top of page
Writer's pictureA . Annapurna

ఎందుకు ఈ కలరవము


'Enduku Eee Kalaravamu' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

ఏకాంతములో నీ తలపులు కలరవములు రేపగా మనసు చెదిరిపోయే

చల్లని గాలులు నాలో తాపము రేపగా తోడుకోరి తనువు అలమటించిపోయే


వెన్నెలరాత్రులు వృధాగా గడిచి పోతుంటే వయసు కలవరపెడుతోంది

వలపుల ఊయలలో ఊగుతున్న మనసుకి ఊరట కలిగించు

దారి తోచకున్నది .


నీవు దూరదేశమేగినా నా మనసంతా నీతోనే వున్నది నిను వీడనన్నది

రోజులు గడవకున్నవి కంటికి నిదురే రాకున్నది నీపై నుంచి మనసు మరల కున్నది


ఇదేమివింత తెలియని కలవరింత నిన్నుచేరు దారి తెలియకున్నది

రెక్కలు కట్టుకుని గాలిలో ఎగిరి రానా నీలిమేఘముపై తేలి నీ చెంతకు చేరనా


చిరుజల్లునై నీమీదకురియనా మెరుపు తీగనై నిన్ను అల్లుకోనా

ఇంద్ర ధనుసు చాపమై నీ ముంగిటకు చేరుకోనా తెలిమంచు బిందువుగా మారిపోనా


ప్రేమావేశముతో నీ పెదవి మీద చెరిగిపోని ముద్ర వేసి నీలో కరిగిపోదును

విడదీయరాని బంధముతో బందీగా చేసి నీ రుదయ మందిరాన నిల్చి పోదును


నీప్రేమ మధురం నీతలపు మధురం నీచెంతచేరాలని నామనసు పడుతున్నది ఆత్రం

ఓ ప్రియతమా మనలను కలిపినస్నేహమా కలకాలం నిలవాలి ఈ బంధము


అల్లంత దూరాన వెలుగుతున్న ఆశాదీపాలు రారమ్మని పిలుస్తున్నవి

నిదురరానికళ్ళు వెలవెల బోతున్నవి అలికిడివిన్నంతనే నీవేమో అని వెదుకుతున్నవి


నిలిచిపోయే ఈరేయి నీవులేక తారా చంద్రులులేక గాలిలేక విరులులేక

ఈవనమెల్ల చిన్నబోయే తుమ్మెదల ఝున్కారములేక కోయిల పాటలేక


ఎదురుచూస్తున్నాయి నీరాకకోసం నీ పద సవ్వడులకోసం

మన జంట నడయాడు రోజులకోసం ఆమని రుతువు రాకకోసం.


***శుభం ***

గమనిక : కలరవము అనేది అచ్చు తప్పు కాదని, ఒక పద ప్రయోగమని మనవి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.










62 views0 comments

Comments


bottom of page