top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 25


'Kakathi Rudrama Episode 25' New Telugu Web Series



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

మహాదేవరాజు పరాజయం చెందబోతున్నట్లు శివదేవయ్య కి చెబుతుంది రుద్రమదేవి.

మహాదేవరాజు దేవగిరి పారిపోవాలని తలుస్తాడు.

గన్నారెడ్డి అతడిని నిలువరించే ప్రయత్నం చేస్తాడు.


ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 చదవండి..

ఎల్లోరా గ్రామము ప్రక్క తన సైన్యాలను నిలిపి మహాదేవరాజు ఈ గజదొంగను హతమార్చే సమయం ఇదేనని తన ఏబదివేల ఆశ్వికబలమును, మిగిలిన వెయ్యి ఏనుగులను గరుడవ్యూహం రచించి గన్నారెడ్డి పై దాడి చేసినాడు. అక్కడ గన్నారెడ్డి బలగంలో ఒక్కడు కూడా లేడు. గన్నారెడ్డి ఆ కొండదారిలో ఇంకను వెనుకకు పోయి ఉన్నాడు. మహాదేవుడు ఆ వ్యూహం చెదిరిపోకుండా ముందుకు రాలేడు.

ఇంతలో రాత్రి అయినది. మహాదేవుడు తన సేనల నన్నింటినీ ఆపి, చారుల వార్తల కొరకు నిరీక్షించు చుండగ, అతని వేగులనాయకుడు వచ్చి మహాప్రభూ! రుద్రమ్మ తన సేనలతో కోట ముట్టడి చేసి సగం బలగాలను మనవేపు గన్నారెడ్డికి సహాయంగా పంపుతున్నది" అని వార్త తెచ్చినాడు.

మహాదేవరాజు నిరుత్తరుడైనాడు. తన సేనల నాశనం తప్పదనుకున్నాడు. తాను కోటలోనికి వెళ్ళుటకు వీలు లేదు. కోటలో వారు తనకు సహాయం చేయడానికి వీలులేదు. భోజనసామగ్రి అయిపోయినది. లక్షలకొలది క్షతగాత్రులైన బలగాలతో ఈ రాక్షసి కాకతి మూకలతో పోరాడుట ఎట్లు?

కవులమాటలన్నీ తెగడ్తలే. తనకు భయపడి ఓరుగల్లు సింహాసనంపై ఆడుదాన్నిఎక్కించారుట. ఆడదాన్ని తానేమి చేయలేనని, చేయనని వారికి ధైర్యమట! అలాంటి వాడు తాను మహావీరున్నని వెళ్ళినాడే. అబ్బ రాజ్యతృష్ణ! రుద్రమ్మ ఆడదా? బ్రహ్మరాక్షసి! మహామారి! కాళరాత్రి!

చీల్చిచెండాడి వెంట తరుముకు వచ్చిన కాకతిదేవతే

రుద్రమ్మ! ఏమి యుద్దం! ఏమి పరాక్రమం! ఎంత నిర్వహణశక్తి! ఎంత వ్యూహరచనా చమత్కృతి! తన బలగాలు నాశనం కాకూడదు. చాలు: ఇక తనకు బుద్ది వచ్చింది.

కందిరీగలతుట్ట. కాకతీయులకు కోపం తెప్పించకు తండ్రీ! అని తండ్రి చెబుతే తాను విన్నాడా! వినక, తెచ్చుకున్నదీ విపరీతమయిన పరాభవం. తాను రుద్రమ్మకు ఎదురుపడక తన సైన్యాలతో ఏ కొండలకో వెళ్ళిపోతే తనంటే ప్రజలకు గౌరవమూ, భక్తి పూర్తిగా నశించిపోవును. మరిరెండు మూడు దినాల ప్రయత్నించుదమనుకుంటే, ఇంకా కొన్నివేలమంది నాశనమగుదురు.

మహాదేవునకు మతి పోవుచున్నది. గౌరవం పోయినది. నలుగురిలో తల ఎత్తుకొనలేడు. అందుకు తగినట్లు తాను రుద్రమదేవికి లొంగిపోతే తనను ఏ విధముగా గౌరవించును? ఏ విధముగా చూచును? ఆమె తనను ఎలాంటి అగౌరవాలకు లోను చేస్తుందో?

అయినా కార్యసాధకులకు, రణతంత్రనీతిలో ఇవన్నీ మామూలే. కావున, తనకు నమ్మకమయిన మంత్రివర్యులు భవానీభట్టును, రుద్రమ సర్వసైన్యాద్యక్షుడు చాళుక్యవీరభద్రు ని కడకు పంపినాడు.

ఆ భట్టుగారితో కలిసి చాళుక్యవీరభద్రులు రుద్రదేవ చక్రవర్తిణి దర్శనం చేయించారు. భవానీభట్టు మహాదేవరాజు తరఫున ప్రతినిధిగా రుద్రమకు నమస్సులు తెలియజేసి,

"చక్రవర్తిణీ! మా మహారాజు మహాదేవుడు తను చేసిన తప్పుకు విచారిస్తున్నాడు. దుష్టచింతన తో కన్నుమిన్నుగానక కాకతీయమహాసామ్రజ్యము అతి సులభంగా వశమై పోతుందనే దురాశతో, పెద్ద ఎత్తుగా జైత్రయాత్రకు తరలివచ్చారు. తమ పాదాల మీద వ్రాలి క్షమాభిక్ష వేడి, తగిన పరిహారము చెల్లించగలనని కోరుతున్నారు"అని మనవి చేసినారు.

రుద్ర: భట్టుగారూ! పాములను, దుష్టజంతువులను, రాక్షసులను క్షమించి లాభం లేదు. ఎప్పటికప్పుడు నాశనం చేయవలసిందే! అయినా తోటి దేశపాలకుడు, మా తండ్రిగారికి మిత్రుడయిన కృష్ణభూపతి కుమారులు- అందుకని మీ రాజును మేముప్రాణంతో విడిచిపెడుతున్నాము.

భవానీ: చక్రవర్తిణీ! మేమందరమూ సదా మీకు ఎంతో కృతజ్ఞులము.

రుద్ర: సరేనయ్యా మంత్రివర్యా! మాకు కోపం లేదు. క్షత్రియులకూ, బ్రాహ్మణులకూ కోపం నాశనహేతువు. మేము వైద్యులము. మీ రాజుకు కలిగిన రాజ్యకాంక్ష తృష్ణ రోగాన్ని మేము నివారణ చేస్తాము. మీ రాజు మాకు కోటి వరహాలు, మా సేనలో అసువులు బాసిన వారి కుటుంబాల పోషణకై కోటిన్నర వరహాలు అపరాదం చెల్లించాలి. గోదావరీ మంజీర సంగమం వరకు ఉత్తరపుగట్టు శౌణరాజ్యపు సరిహద్దు. అక్కడ నుండి మా శాసనం ఉన్న విజయస్తంభాల గురుతున్న తెలుగుగ్రామాలన్నీ మా వశమవుతాయి. మా రాజ్యంలో భాగాలవుతాయి.

భవానీ: చిత్తం, చక్రవర్తిణీ!

భవానీభట్టు వెళ్ళి సంధి నియమాలు వివరించగనే, ఇంతటితో బయటపడినామని కాలిచెప్పులు విడిచి కిరీటం చేతులలో పట్టుకొని, రుద్రమ్మ పాదాలచెంత ఉంచి

"అష్టమ చక్రవర్తిణీ.. క్షంతవ్యుడను"అని పలికెను.

ఇదివరకే సంధినియమాల ననుసరించి దేవగిరికోట నుండి కోశాధికారులు మూడుకోట్లు సువర్ణ నాణాలూ, రత్నాలు బంగారు పళ్ళెరాలతో కొనివచ్చి రుద్రమపాదాల చెంత ఉంచినారు. చక్రవర్తిణి ఆజ్ఞమేరకు మహాదేవుని సింహాసనమున కూర్చుండ

బెట్టి యాతని తలపై కిరీటము నలంకరించినారు.

ఎల్లరునూ జయజయ ధ్వానాలు చేసిరి. సైనికులు, దళపతులు, ముఖ్యసేనాపతులు, ప్రజలు, మంత్రులు, సభికులు జయజయధ్వానాలు చేసినారు.

-------------------------------------------------------------------

ఓరుగల్లుకోట - ప్రభువుల సమక్షంలో - శివదేవయ్యామాత్యుల ఆధ్వర్యంలో సేనాధిపతులకే, సైనికులతో, రాజప్రముఖులతో, సామాన్యప్రజానీకంతో కిటకిటలాడుచున్నది. అన్నిరంగాల ప్రముఖులు ఆసీనులైయున్నారు.

శివదేవయ్యమంత్రి చిరునవ్వుతో ఉన్నతాసనముపై వసించియున్నాడు. ఎడమ ప్రక్కన గన్నారెడ్డి, కుడివైపున చాళుక్యవీరభద్రులు కూర్చుని వున్నారు.

అక్కడ ముఖ్యులందరూ తమతమ స్థానాల్లో అధివసించి యున్నారు.

రుద్రమదేవి కన్నులయొదట కూర్చున్నవారు, లకుమయారెడ్డి, అతని కుమారుడు వరదారెడ్డి,

ప్రసాదిత్యనాయకుడు లేచి- "శివదేవయ్యామాత్యులు మనకెల్లరకూ పరమపూజ్యులు.... వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము"

కరతాళధ్వనులు విజయోత్సహముతో మ్రోగినవి.

శివదేవయ్యామాత్యులు లేచి సభకు నమస్కరించి -ఆ తరువాత గంభీర స్వరముతో

"కాకతి ప్రభువుల క్షాత్రము నేడు మీసములు దువ్వుచున్న వీరులకు తెలిసి వచ్చినది. తలలు వంచుతున్నారు. పాదములపై కిరీటములు పెట్టినారు. ఇంక మన వీర కిశోరముల బలపరాక్రమములు లోకానికి తెలిసినవి. వారి మాతృభూమి పై కన్నెత్తి చూసినవాడు, ఎంతటి ఘనుడయినా వాడిని పట్టి తన్ననిదే వూరుకొనరు. వారి మాతృభక్తి, మాతృభూమి పైగల భక్తి అనుపమానము. వారందరికీ మా కృతజ్ఞతలు.

సభలో మళ్ళీ కలకలము. విజయధ్వానాలూ- హర్షాతిరేకములు. -మరల సభలో నిశ్శబ్ధము.

"ఇప్పుడు మీరు మహావీరుని, మహాపురుషుని మీదుమిక్కిలి మీకందరికీ సుపరిచితమైన మహాగజదొంగ.....” అంటూ ఉండగనే

జనంలో కదనోత్సాహము, ప్రళయగర్జనలలాగా విజయ

భేరీలు. గన్నారెడ్డి లేచి నిలబడి, చిరునవ్వుతో చక్రవర్తిణికి సభకు నమస్కరించెను.

శివదేవయ్యామాత్యులు బంగారుపళ్ళెరములోని రత్నాలహారమును వీరవరేణ్యులు గన్నారెడ్డి ప్రభువు కంఠసీమను అలంకరించినారు. మరల సభలో తప్పెట్లమ్రోతతో, ఓరుగల్లుకోట దద్ధరిల్లినది. జయజయధ్వానలు మారుమ్రోగినవి.

"అతని జన్మ సార్థకము. ఇంతటి ప్రభుభక్తిపరాయణుడు మన వెంట ఉండుట -మనలో జన్మించుట, కాకతీదేవి వరాలపంట, కాకతీయమహాసామ్రజ్యము చేసుకున్న అదృష్టము. కాకతీ సామ్రజ్యము పై కన్నేసివుంచిన వారందరినీ లొంగదీసినాడు- రుద్రమదేవిచక్రవర్తిణి ని ఆడది ఆడది అని గేలిచేసిన కుట్రదారులనందరినీ చరిత్రగర్భములోనికి, వామనుడై -అంతై-ఇంతై కాలితో అణగదొక్కినాడు.

అయితే గన్నారెడ్డి చక్రవర్తిణి అనుమతితోనే, గజదొంగగా ప్రవర్తించినాడనీ- యిది అంతా రాజకీయ రణతంత్రములోని భాగమని మీ రెల్లరూగమనించగలరు.

మరల సభలో హర్షధ్వానాలు.

"ఇప్పుడు సభలో మీకు ఇద్దరిని పరిచయం చేస్తాను. -మొదటి వారు లకుమయారెడ్డిప్రభువులు, గన్నారెడ్డి చిన్నాయన గారు. అన్న కుమారునికి రాజ్యమునీయక అపహరించి, కాకతీయప్రభువులకు సామంతులుగా ఉంటూ, చాపకిందనీరు వలె కుట్రలు చేసినారు....

"ఆడుదాని రాజ్యము క్రింద బ్రతికెడి క్షాత్రవ రక్తం రాజులెవ్వరూ"అని తెరవెనుకనుండి నాటకమును రక్తికట్టించినారు. సామంతరాజులను రెచ్చగొట్టిరి.

అందువలననే గన్నారెడ్డి వీరిని బంధించి చక్రవర్తిణికి అప్పగించినారు. వీరిని ఎట్లు శిక్షింపవలెను. ప్రజలే తీర్పు చెప్పాలి.

జనాగ్రహము పెల్లుబికినది. "శిరచ్ఛేదనము"యనియు "ఉరిశిక్ష"యనియు కేకలువినబడినవి. లకుమయారెడ్డి దించిన తల ఎత్తలేదు.

శివదేవయ్య ఒక్క క్షణం ఆగి--

"మీకు యింతకన్నా మరొక భయంకరమైన విషపునాగు వంటి వారిని పరిచయము చేసెదను".

తొలినుంచి అనగా గణపతిదేవులు, అస్వస్థులుగా వున్నప్పటినుంచి కోటలోని రహస్యములు శత్రువులకు తెలియుచున్నవి. మేము ఎన్ని సార్లు ప్రయత్నించిననూ, కుశాగ్రబుద్ది కల మన వేగులు సైతము ఈ కుట్రదారులని కనిపెట్టలేకపోయారు.

"మేము మాలో ఒకరిగా భావించి వయస్సులోపెద్దవాడైన జన్నిగదేవులకు అపారమైన గౌరవమిచ్చుచున్నాము. వారు కృతఘ్నులై, స్వార్థపరులై, తిన్నయింటివాసాలు

లెక్కబెట్టుచూ, కుట్రధారులై- కాకతీయసామ్రాజ్యమును శత్రువులకు ధారబోయు నీచత్వమునకు పాల్పడినారు.

మాతృభూమిని, మాతృదేవతను పరాయివారికి అమ్ముకొనుటకు సిద్దపడినారు. వీరు చేసిన కుట్రలు మిక్కిలిగా నున్నవి. వీరిని ఏమనవలెను" అనెను.

అందరూ ముక్త కంఠముతో రాళ్ళతో కొట్టిచంపండి" యంటూ కేకలు వేసిరి.

"ఔను అదే శిక్ష" అన్నారు.

"నిజమే. అందరూ నిశ్శబ్ధముగా ఉండండి. కానీ వారిరువురూ చేసిన తప్పులు ఒప్పుకొన్నారు. పశ్చాతాపంతో కుమిలిపోతూ చక్రవర్తిణి రుద్రమదేవి వారిని క్షమాభిక్ష అడిగారు. కానీ మీరందరూ ఒక్క విషయం గ్రహించవలెను. మనవేగు లెవ్వరూ ఎంత

సునిశిత బుద్ధి కలవారైతేనేమి, ఈ కుట్రలకు మూలకారకులను కనుగొనలేకపోయినారు. ఈ నిజమును కనుగొని మనలను అప్రమత్తము చేసిన వారు శ్రీగోన గన్నారెడ్డి ప్రభువులే. ఏమని వర్ణింపవలెను.’

జనసందోహపు కరతాళధ్వనులు.

ఇంతలో రుద్రమదేవి చక్రవర్తిణి కలగజేసుకొని,

"గన్నారెడ్డిప్రభూ! కొన్నిసార్లు తెలిసో తెలియకో మేము మిమ్ములను శంకించినాము. ఈ సభాముఖమున మీరు మమ్ములను క్షమించవలెను. తప్పు చేసినది చక్రవర్తిణి

అయినా, మామూలు మనిషి అయినా నేరము అంగీకరించుటలో ఔన్నత్యమూ, ధర్మమూ కలవని మేము నమ్ముచున్నాము"

గన్నారెడ్డి లేచి “చక్రవర్తిణీ! మీ ప్రేమ అనుపమానము, నాలాంటి వీరులందరూ రాజభక్తి, దేశభక్తి కలవారున్నారు. ఎవరినయినా శిక్షించే ముందు పూర్వపరాలు వీక్షించి శిక్షించవలసిందిగా ఈ సభాముఖంగా ప్రార్థన".

ఈ మాటలకు ప్రజలు హర్షాతిరేకములు వెలిబుచ్చిరి.

---------------------------------------

ఓరుగల్లు నగరమున -

ఎటు చూసినా తోరణములే.. పందిళ్ళే... పచ్చని మామిడితోరణములే.. రంగురంగు పూలే... పాతబడిన అరటి చెట్లే.

జనం. క్రిక్కిరిసిన జనం.

పాటలూ, ఆటలూ, కోలాటములూ, విచిత్రవేషధారణలు ఒక్కటేమిటీ-కర్రసాములూ, కత్తిసాములూ, ఖడ్ఘచాలనములు, ఇంత ఆనందము.... అంతకు ముందెన్నడూ ఎవ్వరూ చూడలేదు. ఇక చూడగలరన్న భావము లేదు.

సామంతులు, రాజప్రముఖులు విచ్ఛేసినారు.

మహాదేవరాజు కోట్లకొలది ధనమును కప్పముగా, బహుమతిగా పంపియున్నాడు. అపార ధన, కనకాదులతో కోశాగారములు నిండిపోయినవి.

చిన్నవూరంత మేళగాళ్ళ వాద్యములతో, మోతలతో, వళ్ళు పూనకం వస్తుందా అన్నంత హర్షాతిరేకంతో, కవి, పండిత, గాయక మ్రోల-

కోట ఒక ఆనంద సముద్రమై ఆనందసాగరమై- ఛకచ్ఛకితమై వున్నవేళ ' నవమచక్రవర్తి - రుద్రమదేవి పట్టాభిషేకము'--

లక్షల లక్షల మంది కన్నులపండువుగా చూస్తున్నవేళ, శివదేవయ్యామాత్యుల కళ్ళు ఆనందబాష్పాలతో తడిసి చెమ్మగిల్లినాయి.

"జయము.... జయము... కాకతీ సామ్రాజ్యరూఢ రుద్రమదేవి చక్రవర్తిణికి

జయము.... జయము...

జయము.... జయము........ జయము..

--------------------------

చేసిన తప్పులకు సిగ్గుపడి జణిగదేవులు శేషజీవితమును శివారాధనలో గడపవలెనని నిశ్చయించుకున్నారు. వారు తపస్సునకు అనవు ప్రదేశము శ్రీశైలమునకు పోయినారు.

లకుమయారెడ్డి చేసిన నేరాలకు సిగ్గుపడి- తన రాజ్యమును వారసుడగు గన్నారెడ్డికి ఇచ్చివేసి తనకొడుకు వరదారెడ్డిని కూడా గన్నారెడ్డి కే తనసొంత సోదరునిగా చూసుకొనమని అప్పగించెను.

శ్రీశైలములో మల్లికార్జునస్వామి అర్చనలో మిగిలిన జీవితాన్ని నిర్మలంగా గడిపి సార్ధకం చేసుకొనవలెనని లకుమయారెడ్డి వెళ్ళిపోయినాడు. --

-----------------------------------------------------

ఇంకా వుంది...


------------------------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


75 views0 comments
bottom of page