సాంఖ్యయోగ సారం - చివరి భాగం
- Rayala Sreeramachandra Kumar

- Jun 11
- 6 min read
సాంఖ్యయోగ సారం, సాంఖ్యయోగం, భగవద్గీత, భగవద్గీత రెండవ అధ్యాయం, బుద్ధియోగం, స్థితప్రజ్ఞుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, కర్మయోగం, ఆత్మజ్ఞానం, మోక్షం, బ్రాహ్మీ స్థితి, మనస్సు మరియు బుద్ధి, గీతా బోధనలు, ఆధ్యాత్మిక వ్యాసం, హిందూ తత్వశాస్త్రం, కర్మఫల త్యాగం, భగవద్గీత విశ్లేషణ, గీతా సారం, ధ్యానం, ఆత్మతత్త్వం, ఆధ్యాత్మిక జ్ఞానం, Telugu Spiritual Article, Bhagavad Gita Telugu, Sankhya Yoga, Buddhi Yoga, Sthitaprajna, Spiritual Wisdom, Hindu Philosophy
Sankhyayoga Saram - Part 2 - Telugu Article | R C Kumar
సాంఖ్యయోగ సారం - చివరి భాగం - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 11/06/2026
ఇక సాంఖ్యయోగ సారం - చివరి భాగం చదవండి.
భగవద్గీతలోని సాంఖ్యయోగం మనిషి జీవితాన్ని మార్చగల అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది. మొదటి భాగంలో ఆత్మ తత్వాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడి విషాదాన్ని తొలగించే ప్రయత్నం చేయగా, ఈ రెండవ మరియు చివరి భాగంలో బుద్ధియోగం, కర్మఫల త్యాగం, మనస్సు-బుద్ధి సంబంధం, స్థితప్రజ్ఞుడి లక్షణాలు మరియు మోక్ష మార్గం గురించి లోతైన బోధనను అందిస్తారు. మనస్సును నియంత్రించి, కర్తవ్యాన్ని అనాసక్తితో నిర్వర్తిస్తూ, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే స్థితికి ఎలా చేరుకోవాలో ఈ వ్యాసం స్పష్టంగా వివరిస్తుంది. ఆధునిక జీవితంలోని ఒత్తిడులు, కోరికలు, కోపం, మమకారాల మధ్య ఆధ్యాత్మిక సమతుల్యతను పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక మార్గదర్శక దీపంలా నిలుస్తుంది. సాంఖ్యయోగ సారం – రెండవ (చివరి) భాగం ద్వారా గీతా జ్ఞానంలోని అమూల్యమైన సూత్రాలను తెలుసుకొని, అంతరంగ శాంతి మరియు ఆత్మోన్నతికి దారి తీసే దివ్య సందేశాన్ని ఆస్వాదించండి.
మొదటి భాగంలో ఆత్మతత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానాన్ని వివరించిన పిదప, "బుద్ధిర్యోగే త్విమాం శృణు" అంటూ అర్జునుడికి బుద్ధియోగాన్ని విశదీకరించారు కృష్ణ పరమాత్మ. ఈ అవగాహనతో పని చేస్తే అర్జునుడికే కాదు మనకు కూడా కర్మబంధముల నుండి విముక్తి లభిస్తుంది.
అటువంటి నిర్మోహ, నిర్లిప్త, అనాసక్త స్థితికి మనస్సుని తీసుకురావడంలో బుద్ధి యొక్క పాత్ర ఏమిటో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ప్రతిఫలం మీద ఆశ లేకుండా కర్మలను ఆచరించే దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా, స్థిరంగా, నిశ్చలత్వంతో ఉంటుంది. అదే దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ బుద్ధి గురించిన ప్రస్తావన తెచ్చారు కాబట్టి, మనస్సు పాత్ర మరియు బుద్ధి పాత్రల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనస్సు పదేపదే వస్తువుల వైపు, విషయాల వైపు పరుగులు తీస్తుంది కాబట్టి, మమకారాసక్తులు అనేవి మనస్సు యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరక సుఖాలు దేనిపైనైనా మమకారాసక్తులు ఉండవచ్చు. కాబట్టి, ఒక వ్యక్తి లేదా వస్తువుకు సంబంధించిన ఆలోచనలు పదేపదే మనస్సుకు వస్తుంటే, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడింది అన్నదానికి అది సూచన.
"సంగాత్ సంజయతే కామః" - దేనితో అనుబంధం లేదా ఆసక్తి కలుగుతుందో అదే విధమైన కోరిక పుడుతుంది. ఆ విధంగా అనుబంధం, మమకారాసక్తులను ఏర్పరుచుకునేది మనస్సు అయితే, అందులో శ్రీకృష్ణుడు బుద్ధిని ఎందుకు తీసుకువస్తున్నాడు? అనుబంధాన్ని, మమకారాన్ని తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా?
ఇక్కడ మనకు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మన శరీరంలో సూక్ష్మమైన "అంతఃకరణ" అనేది ఒకటి ఉంటుంది, "అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి" అంటాం కదా. అంతఃకరణం అంటే వ్యావహారిక భాషలో దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ అంతఃకరణం ఒక సూక్ష్మ యంత్రం లాంటిది.
ఇందులో "బుద్ధి" అనేది "మనస్సు" కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. మనస్సు కోరికలను సృష్టించి, బుద్ధి నిర్ణయించిన ఆ వస్తువిషయాలతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకు, సంతోషంగా ఉండాలంటే డబ్బే ముఖ్యం అని బుద్ధి గనక నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది.
డబ్బు కాకుండా పేరుప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు పేరుప్రతిష్ఠల కోసం పాకులాడుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి యందు ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు తదనుగుణమైన కోరికలను పెంచుకుంటుంది. అంటే ముఖ్యమైన పాత్ర పోషించేది బుద్ధి. మరి బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉందా? దీనికి ఒక ఉదాహరణ:
మనకు తెలియకుండానే రోజంతా మనం మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా కాళ్లు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. ఏదో నములుతుంటాం, లేదా టీవీ చూస్తుంటాం. కానీ, ఆఫీసులో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఎందుకు? ఆఫీసు క్రమశిక్షణ మన మనస్సుకి నచ్చి కాదు, మనసుని దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే ఆఫీసులో కూడా కావాలంటుంది. కానీ కుదురుతుందా? ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరమని బుద్ధి నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ధి అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం రోజంతా క్రమశిక్షణతో ఆఫీసులో కూర్చుంటాము.
అదే మనసుని దాని ఇష్టానికి వదిలేస్తే, ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని రిలాక్స్ అవ్వడానికి, టెలివిజన్ చూసేందుకు మొగ్గు చూపుతుంది. కానీ, కూటికోసం ఆఫీసులో పని చేయటం అవసరమని "బుద్ధి" నిర్ణయిస్తుంది.
ఆ విధంగా మనస్సు యొక్క సహజ స్వభావాన్ని, బుద్ధి నియంత్రిస్తుంది. బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉందని ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తున్నది. కాబట్టి, మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేసే విధంగా బుద్ధిని ఉపయోగించుకోవాలి.
కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా, అన్ని పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవడమే బుద్ధియోగము. "కర్మణ్యేవాధికారస్తే" అంటూ శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు, మరియు చేయవలసిన కర్మలు మానుకోవడం అనే ఆలోచన రాకూడదు అంటూ అర్జునుడికి హితబోధ చేశారు.
పని చేసేటప్పుడు, తరువాత కూడా కర్తృత్వాన్ని (నేనే చేస్తున్నాను, నేనే చేశాను అన్న అహంకారాన్ని) విడిచిపెట్టాలి. అలాగని కర్మలను మానేసే ఆలోచన రాకూడదు. దీన్ని అర్థం చేసుకొని ఆచరించగలిగితే, మనం కూడా కర్మబంధాల నుండి విముక్తి పొందగలము.
తదుపరి, స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అర్జునుడు అడగడానికి కారణం ఉంది. కొంతమంది దొంగ వేషాలు వేసేవారు పైకి మాత్రం గొప్పగా సమాధి స్థితిలో ఉన్నట్లు నటిస్తుంటారు. కాబట్టి, నిజమైన యోగులను గుర్తించడానికి లోకానికి ఒక మార్గం కావాలి. అదృష్టవశాత్తు, అర్జునుడే దీనికి సంబంధించిన ప్రశ్న అడిగాడు. ఒక వ్యక్తి సరైన ఆధ్యాత్మిక దారిలో ఉన్నాడో లేదో, అతను నిజమైన యోగో లేక మోసగాడో తెలుసుకోవడానికి అర్జునుడు అడిగిన ప్రశ్నకి వివరణాత్మక భాష్యాన్ని చెప్పారు కృష్ణ పరమాత్మ.
ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్న వారు మోహము, భయం, మరియు క్రోధములకు అతీతంగా ఉంటారని విశదీకరించాడు. వారు సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి, వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది.
మనస్సుని వేధించే అన్ని కోర్కెలను త్యజించి, ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే కష్టనష్టాలు, సుఖదుఃఖాలు, అవమానాలు, ప్రశంసలు, అవార్డులు.. ఏవైనా సరే, ఏ మాత్రం చలించకుండా, తన మనస్సును స్థిరంగా భగవంతుడికి అనుసంధానం చేసుకునే జ్ఞానిని "స్థితప్రజ్ఞుడు" అంటారు.
"స్థిత" అంటే స్థిరమైన, "ప్రజ్ఞ" అంటే బుద్ధి. తన బుద్ధిని ఆత్మలో (లేదా దేవుడిలో) స్థితపరిచిన వాడే "స్థితప్రజ్ఞుడు". మిగిలినవారంతా బుద్ధి నిలకడ లేనివారు. వారి మనసు దేవుడి మీద ఉండదు; బయట కనిపించే ప్రపంచం మీద, వస్తువిషయాల ఆకర్షణల మీదే ఉంటుంది. ఎందుకంటే భౌతిక శక్తి అయిన "మాయ" ఆనందం అనే భ్రాంతిని కలుగచేస్తుంది. అది ఒక ఎండమావి లాంటిది. ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవటానికి దాని వెంట పరుగులు పెట్టేవారు స్థితప్రజ్ఞులు కాజాలరు.
నిజమైన స్థితప్రజ్ఞుడు ఎవరని తర్వాత ప్రశ్నకు జవాబుగా, దుఃఖములకు కుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, మమకారము, భయము, మరియు కోపాన్ని విడిచి పెట్టిన వ్యక్తిని "స్థితప్రజ్ఞుడైన ముని" అంటారు. బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు, అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది. దానివల్ల మనస్సు భగవత్ ధ్యాస నుండి పక్కకు పోతుంది. కాబట్టి, సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల పట్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసినవాడు స్థితప్రజ్ఞుడైన ముని.
"ఒక సామాన్యుడు రాజు కావాలని, రాజేమో ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు; చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు; ఒక దేవత స్వర్గాధిపతి అవ్వాలని కోరుకుంటాడు; ఇంద్రుడు బ్రహ్మదేవుడు అవ్వాలని కోరుకుంటాడు". ఆ విధంగా భౌతిక భోగముల మీద ఉన్న తృప్తి, తృష్ణ తీరదు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి చెప్పబడిన ముఖ్యమైన శ్లోకాలను మహాత్మా గాంధీ గారు కూడా ప్రతిరోజూ పారాయణం చేసేవారట.
కోపానికి దారితీసే లింకులను కృష్ణుడు చక్కగా వివరించారు. "ధ్యాయతో విషయాన్ పుంసః" - ఇంద్రియాలకు సంబంధించిన విషయముల మీదనే ఆలోచిస్తూ ఉండడం వలన, "సంగస్తేషుపజాయతే" - వాటి మీద క్రమంగా మమకారాసక్తి పెరుగుతుంది. "సంగాత్ సంజాయతే కామః" - అప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు, కోరికలే పుడుతుంటాయి. "కామాత్ క్రోధోఽభిజాయతే" - ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఉత్పన్నమవుతుంది.
దీనికి ఉదాహరణ: ఒక అందమైన అమ్మాయిని చూసిన అబ్బాయికి "ఆ అమ్మాయి నాదవుతే ఎంత బాగుంటుంది" అనే ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సుకి ఆమె పట్ల ఒక రకమైన అనురక్తి ఏర్పడుతుంది. క్రమంగా అది పిచ్చి ప్రేమగా మారుతుంది. చివరికి ఆ ప్రేమ ఫలించక పోతే కోపంగా మారుతుంది. ఇక పగ పెంచుకొని వేధించడం, యాసిడ్ పోయడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఆ విధంగా కోపం అనేది మూఢత్వానికి, విచక్షణా రాహిత్యానికి దారితీస్తుంది, ఆ మూఢత్వం వలన జ్ఞానశక్తి నశిస్తుంది. ఆ విధంగా జ్ఞానశక్తి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషే పతనమౌతాడు.
ఒకసారి బ్రాహ్మీస్థితికి చేరిన తర్వాత, అంటే జ్ఞానోదయం కలిగిన తరువాత, ఇక మళ్లీ భ్రమకు లోను కావడం, మాయలో పడడం అనేది జరగదు. మరణ సమయంలో కూడా ఇదే వివేకంతో స్థిరంగా ఉన్న వ్యక్తి "బ్రహ్మనిర్వాణమృచ్ఛతి" - జనన-మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. అదే మోక్షం.
"అంతకాలే + అపి". సంస్కృతంలో "అపి" అంటే "కూడా" అని అర్థం. అంటే "చివరి సమయంలో కూడా" ఎవరైతే ఈ బ్రాహ్మీస్థితిలో (దైవ చింతనలో) ఉంటారో, వారికి మోక్షం వస్తుంది అని దీని అర్థం. జీవితమంతా సోమరిగా ఉండి, "చివర్లో చూసుకుందాంలే" అని భగవంతుడి ధ్యానాన్ని వాయిదా వేయడం కాదు. అందుకే కృష్ణ పరమాత్మ తెలివిగా చివరి సమయంలో కూడా (అపి) అన్నారు.
కృష్ణార్పణం
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్ |










Comments