ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13
- Pandranki Subramani

- 7 days ago
- 8 min read
Updated: 13 hours ago
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 13 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 31/01/2026
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.
తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.
సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది. భార్య ఉద్యోగం చేయడానికి ప్రోత్సాహం ఇస్తాడు మధుమురళి.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 13 చదవండి.
దీపాలు పెట్టే వేళ దాటింది. శివగామి మలి స్నానం చేసి పూజాగృహంలో దివ్వెలు వెలిగించి దేవికి అర్చన చేసి—
“సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యయంబకే దేవి నారాయణీ నమోస్తుతే” అని శ్లోక పఠనం గావించి, ఆ తరువాత మాధవిని పిలిచి ఇంట్లోని పెద్దలందరికీ హారతితో పాటు ప్రసాదం ఇచ్చి రమ్మని పురమాయించి ఉక్కపోతగా ఉందనిపించి గదిలోకి వెళ్ళింది.
సీలింగ్ పూర్తి స్పీడులో వేసి కట్టుడు చీర వేసుకోవడానికి వీలుగా ఉన్న కోకను విప్పసాగింది. దాదాపు కోకను సగం విప్పేసిందనాలి. అప్పుడు అనుకోని విధంగా విస్మయానికి లోనైంది. విస్తుపోయింది. మధు మురళి తిన్నగా గదిలోపలకు దూసుకు వచ్చాడు.
“మీరెప్పుడు నాతో మాట్లాడటానికి వచ్చినా గది తలుపు తట్టే కదా వస్తారు! ఇప్పుడేమయింది ఇంతలా ఆదరా బాదరాగా దూసుకు వచ్చారు? ఏం కావాలి?” కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగిందామె.
“ఔను. నేను సాధారణంగా మొనవ్రేళ్ళతో మూడుసార్లు తలుపు తట్టే లోపలకు వస్తాను. కాని—ఈరోజు ఆకాశ వాణి వింతగా ప్రబోధించింది—అనుమతి అడక్కుండానే లోపలకు చొరబడమని— "బ్రోచుటకిదే తగు సమయమని"—“
శివగామి కూడా వింతగానే నవ్వుతూ అంది— “ఎందుకోమరి!”
“చెప్పను—ససేమిరా చెప్పను. నోటితో చెప్పే సమయం కాదిది. ఓపిక మించి పోయిన సమయమిది” అంటూ ఆమెను అమాంతం అందుకుని కౌగిట్లో వలపు సంకెళ్ళతో బిగించాడు. మెడ చుట్టూ ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి ఆమె పెదవుల్ని తనలోకి లాక్కున్నాడు.
“అయ్యో మురుగా! మీ చెల్లి వచ్చేస్తుందండీ! పరువు పోతుందండీ!” అని బిగి కౌగిలి నుండి విడివడాలని ప్రయత్నించింది.
మధు మురళి పట్టు సడలించలేదు. “రానీయ్! బ్రహ్మ రుద్రాదులు రానీయ్—నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మల్లెలు—కనకాంబరాలు—మరువంతో నన్ను ఒరసుకుంటూ వస్తే నేను ఊరకుంటానా? ఓర్పు వహిస్తూ జపతపాలు చేసే మౌన మునిలా ఓ మూల కూర్చుంటానా! నాలో మాత్రం ఉడుకు రక్తం ఉండదా!”
“ప్లీజ్! ఒక్కమాట వినండి. ఆ తరువాత మీ ఇష్టప్రకారం మీరు చేసుకోండి”
“ఉఁ చెప్పు”—అని కౌగిలి సడలించాడు మధుమురళి.
“కాంచిపురం నుండి మావాళ్ళు వస్తున్నారు!”
“ఎందుకంట? నన్ను ఆపడానికా! నాలో రేగుతున్న మదనోత్సవాన్ని మంచు నీళ్ళలో ముంచడానికా?”
“ముమ్మాటికీ కాదు. కామాక్షమ్మ గుడి పురోహితులతో చర్చించి మంచి ముహూర్తం చూసి శాంతి ముహూర్తం సంప్రదాయసిద్ధంగా జరిపించడానికి రాబోతున్నారు. సారెలూ కానుకలూ అంది పుచ్చుకుని మరీ వస్తున్నారు. ఇన్నాళ్ళూ ఊపిరి బిగబట్టి సాధించిన దీక్ష ఈ ఒక్కరోజుతో భంగపాటుకి లోను చేయడమా! అంతా బూడిదలో పోసిన పన్నీరు కావడమా!”
“సరే—అలాగే అనుకో! మరి దీనికి బదులివ్వు. డొంకతిరుగుడుగా కాకుండా సూటిగా బదులివ్వు. నేనిప్పుడే ఇక్కడే నిన్ను మోహపు ఆకాశపు అంచులకు తీసుకెళ్లిపోయాననుకో—అప్పుడేమి చేస్తావు? అరుస్తావా "రేప్ చేసానని!" పుణ్యఘడియ రాక మునుపే స్వకార్యం ముగించేసానని శాపనార్థాలు పెడతావా?”
శివగామి పక్కున నవ్వింది. అతడి మెడ చుట్టూ రెండు చేతులూ పోనిచ్చి అంది— “ఏమీ అనను. నాకు ఇష్టం లేని దానిని చేస్తేనే కదా అరవడానికి—“
అతడప్పుడు పట్టు పూర్తిగా సడలించాడు. దూరంగా తొలగిపోయాడు. తొలగిపోతూ మృదు స్వరంతో అన్నాడతను “హెచ్చరిక చేసినందుకు థ్యాంక్స్! ఇక నాదొక చిన్నమాట—“
“చెప్పండి” అందామె.
“ఇకపై నాకు టీలు కాఫీలు ఇవ్వడానికి నా స్టడీలోకి రాకు. మా చెల్లి ద్వారానో అమ్మద్వారానో పంపించు. ఇది ఉభయతారకం. మంచి ఊపులో ఉన్నట్టున్నాను. తియ్యటి మత్తెక్కించే నీ శరీర వాసనల్ని బాగానే ఆఘ్రాణించినట్టున్నాను. ఇక నా వల్ల కాకపోవచ్చు. ఆపుకోలేక పోవచ్చు” అంటూ గది తలుపు వైపు నడిచాడు.
విత్ రీజన్ ఆర్ విదౌట్ రీజన్—ఎడబాటు ఎక్కువవుతున్న కొద్దీ విరహవేదన హోమ జ్వాలలా అంతకంతకూ తీవ్రతరం అవుతూనే ఉంటుంది కదా! అతడి అవస్థ గమనించి శివగామి చిలిపితనం చిందించేలా నవ్వుతూ వదులైన కోకను కట్టుకోసాగింది. ఈ సంప్రదాయ సరిహద్దుల ఫలితంగా ఏర్పడ్డ ఎడబాటు వల్ల అవస్థపడుతున్నది మధు మురళి మాత్రమేనా—తను కూడా అదే అవస్థను ఎదుర్కోవడం లేదా! నిజానికి మురళి చొరవ చూపించి తనను ఆక్రమించుకోవడానికి పూనుకుంటే తను ఆపగలదా! తనకే కాదు, ఈ ముల్లోకాలలో ఎవరికైనా ఆపతరమా!-----
హాలులో మధులిక డైనింగ్ టేబుల్ ప్రక్కనున్న ఫ్యాన్సీ స్టాండుపైనున్న పూలకుండీలో వాడినవి తీసి తాజా పూలు పెట్టి ట్రిమ్ముగా విరబూసేలా కనిపించడానికి సర్దుతూంది. సాధారణంగా హాలు బయటగాని, ఇంటీరియర్ గదుల్లోపల గాని పూలమొక్కల్ని ఆమే స్వయంగా చక్కబెడుతుంది. ఏ రోజు ఏ పూలు తీసి పెట్టాలో ఆమె ఎంపిక చేస్తుంది. పనావిడ కాంతమ్మకు ఆ పని అప్పజెప్పదు. పూలను ట్రిమ్ చేసి కుదురుగా ఉంచడం ఇంటి నలుమూలలా పరిమళం వ్యాపించేలా అలంకరించడం ఆమె మనసులో అదొక అద్భుతమైన సృజనాత్మక కళ. తేనె చినుకులు చిందే ఆకాశ గోపురంలోకి చూసినంత ఆనందం. అప్పుడు వెనుక ఎవరో వచ్చిన కదలిక గమనించిందామె. కాని—ఆగలేదు. తిరిగి చూడలేదు. అడుగుల సవ్వడిని బట్టి అప్పుడక్కడకు వచ్చిందెవరో పసిగట్ట గలిగింది. చిరపరిచితం ఆ సాహచర్యం. ఇప్పుడు మధురమైన పాట వినిపించింది—
“పలుక రాదటే చిలుకా! పలుకరాదటే చిలుకా! సముఖములో రాయబార మెందులకే—
ఎరుగని వారమటే—మొగమెరుగని వారమటే—
పలికిన నేరమటే, పలుకారగ నేరమటే—
ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటే—
మనసున తొణికే మమకారాలు—కనులను మెరిసే నయగారాలు
తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా—“ పాట చివరన మధులిక సర్రున తల తిప్పింది.
“మిమ్మల్నెవరు బ్రహ్మచర్యం పాటించమన్నారు! మిమ్మల్నెవరు సరాసరి మీ స్టడీ రూములోకి మకాం పెట్టమన్నారు?”
“ముఖం చెల్లక—నోటమాట రాక—“
“నేనింత వరకూ ఒక్కసారి కూడా అనలేదే—మీరు నాకు కీడు తలపెట్టారని—“
“ఔను, నువ్వనలేదు. అనవు కూడాను, నీవంటి శాంతి మూర్తి నాకు భార్యగా లభించడం పూర్వజన్మసుకృతమేనేమో!”
దానికామె ఏదో అనబోయేంతలో మేడ మెట్లు దిగుతున్న అత్తామామలను చూసి చప్పున ఆగిపోయింది. అంతటి ఘనకార్యం చేసిన కొడుకుతో అలా మామూలుగా అంత త్వరగా మాటలు కలపడం వాళ్ళకు నచ్చదని ఆమెకు తెలుసు. వాళ్ళలా నిదానంగా నడచుకుంటూ వచ్చే లోపల టిఫిన్ తినడం ముగించి వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుని మేడ మెట్ల వైపు నడిచాడు సోమశేఖర్. భార్యాభర్త లిద్దరూ వచ్చి బల్లముందు కూర్చోవడం గమనించిన మధులిక వేగంగా వచ్చి ఇద్దరిముందూ ప్లేట్లు పెట్టి రెండు ఇడ్లీలు ఒక దోశె పెట్టి విడి విడిగా రెండు గిన్నెల్లో కొబ్బరి పచ్చడి పెట్టి—రెండు గ్లాసుల నిండా మంచి నీళ్ళూ కూడా పెట్టి అక్కడి నుండి కదలబోయింది.
అప్పుడు—"ఆగు మధులికా!": అన్న గొంతు వినిపించి నడుస్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఉమాదేవి సూటిగా చూస్తూ అంది—
“చాలామంది ఆడాళ్ళలో నాకు మహా చిరాకెత్తించే పెళుసైన గుణాంశం ఇదే!”
పెదాలపైకి నవ్వు రేఖల్ని తెచ్చిపెట్టుకుంటూ అదేమిటన్నట్టు అత్తయ్య వైపు చూసింది మధులిక.
“నందన వనం వంటి ఇంట్లోకి విస్ఫోటనమే తెచ్చాడు వాడు. మాకు కొన్నిరోజులుగా కునుకు లేకుండా చేసాడు వాడు. కాని నువ్వేమో—వాడు మురిపెంగా అన్న చిన్నమాటకు కరిగి మురిసిపోయి వాడితో మాటలు కలుపుతున్నావు. కనీసం మాకోసమైనా కాస్తంత బెట్టయినా చూపించవద్దూ! అలాగా మగాడి ముందు కొవ్వొత్తిలా కరిగిపోతావూ?”
మధులిక నవ్వుతూ దగ్గరకు వచ్చి మరొక రెండు గిన్నెల్లో సాంబారు పోసి నిదానంగా అంది. “మీ అబ్బాయి బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నవాడు. ఆయనను నేను గమనించకపోతే మరెవ్వరు చూస్తారు అత్తయ్యా! నేనిప్పుడు చేస్తున్నదాంట్లో కొత్తేమీ లేదుగా! ఎల్లప్పుడూ చేస్తున్నదేగా నేనిప్పుడు చేస్తున్నాను. కోపతాపాలు కలిగాయి కదానని నా పనులు మానుకోలేను కదా! మరొకరికి అప్పజెప్పలేనుగా—“
“ఇంకెవరో ఏమిటి—ఉందిగా ఎక్కడో మీ వాడి సో కాల్డ్ మొదటి పెళ్ళాం. అది చూసుకుంటుందిలే—తలచుకుంటే కంపరం కలుగుతూంది. కనిపిస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తోంది. కాని నువ్వు కొట్టనివ్వవుగా—సకలమూ సర్వలక్షణమూ పుణికిపుచ్చుకున్న సాధ్వీ మణివిగా! దానికి కొంచమైనా ఇంగితం ఉండవద్దూ—పెళ్లయిన వాడితో ఒరసుకుని తిరగకూడదని. తలచుకుంటే దానికున్న స్తోమతను బట్టి ఈడూ జోడూ కుదిరిన మగాడు దొరకడూ! అది కనుసన్నలతో సైగ చేయాలే గాని ప్రవరాఖ్యుడు వంటి వాళ్ళు సహితం క్యూలో వచ్చి నిల్చోరూ! ఈ పెడసరి వ్యవహారం ఎంత దూరం వెళ్ళి ఎక్కడ ఎలా ముగుస్తుందో! మీ ఇంట్లో వాళ్లకు ఎప్పుడు చేరుతుందో!”
అప్పుడు మధులిక అడ్డుతగిలింది— “అంతటి ఆవేశం పనికిరాదు అత్తయ్యా! ఈ మధ్య మీకు బీపీ పెరిగినట్లుంది. ఇలా హద్దుమీరి ఆవేశపడితే మరింత పెరుగుతుంది. మీ అబ్బాయి ఆఫీసుకు బయల్దేరేటట్లున్నాడు. ఏదైనా కావాలేమో చూసొస్తాను. మీకింకేమైనా కావాలా అత్తయ్యా?”
ఉమాదేవి బదులివ్వలేదు. సదానందం వైపు సూటిగా చూసింది. “మీరెలాగండీ ఇలా నిమ్మకు నీరెత్తినట్లు ఉండగలుగుతున్నారు! కోడలు పిల్లకు గుండెనిబ్బరం కలిగేలా రెండు మాటలు చెప్పరాదూ?”
అతడు భార్య ముఖంలోకి చూసి చిన్నగా నవ్వటానికి ప్రయత్నించాడు. “చెప్తాను. ఎందుకు చెప్పనూ! కాని చెప్పడానికేమైనా తోస్తేనేకదా! మొన్న మొన్నటి వరకూ ఇద్దరూ ఆడుతూ పాడుతూ తిరిగేవారు. అప్పుడప్పుడు డ్యూయెట్ సాంగ్స్ కూడా కలిసి పాడుకునేవారు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా మారిపోయిందో—మనం మెట్లు దిగేటప్పుడు నీ పెద్దకొడుకు పాడిన తెలుగు పాట విన్నావు కదూ! వాడికి ఆ పాట ఎవరు నేర్పినదనుకున్నావు? పాత పాటల ప్రేమికురాలు నీ కోడలు పిల్లే—నాకున్న దిగులంతా ఒక్కటే—వియ్యంకురాలికీ వియ్యంకుడికీ ఇది గాని తెలిస్తే ఏమవుతుందోనని—కనీసం షాజహాన్ లా తయారైన నీ ముద్దుల కొడుకు కమలవాణిని ఎక్కడో పరిచయమైన కొలీగ్ అనో లేక ఎక్కువలో ఎక్కువ గార్ల్‌ఫ్రెండనో తేల్చేసినా పరవాలేదు. అదేదో కొండవీటి గుర్రపు రౌతు లా సాహసంగా ఆమెను భార్య అనేస్తున్నాడు. బెరుకన్నది లేకుండా మనముందు కూడా అదే మాట అనేస్తున్నాడు. ఇప్పటికి అదే మాట ఎంత మంది ముందనేసాడో! తలచుకుంటుంటే వింటుంటే గొంతున పచ్చి వెలక్కాయ పడ్డట్లుంది”
ఉమాదేవి ఇక మాట్లాడకుండా ఊరకుండి పోయింది.
అతడు మళ్ళీ అందుకున్నాడు— “రాను రాను వాడి నిష్పూచీ వాలకం చూస్తుంటే నాకు కంపరం కలుగుతుందోయ్”
“ఎందుకున్నట్టు” ఉమాదేవి భర్త కళ్లలోకి చూసింది.
“వాడు వెలగబెడుతున్న వ్యవహారం వెనుక ఉన్న పర్యావసానాల గురించి వాడు ఆలోచించడం లేదనే తోస్తోంది. వాడికి ఇద్దరు భార్యలున్నారన్నది ఫ్యామిలీ కోర్టులోనో విమెన్ రైట్స్ కమిషన్ లోనో నిరూపణ అయితే వాడికి ఉద్యోగం ఊడటమే కాదు—జైలు శిక్ష కూడా పడవచ్చు, ఇదీ నా భయం—“
ఇది విని ఉమాదేవి చిన్నగా నవ్వి భర్తకు భరోసా ఇస్తున్నట్లు అంది— “మధులిక కేసుని అంతవరకు పోనివ్వదు లెండి.” అని ఎటో చూపులు సారించి చూస్తూ పరధ్యానంగా ఇడ్లీలు చిదమసాగింది. ఇక చెప్పడానికీ వినడానికీ ఏమీ లేదని మధులిక అక్కడి నుండి కదిలింది.
శుక్రవారం. శుక్లపక్ష పాడ్యమి ఆరంభం. నవమి వరకు నవరాత్రుల ఆధ్యాత్మిక శోభ నగరం నలువైపులా వెల్లివిరుస్తోంది. ఉమాదేవి నవ ఉపవాసాల దీక్ష పూర్తిగా కాకపోయినా ముఖ్యమైన పుణ్యదినాలు అత్తగారితో కలిసి పరిపూర్ణమైన మనసుతో పాటిస్తోంది. ఇద్దరూ సమతౌల్యాహారం కలిసి తీసుకుంటారు. ఉదయం పండ్ల ముక్కలతో అల్పాహారం. మధ్యాహ్న భోజనం—వాటర్ చెస్ట్ నట్ పిండితో రొట్టీలు—పాలకూర అరటికాయ వేపుడు. లేత కాయగూరలతో తయారుచేసిన రైతా. రాత్రి పడుకునే ముందు కాసిన్ని పాలు. అవన్నీ మధులికే దగ్గరుండి చేయిస్తుంది. స్వయంగా కొసరి కొసరి ఇద్దరికీ తినిపిస్తుంది.
ఆ రోజు యధాప్రకారం అవన్నీ చేయడానికి వంట గదిలోకి వెళ్ళబోతున్న మధులికను నర్సమ్మ పిలిచింది— “ఎక్కడికమ్మా ఆ పరుగు!”
“నిన్న మనం కలిసి మాట్లాడుకున్నాం కదండీ! నవ ఉపవాసాలకు మొదటి రోజు మీరూ అత్తయ్యా ఏ పూటకు ఏమి తినాలో నన్ను చేయమని చెప్పారుగా అవ్వా! ఇప్పుడు కాంతమ్మతో కలిసి చేయనారంభిస్తేనే సమయానికి తెమలుతుంది”
“ఔను నిజమే! చెప్పాను. అసలు విషయం ఇప్పుడిప్పుడే గుర్తుకి వచ్చింది. కాబట్టి—నువ్వీరోజు అటు వెళ్ళకు—కాంతమ్మ అండదండలతో మేము అదంతా చూసుకుంటాం. నువ్వు ఉదయం స్నానం చేశావు కదూ?”
నర్సమ్మ ప్రశ్నకు బదులుగా తలూపుతూ తలంటుపోసుకున్నానని చెప్పింది.
“తిన్నగా వెళ్ళి చీరమార్చుకుని రా! ఎందుకు అని అడక్కు—“
మధులిక మాట్లాడకుండా మేడ మెట్లెక్కి చీర మార్చుకుని వచ్చింది. ఆమె దిగడం—సోమశేఖరం బ్రీఫ్ కేసుతో అదే ఊపున రావడం ఒకేసారి జరిగింది. ఉమాదేవి అత్తగారి ప్రక్కన కూర్చుంది గాని తల అటు తిప్పకుండా ఎటో చూపు నిలిపింది.
“ఒరేయ్ రాజశేఖరా! ఇలా రారా!”
నర్సమ్మ పిలుపు అందుకుని దగ్గరకు వచ్చి “చెప్పు బామ్మా!” అని ఎదురుగా నిల్చున్నాడు.
“నువ్వు ఆఫీసుకే కదూ వెళ్తున్నావు!”
“ఇదేం ప్రశ్న బామ్మా! చూస్తే తెలియడం లేదూ?”
“తెలుసు లేరా తోటరామా! కారణంతోనే అడుగుతున్నాను. మహాసామ్రాజ్ఞి రాజరాజేశ్వరీ దేవి అలంకార దినం. మహా గొప్పగా శోభాయమానంగా ఉంటుందిలే—నువ్వు మధులికతో పాటు గుడికి వెళ్ళి అమ్మవారికి జరిపే అర్చన కనులారా చూసి తరించి ఆ తరువాత మధులికను ఇటు ఆటోరిక్షాలో పంపి, నువ్వటు వెళ్ళిపో—“
అతడు నివ్వెరపోతూ చూసి అడిగాడు— “ఇప్పుడా!” అని.
“ఔను. ఇప్పుడే—“ ఆమె కచ్చితత్వం కూడుకున్న కంఠస్వరంతో అనేటప్పటికి అతడికి మరు పలుకు లేకుండా మధులికకు సైగ చేస్తూ బయటకు నడిచాడు.
కాసేపటికి బండి స్టార్ట్ అవడం గమనించి ఉమాదేవి అత్తగారి వైపు తిరిగి అంది— “అదేమిటి అత్తయ్యా! మనవడినీ మనవరాలినీ ఇంత పెందలకడే దేవి దర్శనానికి పంపిస్తున్నారు—విశేషం ఏమైనా ఉందా?”
“ఎందుకు లేదు! కచ్చితంగా ఉంది. నేను గాని ఇటువంటి ఏర్పాటు చేయకపోతే అది అక్కడి నుండి దారిలోనే అడ్డుకుని సోమశేఖరాన్ని గుడికి తీసుకుపోతుంది. ఆ అవకాశం దానికెందుకివ్వాలి? మనం ఉండగా మధులికకు ఎందుకు అన్యాయం జరగాలి!”
అత్తగారి మాట విని ఉమాదేవి మోమున చిరునవ్వు మెరిసింది. మనసున పన్నీటి చుక్కలు చిలికినట్లనిపించింది. కడుపున బిందెడు పాలు పోసినట్లనిపించింది. నిజమే మరి—ఎప్పటికైనా తమ్మింటి కోడలు మధులికేగా! కమలవాణి ఎంతటి చాకచక్యంతో సాధించిన గెలుపైనా—అది నీటిపైన గీచిన గీతేగా! గర్భగుడిముందు మోహావేశంలోనో భావావేశంలోనో పడి దాని మెడన పసుపు తాడు కట్టించుకుంటే సరిపోతుందేమిటి? పెద్దల సమక్షంలో పవిత్ర మంత్రోచ్ఛరణల శంఖానాదాలతో ఆకాశాన్ని తాకే మంగళ వాయిద్యాల మధ్య మంగళ సూత్ర పూజ జరిపించినప్పుడే కదా వాళ్ళిద్దరిదీ వివాహ బంధమవుతుంది—
విదేశీ చదువులతో అన్యదేశ పోకడలతో పెరిగిన కమలవాణి ఆలోచనకు ఇదంతా అందకపోవచ్చు. కనీసం వయసులో పెద్దవాళ్లయిన ఆమె కన్న తల్లిదండ్రులకు తెలవద్దూ! అడపా దడపా ఇంటికొస్తున్న మరొక పుణ్య స్త్రీ భర్తను అల్లుడిగా స్వీకరించేయడమే! ఏమో—ఇప్పటికిప్పుడు ఖరారుగా చెప్పడం కష్టంగాని, తెలివిమీరిన కమలవాణి సోమశేఖరంతో మెడన పసుపు తాడు కట్టించుకుంటూ, పూలమాలలు మార్చుకుంటూ, అదే అదనుగా సెల్ఫీ కూడా తీయించుకుని ఫోటోకి ఫ్రేము తగిలించుకుని ఇంట్లో భద్రంగా ఎక్కడైనా దాచుకుందేమో!
అయినా, తనను తను కాపాడుకోవడానికి చిన్నపాటి అబద్ధం చెప్పి విద్యుదాఘాతంలా ఎదురైన క్లమ్సీ రిలేషన్ షిప్ నుండి బయట పడలేని శేఖరం వంటి వాడు ఈ స్పీడీ లోకంలో ఎలా నెట్టుకు వస్తాడో! ఇదంతా విధివలయం కాకపోతే, చుట్టుముట్టిన గ్రహపాటు కాకపోతే ఎక్కడో జబ్బున పడి ఎప్పుడో పైలోకాలకు చేరుకుందనుకున్న కమలవాణి ఠీవిగా తోకచుక్కలా ఎలా ఎక్కడి నుండి ఉడి పడిందో! ఏది ఏమైనా మధులిక దీనికి తగినంత రీతిన తగుస్థాయిలో ప్రతిస్పందించడం లేదనే తోస్తూంది ఉమాదేవికి.
===============================================
ఇంకా వుంది
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments