top of page

గృహలక్ష్మి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Gruhalakshmi' New Telugu Story Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి


ఉద్యోగ రీత్యా అస్సాంలో ఉంటున్న గిరీష్ అమ్మా నాన్నాలని చూసి వెళదామని వచ్చి, అమ్మ ఇంట్లో లేదని తెలిసి ఆశ్చర్య పోయాడు.

'అమ్మ దగ్గరకి వెళ్ళాలి. ఈ వయసులో అమ్మ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది, ఏ పరిస్థితులు ఆవిడని ఆ వైపు నడిపించాయ్?'

వైవాహిక జీవితాన్ని గురించి, కుటుంబంలో బంధాల గురించి అంత స్పష్టంగా, లోతుగా ఆలోచించే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం అనిపించింది గిరీష్ కి. కానీ కారణం చాలా బలమైనదే అయ్యుంటుంది అనుకున్నాడు.

'అంత ముఖ్య విషయం తనకెందుకు తెలియలేదు? కావాలనే అమ్మ చెప్పలేదా? ఏమో బుర్ర వేడెక్కి పోతున్నది. అమ్మని కలిస్తే తప్ప వివరాలు తెలియవు' అని మనసులో మధన పడుతున్నాడు గిరీష్.

@@@@

"నాన్నగారికి కందిపప్పు వేయించి చేస్తే ఇష్టం. పచ్చి పప్పు తినరు. పప్పులో నంచుకోవడానికి పుల్లగా గోంగూర పులుసో, ఆవకాయో ఇష్టపడతారు."

"వడియాలు, ఊరు (చల్ల) మిరపకాయలు ఉండాలి. పెరుగు పులిస్తే తినరు. అందుకే ఏ పూటకి ఆ పూట తోడు పెడతాను. ఏం చేస్తాను రోజూ ఉండేదానికి? చచ్చినట్టు చెయ్యాలి" అన్నది కమల జనాంతికంగా తనలో తను అనుకుంటున్నాననుకుని.

"రోజూ అలా చెయ్యాలంటే బోలెడు శ్రమ కదమ్మా! ఇంట్లో నలుగురున్నప్పుడు ఒక్కొక్కరికి ఇష్టమైనవి చెయ్యాలంటే ఇల్లాలికి పది చేతులు ఉండాలి. ఏనుగంత బలం ఉండాలి. అయినా ఇంతమందికి వండి వారుస్తున్న నీకు జోహార్లు" అన్నాడు గిరీష్ అక్కడే కూర్చుని సైన్స్ డ్రాయింగ్ వేసుకుంటున్నవాడల్లా తలెత్తి చూసి.

"మగ వారికి కొన్ని అలవాట్లు పెద్ద వాళ్ళు చేస్తారో, వాళ్ళకి వాళ్ళే స్వానుభవంతో నేర్చుకుంటారో తెలియదు!"

"కానీ భార్య వచ్చేసరికి అవన్నీ తప్పనిసరై కూర్చుంటాయి. భార్య దగ్గర చనువు వల్ల అదెందుకు చెయ్యలేదు, ఇలా చేస్తే నాకిష్టం అంటూ స్పష్టంగా చెబుతారు" అన్నది కమల.

"భార్యలు కూడా పెళ్ళైన కొత్తలో ఉండే ఆకర్షణ వల్లనో, ప్రేమ చొప్పునో ....వాళ్ళకి ఏదిష్టమో అదే చేస్తూ వారి మనసు చూరగొనే పనులు చేస్తూ తెలియకుండానే అది అలవాటుగా మారేట్లు చేస్తారు" అన్నాడు.

"కొన్నాళ్ళయ్యాక, పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగి...ఇల్లాలికి వయసు వచ్చి, అశక్తత వల్ల చెయ్యలేక సర్దుకోవలసి వచ్చినప్పుడు మొదలవుతాయి ఘర్షణలు" అన్నది కమల.

@@@@@

"మొన్న క్యాంపుకెళ్ళినప్పుడు మా చెల్లింటికి వెళ్ళాను. అది కంది పచ్చడి ఎంత బాగా చేసిందనుకున్నావ్...చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టే ఉంది. మనింట్లో నువ్వెప్పుడూ కంది పచ్చడి చెయ్యగా గుర్తు లేదు. అది భలే పని మంతురాలు. చిన్నదాన్ని పొగడకూడదు కానీ చిటికెలో అన్నీ చేసేస్తుంది" అన్నాడు విశ్వం.

కమల భర్త చేతికి కాఫీ గ్లాసిచ్చి మాట్లాడకుండా ఊరుకుంది. మాట్లాడినా ఉపయోగం ఉండదని తెలుసు కనుక!

'ఈ మగవారికి ఇంట్లో భార్య ఎంత చేసినా ఒక గుర్తింపు, ప్రశంస ఉండవు. బయటివాళ్ళు కప్పు కాఫీ ఇచ్చినా అందులో ఏదో ప్రత్యేకత, గొప్పతనం కనిపిస్తాయ్ ' అనుకుంది కమల మనసులో!

కాఫీ తాగుతూ ఉండగానే ఫోనొచ్చింది. బయట బాల్కనీలోకెళ్ళి అరగంట మాట్లాడొచ్చాడు.

"ఆఫీసునించి వస్తూ ఒక జత పంచలు తెండి, మా మామయ్య ఈ రాత్రికి వస్తున్నాడు. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. మనింటికొచ్చి చాలా కాలమయింది" అని కమల చెప్పిన మాట పూర్తిగా మరచిపోయిన విశ్వం కనీసం దాని గురించి ప్రస్తావించకుండా డ్రెస్ వేసుకుని హడావుడిగా బయటికెళ్ళిపోయాడు.

అలా వెళ్ళిన వాడు రాత్రి పదింటికి వచ్చాడు. కమల మేనమామ అప్పటికే భోజనం చేసి పడుకున్నాడు.

ఇక అప్పుడు బజారుకెళ్ళి పంచలు తెచ్చే అవకాశం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడటం అనవసరం అని ఊరుకుంది కమల.

మరునాడు ఉదయమే కాఫీ తాగి వెళ్ళాలని బయలుదేరుతున్న కమల మేనమామని, విశ్వం మొహమాటంగా పలకరించి వీడ్కోలు చెప్పాడు.

ఆయన్నటు పంపించిన కమల, "రాత్రి ఎక్కడికెళ్ళారు, తిరిగొచ్చేసరికి అంత పొద్దుపోయింది" అన్నది.

"మా చిన్నప్పటి ఫ్రెండ్ చిక్కడ్ పల్లిలో ఉంటారని చెప్పాను కదా! అతనికి అర్జెంట్ గా ఏదో అవసరం వచ్చిందని ఫోన్ చేశాడు. వెళ్ళాను. ఏమయింది" అన్నాడు.

"గిరిజ తన ఫ్రెండ్ ఇంటికెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి. రాత్రి లేట్ అవుతుంది అని మిమ్మల్ని తీసుకెళ్ళమని అడిగింది."

"నేను మిమ్మల్ని ఆఫీసు నించి వస్తూ మా మామయ్య కోసం పంచలు తెమ్మన్నాను. మాతో మాట్లాడే తీరుబడి ఉండదు. చెప్పింది గుర్తుండదు. చెయ్యాలన్న బాధ్యత ఉండదు."

"మీరు, మీ ఫ్రెండ్స్ మధ్యలో మేము అనబడే వాళ్ళం అసలు ఉన్నామా? మీ ఫ్రెండ్స్ అవసరాలు మీరు తీస్తారు. మరి మా అవసరాలు ఎవరు తీరుస్తారు" అన్నది ఉపయోగం ఉండదు అని తెలిసినా కాస్త గట్టిగా!

"ఇంట్లో ఉంటే ఇలా నస పెట్టి చంపుతూ ఉంటే చిరాకుగా ఉంటుంది. నన్ను చూస్తేనే నీ మొహాన నవ్వు మాయమవుతుంది. ఎప్పుడూ దెప్పుతూ ఉంటావ్!"

"ఆ మధ్యన లలిత వాళ్ళ అమ్మాయిని ఎమర్జెన్సీ గా హాస్పిటల్లో చేర్చాలని వెళితే అప్పుడూ ఇలాగే గొడవ చేశావ్! నీ దృష్టిలో ఎవ్వరికీ ఉపకారం చెయ్యకూడదు" అన్నాడు.

"బయటి వాళ్ళు నన్ను ఇంద్రుడు చంద్రుడు అంటారు. ఇంట్లో వాళ్ళకి నేనో విలన్ని! అందుకే బయట తిరుగుతాను" అన్నాడు.

"ఆ లలిత కూతురు హాస్పిటల్ అవసరం ముఖ్యమని మీకనిపించింది".

"అదే నాకు కాలు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని తెలిసి, సెలవు పెట్టే వీలు లేదని మా తమ్ముడికి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పి చేతులు దులిపేసుకు వెళ్ళారు".

"బయటి వాళ్ళవి ముఖ్యం, ఎమర్జెన్సీ..ఇంట్లో వాళ్ళది మాత్రం అముఖ్యం" అన్నది కమల.

"మాటకి మాట చెబుతావ్! అయినా చెయ్యట్లేదు చెయ్యట్లేదు అని గోలే కానీ మొన్న శనివారం ఆఫీసు నించి వస్తూ డ్రై క్లీనింగ్ షాపు నించి బట్టలు తేలేదా? ఎన్ని చేసినా మీ ఆడవాళ్ళకి తృప్తి ఉండదు" అని విస విసలాడుతూ వెళ్ళాడు.

డ్రై క్లీనింగ్ కి ఇచ్చిన బట్టలు అతనివే! కాన్ ఫరెన్స్ ఉన్నదని తెచ్చుకున్నాడు. అది కూడా తనకి ఉపకారమేనన్నమాట అనుకున్నది కమల మనసులో!

@@@@@

"కమల గారూ మీరు చాలా అదృష్టవంతులండి. మొన్న అలా ఫోన్ చేశానో లేదో ఇలా వచ్చి వాలిపోయాడు మావాడు. సికింద్రాబాద్ జనరల్ బజారుకెళ్ళి బట్టలు తేవాలని మా ఆవిడ గొడవ చేస్తుంటే విస్సి గాడిని రమ్మని ఫోన్ చేశాను. వస్తానని చెప్పి వెంటనే వాలిపోయాడు. ఎంతయినా మనుషులంటే ప్రాణం పెట్టే వాళ్ళు దొరకటం అదృష్టం" అన్నాడు విశ్వం చిక్కడ్ పల్లి ఫ్రెండ్ మురళి.....ఇంకో మిత్రుడి తాలూకు పెళ్ళిలో కలిసి.

"అవునులెండి 'అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోను' పెట్టేవాళ్ళంటే బయటి వారికి కలిగే అభిప్రాయం ఇదే. మా అదృష్టం గురించే చెప్పాలి."

"మీ లాగే మేం కూడా ఇంకోరి మీద ఆధారపడి బతకాలేమో! అప్పుడు ఈయన గారి రియాక్షన్ ఎలా ఉంటుందో" అనుకుంది మనసులో!

విశ్వం ఫ్రెండ్స్ ముందు వ్యతిరేకంగా అతని గురించి పైకి అన్నా మాట్లాడి ప్రయోజనం ఉండదని తెలుసు.

"అమ్మా .... నాన్నగారి ఫ్రెండ్ చూశావా ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నారు".

"మొన్న అత్త వాళ్ళింటికెళ్ళొచ్చి ఆవిడ గారు పెట్టిన కంది పచ్చడి గురించి గొప్పగా పొగిడి, మనింట్లో ఎందుకు చెయ్యవు అని అడిగారు. నువ్వు ఆయనకిష్టం అని చేసి పెడితే..అది వదిలేసి ఎన్నిసార్లు చింతకాయపచ్చడి వేసుకు తిన్నారో నాకు గుర్తుంది. ఈ మగాళ్ళంతా ఇంతేనేమో? 'ఇంటి చెట్టు మందుకి పనికి రాదు'.

"ఇంట్లో వాళ్ళు లోకువ, బయటవాళ్ళని ఇచ్చకాలకి ఆకాశానికెత్తేస్తారు" అన్నది గిరిజ.

"ఇంట్లో వాళ్ళు...బయటివారిలాగా ముఖ ప్రీతి మాటలు మాట్లాడరు. అలా మాట్లాడినా కృత్రిమంగా ఉంటుంది. బయటి వారు తమ పబ్బం గడుపుకోవటానికి అలా 'ములగ చెట్టు' ఎక్కిస్తారు. పొగడ్తలకి లొంగని మనుషులెవరుంటారు?" అన్నది కమల.

"నాన్నగారిలాగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలయితే నోరు మూసుకుని నీ లాగా భరించరు. విడాకులు తీసుకుని బయటపడతారు" అన్నది గిరిజ.

"పెద్దగా చదువుకోని పేదింటి వారయితే, ఇలా బాధ్యతా రహితంగా తిరిగే మగవారిని వదిలేసి, వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు. అసలు వివాహేతర సంబంధాలు ఇలాంటి అసంతృప్తుల నించే మొదలవుతాయేమో" అన్నది....అది మంచి పరిష్కారం అన్నట్టు!

"వాళ్ళైనా కొంతకాలం బావుంటారు, తరువాత వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటారు" అన్నది కమల.

'సంసారంలో సరిగమలు' ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అవకాశం ఉందని విడాకుల గురించి ఆలోచిస్తున్నారు.

ఆడా మగా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఎందుకు భరించాలి అని ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఉందని సంతోషిస్తున్నారు.

కానీ భార్యా భర్తల మధ్య ఇలాంటి చికాకులు ఉన్నా, ఒక స్వతంత్ర్యం, ఒక అలవాటు, .....అంతర్లీనంగా ఒక హక్కు ఉంటుంది కనుకే ఆడవాళ్ళు దాన్ని భరిస్తారు.

"విసుక్కుంటూనే భర్తలని ఒక తల్లిలాగా...వారి అలవాట్ల నించి చక్కదిద్ది దారిలో పెడతారు. అందుకే మన దేశంలో భార్యని గృహలక్ష్మి అన్నారు" అన్నది కమల వివరిస్తున్నట్టు.

పక్కన ఆఫీసు పని చూసుకుంటూ తల్లీ చెల్లెళ్ళ సంభాషణని ఒక చెవితో ఆలకిస్తున్నాడు గిరీష్.

@@@@@

"అమ్మా ఉన్నట్టుండి ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్" అన్నాడు గిరీష్ అమ్మ భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ... ఉపోద్ఘాతంగా పక్కనే మంచం మీద కూర్చుంటూ!

"గుర్తింపు, ప్రశంస, ప్రతిఫలం లేని ఉద్యోగం నువ్వు చేస్తావా? ప్రమోషన్ రూపంలో నీ పనికి గుర్తింపు దొరకలేదనే కదా, చేస్తున్న ఉద్యోగంలో అంత సీనియారిటీని వదిలేసి అంత దూరం అస్సాం వెళ్ళావ్! " అన్నది సాలోచనగా బయటికి చూస్తూ.

"ఇప్పుడు నాఉద్యోగం, హోదా గురించి మాట్లాడతావేం" అన్నాడు.

“గృహ విషయాల్లో ప్రతి ఫలం అక్కరలేదు. కానీ..కనీసం గుర్తింపు, ప్రశంస లేని తన సేవలు గృహలక్ష్మి నోరు మూసుకుని ఎంత కాలం చేస్తుంది?"

"మీ పెద్ద బామ్మ గారు కూడా నాలాగే బాధ పడి ఉంటుంది. మీ నాన్నగారు మీ పెద్ద తాతగారి పోలికే! పాపం ఆ రోజుల్లో ఆవిడకి అంతకంటే ప్రత్యామ్నాయమూ లేదు! అంత ఆలోచించే తీరుబడీ లేదు."

"ఆవిడకి పది మంది పిల్లలు. పల్లెటూరి కాపురం. పొయ్యిల మీద వంటలు. పిల్లల పెంపకం, అతిధి మర్యాదలు, 'కుడితిలో పడ్డ ఎలుకల్లే' ఎప్పుడూ తన్నుకోవటంతోనే సరిపోయింది."

"అప్పుడు ఇల్లాలికి ఇల్లే లోకం. వారి సేవలకి గుర్తింపు అవసరం అనే విషయం తెలియని రోజులవి. కాబట్టి ఆవిడ జీవితం అలాగే గడిచిపోయింది. ఇప్పుడు కాలం మారింది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయ్. సరైన గుర్తింపు లేని ఉద్యోగాలు చెయ్యటానికి ఇష్టపడట్లేదు."

"ఇల్లాళ్ళు మాత్రం ఏ అసంతృప్తి వ్యక్తపరచకుండా జీవితమంతా గానుగెద్దుల్లాగా పని చెయ్యాలని కోరుకోవటం అన్యాయం కాదా?"

"ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నారు?"

"కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆశ్చర్యంగా చూస్తారు" అంది ఊపిరి తీసుకుంటూ.

"చిన్నా నువ్వైనా ఆడవారిని, వారి సేవలని గుర్తించటం నేర్చుకో."

"అరుణ చేసే ఇంటి పనులని ప్రశంసించటం నేర్చుకో!"

"ఒక్క చిన్న గుర్తింపు వారికి ఏనుగంత బలాన్నిస్తుందని గుర్తు పెట్టుకో. జీవితాంతం నీ కష్టం, సుఖం పంచుకుంటూ నీతో కలిసి నడిచే భార్య అంటే taken for granted గా ఉండద్దు."

"ముఖ ప్రీతికి బయటి వారిని పొగిడే భర్త, కంచం ముందు కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఏం తింటున్నాడో తెలియకుండా భోజనం ముగించి వెళితే ఆ ఇల్లాలికి అవమానంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోతే...ఎంత చదువుకున్నా నా దృష్టిలో అది సరైన చదువు కాదు" అన్నది.

"నాకు రాను రాను ఒంట్లో ఓపిక తగ్గుతున్నది. గుర్తింపు లేని సేవ చెయ్యలేననిపించింది. ఇక్కడ నాలాంటి వాళ్ళే, నా వయసు వాళ్ళే ఉన్నారు."

"మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటే కాలక్షేపంగా ఉంటుంది."

"శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం అని నేను నీకు చెప్పక్కరలేదనుకుంటా! అందుకే ఇలా నిర్ణయించుకున్నాను" అన్నది.

అమ్మ అన్నదానిలో ఒక్క అక్షరం కూడా తప్పని చెప్పలేని స్థితి గిరీష్ ది.

"నీకు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడే ఉండమ్మా! నా దగ్గరకి రావాలనిపించినప్పుడు ఫోన్ చెయ్యమ్మా. వచ్చి తీసుకెళతాను. నీ సంతోషం నాకు, చెల్లికి ముఖ్యం" అని రేపు మళ్ళీ వస్తానని చెప్పి లేచాడు గిరీష్ తేలిక పడ్డ మనసుతో.

[భర్తలు విశ్వంలా ఉండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం!

ఇంటి విషయాలు నిష్టూరంగా ఉంటాయని భరించలేమని ఎన్నాళ్ళు పారిపోతారు?

అలా బయట ఇచ్చకాలకి పోకుండా, ఇంటి విషయాలు భార్యలతో సమానంగా మొయ్యటం తమకి కూడా సమాన బాధ్యత అని భావించాలి.

అవి తమకి భారం కాదని ఎందరు మగవాళ్ళు ఆమోదించగలరు? అలా ఉంటే ఆడవారికి అసహనం, అసంతృప్తి ఉండవు కదా!]


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు



45 views0 comments
bottom of page