'Kakathi Rudrama Episode 24' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 24 వ భాగం
గత ఎపిసోడ్ లో
గన్నారెడ్డి తన సేనలతో మహాదేవుని మీద ఒత్తిడి పెంచుతాడు.
కాకతీయ సైన్యాలు కంప కోటను ముట్టిస్తారు.
మంటల వెనుకనుండి బాణాలతో దాడి చేస్తారు.
ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 చదవండి. .
శివదేవయ్య అంతర్మథన చర్చలు----
శివదేవయ్య అందరితో సహస్రావదానంలా ప్రశ్నోత్తరాలు జరుపుచున్నను, ఆ సాయంకాలము జరిగిన మహాయుద్దాన్ని గురించే ఆలోచిస్తున్నారు.
తాను రుద్రప్రభువు కు ఆలోచనలు చెప్పగూడదు. ఆ ఉత్తమురాలు తన రాజ్యము తానే రక్షించుకోవాలి. తన సార్వభౌమత్వము తానే నిర్మాణము చేసుకోవాలి. స్త్రీలలోని
పరిపాలనాదక్షత, కళాప్రపూర్ణము, శక్తియుతము. పురుషుని శక్తి అత్యంత బలయుతము. పురుషుడు విరోధులను లోబరుచుకున్నా, తన ప్రాభవం కోరతాడు. స్త్రీ ఇతరులను జయించినా వారి పూజ ఆశిస్తుంది.
రెండు శక్తులూ రుద్రమాంబలో యమునా గంగా సంగమమయ్యాయి!
ఈ తల్లి స్త్రీరాజ్య మెంత ఉత్కృష్టమో లోకానికి చాటగలదుగాక. పురుషుడు విభూతులను సంపాదించగలడు. వాటిని ఉత్తమంగా కాపాడవలసింది స్త్రీ గదా! పురుషుడు సృష్టికర్త. స్త్రీ సంరక్షణ కర్త్రి. ఇది మహాభావ విషయంలో, భౌతికంగా స్త్రీ బిడ్డలను కనాలి. పురుషుడు ఆ శిశువులను రక్షించాలి. ఈ భౌతిక సత్యంలో నుండే తాంత్రికవాద ముద్భవించింది.
ప్రేమకు విముఖుడయిన శివుడు కాముని దహిస్తే దేవి ఏమవుతుంది? విశ్వసౌందర్యాన్ని ప్రేమించి భోగించగల ఆమె దివ్యరాగము పురుషునిలో లేకపోతే విశ్వానికే
నాశనం! పరమేశుని ఇచ్ఛ సృష్టిస్థితి లయాలు. నాశన శక్తి భంఢాసురుడయినది.
ఆ నాశన శక్తి ని పురుషుడు నాశనం చేయలేక పోవుట విచిత్రం. దేవిని ధ్యానించినాడు పరమేశుడు. తాను ఏమి చేయలేడు. దేవి ఎక్కడ? సర్వమూ ఆహుతి అయిపో
యినది. తానే ఆహుతి అయినాడు. తన ఇచ్ఛ ఆహుతి అయినది.
ఆ దివ్యాగ్ని లో నుంచి దివ్యకామ అయిన దేవికామేశ్వరిగా ఆవిర్భవించింది. ఉపాధి లేని శక్తి ఎట్లు? పురుషుడే కామేశ్వరుడు. కామకామేశ్వరి, రాజరాజేశ్వరి అనేభావం విశ్వవిశ్వాలకు, అనంతకాలానికి మూలమంత్రం. ఆ మంత్రానికి అధిదేవత కాముడేఅయినాడు.
అలాంటి ఈ విశ్వంలో, విశ్వానికి మధ్యమయిన ఈ భూమిలో, రాజులు రాజ్యాలకోసం, మతకర్తలు ధర్మాలకోసం, పండితులు తమ వాదాలకోసం విజిగీషులై జైత్రయాత్రలు చేయడం ఎందుకు?
ధనం, భోగం, కీర్తి ఈ మూడు బ్రతికి వున్నన్నాళ్ళే ఉంటాయి. కీర్తి కొన్ని నూర్ల సంవత్సరాలు వుండవచ్చును. ఎంతమంది రాజులు దానశాసనాలు వ్రాయించలేదు. అవి జరుగుతున్నాయా? ఎంతమంది తాత్విక ధర్మస్థాపనలు జరుపలేదు? అవి ఏమయ్యాయి? మతాలు మాత్రం ఎన్ని విధాల రూపం పొందుటలేదు. అన్ని ధర్మాలు, తత్వాలు తాత్కలికమే. కాని వర్తమాన నాటకం మాత్రం తప్పదు.
మహాదేవరాజు ఓరుగల్లుకు వచ్చాడు. ఏమి కట్టుకుపోతాడు? ప్రాణాలా? అతడు వచ్చాడని మనం రక్షించుకోవడం ఏమిటి? ఇది అంతా ప్రళయ నటేశ్వర మహాభావము. పులితోలో, ఏనుగుతోలో నడుమున కట్టుకుని, కంకళాలు దరించి త్రిశూలము, ఢమరుకము, అగ్ని మూడు హస్తాల దాల్చి అభయహస్తముతో సృష్టిస్థితి లయాత్మకము లయిన కోటివేల కిరణాలతో నృత్యనృత్తాలతో, అభినయాదులతో, దివ్యగాంధర్వంతో విశ్వభావంతో తాండవం చేస్తాడట. అన్నీ ఆ తాండవంలో భావమాత్రములే.
శివదేవయ్య చిరునవ్వు నవ్వుకొన్నాడు. శిష్యులంతా లోగొంతుకలతో ఏవేవో చర్చించుకొంటున్నారు. అంతలో రుద్రదేవ చక్రవర్తిణి హఠాత్తుగా లోనికి దయచేసి, గురువునకు సాష్టాంగనమస్కారం చేసింది.
అచ్చటనున్న వారంతా లేచారు. గురుదేవులు తమ ఆలోచనాపధం నుండి మరలి చటుక్కున లేచి " రండమ్మా! రండి. అధివసించండి" అని ఆసనము చూపెను.
రుద్రమదేవి, శివదేవయ్య మిగిలినవారు తమతమ ఆసనములలంకరించినారు. యుద్దవిషయాలు వారిరువురు మాట్లాడుకొంటే విందామని కుతూహలముతో ఎదురు చూస్తున్నారు.
రుద్ర: బాబయ్యగారూ! ఇంతవరకూ మనదే విజయం. మహాదేవరాజు చిందరవందర అయిపోయినాడు విన్నారా?
శివ: విన్నాను మహారాజా! మీ మనస్సులో ద్వాదశార్కులు ప్రతిఫలింతురు గాక! మీ హస్తాలలో పాశుపతాది దివ్యాస్త్రాలు భాసించుగాక! మీ చూపులలో ఫాలనేత్రాగ్ని వెలిగిపోవుగాక! మీ శత్రవు పరాభూతుడగుగాక! మీకు శుభమగుగాక!
--------------------------------------------
వారము దినములు ఎడతెరిపిలేకుండా, సర్వకాలాలయందు మహాదేవుడి సేనలపై విరుచుకుపడి నాశనం చేసిరి. ముక్కలు చేసి నుగ్గునుగ్గుగా భస్మము చేసినారు.
చాళుక్య వీరభద్రుడు యుద్దంలో ప్రాణాలు మరచిపోయి, దుర్నిరీక్ష్య పరాక్రముడై శత్రు సేనలను ముక్కలు చేస్తున్నాడు. వారము దినాలయిన వెనుక రుద్రదేవి, తన సర్వసైన్యాలకు రెండు దినములు విశ్రాంతి అని ఆజ్ఞ జారీచేసింది.
కోటలోనుండి ఒత్తిడి లేకపోవడం వల్ల మహాదేవుడి సైన్యాలకు కొంచము " అమ్మయ్యా"
అని గాలి పీల్చుకునే అదను దొరికినది. ఈ పదిదినాల యుద్దానికి శత్రువులు మూడు లక్షలమంది ముక్కలయిపోయినారు. రెండు లక్షలమంది మృత్యులయినారు.
గాయాలు తగిలినవారు ఎనభై వేలున్నారు. తక్కినవారు శత్రువులకు బందీలయినారు గోనగన్నారెడ్డి శత్రువులకు దేవగిరినుండి ఆహారసామగ్రి రానివ్వడు. దేవగిరి మహా
దేవరాజు పంపిన చారులనందరినీ దారిలోనే బందీలుగా పట్టుకుని శత్రువుల వార్తలన్నీ అందిపుచ్చుకుని ఆనందిస్తూ, మహాదేవరాజు సైన్యాలను చిందరవందర చేయుచుండెను. మల్యాలవారి సైన్యాలకు కూడా ఆ పదిదినాలు గన్నారెడ్డే ముఖ్య నాయకుడు. ఆ పదిదినాలు అతడు నడిపిన యుద్ధ వ్యూహ విధానము వర్ణనాతీతం.
ఆ రాత్రి యుద్దము సంగతి చారుల వలన రుద్రమదేవికి తెలిసెను.
చక్రవర్తిణి ఎంతో ఆనందించెను. అన్నాంబిక తనను వలచిన వాని కడకు వెళ్ళెను. ఆమె ఏమి చేయుచుండెనో అని రుద్రదేవి అనుకున్నది. గన్నారెడ్డి ఇప్పటికి నాలుగేళ్ళ నుండి కాకతీయ మహాసామ్రాజ్యానికి చేసిన సేవ అపారము. గజదొంగ అయిన నేమి అని కదా లోకైకసుందరి అన్నాంబిక అతన్ని ప్రేమించింది.
ప్రేమకు కారణం వ్యక్తంగా కనబడదు. ఎందుకు ఎవరి ముందు ఎవరికి ప్రేమ కలుగతుందో ఎవరు చెప్పగలరు. యుద్దకాలమునందే మానవహృదయం లో ప్రేమ పరవళ్ళెత్తుతుంది. యుద్దాల నుంచి వచ్చిన వీరుడు ప్రియురాలి వక్షఃస్థలంపై తలవాల్చి ఆమె హృదయగతులు దివ్యగీతము ఆలాపించగా, ఆ జోలకు నిదురపోగోరుతాడు. ఒక ప్రాణిని ఇంకొకప్రాణి నాశనం చేసే సమయంలో అతడు రాక్షసుడే అవుతాడు.
అలా రాక్షసుడేన మానవుని తిరిగి మానవునిగా చేయగలిగిన ప్రేమ. ప్రేమ ఎంత దివ్యమైనది! స్త్రీయే రాక్షసి అయినప్పుడు పురుషునికన్న వేయిరెట్లు ఎక్కువగా ప్రేమను వాంచిస్తుంది. ఆమెను దివ్యురాలిగా చేసే తల్లి ప్రేమకు పురుష ప్రేమయే ప్రాంగణము.
ఆ ప్రాంగణంలో తానువలచిన అతిలోకసుందరాకారుడు కర్కశురాలై, రాక్షసియై, మానవప్రాణాదనియైన తనను, మనుషులను గుర్తించలేని చూపులతో వచ్చే తనను, ప్రపంచానికంతకు తానే సామ్రాజ్ఞిని అని వచ్చే తనను తననుండి రక్షించడానికి గాఢంగా హృదయానికి అదుముకుని తనలో ప్రళయతాండవం చేసే రాక్షసత్వాన్ని ప్రేమామృతంతో నాశనం చేయగలడా మహానుభావుడు!
చాళుక్యవీరభద్రుని చూచిన క్షణమే అతడు తన జీవితానికి జన్మజన్మలకు ఈశ్వరుడెట్లా అయినాడు? ఏమి విచిత్రమైనదీ ప్రేమ! ఎంత తీయని బాధతో బ్రతుకు
సర్వము నిండిపోతుంది! ఆత్మ ఒక్కటే అగుగాక. ప్రత్యేకాత్మత్వము పొందిన ఒక్కొక్క వ్యక్తి ప్రపంచానుభూతులను ఒక్కొక్క విధంగా పొందగలుగును. అన్నాంబిక గన్నారెడ్డికై పొందిన ప్రేమ పరమార్దము, చాళుక్య వీరభద్రునికై తాను పొందిన ప్రేమ పరమార్దము ఒకటే అయినా వివిధ మూర్తులుగా ఉంటాయి.
వీరభద్రప్రభువునకు ఆపదలేమియు రాకూడదని తన హృదయములో నున్నది. అయినా క్షత్రియ వీరుడు ప్రాణాలకు తెగించి యుద్దము చేయవలసి యున్నది. వీరభద్రడు పరమస్వామిగాను, పరమశివుడుగానూ తనకు కనబడుతాడు ఆయన వీరవిక్రముడై, పురుషోత్తముడు కావాలని తాను కోరుకుంది. యుద్దములో అనవసరపు హానికి లోబడకుండా, ఆయన తమ నగరులోనే ఉండాలని తాను కోరుకుంది.
ఓహో ప్రేమ అత్యద్భుతము! ప్రేమయే ఒక వ్యక్తి! ప్రేమే సర్వ సృష్టికి మూలము.
"చాళుక్యప్రభూ! మీరేమి ఆలోచించుచున్నారు?"
రుద్రదేవి తన నగరులో దేహము వేడెక్కగా, ఏవో మాధుర్యాలు తన్ను పొదుపుకొనగా, వక్షములుప్పొంగగా సిగ్గుపడుతూ తన మంచముపై వాలిపోయినది.
------------------------------------------------------------
మహాదేవరాజు కాకతీయ మహానగరం ముట్టడించిన పదునాలుగవనాటి ఉదయము మొదటి జామునుండి రుద్రదేవి సమస్త సైన్యాలతో కోటవిడిచి మహాదేవరాజు సైన్యాలపై ఉరికినవి. అన్ని గోపురద్వారాలు, దిడ్డిద్వారాలు తెరువబడినవి. కోటగోడల మీదనుండి నిరంతర బాణవర్షము శత్రువులపై కురుపిస్తున్నాడు చాళుక్య వీరభద్రుడు.
ఇన్నాళ్ళనుండి మహాదేవరాజు బలగాలు మట్టిగోడను బద్దలుకొట్టడానికి చేసిన ప్రయత్నములన్నీ ఏనుగుపై కురిసిన వానలా అయినవి. అక్కడక్కడ కొన్ని పెళ్ళలు మాత్రం విరిగిపడ్డాయి. దిడ్డిదారులు, గవనులు చేరడానికి అనేక పర్యాయాలు వేసిన వంతెనలు, అగ్నిబాణాల చేత దహించబడ్డాయి. పడమటి ద్వారాన్ని పట్టుకోవాలని మహాదేవరాజు విశ్వప్రయత్నము చేస్తూనే ఉన్నాడు.
బలగాల రక్షించే రక్షకచ్ఛత్ర ఫలకాలు సంతతధారగా కురియు శిలావర్షము చేత ముక్కలయినవి. పదమూడవ దినాన మహాదేవరాజు సర్వదుర్గచ్ఛేదక యంత్రాలను ఉపయోగించి తూర్పుద్వారముపై దాడి సలిపినాడు. గడకర్రతెప్పలు వందల కొలది గవనుల
కీవల వేయించినాడు. వానిని సంరక్షిస్తూ కోట బురుజుల మీదికి వీరులు రాకుండా రెండునూర్ల చక్రకొట్టాలు వెనుక నిలిపినాడు. ఆ కొట్టాలపై నుండి మహాపరాక్రమంతో వీరులు శిలా ప్రయోగ యంత్రాలు, శతఘ్నులు, మహాబాణాలు ప్రయోగించుచుండిరి.
ఆ చక్రకొట్టాలకు వేలకొలది ఏనుగులు కవచరక్షితులై దుర్గాలవంటి అంబారీలతో నిలచినవి. అందుండి వీరులు నిరంతరం అగ్నిబాణాలు ప్రయోగిస్తున్నారు. చిన్ననావలు వందలకొలది విశాలమైన కందకంలో వేసిరి. ఆ నావలపై వంతెనగా వెదురుదళ్ళు వేసినారు. దడులపై మట్టి వేసినారు. వంతెన సిద్దమైనది. ఈవలావల ఉన్న దిడ్డుల కడను ఈలాంటి వంతెనలను వేయించినారు.
ఆ పదమూడో రోజున అన్ని గోపురాలకడ, దిడ్లకడ ఇరువాగుల వారికి భయంకర యుద్దము జరుగుచునే యున్నది. కరిగిన సీసము, సలసలకాగే నూనె వర్షము కురుస్తూనే వున్నది.
వంతెనమీదనుండి ఏనుగులు, వీరులు వస్తున్నారు. ద్వారచ్ఛేదానికై కుంభస్థలాలకు కట్టిన బ్రహ్మశూలాలతో ఏనుగులు తలుపులను బద్దలు కొడుతున్నాయి. ఏనుగులకు సహాయంగా వీరులు చక్రయంత్రాలపైనున్న పెద్ద యినుప గదలతో తలుపులుబద్దలు కొడుతున్నారు. పై నుండి కురిసే అగ్ని శిలాబాణవర్షాలకు వేలకొలది వీరులు మాడిపోవుచున్నారు.
పైన గోడలమీద, బురుజులమీద వీరుడు తలఎత్తేసరికి చక్ర గొట్టాలనుండి బాణవర్షం కురియుచున్నది. నాటిరాత్రి కూడా తూర్పుద్వారం కడ ఎడతెగని యుద్దం జరుగుచూనే ఉన్నది. తక్కిన ద్వారాలకడకు మహాదేవరాజు అఖండమయిన ఒత్తిడి కలుగజేయుచునే ఉన్నాడు.
పదునాలుగవ దినము ఉదయించినది. పడమట, ఉత్తర, దక్షిణముల గవనులుదిడ్లు ఒక్కసారిగా తెరచి, వేలకొలది బలములతో రుద్రదేవి వచ్చిపడెను. వంతెనలు కూలినవి. ఆ దినమున ఆంధ్రవీరులు నెరపిన పరాక్రమము అప్రతిమానమైనది.
సాయంకాలానికి మహాదేవుని సేనలు నాలుగుభాగాలై కోట ముట్టడి వీడి, రెండు ఫర్లాంగులు వెనుకకు పోయినవి. కోటగోడనుండి యుద్దము చేసిన వీరులందరు వెలుపలికి వచ్చి వేసినారు.
తన అంగరక్షకులతో, చక్రరక్షకులతో, కవచరక్షకులతో రుద్రదేవి మహాశక్తిలా విజృంభించి మహాదేవుని నగర పొలిమేరలవరకూ తరిమి తరిమి కొట్టినది. మహాదేవరాజు తన ప్రజ్ఞతో తన సేనలన్నింటినీ కలుపుకొన ప్రయత్నిస్తూ ఉత్తరాభి ముఖుడై, అతి కష్టంమీద నష్టంలేకుండా దేవగిరి ఎలా చేరడము అన్న తీవ్ర సమస్యను ఎదుర్కొంటూ పారిపోవుచున్నాడు.
నాలుగు రోజులలో హతశేషులైన మూడులక్షల బలగము అయిదు విభాగాలుగా గోదావరి చేరింది. గోదావరి వరదతో గట్లు పొర్లి ప్రవహిస్తున్నది. వెనుకనే రుద్రమదేవి తన అన్ని సైన్యాలను నడుపుకొంటూ మహాదేవుని సైన్యాలను నదీసంగమానికి దిగువభాగంలో తాకింది.
మల్యాలవారి సైన్యాలు ముందు మంజీరనది ఆవలి ఒడ్డున ఉండి మహాదేవుని నది దాటకుండా చేయుడని, గన్నారెడ్డి ఆలోచన చెప్పడం వల్ల ఉభయసైన్యాలు మంజీరకు ఎగువను దాటి ఆవలి ఒడ్డుననే మంజీర గౌతమి సంగముం వరకూవచ్చి నిలబడినవి. గన్నారెడ్డి సంగమానికి ఇంకా దిగువనే రుద్రదేవి సైన్యాలను వదలి గౌతమిని దాటి ఈవలి ఒడ్డుకు మహాదేవరాజును రాకుండా చేయాలని పోయాడు.
కాని మహాదేవరాజు కాస్త ముందుచూపుతో నాలుగు రోజుల క్రిందటనే దేవగిరికి ఆరితేరిన వేగులను పంపించి ఉన్నాడు. ప్రతిష్టానంలో సిద్దముగా నున్న ఏబదివేల నావలు నడుపుకుంటూ దేవగిరి సేనలో సగము వచ్చినవి. ఆ రాత్రి మహాదేవుడుతన సేనలను ఆవలకు దాటించునాడు.
తెల్లవారేసరికి రుద్రమదేవికి మహాదేవుని గౌతమీ తీర శిబిరము నిర్మనుష్యమై దర్శనమిచ్చినది?
దేవగిరి కోటకు, ఎల్లోరా గుహకు మధ్య ఎత్తయిన కొండలు, కొండలపై జనపదాలు ఉన్నవి. దేవగిరి కోటకు ప్రతిష్టానానికి మధ్య చిన్న గిరులు ఉన్నాయి. మహాదేవుడు సైన్యాలతో ప్రతిష్టానం చేరకముందే మల్యాలవారిలో పదిహేను వేల అశ్వికసైన్యం ముందు ప్రతిష్టానానికి ఎగువనే గోదావరి నదిని దాటింది.
గోనగన్నారెడ్డి దేవగిరి దారిలో రెండుకొండల మధ్య సేనలను నిలిపినాడు. మల్యాల సైన్యాలు వచ్చి దేవగిరిని చుట్టుముట్టాయి. మహాదేవరాజు ముందుకు వచ్చినచో గోనగన్నారెడ్డి తన సేనను అర్దచంద్రాకారవ్యూంగా బండరాళ్ళ వెనుక, చెట్లవెనక, పొదలవెనుక నిలిపి, సిద్దంగా ఉండెను.
రెండు గడియల కొక దళము చెప్పున ఎక్కడ ఉన్న వారక్కడే నిలుచున్న ప్రదేశాలలో నిద్రపోయారు. పగలు గడిచింది. రాత్రి గడచినది. ఎక్కడి వారక్కడే అటుకులు భుజించారు. నీరూ త్రాగినారు. ప్రొద్దు ఉదయించిన పిదప మహాదేవరాజు
సేనలలో ముందు వాహినులు, వాలిపోయిన శరీరాలతో, ఎల్లాగో నగరదుర్గం చేరుకుందామని నిర్భయంగా, నిస్సంశయంగా వచ్చారు.
ఇంతలో ఒక్కసారిగా వేయిశంఖాలు ఆకాశం అంటేటట్లు గుండెలు వ్రక్కలయ్యే మహాధ్వనం వినపడెను. చమటలు గ్రమ్మ, కాళ్ళు వణికిపోవ, నిశ్చేష్టములైనవి సేనలు.
“మీరు మీ ఆయుదాలన్నీ క్రిందపడవేసి, ఒకరి వెనుక ఒకరు రండి. ఈ దారిని మీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చును. " అని ప్రకటన వినబడింది.
“అడుగు వెనక్కు వేస్తే ప్రాణాలు దక్కవు" అని రెండవ ప్రకటన.
“ఈ ప్రక్కా, ఆ ప్రక్కా, ముందూ, వెనకా మేమున్నాము!" అని మూడవ ప్రకటన.
"మేము రుద్రమదేవి తరఫున గోనగన్నారెడ్డి సైనికులము. మా ప్రభువే యిక్కడ వున్నాడు స్వయంగా!" అని నాలుగవసారి ఘర్జన.
ఆ కేకలతో కత్తులు, డాలులు, ఛురియలు, శూలాలు, భల్లాలు, ధనుస్సులు, బాణాలు క్రిందకు వదలి, పదివేల మంది వీరులు తలలు వంచుకొని ముందుకు సాగారు. అలా మూడు వాహినులు, ఆయుదాలు విసర్జించి ముందుకు సాగెను. ఈ వార్త నెమ్మదిగా మహాదేవరాజునకు తెలిసినది. తక్కిన రెండు లక్షల పై చిల్లర సైన్యాన్ని ఆపివేసినాడు. ఆ దారి తప్పితే కొంచెం చుట్టు దారి లో దేవగిరి చేరవచ్చును. అటు తరువాత చూసుకోవచ్చని, మహాదేవుడు సైన్యాలను దారి మళ్ళించాడు. ఈ లోగా కోటకు వెళ్ళేదారి ఒకే ద్వారాన్ని అరికట్టి మల్యాల నాయకులు కాపుకాసారు.
మహాదేవరాజు సైన్యాలు దారి మళ్ళాయని తెలియగానే, ఆ దారిలో రెండువేల మంది ఆశ్వికులను నిలిపి గన్నయ్య అతి వేగంగా చుట్టుదారిని చేరే ఎల్లోరా మార్గపు కొండలపైకి పోయినాడు. మహాదేవరాజు ఎల్లోరా గుహలప్రక్కన ఉన్న కొండపాదం దగ్గర కల సెలయేటి కడ తన సైన్యాలను నిలిపినాడు.
-----------------------------------------------------
ఇంకా వుంది...
------------------------------------------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Kommentare