top of page

వీ లిసన్ యూ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link


'We Listen to You' written by N. Dhanalakshmi

రచన: N. ధనలక్ష్మి

“అదేంటి! సార్ నేను అన్ని రౌండ్స్ లో క్వాలిఫై అయ్యానుగా... మరెందుకు నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అంటున్నారు…?”

“సారీ .... మా కంపెనీ లో పని చేయాలంటే అనుభవం ఉండాలి… పైగా నీకున్న అర్హతకి ఈ పోస్ట్ కరెక్ట్ కాదులే. ఇంకో చోట ప్రయత్నించు....”

“బెటర్ లక్ నెక్స్ట్ టైం.....”

“రేయ్! ఇంకా ఎన్ని రోజులు మాపై పడి తింటావు రా... నీ వయసు పిల్లలు రెండు చేతులా సంపాదిస్తూ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ, పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో పచ్చగా ఉంటే నువ్వేమో ఇంకా పది రూపాయలకు కూడా మా వద్ద చేయి చాపుతున్నావు.. సిగ్గుగా లేదు రా? దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో నీ లాంటి బిడ్డ పుట్టాడు..”

“నీ కోసం నేను ఆగినా మా వాళ్ళు ఆగేలా లేరు.. వారిని కాదనుకొని నీతో రాలేను… అయినా వచ్చినా ఏమి పెట్టి పోషిస్తావు? నిన్ను నువ్వే చూసుకోవడమే భారంగా ఉంటే... ఇంకా నన్ను ఏమి చూసుకుంటావని? సో.. ఈ క్షణం నుంచి నీతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుంటున్నా. లెట్స్ బ్రేక్ అప్ అండ్ మూవ్ ఆన్..”

“రేయ్ మామా! ప్రతి క్షణం నీతో మేము ఉండాలంటే ఎలా రా? మాకు పనులు ఉంటాయి....”

“రేయ్! ఎన్ని సార్లు డిమ్మికిలు పడతావు రా...నీకు అలుపు సొలుపు అన్నది రాదా ఏంటి? సర్లే.. ఎన్నో అనుకుంటాము అన్నీ అవుతాయా!?? మా కిరాణా కొట్టులో లెక్కలు రాయి.. ఇలా అయినా నువ్వు చదివిన చదువుకి న్యాయం చేయి…”

‘ఇలాంటి మాటలని విని చాలా విసిగిపోయాను... మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోయాను...


కష్టపడి అన్నీ రౌండ్స్ క్లియర్ చేస్తే రిజర్వేషన్, అనుభవం లేదంటూ జాబ్ ఇవ్వరు.

ప్రతి ఒక్కరూ నాతో ఆడుకునేవారే.... అటు తల్లితండ్రికి నేను భారమే, ఇటు నాతోనే జీవితం అనుకున్న అమ్మాయికి నేనో ఆప్షన్.. ఇరుగు పొరుగు వారికి నేనో జోకర్.....అన్నీ పంచుకునే ఫ్రెండ్సేమో వారి జీవితాల్లో బిజీ… ఇంకా నేను ఎందుకు బ్రతకాలి… బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి..

చస్తే ఏ బాధ ఉండదు’ అనుకొని హోటల్ కి వెళ్ళాడు అశ్విన్....

ఇంటర్వ్యూ టెన్షన్ తో సరిగ్గా తినలేదని చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ఫుల్ గా తిని… ఇష్టమైన బ్లాక్ కరెంట్ ఐస్ క్రీం తినేసి.... దగ్గరలో ఉన్న షాప్ లో పాయిజన్ తీసుకొని బైక్ లో ఊరి చివరకి వచ్చేశాడు...

ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకొని తనని తాను చూసుకుంటూ ‘ఎంత అందంగా ఉన్నావు రా అయ్య! కానీ ఏమి లాభం.. కొద్దీ క్షణంలో పైకి వెళ్ళి యముడికి షేక్ హ్యాండ్ ఇస్తావు..’ అనుకున్నాడు.

చివరి సారిగా...

తన ఫోన్లో పేరెంట్స్, ఫ్రెండ్స్, లవర్ తో ఉన్న ఫోటోలని చూసి వారితో ఉన్న జ్ఞాపకాలను తలచుకొంటూ విషాన్ని తన వెంటే తెచ్చుకున్న జ్యూస్ లో కలిపి నోటి వద్దకు తీసుకొనివచ్చాడు..

ఇంతలో తనకి ఫోన్ కాల్ వచ్చింది...

కట్ చేసి సిద్ధంగా ఉన్న విషం కలిపిన జ్యూస్ ను చేతిలోకి తీసుకొని తాగేంతలొ మళ్ళీ ఫోన్ రింగ్ అయింది... 'వీడు ఎవరో గాని నా చేతిలో చచ్చాడే..' అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు అశ్విన్...

" నమస్తే సర్...నా పేరు సూర్య. నేను 'వీ లిసన్ యూ' గ్రూప్ నుండి ఫోన్ చేస్తున్నా సర్....”

“అయితే ఏంటి రా? వింటారా.. ఏమి వింటారు... చెత్త గ్రూపులు మీరూను!?? పెట్టేయ్ ఫోన్” అని అశ్విన్ ఫోన్ కట్ చేస్తుంటే....

“హలో సర్… దయచేసి కోపం తెచ్చుకోకండి.. మీతో మాట్లాడానికి నాకు ఒక 15 నిమిషాలు సమయం ఇవ్వగలరా!????” అన్నాడు అవతలి వ్యక్తి.

“ఏంట్రా ఇచ్చేది...!?? ఇలా అడిగి మెత్తగా మాట్లాడి, నా దగ్గర డబ్బులు కొట్టేయాలని మీ ఎదవ ప్లాన్స్ కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఏమి లేవు… అయినా నా నంబర్ ఎవరు ఇచ్చారు రా మీకు!??” అడిగాడు అశ్విన్.

“సార్! మీరే ఇచ్చారు… ఫేస్ బుక్ లో ఉన్న ‘వీ లిసన్ యూ ‘ గ్రూపులో జాయిన్ అయ్యారు.. అక్కడే మీరు రిజిస్టర్ చేసుకున్నారు” చెప్పాడు సూర్య

‘ఓ.. నేనే ఇచ్చి చచ్చానా !?? బోర్ కొట్టి ఎఫ్ బీ లో కనపడిన గ్రూప్ లో నంబర్స్ ఇస్తే ఇలాగే ఉంటుంది’ అని తనని తాను తిట్టుకుంటూ తల కొట్టుకున్నాడు...

“అవునూ.. మీ టీమ్ ఏమి చేస్తుంది.. ఎంత మంది ఉన్నారు ఏంటి!” అంటాడు అశ్విన్ కొంచం వెటకారంగా…

“మేము మొత్తం పది మంది ఫ్రెండ్స్ కలిపి ఈ గ్రూప్ మొదలు పెట్టాము సర్.. ప్రతి శనివారం, ఆదివారం మా టీమ్ వారు గ్రూపు లో ఉండేవారికి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడతాము.. అవసరాన్ని బట్టి సమయాన్ని పెంచుతాము.. ఇంకో ముఖ్య విషయం మీరు మాతో మాట్లాడడానికి డబ్బు ఏమీ కట్టే అవసరం లేదు..

ఒంటరిగా, నిరాశలో, జీవితం మీద విరక్తి, ఏవైనా తప్పులు చేసి ఉండి తమ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక సతమతం అయ్యే వారికోసం మేము ‘వీ లిసన్ యూ’ మొదలు పెట్టాము.. మొదట ఇందులో ముగ్గురం ఉండేవారం.. తరువాత మా వర్క్ నచ్చి మరికొంతమంది జాయిన్ అయ్యారు… వారి ప్రతి ఎమోషన్ మాతో పంచుకుంటున్నారు.. మేమేదో చేసేస్తాము అని కాదు.. మాకు తెలిసిన పరిధిలో చెప్తాము.. ఒకేలా పరిష్కారం చెప్పలేనివి అయితే వింటాము.. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు కదా మన బాధను నలుగురితో పంచుకోవడం వల్ల సగం తగ్గుతుందని.. మా టీమ్ ముఖ్య ఉద్దేశ్యం ఇదే సర్…”

అశ్విన్ కోపం కొంచం తగ్గింది… “చూడండి సూర్య గారు! ఇలా రెస్పెక్ట్ ఇవ్వడం నాకు రాదు...పైగా ఇంతసేపు నా తిట్లు విన్నావు, నా కోపాన్ని భరించావు… నిన్ను నా ఫ్రెండ్ గా భావిస్తూ చెప్తున్నా. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణమే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నా…” అన్నాడు.

“ఎందువల్ల అశ్విన్? ఏమైంది!”

" రేయ్ ! మామ..ఏంటో ! ఈ వెదవ జీవితం నాకు ఎప్పుడు షాక్స్ మీద షాక్స్ ఇస్తు ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదివేవాడిని. పోలీస్ అవ్వాలి అన్నది నా లక్ష్యం.. కానీ అమ్మ, నాన్న ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్ చదివించారు...ఇష్టం లేకపోయినా కూడా బాగానే చదువుకున్నాను.. డాన్స్ చాలా బాగా చేస్తాను. ఒక షో లో పాల్గొనే అవకాశం వచ్చినా వెళ్ళలేకపోయాను…

ఉదోగ్య ప్రయత్నాలు మొదలు పెట్టాను… వెళ్ళిన ప్రతి చోట చేదు అనుభవమే.. కొన్ని చోట్ల రికమండేషన్ కారణం అయితే ఇంకొన్ని చోట్ల అనుభవం కారణం అవుతుంది.. అసలు జాబ్ ఇస్తానే కదా అనుభవం వచ్చేది, తెలిసేది… ఈ రోజు నాకు జాబ్ కన్ఫర్మ్ అనుకుంటే అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది.. ఇది నా 24వ ఇంటర్వ్యూ..

అమ్మ, నాన్నకి నేను అక్కర్లేదు.. ఇన్నాళ్ళు నువ్వు, నీ ప్రేమ ఉంటే చాలు అన్న సిరికి కూడా నేను లోకువే అయిపోయాను… పూర్తిగా నన్ను అవాయిడ్ చేస్తుంది. నన్ను అందరూ జోకర్ లా చూస్తున్నారు రా! జాబ్ లేకపోతే.

నాకు చచ్చిపోవలని అనిపిస్తుంది రా.. నేనంటే ఎవరికి ఇష్టం లేకుండా పోయింది..” బాధగా చెప్పాడు అశ్విన్

“అశ్విన్! మీరు నన్ను ఫ్రెండ్ గా భావించి మీ బాధను షేర్ చేసుకున్నారు...

మా నాన్న గారు చెప్పిన ఒకరి స్టోరీని చెప్తాను విను.. ఇది విన్నాక నీ నిర్ణయం ఏంటో చెప్పు.....

" ఏడాది వయసులో నాన్న తనని, అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అమ్మ నాటకాలలో నటించేవారు. అప్పుడప్పుడు స్టేజ్ షోలు ఇస్తు ఉండేవారు.. తనకు మూడేళ్లు ఉన్నప్పుడు అమ్మ గొంతుకు ప్రాబ్లెమ్ వచ్చింది.. నాటి నుండి వాళ్ళమ్మకు మాట లేకుండా పోయింది.. నెలకు ఒక్కసారి ఇల్లు మారుతూ ఉండేవారు. ఎందుకంటే అద్దె కట్టడానికి వాళ్ల దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఎన్నో రోజులు పార్క్ లో నిద్ర పోయేవారు.

తనకి తొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళమ్మ మతిస్థిమితం కోల్పోయి హాస్పిటల్ పాలయింది..

ఆనాటి నుంచి ఒంటరివాడు అయ్యారు.

చెప్పులు కుట్టేవారు. న్యూస్ పేపర్ లు వేస్తూ, ఆఫీస్ బాయ్ గా ఇలా రకరకాల పనులు చేస్తూ ఒంటరి జీవితాన్ని అనుభవించసాగారు.. ఎన్నో రోజులు పస్తులు కూడా ఉండేవారు…

తన పని చేస్తూ అక్కడున్న వారి మాట తీరును గమనించి మిమిక్రీ చేసేవారు..14 ఏళ్ల అప్పుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది..

మాట్లాడకుండా నవ్వించడం అనేది ఎంతటి కష్టం .. అలాంటి పాత్రలను అలవోకగా చేసేవారు.... ఎంతటి కష్టంలో ఉన్న వారైనా ఆయన నటనను చూడగానే నవ్వు వచ్చేస్తుంది. తన హావభావాలతో, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు..

ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ బాధపడుతూ కూర్చోలేదు... తన ఒంటరితనాన్ని ఆయుధంగా చేసుకొని, ప్రపంచం మొత్తం మెచ్చే నచ్చే హాస్యనటుడు కాగలిగారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన ఎవరో కాదు. ‘చార్లీ చాప్లిన్.

చిన్న తనంలోనే ఎన్నో అనుభవించారు...

అయినా ఎప్పుడు కృంగి పోలేదు...తనని తాను నమ్మారు, ఇష్టపడ్డారు.. ఎవరో మనకి ప్రేమను పంచాలి అని ఎందుకు అశ పడాలి అనుకున్నాడు… అందుకేగా ఇప్పుడు మనందరి అభిమానం పొందారు, అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు..

మన జీవితంలో ఎదురుపడే ప్రతి ఒకరిలో మనకు తెలియని చార్లీ చాప్లిన్ ఉంటారు తెలుసా! లోపల విషాన్ని దాచుకున్న శివుడు లాగ… గుండెల్లో మంటలు చెలరేగుతున్నా, ఎన్నో కష్టాలు ఉన్నా సరే, పెదాలపై చిరునవ్వు విడిచి పెట్టకుండా నవ్విస్తూ నవ్వుతూ ముందుకు సాగే వాళ్ళు ఎందరో తారసపడుతుంటారు..

ఎవరి దాకా ఎందుకు.. నన్నే తీసుకో!... నేను కూడా నీలాగే ఎంతో కష్టపడి, ఇష్టపడి పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేశా.. చివరిలో ఏక్సిడెంట్ అయి రెండు కాళ్ళు కోల్పోయాను .. మొదట బాధ పడ్డాను.. ఇప్పుడు ఆ జాబ్ కోసం ప్రిపేర్ ఆయ్యేవారి కోసం ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని ఉన్నా.. లోపల ఎంత బాధ ఉన్నా, నా వారికోసం పెదాలపై ఎప్పుడు చిరునవ్వు వీడలేదు....

రిజిస్టర్ చేసుకునేటప్పుడు మా గ్రూప్ లో నువ్వు ఫిల్ చేసిన ఫార్మ్ ద్వారా నీకు హ్యారీ పోటర్ స్టోరీస్ చదవడం అంటే ఇష్టం అని తెలిసింది.. ఆ సీరీస్ రాసిన j.k రౌలింగ్, అందరం అభిమానించే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక్కప్పుడు రిజెక్షన్ ఎదురుకొన్న వారే… ఇప్పుడు చూడు.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడి ఉన్నారు వారు..

అశ్విన్! నీకు జాబ్ దొరికే వరకు ట్యూషన్ చెప్పు. నీకు డాన్స్ బాగా వచ్చు అన్నావుగా.. ఏదైనా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లో పార్ట్ టైం డాన్స్ మాస్టర్ గా జాయిన్ అవ్వు.. కొంచం ఓపికగా ప్రయత్నించు. లైఫ్ లో తప్పకుండా సక్సెస్ అయి తీరుతావు మిత్రమా...... ఏమి అంటావు!?” చెప్పడం పూర్తి చేసాడు సూర్య.

ఎటువంటి సమాధానం రావడం లేదు....

“హలో అశ్విన్...!? హలో హలో......

హలో అశ్విన్..... హలో....”

“హా సూర్య! లైన్ లోనే ఉన్నాను.. నువ్వు చెప్పిన వారి గురించే ఆలోచిస్తున్నా… నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే… వాళ్ళు పడ్డ కష్టాలతో, అనుభవించిన బాధలతో పోల్చుకుంటే నాది కష్టమే కాదు అనిపిస్తుంది.. నిన్ను ఓ మాట అడగవచ్చా?”

“అడుగు అశ్విన్…”

“కాళ్ళు పోయాయి. పైగా నీ ఆశయం కూడా చెల్లాచెదురు అయింది కదా. అయినా కూడా ఇంత

సింపుల్ గా తీసుకొని ఎలా ఉన్నావు? నీకు ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది..?”

సూర్య నవ్వుతూ....

“జీవితం పట్ల ఆశ అశ్విన్...

ఆ ఆశే శ్వాసగా జీవిస్తున్నా.

నా వారి పట్ల నాకున్న బాధ్యత నన్నే బ్రతికేలా చేస్తోంది… రేపు అన్న రోజున జీవితం బాగుంటుంది అనే నమ్మకం నాలో ధైర్యాన్ని నింపింది.....

ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉన్నప్పుడు...

ఎవరివో ఏడుపులు వినపడ్డాయి. హాస్పిటల్ అన్నాక ఇవ్వన్నీ కామన్ కదా అనుకున్నా. కానీ వారి మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి..

ప్రేమలో ఓడిపోయి ఆ బాధను స్నేహితులతో పంచుకుంటే ఎగతాళి చేస్తారు ఏమోని, ఇంట్లో చెప్పితే ఏమంటారోనని, ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది ఓ అమ్మాయి.. ప్రాణమైన కూతురు చనిపోవడంతో తండ్రి అక్కడికక్కడే చనిపోయారు.. ఒకేసారి భర్తను, బిడ్డను కోల్పోయిన ఆ తల్లి బాధ, వేదన వర్ణనాతీతం. ఎవరు మాత్రము తగ్గించగలరు...

ఆ అమ్మాయిలా ఇంకొకరు ప్రాణాలను తీసుకోకూడదు. ఎవరైనా తమ బాధను చెప్పితే ఓపికగా వినేవారు ఉండాలి. అది కూడా

ఒకరిని ఒకరు చూసుకోకుండా అవసరమైతే సలహాలిచ్చేలా ఒక గ్రూపు ఉంటే బాగుండు అన్న ఆలోచన ఈ వీ లిసన్ యూ...

నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ తోడుగా నిలిచారు.. మా ప్రయత్నం ఫలించి ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్నారు.. ఆ విధంగా నీకు కాల్ చేశాను.”చెప్పడం ముగించాడు సూర్య.

“వావ్ సూర్య! కాళ్ళు కోల్పోయాను అని ఏడుస్తూ కూర్చోకుండా నీ వారి కోసం బ్రతుకుతూ, పక్కవారి బాధను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్న నీకు సెల్యూట్...

నువ్వు చెప్పిన ప్రతి మాట నాలో స్ఫూర్తిని నింపుతూ జీవితం పట్ల ఆశను పెంచింది… ఇంకెప్పుడూ ‘చస్తాను’ అన్నమాట అనను కాక అనను… గెలిచే దాకా పోరాడుతూనే ఉంటాను. వెనుకంజ వేయను కాక వేయను ఎన్నటికీ.. అలాగే మీ గ్రూపులో నా నంబర్ కూడా ఆడ్ చేయి. ఇకపై నేను కూడా మీ గ్రూప్ తరపున ఎదుటివారి మాటలని వింటాను…” అన్నాడు అశ్విన్.

సూర్య ఆనందంగా నవ్వుతూ “తప్పకుండా ఇకపై నువ్వు కూడా మా గ్రూప్ తరపున వాలంటీర్ గా ఉంటావు అశ్విన్...అల్ది బెస్ట్” అన్నాడు.

“థాంక్స్ యూ అండ్ బై” చెప్పేసి బైక్ పై తన జీవిత గమ్యాన్ని మొదలు పెట్టాడు అశ్విన్..

కొంచం దూరం వెళ్ళాక ఎవరో తాతయ్య అందరినీ లిఫ్ట్ అడుగుతున్నా ఎవరూ అపడం లేదు. ఇది గమనించిన అశ్విన్ ఆ తాతయ్య దగ్గరకి వచ్చి బైక్ ఎక్కమన్నారు..... వివరాలను తెలుసుకొని బైక్ ను ఆటు వైపు పోనిచ్చాడు...

క్షణాల క్రితం చస్తానన్న నేనేనా ఇప్పుడు ఇంకొకరికి సాయం చేస్తున్నా.. ఫస్ట్ అమ్మ దగ్గరకి వెళ్ళాలి.

నాన్న కోపానికి, నా పంతానికి మధ్య నలిగిపోతూ ఉందిఅమ్మ. నాన్నతో కాసేపు మనసువిప్పి మాట్లాడి, కొద్ది రోజులు సమయం అడిగి, ఉద్యోగ ప్రయత్నాలు సరి కొత్తగా మొదలు పెట్టాలి.. ఇలాంటి పలు ఆలోచనలతో ఉన్న తనకి “బాబూ! నేను దిగవలసిన ప్లేస్ వచ్చేసింది బాబూ! కాస్త బైక్ ని

సైడ్ లో ఆపు” అన్న పిలుపుతో తన ఊహాలోకం నుండి బయటకి వచ్చాడు అశ్విన్...

“సారీ తాతయ్యా! ఏదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు..”

" హా! పర్లేదు బాబూ! బస్ తప్పిపోయి, పర్స్ ఎవరో కొట్టేస్తే ఎలా వెళ్ళాలో తెలియక ఎవరు సాయం చేయక ఇబ్బంది పడుతున్న నన్ను చూసి సాయం చేశావు .. బాబూ! నీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ చెట్టుకి అనుకొని ఉన్న ఇల్లు మాది.. రా బాబూ! వచ్చి కాస్త టీ తాగి, నీ ప్రయాణం మొదలు పెట్టవచ్చు.. రా బాబూ! కాదు అనకు”

“వస్తాను తాతయ్యా! మీరు వెళ్ళండి. బైక్ పార్క్ చేసి నేను వస్తాన”ని

చెప్పి, తన బండిని ఓ వైపు ఆపి ఫోన్ తీసుకొని చూస్తే, అందులో 50 మిస్డ్స్ కాల్స్ వచ్చాయి, ఇంటి నుండి...

ఇంటికి ఫోన్ చేశాడు అశ్విన్...

“ఏమి అయిపోయావు రా కన్నా !!

ఎన్ని సార్లు ఫోన్ చేశామో తెలుసా!! ఉదయం అనగా వెళ్ళినవాడివి.. ఫోన్ చేస్తుంటే తీయకపోతే కంగారు వచ్చేసింది.. ఇంకా కొద్ది సేపు నువ్వు ఫోన్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాము తెలుసా!?”

అమ్మ, నాన్న అన్న పిలుపు అశ్విన్ పిలవగానే ఇద్దరూ ఏడ్చేశారు.

కాసేపు అయ్యాక ..

రేయ్ కన్నా! మేము ఏంచేసినా నీ మంచికే రా.

సరైన చదువు లేకపోవడం వల్లే చిన్న చిన్న జాబులు చేసి చాలీ చాలని జీతంతో కడుపు మాడ్చుకొని ఎన్నో రోజులు ఉన్నాము.. ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదని చిన్నప్పటినుంచి నీ పట్ల కఠినంగా ఉన్నాం.. క్షమించు కన్నా! ఇంకెప్పుడూ నీ మనసు నోచ్చుకునేలా మేము ప్రవర్తించం.. ఇంటికి తిరిగి వచ్చేయ్ బాబూ! జాబ్ చేయకపోతే ఏమి? మా బిడ్డ పై మాకు నమ్మకముంది. ఏదో ఒక వ్యాపారం చేసుకుని అయినా నువ్వు బ్రతకవచ్చు. బాబూ! త్వరగా రా బాబూ!.."

"అమ్మా! నాన్నా! నన్ను క్షమించండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను.. మీ కొడుకు కొన్ని గంటల్లో మీ ముందు ఉంటాడు..”

“సరే రా! త్వరగా రా .. నీకు ఇష్టమైనవి చేసి ఉంటాను .. అమ్మతో పాటుగా మీ నాన్న కూడా ఎదురు చూస్తుంటారు కన్న! వచ్చేయ్ త్వరగా…”

“సరే అమ్మా! సరే నాన్నా!” అని ఆనందంగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి తాతయ్య ఇంటి వైపు వెళ్ళాడు అశ్విన్..

వాళ్ళ మాటల మధ్యలో తెలిసింది ఏమిటంటే...

ఆ వృద్ధ దంపతులను కొడుకులు చూసుకోవడలేదని, పోషణార్థం ఇంటి దగ్గరే తినుబండారాలు తయారుచేసి అమ్ముతున్నారని తెలుసుకున్నాడు...

వాటిని తిని రుచి చూశాడు. చాలా అంటే చాలా బాగున్నాయి.

తాతయ్యకు సహాయం చేయాలని భావించిన అశ్విన్ వాటిని తను అమ్మి పెడతానని,

మీరు అన్ని రకాలు చేయండి. పెట్టుబడి నేను పెడతానని చెప్పి ఇంటికి చేరుకొని వాళ్ల అమ్మ, నాన్నకు విషయం చెప్పి సేవ్ చేసుకున్న డబ్బుతో ఆ తాతయ్య వాళ్ళకి కావలసిన సరుకులు అందించాడు

అశ్విన్..

తన తెలివితేటలతో " స్వగృహ ఫుడ్స్" అనే అప్ ని క్రియేట్ చేశాడు...ఇంటి దగ్గరకే వారు కోరిన స్వీట్స్ తెచ్చి ఇచ్చేలా.. కొద్ది రోజుల్లోనే వాళ్ళు చేసే తినుబండారాలకు మార్కెట్లో విపరీతమైన ఆదరణ లభించింది...

అందరితో స్నేహంగా ఉంటూ మంచి స్నేహితులు సంపాదించుకున్నాడు. ఈ ప్రయాణంలో ..

కొద్ది రోజుల తరువాత అశ్విన్ కి తన కోరిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. జీతం కూడా తనకున్న దాని కన్నా రెట్టింపు . ఆ జాబ్ చేసుకుంటూనే " స్వగృహ ఫుడ్స్" బిజినెస్ ను కూడా చేస్తూ సక్సెస్ఫుల్ కెరీర్లో దూసుకుపోతున్నాడు అశ్విన్...

ఇటు వృత్తిని చూసుకుంటూనే వారాంతాల్లో

" వీ లిసన్ యూ" గ్రూప్ కోసం సమయం కేటాయిస్తున్నాడు. ఎందరి సమస్యలనో విని, తనకు తోచిన విధంగా సలహాలు ఇస్తూ, అవసరమైతే సాయం చేస్తుంటాడు.. ఈ పయనంలో సూర్య, అశ్విన్ ప్రాణ స్నేహితులు అయ్యారు...

అంతే కాదు. ఆ బస్తీలో ఉండే పిల్లలకి సాయంకాలం ఒక గంట పాటు ఉచితంగా డాన్స్ నేర్పిస్తూ వారి చదువు కోసం కూడా సాయం చేస్తున్నాడు అశ్విన్..

తన వద్ద డాన్స్ నేర్చుకున్న పిల్లలు అన్నిట్లో విజయం సాధించారు. అశ్విన్ డాన్స్ మాస్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఇలా ఇష్టమైన ప్రవృత్తిలో కూడా విజయాన్ని అందుకున్నాడు అశ్విన్...

మరదలు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందని తెలుసుకుని, తనను వివాహం చేసుకున్నాడు. తన మరదలు రాకతో నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసుకున్నాడు అశ్విన్...

ఇలా అన్నిట్లో విజయం సాధిస్తూ తన జీవిత పయనంలో ముందుకు సాగిపోతున్నాడు.

@@@@@@@@@@@@@####

" జీవితం అంటేనే సర్ప్రైజ్...ఎన్నో నేర్పుతుంది అనుక్షణం... ఒక సారి కష్టం దాటుకొని బయటకు వచ్చి చూడండి, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.. కొంతమంది బతకడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది.. గుండెల్లో మంటలు చెలరేగుతున్నా, పైకి చార్లీచాప్లిన్ లా నవ్వుతున్న వారెందరో ఉన్నారు. ఆలోచిస్తే చూస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అమ్మ కడుపులో ఉండగానే మనం ఎంతో నరకాన్ని అనుభవిస్తాము. చీకటిలోనే ఉంటాము.

అమ్మ చల్లవి, వేడివి తాగినా, వాటిని భరించి ఈ లోకం లోకి వస్తాము.. ఈ లోకాన్ని చూడ్డానికి మన పోరాటం చేసాము. అప్పుడు ఈ బ్రతుకు పయనం లో వచ్చే ఈ సమస్యలు మనకు ఎంతవి.

💕 లవ్ యువర్ జిందగీ..💕జీవితాన్ని ఎప్పుడూ అంతం చేసుకోకండి.. ప్రతి జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ జీవితం అనేది మీది కాదు, మీ వాళ్ళది అని ఎప్పటికీ మర్చిపోకకండి....

💕లవ్ యువర్ లైఫ్💕..........

// బాధ పడడం ఎందుకు...

పోరాడే శక్తి నీకు ఉన్నప్పుడు..

కృంగి పోవడం ఎందుకు

నీలో పట్టుదల ఉన్నప్పుడు..

విజయం నీకు ధైర్యాన్ని ఇస్తుందేమో

అపజయం నీకు దేనినైనా తట్టుకునే బలాన్ని ఇస్తుంది..

నీలో దాగిఉన్న బలం ఏంటో… బలహీనత ఏంటో తెలుస్తుంది.. అదే కదా నీకు విజయాన్ని కలిగించే వారధి

విమర్శ చేసేవాళ్ళు చేయనీ

వీరి నుంచి ఆత్మవిమర్శ చేసుకో..

బాధ పెట్టే వాళ్ళు పెట్టనీ..

వీరి నుంచి తట్టుకునే గుణాన్ని అలవర్చుకో..

కింద పడ్డ ప్రతిసారీ పైకి లేవడం నేర్చుకో

అవసరంలేని ఆలోచనల నుంచి బయటికి

రావడానికి ప్రయత్నం మొదలు పెట్టు.

కష్టాలు లేని మనిషి ఉండరు...

సమాధానం లేని ప్రశ్నలు ఉండవు.

పరిష్కారం లేని సమస్య అనేది ఉండనే ఉండదు..

ఓటమి వస్తుంది అని అడుగు వేయడం ఆపకు

గెలుపు వచ్చేసింది అని సంబర పడకు..

వ్యత్యాసం తెలుసుకొని నడుచుకో..

నిన్నటి చింతను వదిలిపెట్టి

రేపటి గురించి ఆశ పడుతూ..

ఓటిమి నుంచి నేర్చుకుంటూ...

వెనుకంజ వేయక అగిపొని ప్రవాహంలా నీ పయనం మొదలు పెట్టాలి… అప్పుడే కదా విజయలక్ష్మి నీకు వరించేది ......

" కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. జీవితం ఒకసారి పోతే రాదు. ఆల్వేస్ బీ హ్యాపీ.. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి....."

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


36 views1 comment
bottom of page