top of page

తరాల అంతరాలు


'Tharala Antharalu' New Telugu Story


Written By Neeraja Hari Prabhala


రచన: నీరజ హరి ప్రభల


"దీపా! కాలేజీ అవగానే సాయంత్రం సినిమాకి వెళదామా?" అడిగాడు సుధీర్ దీపను.

"సరే " అంది దీప.


ఆసాయంత్రం ఇద్దరూ సినిమాకి వెళ్లి ఆ తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్లారు. ఇది తరచూ జరిగేదే. కాలేజీలో దీప, సుధీర్ లది ఒకే క్లాసు. డిగ్రీ ఆఖరి సం… చదువుతున్న వీళ్ల మధ్య పరిచయం క్రమేణా ప్రేమగా మారి ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఇద్దరూ మంచి ఉద్యోగాలలో స్ధిరపడ్డాక తమ ప్రేమ విషయాన్ని ఇరువైపులా పెద్దలకు చెబుదామని నిర్ణయించుకున్నారు.


ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసి రిటైరయిన విశ్వనాథం గారు భార్య పార్వతమ్మ, కొడుకు సుధీర్ లతో పెద్దలిచ్చిన ఇంట్లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. చిన్నప్పటి నుంచి సుధీర్ కష్టపడి చదివి మంచి మార్కులతో పాసవుతూ డిగ్రీ చదువుతున్నాడు. ఆ ఇంట్లో పార్వతమ్మ మాటే చలామణి. ఆవిడ పైకి సాత్వికంగా కనబడుతున్నా ఆవిడలో పంతం, పట్టుదల ఎక్కువ. తన మాటే నెరవేరాలని ఆశిస్తుంది.

ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను పాటిస్తుంది. తనలాగే అందరూ అవి పాటించాలని అనుకుంటుంది. తనకు రాబోయే కోడలు కూడా అలాగే ఉండాలని ఆవిడ కోరిక. భర్త ఆవిడ మాటను జవదాటడు. అందుకు పూర్తి విరుధ్ధం సుధీర్. 'మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి' అని ఎన్నోమార్లు తన తల్లికి చెప్పినా ప్రయోజనం లేక మిన్నకున్నాడు.


రోజులు గడుస్తున్నాయి. దీప, సుధీర్ ల చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నారు. వాళ్ల కృషి ఫలించి త్వరలోనే ఇద్దరూ వేర్వేరు కంపెనీలలో మంచి ఉద్యోగాలను సాధించారు. వాళ్ల ఆనందానికి హద్దులేదు. ఒకరోజున ఇద్దరూ వాళ్ల ప్రేమ విషయాన్ని వాళ్ల తల్లితండ్రులకు తెలిపి, పెళ్లి చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని తెలిపారు.

కూతురి ఇష్టాన్ని ఏనాడూ కాదనలేదు దీప తల్లిదండ్రులు. వాళ్లకు తమ కూతురి ఆలోచన, నిర్ణయాల మీద నమ్మకం ఎక్కువ. వాళ్లు తమ ఆమోదాన్ని తెలిపి సుధీర్ ని తమ ఇంటికి తీసుకుని రమ్మన్నారు. ఒకరోజున సుధీర్ ని తన ఇంటికి తీసికెళ్లి తల్లితండ్రులకు పరిచయం చేసింది దీప. అతని మాటతీరు, పెద్దల ఎడల వినయవిధేయతలు వాళ్లకు నచ్చింది. ఆ తర్వాత సుధీర్ తరచూ ఆ ఇంటికి వస్తూపోతూ ఉండటం వలన వాళ్లతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది సుధీర్ కు.


సుధీర్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగానే పార్వతమ్మ సుధీర్ మీద ఇంతెత్తున ఎగిరి తన అయిష్టతను వెల్లడించింది. తనకు ప్రేమ, పెళ్లి వ్యవహారాలంటే ఇష్టం లేదనీ, తాము చూసిన సాంప్రదాయపు పిల్లనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆవిడ మాటకు విశ్వనాథం గారు వంత పాడారు. కానీ వాళ్ల ను ఒప్పించే ప్రయత్నంలో దీపను తన ఇంటికి తీసుకొచ్చి వాళ్లకు పరిచయం చేశాడు సుధీర్. దీపని నఖశిఖపర్యంతం చూసి ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేసినంత పని చేసింది పార్వతమ్మ. ఆవిడ ప్రవర్తన తనకిష్టం లేకపోయినా వాళ్ల స్వభావాన్ని గురించి సుధీర్ తనకు ముందే చెప్పి ఉండటంతో అన్నిటికీ ఓర్పుతో సమాధానాలిచ్చింది దీప. కాసేపు అక్కడే వాళ్లతో గడిపి ఆ తర్వాత దీప తన ఇంటికి వెళ్లింది.


ఆ తర్వాత సుధీర్ వాళ్ల ఇంట్లో ఈ పెళ్లి మీద పెద్ద చర్చ జరిగింది. సుధీర్ పట్టుదలగా 'దీపనే పెళ్లి చేసుకుంటాను' అనడంతో పార్వతమ్మ అయిష్టంగానే పెళ్లికి అంగీకరించింది. దీప అందం, మంచి జీతం తెచ్చే పిల్ల అవటంతో ఆవిడ ఒకింత మెత్తబడింది. భార్య అంగీకారమే తనదీ అవడంతో విశ్వనాథం వాళ్ల పెళ్లికి 'సరే' అన్నాడు. ఆ శుభవార్తను దీపకు చెప్పగా దీప సంతోషించింది. ఒకరోజున దీప తల్లితండ్రులు సుధీర్ ఇంటికి వచ్చి పెళ్లి విషయాలను మాట్లాడడంతో ఇరు కుటుంబాలు నిశ్చితార్థం చేసుకున్నారు. ఒక శుభముహూర్తమున దీప, సుధీర్ ల పెళ్లి జరిగింది.


దీప సుధీర్ తో కాపురానికి అత్తారింటికి వచ్చింది. సుధీర్, దీపలు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. స్వతహాగా దీప తెలివికలదీ, కలుపుగోలు పిల్లవడంతో ఇంటిపని చేసుకుని, అత్తామామలను, భర్త ను ప్రేమగా చూసుకునేది. రోజూ ఆఫీసుకి వెళ్లివచ్చేది. దీప ఆ ఇంటికి వచ్చిన మొదలు పార్వతమ్మకు దిగులు పట్టుకున్నది. తన కొడుకును తనకు కాకుండా దీప ఎక్కడ వేరుచేస్తుందో? చదువుకున పిల్ల, తెలివైనదీ, ఉద్యోగస్తురాలు అనీ. అది మనసులో పెట్టుకొని దీప ఏంచేసినా ఏదో వంకలు పెట్టి ఏదోవిధంగా సాధించేది. ఆవిడ ప్రవర్తనకు మొదట్లో దీప బాధపడి ఆవిడకు మంచిగా, అనునయంగా చెప్ప ప్రయత్నంచేసి మిన్నకుంది.


కొన్నాళ్ళకు దీప గర్భవతి అవడం, నెలలు నిండి పండంటి కొడుకుని కనడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. మనవడిని చూసి వారసుడొచ్చాడని కొండంత సంబరంగా ఉంది పార్వతమ్మ. వాడికి 'వేణు' అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నారు. వాడు క్రమేపి పెరిగి తన మాటలు , ముద్దుముచ్చట్లతో అందరినీ అలరిస్తున్నాడు. కొన్నాళ్లకు వాడిని స్కూలులో చేర్చారు.


కాలం గడుస్తోంది. వేణు చక్కగా చదువుతూ స్కూలు ఫస్ట్ వచ్చాడు. దీప, సుధీర్ లు వేణుకి సమాజం, వాటి విలువలు, మంచితనం, మానవత్వం గురించి ఎప్పుడూ చెబుతూ ఉండడంతో అవి వాడిని ఆకర్షించాయి. ఆ తర్వాత వాడు కాలేజీలో చేరడం జరిగింది. చిన్నప్పటినుంచీ తాతా‌, బామ్మల ఆచారవ్యవహారాలను దగ్గరగా చూడటంతో వేణు వాళ్లని మార్చే ప్రయత్నంచేసి ఊరుకున్నాడు. వయసైనకొద్దీ అది వాళ్లకు ఎక్కువైందే కానీ తగ్గలేదు. వేణు చక్కగా చదివి ఇంజనీరింగ్ ను పూర్తిచేసి మంచికంపెనీలో ఉద్యోగంలో చేరాడు.


కాలం సాఫీగా సాగుతోంది. కొన్నాళ్లకు తన తోటి ఉద్యోగి మేరీతో ప్రేమలో పడ్టాడు వేణు. మేరీ కూడా వేణుని ప్రేమిస్తోంది. మేరీ చాలా మంచిపిల్ల. అనాధ అయిన మేరీ గవర్నమెంట్ హాస్టల్ లో పెరిగి, కష్టపడి చదివి ఉద్యోగం చేసుకుంటోంది. మేరీ గతాన్ని విన్న వేణుకి ఆమె మీద ప్రేమ మరింత పెరిగింది. మేరీ గురించి తన ఇంట్లో అందరికీ చెప్పి ఆమెని పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని తెలిపాడు. అందుకు దీప, సుధీర్ లు సంతోషంగా అంగీకరించారు.


పార్వతమ్మ " ప్రేమా, దోమా అంటూ ఒక అనాధని మన ఇంటి కోడలిగా తెస్తావా?" అని ఏడ్చి రంకెలు వేసినా ఎవరూ జడవలేదు.


"అనాధ అని అంటావేంటి? పెళ్లయితే తనకి మనమంతా ఉంటే ఆమె అనాధ ఎలా అవుతుంది? మనుషులలో మంచితనం, సంస్కారం కావాలి. వాటిని గమనించు" అని సుధీర్, దీపలు ఎంత చెప్పినా ఆవిడకు చెవికెక్కలేదు.


వేణు మేరీని రిజిస్టర్ మేరేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మేరీ ఆ ఇంట్లో అందరితో కలుపుగోలుగా ఉన్నా పార్వతమ్మ మాత్రం ఆమెని చులకనగా, ఈసడింపుగా చూసేది. ఆవిడ ప్రవర్తనకు మేరీ బాధపడితే వేణు‌, సుధీర్, దీపలు 'ఆవిడ పెద్దావిడ, ఆవిడ తీరంతే, దాన్ని మనసులో పెట్టుకోవద్ద'ని ఆమెని ఓదార్చారు.

కాలం సాఫీగా సాగిపోతోంది. ఒకరోజున పార్వతమ్మకు జబ్బు చేసి హాస్పిటల్ లో చేరింది. ఆవిడకు రక్తం ఎక్కించవలసి వస్తే ఆమె బ్లడ్ గ్రూప్, మేరీ బ్లడ్ గ్రూప్ ఒకటే అవటంతో మేరీ ఆవిడకు మనస్ఫూర్తిగా రక్తాన్ని ఇచ్చింది. దగ్గరుండి ఆవిడకు సపర్యలు చేసింది. ఆవిడ త్వరలోనే కోలుకుని ఇంటికి వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారు.


ఒకరోజున " చూడమ్మా! నీవు అనాధ అని ముద్ర వేసి మేరీని చాలా చులకనగా చూసి ఆమెని అవమానించినా, మేరీ నీకు రక్తమిచ్చి, ప్రేమగా దగ్గరుండి సపర్యలు చేసింది. అలాగే నీ కోడలు దీప కూడా నిన్నర్ధం చేసుకుని ఇంటిని సరిదిద్దుకుంది. కాలం మారుతున్న కొలదీ తరాల అంతరాలలో, మనుషుల పధ్ధతులలో వ్యత్యాసాలు ఉంటాయి. మీ తరం, మా తరం, ఇప్పుడు వేణు తరం , ఇంక ముందు వాడి పిల్లల తరం … ఇలా తరాల అంతరాలలో లో ఎన్నో, ఎన్నెన్నో మార్పులు ఉంటాయి.


వాటిని అనుసరిస్తూ మనమూ ముందుకు నడవాలి. అప్పుడే మనము ప్రగతి పధాన పయనించగలిగేది. మనుషులలో మంచితనం, మానవత్వం, సంస్కారం, సేవాదృక్పధం ఉంటే చాలు. అది గమనించి అర్థం చేసుకుని ఇప్పటికైనా అందరితో మంచిగా మెలుగు. ఇప్పుడైనా నీకు కనువిప్పు కలిగితే చాలా సంతోషం." అని సుధీర్ అనునయంగా చెప్పిన మాటలకు పార్వతమ్మ మనసు మారి ఇన్నేళ్లుగా తన నడవడిక, ప్రవర్తనకు సిగ్గుతో పశ్తాత్తాప పడింది.


"మేరీ! ఇలా రామ్మా! దీపా! నీవు కూడా రా!" అని వాళ్లిద్దరినీ పిలిచి దగ్గరకు తీసుకుని "మీరిద్దరూ నన్ను క్షమించాలమ్మా!" అని హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ. "మనలో మనకు క్షమాపణ లేంటత్తయ్యా! మీరు ఈ ఇంటికి పెద్ద. మనమందరం ఒకటే. సంతోషంగా ఉందాము" అన్న దీప మాటలకు శృతి కలిపింది మేరీ. అందరూ హాయిగా నవ్వుతూ సరదాగా కబుర్లతో గడిపారు.


...సమాప్తం...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మనసులోని మాట
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


44 views0 comments

Comments


bottom of page