెప్పాడు. "మనం ఎంత గొప్ప కాలేజీలో చేరినా, చదవకపోతే ఫలితం శూన్యం. నువ్వు కష్టపడి చదువు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది" అని చెప్పాడు శ్రీరామ్.
కార్తీక్ కూడా సహజంగానే తెలివితేటలు ఉన్నవాడు. అందుకే ఇంజనీరింగ్ మంచి మార్కులతో పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు.
కార్తీక్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో, అనుకోని కష్టం చుట్టుముట్టింది శ్రీరామ్ కుటుంబానికి.
ఆ రోజు ఉదయం శ్రీరామ్ ఆఫీసుకి వెళ్లి టేబుల్ మీద ఫైల్స్ అన్నీ అర్జెంట్ ప్రకారం పెట్టుకుని, తన టేబుల్ అరలో ఉన్న పెన్నులు, క్యాల్క్యులేటర్ కోసం వెతుకుతూ ఉండగా, చేతికి ఏదో కట్టగా తగలడంతో బయటకు తీసి చూడగా డబ్బుల కట్టగా గమనించాడు.
'తన టేబుల్లో ఎవరు పెట్టారు?' అనుకుంటూ ఉండగానే, ఏసీబీ (ACB) అధికారులు దాడి చేశారు.
"ఆయన చేతిలో లక్ష రూపాయల నగదు దొరికింది" అని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. జరిగిన సంఘటనకి శ్రీరామ్ కొయ్యబారిపోయాడు.
"నేను తీసుకోలేదు, నాకు తెలియదు" అని మొత్తుకున్నా ఎవరూ వినలేదు.
టీవీ చూస్తున్న శ్రీరామ్ భార్య శ్రావణి, తన భర్త గురించి టీవీలో "లంచం తీసుకుంటూ దొరికిపోయిన అకౌంట్స్ ఆఫీసర్ శ్రీరామ్" అని రావడం, వీడియోలో తన భర్తను పోలీసులు పట్టుకుని తీసుకుని వెళ్లడం చూసి కంగారుగా కొడుకుకి ఫోన్ చేసి చెప్పింది.
ఇంతలో ఇంట్లోకి పదిమంది జొరబడి, "మేము ఏసీబీ నుంచి వచ్చాము. మీ ఇల్లు సెర్చ్ చేయాలి" అని చెప్పి ఉన్న నాలుగు గదులలోకి వెళ్లారు.
ఇంతలో కార్తీక్ ఇంటికి వచ్చి ఏసీబీ ఆఫీసర్ని అడిగాడు.
"మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మీ నాన్నగారు పనిచేస్తున్న ఆఫీసు మీద రైడ్ చేస్తే మీ నాన్నగారి చేతిలో లక్ష రూపాయలు బండిల్, టేబుల్ మీద కొంతమంది కాంట్రాక్టర్స్ ఫైల్స్ ఉన్నాయి. ఆ డబ్బు మీ నాన్నగారిది కాదు అంటే లంచం తీసుకున్నది" అన్నాడు ఆఫీసర్.
"సార్, మా నాన్నగారు నిజాయితీకి ప్రాణం ఇస్తారు. అటువంటిది ఆయన లంచం తీసుకోవడం అనేది జరగని పని. ఎవరో కావాలని ఆయనని ఇరికించారు" అన్నాడు కార్తీక్.
ఇంతలో సెర్చ్ పూర్తి చేసుకున్న వాళ్లు వచ్చి, "సార్, ఇంట్లో రెండు వేల రూపాయలు తప్పా ఏమీ దొరకలేదు. పెద్దావిడ మెడలో కూడా మంగళసూత్రం తాడు తప్ప బంగారం కూడా ఏమీ దొరకలేదు" అని రిపోర్ట్ చేశారు.
"కార్తీక్ గారు, మీ ఇంటి పరిస్థితి చూస్తే మీ నాన్నగారు లంచాలు తీసుకునే వారంటే నమ్మకం మాకు కుదరడం లేదు. కానీ మీ నాన్నగారి చేతిలో డబ్బులు దొరకడంతో మేము కేసు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే గానీ ఏమీ చెప్పలేను" అని చెప్పి వెళ్లిపోయారు.
ఈ వార్త టీవీలో చూసి చుట్టుపక్కల వాళ్లు శ్రీరామ్ కుటుంబం గురించి తలో మాట అనుకోవడం మొదలుపెట్టారు. "పైకి నిజాయితీపరుడులా నటిస్తాడు, లోపల ఇది అసలు రంగు?" అని విమర్శలు మొదలుపెట్టారు.
శ్రీరామ్ కి పదిహేను రోజుల జ్యుడిషియల్ అరెస్ట్ జరిగింది. విషయం తెలిసి కార్తీక్ కి పిల్లనిస్తాను అన్నవాళ్లు, "అవినీతిపరుడి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వం" అని సంబంధం మానుకున్నారు.
శ్రీరామ్ బెయిల్ దొరికింది, కానీ సస్పెండ్ అయ్యాడు. కోర్టు ఖర్చుల కోసం కార్తీక్ అప్పులు చేయాల్సి వచ్చింది. శ్రీరామ్ మానసిక వేదనతో మంచం పట్టాడు.
కార్తీక్ తన తండ్రి దగ్గర కూర్చొని, "ఈ సంఘటన జరగటానికి ముందు వారం రోజులలో మీకు ఎవరితోనైనా గొడవ జరిగిందా? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. మిమ్మల్ని కావాలని ఈ కేసులో ఇరికించినట్టు అనిపిస్తోంది. ఈ అపవాదు నుంచి బయటపడాలి అంటే మీరు ఎవరికైనా అడ్డంగా ఉన్నారా అనేది తెలుసుకోవాలి" అన్నాడు.
"నాతో అందరూ మంచిగానే ఉంటారు" అని తండ్రి అనడంతో, కార్తీక్ కి ఏం చెయ్యాలో తెలియక, తండ్రి పనిచేసిన ఆఫీసుకి వెళ్లి కొంతమందితో మాటలు కలిపి ఆఫీసులో తన తండ్రికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో గమనించాడు.
శ్రీరామ్ క్రింద ముగ్గురు జూనియర్ అకౌంట్స్ క్లర్క్ లు ఉన్నారని, వారిలో ఎవరో ఒక కాంట్రాక్టర్‌తో కలిసి ఒక పెద్ద స్కామ్ చేయాలని ప్లాన్ చేశారు. దానికి నిజాయితీపరుడు అయిన శ్రీరామ్ అడ్డుతగులుతాడు అని, ఆయన్ని వదిలించుకోవడానికి ఈ "ట్రాప్" ప్లాన్ చేశారని కార్తీక్ గ్రహించాడు.
అయితే ఆ ముగ్గురు అసిస్టెంట్లు కూడా తన తండ్రి మీద మంచి అభిమానం చూపించడంతో కార్తీక్, తన తండ్రికి విషయం చెప్పి, "ఆ ముగ్గురిలో ఎవరిమీద మీకు అనుమానం ఉంది?" అని అడిగాడు.
శ్రీరామ్ కి తన కొడుకు ఆఫీస్ పని మీద శ్రద్ధ చూపించకుండా తన గొడవలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేక మాట్లాడకుండా ఉండిపోయాడు.
ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు కొడుకు కార్తీక్ని పిలిచి, "అబ్బాయి, ఈ అపవాదు నుంచి బయట పడటానికి ఒక్కటే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం గవర్నమెంట్ ఉద్యోగస్తులు పనిచేస్తున్న హాల్ లో సీసీ కెమెరా పెట్టారు. ఎవరైనా లంచాలు తీసుకుంటే దొరుకుతారు అని. అయితే ఆ కెమెరా కొన్నాళ్లు పనిచేసి, తరువాత పనిచేయడం మానేసింది. అప్పుడు నేను, మా బాస్ అనుకున్నాము, ఈ ఉద్యోగులే కెమెరాని పాడుచేసి ఉంటారు అని. గవర్నమెంట్ ఆఫీస్ అవ్వడంతో మళ్లీ దాని విషయం పట్టించుకోలేదు.
నేను రోజూ స్టాఫ్ అందరూ వెళ్లిపోయిన తరువాత కూడా ఫైల్స్ చూసుకుని అటెండర్ తో ఆఫీస్ కి తాళం వేయించి వచ్చేవాడిని. ఒకరోజు ఎందుకో కెమెరా విషయం గుర్తుకు వచ్చి చూస్తే దాని కనెక్షన్ తీసివేసి ఉంది. ఎవరో అవినీతికి అలవాటు పడిన వారే ఈ పని చేసి ఉంటారు అనుకుని, ఆ సీసీ కెమెరాని నా పక్కన ఉన్న అల్మారా పైన కనిపించకుండా పెట్టి కనెక్షన్ ఇచ్చాను. ఆ తరువాత ఆ విషయం మర్చిపోయాను.
నిజంగా నా మీద ఎవరు పన్నాగం పన్ని ఏసీబీకి పట్టించారో తెలియడానికి మనం ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లి ఆ కెమెరా చూడాలి" అన్నాడు శ్రీరామ్.
"మీరు సస్పెండ్ అయ్యారు కదా నాన్నా, ఇప్పుడు మిమ్మల్ని ఆఫీసుకి రానిస్తారా?" అన్నాడు తండ్రితో కార్తీక్.
"నాకు నమ్మకస్తుడైన వాచ్‌మ్యాన్ ఉన్నాడు. ఈ రోజు ఆదివారం, సెలవు. పదా, ఇప్పుడే వెళ్లి చూద్దాం" అన్నాడు.
శ్రీరామ్ని చూసి వాచ్‌మ్యాన్ రాంసింగ్ లేచి నుంచుని, "సార్, బాగున్నారా?" అన్నాడు.
"ఏం బాగుండటం రాంసింగ్, ఒకసారి నేను కూర్చునే గదిలో చిన్న పని ఉంది. నువ్వు కూడా మాతో వస్తే అదృష్టం బాగుంటే నేను ఈ అపవాదు నుంచి బయటకు వస్తాను" అన్నాడు శ్రీరామ్.
నమ్మకస్తుడైన రాంసింగ్ శ్రీరామ్ని, కార్తీక్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. కార్తీక్ తండ్రి గదిలో ఉన్న కెమెరాని తీసుకొని చూశాడు.
శ్రీరామ్ వీడియో చూసి ఆశ్చర్యంతో, "ఓరి వీడి దుంపతెగా! వీడు నాతో నమ్మకంగా తిరిగే క్యాషియర్ మురళి. చూడు సింగ్, డబ్బుల కవర్ ఎలా నా టేబుల్లో పెడుతున్నాడో!" అన్నాడు.
కార్తీక్ వెంటనే పరిచయం అయిన ఏసీబీ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి చెప్పడం, ఆయన వెంటనే వచ్చి సీసీ కెమెరా స్వాధీనం చేసుకుని ఇంటి దగ్గర ఉన్న క్యాషియర్ మురళిని అరెస్ట్ చేసి అతని స్టేట్‌మెంట్ ప్రకారం కాంట్రాక్టర్ కుమార్ని కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచాడు. ఈ వార్త టీవీలో చూసిన బంధువులు ఇన్నాళ్లు శ్రీరామ్ని శంకించినందుకు సిగ్గుపడ్డారు.
శ్రీరామ్ నిర్దోషి అని తేలడంతో, ఆయన్ని గౌరవంగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కుట్ర చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది.
కార్తీక్ కి వచ్చిన ఆ పాత సంబంధం వాళ్లే మళ్ళీ వచ్చి క్షమాపణ అడిగారు.
కానీ కార్తీక్ నిశ్చయంగా చెప్పాడు: "కష్టాల్లో ఉన్నప్పుడు తప్పుగా అర్థం చేసుకున్న వారు, సుఖాల్లో ఉన్నప్పుడు మాకు అక్కర్లేదు" అని తిరస్కరించాడు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










Comments