ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14
- Pandranki Subramani

- 11 hours ago
- 7 min read
#ఉదయరాగఉద్వేగాలు, #UdayaragaUdvegalu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Udayaraga Udvegalu - Part 14 - New Telugu Web Series Written By Pandranki Subramani Published in manatelugukathalu.com on 06/02/2026
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు.
తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్.
సోమశేఖరానికి, మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది.
భర్తను విమర్శిస్తున్న అత్తగారిని వారిస్తుంది మధులిక.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - ముందుమాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఉదయరాగ ఉద్వేగాలు – పార్ట్ 14 చదవండి.
అనుకోని విధంగా ఫైనల్ ఇయర్ ఫలితాలు రాక మునుపే కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది. ముగ్గురు నలుగురు బ్యాచ్ మేట్స్ సహా ఇంద్రకిరణ్ కూడా ప్రీలిమినరీ స్టేజ్‌కు సెలెక్ట్ అయ్యాడు. ఫైనల్ పోస్టింగ్ కోసం అతడు కంపెనీ హెడ్ క్వార్టర్స్‌లో బోర్డ్ ఆఫ్ సెలక్టర్స్ ముందు హాజరవాలి. వాళ్ళ ముందు గాని అవుననిపిస్తే ఆఫీసర్ క్యాడర్‌కు చెందిన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్ట్ ఖరారయినట్లే!
మొదటి ప్రత్యక్ష ఇంటర్వ్యూ-మొదటి పోస్ట్- ఇంద్రకిరణ్‌కు ఉత్కంఠ ఊగిసలాడిస్తోంది. విద్యుత్ వంటి ఆ వార్త ఇంటిల్లపాదినీ ఊగిసలాడిస్తోంది. మధులిక మరదికి సెలక్షన్ బోర్డును ఎదుర్కోవడంలో పలు మెళకువలు నేర్పించసాగింది. సెలక్షన్ కమిటీ సభ్యులముందు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో వివరించసాగింది. మరీ వినయం-అదే సమయాన మరీ ఓవర్ యాక్షన్ లేకుండా సమస్థాయిలో ఉండేలా చూసుకోవాలని హెచ్చరించింది. సవ్యాతి సవ్యంగా ఉండక పోయినా పరవాలేదు. అపసవ్యంగా మాత్రం ఉండకుండా చూసుకోవాలని నొక్కివక్కాణించింది.
***
ఫైనల్ ఇంటర్వ్యూ జరిపే రోజు రానే వచ్చింది. కార్పొరేట్ వ్యాపార సంస్థల డ్రెస్ కోడ్ ప్రకారం ఇంద్రకిరణ్ వదిన సలహా ప్రకారం తెల్ల షర్ట్ తొడుక్కుని మెడకు టై-కట్టుకుని ఠీవిగా స్టయిలిష్‌గా తయారయి వెళ్ళాడు. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టు అంటే ఆషామాషీ వ్యవహారమా! ఆనుపానులు మెళకువలూ నేర్చుకున్న తరువాత ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తరువాత-ప్రొబేషనరీ పీరియడ్ కూడా సజావుగా పూర్తి చేసుకున్న తరువాత వైకుంఠపాళిని దాటుకుంటూ ఆఫీసర్ క్యాడర్‌కు చేరుకోవడమే కదా! కాని—కంపెనీ ఇంటర్వ్యూలో ఏమి జరిగిందో ఏమో మధ్యాహ్నం ఇల్లు చేరుకున్న తరువాత నిశ్శబ్దంగా సోఫామూల ఒదిగి ప్రక్కనున్న పూలకుండీ వైపు తదేకంగా చూస్తూ కూర్చున్నాడు ఇంద్రకిరణ్.
చిన్నకొడుకుని ఆ రీతిన చూసిన సదానందానికి అనుమానం సర్రున పొడసూపింది, ఇంటర్వ్యూలో కుర్రాడి పెర్ఫార్మెన్స్ బెడిసికొట్టిందేమో! అయినా ఇందులో వగచడానికేముందని? ఇది కాకపోతే మరొకటి— ఆటు పోటుల్లో ఇది కూడా ఒకవిధమైన బ్రతుకాటే కదా! ఇంద్రకిరణ్ కాకుండా వాడి కాలేజీ మేట్స్ ఇంకెవరైనా సెలెక్ట్ అయ్యారేమో! అందుకే వాడు సింకింగ్ ఫీల్‌కు లోనవుతున్నాడేమో! అందుకే అతడు తరచుగా కొడుక్కి ప్రబోధిస్తుంటాడు ఎక్కువగా దేనినీ ఆశించకూడదని, అందుకోవటానికి త్వరగా ఆశించకూడదని-- ముఖ్యంగా వాళ్ళ చేతుల్లో లేని దానికోసం వెంపర్లాడకూడదని. మొదటిసారి హాజరయిన ఇంటర్వ్యూలో ఎదురయిన మొదటి దెబ్బకు చిన్నకొడుకు తట్టుకోలేకపోతున్నాడేమో! ఇటువంటి దెబ్బలు మరో నాలుగు సార్లు తింటే తానుగా రాటుదేలిపోతాడులే— అలా ఆలోచించుకుంటూ సదానందం కొడుకు వద్దకు వెళ్ళేలోపల ఉమాదేవి చకచకా మేడమెట్లు దిగి చిన్న కొడుకు వద్దకు పరుగున వచ్చింది-
“ఏమైందిరా ఇంద్రా! ఇంటర్వ్యూ ఇంకా పూర్తికాలేదా!“ ఆదుర్దానిండిన గొంతుతో అడిగిందామె.
మెడనున్న టైని వదులు చేస్తూ విప్పి చేతిలోకి తీసుకుంటూ లేచాడు ఇంద్రకిరణ్- “అదేమీ లేదమ్మా! ఇంటర్వ్యూ పూర్తయింది. రిజల్ట్ ఇప్పుడిప్పుడే చెప్పమూ- పోస్టులో మేటర్ వస్తుందని పంపించేసారు”
అప్పుడక్కడకు చేరుకున్న సదానందం అడిగాడు- “మరెందుకురా అంత డీలాగా తయారయావు? ఒకవేళ ఫలితం అనుకూలంగా ఉండకపోయినా పోయేదేముంది? ఇంకెన్నో పోటీ పరీక్షలుంటాయి. ఇంకెన్నో ఇంటర్వ్యూ కార్టులు వస్తాయి. మొదటి సారే ఇంతలా టెన్షన్‌కు లోనయితే ఎలా రా!“ అంటూ చేతిలో ఒక స్లిప్పు నోట్ ఉంచాడు.
తండ్రి అందించిన ఆ నోటుని చూసాడు ఇంద్రకిరణ్. అందులో ఉన్నది ఒక కోచింగ్ గైడ్ పలికిన వాఖ్యానం— “విజయానికి ప్రేరణ ఉండాలి. ప్రేరణ ఉంటే చాలదు. అనుకున్నది సాధించాలన్న తపన ఉండాలి. అది మాత్రం ఉంటే చాలునా— దానిని సొంతం చేసుకోగల శక్తి ఉండాలి. మధ్యలో ఎదురొచ్చే సమస్యలకు ఎదుర్కాలు పలికే మనోబలం కావాలి. అక్కడక్కడా అప్పుడప్పుడు డీ-కొనే వైఫల్యాలను భావోద్వేగాలకు లోనుకాకుండా నిలద్రొక్కుకోగల ఆత్మనిగ్రహాన్ని పెంపొందించుకోగలగాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది”
అదంతా సాంతమూ చదివిన తరువాత ఇంద్రకిరణ్ అభావంగా ఇద్దరి వైపు సూటిగా చూస్తూ అన్నాడు. “నన్ను ముందు చెప్పాల్సింది చెప్పనిస్తారా!”
ఆలోపల అక్కడకు మెల్లగా నడుస్తూ వచ్చిన నర్సమ్మ మనవడికి వత్తాసుగా అంది- “నువ్వు చెప్పరా కిరణూ! మొగుడూ పెళ్లాలిద్దరూ అనవసరంగా కంగారు పెట్టిస్తున్నట్లున్నారు. నిదానంగా చెప్పరా!“
ఇంద్రకిరణ్ ఎడబాటు తీసుకుంటూ ఊపిరి అందుకుంటూ బదులిచ్చాడు- “నేనీరోజు అన్నయ్య ఫ్రెండ్‌ని చూసాను. ఫ్రెండంటే ఫ్రెండ్ కాదనుకో—వాడి క్లోజ్ గాళ్ ఫ్రెండ్ కమలాదేవిని—“
ఆమాట విన్నంతనే వాళ్ళమధ్య టపాసు పేలినట్లు ఉలిక్కిపడుతూ ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రెండు క్షణాల తరువాత నర్సమ్మ పలికింది “దాని పేరు కమలాదేవి కాదు. కమలవాణి. అసలు దానింటికి నువ్వెందుకు వెళ్ళావురా?”
“నువ్వు మరీను బామ్మా! నేనెందుకు ఆమెగారింటికి వెళతాను? నాకేమిటి పిచ్చా! కంపెనీలో బోర్డ్ ఆఫ్ సెలక్టర్స్‌కు ఆమె గారే చైర్మన్- డిప్యూటీ ఎమ్.డి. హోదాలో--“
ముగ్గురూ నోటమాట రాక ఊరకుండిపోయారు. కాసేపటికి మళ్ళీ నర్సమ్మే మనవణ్ణి కదిపింది- “ఐనా నీకెందుకురా దాని గురించి లేనిపోని దిగులు. నువ్వెవరివో దానికి తెలియదుగా! మీ అన్నయ్యతో ఏదో పార్కులో ఉన్నప్పుడు దాని ఫోటో మొబైల్‌తో తీసావన్నది దానికి తెలిసే అవకాశమే లేదుగా!”
“విషయం అది కాదు బామ్మా! కమలవాణి గారు మామూలు లేడీ కాదు. చాలా టఫ్-విత్ షార్ప్ బ్రెయిన్. ఇంటర్వ్యూ జాబితాకు చివరి సవరణలు చేసి మాకందరకూ టీలు ఇప్పించి మమ్మల్నిక వెళ్ళమన్నారు. అందరితో బాటు ఆమెకు నేను కూడా థాంక్స్ చెప్పి బయటికొచ్చేసాను. అప్పుడు వాళ్ళ పి.ఎ. పరుగున వచ్చి నన్ను మేడమ్ పిలుస్తున్నారని కబురందించింది. నాకు దిగ్గున అనిపించింది. అయినా—అసహనాన్ని అణచుకుంటూ వెళ్ళి అడిగాను-పిలిచారా మేడమ్-అని.
’అవును. పిలిచాను. మీ ముఖం చూస్తుంటే ఎక్కడో చూసినట్టు--మా బంధువొకాయన గుర్తుకి వస్తున్నాడు‘ అంది ఆమె. ఆమె అలా అన్న వెంటనే నాకేమి అయిందో నాకే తెలియదు-ఠపీమని రిటార్ట్ చేసాను- ‘నాకు తెలుసు మేడమ్ ఆ బంధువెవరో! అతని పేరు మిస్టర్ సోమశేఖరం. వాడు మా అన్నయ్యే—సదానందం గారి పెద్ద కొడుకు. ఒకానొకప్పుడు వాడికి మా ఇంట్లో మంచి పేరుండేది. ఇప్పుడా మంచి పేరు లేదు‘ అన్నాను.
ఎందుకన్నట్టు నా కళ్ళలోకి చూసింది. నేను మళ్ళీ ఠపీమని బదులిచ్చాను- ‘వాడికిప్పుడు రెండు పెళ్ళాల మొగుడు అన్న రొమాంటిక్ పేరుంది‘ అలా బదులిస్తూ వేగంగా బయటకు నడిచాను తిరిగి చూడకుండా—“
అతడలా చెప్పడం పూర్తి చేసాడో లేదో సదానందం అరచినంత పని చేసాడు-“నీకు మతి గాని పోయిందిరా! ఆమెతో తగవులాటకు దిగి చేతికందబోయే ఉపాధిని చేతులార పోగొట్టుకుంటావా? అసలు ఆమెతో నీకెలా సంబంధం ఉంటుందిరా! నువ్వేదో మార్కెటింగ్ డివిజన్‌లోనో లేక అకౌంట్స్ సెక్షన్‌లోనో పని చేస్తూ, పని నేర్చుకుంటూ గడుపుతావు. అసలు కమలవాణి ముఖంలో ముఖం పెట్టి చూసే అవకాశమే నీకు ఉండకపోవచ్చు. తొందరపాటు బ్రతుకు బాటపై గొడ్డలి పోటుగా మారకుండా చూసుకోవాలి. తెలుసా--”
ఈసారి ఉమాదేవి భర్తకు వత్తాసుగా వచ్చింది.“అవున్రా చిన్నా! జీవనోపాధి వేరు—పర్సనల్ ఈక్వేషన్స్ వేరు. రెంటినీ మిక్స్ చేయకూడదు. నువ్వు ఉపయోగించిన కరకు మాటకు కమలవాణి రియాక్ట్ అవుతుందేమో! ఆడాళ్ళకు ఏమి ఉంటుందో ఏమి ఉండదో చెప్పడం కష్టం గాని ఉద్వేగాలు ఉక్రోశాలు మాత్రం అధికంగానే ఉంటాయి“
దానికతడు ఊరుకోలేదు. సూటైన కంఠ స్వరంతో బదులిచ్చాడు- “రియాక్ట్ అయితే అవనివ్వమ్మా! అసలావిడ బోర్డ్ ఆఫ్ సెలక్టర్స్‌కు చైర్మన్ అని తెలిస్తే నేనా కంపెనీ ఇంటర్వ్యూకే వెళ్ళి ఉండేవాణ్ణి కాను. ఇది నిశ్చయం--” అంటూ లేచి వెళ్ళిపోయాడు.
ఇదంతా మేడపైనుంచి చూస్తూ నిల్చున్న మధులిక మరిది వైఖరికి మనసున అదోలా ఫీలవుతూ నెత్తిపైన సన్నగా కొట్టుకుంది. మరిదికి ఆవేశం ఉన్నంతగా ఆలోచన లేదులా ఉంది. రాటు దేలాల్సి ఉంది. జీవితానుభవం సంపాదించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఇంద్రకిరణ్ ఫార్మా కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళి వారం దాటిపోతోంది. అటునుంచి పోస్ట్ మాన్ ఇటునుంచి కొరియర్ సిబ్బంది వచ్చిపోతున్నారే గాని ఒక్కరు కూడా ఇంటి వసారా వరకు వచ్చిన జాడ లేదు. ఆ తరువాత క్రమంగా ఇంద్రకిరణ్ మునుపులా వసారా వైపు చూడటం మానుకున్నాడు. తన గదిలో ఒంటరిగా కూర్చుని మొబైల్‌లో ఏవేవో చూస్తూ సమయం గడుపుతున్నాడు.
ఎప్పుడైతే తన కాలేజీ మేట్స్ కొందరికి నియామక పత్రాలు చేరాయని కబురందుకున్నాడో అప్పట్నించి అతడిలో అసహనం మరింత పెరిగింది. ఇదంతా దూరం నుంచి చూస్తూనే పూజాగదిలో దైవ స్తోత్రాలు పఠిస్తూనే తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే మరది మానసిక పరిస్థితి గమనిస్తూనే ఉంది మధులిక. కాస్తంత సంకోచాన్ని ప్రక్కన పెట్టి కమలవాణి వద్దకు వెళ్ళి ఒకే ఒక మాట-సారీ-అని చెప్తే కంపెనీనుండి నియామక పత్రం పావురంలా రెక్కలు కట్టుకుని వసారాముంది వాలుతుంది, కాని మరిది అలా చేయడు. తనకంటే అతడికే కమలవాణి పైన కోపం ఎక్కువగా ఉందన్నది ఆమెకు తెలుసు. మరి—దీనికి మరొక మార్గం--సోమశేఖరాన్ని కదపాలి. కాని—తను ససేమిరా ఆపని చేయలేదు. తన పచ్చటి సంసార జీవితంలోకి దొడ్డి దారిన చొరబడాలని చూస్తూన్న అటువంటి నంగనాచీనా తను మోకాలొడ్డి వేడుకుంటుంది? అది ఈ జన్మలో జరగదు. జరగకూడదు.
తనలోని రెపరెపలాడుతూన్న సందిగ్ధావస్థను గమనించనట్టు ఇంద్రకిరణ్ దురవస్థను తెలియనట్టు అత్తయ్యా అవ్వా తననే సూటిగా తదేకంగా చూడటం మధులిక గ్రహించకపోలేదు. ఏదైనా చెప్పాలనుకున్నా నోరు విప్పి చెప్పలేని పరిస్థితి. ఇంట్లో కమల వాణి ఊసెత్తడం అంటే చప్పున ఎర్రని విద్యుత్ తీగను తాకడం వంటిదే--ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో! నిన్న కాక మొన్న జరిగిన మరొక ఉదంతం ఆమెకు గుర్తుకి వచ్చింది.
ఎవడో కాలేజీ మేట్ ఇంద్రకిరణ్ కోసం ఫోన్ చేసాడు. ఇంట్లో లేడు ఏమి కావాలని అడిగిందామె. అతడు బాంబు తునక విసిరాడు; తనకు నియామక పత్రం వచ్చేసిందని. ఇంద్రకిరణ్‌కు ఇంకా రాకపోతే తిన్నగా కంపెనీ మేడమ్‌ని కలుసుకోమని-ఆలస్యం అమృతం విషమని—ఆ వార్త విన్న ఆమెకు దిగ్గున అనిపించింది. వచ్చిన చిక్కల్లా అదే కదా! మరది మేడమ్‌ని కలుసుకోక పోవడమేగా వచ్చిన సమస్యల్లా---
ఆరోజు ఆదివారం. పొరుగింట్లో వరలక్ష్మీ వ్రత పూజకు రమ్మనమని కబురందుకుని మధులిక పట్టు చీర కట్టుకుని నుదుట కుంకుమ బొట్టు దిద్దుకుని కొప్పునిండా కనకాంబరాలు తురుముకుని, శేఖరానికి ఓమాట చెప్పి గదిలో స్తబ్దుగా కూర్చున్న ఇంద్రకిరణ్ వద్దకు వెళ్ళి ఫలహారం ప్లేటు అందించి ప్రక్కన కాఫీపోసిన ఫ్లాస్క్‌ను ఉంచి చిలిపిగా జుట్టుని నిమిరి మేడ మెట్లు దిగసాగింది.
అప్పుడు ఆమెను అల్లంత దూరంనుంచి చూస్తూనే నర్సమ్మ అంది- “ఎవరో అబ్బాయి ఈ కవరునిచ్చి ’ఆగవయ్యా!‘ అని పిలుస్తున్నా ఆగకుండా తుర్రుమన్నాడు. అంతా ఇంగ్లీషులో ఉంది. అక్షరాలు కూడా కళ్ళకు ఆనక నీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చి చూడమ్మా ఇది ఎవరికోసం వచ్చిందో--“ అని ఒక పొడవాటి కవరుని అందించింది.
ఆదివారం పూట పోస్టల్ కవరా—తనకు తెలిసి ప్రైవేట్ కొరియర్ మెసెంజర్ కూడా ఆదివారం పూట రావటానికి ఇష్టపడడు. మధులిక అలా ఆలోచిస్తూ తనకు తను నమ్మలేనట్టు రెప్పలు అల్లాడిస్తూ కవరుకు రెండు వైపులా చూసి కవరు మొన వేళ్ళతో చించింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అది ఇంద్రకిరణ్ కోసం వచ్చిన నియామక పత్రం-బోర్డ్ ఆఫ్ సెలక్టర్స్ తరపున కమలవాణి సంతకం బోల్డ్‌గా ఉంది. అబ్బ-అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచిందామె.
ఎట్టకేలకు కమలవాణి లేనిపోని పట్టింపులకు పోకుండా రుసరుసలు పోకుండా ఇంద్రకిరణ్ సోమశేఖరం తమ్ముడన్నది మరచిపోకుండా తన కర్తవ్యం సజావుగానే నెరవేర్చినట్లుంది; ఎటువంటి హంగామాకీ చోటివ్వకుండా-- నర్సమ్మకి విషయ వివరణ ఇస్తూ ట్రైనింగ్ పీరియడ్‌లో కన్సాలిడేషన్ జీతం కూడా ఇస్తారని చెప్తున్నప్పుడు ఉమాదేవి చిన్న కొడుకుతో కలసి చకచకా మెట్లు దిగి వచ్చింది.
“అది నిజంగానే నియామక పత్రమేనా మధులికా! ఈరోజు ఆదివారం కదూ-అందుకని అడుగుతున్నానమ్మా!“
మధులిక నవ్వుతూ పత్రాన్ని ఇంద్రకిరణ్‌కు ఇస్తూ అంది- “అవునత్తయ్యా! మొదట నేను కూడా ఏమో అనుకున్నాను” అని మరది వైపు తిరిగి కంగ్రాట్స్ చెప్తూ అంది.”ఇకపైన ఉన్నపళంగా ఆవేశానికి లోనుకాకుండా కెరీర్‌పైనే దృష్టి పెట్టాలి. నీకెవరి పట్లయినా ఇష్టం లేకపోతే వాళ్ళతో మాట్లాడాలని తోచనప్పుడు ముఖం చాటేసుకుని వెళ్ళిపో-యాజ్ సింపుల్ యాజ్ హిట్టింగ్ ఎ స్లో క్రికెట్ బాల్-నీకు కంపెనీతో పని గాని, మీ డిప్యూటీ ఎమ్.డి.తో కాదుగా! నీ వయసు కుర్రాళ్ళు నీతో బాటు వచ్చి చేరుతారు. హాయిగా వాళ్ళతో కబుర్లాడుతూ ప్యాంట్రీలో టైమ్ స్పెండ్ చేయవచ్చు లేనిపోని టెన్షన్ దరిచేర నివ్వకుండా-- ఓకే!“
అప్పుడు ఉమాదేవి కొడుకు తలపైన చిన్నపాటి మొట్టికాయ పెట్టి విప్పారిన ముఖంతో అంది- “విన్నావు కదరా మీ వదిన చెప్పిన మాటలు. ఎంత ప్రాక్టికల్‌గా ఉన్నాయో గమనించావా! ఆ నాడు అర్జునుడి చూపు పిట్ట కంటిపైన ఉన్నట్టు ఇకపై నీ చూపు అంతా నీ కెరియర్‌పైనే నిలవాలి--”
సరిగ్గా అదే సమయాన బ్రీఫ్‌కేస్‌తో మేడమెట్లు దిగిన సోమశేఖరం తల్లి వైపు చూస్తూ అడిగాడు“ఎవరమ్మా అంత ప్రాక్టికల్‌గా చెప్తున్నది? నాకు కూడా అలా చెప్తే బాగుంటుందేమో!”
ఉమాదేవి కొడుకు వైపు తిరగలేదు. ముఖం వైపు చూడలేదు. ఆమె మాత్రమే కాదు, అక్కడున్నవారెవరూ నోరెత్తలేదు. వాతావరణంలోని టైట్ సిట్యుయేషన్ అర్థం చేసుకున్న శేఖరం గాంభీర్యత నింపుకున్న ముఖంతో మధులిక వైపు చూపు సారిస్తూ “నువ్వేదో వ్రత పూజకి వెళతానన్నావుగా! వెళ్ళలేదు! పుణ్య ఘడియ దాటిన తరువాతనే చేరుకుంటావా?” అంటూ గుమ్మం వైపు నడిచాడు.
అప్పుడు నర్సమ్మ గొంతు ఖంగుమంది. ”అక్కడాగరా పెద్దోడా! ఈరోజు ఆదివారం కదా—మీ ఆఫీసులో పనేముంటుందిరా!“
సోమశేఖరం ఎక్కడివాడక్కడే నిల్చుని నవ్వుతూ బదులిచ్చాడు-“సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు హాలిడేస్ లెక్కలోకి రావు బామ్మా! సూరత్ నుండి వ్యాపార బృందం వస్తోంది. వాళ్ళతో జరిపే చర్చల్లో మేం సీనియర్ జనరల్ మేనేజర్‌కు అసిస్ట్ చేయాలి. ఇంకేమైనా అడగాలా బామ్మా?“
తల అడ్డంగా తిప్పుకుంది నర్సమ్మ. బండి ఉంచిన స్టాండ్ వైపు నడచిపోతున్న శేఖరాన్ని చూస్తూ మధులిక అబ్బురపడింది. ఇంతకీ తమ్ముడు మేనేజ్‌మెంట్ ట్రైనీగా కమలవాణి వాళ్ళ ఫార్మా కంపెనీలో చేరబోతున్నాడన్నది సోమశేఖరానికి తెలుసా తెలియదా! లేక తెలియనట్టు ముభావంగా చూపులు సారించి సాగిపోతున్నాడా!
ఏమో—ఎవరు చెప్పొచ్చారు.. తన భర్త కూడా ప్రపంచీకరణ ప్రభావంతో చాలామందిలా నటించడం నేర్చుకుంటున్నాడేమో! ఆమె అలా ఆలోచిస్తూ శేఖరాన్ని అనుసరించింది.
===============================================
ఇంకా వుంది
ఉదయరాగ ఉద్వేగాలు - పార్ట్ 14 త్వరలో
===============================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments