top of page

మద్యం కోసమొక కదనం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Madyam Kosamoka Kadanam' New Telugu Story Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

మందుబాబుల గురించి ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణిగారు రచించిన హాస్య కథ ఇది.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

నేను గోపాల్రావు వాళ్ళింటి చావిడిలోకి ప్రవేశించేటప్పటికి అక్కడ గోపాల్రావు మాత్రమే కాక- మరొక ముగ్గురు సహోద్యోగులు అనుకోని రీతిన తారసపడ్డారు. గంగరాజు, చలపతి దగ్గర దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం మాత్రం కాస్తంత ఎడంగా ఒదికి కూర్చున్నాడు; చావడి చుట్టూ వ్రేలాడ దీసిన వివిధ దేవతల పటాలను భవ్యంగా పరీకిస్తూ. -

నాకు తెలిసినంత మేర అతడెప్పుడూ అంతే! నలుగురు మధ్య కూర్చున్నా మూడవ మనిషిలా చిప్పలో ముడుచుకున్న తాబేలులా ఒదిగుంటాడు. తనకు తాను చుట్టూరా గిరిగీసుకుని ఉంటాడు. అలా ఎడంగా ఉండటం సంభాషణా ప్రవాహం నుండి వైతొలగి ఉండటం అతడికి అదో విధమైన మెంటల్ రిలీఫ్.

అప్పుడప్పుడే చావడిలోకి ప్రవేశించిన గోపాల్రావు నారాకను గమనించి— మిక్కిలి పొంగిన మనసుతో- “రావోయ్ వినాయకం! చాలా రోజులకి ఇటువేపు వచ్చినట్టున్నావు! ఆఫీసులో కూడా నల్లపూస వయి పోతున్నట్టున్నావు-- “అంటూ లోపలి లోగిలి వేపు తిరిగి నా ఉనికి గుర్తు చేస్తూ మరొక కప్పు కాఫీ అదనంగా తీసుకు రమ్మనమని పెనుకేకతో పురమాయించాడు ఇంటావిణ్ణి.


అవన్నీపట్టనట్టు కూర్చుంటూ అన్నాను- “అదేఁవిటి గోపాలా! రమ్జుగా కళకళలాడాల్సిన నీ యింటి చావడి గంభీరమైన వార్ రూమ్ వాతావరణంతో ఊగిసలాడు తున్నట్లుందే! ఇంతకీ వాటీజ్ ది మేటర్?”


అతడు నవ్వి కులాసాగా కనిపించడానికి ప్రయత్నిస్తూ- “అబ్బే! నువ్వనుకున్నంత సీను లేదుగాని, ఇప్పటి మన సెక్రటరీ దామోదరం రాబోయే స్టాఫ్ యూనియన్ ఎలక్ష న్ లో రెండవసారి గనుక నిల్చుంటే తేరు కోలేడేమోనని చెప్పుకుంటున్నారు. ఇది నేను చెప్పానని బయటెక్కడా అనబోకు. అసలే మన ఆఫీసు గోడలకు ఇంతింత దోరచెవులు” అన్నాడు.


నేను నవ్వి అడిగాను- “గోడచెవుల మాట మనకెందుకు గాని, దామోదరం ఓడిపోతాడని నీకెలా తెలుసు?”


నవ్వటానికి ప్రయత్నిస్తూ బదులిచ్చాడు- “ కచ్చితంగా చెప్పడం కాదు గాని, మొదట్నించీ మన గ్రూపుకి ఒక ఆనవాయితీ ఉండనే ఉందిగా, ప్రీపోల్ వంటి ప్రజాభిప్రాయ సేకరణ. కొత్త స్టాప్- మనబోటి పాత స్టాప్- లేడీ సిబ్బంది- అందరివద్దా సూచాయగా మాటలో మాటగా సర్వేచేసి కనుక్కున్నాం”

“అలాగే అనుకుందాం. గెలుపోటములు వెలుగు నీడల్లా వెన్నంటివస్తూనే ఉంటాయి కదా! ఐనా దామోదరం ఓడిపోతే మీకొచ్చిన నష్టమే మిటంట?”

అతడాగి బదులిచ్చాడు- “అతడైతే మనసు విప్పి మాట్లాడతాడు. నోరార నవ్వుతూ పలకరిస్తాడు. ముఖ్యంగా జాలీ టైప్ కదూ! ”


అప్పుడు చటుక్కున సుబ్రహ్మణం జోడించాడు- “అంతేనా- మందితో కలగలసి మందేసుకుని చిందులే స్తాడు. మందుబాబుల టీముని పెంచుతాడు“

నేనప్పుడు అదేమీ గమనించనట్టు అరక్షణం ఊరకుండిపోయి వెంటనే స్పందించాను- “ఇప్పటికదంతా చోడో యార్! ఇప్పుడు మనమంతా జాలీగా ఉండవలసిన తరుణమని మీరెందుకు గుర్తించరంటా! ”


అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు—వెర్రి వెంగళప్పల్లా-- ”మీకింకా న్యూస్ తెలియదన్నమాట! మనకనుకూలంగా పే- రివిజన్ కమిటీ రిపోర్టు వచ్చేసిందోచ్! దాదాపు మన డిమాండ్లన్నీ నెరవేరినట్లే ఫిట్మెంటుతో సహా-- నెల రోజుల్లో మనకందరకూ జీత భత్యాలు బకాయిలతో బాటు చేతికందేసినట్టే! కాబట్టి మనం రిజాయ్స్ చేసుకుందాం! ”


ఎలా అన్నట్టు చూసారు అదే వెర్రిముఖాలతో. అప్పుడు మళ్ళీ అందుకున్నాను- ”గ్రాండ్ పార్టీ గురించి తరవాత ఆలోచిద్దాం. మొదట- జోక్స్ తో ఆరంభింద్దాం ఎంచక్కా కాఫీలు తాగుతూ-- ఇక్కడ మెర్క్యురీ ద్రావకంలా వ్యాపించి ఉన్న స్తబ్దత్వాన్ని దూరంగా పారద్రోలుదాం. సరేనా?“


గోపాల్రావు అంగీకరిస్తూనే మెలిక పెట్టాడు- “ఒక్కొక్కరూ ఒక్కొక్క జోక్ చెప్పాలన్నావే—మనం చేసుకునే పెద్దపార్టీకి ముందస్తుగా-- అది బాగుంది. కాని ఒక షరతుపైన- సుబ్రహ్మణ్యానికి మాత్రం ఎటువంటి జోకూ చెప్పే అవకాశం ఇవ్వకుండా- “

నివ్వెరపోయాను. ఎట్టకేలకు కళ్లు మిటకరించి అన్నాను- “ఎవరు చెప్తేనేం—జోక్ చెప్పడంలోగాని వినడంలో గాని ప్రమాదమేముందోయ్! విన్న జోక్ కి నవ్వడం నవ్వకపోవడం వాళ్ల వాళ్ల వంతవుతుంది గాని-- ”


“మేటర్ అది కాదు. మనం చెప్పడంలో ప్రమాదం ఉండకుపోవచ్చు గాని- ఈ సుబ్రహ్మణ్యం గాని చెప్పాడనుకో ప్రమాదం ముంచుకు రాపాడి వస్తుంది. ఇతగాడికి భావ వ్యక్తీకరణకీ- దాడి సల్పడానికీ మధ్య ఉన్న వ్యత్యాసమే తెలియదు. ఎడాపెడా—చెడామడా ఎటాక్ చేస్తాడు. అక్కడా- అక్కడా- అలా- అలా గుండ్రాయిలా తిరుగుతూ మనవద్దకు వచ్చేస్తాడు. ఎటాక్ చేస్తాడు. ఎదుటి వారి ఉ త్సాహాన్ని ఆవిరి చేసి మనిషిని నిలువునా నీరుగార్చేలా చేసి గాని వదలడు. ఇది గ్యారంటీ!


”నేను అయోమయంగా తిరిగి చూసే లోపల సుబ్రహ్మణ్యం నోరు విప్పాడు- “గోపాలా! నువ్వింకా హ్యాంగోవర్ లో ఉండి నోరు జారుతున్నావేమో! కమ విత్ ట్రూత్! ”

గోపాల్రావ్ లేచి నిల్చున్నాడు- “ఇంకెక్కడి ట్రూత్?నేను అనుకున్నట్టే ట్రూత్ నీ నోట ఇప్పుడు వచ్చేసిందిగా! ”


ఆ మాటలకు నేను మరింతగా అయోమయంలో పడ్డాను- అదేమి ట్రూతో అర్థం చేసుకోలేక. ”అయ్యో వెర్రి బాగుల వినాయకమా! కోతితోక ఇం కా పట్టుకోలేదా?నన్ను హ్యాంగోవర్ లో ఇంకా ఉన్నావా- అని అడగలేదూ! అంటే- ఇక్కడున్న వాళ్ళ మందరమూ చిందులు వేసే మందు బాబులమని- మాకందరకూ ముక్కు వంకరని-- మాటను వంకరగా తిప్పి చెప్పడం లేదూ? ఇక ఇతగాడు గాని జోక్ చెప్పనారంభిస్తే- అదెలా ఉంటుందో ఇక చెప్పాలా! ఉన్న మూడ్ గోవిందా! ”


నేనిక ఊరుకోలేక పోయాను. ”ఏమిటిదింతా సుబ్రహ్మ ణ్యా! ఆఫీసులో నువ్వు మీదు మిక్కిలి నిదాన పరుడివన్న పేరుంది. మరి-- ఎదుటివారి పర్సనల్ విషయాల పట్ల అంతటి విముఖత చూపించడం దేనికీ! ఆ మాటకు వస్తే—తాగుతున్న వారందరినీ వ్యసనపరులన లేముగా! నేను మొన్న ట్రైనింగ్ కోర్సుకోసం ఢిల్లీ వెళ్లాను. హైస్కూలు కుర్రాళ్లు పానీయంలా బీరు పుచ్చుకోవడం చూసాను. దానికేమంటావు?ఈ రోజుల్లో దానినంత సీరియస్ గా తీసుకుంటే యెలా?సాహచర్యం దెబ్బతినదూ! మొన్న మొన్న యేం జరిగిందో గమనించలేదూ?”


సుబ్రహ్మణ్యం అదేమిటన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు.

”టీవీలో ఊరంతా చూసిందేగా—లాక్ డౌన్ సడలించిన తరవాత బెల్ట్ షాపు తెరిచిన తరవాత వీధులంతా ఒకేసారి కోలాహలంగా తయారవలేదూ! ఒతను పెద్ద సైజు సారాయి బాటిల్ నెత్తిన పెట్టుకుని సంతోషంతో యెలా చిందులు వేసాడో మనం చూసాంగా! వాళ్ళ సంతోషాన్ని నువ్వు పంచుకోనవసరం లేదు. వాళ్ళ ఆనందానికి కారణం గుర్తించాలిగా! ”

అప్పుడు సుబ్రహ్మణ్యం స్పందించాడు- “నువ్వు చెప్పడం పూర్తి చేసావుగా! ఇక నేను చెప్తాను విను. తాగుడుని డిస్ లైక్ చేసేది, ఒకానొకప్పుడు. ఇప్పుడలా కాదు. రాను రాను తాగేవారిని చూసినా అంతే అసహనానికి లోనవుతున్నాను. వాళ్ళ వల్ల ఎన్నో ప్రమాదాలు అపార్థాలు- అనర్థాలూను. అందుకే- బంధువులెవరైనా- సహోద్యోగులైనా- మందు పుచ్చుకునేవారు హ్యాంగోవర్ లో ఉంటూ ఇంటి వాకిట వరకూ రాకూడదని బాహాటంగా ఢంకా భజాయించాను”


ఆమాటతో నాకు ఖంగుతిన్నంత పన యింది. నేను సహితం అప్పుడప్పుడు నలుగురితో నారాయణా అన్నట్టు మందు పుచ్చుకోవడం కద్దు. కాని- మందునీ మందు బాబుల్నీఇంతగా చీదరించుకునే వ్యక్తిని,నేనిప్పుడే చూస్తున్నానేమో! ఓరి నాయనో! ఇటువంటి వాడితో పెద్ద తంటాయే-- ఇక విషయానికి వస్తే సూటిగా చెప్పవలసొస్తే మందు పుచ్చుకోవడమన్నది ఈ రోజుల్లో జాతి కుల మతాలకతీతమైన సామాజిక పరమైన గెట్ టు గేదర్ ప్రక్రియ అన్నది సుబ్రహ్మణ్యానికి తెలియనిదా! నాలో ఉన్నపళాన అలజడి పెల్లుబికింది. ”అంటే- మీరు సోమపానం గురించి ప్రచారం చేస్తూన్న ప్రతికూల అంశాలన్నీ నా చెవిన పడ్డది నిజమేనన్న మాట”


ఇది విని అతడు చల్లబడ లేదు. “అదంతా తరవాతి విషయం. నువ్వు లేవదీసిన మొదటి పాయింటుకి పూర్తిగా బదులివ్వనే లేదు. నన్నది పూర్తి చేయనియ్యి. నెత్తిన పెద్ద బాటిల్ ఒకటి పెట్టుకుని ఒక మందు బాటు గెంతులు వేస్తూ చిందులు వేసాడన్నావే—ఆ తరవాత యేమయిం దో తెలుసా!

ఏమీ కాలేదన్నాను.


“ ఏమీ కాలేదనకు. అయింది. ఆడుతూ పాడుతూ వెళ్తూన్న ఆ మనిషికి యేమయిందంటే— కొద్ది దూరం వంకర టింకర డ్యాన్స్ చేస్తూ వెళ్ళి తనకు తాను తడబడి ప్రక్కనున్న నల్లా కాలువలో బోర్లా పడ్డాడు. ముక్కు విర గ్గొట్టుకున్నాడు. నెత్తి పైన పెట్టుకుని ఊరేగిన బాటి ల్ విరిగి ముక్కలయింది. ఇది బొమ్మతో సహా దినపత్రికలో పడింది. అది నేను కట్ చేసుకుని ఉంచుకున్నాను. చూడాలంటే మా యింటికి రా చూపిస్తాను”


నేనేమి అనలేదు. ఇప్పటి స్పీడీ ప్రపంచంలో యిటువంటి ఛాదస్తపు మనుషులతో యెలా వేగేది? తాగుడికి అలవాటు పడ్డవాడి మెదడు—క్రమక్రమంగా పాడయి- పుచ్చి పోయి—చివరకు మతి చెడి నడిరోడ్డున తిరిగి తిరిగి బ్రతుకు చాలిస్తాడని చెప్తుంటాడట- ఈ పాత కాలపు మేధావి. ఇటువంటి వాడితో యేం చెప్తే యేం ప్రయోజనం? తూగుతున్న వాళ్ళందరూ తాగుబోతులు కారని వాళ్ళను యెత్తీ యెత్తిన వెంటనే వ్యసన పరులనకూడదంటే ఇతగాడు ఒప్పుకుంటాడా! ససేమిరా ఒప్పుకోడు. విరుచుకు పడతాడు. ఇక వాతావరణంలోని టెంపోని తగ్గించి మాట మార్చడమే మంచిదనుకుంటూ పెదవి విప్పేలోపల అతడు చటుక్కున లేచాడు. ”ఇక బాత్ కతమ్. నేనిక కదుల్తాను”అంటూ లేవబోయాడు సుబ్రహ్మణ్యం.


నేను ఊరుకోలేదు. ”ఇప్పుడిప్పుడేగా మిత్రుల మధ్య ఒప్పందం కుదిరింది దానిని ఉల్లంఘించి వెళ్ళిపోతానంటే యెలా?. దాని ప్రకారం నువ్వు నీవంతు జోకొటి చెప్పే తీరాలి! ”


నా మాట విన్నంతనే చలపతి తుళ్లిపడుతూ లేచి వచ్చాడు- “నువ్వు మరీనయ్యా వినాయకం! రోడ్డున పోయేదానిని అందుకుని ముక్కుకి రుద్దుకున్నట్లుంది నీవాలకం. వాడు దేని గురించి జోక్ చెప్తాడు— మళ్లీ అదే తంతు- తాగేవారిని కక్షతో యెడాపెడా ఎటాక్ చేస్తాడు. మాతో బాటు నువ్వూ చిన్నబుచ్చుకుని ముఖం వ్రేలాడ దీసుకుని ఇంటికి వెళ్లాలి. ఇది మనకు అవసరమా! ”


నేనూరుకోలేదు. సుబ్రహ్మణ్యా న్ని ఉద్దేశించి అన్నాను- “ఈ ఒక్కసారీ ఘాటుగా కాకుండా చాలా మైల్డ్ గా చెప్పాలోయ్ సుబ్రహ్మణ్యా! ఆహ్లాదకరంగా ఉండాలి—సుమధురమైన అందమైన ఆడదాని శ్వాసలా ఉండాలి. నౌ- యువర్ టైమ్ స్టార్ట్స్! ”


“ఒప్పందం అన్నావు కాబట్టి—దానిని మిత్రులందరూ పాటించాలన్నావు కాబట్టి- నాకు తెలిసిన జోక్ ఒకటి చెప్తాను. నా మిత్రుడి మేనమామ ఒకాయన ఉన్నాడు. ఆయనపైన తరచుగా పిర్యాదులు- మాటి మాటికీ కంట్రోలు తప్పిపోతున్నాడని. పనికి యెగనామం పెట్టేస్తున్నాడని-- దీని వల్ల అత్తా మామయ్యల మధ్య తరచూ గొడవలు. అందుకని అత్తయ్య పోరు పడలేక కొత్త రక పు సైకిలొకటి ఇంటివాకిట పెట్టాడు వాళ్ల మేనల్లుడు.

’మామయ్యా! ఇకనుంచి నువ్వు బైకు గాని- స్కూటీ గాని ఉపయోగించ కూడదు. ఎందుకంటే- మీరు పట్టు తప్పిపోతు న్నారు. దానికి కారణం మీకు బాగానే తెలుసు. కాబట్టి- ఇకపైన సైకిలే నీకు శరణ్యం. కొత్తరకపు సైకిల్ కొనుంచాను- నీకు ప్రమాదాలు వాటిల్లకుండా-- ”

“అర్థమైందిరా అబ్బాయ్! అంతా మీ అత్తయ్య నిర్వాకంలా ఉంది. దాని పసుపుతాడు గురించి అది ఆలోచించడంలో తప్పుందనలేం కదా! ”అంటూ బైటికెళ్లి మళ్లీ వచ్చేసాడు మేనమామ- యెంత జోరుగా పెడల్ తొక్కినా సైకిల్ రవంత కూడా కదలడం లేదంటూ--

అప్పుడు మేనల్లుడు తేరుకుంటూ అన్నాడు—“నేను చెప్పింది నువ్వు పూర్తిగా వినలేదనుకుంటాను మామయ్యా. ! ఇది అత్యాధునికమైన బైస్కిల్. దానిపైన కూర్చునే ముందు హ్యాండిల్ ప్రక్కనున్న గుండ్రటి గోళంలోకి ముమ్మార్లు ఊపిరి జోరుగా ఊదాలి. అప్పుడే అది కదుల్తుంది”


మేనమామ అదోలా చూసి కనుబొమలెగరేస్తూ“ఇంతేనా! ఇది ముందే చెప్పొచ్చు కదరా! ” అంటూ చకచకా నడచి వెళ్లి అదే వేగంతో మరునిమిషమే తిరిగొచ్చాడతను. ”ఇదెక్కడి మాయదారి సైకిల్ రా బాబూ! మూడు సార్లు ఊదిన తరవాత కూడా అది కదలనంటూ మొరాయిస్తుంది! ”

“గోళంలోకి బలంగానే ఊదావా మామయ్యా! ”

“నిజంగా బలంగానే ఊదానురా బాబూ దమ్ములాగి! ”

“ఐతే—నువ్వీరోజు ఫ్యాక్టరీకి సెలవు పెట్టాల్సిందే మామయ్యా! “

తెల్లబోయి చూసాడు వాళ్ళ మామయ్య.


“ఎందుకంటే—మత్తు పూర్తిగా దిగని వారు- హ్యాంగోవర్లో ఇంకా తేలుతున్నావారు సైకిల్ పైన కూర్చుంటే అది ససేమిరా కదలదంటే కదలదు. నువ్వు ఆ జల్లెడు పరికరంలోకి ఊదావుగా- నీకు మత్తింకా వదల్లేదని పసికట్టేసింది ఈ స్పైయింగ్ సైకిల్?“ అంటూ చెప్పడం ముగించి మా వేపు తిరిగి”ఎలాగుంది? బాగుంది కదూ నాజోక్! “అంటూ సుబ్రహ్మణ్యం వాకిట దాటి రోడ్డుపైకి వెళ్లిపోయాడు.


అంతలో ఎవరో స్త్రీ గొంతు పకా పకా నవ్వినట్లనిపించి పక్కకు తిరిగి చూసాను. దళసరి ప్లేటులో కాఫీ కప్పులు పెట్టుకు ని- బ్యాలెన్స్ తప్పిపోకుండా అవస్థపడుతూ పడీ పడీ నవ్వుతూంది గోపాల్రావు సతీమణి. మందుబాబుల తాట తీయడంలో ఆడాళ్ళకు ఎందుకంత ఆనందమో మరి!


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


27 views0 comments

Comments


bottom of page