'Manasunte Cheyagalam' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
మనసు మూగది మాటాడలేదు దానికి భాషలేదు కానీ ....
మాటలతో చెప్పలేని భావాలూ చూపులతో వ్యక్తీకరించవచ్చు
మాటలురాని పసిబిడ్డ ఎలా తన ఇష్టాన్ని కష్టాన్ని చెబుతాడో ..
మాటలేని మూగ జీవాలు కూడా చేష్టల ద్వారా తెలియ జేస్తాయి.
మాటవున్నమనిషి కళ్ళువున్నమనిషి భాషాభిమానం అంటూ ...
మనిషికి మనిషికీ మధ్య తేడాలు సృష్ష్టిస్తాడు వినోదంగా చూస్తాడు.
ఒక్కభాషను నేర్చితే కష్టం ఆ ప్రాంతానికే పరిమితం అవుతారు...
కనీసం నాలుగు భాషలు వస్తే ఎక్కడైనా ఉపయోగ పడుతాయి.
భాషాభిమానం బ్రతుకు తెరువు చూపదు కడుపు నింపదు...
గతకాలంలో అవసరం లేకపోయిన్ది ఇప్పుడు ఆ అవకాశం లేదు.
కాలంమారినా ఆలోచనలు మార్చుకోని పాతతరం చాదస్తం విసిగిస్తుంది...
అనుభవాలతో కొత్త ఆలోచనతో నేటితరానికి ప్రతీకలు అవుతారు కొందరు .
వయసుతో పనిలేదు ఆలోచనతోనే అభివృద్ధి జరుగుతుంది....
నిరంతరం ఏదో పని కల్పించుకునేవారికి కొత్త ఆలోచనలు వస్తాయి.
అందుకే కాలాన్ని వృధా చేయవద్దు తోచదు అనే మాట చెడ్డది..
తీరిక లేకపోవడం శారీరకశ్రమ ఆరోగ్యానికి మంచి ఔషధం.
పని -వ్యాపకం కల్పించు కోడానికి డిగ్రీలు అవసరంలేదు...
మన ఆలోచనలకు మనలోని ఇష్టానికి ప్రతి రూపమే వ్యాపకం.
నిరంతరం చదువుతూ నేర్చుకుంటూ ఉండటమే గొప్పతనం...
నలుగురితో కలిసి సమాజానికి ఉపయోగపడటమే లక్ష్యం కావాలి.
ఇప్పుడు ఎన్నో అవకాశాలు వున్నాయి అందుకుని పోదామని ఆలోచన చేయాలి ..
బద్ధకం వదిలి వయసు మరిచి ఎదో చేయాలనే తపన పెంచుకోవాలి అదే ఆనందంఇస్తుంది.
******
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments