'Kakathi Rudrama Episode 23' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 23 వ భాగం
గత ఎపిసోడ్ లో
మహాదేవుడి సైన్యాన్ని గన్నారెడ్డి దారిలోనే అటకాయించి, బాగా చికాకు పెడతాడు.
అయినా అతడి సైన్యం ఓరుగల్లును చుట్టుముడుతుంది.
దాడిని ఎదుర్కోవడానికి రుద్రమదేవి సైన్యం సన్నద్ధమౌతుంది.
కోట పరిరక్షణ వ్యూహాలను రుద్రమ స్వయంగా పర్యవేక్షిస్తుంది.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 చదవండి. .
రుద్రదేవి తన సేనాపతులనందరినీ, ఆ రాత్రి తన ఆలోచనా మందిరానికి పిలిచింది.
"మీరు తెలుగువీరులు. పగరకు వెన్నిచ్చి పారిపోయే వారుకాదు. నేటి మేటి శూరులు. విరోధిని పూర్తిగా ఓడించడానికి నెలదినాలకన్నా ఎక్కువకాలం పనికిరాదు. పదిరోజుల లోపు మనం విజయం పొందగలం అని నేననుకోను.
"మన యుద్దవిధానం మనకోటను రక్షించుకోటం కాదు. అని మీరు నిస్సందేహంగా నమ్మండి. శత్రువును సర్వనాశనం చేసి ఓడించడమే మన కర్తవ్యము. అది ఒక్కటే మన ధర్మము. మన కోటబలం అందుకే ఉపయోగపడాలి.
"ఒక్క నిమిషము కూడా శత్రువునకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఈయకూడదు. గవనులు వెడలి వారిపై బడి నాశనం చేస్తూ ఉండడము, వారి ఒత్తిడి ఎక్కువైతే కోటలోకి వచ్చేయడము! అన్ని గవనుల నుండీ ఒక్కసారి ముందుకు దుమికి వెనక్కురావడం, ముందుకుపోతే జాగ్రత్తతో పోవాలి!
"ఈ నాటికి మూడవ దినం శత్రువులను కంపకోటకడకు రానిచ్చి, పోరు మంచిపట్టు ఉన్నసమయంలో కంపకోట అంటించాలి. అంటించేముందు తక్కిన సైన్యం మట్టికోటలోనికి వచ్చివేయాలి! అగ్నిహస్తులు మాత్రం అగ్ని ముట్టించి లోపలికి వచ్చేయండి. శత్రువు రక్షణకోసం వెనక్కు తగ్గగనే, అగ్ని ఆరిపోయే సమయం లో అన్ని సింహద్వారాల నుంచి, దిడ్లనుంచీ లక్షమంది పైకురికి శత్రువును చీకాకు పరచండి.
శత్రువు బలం ఎక్కువ అయ్యే విషయం మేము కోటగోడలమీదనుంచీ చూచి మహాకాహళాలు ఊదిస్తాము. కాహళాల ధ్వని విని నెమ్మదిగా వెనక్కు అడుగువేయండి.
పైకి వెళ్ళే సైనికులందరూ శిరస్త్రాణాలమీద ఎర్రతలపాగాలు చుట్టుకొనండి. మన సైనికులు గోడదగ్గరకు వస్తూంటే శత్రువు మా బాణపు వేపుకురాగానే బాణవర్షం ఆపుతాము. మన సైన్యం నిలబాటు చేసి, శత్రువును రెండవసారి తలపడండి.
అప్పుడు మహా భేరీలు మేము మ్రోగించగానే ప్రతి సైనికుడు లోపలికి వచ్చి వేయవలసిందని మా ఆజ్ఞ. ఈ లోగా ఆ సమయంలోనే ఉభయమల్యాల సైన్యాలు గన్నారెడ్డి ప్రభువులు వెనకనుండి శత్రువులపై ఒత్తిడి ఎక్కువ చేసేందుకు మా ఆజ్ఞ”
అని చక్రవర్తి గంభీరోపాన్యాసము తో సేనాపతులకు మార్గనిర్దేశము చేసి సభ చాలించినారు. ఆ మరునాడు ముమ్మడమ్మ కు వీరోచితవేషం వేసికొమ్మని తనవెంట తీసుకుని శివదేవయ్య మంత్రిని దర్శించడానికి వెళ్ళారు.
ఆయన రుద్రదేవిని, ముమ్మడమ్మ ను అశీర్వదించి
"మహారాజా, మీరు నిశ్చయించిన ప్రథమయుద్ద ప్రయోగము అమోఘమైనది. దానివల్ల శత్రువుకు కలుగబోయే నష్టము అపారము. మీరే దర్శింతురుగాక!
లోకంలో ఆడువారికి రాజ్యార్హత పెద్దలు ఎందుకు తీసివేశారో!" అన్నారు
రుద్ర; గురుదేవా; స్త్రీకి రాజ్యార్హత పెద్దలు ఊరికే తీసివేసారంటారా? ఆలోచించి తీసివేశారు. ఎప్పుడు యుద్దం జరుగుతోన్నదని విన్నా గజగజ వణికిపోతారు.
శివ; పిల్లవానికి ముల్లు గుచ్చుకుంటే తల్లి తీసివేయదా!
తప్పక తీసివేస్తుంది. పిల్లవానికి బాధ కలిగితే ఊరుకోదు.
రుద్ర; కత్తిపుచ్చుకుని కుమారునకైనా శస్త్రచికిత్స చేయగలదా బాబయ్యగారూ?
శివ; పాము కరిస్తే, విషం పీల్చివేయవలసి ఉంటే తన ప్రాణనష్టానికన్నా వెరవకపీలుస్తుంది కదా తల్లీ!
రుద్ర; తన ప్రాణాన్ని అర్పించడానికి, స్త్రీ ఎప్పుడూ సిద్దమే.
శివ; తన కొడుకు ప్రాణం రక్షించుకోవడానికి, కొడుకును బాధపెట్టలేక, కొడుకును చంపివేసుకుంటుందా?
రుద్ర; ( మౌనం)
శివ; కాబట్టి దేశానికి తల్లి అయినది రాణి. తన బిడ్డలయిన దేశ ప్రజలను రక్షించడానికి సందేహిస్తుందా ?
రుద్ర; తానే, ధర్మంగా రాజ్యం చేస్తాను అనుకోడం అహంభావం కాదా?
శివ; తన్ను ఓడించి రాబోయేవాడు రాక్షసుడు కాజాలడని, ప్రజలను రక్షిస్తాడని ఆ రాణికి నిర్ధారణగా తెలియునా?
రుద్ర; ఇవన్నీ తలచుకుంటేనే నాకు ఆవేదన కలుగుతూ ఉంటుంది. పరమశివుడు ఇన్ని కష్టాలతో ఎందుకు ఉద్భవింపజేశాడు. ఒకరు రాజ్యాధిపతులా, ఒకరు గంగిరెద్దు దాసరులవంటి బిచ్చగాండ్లు !
శివ; బిచ్చగాండ్లు అయి పడే కష్టాలు ఎక్కువ ఏముంది? రాజ్యాధికారులు పడని కష్టాలు ఏమున్నాయి? సర్వ విశ్వంలో యీ మనుష్యుడే జ్ఞాన ఉపాధి. అతడే " ఏమి" అనే ప్రశ్న వేసుకుంటున్నాడు. భక్తులు, జ్ఞానులు, అవతారపురుషులు కష్టాలలో కుంగిపోయి, మానవజాతిని ఉద్దరించడానికి అనేక ఆవేదనలకు లోనవుతారు.
బీదవారికే మోక్షం సులభం అని తెలుపడానికి కాబోలు, రాముడు శబరి ఎంగిలి తిన్నాడు. శ్రీకృష్ణుడు కుచేలునికి ప్రాణస్నేహితుడయ్యాడు. అయినా ఏదో మార్పులతో ప్రపంచం అలానే వుంది.
రుద్ర; గురుదేవా! మనుష్యుల గుంపులు ఎలా ఉన్నా ప్రత్యేకవ్యక్తి పరమాత్మ ను తెలిసికోవడమే మహాకర్మ అవుతుంది కాదా?
శివ; నిజం తల్లీ! అయినా నీ చుట్టుపక్కల ప్రపంచం చూచి దాని సంతోషాలలో, బాధలలో ఒకటౌతూ, నువ్వు ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ ప్రపంచం నిజమనుకుంటూ, కాదనుకుంటూ, ఒక దివ్యనాటకంలో పాత్ర అవుతూ, చరించటం ఎంత విచిత్రమైన విషయం.
రుద్ర; అందుకే "నువ్వు నిష్కామంగా కర్మ చేయి, ఫలం నాకు వదులు" అని శ్రీకృష్ణ భగవానుడు అన్నది.
శివ: అదేగా పాశుపతం చెప్పింది తల్లీ! ఇంతకూ జీవిత మహాయుద్దం, ముందర ఈ అఖండ ఆత్మయుద్దం ముందర మనం ఒనరించే యుద్దాలు దివ్విటీ ముందర
దీపాలవంటివి.
రుద్ర; చిత్తం.
శివ; చిత్తమని నిస్పృహచెంది వెళ్ళకు! మన పౌరుషాలు, మన జ్ఞానాలు, మన ఖ్యాతులు, మన ఆవేశాలు దేహయుద్దానికి, ఆత్మయుద్దానికి కూడా ఉపకరణాలు.
ఏ యుద్దంలో నైనా మనమే విజయం పొందాలి.
శివదేశికుల బోధలు విని ఉప్పొంగి, రుద్రమ ఆయనకు పాదాభివందన మాచరించి వెడలిపోయినది.
ముమ్మడమ్మ గురువులకు నమస్కరించి చక్రవర్తికి కలిగిన అనుమానమేమిటీ? అది గురువులెట్లా తీర్చారు. వారి సంభాషణ ఇసుమంతయినా తనకు బోధపడక పోయినదేమీ? అనుకుంటూ రుద్రమ వెనుకనే తన గుర్రం నడిపించుకుంటూ వెళ్ళినది.
----------------------------------------
ఆ మరునాడు చక్రవర్తి దగ్గరనుండి సూర్యుడు నెత్తిమీదున్నవేళకు మహాదేవరాజు సైన్యాలపై ఒత్తిడి ఎక్కువ చేయవలసిందని కాచయప్రభువు గన్నారెడ్డికి వార్తపంపినాడు.
మూడు సైన్యాలు మూడు వైపులనుండి కాపలా కాచారు. ఎక్కడో దూరాననుండి ఆశ్వికసేనలు, గజబలం, రథాలు బయలుదేరి వేగంగా వచ్చి మహాదేవరాజు సైన్యాలకు వెనక తాకినవి. ఈ తాకిడి ప్రళయంగా ఉండటంవల్ల మహాదేవరాజు సైన్యాలు ఎన్నో వెనకవైపు తిరిగి మహాసైన్యాన్ని ఎదురుకొన్నాయి.
గన్నారెడ్డి అశ్వబలం వేగంగా వచ్చి విరోధులని తాకి బాణాలు వదలడం, మళ్ళీ అంతవేగంతో వెళ్ళిపోతుండటం అనే ఆవర్త యుద్దవిధానం ఉత్తమమయినదని తెలియజేసినాడు. మహావేగంతో
వెళ్ళేవాడు గురికి దొరకడు. అతడు ప్రయోగించే బాణాలుగానీ, భల్లాలు గానీ, తోమరాలు గానీ నిలిచయున్న విరోదులకు తగిలితీరతాయి.
ఈ ఆవర్త విధానం చూసి భ్రమసిపోయి శత్రువులు వేలకొలది కూలిపోతున్నారు. సరిగా ఆ సమయంలో కంపకోట వదలి ప్రసాదిత్యనాయకులు లక్షమంది సైనికులను విరోధిపై ప్రయోగించినాడు.
శత్రుసైన్యాలు ద్విముఖమై యుద్దం చేస్తున్నాయి.
ప్రసాదిత్యప్రభువు, శత్రువు తాత్కాలికంగా నిర్మించుకొన్న గోడలను, అనేక ప్రదేశములను బద్దలుగొట్టించి లోనికి ప్రవేశించాయి. పోరు ఘోరమయ్యెను.
ఆ సమయంలో వేయి మహాకాహళపు మ్రోతలు వినబడ్డాయి. కంపకోటకు ముందుకు రెండుపాయలుగా ఏనుగులు వచ్చి ప్రసాదిత్యునికి బాసటగా అయినాయి. ప్రసాదిత్యుని సైన్యాలు నెమ్మదిగా వెనక్కు తగ్గుచూ మళ్ళినవి. వారిమీద విరుచుకుపడేవారిని గజసైన్యాలు నిలువరింనవి. గజసైన్యాల వెనుకకు ప్రసాదిత్యుని బలగాలు మళ్ళగానే ఏనుగులు మళ్ళీ కంపకోటలో దిడ్లవెంట లోనికెళ్ళినవి.
మహాదేవరాజు శత్రువులు ఓడినారనే తలచి ఒత్తిడి ఎక్కువ చేసినాడు. ఆ సమయంలో మల్యాలవారు, గన్నారెడ్డి సైన్యాలు ఆవర్తయుద్దం మాని నిలచి పోరాడసాగిరి. కాలిబలాలు ముందుకు జరిగాయి.
ఇటు మట్టికోటలోని వారు కంపకోట దగ్గరకు రాకుండా శత్రువును నిలువరించినారు.
కంపకోట నుండి ఒత్తిడి తక్కువైంది. శత్రువులు తమ వేగం తాము ఆపుకోలేక, ఎదిరి వారు కంపకోటను కాపాడుకోలేకుండా ఉన్నారని, కంపకోటపై విరుచుకుపడినారు.
ఇంతలో ఫెళఫెళ రవాలకో, నూనెలతో తడుపబడి గంధకాదులకో సిద్దమైయున్నకంపకోట అంటుకున్నది.
కంపకోట అంటుకున్న వెంటనే భుగభుగమనే మంటలు ఆకాశంపై దుమికాయి. మంటలతోపాటు నూనెపొగలు, గంధకపుపొగలు నాసిరంధ్రాలలో దూరి వీరుల కళ్ళు మూసినవి. ఆపుకోలేని దగ్గు వచ్చినది. వేగంతో ముందుకురికిన శత్రుబలాల గోలలు నభోంతరాళం నిండిపోయింది.
సువ్వు సువ్వున వేగంతో మహావర్షపాతం వలె బాణాలు శత్రువుల ప్రాణాలు హరిస్తున్నాయి. రెండు గడియలకు శత్రువులు తెప్పరిల్లి వెనుకకు మరలిరి. మంటలు తగ్గెను.
కాకతీయ సైన్యాలు మంటల వెనకనుండి ఉధృతంతో శత్రువులపై ఉరికెను. ఓరుగల్లు కోటగోడలు పగిలినట్లు కాకతీయసేనలు విరుచుకుపడినవి. చెక్కుచెదరకుండా
వ్యూహనిర్మాణం చెడకుండా, విధిగా, ఆ వాహినులు శత్రువులను నాశనం చేస్తున్నవి. తమ గోడలలోనికి పోయికూడా శత్రువులు రుద్రదేవి సైన్యాలను ఆపలేకపోయినారు.
శత్రువుల తాత్కాలిక కుఢ్యాలు కూల్చి శత్రు శిబిరాలలోకి చేరి, రుద్రదేవే ముందుండి నడిపే ఆ వాహిని విరోధిబలగాలను నాశనం చేస్తున్నవి.
మహాదేవుడు తన యుద్దకౌశలము, పౌరుషము ఓడిపోతామన్న భయంచేత కలిగిన కోపమూ మూడు త్రేతాగ్నులుగా విజృభించి రాక్షసునిలా పోరాడినాడు. అతని సేనలు తమ నాయకుని మెప్పుపొందుటకు భయంకర యుద్దము చేసిరి.
వీరనష్టముకాకుండా యుద్దం చేయదలచుకున్న రుద్రదేవి ఆజ్ఞచొప్పున గన్నారెడ్డి, మల్యాల నాయకులు ఆవలివైపునుండి భయంకరమైన యుద్దం ప్రారంభించారు.
ఇటు రుద్రమ ఆజ్ఞ చొప్పన భేరీలు మ్రోగినవి. రుద్రమ సైన్యాలలో కొత్తసైన్యాలు వచ్చి పదాతులకు, ఆశ్వికులకు రక్షణ కల్పించగానే ఆయా బలాలన్నీ కోటలోనికి వెళ్ళిపోయి
నవి. గజబలం కూడా కోటచేరినవి.
కోటదగ్గరకు మహాదేవుని సేనలు రావటానికి వీలులేదు. అటు గోన, మల్యాలసేనలు వెనుకకు జరిగి మాయమైనవి. ఆ దినమందు మహాదేవుని సైన్యంలో ఒకలక్ష ఏబదివేల మంది వీరులు మరణించినారు. కాకతీయులకు దొరికినవారు అనేక వేలమంది. కాకతీయసైన్యాలలో మృతులైనవారు, గాయపడినవారు, విరోధులకు చిక్కిన వారున్నూ ముప్పదివేలు.
మహాదేవుని గుండెలో రాయిపడింది.
కోటపైకి వెళ్ళకుండా ఉంటే తనకు నష్టమే! కోటపైకి వెళ్ళినచో తన సేనలకే ఎక్కువ నష్టం సంభవిస్తోంది. ఎలాగో ఉత్తమమైన విధానం అవలంభించి ఓరుగల్లును స్వాధీనం చేసుకోవాలి.
తాను కోటముట్టడి వదలి ఇతరనగరాలమీదికి వెళ్ళితే మంచిదేమో! కోటలో వున్న వారికి బలం ఎక్కువ అవుచున్నది. కోట ఈవలకు వచ్చిన కాకతీయులను తన సైనికులు నాశనం చేయగలరు.
అయినా తానెందుకు తొందరపడటం!
చుట్టుప్రక్కల గ్రామాల వారంతా ఓరుగల్లు నగరంలోనే ఉన్నారని తన వేగులు తెచ్చిన వార్తలే నిజమైతే నగరంలో పదునాలుగు లక్షల జనం ఉన్నారు. ముట్టడి నిలబాటు చేసినట్లైతే ఇన్ని లక్షలమంది, ఉన్న ఆహారపదార్థాలు ఒకనెలరోజులలో తినివేయగలరు. జాగ్రత్తగా ఉంటే ఇంకొక పదిహేనురోజులు ఈడ్చుకురాగలరు.
అంతవరకు తాను ముట్టడి నిలబాటు చేయగలిగితే
కోట తన స్వాధీనం కాగలదు. తనకు ఈ కాకతీయుల యుద్దవిధానం మొత్తము అవగతమైపోయింది. అందుకని తాను తొందరపడక తన శక్తి కాకతీయులకు తెల్లమయ్యేటట్లు చేశాడు’ అను
కొనుచు మహాదేవరాజు, ఆ రాత్రి పనివారలచేత తనకోటగోడలు, బురుజులు బాగుచేయించాడు.
వెనుకనుండి మల్యాలవారి సేనలు, గోనగన్నారెడ్డి సేనలు తనను పొడవకుండా ఆవైపు చిరుకందకాలు, కంపకోటలు రెండు శ్రేణులుగా కట్టించెను.
ఈ లోగా వేగులవారిని పంపి దేవగిరిలో ఉంచిన లక్షసైన్యంలో ఏబదివేల మందిని, ఆహారప దార్థాలను తెప్పించుకొన సంకల్పించాడు.
-----------------------------------------------------
ఇంకా వుంది...
------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Commenti