top of page

భార్యాభర్తలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Bharyabharthalu' New Telugu Story Written By Bhagavathula Bharathi


రచన: భాగవతుల భారతి



"ఎలాగోలా తప్పించున్నామనుకున్నాం."

ముఖం కంద గడ్డలా చేసుకుని భార్యవంక రుసరుస లాడుతూ చూసాడు కూర్మాంగద.


"తాతాచార్ల వారి ముద్ర వీపు తప్పినా భుజం తప్పలేదన్నమాట. గత మూడు వేవ్ లూ దాక్కుని దాక్కుని,ఇంట్లో అందర్నీ మీ అతిభయంతో చావగొట్టుకు తిన్నారుగా ..

పిట్ట బిఱ్ఱు మననీయకుండా, ఒకింటి మీది కాకి మనింటిమీద వాలనీయకుండా,..

డబ్బులు కూడా కడిగారుగా! "

మూతి మూడువంకర్లు తిప్పింది తాయారు.


"అంటావే! అంటావ్! నేను అంత జాగ్రత్తగా ఉండబట్టే మెుదటి మూడూ తప్పించుకున్నామ్. ఈ వేవ్ నీ వల్లే వచ్చుంటుంది. వద్దన్నకొద్దీ ...అక్కావాళ్ళు కారుకొన్నారూ? చూసి వస్తామని పోయావుగా! అంటి ఉంటుంది. "


"ఆ మాటే అనొద్దన్ననా!? నేను ఎంత జాగ్రత్త గా గ్లౌజులూ, మాస్కులూ వేసుకుని వెళ్ళానూ? మీరే సిగరెట్లనీ పాన్ లకీ షాప్ కి వెళ్ళి, కరోనా.... "


"అమ్మా, తల్లీ, దండ్రీ! మీరిద్దరూ గోల ఆపితే,

కరోనా లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతాను ." అన్నాడు డాక్టర్ తలతపేలా.

"ముందుగా ఓ గదిలో బందీలై ఉండాలి.

ఇదిగో ఈ మందులు కోర్స్ ప్రకారం వాడాలి.

ముఖ్యంగా కూర్మంగారూ! మీరూ... "


"అమ్మో ఓగదిలో ఉండాలా? నేను ఒక్కణ్ణే ఉండాలా? తాయారు ను వదిలి నేనుండలేను నాకు భయం. "

"డాక్టర్ గారూ! "అంటూ తాయారు డాక్టర్ కి సైగచేసింది .


"అదేంటండీ! మీ ఆవిడగారూ మీతో ఉంటారుగా ...ఇంకేం ఎంచక్కా పోట్లాడుకుంటూ కాలక్షేపం చేయండి " అన్నాడు తలతపేలా .

"ఏ డాక్టరైనా పోట్లాడుకోమని చెబుతారా? "

అడిగాడు కూర్మాంగద, గుర్రుగా..


"అయ్యా! ఓ రైలు ఎక్కిన జంట, ఒకే కిటికీలోంచి చూస్తుంటే వాళ్ళు లవర్స్. అదే

గుడ్లుమిటకరించుకుంటూ, ఒకరినొకరు మిర్రిమిర్రి చూసుకుంటూ, వేరువేరు కిటికీల్లోంచి చూస్తూ కూర్చుంటే, భార్యాభర్త లన్నమాట.

కాబట్టీ మీ ఇద్దరూ ఒకే గదిలో… డింగుటకా డింగుటకా... " ఛలోక్తి విసిరాడు తలతపేలా.


"డింగుటకా అంటే.."

"మీ ఆవిడగారు చెబుతారులే, మీ ఫామిలీ డాక్టర్ గా సరదాగా జోక్ చేసాను. కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా కలకాలం ప్రేమను పంచుకునేది ఒక్క భార్యాభర్తలబంధమేనయ్యా .. చక్కగా ఉండండి " నవ్వాడు డాక్టర్.


"అవునూ! తలతపేలా అని మీ పేరు మాకెప్పుడూ విచిత్రంగానే ఉంటుంది.

దీనిఅర్ధం ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదూ?!"


"ఇదేదో మెడికల్ పరిభాషైతే చెప్పేవాణ్ణే. అప్పట్లో, హెల్మెట్ వచ్చిన కొత్తట. నేను పుట్టగానే నా తల లావుగా ఉండటం చూసి తలతపేలా గాడు పుట్టాడే అన్నాట్ట. ఆనందం పట్టలేని ,తెలుగుభాషా ప్రవీణుడైన మాతాత ... ఇకఅంతే. ఆ పేరే ఖాయం చేసారు, " అని చెప్పాడు, తనకేగదా వెరైటీ పేరుందని మురిసిపోతూ ...తలతపేలా..


"ఇవాళా రేపూ వచ్చే కరోనాతో ప్రమాదం ఏం కాదన్నారూ ?!" కూర్మాంగద తల్లి అడిగింది.


"అమ్మా! నీ వయసురీత్యా, నీకు పిల్లలకూ అంటుకోకూడదని, మేం గదిలోనే ఉంటాం "

అన్నాడు, కూర్మాంగద.

ఇక టామ్ అండ్ జెర్రీ మెుదలయింది.


"ఏమండీ! గదిలోనూ మాస్క్, చెప్పులు వేసుకుతిరగమన్నారుగా డాక్టర్. "

"నేను చెప్పులు వేసుకోను. లెంపలేసుకుంటా నీతో .. ఇందులో ఉన్నందుకు "


"ఏమే! సూర్యుడికెదురుగా నిలబడమన్నారే పోదాం రా! "

"సూర్యుడితో నాకేం పనీ ...నక్షత్రాలతో నాకేం ఒరిగిందనీ... "


"నీ దుంప పిలకెయ్య !ఇందులో కూడా కవితాత్మకతా?! మీ నాన్న నిన్ను ఇంత మెుండిగా కన్నాడేంటో " ముఖం చిట్లించి అడిగాడు.


"నాన్నలకేం అంతే కంటారు. మనం ఎలా తయారవుతామో కలగనలేరుగా ?!"

"నీ ప్రాసలు పెద్దపులి ఎత్తుకెళ్ళా! "


"ఏమండీ! కరోనా సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలటండీ! "

"పౌష్టికాహారం పేరుతో కుక్కలూ, పిల్లుల్నీ తినమంటావా ?"

"వాక్.... వాంతులు వచ్చేటట్లు అవేం మాటలండీ"


"ఎలుకనూ పిల్లినీ ఓ గదిలో పడేసి తన్నుకు చావమన్నాడు,ఆ డాక్టర్ … రేపు అడుగుతా ఉండు. " అన్నాడు కోపంతో రుసరుసలాడుతూ .


అన్నిటికీ ఇద్దరికీ గదిలో చిలిపి తగాదాలే. ఇద్దరూ ఎడ్డెమంటే తెడ్డెమే. గిల్లికజ్జాలే.

ఈ నాలుగురోజుల్లో కూర్మాంగద చాల కోలుకున్నాడు.

డాక్టర్ టెస్ట్ చేసారు. " ఓకే చాలా సంతోషం తగ్గిపోయింది. "

"మరి తాయారు కీ"


"ఆమెకు కరోనా లేదు. మీరు గదిలో ఒక్కరే ఉంటారని మీకు భయమన్నారని, తనకూ కరోనా ఉన్నదని, నా చేత అబద్దం చెప్పించారు. మీకు తగ్గిందికాబట్టి...ఇక ఇద్దరూ హ్యాపీ" -డాక్టర్ తలతపేలా.


కూర్మాంగద తాయారు వంక బాధగా చూసి, తలతపేలా తో " ఇన్నిరోజులుగా నాతో గదిలో ఉంది. ఎందుకైనా మంచిది. టెస్ట్ చేయండి." అన్నాడు.

టెస్ట్ చేసి " అయ్యో! సారీ తాయారుగారూ! మీకు కరోనా ,మీరొక్కరే హోమ్ క్వారంటైన్ లో ఉండాలండీ!" అన్నాడు.


"ఫరవాలేదండీ! అప్పుడూ, ఇప్పుడూ ఆయన క్షేమంగా ఉండటమే కోరుకున్నాను.

నేను గదిలో ఉండగలను. " అంది.


"తాయారు గారూ! గదిలో ఒంటరిగా ఉండటానికి తయారా? ఎంతలెండి ఓ నెలరోజులు గదిలోనే ఉండిపోండి.. కూర్మాంగదను వాళ్ళ అమ్మకు వదిలేసి " నవ్వాడు డాక్టర్.


"హమ్మో! నెలరోజులా ? ఐనా ముందు జాగ్రతగా మందులు వాడితే బాగుండేదిగా " కూర్మాంగద బుంగమూతి పెట్టాడు.


"చాలామంది అలాగే వాడుతున్నారుకానీ, కరోనా లేకుండా మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయని నేనే వద్దన్నాను. " అన్నాడు తలతపేలా.


"మరి నాతో ఎవరు పోట్లాడతారూ?!"


"బాధపడకండి...మీతో గదిలోంచే పోడ్లాడతాగా! ప్రామిస్" అంటూ నవ్వింది తాయారు.


తాయారును దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టాడు కూర్మాంగద. నీ పోట్లాటలోకూడా ఇంతప్రేమ ఉందా!? అన్నట్లుగా....


'మీకూ అంతే ప్రేమేగా!' అన్నట్లు నవ్వింది తాయారు .

$$$$$$$$$$

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


151 views0 comments
bottom of page