top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 26/10/2023

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది. వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.


కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు ఏసీపీ యాది రెడ్డి. వాళ్ళు పార్టీ చేసుకున్న గెస్ట్ హౌస్ ను పరిశీలిస్తాడు. మనోరమ హత్యకు గురైనట్లు అనుమానిస్తాడు.

మనోరమ చనిపోయినట్లు, ఆమె శవాన్ని మినిష్టర్ గారి తోటలో పూడ్చి పెట్టినట్లు చెబుతాడు వాచ్‌మెన్‌ యాదయ్య.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 13 చదవండి.


“సార్‌, మన గెస్ట్‌ హౌస్ వాచ్‌మెన్‌ పోలీసులకి అన్ని విషయాలు చెప్పేశాట్ట! స్టేషన్‌ నుంచి ఇప్పుడే కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి చెప్పాడు.. ఏసీపీ బాడీని బయటకు తీయించడానికి బయలుదేరాడట” మినిష్టర్‌ గోవిందరావు కి, పి. ఏ మణి ఫోన్‌లో చెప్పాడు.. హడావుడిగా.


తనకి పి. ఏ గా పనిచేస్తున్నా అతడికి నమ్మకస్తుడు మణి. గోవిందరావు ఎమ్మెల్యే గా పనిచేస్తున్నప్పటి నుంచి.. అంటే దాదాపు పది ఏళ్ళ నుంచి తన జెండా పట్టుకుని ఎజెండా వలె తిరిగాడు. ఎన్నికల ప్రచారంలో తన ఆఫీసులో డబ్బు దస్కం అంతా అతడి చేతుల మీదుగా జరిగింది. నిజానికి మణి అతడి ఇంట్లో మనిషిలా ఉంటాడు. పిఏ. చెప్పిన మాటలకు గోవిందరావు ముఖం చిట్లించాడు.


"వాచ్‌మెన్‌ గాడికి ఏమైంది? " అడిగాడు గోవిందరావు.


"పోలీస్‌స్టేషన్‌ లో లాఠీతో నాలుగు పీకేసరికి నిజం కక్కేశాట్ట. సార్‌, భార్యాభర్తలిద్దరినీ ఉతికారుట”.


"అసలు మనగెస్ట్‌హౌస్‌ లో పార్టీ జరిగినట్లు పోలీసులకి ఎవరు చెప్పారుట?” కోపంగా గోవిందరావు అడిగాడు.


"ఆ అమ్మాయి, అదే చనిపోయిన అమ్మాయి మనోరమ కనబడటం లేదని కంప్లయింట్‌ ఇచ్చారట సార్‌. దాంతో డొంకంతా కదిలింది”.


"సరే, వాళ్ళు కంప్లయింట్‌ ఇచ్చారు. అది మినిష్టర్‌ గెస్ట్‌హౌస్‌ కదా. ఆ ఏసీపి వెళ్ళే ముందు నా కొక మాట చెప్పొచ్చు కదా! ఈ కేసులో నా కొడుకు వెదవ ఉన్నాడుగా”, అన్నాడు గోవిందరావు.


"అతడు చాలా స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ సార్‌. జిల్లాలో అతడి బాధ పడలేక ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు" చెప్పాడు మణి.

చలం అనే వ్యక్తికి ఫోన్ చేసాడు గోవిందరావు.


"విఐపి గా ముద్రపడినాక చాలా చాలా చిక్కులొస్తున్నాయ్‌.. ఎంత జాగ్రత్తగా వుందామన్నా, ఇదిగో మన పోరగాళ్ళు ఉన్నారు చూడు.. ఉండ నివ్వరు.. నీకు తెల్వంది కాదు.. " అన్నాడు.


"అవునండీ, అవన్నీ మామూలేగా. రామా, అన్నా బూతుపదం లా హెడ్డింగ్‌ పెట్టేస్తున్నారు, మీడియా వాళ్ళు. మొన్న సియం. గారమ్మాయి ఫ్రెండు తో సినిమా కెళితే ఏదో లవ్‌ఎఫైర్‌ అని రాశారు ఈ పేపరోళ్ళు” అన్నాడు చలం.


“చూశాను చాలా.. మన అధికారం అడ్డం పెట్టుకుని ఎవరెవరో అడ్డమైన పనులు చేస్తున్నారు. అన్నింటికీ మనం బాధ్యత అంటే ఏం చెబుతాం. చెప్పు! సెలబ్రిటీ లంటే మరీ లోకువై పోయిందయ్యా! ఈ మీడియాకి. ఈ చానళ్ళు మరీనూ. ఎలాగోలా బురద జల్లాలని చూస్తున్నారు”.


"అది మాత్రం నిజమండి".


"ఇప్పుడింక ఫోన్ చేసింది కూడా అలాంటి విషయమేనయ్యా! ఎంత చెప్పినా వినిపించుకోరూ. మా కొడుకు వెదవలు. ఏదో పార్టీలకని వెళ్ళాడట. ఎవత్తినో నవ్వులాటలో తోసివేశాడట. తగలరాని చోట తగిలి చచ్చింది. అది కాస్తా మా వాడి మెడకి

చుట్టుకుంది. ఇప్పుడదో పెద్ద కేసు. ఆడెవడో ఏసీపీ యాదిరెడ్డట. ఈ కేసును పకడ్బందీగా చూస్తున్నాడు. మా వాణ్ణి బయటకు లాగాలీ. అసలాడు ఆ పార్టీలోనే లేడన్నట్లు ఎఫ్‌ఐఆర్‌ రాసేట్లు చూడాలి. చలం బాయ్‌! నీకు పుణ్యముంటది. "


"యాదిరెడ్డా!.. వాడో పెద్ద మెంటల్‌ గాడు. మస్తు స్ట్రిక్ట్‌ గ ఉంటడు. ఎవ్వని మాట ఇనడు.. చాలా మొండి ఘటం.. " చలం చెప్పాడు.


"ఆ మాట విన్నాను. చలం బాయ్‌! అందుకే నీకు ఫోన్‌ చేస్తున్న. లేకపోతే నేనే వాడితో మాట్లడే వాణ్ణి కదా!.. ఇలాంటి చిన్న విషయాలు హోంమంత్రి తో, సియంతో చెప్పడం బావుండదని.. పైగా నువ్వున్నావు కదా! ఇక నాకు వాళ్ళతో పనేంటి అన్న ధీమా కూడా ఉందయ్యా!.. ”

“మీరన్నది కరక్టే నండీ.. ఇలాంటి విషయాలు సియం గారి దృష్టి కి తీసుకెళతామా? నేను తప్పకుండా పని అయ్యే టట్లు చూస్తా.. లేకపోతే ఐజి తో చెప్పిస్తా. వినకేం

చేస్తాడు. !?”


"అవును. వాడికి ఐజి యే బెటర్‌. నేను డైరక్ట్‌ గా మాట్లాడటం కన్నా సియం. పేషీనుంచి మాట్లాడావంటే ఆ తీరే వేరు కదా !.. నువ్వు మాట్లాడిన తరువాత నేను ఐజి తో మాట్లాడుతాను. అప్పుడు బావుంటుంది. "


“సరే గోవింద్‍ సాబ్‌ ! నేను మీకు ఫోన్‌ చేసి ప్రోగ్రెస్‌ చెబుతాను.. సియం గారు పిలుస్తున్నారు.. డిల్లీ హడావుడి కదా! ఉంటాను” ఫోన్‌ పెట్టేశాడు చలపతి.

ఈ విషయం లో చలం ఎంతో కొంత చేస్తాడని నమ్మకం ఉంది. అయితే చేతులు ముడుచుకు కూర్చోలేదు. మనోరమ తప్పిపోయిన ప్రకటన పత్రికలలో వచ్చింది కానీ ఎవరెవరు ఉన్నారో ఇంకా తెలీలేదు. ఎవరినీ అరెస్టు చేసినట్లు గానీ, అనుమానితులని కానీ పట్టుకోవడం లాంటివి, వాళ్ళ పేర్లు బయటకు రాలేదు. అలాంటి వార్త లేవైనా వచ్చినా అందులో తన కొడుకు పేరు రాకుండా ఉండాలని గోవిందు ఆలోచన.


ఆ ఆలోచన చలపతికి చెప్పేసరికి చలం ఆ పనంతా తన స్వంత పనిలో చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఆ వెంటనే దినపత్రికల సంపాదకులతో మాట్లాడాడు.

మంత్రి గారబ్బాయి దిలీప్‌ పేరు " మనోరమ మిస్సింగ్‌" వ్యవహారంలో కనబడకూడదని మరీ మరీ చెప్పాడు. ఇవన్నీ పేపర్‌ వాళ్ళకు నిత్యకృత్య వ్యవహారమే. వాళ్ళకు

మామూలే.

--------------------------------

ఇంతకీ మనోరమ విషయం ఏమైనా తెలిసిందా? అన్నట్టు తనవైపు తిరిగి వెన్నెల అడగడంతో కంగారు పడింది రవళి. అనుమానంగా చూసింది క్షణం వైపు.


"నిన్నే అడిగేది, .. మనోరమ ఏమైనట్లూ" కావాలనే రెట్టించి ప్రశ్నించింది కూడా. ఆ ఇద్దరినీ భావగర్భితంగా చూస్తుండిపోయింది యమున. మిగిలిన వాళ్ళు తమను

కాదన్నట్లు గా ఉన్నారు.


“తెలీదు.. అది కనబడక వారం రోజులయ్యింది” దిగాలుగా అన్నది రవళి.

"దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. మమ్మల్ని మాటిమాటికి పిలిచి ప్రశ్నలతో చంపేస్తున్నారు.. ఈ కంప్లయింట్‌ అదీ వద్దన్నాను. నా రూమ్మేట్‌ ఊర్మిళ కంప్లయింట్‌ ఇద్దామని బయలుదేరదీసి బలవంతం మీద ఇప్పించింది. ఇప్పుడు స్టేషన్‌ చుట్టూ కుక్కల్లా తిరగలేక చస్తున్నాం" రవళి దిగాలుగా అన్నది.


"ఆ రోజు ఎవరెవరు పార్టీ కెళ్ళారే?” రవళి ముఖంలోకి చూస్తూ అడిగింది వెన్నెల.


ఆ ప్రశ్నలతో వెన్నెల తాపత్రయం ఏమిటో యమునకు అర్థమయ్యింది. పెదవులు విచ్చీ విచ్చుకున్నట్లు నవ్వుకున్నది.


"నేను, మనోరమ, ఊర్మిళ, దిలీప్‌, చందూ.. కానీ ఊర్మిళ అరగంట ఉండి వెళ్ళిపోయింది. దిలీప్‌, మంత్రిగారబ్బాయి.. రవళి చెప్పేసింది. ఏమవుతే అదవనీ అని”.


"చందూ.. ఎవరూ?” వెన్నెల ఆరా తీసింది. ఆ ఒక్క పేరే వెన్నెల ఎందుకు అడుగుతున్నది రవళి అంతగా పట్టించుకోలేదు.


"చంద్రశేఖర్‌” అని అంటూ అతడి వివరాలు మొత్తం చెప్పేసింది. ఆ మాటకి ఇప్పుడేమంటావ్‌ ? అన్నట్లు యమున కేసి చూసింది వెన్నెల.


వెన్నెల చూపులకు యమున ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది.

"మంత్రి కొడుకు ఉన్నాడు. వాళ్ళ పేర్లేమి ఉండవులే.. మేనేజ్‌ చేస్తారు. పాపం మనోరమ.. ఎటూ తేలకుండా మిగిలిపోయింది” అంది వెన్నెల.


వెటకారంగా అన్నదో, మామూలుగా అన్నదో రవళికి అంతు పట్టలేదు.


"మనోరమకు అన్ని అలవాట్లు ఉన్నాయా?” ఐదు నిమిషాలు పోయాక అడిగింది వెన్నెల. అడిగింది యధాలాపంగా అయినా ఏం చెప్పాలో రవళికి తోచలేదు. వెంటనే

ఏం చెబితే వాళ్ళు ఎలా తీసుకుంటారోనని సందేహించింది.


“అంటే?”, అన్న ప్రశ్న తనకి అర్థం కానట్లు కానీ, నిజానికి వెన్నెల అడిగిన ప్రశ్న చక్కగా అర్థం అయ్యింది.

“అదే.. పబ్‌లూ, షికార్లు, మందు వగైరా.. అన్నమాట.. ” వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అన్నది వెన్నెల.


"ఉన్నాయి.. ” ముక్తసరిగా చెప్పింది రవళి.


"నీవూ దానితో బాగానే తిరుగుతున్నావుకదా!” వెన్నెల అన్నది. ’ అంటే నీకు మందు పుచ్చుకోడం, పబ్ లలో ‘అన్నట్టు నర్మగర్భంగా అడిగింది.


"అదే అనుకుంటున్నాను. తప్పు చేశానని.. " రవళి గొణిగింది.


"ఇప్పుడు అనుకుని ఏం లాభం? " యమున అన్నది.


"అప్పట్లో మోహన్‌ మోసం చేసి వెళ్ళి పోవడం తో ఒక విధమైన డిప్రెషన్‌ లో ఉండి, మనోరమ వెంట తిరిగి ఎంతో హాయిగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాను. కానీ తెలిసే సరికి చాలా తప్పు త్రోవ అని తెలిసింది.. కానీ అప్పటికే ఆలస్య మైపోయింది.. ” రవళి దిగాలుగా అన్నది.


"నువ్వు ఇలా మానసికంగా క్రుంగిపోతున్నా వని మాకు ఎప్పుడూ చెప్పలేదు. తెలిస్తే మేము నీతో కూడా కొంతసమయం గడిపే వాళ్ళము కదా! నిన్ను మంచి మాటలతో ఓదార్చే వాళ్ళము కదా!” వెన్నెల ఇలా సూటిగా కొట్టినట్టు అన్నది.


రవళి ఏమీ మాట్లాడ లేదు. ఇలా అందరూ తలో మాట అడుగుతుండేసరికి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది రవళి.


ఇంక అక్కడ యమున, వెన్నెల కూర్చున్నారు. “ఇప్పటికైనా నమ్ముతావా మా వరస్ట్‌ ఫెలో ఉన్నాడన్న సంగతి ?”


"బుద్దిలేకపోతే సరి. మొగుణ్ణి పట్టుకుని అలా మాట్లాడకు?” కసిరింది యమున.

"మొగుడు కాదు.. విడిచిపెట్టేసిన వాడు.. ” వెన్నెల సవరించింది.


“అది న్యాయబద్దంగా జరగలేదు. అంతవరకూ నీవు అతని భార్యవి.. అతను నీకు మొగుడు.. ” యమున విసురుగా ఖరాఖండిగా చెప్పింది.


“సరే.. సరే.. నా మొగుడే.. నేను. మొగుణ్ణి విడిచి వేరుగా ఉంటున్నాను. అలా అనొచ్చు.. ఈ కేసులో అతడు ఇరుక్కుంటాడు. నా అనుమానం దాన్ని ఏదో చేసి

ఉంటారులే. మానభంగం చేసి చంపేసి ఉండొచ్చు.

వాళ్ళకి మానభంగం చేయవలసిన పనేంటీ? దేనికైనా మనోరమ కాదంటే కదా! ఏం జరిగిందో ఆ రహస్యాన్ని పోలీసులే కనిపెట్టాలి”.


వెన్నెల మాట్లాడలేదు. ఎటో చూస్తుండిపోయింది. సరేగానీ ఆ విషయాలు మనకెందుకు? బుర్రపాడుచేసుకోడం తప్ప. మంచి విషయాలు మాట్లాడుకుందాం. ప్రశాంతత ఉంటుంది” యమున అన్నది.


“అవును. మనకి అనవసరం ఈ విషయం. కాకపోతే మా వేస్ట్‌.. అలా అనొద్దన్నావు కదా! చందూ ఇరుక్కున్నాడు. కనుక ఏదో మాట్లాడాలనిపించింది.. ” వెన్నెల అన్నది.


అప్పుడు అప్రయత్నంగా కనుకొనకుల నుంచి జలజలా నీళ్ళు కారాయి.

"చూశావా ! మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చెదిరిపోదు.. అతడి అలవాట్లు, పద్దతులు మాత్రమే మీ ఇద్దరి మధ్యా అడ్డుగోడల్లా ఉన్నాయి. అంతేనా ?”

అవునన్నట్లు తలూపింది వెన్నెల.


"చూద్దాం. ఈ సంఘటన, అతడి జీవితంలో ఏమైనా మలుపు తీసుకు వస్తుందేమో?” వెన్నెల భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నది యమున.


"అలా మార్పు వస్తే మంచిదే. నేను ఆశిస్తున్నదీ అదే.. ” వెన్నెల, లోగొంతుతో.


హోప్ సో.. " అంటూ లేచింది యమున.

"ఒక్క నిమిషం ఆగు.. " అని చెప్పి వెన్నెల వెళ్ళి వాష్‌బేసిన్‌ దగ్గర ముఖం కడుక్కుని బ్యాగ్‌లో నుంచి నాప్కిన్ తీసి ముఖం తుడుచుకున్నది. బొట్టు పెట్టుకుని

ఇద్దరూ ఆఫీసుకి వెళ్ళారు.


ఆఫీసులో అంతా గందరగోళం గా ఉంది. అందరూ ఒక్క చోట గుమిగూడారు.


"ఏంటీ హడావుడీ!” అనడిగింది.. అటుగా వస్తున్న అటెండర్‌ ను యమున.


"ఏం లేదు మేడమ్‌, వారం రోజుల క్రితం మిస్సింగ్‌ మనోరమ కేసు. కనబడకుండా పోయిన మనోరమ అనే అమ్మాయి కేసులో చంద్రం అనే అతడిని అరెస్ట్‌ చేసి అదుపు లోకి తీసుకున్నారుట పోలీసులు. అన్నీ టీవీ చానల్స్‌ లోను ఇదే బ్రేకింగ్ న్యూస్‌ క్రింద మాటిమాటికి చూపిస్తున్నారు. " అన్నాడు అటెండర్‌.


ఆ మాటకి వెన్నెల ఒక్కసారి జలదరించింది. ముఖం కాస్తా జేవురు రంగులో మారి పోయింది. యమున ఇది అంతా గమనిస్తూనే ఉంది.


"వెన్నూ, కూల్‌.. ప్లీజ్‌ కంట్రోల్‌.. " యమున అన్నది వెన్నెల దగ్గర కొచ్చి.


"ఫర్వాలేదులే.. నేను ఓకే.. ఇవ్వాళో రేపో వినవలసి వస్తుందని అన్నిటికీ సిద్దమయ్యాను. మెంటల్‌ గా తయారుగా ఉన్నాను" అంది నెమ్మదిగా వెన్నెల.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







56 views0 comments

Comments


bottom of page