top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 18


'Kotha Keratam Episode 18' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 14/11/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 18' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.


డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.


రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు.


తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో భార్గవను చేరుస్తాడు రామయ్య.


స్నేహితుడు అనిల్ తండ్రికి క్యాన్సర్ అని తెలిసి బాధ పడతాడు భార్గవ. తాతయ్య సలహాతో స్నేహితులతో డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు.


భార్గవ సిగెరెట్స్ తాగడం గమనించి, సున్నితంగా కన్విన్స్ చేసి మానిపిస్తాడు రామయ్య.


మార్కులకోసం భార్గవ మీద ఎక్కువ ఒత్తిడి తేవద్దని కొడుకు, కోడళ్ళకు చెబుతాడు రామయ్య.

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదిస్తాడు భార్గవ.

ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 18 చదవండి.


తొంభై ఎనిమిది శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు భార్గవ. డాక్టర్ చదువుకోసం లండన్ వెళ్ళబోయే ముందర తన పద్ధెనిమిదవ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి, ఇంట్లోనే ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు భార్గవ.

పార్టీ ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి.


ఇంకో రెండ్రోజుల్లో పుట్టినరోజు. ఉదయం ఫలహారాలయ్యాక అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండగా ఉదయం సుమారు పది గంటలకి ఫోన్ మ్రోగింది.


హాల్లోనే కూర్చున్న భార్గవ ఫోన్ ఎత్తి “హలో నమస్తే. ఎవరు కావాలండీ?” అన్నాడు.


“రాజేంద్రగారితో మాట్లాడాలి. పిలుస్తారా?”


“ఇప్పుడే బయటకి వెళ్ళారండీ. రాగానే చెప్తాను. ఇంతకీ మీరెవరూ?”


“నువ్వు భార్గవ కదూ”


“అవునండీ నా పేరు మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోయాడు.


“నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు బాబూ. నా పేరు సూరజ్ ”


“ఓ అలాగా! ఇదిగో నాన్న వచ్చారు ఇస్తానుండండి” అని “ఎవరో సూరజ్ గారట” చెప్పాడు రిసీవర్ అందిస్తూ.


“హలో సూరజ్ బాగున్నావా?”


“నేను బాగున్నాను రాజూ. మరో రెండ్రోజుల్లో ఇండియా వస్తున్నాను. మీ ఇంటికి వస్తాను. భార్గవ మేజర్ అవుతాడు కదూ ఈ సంవత్సరం. దానికి సంబంధించి మీ అందరితో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. సరే ఇక ఉంటానూ ఎల్లుండి కలుద్దాం” లైన్ కట్ అయింది.


ఫోన్ పెట్టేసి మాటాపలుకూ లేకుండా శూన్యంలోకి చూస్తున్న భర్త దగ్గరగా వెళ్ళి “ఏమండీ ఏమైంది? ఎవరి ఫోన్?” అడిగింది కళ్యాణి.

“సూరజ్ వస్తున్నాడట. భార్గవని చూడాలని ఉందట. మనతో ఏదో మాట్లాడాలట”


“అవునా?”


తర్వాతి రెండు రోజులూ రెండు యుగాల్లా గడిచాయి వాళ్ళకి.

ఆ ఫోన్ వచ్చినప్పటినుంచీ అదోలా ఉన్న తల్లిదండ్రులని గమనిస్తూన్న భార్గవ ‘ఏమై ఉంటుందీ? ఆ సూరజ్ ఎవరో? తాతయ్యకి తెలుసేమో అడుగుతాను’ నెమ్మదిగా తాతగారి వద్దకు వెళ్ళాడు.


“ఏమి కావాలిరా మనవడా?”


“తాతయ్యా సూరజ్ ఎవరో మీకు తెలుసా?”


“ఆ తెలుసూ. మీ నాన్న స్నేహితుడు. అతని చదువుకోసం మనం ఎంతో సహాయం చేసాము. మీ అమ్మకి ఆపరేషన్ జరిగినప్పుడు మీ నాన్న ప్రక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. నిన్ను చేతుల్లో ఎత్తుకున్నాడు. అందుకనే నువ్వంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరమూ నీ పుట్టిన రోజున తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఆ పేరు నీకెవరు చెప్పారు?”


“ఇందాక నాన్నకి ఫోన్ వచ్చింది. నాన్న బయటకి వెళ్ళారని నేను మాట్లాడాను. తన పేరు సూరజ్ అనీ నేను బాగా తెలుసనీ అంటేనూ ఎవరా అని అడుగుతున్నాను అంతే” అయితే అప్పటినుంచీ తల్లీతండ్రీ అన్యమనస్కంగా ఉంటున్నారని మాత్రం చెప్పలేదు, తాతగారిని కంగారు పెట్టడం ఎందుకని.


భార్గవ పుట్టినరోజు ఉదయమే కార్లో దిగాడు సూరజ్.

రాజేంద్ర ఎదురు వెళ్ళి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. కళ్యాణి చెమర్చిన కళ్ళతో నమస్కరించింది.

రామయ్యగారికి పాదాభివందనం చేసాడు సూరజ్.


“భార్గవా అంకుల్ కి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమ్మా” ఎన్నడూ లేనిది తాతగారు అలా అనడం చిత్రంగా అనిపించినా పెద్దవారు చెప్పారని సూరజ్ కాళ్ళకి నమస్కరించాడు.


భార్గవని ఆశీర్వదించి భుజాలు పట్టి లేవదీసి గాఢంగా కౌగలించుకున్నాడు సూరజ్.


రక్తసంబంధం మహాత్మ్యమేమో, కన్నతండ్రి అని తెలియకపోయినా, సూరజ్ కౌగలించుకోగానే అప్రయత్నంగా భార్గవ కళ్ళు తన్మయంతో మూసుకున్నాయి.


అటు సూరజ్ కూడ కనుకొలుకుల్లోంచి రాలిన ఆనందభాష్పలు భార్గవకి కనపడకుండా జాగ్రత్తపడ్డాడు.

అయితే ఈ రెండు విషయాలూ రామయ్య దృష్టిని మాత్రం దాటిపోలేదు.


కాఫీ ఫలహారాలై హాలులో కూర్చున్నాక “అంకుల్ ఇవి తీసుకోండి” ఒక కాగితాల దొంతర రామయ్య చేతిలో పెట్టాడు సూరజ్.


“ఏమిటీ బాబూ ఇవి? నాకెందుకు ఇస్తున్నావు?”


“ఇండియాలో నాకంటూ ఎవరూ లేరు. నేనా అమెరికాలో స్థిరపడ్డాను. అందుకని ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ భార్గవ పేరున రిజిస్టర్ చేయించాను. వీటిని మీ ఆధ్వర్యంలో ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించండి. ఇంకా ఏవైనా లీగల్ ఫార్మాలిటీస్ ఉంటే నా లాయర్ పూర్తి చేస్తాడు.”


“అయ్యో వాడి పేరున ఎందుకూ. అదేదో నువ్వే చేయవచ్చును కదా?” రాజేంద్ర అభ్యంతరం చెప్పాడు.


“అవునన్నయ్యా అదే సరైన పద్ధతి” కళ్యాణి వంత పలికింది.


“భార్గవ డాక్టర్ చదువుకుందామని అనుకుంటున్నాడని, ఇక్కడ గ్రామ ప్రజలకి సేవ చేద్దామనుకుంటున్నాడని చెప్పావు కదా. ఏదో ఉడతా భక్తి ఈ డబ్బు ఆ సత్కార్యంలో ఉపయోగపడితే నాకు సంతోషం”


“అంకుల్ మీరైనా చెప్పండి వీళ్ళకి”


‘భార్గవ క్షణిక తన్మయత్వం, సూరజ్ ఆనందభాష్పాలు, ఈ ఆస్తి అప్పగింతలూ తాను ఊహించినదీ, విన్నదీ నిజమని రూఢీ చేస్తున్నాయి’ అనుకుంటూ ఆలోచనలలో మునిగి ఉన్న రామయ్య చెవులకు సూరజ్ మాటలేవీ సోకలేదు.


తండ్రి ఎంతకీ బదులివ్వక పోవడం చూసి “నాన్నా సూరజ్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు” కొడుకు భుజం తడుతుంటే గబుక్కున ఈ లోకంలోకి వచ్చి “ఏమంటున్నావు బాబూ?” అన్నారు.

తన అభ్యర్థన మళ్ళీ తెలిపాడు సూరజ్.


“నువ్వంతగా చెప్తుంటే ఎలా కాదనగలము. నీ ఇష్టప్రకారమే జరుగుతుంది” భరోసా ఇచ్చారు నిండు మనసుతో.


“థ్యాంక్స్ అంకుల్. నేను ఇక్కడికి వచ్చిన పని నెరవేరింది. మిమ్మల్నందరినీ చూడగలిగాను. అదే చాలు. రాత్రికే నా తిరుగు ప్రయాణం” భోజనం చేసి వెళ్ళమన్నా వినకుండా బయలుదేరాడు.

కారెక్కబోతూ భార్గవని మళ్ళీ కౌగలించుకుని “ఈ అంకుల్ ని మర్చిపోకూ” అన్నాడు.


“మర్చిపోను అంకుల్. మీ కోరిక తీర్చడానికి కూడా తప్పక ప్రయత్నిస్తాను” అన్నాడు.


సూరజ్ వచ్చి వెళ్ళిన రోజు రాత్రి ఎంతకీ నిద్రపట్టక మంచంపై దొర్లుతున్న భార్గవ మనసుని పరిపరివిధాలైన ఆలోచనలు చుట్టుముట్టి కందిరీగల్లాగా రొదపెట్టాయి ’అంకుల్ కౌగలించుకున్నప్పుడు అదేమిటో కాని ఆయన నాకు బాగా కావలసిన వారనిపించింది చిత్రంగా! ఎందుకలా అనిపించిందో?’ ఎటూ తెగని ఆలోచనలకి బలవంతంగా అడ్డుకట్ట వేసి నిద్రకి ఉపక్రమించాడు.


అయితే ఆ తర్వాత చదువూ విదేశీ ప్రయాణం హడావిడిలో బిజీ అయిపోయిన భార్గవకి మరెన్నడూ దాని గురించి ఆలోచనేరాలేదు!

&&&

నేనెవ్వరి కోసమూ ఆగను. నాకందరూ సమానమే. నా ధర్మం నేను నెరవేరుస్తానంటూ కాలచక్రం ముందుకు కదిలింది.


భార్గవ డాక్టర్ చదువు పూర్తికావచ్చింది. తదుపరి అక్కడే స్పెషలైజేషన్ కూడా చేద్దామని ప్రవేశ పరీక్ష వ్రాసి జనరల్ మెడిసిన్ లో సీటు తెచ్చుకున్నాడు.

డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చేరే ముందర, సెలవలకి ఇంటి వస్తానన్నాడు.

ఇంటిల్లిపాదీ ఎదురు చూస్తున్నారు భార్గవ రాకకోసం.

ఆలోగా ఎవరూ ఊహించ సంఘటన ఒకటి జరిగింది!


ఒకనాడు రాజేంద్ర సహోద్యోగి, మిత్రుడూ మహేష్, ఫోన్ చేసి, భార్యతో కలిసి, వస్తానని చెప్పాడు.

“చాలా కాలం తరువాత ఇవాళ ఇతను ఎందుకువస్తున్నాడో?” కళ్యాణి సందేహపడింది.


“నేనే ఎప్పట్నించో రమ్మంటున్నాను. ఇప్పటికి అతనికి తీరుబడి అయిందేమోలే. అన్నట్లు అతను ఈ మధ్యన నెల రోజులు సెలవు పెట్టి లండన్ వెళ్ళాడు. మొన్ననే తిరిగి వచ్చాడు”


“లండనా! ఎందుకూ?”


“అతని చెల్లెలు ఉందని చెప్పాడే అప్పుడు ఒకసారి! ఆవిడ కూతురు పెళ్ళికని వెళ్ళాడు”


“మన అబ్బాయిని చూసి రమ్మనకపోయారా ఒక్కసారి?”


“ఛ ఛ అతనేదో పనిమిద వెళుతుంటే అలా ఎలా చెప్పగలను? అసలు వాళ్ళుండేది ఎక్కడో వీడి కాలేజీ ఎక్కడో కూడా తెలీదు. ఒకవేళ చెప్పాననుకో మొహమాటంకొద్దీ కాదనలేక పోవచ్చును. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు?”


“ఊ...నిజమే. భార్గవ ఎలా ఉన్నాడో ఏమిటో! ఈ మధ్యన మరీ గుర్తొస్తున్నాడు. చూడాలనిపిస్తోంది. ఏం చదువులో ఏమిటో బాబూ? ఎప్పుడు వాడి చదువు అయిపోతుందా ఎప్పుడు ఇక్కడికి వస్తాడాని ఎదురు చూస్తున్నాను”


“నాకూను. నాన్న మనవద్ద గుంభనగా ఉంటున్నా మనకంటే ఎక్కువగా బెంగపెట్టుకున్నారనే అనిపిస్తోంది.”


”అవునండీ నాకూ అదే అనిపిస్తోంది సుమా! కొంతలో కొంతనయం ఈ సెల్ ఫోన్ పుణ్యమాని వీడియో కాల్ లో అప్పుడప్పుడూ చూడగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము”


“నిజమే”


ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.

“మహేష్ అయ్యుంటాడు” తలుపు తీయడానికి లేచాడు రాజేంద్ర.


భార్యా సమేతంగా వచ్చిన స్నేహితుడిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు.

“నమస్తే అంకుల్ ఎలా ఉన్నారు?” రామయ్యని పలకరించాడు మహేష్.


“బాగానే ఉన్నాను బాబూ ఆ భగవంతుని దయవల్ల. మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తానూ” అని లోపలికి వెళ్ళారు.


కుశల పూర్వక సంభాషణ అనంతరం “ఇన్నాళ్ళకి మాపై దయకలిగింది” అన్నాడు రాజేంద్ర.

“నీకు తెలియనిదేముంది రాజూ మన ఆఫీసులో పని. ఉన్న ఒక్క ఆదివారం ఎక్కడికీ కదలకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అందులో మొన్ననే లండన్ తిరిగి వచ్చాము పైగా అక్కడ పెళ్ళి పనులతో అలసిపోయాము. దానికి తోడు ఆ జెట్ లాగ్ వదలడానికి రెండ్రోజులు పట్టిందనుకో”

“పెళ్ళి బాగా జరిగిందా? లండన్ అంతా చూసారా?”


“ఓ మహాచక్కగా. మా చెల్లెలు పెళ్ళై వెళ్ళాక ఒకసారి, తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. లండన్ చాలా మారిపోయింది”


“అవును ఇప్పుడు రోజు రోజుకీ ఓ కొత్త మార్పు మరి”


“అవును. అన్నట్లు ఒక విషయం చెప్దామని ప్రత్యేకంగా ఇవాళ వచ్చాము.”


“ఏమిటో?”


“అక్కడ మేము షాపింగ్ కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీ అబ్బాయి కనిపించాడు స్నేహితులతో”


“ఓ అవునా ఎలా ఉన్నాడు? నిన్ను చూసి గుర్తుపట్టాడా?” ఆత్రుతగా అడిగాడు.


“లేదు లేదు. ఏదో హడవిడిలో ఉన్నట్లున్నాడు...చేతులలో ఎవరో ఒక అమ్మాయిని ఎత్తుకుని గబగబా వెళిపోతుంటే చూసాను. ఆ అమ్మాయి కూడా భార్గవ మెడలో చేతులు వేసి హత్తుకుని ఉంది. నేను పలకరించేలోగానే అతడూ వెనకాలే మరో ఇద్దరు కూడా హడావిడిగా వెళ్ళిపోయారు”


“అవునా” మహేష్ చెప్పింది విని అవాక్కయ్యారు.


“అదే కదా! మీ అబ్బాయికి పెళ్ళయ్యిందన్న విషయం నువ్వు నాకు చెప్పలేదేమా అని అడుగుదామనీ దెబ్బలాడుదామనీ వచ్చాను” నవ్వేశాడు.


“అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు. వాడి పెళ్ళంటే అందరినీ పిలవనా ఏమిటీ?”


“ఓ! అలాగా అయితే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నడేమో?”


“ఏమో అయ్యుండచ్చు.”


“అంటే నీకేమీ తెలియదా”


“ఇప్పటివరకూ తెలియదు. అయినా అలాంటిదేమైనా ఉంటే మాకు కాకపోయినా వాళ్ళ తాతయ్యకైనా తప్పక చెప్తాడు. ఏం నాన్నా మీకేమైనా తెలుసా”


ఐదు నిమిషాల క్రితం వచ్చి కూర్చుని ఆ సంభాషణ అంతా మౌనంగా ఆలకిస్తున్న రామయ్య “లేదురా. అయినా వాడెవరినైనా ఇష్టపడుతున్నానని చెప్పాలేగానీ మనం కాదంటామా ఏమిటీ?”

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in

72 views0 comments
bottom of page