top of page
Writer's pictureA . Annapurna

విజ్ఞత



'Vijnatha' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

'మమ్మీ .....గుడికెళ్లి వస్తాను. తలుపువేసుకో ....అంటూ రజని అమ్మతో చెప్పి బయటకు వచ్చింది… ఒక సాయంత్రం.

పదినిముషాల తరువాత ఆఫీసునుంచి వచ్చిన మురళి టీతాగి, టీవీ చూస్తూ ''రజని ఏదీ ?” అన్నాడు.

''గుడికెళ్లిందండీ …” అంది రేవతి.

''దీనికి ఇప్పటినుంచీ ఈ భక్తి ఏమిటి? నిజంగా గుడికెళ్ళిందా...ఇంకెక్కడికైనా వెళ్లిందా?” అన్నాడు మురళి.

''అబ్బే! అలాచేయదండి.... గుడికే వెళ్లింది. ఈరోజు శుక్రవారం అని.!” చెప్పింది రేవతి.

మురళి మాటాడలేదు...ఆరోజు ఏదో ఆందోళనగా వున్నాడు అతను.

కానీ భర్త సందేహం గురించి ఆలోచించాల్సిందే...!. నాకెందుకు రాలేదు ఈ అనుమానం .. అనుకుంది మనసులో.

గంటతరువాత ఇంటికివచ్చిన రజనీని మురళి అడిగాడు....

''రజనీ! ఏదన్నా జాబుకి అప్లయి చేసావా... హయ్యర్ స్టడీస్ కి వెడతావా ?" అని.

''ఏమీ ఆలోచించలేదు డాడీ ..." అంది రజని.

''నీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు?"

''ఈమధ్య కలవలేదు....!”

''కలవక పోయినా ఫోనులో మాటాడుకుంటారుగా!”

రజని బదులు చెప్పలేదు.

''చూడు రజినీ ....నీకు దేవుడి భక్తి కంటే భవిష్యత్ ముఖ్యం. అనుక్షణం ఆలోచించాలి....బ్యాంకు ఉద్యోగాలకి అప్లై చేయి. కావాలంటే కోచింగ్ తీసుకో....టైం వేష్టు చేయకు. మైండ్ ఇట్.'' సీరియస్గా అన్నాడు.

మొదటిసారి తండ్రికి భయపడింది. కాస్త అభిమానంగా ఫీలయింది.

మౌనంగా డిన్నర్ చేసి తన రూములోకి వెళ్ళిపోయింది.

''ఏందుకండీ రజనితో అంత కఠినంగా మాటాడేరు....బాధపడినట్టుంది....” అంది రేవతి .

''రేవతీ ...కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి. తప్పదు. నీకు ఎంతసేపూ పూజలు, భక్తి తప్ప ఆడపిల్లను ఎలా కనిపెట్టి ఉండాలో పట్టదు. టీవీల్లో ఎన్ని దారుణాలు చూడలేదు? అది చెప్పేది ఎంతవరకు నిజమో ఆలోచించాలి. ఈరోజు మా కలీగ్ శంకర్ కూతురు పూజ గురించి బాడ్ న్యూస్ తెలిసింది. ‘ఫ్రెండ్తో మూవీకి వెడుతున్నా’ అని చెప్పి వెళ్ళిందిట రెండు రోజుల క్రితం.. ఇంటికి రాలేదు.

పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఒక హోటల్ రూములో డెడ్ బాడీ కనిపించిందిట. ఆఫీసులో సాయంత్రం తెలిసింది.

మేము వెళ్లి చూసి వచ్చాం.''

''అంటే రజని కి బాయ్ ఫ్రెండ్ వున్నాడంటారా? ఎప్పుడూ చెప్పలేదు.''

''అదే తెలుసుకో.....

ప్రతీ విషయం దేవుడిమీద భారం వేయకు. నువ్వు చేయాలసింది చేయి'' అన్నాడు.

రెండురోజుల తరువాత రజిని ఎప్పటిలా 'గుడికి వెడుతున్నా......’ అంటే రేవతి చెప్పింది.

''ఈ రోజు నేను కూడా వస్తాను పద …” అని.

రజని కంగారు పడింది....కానీ వద్దంటే అనుమానం వస్తుందని ఊరుకుంది.

గుడి ఒక ఫర్లాంగ్ దూరంలో వుంది వాళ్ళ ఇంటికి. ఇద్దరూ రోడ్ మీదకు రాగానే బైకుమీద ఒక యువకుడు వెంబడించాడు. అది గమనిన్చలేదు రేవతి.

గుడిలోకి వెళ్ళాక ''మమ్మీ నువ్వు ప్రదక్షణలు చేసిరా … ఈలోగా అరటిపళ్ళు, కొబ్బరికాయ తెస్తాను షాపుకెళ్లి …” అంది రజని.

''సరే” అని రేవతి వెళ్ళగానే రజని దగ్గిరకి వచ్చాడు బైక్ యువకుడు.

''నువ్వు రావద్దని మెస్సేజ్ పెట్టాను. ఈరోజు మా మమ్మీ నాతో వస్తోందని. నువ్వు వెళ్ళిపో. …” కంగారుగా చెప్పింది రజని .

'' ఫోను చార్జి లో పెట్టాను. తీసుకు రాలేదు. ఐనా వచ్చే వాడినే. నిన్ను చూడకుండా ఉండలేను రజ్జు'' ...అన్నాడతను.

''అబ్బా! ఇప్పుడు వెళ్ళు...రోజూ వీడియోలో చూస్తున్నావుగా....”

''ఆ చూడటం ఈ చూడటం ఒకటేనా...ఈ రోజు మీ ఇంటికి వస్తాను...మీ మమ్మీకి పరిచయం చేయి..”

''వద్దు...చంపేస్తారు మా డాడీ.....” అని వారిస్తున్నా వినకుండా రజనీని వాటేసుకున్నాడు.

అదే క్షణంలో రేవతి మసక చీకటిలో వాళ్ళను చూసింది.....చూడనట్టు నటించింది....కానీ గాభరా పడుతూ 'మురళి అనుమానం నిజమే ఏం చేయాలి ....’ అనుకుంది.

తల్లిని చూసి కంగారుగా అతడిని వదిలించుకుని వచ్చేసి..... “మమ్మీ ఇంటికి పోదాం. నాకు కడుపులో నొప్పిగా వుంది …” అంటూ ఆటో పిలిచింది...రజని.

ఇంటికి రాగానే రూములోకివెళ్ళి తలుపులు మూసుకుంది.

రేవతి ఊరుకుంది. మురళి వచ్చే టైం అయినదని.

వస్తూనే మురళి బ్యాంకు అప్లికేషన్స్ తీసి కాఫీ టేబుల్ మీద పెట్టి అన్నాడు …”రజనీని పిలు...రమ్మని”

''రజనికి కడుపు నొప్పిగా ఉంటే టాబ్లెట్స్ వేసుకుని రెస్టు తీసుకుంటోంది....మార్నింగ్ ఇద్దురుగాని…” అంది రేవతి,

అప్పటికి ఏదో చెప్పి తప్పించుకుంటూ.

కానీ రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూనేవుంది.

పిల్లలు కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకుంటారని పెద్ద వుద్యోగం చేయడమో, పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారనో లేదా విదేశాలకు వెళ్లి వున్నతమైన కెరీర్లో పేరు తెచ్చుకుంటారనో ఆశపడుతుంటారు అమ్మ నాన్నలు.

కొందరు తల్లితండ్రులు వారికి ఒక అవకాశం కల్పిస్తే, మరికొందరు ఎలాంటి అవగాహన లేక పోయినా స్నేహితుల ప్రభావం వల్లనో, ఎవరో ప్రముఖుల గురించి తెలుసుకునో.... తెలివితో బాగా స్థిరపడుతారు.

అటు ఇటు కాకుండా పోతారు మరి కొందరు.

ఇప్పుడు రజని సమస్య తెచ్చిపెట్టింది. అబ్బాయితో స్నేహం చేస్తోంది. అతడు ఎలాంటి వాడో తెలియదు.

పై పై మెరుగులు, తీయని కబుర్లు, నాలుగు సినిమా డైలాగులు చెప్పగానే వలలో పడిపోతారు. నువ్వు ఫలానా హీరోయిన్ లాగా అందంగా వున్నావు అంటే నిజమే అనుకుంటారు.

ఈ డేటింగ్ తో బాయి ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ వంటబట్టి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు.

అబ్బాయిలతో పరిచయాలు తప్పుకాదు. అవి మంచికి సోపానాలు అయితే అందరికీ సంతోషమే .

కానీ ఫన్ కోసమో, టైంపాస్ కోసమో, ఫ్యాషన్ కోసమో అయినప్పుడు ప్రమాదాలు తెస్తాయి.

ఒక అబ్బాయి అందంగా వున్నాడనో, బాగా పాటలు పాడుతాడనో… మరో ఆకర్షణలో చేసే స్నేహాలు ముప్పు తెస్తాయి.

ఈ విషయం అమ్మలు అందరూ వారి అమ్మాయిలకు చెప్పాలి. తిట్టి భయపెట్టి కట్టడి చేసి బంధించవద్దు.

అలాగే అబ్బాయిలకు స్నేహం ''విలువను'' గౌరవించమని చెప్పాలి. నెల రోజుల పరిచయం, మూడునెలల ప్రేమ, ఆరునెలలకు బేదాభిప్రాయాలు.. విడిపోవడాలు .... ఇవి స్నేహానికి నిర్వచనం కాదు.

చాలా ఆలోచించి వివేకంతో, పెద్దవాళ్ళ అండతో కొనసాగిస్తూ మంచి నిర్ణయం తీసుకోడంలోనే పటిష్టత ఉంటుంది. భద్రతా, ఒక గౌరవం ఉంటుంది.

మురళి ఆఫీసుకి వెళ్ళాక రజనితో మాటాడింది రేవతి.

''రజనీ నిన్న టెంపుల్ కి వచ్చిన అతను ఎవరు? ఎప్పటి నుంచీ పరిచయం? అంత చనువు ఎందుకు ఇచ్చావు? నువ్వు చాల దూరం వెళ్ళిపోయావు. తప్పు చేస్తున్నావు.''

''నువ్వు చూసావా మమ్మీ?” నేరం చేసినట్టు భయపడి అడిగింది.

''అవును. నాతో అబద్ధంచెప్పి అతడిని కలవడానికి వెడుతున్నావంటే....... నాకు చాలా బాధ కలిగింది .

మా ఇద్దరినీ మోసం చేస్తున్నావు..... స్వచ్ఛమైన స్నేహానికి చాటు మాటు ఉండదు. వుండకూడదు. మంచి స్నేహం అయితే ఇంటికి పిలిచి నాకు డాడీకి పరిచయం చేయాలి.... సరే! పెళ్లిచేసుకుంటావా? చదువుకుంటావా.. ఏ అభిప్రాయంతో అతడితో స్నేహం చేస్తున్నావు? ఇదైనా నిజం చెప్పు.''

''సారీ మమ్మీ.... ఇప్పుడు నిజం చెబుతాను. అతనిపేరు మదన్. నాకు సీనియర్. ఒట్టి ఫ్రెండ్ షిప్ మాత్రమే. మరో అభిప్రాయం లేదు అంది....” రజని.

''ఇంటికి రమ్మను....ఈసారి. బయట కలుసుకోడం డాడీకి ఇష్టం ఉండదు. తెలిస్తే కోపగిస్తారు '' అని వార్ణింగ్ ఇచ్చింది. కానీ .....

రజని అబద్ధం చెబుతోందని రేవతికి తెలుసు. ఆరోజు వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారు కనుక.

ఈరోజుల్లో ఈ పిల్లలతో చాల ఇబ్బందిగా వుంది. మందలిస్తే ఏ అఘాయిత్యం చేస్తారో అని ఊరుకుంటే మితిమీరిన స్నేహాలు మరో ప్రమాదానికి దారి తీస్తాయి. పెళ్లి చేద్దామంటే వుద్యోగం లేనిదే పెళ్లి అవ్వడంలేదు.

ఈవిషయం మురళికి తెలిసిందంటే కొంప మునుగుతుంది.

రజనీ బ్యాంకు జాబుకి అప్లికేషన్ పెట్టింది.

''అదొక్కటే నమ్మకం పెట్టుకోకు. IAS కోచింగ్ తీసుకో... నీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారో అడుగు....అన్నాడు మురళి.

అతడి పోరు పడలేక ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటోంది. బయటకు వెళితే డాడీతో లేదా మమ్మీ తోనే .

రజనికి ఫ్రెండ్స్ ఎక్కువలేరు. వున్నా ఇద్దరిలో ఒకరికి పెళ్లి ఐంది. మరో అమ్మాయి ఎం టెక్ చదువుతోంది.

రజని స్నానానికి వెళ్ళినపుడు ఫోన్ చెక్ చేసింది రేవతి.

అందులో మదన్కి పెట్టిన మెస్సేజ్ వుంది. 'మా మమ్మీ డాడీలు చదువుకోమంటున్నారు కోచింగ్ తీసుకుంటున్నాను.. నేనిక బయటికి రాను. నాతొ మాటాడాలంటే ఇంటికి రా..'.అని .

' వూరికి వెడుతున్నా! వచ్చాక కలుద్దాం. బాయ్ బాయ్ ' అని రిప్లై ఇచ్చాడు మదన్.

హమ్మయ్య వదిలింది గొడవ...వాడిక రాడులే.... అని సంతోషించింది రేవతి.

మదన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడంలేదు. మెస్సేజ్ లకు రిప్లై ఇవ్వడమూ లేదు.

రజనికి అర్థం ఐంది… అతను తప్పించుకుంటున్నాడని. వూరికివెళ్ళడం కూడా నిజంకాదని !

నేను మదన్ తో స్నేహం చేయడం సరికాదు. అతను నమ్మతగినవాడు కాదు..... మమ్మీ చెప్పినట్టు అది ఒక ఎట్రాక్షన్ . మంచిగా ఉండేవాడు . మంచివాడైతే మమ్మీడాడీలను పరిచయం చేసుకుని, వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళేవాడు. అతడిది టైం పాస్ స్నేహమే ! అతడి నంబర్ డిలీట్ చేసింది...ఇక మాటాడ కూడదని నిర్నయిన్చుకుంది.

ఇక నేను పట్టుదలగా చదువుతాను. అని నిశ్చయిన్చుకుంది.

ఆరోజునుంచీ మరో దృష్టి లేకుండా శ్రద్ధపెట్టింది.

బ్యాంకు జాబ్ కూడా వచ్చింది.

రేవతి, మురళి చాల సంతోషించారు.

తెలిసి తెలియని వయసులో పిల్లలు తప్పటడుగు వేస్తారు. వేయి కళ్ళతో కనిపెట్టుకుని వారిని దారికి తెచ్చుకోవాలి. మురళికి తెలియకుండా గండం గడిచింది. తెలిస్తే ఆవేశంతో ఏమిచేసే వాడో … పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ అనేది పరిమితిలో ఉండాలి. భయంతో కూడిన ప్రేమ ఉండాలి. ఏది అటు ఇటు ఐనా నష్టమే.

ఇక రజని గురించి ఎలాంటి భయము ఉండదు.

ఇక జీవిత బాగా స్వామిని తానే ఎంచుకోగలదు. జీవితాన్ని దిద్దుకోగలదు. ఒక సమయంలో నాలుగు రహదార్ల మధ్య నిలబడవలసి వస్తుంది.

ఏ దారి ఎంచుకోవాలో తెలియక అయోమయంగా ఉంటుంది.

సరైన దారి ఎన్నుకుంటే జీవితం సుఖమయ మవుతుంది.

ఆ ఎన్నుకున్నదారి మనిషి విజ్ఞతని తెలియ చేస్తుంది.

*******

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.






56 views0 comments

留言


bottom of page