పల్లె పిలిచింది - 16
- T. V. L. Gayathri
- Jun 7
- 2 min read
Updated: Jun 9
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #ధ్రువకోకిల, #కావ్యము

Palle Pilichindi - 16 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 07/06/2025
పల్లె పిలిచింది - 16 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
71.
తేటగీతి
విద్య యుద్యోగ వసతులు విరివిగాను
నగరవాసులు పొందుచు నమ్మకమగు
జీవనభృతితో గడుపుచు చింతమరచి
యున్నతంబగు స్థితిగూడి యుందురచట.//
తాత్పర్యము.
పట్టణములలో విద్య, ఉద్యోగ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. జీవనభృతికి లోటు లేదని నగరవాసులు నమ్మకంతో, దిగులు పడకుండా ఉండి, ఉన్నతమైన స్థితిని పొందుతూ ఉంటారు.//
72.
ధ్రువకోకిల.
విలువపెంచెడి విద్యలిట్టుల వృద్ధిచెందును శీఘ్రమే
పలురకంబుల వృత్తులీదరి వైభవంబుగ వెల్గగన్
నిలిచి యుండు వికాసమెప్పుడు నిశ్చయంబుగ జాతికిన్
గలిమి కూడును పట్టణంబులు ఖ్యాతితో విలసిల్లగన్.//
తాత్పర్యము.
గొప్పవైన విద్యలు నగరంలో వృద్ధి చెందుతూ ఉంటాయి. చాలా రకాలైన వృత్తి విద్యలు ఇక్కడ ఉంటాయి. అందుకని పట్టణాలు వికాసంతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సంపదలతో నగరాలు ప్రసిద్ధి చెందుతూ ఉంటాయి.//
73.
తేటగీతి.
ప్రగతిపథమును జూపెడి పట్టణములు
దేశమున్ నడిపించును తీరుగాను
భావి నిల్పెడి జాతీయ భావములను
ప్రజల హృదిలోన కల్పించి విజయమిడును.//
తాత్పర్యము.
దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపించేవి పట్టణములే. అందరం ఒక్కటే అనే జాతీయ భావనతో పట్టణవాసులు విజయులై కలిసి మెలిసి ఉంటారు.//
74.
ధ్రువకోకిల.
కులమతంబుల భేదభావము కూడదంచును పౌరులున్
నిలుతురెప్పుడు జాతికోసము నెయ్యులై నగరంబులో
కలలు తీరెడి మార్గమందున గౌరవంబుగ సాగుచున్
వెలుగుపంచుదురీ జనంబులు వేదనల్ దిగమ్రింగుచున్.//
తాత్పర్యము.
పట్టణాల్లోని పౌరులు కులమత భేద భావములు చూడరు. జాతి కోసము స్నేహంతో మెలుగుతారు. నగరంలో వివిధ వృత్తులలో పనిచేస్తూ, కష్టాలు దిగమింగుతూ గౌరవంబుగా బ్రతుకుతూ, ప్రక్కవారికి తోడుగా ఉంటారు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments