'Dabbuthone Sneham' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
క్రోమ్ బుక్ లో కొత్తగా వచ్చిన మెయిల్ చూసి కుతూహలంగా చదివింది రేవతి .
''హలొ రేవతి ఎలావున్నావ్ ? ఈమధ్య నీ గురించి తెలిసింది. పత్రికలో నీ వ్యాసం ద్వారా చాలా సంతోషం వేసింది. మనం చాలా మాటాడుకుందాం. వీలుకుదిరితే రిప్లై ఇవ్వు . పంకజ.... అదీ మెయిల్.
ఇన్నేళ్లకి పంకజ నుంచి వచ్చిన ఆ కబురు ఆశ్చర్యం అనిపించింది రేవతికి.
వైజాగ్ లో పంకజ వాళ్ళఇంట్లో అద్దెకు ఉండేవారు రేవతి నాన్నగారు. ఇద్దరికీ ఆరేళ్ళు వయసు తేడా వున్నా స్నేహం కలిసింది. కలిసి సినిమాలు చూడటం షాపింగ్ మార్కెట్లకు వెళ్లడం పత్రికలు చదవడం….అలా .
ఆస్నేహం ఇద్దరి పెళ్లిళ్లు అయ్యేవరకూ కొనసాగినా రేవతి నాన్నగారు వేరే వూరికి మారేక దూరమైంది. పంకజ భర్త గుజరాత్లో వుద్యోగం చేసేవాడు.అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకుని ఫోన్లు చేసుకున్నా తరువాత ఆగిపోయాయి.
ఎవరి ఉద్యోగాలు సంసారం పిల్లలు బాధ్యతల్లో వాళ్ళు దూరం అయ్యారు.
రేవతి హైదరాబాదు లో ఉంటే పంకజ గుజరాత్ లోనే వుండిపొయిన్ది. అక్కడ ఒక స్కూల్ పెట్టిందని, బాగా పేరు తెచ్చుకుందని వాళ్ళ తమ్ముడు రాకేష్ అప్పుడప్పుడు చెప్పే కబుర్లు తప్ప మళ్ళీ కలుసుకోలేదు.
రేవతి, పిల్లలు వున్నత విద్యకు విదేశాలకు వెళ్ళాక ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది .చదువుకునే రోజుల్లో
రచనలు చేయడం మొదలుపెట్టి కొనసాగిస్తూంది.
ఆలా 25 ఏళ్లుగా వ్యాసాలు రాయడం అలవాటు. వాటిని చదివే పంకజ మెస్సేజ్ పంపింది.
''పంకజ...నీ మెయిల్ చదివాను. నువ్వు ఎక్కడో గుజరాత్లో నేను తెలంగాణలో ఉండిపోవడం వలన
మనం దూరం అయ్యాము. రాకేష్ నీ కబుర్లు చెపుతూనే వున్నాడు. నీ కొడుకులు అమెరికాలో వున్నారని
నువ్వు స్కూల్ రన్ చేస్తున్నావని భావి భారత పౌరులను తీర్చి దిద్దే మహా క్రతువు చేస్తున్నావని విన్నాను.
మనకి ఇప్పుడు ''మనకి నచ్చిన వ్యాపకంతో కాలం గడిపే అవకాశం వచ్చింది. నేను ఒక ఆర్గనైజేషన్ లో
పనిచేస్తున్నాను. నాకు చాలా నచ్చింది. నీ స్కూల్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుతున్నాను.
నువ్వు, రాకేష్ ఇంటికి వస్తే కలుద్దాం'' అంటూ బదులిచ్చింది రేవతి.
''నీ జవాబు చదివాకా సంతోషం కలిగింది. రాకేష్ కి, నాకూ మాటలు లేవు. నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు.నీకు గుర్తు వుందా...అమ్మ, తమ్ముడు, నేను ఉండేవాళ్ళం. మీ నాన్నగారు మా ఇంటినుంచి వెళ్లి పోయాక ఆఇంట్లోకి వచ్చిన వారి అమ్మయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాకేష్. అమ్మ చనిపోతే నాలుగు రోజులకి కబురు చేసాడు. అమ్మ గోల్డ్ మొత్తం తీసుకున్నాడు.
మా ఇల్లు పెద్ద మేడకదా! అది నాకు చెప్పకుండానే అమ్మి ఎదో కొంత... చాలా తక్కువ మనీ ఇచ్చాడు.
మా వారు చాలా మెత్తటి మనిషి.. ఎందుకులే వాడితో గొడవపడటం .. అంటూ వూరుకున్నారు.
వాడిమొహం చూడను '' అంటూ మళ్ళీ లెటర్ పెట్టింది.
''ఉన్నదేమో ఇద్దరు. వాళ్ళు సఖ్యముగా లేరు. ఇదెక్కడి కుటుంబం ? బంధం లేదు, అనుబంధం లేదు.
డబ్బుతోనే కలిసి, డబ్బుతోనే విడిపోతున్నారు. అదీ అన్నతమ్ములు, అక్క చెల్లెలు అనే రక్త సంబంధమే పోయింది '' అన్నాడు రేవతి భర్త అమరేంద్ర, రాకేష్ గురించి విని.
కొన్నాళ్ళు గడిచాక పంకజ ఫోను చేసింది.
''రేవతీ! నీ ఆర్టికల్స్ చాలా బాగుంటున్నాయి. ఎన్ని రాసావు? పత్రికలవాళ్ళు ఎంత ఇస్తారు?” అని అడుగుతూ..!
రేవతి ఆశ్చర్య పడింది.ఇంతవరకూ అమరేంద్ర ఆవిషయం అడగలేదు. అలాంటిది పంకజ ఎందుకు
అడుగుతోంది..... అని.
''ఎదో ఇస్తారు.. పత్రిక స్థాయిని బట్టి. ఇప్పుడు అంతా ఆన్లైనే. నేను పట్టించుకోను. నా ఆలోచన
పాఠకుల్లోకి వెళ్లడమే ముఖ్యము అనుకుంటాను . ఆ మనీ నేను పనిచేసే సంస్థకు ఇస్తాను ఫండ్స్ గ . 150 వరకూ ఉండచ్చు ''అంది రేవతి.
''150 + 500 అన్నమాట. ....సుమారుగా. అదే ఇంగ్లీషులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తారు.
నీకు తెలిసే ఉంటుంది. రాయకూడదూ? అంది.
''ఇంగిలీషులోనా ? నాకు అంత ప్రావీణ్యం లేదు.'' నిజాయితీగా చెప్పింది రేవతి.
''ఓసి పిచ్చి మొద్దూ ! రైటర్స్ అంతా ప్రావీణ్యం వున్నవాళ్ళేమీకాదు. వాళ్ళు కూడా వేరేవాళ్ళ చేతనే రాయిస్తారు. నీకో సలహా చెబుతాను విను .
నాకు ఇంగ్లిష్ బాగావచ్చు. నా స్కూల్ ఇంగ్లిష్ మీడియం. ఇప్పుడా స్కూల్ సేల్ చేసి వైజాగ్ వచ్చేసాను. నేను నీ తెలుగు వ్యాసాన్ని ఇంగ్లిష్ లో రాసి ఇస్తాను. ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందాం. సరేనా? ఆలోచించు. ''అంటూ పంకజ ఫోను పెట్టేసింది.
రేవతి నోటివెంట మాట రాలేదు..... పంకజ ప్లాను ఏమిటో, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు మళ్ళీ మాటలు కలిపిందో అర్థమైంది.
తమ్ముడితో గొడవలు ఎందుకు, ఎవరివలన వచ్చాయో కూడా అర్థమైంది.
పంకజ భర్త చీఫ్ ఇంజనీరుగా రిటైర్ అయ్యాడు. ఆయనకి పెంక్షనే లక్ష రూపాయలు వస్తుంది.
వైజాగులో బీచ్ వొడ్డున పెద్ద బంగాళా వుంది. హాయిగా ఉండచ్చు.
ఇద్దరు కొడుకులూ అమెరికాలో డాక్టర్లు. వాళ్లకి పంకజ ఆస్తి అంటూ ఇవ్వాల్సిన పనేలేదు.
ఎందుకు ఇంకా ఈ డబ్బుమీద వ్యామోహం?
“నాకు సిగ్గుగా అనిపించింది, పంకజ నాకు స్నేహితురాలు అని చెప్పుకోవాలి అంటే !” అంది అమరేంద్రతో..
''కొందరు అంతే! డబ్బు.. డబ్బు.. అని కలవరిస్తూనేవుంటారు. వున్నది అనుభవించరు. ఇంకా కూడా బెట్టాలి అనే ఆశ. ఏం చేస్తాం? వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది.'' అన్నాడు అమరేంద్ర.
******
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments