top of page
Writer's pictureMadduri Bindumadhavi

ధరణికి గిరి భారమా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Dharaniki Giri Bharama' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి

తల్లి , తన పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది.

భర్త, అత్తమామలతో సర్దుకోలేని వారు కూడా పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు.

ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు ఈ కథలో అదే విషయాన్ని చక్కగా వివరించారు.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

"అమ్మా..పకోడీలు తిననులేమ్మా! కడుపులో వాళ్ళకి తేడా చేస్తుందేమో" అన్నది లలిత ఇంకా పుట్టని తన బిడ్డని తలచుకుంటూ...తన గర్భం వంక మురిపెంగా చూసుకుంటూ.

"ఇంకా ఏడెనిమిది నెలల టైమున్నది. ఇప్పటి నించీ నాలిక మీద వాతెందుకే" అన్నది వరలక్ష్మి.

తల్లి వరలక్ష్మి బలవంతం మీద పకోడీలు తిని కాఫీ తాగుతూ "అమ్మా! పుట్టే వారు ఆడయినా, మగ అయినా ఎదుటి వ్యక్తిని, వారి అభిప్రాయాలని గౌరవించే వారుగా పెంచుతానమ్మా! వాళ్ళ నాన్నల్లే చీటికి మాటికి చిరాకు పడుతూ ఎదుటి వారిని కించపరిచే వారుగా అస్సలు పెంచను" అన్నది ధీమాగా లలిత.

"నీ చేతిలో ఏముందే? తండ్రి పోలికలు పిల్లలకి రాకుండా ఉంటాయా? అందులోనూ వ్యతిరేక లక్షణాలకి జన్యు బలం ఎక్కువ? తప్పకుండా వచ్చి తీరతాయి. అనవసరపు ఆశలు పెట్టుకోకు" అని హెచ్చరించింది వరలక్ష్మి....వారం క్రితం కూతురు ఏడుస్తూ చేసిన ఫోన్ గుర్తు చేసుకుంటూ!

@@@@

కూతురు లలిత అత్తవారింట్లో ఎలా ఉన్నదో అనుకుంటూ మధ్యాహ్న భోజనాలయ్యాక నడుం వాల్చింది వరలక్ష్మి.

ఫోన్ మోగింది.

"కాసేపు కూడా విశ్రాంతి తీసుకునేందుకు లేదు కదా...ఏమి జన్మో" అనుకుంటూ లేచింది ఫోన్ తియ్యటానికి.

"అమ్మా...నేను ఈయనతో కలిసి బతకలేనమ్మా. విడాకులు తీసుకోవటమే పరిష్కారం" అన్నది ఏడుస్తూ!

"ఏమయిందమ్మా? ఏమంటున్నావ్?" అన్నది ఒక్కసారిగా బద్ధకం వదిలిపోగా.

"అన్నిటికీ నసే! అన్నం వండటం ఇప్పుడా అంటారు, ఒక్క అరగంట ఆలస్యమైతే. కొంచెం పెందలాడే వండితే.. అన్నీ చప్పగా చల్లారి పోయాయి. ఇది ఇవ్వాళ్ళ వండిన అన్నమేనా? వీడికేంతెలుస్తుందిలే అని నిన్నటి అన్నం పెట్టావా" అంటారు.

"ముగ్గురికీ ఇంత కూర ఎందుకు? నీదేం పోయింది..సంపాదించేవాడికి తెలుస్తుంది బాధేమిటో? ఇలా దుబారా చెయ్యటానికి నీ పుట్టింటి నించి తెచ్చిన ఎస్టేట్లు ఏమైనా ఉన్నాయా?" అంటారు.

"పోనీ కాస్త తక్కువ వండితే...మా అమ్మకి పచ్చడి మెతుకులు పెడదామనా నీ ఉద్దేశ్యం" అంటారు.

"ఆయనకి పొద్దున రెండు సార్లు కాఫీ కావాలి. కాస్త మిగిలితే నోట్లో పోసుకుంటుంటే..నాకిచ్చినప్పుడల్లా తాగుతావా? అన్నన్ని సార్లు కాఫీ తాగటం మంచిది కాదంటారు"

"సమాధానం చెబితే ఒక తప్పు! చెప్పకపోతే, ముంగిలాగా మాట్లాడవేం? నిర్లక్ష్యమా" అంటారు.

"ఈ మనిషితో కలిసి బతకటం కత్తి మీద సాము అనేది అతి చిన్నమాట అమ్మా" అన్నది ఆయాసం తీర్చుకుంటూ.

"కొత్తలో పెళ్ళాలకి లోకువ అవుతామని కొందరు మగవాళ్ళు తమ ఆధిక్యాన్ని చాటుకోవటానికి ఇలాగే ప్రవర్తిస్తారు. నెమ్మదిగా భార్య అర్ధమయినాక మారతారు. కొన్నాళ్ళు ఓపిక పట్టమ్మా" అన్నది వరలక్ష్మి.

నోటి నసతో ఆగకుండా... చెయ్యి చేసుకోవటం దాకా వచ్చింది లలిత భర్త 'విక్రం' ధోరణి!

కొడుకు మాటకి ఎదురు చెబితే..తన బతుకు అతని నీడన ప్రశాంతంగా వెళ్ళదేమో అనే అనుమానంతో సీతమ్మ గారు తటస్థంగా చూసీ చూడనట్టు ఊరుకుంటుంది.

@@@@

తల్లి ఓదార్పుతో, సలహాతో కొన్నాళ్ళు భర్తని భరించటానికి సిద్ధపడింది లలిత. వేచి చూద్దాం..అంతగా మార్పు రాకపోతే, విడిపోవటం అనే మార్గం ఉండనే ఉన్నది అనుకున్నది.

ఆ రోజు ఉదయం లేస్తూనే ఏదో వికారంగా ఉండి బాత్ రూంలోకెళ్ళి వాంతి చేసుకున్నది. నీరసంగా ఉండి మళ్ళీ వెళ్ళి పడుకుండి పోయింది.

ఆ రోజు ఆఫీసులో అర్జెంట్ పని ఉండి, 'విక్రం' త్వరగా వెళ్ళిపోయాడు.

కోడలు ఇంకా లేవలేదని అటుగా వచ్చిన సీతమ్మ చూసి, "లలితా ఒంట్లో బాగాలేదా? జ్వరం వచ్చిందా" అంటూ నుదుటి మీద చెయ్యేసి చూసింది.

"కడుపులో వికార పెడుతోందత్తయ్యా" అన్నది.

"లే..లేచి పళ్ళు తోముకో. కాఫీ కలుపుతాను. విశేషమేమో! నేను నాయనమ్మనౌతున్నాననుకుంటా. నీళ్ళోసుకుని ఎన్నాళ్ళయింది" అంది సంబరంగా!

"రెణ్ణెలవుతున్నదత్తయ్యా" అన్నది అయోమయంగా!

కోడలి చేత కాఫీ తాగించి, టిఫిన్ చేసి తినిపించింది.

"మీ అమ్మగారికి ఫోన్ చెయ్యమ్మా" అని చెప్పి ఫోన్ చేయించి తను కూడా వియ్యపురాలితో మాట్లాడి సంతోషం వ్యక్తపరిచింది.

ఈ కొత్త పరిణామంతో 'విక్రం' తన సహజ సిద్ధమైన చిరాకుని పక్కన పెట్టి కొన్ని రోజులు భార్యతో మురిపెంగా ఉన్నాడు.

వేవిళ్ళ వల్ల లలితకి ఏమి తిన్నా ఇమిడేది కాదు. తినలేక, తిన్నది వాంతులతో వెళ్ళిపోవటంతో బాగా నీరసించిపోయింది.

"ఏమిటి ఎప్పుడూ గొడ్డల్లే పడుకుని ఉంటావ్? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఏదో నువ్వొక్క దానివే ఈ భూమి మీద కడుపుతో ఉన్నట్టు? కనబోతున్నట్టు? నా బట్టలు ఇస్త్రీకివ్వలేదు. ఆఫీసుకేం వేసుకెళ్ళాలి" అని తన సహజ ధోరణిలో విరుచుకు పడ్డాడు.

మూడో నెలలో పసుపు-కుంకుమ, చలిమిడి పెట్టి నిద్ర చేయించాలని వరలక్ష్మి వచ్చి లలితని తీసుకెళ్ళింది.

రెండు రోజులయిందో లేదో...విక్రం ఫోన్ చేసి "ఎప్పుడొస్తున్నావ్? ఎక్కడికెళితే అక్కడేనా? ఇక్కడ నీకో ఇల్లూ వాకిలీ ఉన్నాయని గుర్తుందా" అన్నాడు.

"ఆడ పిల్లని మంచి రోజు చూసి పంపించాలి. ఎల్లుండి దిగబెడతాను" అన్నది వరలక్ష్మి ప్రశాంతంగా.

@@@@

తనకంటూ ఒక నేస్తం సృష్టిలోకి రాబోతున్నదని, పుట్టబోయే వారి మీద కొత్త ఆశలతో లలిత భర్త ధోరణిని భరిస్తున్నది.

ఏడో నెల వచ్చాక వరలక్ష్మి లలితని పురిటికి తీసుకెళ్ళింది.

పుట్టింటికొచ్చిన నేస్తాన్ని చూడటానికి వస్తున్న చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతూ..అమ్మ వండి పెట్టేవి తింటూ, తన భర్తతో గత ఏడాదంతా గడిపిన గడ్డు కాలం మనసు అడుగుపొరల్లోకి వెళ్ళిపోయింది లలితకి.

లలితని చూసి వెళ్ళటానికి వచ్చిన మాలతి "ఏమ్మా లలితా ఒంట్లో కులాసాగా ఉంటున్నదా? మీ ఆయన చూడటానికి వచ్చి వెళుతున్నాడా? అత్తవారింట్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావని అమ్మ చెప్పింది. ఓ పిల్లో పిల్లాడో పుడితే మగ వాళ్ళ తిక్కలన్నీ సర్దుకుంటాయిలే" అన్నది అనుభవం రంగరించిన ధోరణితో!

"ఏమో అత్తయ్య గారూ...కొన్నాళ్ళు చూసి అతనితో కలిసి బతకటం కష్టమనుకుంటే విడాకులిచ్చేసి ఏ ఉద్యోగంలోనో చేరతాను" అన్నది.

"మొదటి నించీ ఇబ్బంది పడుతూ ఉన్నదానివి, గర్భం రాకుండా జాగ్రత్త పడాల్సింది. ఈ టైంలో ఇట్లా అన్నాననుకోకు. ఒంటరిగా పిల్లలని పెంచటం కష్టం. రేపు అతను పుట్టిన పిల్లని ఇవ్వననచ్చు. ఆలోచించు" అన్నది అనుభవంతో కూడిన ప్రేమతో!

"విడిపోవాలనుకున్నా, నాకంటూ ఒక తోడు ఉండాలి కదా! అందుకే పిల్లని కనాలనుకున్నాను అత్తయ్య గారూ! అతని నీడ కూడా పుట్టిన వారి మీద పడకుండా నా ఆదర్శాలకి అనుగుణంగా వారిని పెంచుతాను" అన్నది లలిత దృఢంగా.

"కడుపులో పిల్ల పడగానే ప్రతి ఆడపిల్లా తను అప్పటి దాక భర్తతో పడిన ఇబ్బందులన్నీ మర్చిపోయి..భర్త పరాయి వాడు గాను, బిడ్డ మాత్రం ఒక్క తన వల్లే కలుగుతున్నట్టూ భావిస్తారు. ఆ భర్త పోలికలు, జన్యు లక్షణాలు....మంచి కానీ, చెడు కానీ...రావటానికి నూటికి నూరు శాతం అవకాశం ఉందని అనుకోనే అనుకోరు...అదేం విచిత్రమో! ఆ పిల్లల పట్ల అమితమైన ఆశలు, కోరికలూ పెంచుకుంటారు. పుట్టే వారిని గురించి...వారు ఎంతో ఆదర్శంగా ఉంటారని నమ్ముతారు."

"మా ఆడపడుచు అల్లుడు తాగుబోతు, తిరుగుబోతు. కానీ అతని నించి విడిపోయిన మా ఆడపడుచు కూతురు "తన అదృష్టం కొద్దీ కొడుకు చాలా మంచివాడు. తండ్రి పోలికలు అస్సలు రాలేదు" అని సంతోషించినంత సేపు పట్టలేదు...వాడు పదిహేనేళ్ళకే తల్లికి ఎదురు తిరిగి మాట్లాడటం, గట్టిగా కేకలేస్తే రోజుల తరబడి ఇంటికి రాకుండా ఫ్రెండ్స్ తో బయట తిరగటం చేస్తున్నాడు. తండ్రి పోలికలు రాక ఎక్కడికి పోతాయి అని ఇప్పుడు అనుకుంటున్నారు."

"ఇలా నువ్వు, మా ఆడపడుచు కూతురే కాదు...ఆడపిల్లలందరూ తను కనే సంతానానికి తండ్రి అవలక్షణాలు రావని ఆత్మ విశ్వాసంతో ఉంటారు. రావటానికి ఎంత అవకాశముందో, రాకపోవటానికి అంతే అవకాశం ఉంటుంది. కానీ తల్లి అయ్యే వ్యక్తి అలా అనుకోదు. అదే సృష్టి చిత్రం" అన్నది మాలతి.

"మీరన్నది నిజమే కావచ్చు అత్తయ్య గారు. కానీ మనిషిని నడిపించేది ఆశే కదా" అన్నది లలిత.

అప్పుడే అటుగా వచ్చిన వరలక్ష్మి వీరి సంభాషణ వింటూ రేడియో ఆన్ చేసింది. అందులో నించి "ధరణికి గిరి భారమా..గిరికి తరువు భారమా..తరువుకి కాయ భారమా..కని పెంచే తల్లికి పిల్ల భారమా" అనే పాట లలిత మాటకి ఊతంగా, సందర్భోచితంగా వచ్చింది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు



69 views0 comments

Comments


bottom of page