top of page
Original.png

నేను మనిషిని సార్!


ఒకవైపు ఆసుపత్రి బెడ్‌పై జానకమ్మ, ఆందోళనగా ఉన్న రాఘవయ్య; మరోవైపు సాయి మాధవ్ సహాయం చేస్తున్న దృశ్యం. మధ్యలో గతాన్ని సూచించేలా యువకుడైన సాయి మాధవ్‌కు రాఘవయ్య ₹500 ఇస్తున్న చిన్న ఫ్లాష్‌బ్యాక్.

Nenu Manishini Sir - Telugu Inspirational Story | M R V Sathyanarayana Murthy

నేను మనిషిని సార్! - తెలుగు భావోద్వేగ జీవిత కథ | M R V సత్యనారాయణ మూర్తి | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com on 16/08/2026


మనిషి జీవితంలో కొన్ని పరిచయాలు క్షణకాలమే ఉంటాయి. కానీ ఆ క్షణంలో చేసిన ఒక చిన్న సహాయం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. రాఘవయ్య చేసిన ఒక చిన్న సహాయం పదేళ్ల తర్వాత అతని భార్య ప్రాణాలను కాపాడేంత పెద్దదిగా మారుతుంది. రక్త సంబంధాల కంటే మానవత్వం గొప్పదని గుర్తుచేసే ఈ హృదయస్పర్శి కథే “నేను మనిషిని సార్!”



“రాఘవయ్యా, జానకికి ఎలా ఉంది?” అని అడిగాడు కేశవ.


“గుండెకి ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు సిద్ధం చేసుకుని రండి అని పెద్ద డాక్టర్ చెప్పారు” అన్నాడు రాఘవయ్య.


ఆ మాట విని దీర్ఘంగా నిట్టూర్చాడు కేశవ.


“అది సరే, ఈ విషయం నీ తమ్ముడు శేఖర్ కి చెప్పావా? జానకి కన్నతల్లిలా వాడిని పెంచి పెద్ద చేసింది. నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని వాడిని చదివించావు. ఇప్పుడు వాడు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు కూడా. వాడు నీకు సాయం చేస్తాడు. బెంగ పెట్టుకోకు” అని భుజం మీద చేయి వేసి అనునయించాడు కేశవ.


అతని మాటలకి చిన్నగా నవ్వాడు రాఘవయ్య.

“మనం ఒకరి మీద ఆధారపడకూడదు కేశవ. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జానకికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పిన విషయం చెప్పాను. వాడికి ఆఫీసులో పని ఎక్కువగా ఉందిట. వారం వరకూ ఖాళీ ఉండదు అని చెప్పాడు” అన్నాడు రాఘవయ్య.


ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు కేశవ. మనుషులు ఇంత స్వార్థంగా ఆలోచిస్తారా? తల్లిలాంటి వదిన గారికి ఆపరేషన్ అంటే తనని డబ్బులు అడుగుతారని, ఆఫీసులో పని ఉందని చెప్పి శేఖర్ మొహం చాటేసాడని అర్థం చేసుకున్నాడు కేశవ. తన స్నేహితుడికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు.


“చూడు రాఘవయ్యా, డబ్బు గురించి ఆలోచించకు. ఆ సంగతి నేను చూసుకుంటాను. జానకిని జాగ్రత్తగా చూసుకో. నేను ఎల్లుండి కనిపిస్తాను” అని మిత్రుడికి ధైర్యం చెప్పి వెళ్ళాడు కేశవ.


ఇంటికి వెళ్లి భార్యతో అన్నాడు ‘రాఘవయ్య భార్య జానకికి గుండె ఆపరేషన్ చేయాలంట, వాడి తమ్ముడు శేఖర్ కి రావడానికి వీలు కాదట’ అని.


ఆ మాట విని వెంకటలక్ష్మి ‘ఏమిటో మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి’ అని నిట్టూర్చింది.


కేశవ రాత్రి పొద్దుపోయే వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తెల్లవారగానే బ్యాంకుకి వెళ్లి పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. వెంటనే రాఘవయ్యని కలిసి “రేపు టౌన్ కి వెళ్దాం, జానకికి ఆపరేషన్ చేయిద్దాం. డబ్బు నేను సర్దుబాటు చేస్తాను. రెడీగా ఉండు” అని చెప్పాడు.


మిత్రుడి మాటలు వినగానే రాఘవయ్య కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. కేశవ రెండు చేతులు పట్టుకుని “నీ సహాయం మరువలేను...” అంటూ ఏదో చెప్పబోతుంటే, “అవన్నీ తర్వాత.. ముందు జానకి రిపోర్టులు, మీ ఇద్దరి రేషన్ కార్డులు ఒక సంచీలో పెట్టుకో. నేను ఉదయమే వస్తాను” అని వడి వడిగా వెళ్ళిపోయాడు కేశవ.


***********

మర్నాడు ఉదయమే కేశవ, రాఘవయ్య ఇంటికి వచ్చాడు ఆటో మీద. రాఘవయ్య, జానకమ్మ, కేశవ ముగ్గురూ ఆటో ఎక్కి టౌన్ లోని పెద్ద ఆసుపత్రికి వెళ్ళారు. అంతకు ముందు జానకమ్మని చూసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. ఆయన మరలా ఆమెని పరీక్ష చేసి, “అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. రూమ్ తీసుకుని ఉండండి. రేపు కానీ, ఎల్లుండి కానీ ఆపరేషన్ చేద్దాం. రిసెప్షన్ లో వివరాలు చెబుతారు. వెళ్ళండి” అని ఒక కాగితం మీద వివరాలు రాసి ఇచ్చారు.


డాక్టర్ గది నుండి బయటకు వచ్చాక, రాఘవయ్యని, జానకమ్మని వరండాలోని కుర్చీలలో కూర్చోబెట్టి, రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు కేశవ.


డాక్టర్ గారు ఇచ్చిన కాగితం చూపించాడు. రాఘవయ్య, జానకమ్మ రేషన్ కార్డులు చూపించాడు వారికి. అవన్నీ చూసి, “మీ కార్డు మీద ఆపరేషన్ చేసినా, సుమారు యాభై వేల వరకూ మీరు కట్టాలి. ముందుగా మీరు ముప్పై వేలు కడితే, మీకు రూమ్ ఇస్తారు. తర్వాత డాక్టర్ గారు వచ్చి చూసి మిగతా వివరాలు చెబుతారు” అన్నాడు రిసెప్షన్ లోని అతను.


కేశవ తెచ్చినవి నలభై వేలు. ఎలా? అని ఆలోచిస్తున్నాడు.


రాఘవయ్య, జానకమ్మల ముందు నుండి వెళ్తున్న ఒక యువకుడు రాఘవయ్యని పరీక్షగా చూసి, వెనక్కి వచ్చి “ఏమిటి సార్? ఇక్కడ కూర్చున్నారు” అని అడిగాడు.


“నా భార్యకి గుండె ఆపరేషన్ చేయాలి. నా మిత్రుడు అక్కడ డబ్బు కట్టడానికి వెళ్ళాడు” అని రిసెప్షన్ వైపు చూపించాడు.


ఆ యువకుడు గబగబా అక్కడికి వెళ్లి, “గిరీ ఏమిటి విషయం?” అని అడిగాడు.


కేశవ ఇచ్చిన కాగితాలు, డాక్టర్ రాసి ఇచ్చిన కాగితం చూపించాడు గిరి. “యాభై వేలు అవుతాయని చెప్పాను” అన్నాడు గిరి.


కాగితాలు అన్నీ చూసి, “ముందు రూమ్ అలాట్ చేయండి. డాక్టర్ రఘుతో నేను మాట్లాడతాను. మనీ విషయం అంతా నేను చూసుకుంటాను” అన్నాడు ఆ యువకుడు.


‘అలాగే సార్’ అని నర్సుని పిలిచి రూమ్ లోకి వాళ్ళను తీసుకు వెళ్ళమని చెప్పాడు గిరి.


కేశవ ఆశ్చర్యంగా ఆ యువకుడి కేసి చూశాడు. అయిదు నిముషాలలో ముగ్గురూ రూమ్ లోకి వెళ్ళారు. కొద్దిసేపటికి ఆ యువకుడు రూమ్ లోకి వచ్చాడు.


“రాఘవయ్య గారూ, రేపు సాయంత్రం జానకమ్మ గారికి ఆపరేషన్ చేస్తానని డాక్టర్ గారు చెప్పారు. మీరు కంగారు పడకండి. ఆయన చాలా సీనియర్ సర్జన్. రేపు ఉదయం కలుస్తాను” అని నమస్కరించి వెళ్ళిపోయాడు.


ముగ్గురూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు.


‘అతను ఎవరు?” అడిగాడు రాఘవయ్య, కేశవని.


“ఏమో నాకు తెలీదు. హాస్పిటల్ వాళ్ళు ముప్పై వేలు అడ్వాన్సు కట్టమన్నారు. నేను కడదామనుకునే సరికి ఇతను వచ్చి వాళ్ళతో ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. నా దగ్గర రూపాయి కట్టించుకోలేదు. రూమ్ ఇచ్చారు” అన్నాడు కేశవ. ముగ్గురూ ఆలోచనలో పడ్డారు.


మర్నాడు సాయంత్రం జానకమ్మకి ఆపరేషన్ చేశారు. ఇబ్బందులు ఏమీ కలగలేదు. ఆమెని ఆపరేషన్ థియేటర్ నుండి ఐసియు కి మార్చేవరకూ ఆ యువకుడు రాఘవయ్య పక్కనే ఉన్నాడు, అతనికి ధైర్యం చెబుతూ. వారం రోజులు గడిచాయి. జానకమ్మని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఆ యువకుడు టాక్సీ లో జానకమ్మని, రాఘవయ్యని, కేశవని వాళ్ళ ఊరు తీసుకువచ్చాడు.


అప్పుడు రాఘవయ్య అడిగాడు ఆ యువకుడిని, “నువ్వు ఎవరు బాబూ, మాకు ఇంత సాయం చేశావు? నీ ఋణం ఎలా తీర్చుకోగలం?”. దానికి ఆ యువకుడు చిన్నగా నవ్వాడు.


“నా పేరు సాయి మాధవ్. పది సంవత్సరాల క్రితం విజయవాడ బస్సు స్టాండ్ లో పర్సు పోగొట్టుకున్నాను. మర్నాడే హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది. ఎంతో మందిని సాయం చేయమని అడిగాను. నన్ను అనుమానంగా చూశారే కానీ ఎవరూ నాకు సాయం చేయలేదు. మీరు ఒక్కరే నా బాధ అర్థం చేసుకున్నారు. ఐదు వందల రూపాయలు ఇచ్చారు. ‘కంగారు పడకు, నీకు అంతా మంచి జరుగుతుంది’ అని నన్ను ఓదార్చారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి” అన్నాడు సాయి మాధవ్.


రాఘవయ్యకి లీలగా గుర్తుకు వచ్చింది. జానకమ్మ కాలికి వెండి పట్టాలు కొని, ఆమెని ఆశ్చర్యపరచాలని విజయవాడ వెళ్ళాడు. కానీ బస్సు స్టాండ్ లో కనిపించిన యువకుడి జాలి గాథ విని కరిగిపోయి ఆ డబ్బులు అతనికి ఇచ్చేసి, కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ యువకుడు ఇప్పుడు కనిపించాడు.


“ఆ నువ్వా బాబూ, ఆరోజు ఏదో ఉద్యోగం కోసం వెళ్తున్నానని అన్నావు. ఆ ఉద్యోగం వచ్చిందా?” అని అడిగాడు రాఘవయ్య.


“ఆ వచ్చింది రాఘవయ్య గారూ. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి ప్రస్తుతం ఇక్కడికి వచ్చాను. ఈ హాస్పిటల్ కి పి.ఆర్.ఓ. గా పనిచేస్తున్నాను. ఆరోజు హడావిడిలో మీ పేరు కూడా అడగలేదు. బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాను. అప్పటినుండి మీ కోసం ఎదురుచూస్తున్నాను, మీకు కృతజ్ఞతలు చెప్పాలని. ఆ దేవుడు నా మొర ఆలకించి మిమ్మల్ని నాకు చూపించాడు. ఈ ఉద్యోగం వలననే నేను నా చెల్లెలి పెళ్లి చేయగలిగాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇదంతా మీ వలననే జరిగింది” అని రెండు చేతులూ జోడించి రాఘవయ్యకి నమస్కరించాడు సాయి మాధవ్.


“నువ్వు నిజంగా దేవుడివి బాబూ. రక్త సంబంధీకులే ఒకరి నొకరు పట్టించుకోని ఈ రోజుల్లో. ఎప్పుడో చేసిన సాయం గుర్తుంచుకుని, మా చేత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వకుండా, మా జానకమ్మకి ఆపరేషన్ చేయించి ఎంతో ఆదరంగా మమ్మల్ని ఇంటి దగ్గర దింపావు” అన్నాడు కేశవ.


“అంత పెద్ద మాటలు వద్దండి. నేను మనిషిని సార్. కృతజ్ఞతలు తెలపడం నా విధి. అంతే” అన్నాడు వినయంగా సాయి మాధవ్.


రాఘవయ్య, జానకమ్మ, కేశవ ముగ్గురూ సాయి మాధవ్ ని ‘చల్లగా ఉండు నాయనా’ అని దీవించారు.


సమాప్తం.

*******

M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):








M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



telugu emotional story,  wife husband story telugu,  old age home story


Recent Posts

See All
నాన్న కోరిక

భర్త చివరి కోరికను నెరవేర్చేందుకు రంగి పడిన కష్టాలు, కొడుకు శేఖర్‌ను ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దిన తల్లి త్యాగం ఈ కథలో హృదయాన్ని హత్తుకునేలా కనిపిస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం, విద్య విలువను

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page