top of page
Writer's pictureNeeraja Prabhala

కడలి కెరటాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kadali keratalu' New Telugu story Written By Neeraja Hari Prabhala

రచన: నీరజ హరి ప్రభల

"రమ్యా! రేపు ఉదయమే నీకు పెళ్లి చూపులు. రోజూ పిల్లలను పోగేసుకుని పొలాలగట్లంటూ తిరుగుతావు. రేపన్నా బుధ్ధిగా ఇంట్లో ఉండు." అన్న తండ్రి రామయ్య మాటలను వింటూ లోపలికి వెళ్లింది రమ్య.


ఆ ఊరిలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రామయ్య - భార్య జానకమ్మ , కూతురు రమ్య తో పెద్దలిచ్చిన చిన్న ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నారు. పదవతరగతి చదివిన రమ్యను ఇంక పై చదువులు చదివించే స్ధోమత లేక పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు రామయ్య గారు. భర్తకు తగిన ఇల్లాలు జానకమ్మ. భర్త మాటకు ఏనాడూ ఎదురు చెప్పి ఎరగదు. నోరు వాయీలేని ఇల్లాలు అని ఆమెకు పేరు. ఉన్నంతలో గుట్టుగా బ్రతుకుతూ రమ్యని ప్రేమగా చూసుకుంటున్నారు రామయ్యా వాళ్లు.


తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఇంకా పై చదువులు చదువుకోవాలనే తన మనసులోని మాటను ధైర్యంగా తల్లి తండ్రుల వద్ద రమ్య చెప్పగా, వాళ్లు తమ ఆర్థిక పరిస్థితిని వివరించి రమ్యను పెళ్లికి ఒప్పించారు. కన్నవాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక , ఇంటి స్ధితిగతులను అర్థం చేసుకున్నదై మౌనంగానే పెళ్లికి అంగీకరించింది రమ్య.


ఆ మరుసటిరోజు పెళ్లి కొడుకు సుధీర్ తన తల్లి సరోజమ్మతో పెళ్లిచూపులకు రావడం, తను వాళ్లకు నచ్చడం ఆరోజే మంచిదని వెంటనే ఇరుకుటుంబాలూ తాంబూలాలు పుచ్చుకోవడం జరిగిపోయింది. పెళ్లిలో ఇచ్చి పుచ్చుకునే మాటలు వగైరా జరిగి మరుసటి నెలలో పెళ్లి ముహూర్తం నిర్ణయం జరిగింది. పెళ్లివాళ్లు వెళ్లినాక కూతురి పెళ్లికుదిరిందని సంబరాల్లో ఉన్నారు జానకమ్మా వాళ్లు.


ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుధీర్ చూడటానికి బాగానే ఉన్నాడు. రెండు సం.. క్రితం తండ్రి చనిపోయాడని తల్లి చెప్పిన వివరాలను వింది రమ్య. రోజులు గడుస్తున్నాయి. రామయ్య తన ఇంటిని అమ్మి రమ్య పెళ్లి ఘనంగా చేశాడు. రమ్య సుధీర్ తో అత్తారింటికి కాపురానికి వచ్చింది.

త్వరలోనే రమ్యకు ఆ ఇంటి వాతావరణం అర్ధమైంది. ఆ ఇంట్లో సరోజమ్మదే పెత్తనం. కొడుకు ఆమె మాటను జవదాటడు. అంతేకాక సుధీర్ కు త్రాగుడు అలవాటు ఉందనీ, పరస్త్రీతో సంబంధం ఉందనీ తెలిసి హతాసురాలై బాధపడింది. నెమ్మదిగా తన ప్రేమతో అతనిని మార్చుకుందామనుకుని అతనితో ప్రేమగా ఉంటున్నా అతనికి భార్య అంటే చాలా చిన్నచూపు, నిర్లక్ష్యం ,అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు తల్లి ఎగదోపు, చెప్పుడు మాటలు ఇవేమీ అతన్ని మార్చలేదు. కొన్ని నెలలకు రమ్య గర్భం దాల్చింది. ఆ తీపికబురు విని రమ్య తల్లి తండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ భర్త , అత్తగారు ఏమాత్రం సంతోషం వ్యక్తం చేయకపోవడం మనసు బాధపడినా పిల్లలు పుడితే వాళ్లే మారుతారనుకుంది.


కొన్ని నెలలకు రమ్యను జానకమ్మ వాళ్లు పురిటికి తీసికెళ్లారు. ఒక శుభముహూర్తాన ఆడపిల్లను కన్నది రమ్య. ఏదో నామమాత్రంగా వచ్చి పాపను చూసి బారసాల చేసుకుని వెళ్లారు సుధీర్ వాళ్లు. మూడవనెల రాగానే రమ్య పాపతో తనింటికి వచ్చింది. వీలు కుదిరినప్పుడు కూతురిని దగ్గరకు తీసుకుని ఆడించేవాడు సుధీర్. దానికే చాలా సంతోషపడేది రమ్య. ఆ పసిపిల్లని అత్తగారు ఎప్పుడూ విదిలించుకునేది. ఆవిడ తీరు అంతే అనుకుంది రమ్య.


సమయం చూసుకుని రమ్య తనలో చదుకునే కోరికను సుధీర్ తో చెప్తే అతను ఆడదానివి , నీవు చదివి ఏంచేస్తావు? అన్న దానికి పౌరుషం వచ్చి తనే ప్రెవేటుగా చదివే నిర్ణయంతో తండ్రి సాయంతో ఫీజు కట్టుకుని డిగ్రీ చదువనారంభించింది. ఇంటిపనులు చేస్తూ చదువుతోంది కనుక ఇష్టం లేకపోయినా ఊరుకున్నారు భర్త, అత్తగారు. 3సం..కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి డిగ్రీ పూర్తి చేసింది. రమ్య ఆనందానికి అవధులు లేవు. రోజులు గడుస్తున్నాయి.

రామయ్య గారు రిటైరవ్వటం జరిగింది.


రమ్య మరోసారి గర్భం దాల్చింది. నెలలు సమీపిస్తుంటే రమ్య పుట్టింటికి వెళ్లి మగబిడ్డను కన్నది. 21వరోజున బారసాల చేసుకుని భార్యను‌, బిడ్డలను తీసుకుని వచ్చాడు సుధీర్. మనవడని వాడిని కాస్త దగ్గరకు తీస్తోంది సరోజమ్మ. ఆ తేడాను గమనించి బాధపడి ఆవిడకు చెప్ప ప్రయత్నం చేసింది. కానీ ఆవిడలో మార్పు లేదు. పాప అది గమనించకూడదని జాగ్రత్తపడేది. పిల్లలు క్రమేపీ పెద్దవుతున్నారు.


కాలం గడుస్తోంది. ఈలోగా ఎన్నో మార్పులు జరిగాయి.ఒక రోజున జానకమ్మ నిద్రలోనే కార్డియాక్ అరెస్టుతో తనువు చాలించింది విషయం తెలిసి పరుగున వెళ్లి గుండెలవిసేలా ఏడ్చింది రమ్య. దగ్గరుండి ఆ మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేశాక తండ్రిని ఓదార్చి తన వద్దకు రమ్మని చెప్పి ఒప్పించప్రయత్నం చేసినా ఆయన ససేమిరా ఆ ఊరిని వదిలి రానన్నాడు. వచ్చే పెన్షనుతో అక్కడే తన భార్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ శేషజీవితాన్ని గడుపుతానని పట్టుపట్టారు. చేసేది లేక ఇరుగుపొరుగు వారిని ఆయనకు కాస్త సాయంగా ఉండమని చెప్పి, ఆయనకేమాత్రం ఇబ్బందులు వచ్చినా తనకు కబురు పెట్టమని చెప్పి ఫోను నెంబరు, తన ఇంటి వివరాలను ఇచ్చి తనింటికి వచ్చింది రమ్య. కానీ ప్రతిరోజూ మనసంతా ఈవయస్సులో తండ్రి ఏం యాతన పడుతున్నారో అనే ఉండేది. వీలు కుదిరినప్పుడు వెళ్లి తండ్రి బాగోగులను చూసుకునేది.


రమ్య పిల్లలను స్కూలులో వేసింది. వాళ్లు చక్కగా చదువుకుంటున్నారు. రమ్య ఆ స్కూలులోనే ఉద్యోగం ప్రయత్నం చేసి భర్తను ఒప్పించి టీచర్ గా చేరింది.


ఇంటికి వచ్చిన మొదలు అత్తగారు రమ్యని ఎంతసేపు సాధింపులూ, ఇంటి పని ఎంత చేసినా కొడుక్కి రమ్య మీద నేరాలను చెప్పేది. తల్లి చెప్పగానే రమ్య మీద విరుచుకుపడేవాడు సుధీర్. భార్యాభర్తల గొడవలకి సరోజమ్మ మనసులో సంతోషించేది. ఈగొడవలకు పిల్లల మనసు పాడవగూడదని ఎన్నోమార్లు భర్తకు చెప్పినా అతనేమాత్రం లక్ష్యపెట్టలేదు. కానీ పిల్లలకు విషయం అర్ధం కాకపోయినా తల్లి తండ్రులు గొడవ పడుతున్నారని తెలుస్తోంది. రమ్య వాళ్లకు చదువు చెప్పుకుంటూ వాళ్లని మరిపించేది.


సుధీర్ తన జీతంలో కొంత ఇంటి ఖర్చు లకని తల్లికివ్వడం అలవాటు. మిగిలినది తన వ్యసనాలకు వాడేవాడు. రమ్య తన జీతంతో పిల్లలకు కావలసినవన్నీ చూసుకునేది. కాలం వేగంగా గడుస్తోంది. ఒకనాడు రామయ్యగారు హఠాత్తుగా గుండెపోటుతో కాలంచేశారు. విషయం తెలిసి రమ్య గుండెలవిసేలా ఏడ్చి భర్త, పిల్లలతో అక్కడికి వెళ్లి జరగవలసిన కార్యక్రమాలను జరిపించి తనింటికి వచ్చింది.


రోజులు గడుస్తున్నాయి. సుధీర్ తరచూ త్రాగిరావడం, ఏదో విధంగా రమ్య మీద చేయిచేసుకోవడం జరుగుతోంది. సంసారంలో ఇవి సహజం, అతనిని ప్రేమతో మారుద్దామని ఎన్నో మార్లు భర్తకు గొడవలొద్దు, వ్యసనాలని మానమని, పిల్లల భవిష్యత్తు కోసమన్నా అన్యోన్యంగా ఉండమని నచ్చచెప్పింది. కానీ "నేను మగాడిని, నా ఇష్టం వచ్చినట్లు ఉంటా " అన్న అతని మాటలకు చాలా బాధపడి రమ్య పిల్లలను తీసుకుని విడిగాఉందామని అనుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకుని భర్తకు చెప్పింది. ఆనాడు ఆ ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. రమ్యను కొట్టి పిల్లలతో బయటకు గెంటేశాడు సుధీర్.


జరిగిన దారూణానికి రమ్య వ్యధ చెంది పిల్లలను తీసుకుని సముద్రం ఒడ్డుకు చేరి పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని బాధపడుతోంది. "ఏడవద్దమ్మా!" అంటూ తమ చిట్టి చేతులతో తల్లి కన్నీటిని తుడుస్తుంటే మనసు ద్రవించిపోయి వాళ్లని ప్రేమగా గుండెలకు హత్తుకుంది. దూరంగా కడలి కెరటాలను చూస్తోంది. ఎగిసిపడుతున్న ప్రతికెరటం ఒడ్డున చేరే ప్రయత్నంతో అణిగిపోయినా మరలా లేచే ప్రయత్నం చేస్తోంది. కెరటంలాగా తను కూడా జీవితంలో ఏమాత్రం ఓడిపోగూడదనుకుంది. తనకు తనే ధైర్యం చెప్పుకుంది. 'ఇంకనుంచి పిల్లలకు తనే తల్లి, తండ్రి అయి ఎన్ని కష్టాలు పడినా వాళ్లను బాగా చదివించి మంచిగా వ్రృధ్ధిలోకి తీసుకురావాలి " అనుకుని పిల్లలతో ఒక హాస్టలుకు చేరింది. అక్కడ కొన్నాళ్లు ఉండి నెమ్మదిగా స్కూలు వాళ్ల సాయంతో దగ్గరలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంట్లోకి చేరింది. ఇప్పుడు రమ్య తనపిల్లలను చక్కగా చదివించుకుంటూ చాలా సంతోషంగా ఉంటోంది. కొన్నాళ్ళకి సుధీర్ నుంచి విడాకులను తీసుకుంది. పిల్లలకు తల్లి, తండ్రి తనే అయి వాళ్లని కంటికిరెప్పలా కాపాడుకుంటోంది రమ్య.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాట




రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏






116 views0 comments

Comments


bottom of page