top of page

కడుపు నిండితే గారెలు చేదు




'Kadupu Nindithe Garelu Chedu' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

"మేం స్వతంత్రంగా బతగ్గూడదా? మీకు ఇళ్ళు వాకిళ్ళు ఉండాలి. మేం మాత్రం సొంతంగా ఓ గూడు కూడా లేకుండా మీ మోచేతి కింద నీళ్ళు తాగుతూ బతకాలా?" అన్న చెంద్రయ్య మాటలు వినేసరికి రఘురాం కి మతి పోయింది.


"ఏం మాట్లాడుతున్నావ్! నువ్వే కాదు ఎవ్వరూ నా మోచేతి కింది నీళ్ళు తాగి బతకాలని కోరుకోను. అసలు అంత మాట ఎందుకనాల్సి వచ్చింది" అన్నాడు స్పృహలోకొచ్చి.


"నా పిల్లలని చదివించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి. పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. మిమ్మల్ని నమ్ముకుని కూర్చుంటే నేను బతకద్దా?" అన్నాడు చెంద్రయ్య.


"నిన్ను నేను సంపాదించుకోవద్దన్నానా? నా దగ్గర పని చేసే ఆ గంటో రెండు గంటలో తప్పితే నువ్వేం చేస్తున్నావని నేనడిగానా? మన చుట్టు పక్కల ఆడా-మగా ఎంత మంది పొద్దుటి నించీ సాయంత్రం వరకు కష్టపడి సంపాదించుకోవట్లేదు? మీరూ అలాగే సంపాదించుకోండి.

ఏ ఖర్చు వచ్చినా ఏదో నా దగ్గర దాచిపెట్టినట్టు వచ్చి డబ్బడుగుతావు. పెద్ద ఉద్యోగాలైనా...చిన్న ఉద్యోగాలైనా సంపాదించుకునే టైం లోనే ఓ రూపాయి వెనకేసుకోవాలి. వచ్చిన డబ్బు వచ్చినట్టు జల్సాలు చేస్తే కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు. ఆ విషయమ నీకు చాలా సార్లు చెప్పాను.

ఇప్పుడొచ్చి నా తల పుళ్ళు కడుగుతున్నట్టు దబాయించి మాట్లాడతావేమిటి? నేనేమన్నా నీకు బాకీనా? ఎంత అంటే అంత ఇవ్వటానికి?

‘ఎంతచెట్టుకి అంత గాలి ', ఎవరి ఖర్చులు, అవసరాలు వారివి. నేను రిటైర్ అయ్యాను తెలుసు కదా!” అన్నాడు రఘురాం.


ఆ మాట రుచించని చంద్రయ్య విసురుగా వెళ్ళిపోయాడు.


*******

గతంలో



"అయ్యా నా కొడుక్కేదన్నా దారి చూపించయ్యా...కాల్మొక్తా! ముగ్గురు బిడ్డల ఎన్క బుట్టిండు. ఆళ్ళ అయ్యుండంగ బిడ్డల పెండ్లిల్లు జేసిన. ఈడ్ని సదివిపిద్దామనుకున్న గాని నా కాడ పైసల్ లేకపాయె! ఇదిగో ఇప్పుడు సూడు సూడు మనుకుంట తండ్రి సచ్చి పాయే! మీరే ఏదో ఒక దారి సూపియ్యాలే! ఆనికి ఇంగ నించి తల్లైనా తండ్రయినా నువ్వే!" అని మైసమ్మ పదిహేనేళ్ళ కొడుకుని రఘురాం దగ్గరకి తీసుకొచ్చింది.


"సరే సరే ఫరవాలేదు, నే చూసుకుంటాలే" అని "నీ పేరేంటి" అనడిగాడు రఘురాం.

"చెంద్రయ్య" అన్నాడు ఆ అబ్బాయి.

"ఏం చదువుకున్నావ్" అనడిగాడు రఘురాం.

"ఊర్ల ఉన్న ఇస్కూల్లో ఐదో క్లాస్ వరకు జదివిన" అన్నాడు చెంద్రయ్య.


కొడుకుని రఘురాం దగ్గర వదిలి ఊరెళ్ళిపోయింది మైసమ్మ!


ఇంటి పనులు, బజారు పనుల్లో సహాయం చేస్తూ రఘు పిల్లలతో కలిసి పెరుగుతున్నాడు చెంద్రయ్య. చెంద్రయ్యని చదివించాలని ప్రయత్నించాడు, రఘు.

"ఏందో సారు ఈ సదువు నాకు బుర్రకెక్కుతలేదు. గిట్ల కష్టపడి పన్లు జేసుకుంట బతికేస్త" అనేవాడు ఎప్పుడు రఘు కొడుకు పాఠం చెప్పాలని ప్రయత్నం చేసినా!


మూడు పూట్లా తిండి పెడుతూ, కట్టుకోవటానికి బట్టలు కొని ... రేపు పెద్దయి పెళ్ళో పేరంటమో చేసుకుంటే అతని సంపాదన అంటూ అతనికి ఉండాలని ఇంట్లో పనులకి నెలకింత అని బ్యాంకులో వేసేది రఘు భార్య సుమతి.


అలా వారితో కలిసి బతుకుతూన్న చెంద్రయ్య కి పెళ్ళీడు వచ్చిందని అతని అక్కలు ఓ సంబంధం చూసి పెళ్ళి చేశారు. పెళ్ళాం కాపురానికొచ్చాక చెంద్రయ్య ఆలోచనల్లో మార్పొచ్చింది. ప్రతి చిన్న విషయానికి తనని రఘు పిల్లలతో పోల్చుకోవటం మొదలుపెట్టాడు.


చెంద్రయ్యలో వస్తున్న మార్పుని గమనించిన సుమతి, "మొత్తం కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకోలేం! విడిగా బతకమని" బయటికి పంపించింది.


అలా బయట బతుకుతున్న చెంద్రయ్య దైనందిన జీవితంలో జరిగే మార్పులని గమనించే అవకాశం లేదు రఘు దంపతులకి.


*******


"ఏమండి ఈ రోజు విజయదశమి. గుడికెళ్ళొద్దామా"అన్నది సుమతి భర్త రఘుతో. "అబ్బా పండుగ నాడు గుడిలో విపరీతంగా జనాలుంటారు. ఇంకో రోజు వెళదాములే" అన్నాడు రఘు కూర్చున్న చోటి నించి లేచే ఉద్దేశ్యం లేనట్టు బద్ధకంగా!


"అబ్బా పదండి. ఇప్పుడు ఇంకా సాయంత్రం నాలుగున్నరే అయింది. ఆరు దాటితే జనం పెరుగుతారు పదండీ" అని బలవంత పెట్టి గుడికి తీసుకెళ్ళింది.


గుడిలో దేముడిని చూసే హడావుడిలో క్యూ లో తన ముందు నిల్చున్న సత్యమ్మని వెనక నించి చూసి సుమతి గుర్తు పట్టలేదు. అయ్యవారు శఠగోపం పెడుతున్నప్పుడు చూసింది. ఆ అమ్మాయి కట్టుకున్న చీర ఖరీదైనదిగా కనిపించింది. తన ఇంటికి పనికి వచ్చే సత్యమ్మకి ఈ అమ్మాయికి అసలు పోలికే లేదు. కూతురు పట్టు పరికిణీ వేసుకుని మెడలో ఏదో నగ ధరించింది. ఇంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నించి వస్తున్నది? "అక్క కూతురు పెళ్ళి, మేనల్లుడి కొడుకు బారసాల అంటూ ప్రతి దానికీ పేద అరుపులు అరుస్తూ వచ్చి డబ్బు పట్టుకెళుతూ ఉంటాడు. ఇప్పటికి అతను తీర్చాల్సిన బాకీ షుమారు 5-6 లక్షల దాకా ఉంటుంది. ఎప్పుడిస్తాడో, ఎలా ఇస్తాడో చెప్పడు. ఇంత డాబుసరిగా బతికుతూ, రేపన్న రోజుకి ఒక్క రూపాయి వెనకెయ్యకపోతే అవసరానికి ఎక్కడి నించి వస్తుంది. ఎప్పటికప్పుడు కల్పతరువుల్లాగ మనం ఉంటే అతనికేం ఇబ్బంది" అని పరి పరి విధాల ఆలోచిస్తున్నది సుమతి.


ఇంతలో చెంద్రయ్య స్కూటర్ మీద వచ్చి భార్య సత్యమ్మని, కూతురు పద్మని తీసుకుని రయ్యిమని వెళ్ళిపోయాడు. రఘుని, సుమతిని గమనించనే లేదు.


ఇంటికొచ్చాక భోజనాల దగ్గర మాటల్లో గుడిలో చూసింది చెప్పి, "వీడికింత డబ్బెక్కడిదండీ?" అన్నది. కూపీ లాగితే బయట పదిమందితో రఘు పేరు చెప్పి పరిచయాలు పెంచుకుని, నాలుగు రకాలుగా సంపాదించి, డబ్బు చిన్న వ్యాపారస్తులకి రోజు వారీ వడ్డీలకి తిప్పుతున్నాడని తెలిసింది.


"ఓహో ఇదన్నమాట ఇతని మాట తీరు మారటానికి కారణం! అందుకే మొన్న నీ మోచేతి కింది గంజి తాగుతూ బతకాలా అనేంత స్థాయికి వెళ్ళాడు. పది రూపాయలు సంపాదించుకుని బాగుపడితే తప్పు లేదు. మనమూ సంతోషిస్తాం! అంత మాత్రాన నీడ నిచ్చిన చెట్టు విలువని ప్రశ్నించే స్థాయికి దిగజారక్కరలేదు. ఏమోలే అతని మొహాన ఏం రాసుందో! ఈ ధోరణి దేనికి దారి తీస్తుందో? 'దురదృష్టవంతుడిని బాగు చేసే వాడు లేడు అదృష్ట వంతుడిని చెడగొట్టే వాడు లేడు.. ' అంటారు ఇందుకే” అన్నాడు రఘురాం.


"వెనకటికి ఇలాంటి వాడే 'ఓడెక్కే వరకూ ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడి మల్లన్న ' అన్నాడుట" అన్నాడు.

"అవునండోయ్ మా నానమ్మ కూడా 'ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం' అని, 'పాలు తాగి రొమ్ము గుద్దటం' అని, 'కడుపు నిండితే గారెలు చేదు ' అనేది, ఇలాంటి వారిని చూసే!"


"పోనీ లెండి ఇప్పటికైనా, అతగాడి గురించి నిజం తెలిసింది. లేకపోతే ఎప్పటికీ, మనం లేకపోతే వాడెట్లా బతుకుతాడు అని అమాయకంగా ఆలోచించే వాళ్ళం!" అన్నది మానవ నైజం తెలుసుకుని కళ్ళు తెరుపుడు పడిన సుమతి.


***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు




Opmerkingen


bottom of page