top of page

పెట్టకపోతే…

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Pettakapothe' New Telugu Story Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి


పిన్నీ! పదో తరగతి ఫలితాలు ప్రకటించినట్టున్నారు… ఆకాశ్ కి ఎంత స్కోర్ వచ్చింది" అని అక్క కొడుకు విజయ్ ఫోన్ చేశాడు.

"స్టేట్ ఫస్ట్ వచ్చాడు" అన్నదిపద్మ.


"అనుకున్నదేగా... నువ్వు కష్టపడ్డావ్! వాడు ఏంటో నీకు సాధించి చూపించాడు. ఇంకో రెండేళ్ళు కష్టపడితే మంచి ప్రీమియర్ కాలేజిలో చదవచ్చు. వాడ్ని చూసి అభినందించటానికి సాయంత్రం వస్తాను" అన్నాడు విజయ్.


@@@@@


వాటర్ వర్క్స్ శాఖలో మధ్య తరగతి ఉద్యోగి రాజేంద్ర. కుటుంబం చాలా పెద్దది కాకపోయినా , సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన తండ్రి తన సర్వీసులో సంపాదించిన డబ్బుతో ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి, పెద్ద కొడుకు రాజేంద్రని ఇంటర్ వరకు చదివించగలిగాడు.


ఆయనకొచ్చే పెన్షన్ కూడా అంతంత మాత్రమే!


పెళ్ళిళ్ళయితే తండ్రి చేశాడు కానీ చెల్లెళ్ళ జీవితాల్లో తరువాయి బాధ్యతలన్నీ రాజేంద్రవే అవటంతో, డిగ్రీ చదవాలన్న ఆశలు పక్కన పెట్టి, పరీక్షలు రాసి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు.


చిన్న ఉద్యోగస్తుడు పెళ్ళి చేసుకోవాలనుకుంటే వచ్చే పిల్ల కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది! పద్మ రాజేంద్ర భార్య అయ్యేనాటికి టెంత్ పాస్ అయింది. మంచి మార్కులతో పాస్ అయినా కూడా ఆడపిల్లని ఇంకా చదివించి, అంతకంటే ఎక్కువ చదువుకున్న అల్లుడిని తెచ్చే స్థోమతు లేని తండ్రి ప్రభాకరం... రాజేంద్రని అల్లుడిగా ఎంచుకుని పెళ్ళి చేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.


అత్తమామలు, ఆడపడుచులున్న ఉమ్మడి కుటుంబం వల్ల ఇంటి బాధ్యలతో సరిపోయేది. ఆడపడుచుల పురుళ్ళు, బాలసారెలు అయ్యేలోపు తను కూడా ఇద్దరు పిల్లల తల్లి అయింది.


తరువాత బంధువులు, స్నేహితుల సలహాతో పిల్లలని అత్తమామలు చూసుకుంటామన్న భరోసా ఇవ్వటంతో ప్రైవేట్ గా చదివి ఇంటర్ పాస్ అయి, ఆ తరువాత సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగంలో చేరింది.


తను స్వయంగా టీచర్ అవటంతో కొడుకు ఆకాశ్ ని చిన్నప్పటి నించే దగ్గర కూర్చుని బాగా చదివించింది. అలా తల్లి శిక్షణలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆకాశ్ ఆ సంవత్సరం టెంత్ క్లాసులో ఉత్తమ శ్రేణి విద్యార్ధిగా నిలిచాడు.


@@@@@


"మేం విద్యానగర్ నించి మాట్లాడుతున్నమండి. మా కాలేజి గురించి వినుంటారు. మీ అబ్బాయి రిజల్ట్స్ పేపర్ లో చూసి ఫోన్ చేస్తున్నాము. ఫీజు తీసుకోకుండా అతనికి ఐఐటి లో చేరటానికి వీలుగా బెస్ట్ కోచింగ్....తర్ఫీదిస్తాం అన్నాడు" ఒకాయన మధ్యాహ్నం ఫోన్ చేసి.


ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే మరొక కాలేజి వాళ్ళు బెల్ కొట్టారు.


సాయంత్రమయ్యేసరికి 5-6 కాలేజిల వాళ్ళు బోలెడన్ని తాయిలాలతో రెడీ అయిపోయారు.


రాజేంద్ర-పద్మ చర్చించుకుని, వ్యాపార ధోరణి తక్కువగా ఉండి ఇంటికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజి ఎంచుకుని అక్కడ చేర్చారు. ఆకాశ్ చదివిన స్కూల్ టీచర్లందరూ కలిసి అతనికి రెండేళ్ళకి కావలసిన పుస్తకాలు సమకూర్చటమే కాక ఒక స్కూటీ కూడా కొనిచ్చారు.


@@@@


తన మీద చుట్టూ ఉన్న వారందరు పెట్టుకున్న ఆశలు నిజం చేస్తూ ఆకాశ్ చెన్నై ఐఐటి లో సీట్ సంపాదించాడు.


కొడుకు మెరిట్ తో చదువులో రాణించటం సంతోషంగానే ఉన్నా...ఇప్పటి వరకు ఎలాగోలా మేనేజ్ చేసిన రాజేంద్ర మధ్య తరగతి జీవితం, ఇప్పుడెలా అనే సందిగ్ధాన్ని కలిగించింది. అమ్మటానికి ఆస్థి పాస్థులేమి లేవు. ఎడ్యుకేషన్ లోన్ పెట్టాలన్నా పూచీకత్తుగా స్థిరాస్థి అయినా చూపించాలి...సరిపడ స్థోమతు ఉన్న ఒక పర్సనల్ గ్యారంటీ అయినా ఇవ్వాలి.


తన కొడుక్కి గ్యారంటీ ఉండమని ఎవరిని అడగ్గలడు..ఇదే ఆలోచిస్తూ ఉండగా వదినగారబ్బాయి విజయ్ వచ్చాడు. "బాబాయ్ డల్ గా కనిపిస్తున్నారు..ఒంట్లో బానే ఉందా? నాలుగేళ్ళు కష్టపడితే ఆకాశ్ చదువు అయిపోతుంది. మీరేం దిగులు పడకండి" అన్నాడు పక్కనున్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ!


"అదేరా.... నిరాటంకంగా వాడి చదువు పూర్తవ్వాలంటే మన దగ్గరేం నిలవలు లేవు. మీ పిన్నిది..నాది జీతాలు కలిపితే వాడు పూర్తి ఫీజు రాయితీ వచ్చే బ్యాచ్ లో రాడు. అట్లా అని ఎంతో కొంత రాయితీ వాళ్ళిచ్చినా పుస్తకాల ఖర్చు, హాస్టల్ ఖర్చు, ఏడాదికోసారయినా ఇంటికి రానూ పోను చార్జిలు అన్నీ కలిపి తడిసి మోపెడవుతాయి. మాకూ ఇల్లు నడవగా... అప్పుడప్పుడు వచ్చే మెడికల్ అవసరాలఖర్చు మా జీతాలతో బొటాబొటీగా తీరతాయి. ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్నా" అన్నాడు.


"భలే వాడివి బాబాయ్ అంత ఆలోచించటం ఎందుకు? కాలం మారింది. ఇప్పుడు కొత్త కొత్త సౌకర్యాలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించి "క్రౌడ్ ఫండింగ్" అనే పద్ధతి ద్వారా పేద కుటుంబాలు న్యాయమైన తమ వైద్య అవసరాలు, చదువుల ఖర్చులు తీర్చుకుంటున్నారు. మొన్నామధ్య మా ఆఫీసులో పని చేసే నాలుగో తరగతి ఉద్యోగి కూతురికి మంచి కాలేజిలో సీట్ వస్తే అందరం తలా కాస్త వేసుకుని, బయట మిత్రుల దగ్గర వసూలు చేసి ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టాము. మా మేనేజర్ వాళ్ళ అబ్బాయిది పాత ల్యాప్టాప్ ఇచ్చాడు" అన్నాడు.


"ఐఐటి లో చదువు ఖర్చు గురించి అంత తేలికగా ఆలోచించలేం కదరా!" అన్నాడు రాజేంద్ర.


"చిన్న చిన్న వాన చినుకులే వరద అయినట్లు...మన పరిచయస్తులు పది మంది దగ్గర వారికి భారం కానంత, వాళ్ళు ఇవ్వగలిగినంత తీసుకోవచ్చు. అందరిదీ కలిపి మన అవసరం తీరుతుంది. ఒక్కరికే అదిభారం కాదు. ఇది ఒక పద్ధతి. "పెట్టకపోతే పెట్టే ఇల్లు చూపించమని" మన పెద్దలు ఎప్పుడో చెప్పారు."


"నాకు వాట్సాప్, ఇన్ స్టాగ్రాం లో అకౌంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా సమాజంలో ధనవంతులయిన అనేక మంది పేదలకి సహాయం చేస్తుంటారని తెలుసుకున్నాను. దాన్ని "క్రౌడ్ ఫండింగ్" అంటారు. ఒక్కరే అంత ఖర్చు భరించక్కరలేదు. మన నేపధ్యం, మన అవసరం వివరంగా అందులో తెలియజేస్తే..వాళ్ళు కూడా వివరాలు తెలుసుకుని నిజ నిర్ధారణ చేసుకుని సహాయం చెయ్యటానికి ముందుకొస్తారు. అలా మన ఆకాశ్ చదువు అవసరాలు తీరతాయి. మీరు దిగులు పడకండి. ఈ రోజే ఆ ప్రక్రియ మొదలు పెడదాం" అన్నాడు.


"నీకు తెలియనిదేముంది బాబాయ్! మనం రామాయణంలో చదువుకున్నట్టు అడవిలో తపస్సు చేసుకుంటున్న మునులని బాధిస్తున్న తాటకి, మారీచుడు, సుబాహుడు లాంటి రాక్షసులని సంహరించటానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సహాయం తీసుకోలేదా?" అన్నాడు. "ఎంతటి వారికయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇతరుల సహాయం అవసరమవుతుంది. మనమూ అలాంటి వారిమే" అన్నాడు.


"అయినా సందర్భం వచ్చింది కనుక...నాకు తెలియక అడుగుతాను... తనుగా వారిని సంహరించగలిగి ఉండి కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సహాయం ఎందుకు తీసుకున్నాడంటావ్..నాకెప్పుడూ ఆ సందేహం కలుగుతూ ఉంటుంది" అన్నాడు నిజాయితీగా విజయ్.


"నేనూ చిన్నప్పుడు నీలాగే ఆలోచించేవాడిని. ఆయన స్వయంగా చంపలేక కాదు. మహా తపస్సంపన్నుడైన రావణుడిని చంపాలంటే రామ లక్ష్మణులకి అనేక అస్త్ర శస్త్రాలు తెలిసి ఉండాలి. భవిష్యత్తులో అరణ్యవాసం చెయ్యటానికి, భీకరమైన యుద్ధం చెయ్యటానికి వారికి ఆకలి దప్పికలుండకూడదు. తపస్సు చేసి శివుడి దగ్గర నించి అనేక అస్త్ర శస్త్రాలని వరంగా పొందిన విశ్వామిత్రుడికి ఆ వయసులో ఇంక వాటితో పని లేదు. అవన్నీ సమర్ధులైన వారికిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. అందుకే రాక్షస సంహారం అనే మిష చూపించి రామలక్ష్మణులని పంపించమని దశరధుడిని కోరాడు. అలా తీసుకెళ్ళి వారిని భవిష్యత్తులో చెయ్యాల్సిన యుద్ధానికి తయారు చేశాడు విశ్వామిత్రుడు" అన్నాడు రాజేంద్ర.


"బావుంది మీ తండ్రి కొడుకుల చర్చ. పొద్దుపోయింది..భోజనాలకి లేవండి. ఆకాశ్ చదువు దగ్గర మొదలుపెట్టి, రామలక్ష్మణుల దాకా వెళ్ళారు" అన్నది పద్మ.


"అవును పద్మా, విజయ్ వచ్చాడంటే మన సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించాను. ఈ కొత్త తరంలో వచ్చే వసతులు, సౌకర్యాల గురించి మనకి బొత్తిగా అవగాహన లేదు. సమయానికి వచ్చి నా గుండెల మీద భారం దింపేశాడు" అని రేపు జీతాలు రాగానే నిన్ను మంచి హోటల్ కి తీసుకెళతాను విజయ్" అన్నాడు మనస్ఫూర్తిగా.


"ఆకాశ్ నీకు కొడుకయితే నాకు తమ్ముడు. వాడి వృద్ధి నాకూ బాధ్యతే! మనలో మనకి ఫార్మాలిటీస్ ఏం లేవు" అని భోజనానికి వంటింటి వైపు నడిచాడు విజయ్.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు













42 views0 comments

Comments


bottom of page