'Edurugunda Unnavadu Pellikoduku' Written By Madduri Bindumadhavi
రచన: మద్దూరి బిందుమాధవి
వరుణ్, మనోహర్... ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. సాయంత్రాలు ఇంటికి ఇంచుమించు ఒకేసారి బయలుదేరతారు. అలాగే కబుర్లు చెప్పుకుంటూ వరుణ్ వాళ్ళింటి దాకా వచ్చాక "రావోయ్ మనోహర్! ఓ కప్పు కాఫీ తాగి వెళుదువు గాని! బ్రహ్మచారిగాడివి, ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తావ్" అన్నాడు.
అలా మనోహర్ కొలీగ్ వరుణ్ తో కలిసి వారింటికి వెళ్ళాడు.
కాలింగ్ బెల్ మోగంగానే వరుణ్ భార్య పంకజ వంటింట్లో ఏదో పనిలో ఉన్నట్టుంది ..కట్టుకున్న చీరకే చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది. చేతులు తుడిచిన గుర్తుగా, చీర మీద మరక కనిపిస్తోంది.
ఆకాశ రంగు నీలి చీరకి ముదురు నీలం రంగు అంచు..పాతబడ్డా చీర అందంగానే ఉంది కానీ..ఆ మరక మాత్రం అసహ్యంగా కనిపిస్తోంది. అనుకోకుండా దాని మీద దృష్టి పడిన మనోహర్ "అబ్బా ఇంత అనాగరికంగా ఉందేంటి ఈవిడ? ఇంట్లో ఉంటే మాత్రం ఇంత అశుభ్రంగా ఉండాలా?" అనుకున్నాడు మనసులో.
సోఫాలో కూర్చుంటూ పక్కకి తిరిగి చూశాడు..టీవీ మీద ఒక పాత చీర కప్పి ఉంది. దాని పక్కన మ్యూజిక్ సిస్టం కాబోలు...వరుణ్ పంచ కప్పి ఉంది. అది చూస్తూనే మనోహర్ కి ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకినట్టు అనిపించింది. 'అబ్బా నాగరికత..స్టైల్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఇంత జెడ్డిగా బతికే వాళ్ళున్నారా?' అనుకుంటూ, తన ముఖ కవళికలు కనిపించకుండా న్యూస్ పేపర్ లో తల దూర్చాడు.
"పంకజ డియర్ మా కొలీగ్ మనోహర్ అని చెబుతుంటా కదా.. ఇతనే! ఎలిజిబుల్ బ్యాచిలర్" అని పరిచయం చేశాడు వరుణ్.
"మా ఇద్దరికి చెరో కప్పు కాఫీ, కాసిని బిస్కెట్స్ పట్రావోయ్" అన్నాడు.
"ఇదిగో చిటికెలో తెస్తా. మీరొస్తారని డికాషన్ కూడా వేసి పెట్టాను" అని వంట గదిలోకి వెళ్ళింది.
'అబ్బో ఈవిడ కాఫీ కలిపే గిన్నె ఎలా ఉందో? కాఫీ కప్పుని కూడా ఏ చీర కొంగుతోనో (ఏ ముక్కో మూతో తుడుచుకున్న) తుడుస్తుందేమో...తల్చుకుంటేనే వాంతయ్యేట్టుంది అనుకుంటూ' ముఖాన గంటు పెట్టుక్కూర్చున్నాడు.
మనోహర్ అదృష్టం...కప్పు పైకి చూడటానికి శుభ్రంగానే ఉంది. 'హమ్మయ్యా...ఇవ్వాళ్ళ నా పుణ్యం పుచ్చిందన్నమాట' అనుకుని కాఫీ గట గటా తాగేసి వరుణ్ వాళ్ళింటి నించి బయట పడ్డాడు.
@@@@
"ఒరేయ్ మనో...మీ వదిన వాళ్ళ పెద నాన్న కూతురు సంబంధం వచ్చిందిరా! రేపు ఆదివారం పిల్లని చూసుకోవటానికి రమ్మన్నారు. ఆ రోజు ఏ ప్రోగ్రాం పెట్టుకోకు. పిల్లని చూసి నచ్చితే ఈ ఆశ్వయుజం లో ముహూర్తం పెట్టుకుందాం అన్నారు" అని రాత్రి అన్నం పెడుతూ కొడుక్కి పెళ్ళి సంబంధం గురించి చెప్పింది.
'నా పెళ్ళికి అప్పుడే ఏం తొందరమ్మా' అన్నాడు....తనకొచ్చే అమ్మాయి ఇందాక చూసిన వరుణ్ భార్య పంకజ లాగా మాత్రం ఉండకూడదు అనుకున్నాడు ఆమె రూపం మనసులో మెదులుతుండగా!
"నీది మరీ చోద్యంరా ...ఉద్యోగం లో చేరి నాలుగేళ్ళయింది. ముప్ఫయ్యేళ్ళు వచ్చాయి. ఇంకా ఎప్పుడు చేసుకుంటావ్? రేపు ఏ ప్రమోషనో వచ్చి వేరే ఊరు వెళితే అసలే దొరకవు. నీ పనులు ఇంకా ఎన్నాళ్ళు నేను చేస్తాను. నీకు కూడ ఓ పిల్లని తెచ్చి తగిలిస్తే మీ తిప్పలు మీరు పడతారు. పెళ్ళి సంబంధాలు చూడటానికి ఇంకా ఆలస్యం చేస్తే ఏదో లోపం ఉందనుకుంటారు. ఇక మారు మాట్లాడకు" అని హుకుం జారీ చేసి వెళ్ళి పడుకుంది మనోహర్ తల్లి వర్ధని.
@@@@
కాస్త అటూ ఇటూగా వదిన పోలికలతో ఉన్న వందన మనోహర్ కి నచ్చింది.
శుభ్రం గురించి, పని పాటల గురించి అప్పటివరకు తన మనసులో సందేహాలేవి గుర్తు రాలేదు మనోహర్ కి ఆ నిముషంలో!
ఆ వయసు అలాంటిది. అందమైన పిల్ల కనపడేసరికి మిగిలిన విషయాలన్నీ మనసు అడుగుపొరల్లోకి వెళ్ళిపోయాయి.
అనుకున్నట్టే ఆశ్వయుజ మాసంలో వందన ఆ ఇంట్లో కోడలిగాను, మనోహర్ మనసులో కలల రాణి గాను కాలు పెట్టింది.
కొత్తగా పెళ్ళయిన మురిపెంలో మనోహర్ కి వందనతో జీవితం ఆకాశంలో తేలిపోయే మబ్బుల్లాగా హాయిగా ఆనందంగా గడుస్తున్నది.
కొత్త కోడలికి అప్పుడే ఇంటి పనులు, వంట పనులు చెప్పటం ఎందుకని వర్ధని కూడా పనులన్నీ తనే చేసుకుంటూ....కొడుక్కి కోడలికి కావలసినంత ఏకాంతాన్ని కల్పిస్తున్నది.
ఆ రోజు వర్ధని ఇంట్లో లేని సమయంలో, మనోహర్ వేలు విడిచిన మేనమామ, ప్రసాద రావు ..చెల్లెలు వర్ధనిని చూసి వెళదామని వచ్చాడు.
వచ్చిన అతిధిని పలకరించి "కూర్చోండి బాబాయి గారు...అత్తయ్య బయటికి వెళ్ళారు. వచ్చేస్తారు" అని కాఫీ టిఫిన్లతో మర్యాదలు చేసింది వందన.
బయటినించి వచ్చిన వర్ధని, వాకిట్లోంచే అన్నయ్యని చూసి "అన్నాయ్యా ఇదేనా రావటం? అలా మాకు తెలిసిన వారింటికి వెళ్ళాను. కాఫీ తెస్తానుండు" అని లేచి వంటింట్లోకి బయలుదేరబోయింది.
"నీ కోడలు కాఫీ ఇచ్చి బిస్కెట్స్ పెట్టి మర్యాద చేసిందమ్మా! ఆఫీసు పని మీద వచ్చాను. సాయంత్రం వెళ్ళిపోతున్నాను" అన్నాడు.
"అయ్యో రాత్రికుండి రేపు వెళ్ళచ్చులే. మనో పెళ్ళికి కూడా ఉండనే లేదు. అప్పుడే వెళ్ళిపోయావు" అన్నది అప్యాయం నింపుకున్న గొంతుతో.
"మళ్ళీ వచ్చే నెల రావాలి. అప్పుడు ఒక రోజు మీతో గడుపుతాను" అని చెప్పి ఇంకొక గంట కూర్చుని వెళ్ళిపోయాడు.
@@@@
సాయంత్రం వంట పని చూడటానికి వంటింట్లోకొచ్చిన వర్ధని...కోడలు కాఫీ కలిపిన వైనం చూసి చిన్నగా నవ్వుకుని..."అమ్మాయ్ వందనా ఇలారా" అన్నది.
అత్తగారి పిలుపుతో, 'వంటింట్లో తనేదో తప్పు చేసి ఉంటుంది...కేకలేస్తారేమో' అనుకుంటూ పిల్లి లాగా వచ్చింది.
"ఇదిగో చూడు ఇది అన్నం వండే గిన్నె. దీనితో కాఫీ పెట్టకూడదు. కాఫీ గిన్నె కింద డ్రాయర్ లో ఉంటుంది. ఒక్క మనిషికి కాఫీ కలపటానికి అందుకు తగిన సైజ్ గిన్నె తీసుకోవాలి. అన్నం గిన్నె పెద్దదిగా ఉంటుంది. ఏది కనిపిస్తే దానితో పని చేసెయ్య కూడదు. పాల గిన్నెతో పులుసు కాచటం, పెరుగు గిన్నెతో అన్నం వండటం...ఇలా చెయ్యకూడదు. ఇంట్లో ప్రతి పనికి దాని కోసం నిర్దేశించిన వస్తువు ఉంటుంది."
"ఉదాహరణకి మీ నాన్న నీ కోసం మనో నే ఎందుకు ఎంచుకున్నారనుకుంటున్నావు? పెళ్ళి చేసేటప్పుడు ఈడు-జోడు, అందం-చందం, చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం, అబ్బాయి ప్రయోజకత్వం, అతనికేమైనా చెడు అలవాట్లు ఉన్నాయా.. అని అనేక విషయాలు చూసుకుంటారు. మగ పిల్లవాడైనంత మాత్రాన..కాళ్ళు చేతులు, ఒడ్డు పొడుగు ఉన్నాడు అని... "ఎదురుకుండా కనిపించిన వాడు పెళ్ళికొడుకు" అని ఏ తల్లిదండ్రులు అనుకోరు. తమకి, తమ పిల్లకి నప్పుతాడా..లేదా అని చూసుకుని, నలుగురితోను వాకబు చేసుకుని..తృప్తిగా అనిపిస్తేనే ముందుకెళతారు."
"అలాగే ఇల్లయినా..ఇంట్లో వస్తువులయినా..ఒక పద్ధతిలో ఉండాలి. ఏదయినా బట్టే కదా అని... టీవీల మీద, సోఫాల మీద చీరలు, లుంగీలు కప్పటం, ఒంటి మీద వాడుకునే బట్టలతో వస్తువులని తుడవటం, కర్టెన్లకి చేతులు తుడవటం...ఇలాంటివి చూడటానికి చిన్న విషయాల్లాగే ఉంటాయి కానీ ఎబ్బెట్టుగా ఉంటాయి. మనం నీట్ గా చీర కట్టుకుని, నగలు పెట్టుకోవటమే కాదు...మన ఇల్లు కూడా చూడగానే ఉన్నంతలో నీట్ గా ఉండాలి".
"ఏంటి ఇంత చిన్న విషయానికి అత్తగారు ఇంత లెక్చర్ ఇస్తున్నారు అనుకోకమ్మా! మా వాడికి చిన్నప్పటి నించి శుభ్రం కొంచెం ఎక్కువ! రేప్పొద్దున వీటివల్ల మీ మధ్యలో పొరపొచ్చాలు రాకూడదు. మీరు చదువుకున్న పిల్లలు. మీ ధ్యాస చదువు, ఉద్యోగం మీద ఉన్నంతగా..ఇంటి పనుల విషయంలో ఉండదు."
"ఇంటికొచ్చిన వారు మన అలవాట్లు చూసి ముఖం చిట్లించుకోకూడదు. చిన్న పిల్లవని తేలికగా అర్ధం చేసుకుంటావని చెప్పాను. తప్పనుకోకు" అన్నది వర్ధని.
"నేను అంత ఆలోచించలేదు అత్తయ్యా... మీరు పెద్ద వారు..అనుభవంతో చెబితే తప్పేముంది. మేము వేరే ఊళ్ళో ఉంటే ఇలా ఎవరు చెబుతారు? మీరన్నట్టు ఇలాంటి వాటివల్ల మా ఇద్దరి మధ్యన ఘర్షణలు తలెత్తచ్చు. మీరు ఇలాగే చెప్పండి. నేను అన్నీ నేర్చుకుంటాను" అని వందన అనేసరికి..అన్నిటికీ అత్తలని నేరమెంచే కోడళ్ళు ఉన్న రోజుల్లో తన కోడలు తనని సహృదయంతో అర్ధం చేసుకున్నందుకు తృప్తిగా వందనని దగ్గరకి తీసుకుంది.
[కొందరు తమని అడిగినా అడక్కపోయినా...వీలు, వివరం చూసుకోకుండా...మేమూ ఏదో చెప్పాం అన్నట్టు మంచి అమ్మాయి ఉంది (అబ్బాయి ఉన్నాడు) ..మీకు సరిగ్గా సరిపోతుంది అని సమ ఉజ్జీ కాని సంబంధాలు గొప్పగా చెబుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ సామెత వాడతారు]
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
Comments