top of page

పల్లె పిలిచింది - 17

Updated: Jun 11

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తురగవల్గనరగడ, #తేటగీతి, #తరలి, #గణనాథ, #కావ్యము

ree

Palle Pilichindi - 17 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 09/06/2025

పల్లె పిలిచింది - 17 - తెలుగు కావ్యము ప్రథమాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



75.

తురగవల్గన రగడ.


కష్టసుఖములందు మీరు కలిసియుండచాలు నగుచు 

నిష్టమైన చదువు కొఱకు నిట్లు నగరవాసు లగుచు 


మరువవలదు పల్లె నెపుడు మాన్యుల వలె నడిచిపొండి!

వెరపు వీడి బ్రతుకుచుండి బిడ్డలార!వెళ్లి రండి!


దారితప్పకుండ మీరు తల్లి దండ్రి మాట నిలిపి 

చేరుకొనుడు గమ్యమిపుడు చింతమరచి మదిని నిలిపి 


సారభూతమైన విద్య శ్రద్ధతోడ నేర్చుకొండి!

చారుమతులుగా మెలంగి జాతికొఱకు కదలి రండి!//


తాత్పర్యము.


ఓ బిడ్డలారా!కష్టసుఖములలో మీరు కలిసి యుండండి!మీకు ఇష్టమైన చదువు చదువుకొనుచు పట్టణంలో ఉన్నా కూడా మన పల్లెను ఎప్పుడూ మరచిపోవద్దు!దారి తప్పకుండా, మీ తల్లిదండ్రుల మాట నిలపండి! చక్కగా మీ లక్ష్యాన్ని సాధించుకొని, బుద్ధిమంతులై మన దేశమును బాగు చేయటానికి కదిలి రండి!//


76.

తేటగీతి.


అరుణగిరి బోధ శ్రద్ధగ నాలకించి 

ఛాత్రులెల్లరు నగవుతో నతులు చేసి 

'మంచి విద్యార్థులుగ మేము మసలు కొనుచు 

చదువు కొనుచుందు' మనిరట సమ్మతముగ.//


తాత్పర్యము.


అరుణగిరి చెప్పిన విషయాలను విద్యార్థులందరూ శ్రద్ధగా విన్నారు. నవ్వుతూ ఆయనకు నమస్కారం చేసి "మేము మంచి విద్యార్థులుగా మసలుకుంటూ చదువుకుంటాము!"అని చెప్పారు.//


77.

తరలి 

భ, స, న, జ న, ర.

యతి -11


భారము కద జీవనములు పట్టణమున క్రుందుచున్ 

నీరసమును వీడి నిలిచి నిత్యము కడు ధీరతన్ 

దారివెదకి సాగుదమని ధైర్యముమెయి ఛాత్రులున్ 

జేరిరపుడు నెయ్యులగుచు చింతమరచి రత్తరిన్ .//


తాత్పర్యము.


పట్టణములో జీవనము సాగించుట ఒకింత కష్టమైనపని. అయినా విద్యార్థులు నీరసమును వీడి, ధైర్యముతో కలిసి మెలిసి గడుపుచూ, దిగులుమరచి పోయారు.//


78.

గణనాథ.

భ, స, భ, య.

యతి -7


దారుణ రుజముల్ దండిగ పురంబున్ 

జేరగ భయమౌ జీవనము లెట్లో?

దారులు కనుచున్ ధైర్యముగ సాగన్ 

 ధీరులు శుభముల్ తెచ్చిరట ఛాత్రుల్ //


తాత్పర్యము.


పట్టణంలో రోగాల భయం ఎక్కువ. అయినా పల్లె నుండి వచ్చిన విద్యార్థులు ధైర్యముగా సాగుతూ శుభాన్ని తెచ్చుకున్నారు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




コメント


bottom of page