కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Rangun Rangamma Meda' written by M R V Sathyanarayana Murthy
రచన : M R V సత్యనారాయణ మూర్తి
ప్రపంచ వింతల్లో ఒకటి కాదుగానీ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది రంగమ్మ మేడ.
ఆ మేడ వెనుక ఉండే కథను, ఆ మేడకు ఎదురుగా ఉన్న అదేలాంటి మరో మేడ కథను చక్కగా మలిచి మీ ముందుకు ఉంచారు ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు .
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
పెనుగొండలో నగరేశ్వర స్వామి గుడి నుంచి లింగాలవీధికి వెళ్ళే వాళ్ళు అందరూ
ఆసక్తిగా, కుతాహలంగా చూసే దృశ్యం ఒకటి ఉంది. అదేనండి బాబూ, ‘రంగూన్ రంగమ్మ మేడ’.
అంటే అదేమైనా ప్రపంచ వింతల్లో ఒకటా? అని మీరు అడగవచ్చు. తప్పులేదు. మీలాంటి పెద్దోళ్ళు అడగాలి, మా లాంటి ‘బుడ్డోళ్ళు’ వినయ విదేయలతో చెప్పాలి. అది గోదారోళ్ళ ప్రధమ కర్తవ్యం. అదిగో మీరు మళ్ళా నావైపు అదోరకంగా సూత్తన్నారు. ‘బుడ్డోళ్ళు’ అంటే చిన్నాళ్ళని, మీ కళ్ళముందు పుట్టిపెరిగిన వాళ్ళమని మీకు మనవి చేసుకుంటూ తెలుగు సినిమా డైలాగ్ ల మాదిరి ‘రెండో’ అర్ధంలోకి వెళ్ళవద్దని కోరతన్నా.
రంగమ్మ మేడమీద ఉంటుంది. కింది రెండు వాటాలు మాస్టర్లకి అద్దెకి ఇచ్చింది. సాయంత్రం మేడ మీదనుంచి వచ్చే సువాసనలు పీలుస్తూ ‘అది రంగూన్ సబ్బు వాసన’
అని ఒకడు అంటే, ‘అరే వల్లకుండే హే, అది బట్టలకు రాసుకునే రంగూన్ అత్తరెహే’ అని
ఇంకొకడు వాదించుకోవడం మనకి కనిపిత్తాది. పైన మేడమీద ఉన్న వరండాకి ఉన్న నున్నటి సిమెంట్ స్తంభాలు, వాటికి ఉన్న ఆర్చీలు, ఆర్చీల మీద అందంగా చెక్కిన రంగు రంగుల పువ్వుల, లతల డిజైన్లు, వాటి మధ్యలో అమర్చిన పింగాణీ పూలకుండీలు, అబ్బో శానా శానా అందంగా ఉంటాయి. సాయంత్రం ఎండ వరండాలోకి రాకుండా వేలాడ దీసిన రంగూన్ కర్టెన్లు, మేడ ముందు ముప్ఫై అడుగుల ఎత్తున పెరిగిన పోక చెట్లు, గాలికి సుతారంగా కదిలే వాటి ఆకులు సూడాలంటే, పెతీవోడూ పక్కోడి రెండు కళ్ళూ అరువు తెచ్చుకోవాలని చెట్లపల్లి శివయ్య గారి అబ్బాయి కడియం పంతులు ఢంకా భజాయించి మరీ చెప్తాడు.
మేడమీద వరండా మధ్యనుంచి వచ్చిన అర్ధ చంద్రాకారం ఆర్చీ చాలా అందంగా
ఉంటుంది. చంద్రలేఖ సినిమాలో రాజకుమారి మేడమీద ఆర్చీ లా, అటూ ఇటూ చెక్కిన
లతలూ,పువ్వులూ మధ్యలో రెండు హంసలూ, అబ్బో ఆ అందం చూడాలంటే మెడ నెప్పి పెట్టినా అలా చూస్తూనే ఉండిపోతారు. ఎప్పుడైనా సాయంత్రం వేళా రంగమ్మ,ఆర్చీ మధ్యలో చిన్న పేము కుర్చీలో కూర్చుని,నగరేశ్వర స్వామి గుడి గోపురం మీద కబుర్లాడుకుంటున్న రామచిలకల కేసి చూస్తూ గతంలోకి జారుకుంటూ ఉంటుంది. మనవరాలు రంగనాయకి వచ్చి ‘అమ్మమ్మా’ అని పిలిచేవరకూ అలా ఉండిపోతుంది. గుడి నుంచి ఇంటికి వెళ్తున్న వంతెన వీధి వెంకటరెడ్డి ఆ దృశ్యం చూసి రెప్పవేయకుండా అలానే ఉండిపోయాడు. సినిమా యాక్టర్ కాంచనమాల ‘ఇలాగే ఉంటుందేమో’ అని పరవశించిపోయాడు.
ఇంత అందంగా ఉన్న రంగమ్మ మేడ మీదకి ఎవరైనా వెళ్ళాలంటే ఉత్తరం గదిలో ఉన్న చెక్క మెట్లు ఎక్కి వెళ్ళాలి. బహుశా డెబ్భై ఏండ్ల క్రితం అంత టెక్నాలజీ లేదేమో మెట్ల నిర్మాణంలో.
రంగమ్మ మేడలో ఉన్న వస్తువులు గురించి పెనుగొండలో జనం చాలా కథలు చెబుతారు. రంగు రంగుల పింగాణి కప్పులు,గిన్నెలు,ప్లేట్లు అద్దాల బీరువాలలో ఒక పధ్ధతి ప్రకారం సర్ది ఉంటాయి. ముఖ్యంగా ‘డ్రెస్సింగ్ మిర్రర్లు’ కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టు ఉంటాయి. అద్దాల చుట్టూ అందంగా చేసిన చెక్క ఫ్రేములు అద్భుతంగా ఉంటాయి. బెడ్ రూముల్లో ఉన్నమంచాలు, నల్లవిరుగుడు చేవతో, రక రకాల డిజైన్ల తో మనసుని కట్టి పడేస్తాయి. కుర్రకారుని బాగా ఆకర్షించే బొమ్మ ఒకటి ఉంది. ఒక పెద్ద గాజు సీసాలో ‘చేయీ చేయీ పట్టుకుని డాన్స్ చేస్తున్న అబ్బాయి,అమ్మాయి బొమ్మ’ ఉంది.
సీసా మూత పైన ఉన్న ఊచని రెండు వేళ్ళతో తిప్పగానే సీసాలో ఉన్న ఆ బొమ్మ చక
చకా కదులుతుంది. రంగు రంగుల బట్టలు వేసుకున్న ఆ బొమ్మలు కదులుతూ ఉంటె
చాలా గమ్మత్తుగా ఉంటుంది.
రంగమ్మ రంగూన్ వెళ్ళడానికి ముందే ముగ్గురు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసేసింది.
రంగూన్ నుంచి వచ్చాకా పెద్ద కూతురు కొడుకు నరసింహం ని, కూతురు రంగనాయకిని తన దగ్గరే ఉంచుకుని పెంచుతోంది.మనవరాలు రంగనాయకి అంటే రంగమ్మకి వల్లమాలిన ప్రేమ.
లింగాలవీది పోలిశెట్టి నాయుడు కబుర్లు చెప్పడంలో దిట్ట. ఎప్పుడూ వైట్ అండ్
వైట్ బట్టలే వేసుకుంటాడు. వైట్ ఫాంట్ మీద వైట్ ఫుల్ హ్యాండ్ షర్టు ఉంటుంది. కానీ
షర్టు ఎప్పుడూ మోచేతుల పైకి మడిచేసి పెట్టుకుంటాడు నాయుడు. ఆ చొక్కా మడతల్లోనే డబ్బులు దాచుకుంటాడు.
సాయంత్రం ఐదు గంటలకు లింగాలవీదిలోని దొరయ్య గారి రామాలయం
అరుగుమీదకు రాగానే అతని చుట్టూ కుర్రాళ్ళు చేరతారు అతని ‘చెన్నపట్నం కబుర్లు’
వినడానికి. అందులో సగం కబుర్లు ‘గాలి కబుర్లే’నని వాళ్లకు తెలుసు. అయినా వాళ్లకు
అదో సరదా. నాయుడు రెండు సార్లు చెన్నపట్నం వెళ్ళాడు.ఎందుకో ఎవరికీ తెలియదు.
కానీ అక్కడి సినిమా కబుర్లు అరుగుమీది శ్రోతలకు భలే పసందుగా చెబుతాడు.నాయుడు
నాగేశ్వరరావు అభిమాని. అందుకే ఎప్పుడూ నాగేశ్వర రావు షూటింగ్ విశేషాలే చెబుతాడు.
“నాయుడు గారూ, మీరు ఇన్నిసార్లు నాగేశ్వర రావు గారి షూటింగ్ లకు ఎలా వెళ్తారండి?”
ఆశ్చర్యంగా అడిగాడు నాగిరెడ్డి.
“దెందులూరు లో రామన్న చౌదరి నా ఫ్రెండ్. నాగేశ్వర రావు అత్తారి ఊరి దెందులూరేగా. అలా రికమండేషన్ కొట్టించామన్న మాట. అంతే ఫినిష్” చార్మినార్ సిగరెట్ పొగ రింగు రింగులుగా వదులుతూ అన్నాడు నాయుడు.
“ఒకసారి ఏమయిందో తెలుసా?” కుర్రకారు కేసి తిరిగి అన్నాడు నాయుడు. ఆ
ఏమయ్యింది? అన్నట్టు కళ్ళు పెద్దవిచేసి అతని కేసి చూసారు కుర్రాళ్ళు అందరూ.
“భార్యాభర్తలు సినిమా షూటింగ్ జరుగుతోంది.కృష్ణకుమారి హీరోయిన్. ఎందుకో
ఆరోజు ఆవిడ చాలా డల్ గా ఉంది. వెంటనే నేను నాగేశ్వర రావు దగ్గరకు వెళ్లి ఆయన
చెవిలో ఓ మాట చెప్పాను. ఆయన వెంటనే డైరెక్టర్ ని పిలిచి చెప్పాడు. వెంటనే సీన్
మారిపోయింది. ‘ఏమని పాడుదునో ఈ వేళా , మానసవీణ మౌనముగా నిదురించిన వేళా’ పాట షూటింగ్ పెట్టేసారు. కృష్ణకుమారి ఆ విషాద సన్నివేశాన్ని అద్భుతంగా రక్తి కట్టించింది.
షూటింగ్ అయిపోయాక నాగేశ్వరరావు , ‘నాయుడూ,మంచి సలహా ఇచ్చావయ్యా’ అని నన్ను అభినందించారు” విలాసంగా నవ్వుతూ అన్నాడు నాయుడు. కుర్రకారు దిమ్మ తిరిగిపోయి అతనికేసి చేష్టలుడిగి చూసారు.
‘ఇది గాలి కబురే’అని గట్టిగా నమ్మిన వరహాల రెడ్డి గారి అబ్బాయి కృష్ణ రెడ్డి “నాయుడూ! నీకు చాలా విషయాలు తెలుసుగా. మరెప్పుడూ రంగూన్ రంగమ్మ మేడ గురించి చెప్పవేం? అక్కడ సీసాల్లో రంగు రంగుల బొమ్మలు ఉన్నాయంటగా. నువ్వు
ఎప్పుడైనా చూసావా?”అని అడిగాడు.
కృష్ణారెడ్డి వైపు చూసి చిన్నగా నవ్వాడు నాయుడు. మరో చార్మినార్ సిగరెట్ తీసి
వెలిగించాడు. పొగని రింగు రింగులుగా వదిలాడు.
“రంగమ్మ మేడలో ‘మాట్లాడే బొమ్మ’ ఉంది. మీకెవరికైనా తెలుసా?”బాంబు
పేల్చాడు నాయుడు.
“మాట్లాడే బొమ్మా?”అందరూ ఒకేసారి గట్టిగా అన్నారు. చిద్విలాసంగా నవ్వాడు
నాయుడు.
“అవును మాట్లాడే బొమ్మే. అది నాకు ఫ్రెండ్ కూడా” అన్నాడు నాయుడు.
‘రేపే మన పెద్ద గుడిలో నాగేశ్వర రావు, సావిత్రి సినిమా షూటింగ్ ట’అన్న వార్త
విన్న వాళ్ళలా కళ్ళు పెద్దవి చేసుకుని, నోళ్ళు తెరుచుకుని నాయుడు కేసి
చూస్తూండిపోయారు అందరూ, కృష్ణారెడ్డి తో సహా.
“రంగమ్మ మనవడు నరసింహం నా అభిమాని. నాగేశ్వరరావు షూటింగ్ విషయాలు
మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకుంటాడు. ఒక రోజు వాళ్ళ మేడ మీదకు తీసుకువెళ్ళాడు.
లోపల గదిలో చిన్న పేము కుర్చీలో ఉంది రబ్బరు బొమ్మ. నరసింహం నన్ను ఆ
బొమ్మకు పరిచయం చెయ్యగానే ఆ బొమ్మ నాకు ‘గుడ్ మార్నింగ్’ చెప్పింది. నేనూ గుడ్ మార్నింగ్ చెప్పి నా పేరు నాయుడు అని చెప్పాను. తర్వాత ఇంకోసారి నేను వెళ్ళినప్పుడు ఆ బొమ్మ నన్ను గుర్తు పెట్టుకుని ‘గుడ్ మార్నింగ్ నాయ్డూ’ అంది. నాకు చాలా ఆనందం వేసింది” గర్వంగా చెప్పాడు నాయుడు.
ఆ తర్వాత ఆరోజుకి సభ చాలించి వెళ్ళాడు నాయుడు.
*****
రంగమ్మ మేడ ఊళ్ళో అందరికీ బాగా తెలియడానికి కారణం ఒక ఆయన
ఉన్నారు.ఆయనే ‘బోదకాలు మాస్టారు’. హలో ,ఏమిటి? అప్పుడే మీలో మీరే స్టోరీలు అల్లేసుకుంటున్నారా?
ఎంత అన్యాయమండి? ఆయన మా సెడ్డ ‘గొప్ప మడిసండి’. మీరు అనుకునే ‘రకం’
కాదండి. ఆయన ఊళ్ళో పిల్లకాయలు అందరికీ ‘ప్రైవేటు’ సేబుతారండి.
రంగమ్మ మేడలో కింద వాటాలో ఉంటారు. ఒకటో తరగతి నుండి పదకొండో
తరగతి పిల్లలు అందరికీ ప్రైవేటు సెబుతారు. పెద్ద షావుకార్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు,
సిన్నా ,సితకా ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు అందరికీ పొద్దున్నా, సాయంత్రం చదువు సెబుతారు. మధ్యలో చదువు ఆపేసి, మళ్ళా చదువుకోవాలనే వారిని ‘మెట్రిక్యులేషన్’ పరీక్షకు కూడా కట్టిస్తారు. డబ్బు కాపీనం లేని మనిషి.
తరగతికి ఒకో రూపాయి తీసుకుంటారు. అంటే ఒకటో తరగతి వారికి ఒక్క రూపాయి, ఐదో తరగతి వారికి ఐదు రూపాయలు, పదకొండో తరగతి వారికి పదకొండు రూపాయలు
తీసుకుంటారు. పెనుగొండ మంచి ఊరు, అందరినీ ఆదరించే ఊరు అని తూర్పు గోదావరి జిల్లా అంతా బాగా పేరు రావడంతో పెళ్ళాం,బిడ్డలతో గోదావరి దాటి ఇక్కడకు
వచ్చారు. అప్పటికే ఎలిమెంటరీ స్కూల్ లో, జమీందార్ గారి హై స్కూల్ లో చాలా మంది
పంతుళ్ళు పనిచేస్తూ,గోదావరి దాటి వచ్చి ఇక్కడ సుఖంగా బతుకుతున్నారు .
ఆయన ప్రైవేట్లో ఎప్పుడూ ఏభై మంది తక్కువ పిల్లలు ఉండరు. బోదకాలు మాస్టారు తమ పిల్లలకు చదువు బాగా సేబుతున్నారని ఊళ్ళోని రైతులు తమ పొలాల్లో పండే కూరగాయలు పట్టుకువచ్చి ఇస్తున్నారు. రంగమ్మ మేడలో ఉండే ‘బోదకాలు మాస్టారు’ పిల్లలకు బాగా చదువు బాగా చెబుతారని స్కూళ్ళ ఇన్స్పెక్టర్ కూడా ఆయన్ని మెచ్చుకుంటారు. మాస్టారికి కుడి కాలు ‘బోద’. దానితో ఆయన అసలు పేరు ‘కోదండరామయ్య’ మరుగున పడి పోయి బోదకాలు మాస్టారు బాగా జనం నోళ్ళల్లో
స్థిరపడిపోయింది. పదేళ్ళ నుంచీ అద్దెకుంటున్నా మాస్టారికి అద్దె పెంచలేదు రంగమ్మ.
ఆయన మంచితనమే దానికి నిదర్శనం.
వంతెన అవతల హాస్పిటల్ కట్టి పెనుగొండ జనానికి మంచి వైద్యం చేసే డాక్టర్
సూర్యనారాయణ రాజు గారి అబ్బాయి రామచంద్రం రాజు కూడా ‘బోదకాలు మాస్టారి’
దగ్గర ప్రైవేటు చదువుకున్నాడు .
డాక్టర్ గారి అబ్బాయి కూడా మాస్టారి దగ్గర ప్రైవేటు కి రావడంతో ప్రజలకు మాస్టారి మీద
మరింత ‘గురి’ పెరిగింది. డబ్బపండు లా ఉండే డాక్టర్ గారి అబ్బాయి తో స్నేహం చేసాడు రంగమ్మ మనవడు నరసింహం. ఒక రోజు రామచంద్ర రాజు ని వాళ్ళ మేడమీదకు తీసుకువెళ్ళి గాజు సీసాలో ఉండి డాన్స్ చేసే బొమ్మలు, గోడకు వేలాడదీసిన రెండు కత్తులు ,డాలు, ఇత్తడి ప్లేట్లు తాపడం చేసిన పెద్దవి,చిన్నవి పెట్టెలు,పై కప్పు నుంచి వేలాడుతున్న శాండీలియర్లు ,రంగుల రంగుల ఎలక్ట్రికల్ బల్బులు , రంగూన్ నుంచి వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన పెయింటింగ్స్ చూపించాడు. రాజు వాటిని చూసి చాలా ఆనందించాడు.
రంగమ్మ కూడా డాక్టర్ గారి అబ్బాయిని చూసి చాలా ముచ్చటపడింది.
రామచంద్రం బుగ్గలు పట్టుకుని సాగదీస్తూ ‘బాగా చదువుకో బాబూ, మీ నాన్న గారిలా పెద్ద
డాక్టర్ కావాలి’ అంది మురిపెంగా.
ఆమె పెట్టిన మినపసున్ని తింటూ ‘ఓ. నేను కూడా మా నాన్నలా డాక్టర్ ని అవుతా’
అన్నాడు రామచంద్రం. డాక్టర్ గారి అబ్బాయి వలన రంగమ్మ మేడలో ఉన్న వింత
విషయాలు మరింత ప్రచారం అయ్యాయి. అయితే నాయుడు చెప్పిన ‘మాట్లాడే బొమ్మ’ని రాజు చూడనేలేదు.
****
రంగమ్మ ఎక్కడికి వెళ్ళినా గుర్రబ్బండి మీద వెళ్తుంది.బండి ముందూ,వెనుక తెరలు కట్టి ఉంటాయి. రెండు మూడు నెలలకు పక్కనే ఉన్న పిట్టల వేమవరం వెళ్తుంది. ప్రతి సంవత్సరం తణుకు ఖచ్చితంగా వెళ్తుంది. అప్పుడు మాత్రం మనవల్ని ఎవర్నీ తీసుకు వెళ్ళదు. పెనుగొండలో జరిగే దసరా సంబరాలకు, సంక్రాంతి సంబరాలకు, గుళ్ళల్లో జరిగే పూజలకు ఎప్పుడూ రంగమ్మ వెళ్ళిన దాఖలాలు లేవు.
అందువల్ల ఆమె రూపురేఖలు రంగూన్ వెళ్లి వచ్చాకా ఎలా ఉన్నాయి?అన్నది చాలా
మందికి తెలియదు. ఆమె ఇంటికి వెళ్లి వచ్చిన అతి కొద్దిమందికి మాత్రమే ఆమె ఎలా
ఉన్నదీ తెలుసు.
రంగమ్మ రంగూన్ నుంచి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆమెలో చలాకీతనం
తగ్గి, కొద్దిపాటి విచారం గూడుకట్టుకుని ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నమ్మిన వాళ్ళే ఇంతలా మోసం చేయడం ఆమె జీర్ణించుకోలేక పోతోంది. కారణం ఎదురుగుండా ఉన్న పొట్టిరెడ్డి మేడ.
ఆ మేడ కూడా అచ్చు రంగమ్మ మేడలానే ఉంటుంది. ఆ మేడకి కూడా అవే డిజైన్లు, అవే ఆర్చీలు, అవే చెక్క మెట్లు. చివరికి మేడముందు అవే రెండు ‘పోక చెట్లు’. తేడా అల్లా ఒకటే! రంగమ్మ మేడలో ఉన్న ఖరీదైన వస్తువులు పొట్టిరెడ్డి మేడలో లేవు.
తన దూరపు బంధువు పిట్టలవేమవరం వెంకటరెడ్డి ఉన్నా, పెనుగొండలో తన బాల్య స్నేహితుడు అని ‘పొట్టిరెడ్డి’ని నమ్మి రంగూన్ లో తను ‘కష్టపడి సంపాదించిన’ డబ్బు అంతా పొట్టిరెడ్డి కి పంపింది.
అక్కడ ఉన్న ఇంజనీర్ తో బిల్డింగ్ ప్లాన్ వేసి పెనుగొండ పొట్టిరెడ్డి కి పంపింది. పొట్టిరెడ్డి రంగమ్మ చెప్పినట్టు చక్కని డిజైన్ తో ఆమె కోరిన విధంగా మేడ కట్టించి ఇచ్చాడు. తన కష్టానికి ప్రతిఫలంగా అయితేనేం, తనకూ అలాంటి మేడే ఉండాలన్న ‘సదుద్దేశంతో’ అయితేనేం రంగమ్మ మేడకి ఎదురుగా, ఆమె డబ్బుతోనే తనూ ‘ఓ మేడ వాడయ్యాడు ’ పెంకుటిల్లు పొట్టిరెడ్డి.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
mrvs murthy • 1 hour ago
బాగా చదివారు మనోజ్ గారు. ధన్యవాదాలు సార్