top of page

కనువిప్పు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kanuvippu' New Telugu Story Written By N. Dhanalakshmi

రచన: N. ధనలక్ష్మి


మనకంటూ కుటుంబం రాగానే మన పుట్టకకి కారణమైన తల్లిని, తండ్రిని మరిచిపోతున్నాము. మన వృత్తిలో ఎదుగుతూ ఆ ఎదుగుదలకు కారణమైన వారిని చిన్నచూపు చూస్తున్నాము. తల్లితండ్రులు మన నుండి ఆశించేది కాసంత ప్రేమ, గుప్పెడు మెతుకులు.

తల్లి పట్ల నిర్లక్ష్యం చూపించిన కొడుకుకి బుద్ది వచ్చేలా చేసిన ఓ చిన్నారి కథ.

విక్రమ్ తన అమ్మ, భార్య వసుంధర, కొడుకు బంటితో కలిసి జీవిస్తుంటాడు. విక్రమ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు...

వసుంధరకి తన అత్త అంటే అసలు పడదు..

తన భర్త, బిడ్డతో కలిసి ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు..

వాళ్ళ అత్తయ్యను తమ మధ్య అడ్డుగోడగా భావిస్తు ఉంటుంది..

బంటికి వాళ్ళ నాన్నమ్మ తో చనువు ఎక్కువ..

ప్రతి రోజు స్కూల్ లో జరిగే విషయాన్ని నాన్నమ్మతో చెప్తుంటాడు.. వాళ్ళ నాన్నమ్మ చెప్పే చందమామ కథలు అంటే బంటికి చాలా ఇష్టం.. అలా కథలు వింటూ నాన్నమ్మ జో కొడుతూ ఉంటే చక్కగా నిద్ర పోయే వాడు..

" నాన్నమ్మ నీకు తెలుసా ఈ రోజు మా తెలుగు మేడమ్ ఒక కథ చెప్పారు నాకు అయితే చాలా బాగా నచ్చింది... అదేమిటో తెలుసా!???

ఒకసారి చంద్రుడిని, సూర్యుడిని, గాలిని, పర్వతాన్ని దేవుడు పార్టీకి పిలిచారట. వాళ్ళకి ఇష్టమైన కేక్స్ , బిస్కెట్స్ అన్నీ ఒక్కొకరికి ఒక్కో ప్లేట్ లో పెట్టి ఇచ్చారట. సూర్యుడు, గాలి, పర్వతం అందరు వాళ్ళకి పెట్టినవి తినేశారట.. కానీ చంద్రుడు మాత్రము సగమే తిన్నాడట.

అది చూసిన దేవుడు చంద్రుడిని అడిగారట

‘ఎందుకు నువ్వు ఏమీ తినలే’దని.

అందుకు చంద్రుడు ‘ఇంట్లో మా అమ్మ ఏమీ తిని ఉండదు.. అందుకే సగం నేను తిని మిగిలినవి మా అమ్మ కోసం తీసుకుని వెళ్తా’నని చెప్పాడట.

అది విన్న దేవుడు చంద్రుడికి వాళ్ళమ్మ పై గల ప్రేమను చూసి సంతోషించి ‘నువ్వు ఎప్పుడూ చల్లగా ఉంటావు. అందరు నిన్ను తమ మామగా భావిస్తారు’ అని వరం ఇచ్చారట!

తల్లి పై ప్రేమ చూపని సూర్యుడిని ఎప్పుడూ కాలిపోతూ ఉండమనీ, పర్వతాన్ని కదల్లేక, ఒక్కచోటే ఉండమనీ, గాలిని కుదురుగా ఉండలేక, అన్ని చోట్లకీ తిరగమని శాపం ఇచ్చారట!

మనం ఎప్పుడూ అమ్మని చంద్రుడి లాగా ప్రేమగా చూసుకోవాలని మా మేడమ్ చెప్పారు... చాలా మంచి కథ కదా నాన్నమ్మా!”

స్కూల్ లో చెప్పిన కథను నాన్నమ్మకు చెప్పాడు బంటి.

" అవును రా కన్నా! చాలా చక్కటి కథ. అమ్మానాన్నలను మనం ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకోవాలి. వారి వల్లే కదా మనమంటూ ఉండేది..” అంది నాన్నమ్మ.

***

"వసూ.. గుడ్ న్యూస్! నాకు ప్రమోషన్ వచ్చింది.. శాలరీ కూడా డబుల్ అయింది. నేను వచ్చే లోపు రెడీ అయి ఉండండి. మనం బయటకు అలా సరదాగా వెళ్ళి కాసేపు గడిపి, నైట్ కి డిన్నర్ చేసి వద్దాం.. నా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం" భార్యతో ఫోన్ లో చెప్పాడు విక్రమ్.

" వావ్.. ఎంత మంచి న్యూస్ చెప్పారు విక్రమ్! చాలా చాలా సంతోషంగా ఉంది.. కంగ్రాచులేషన్స్” అని ఫోన్ పెట్టేసి తన కొడుకు బంటీని పిలిచింది ..

నానమ్మతో మాట్లాడుతున్న బంటి, ఆ పిలుపుతో బయటకు వచ్చాడు... “ఏంటమ్మా..?” అని ముద్దుగా అడిగాడు..

" రేయ్ కన్న మనం బయటకు వెళ్తున్నాము.. వెళ్ళి రెడీ అవ్వు” అని చెప్పేసి తను కూడా వెళ్ళింది రెడీ అవ్వడానికి...

బంటి నవ్వుతూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి విషయం చెప్పి, రెడీ అవ్వమని చెప్పాడు..

బంటి, వసు రెడీ అయి ఎదురు చూస్తున్నారు...

విక్రమ్ కూడా త్వరగా ఇంటికి చేరుకుని రెడీ అయి

“సారీ! ఆలస్యం అయింది. ఇంక మనం బయలుదేరదాము” అన్నాడు..

“నాన్నా! మనం మాత్రమేనా?”

“అవునురా! ఇంకా ఎవరు ఉన్నారు…”

“ఉన్నారు నాన్నా! ఒక్క నిమిషం..” అంటూ లోపలికి వెళ్ళి, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తూ.. రెడీగా ఉన్న నాన్నమ్మను పిలుచుకొని వచ్చాడు బంటి..

వసు ఫేస్ లో రంగులు మారాయి.. వాళ్ళ అత్తయ్యను తీసుకువెళ్ళడం తనకు ఇష్టం లేదు..

" అత్తయ్యా ! బయట వాతావరణం అంత బాగాలేదు.. మీ ఆరోగ్యానికి ప్రమాదం.. మీరు మాతో ఎందుకు? అన్నట్టు నేను ఇంట్లో వంట కూడా చేయలేదు.. ఒక పని చేయండి. మన వీధి చివర ఉన్న గుడిలో ఈ రోజు రామాయణం చెపుతున్నారు..

అంతే కాదు. ఈ రోజు గుడిలో మన పక్కింటి పంకజం గారి అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ ఉందని చెప్పారు. మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది.. అలాగే రామాయణము విన్నందుకు పుణ్యం, అలాగే ఎలాగో ఫుడ్ అక్కడ తింటారు కాబట్టి మీ ఆకలి తీరుతుంది.

ఏమంటారు విక్రమ్....”

“అంతేగా! అంతేగా..” అంటూ వంత పాడాడు విక్రమ్.

“ప్లీజ్ అమ్మా! నేనే చెప్పాను నాన్నమ్మ కి రెడీ అవ్వమని.. ఇప్పుడు వద్దంటే నాన్నమ్మ బాధ పడుతుంది.. "

" రేయ్ బంటీ! పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినాలి. మధ్యలో మాట్లాడకూడదు.. నోరుమూసుకుని, మాతోరా! వెళ్దాము” అంటూ బలవంతంగా తీసుకొని వెళ్ళి పోయారు.

వాళ్ళు సరదాగా గడిపి, నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకున్నారు..

బంటి నవ్వుతూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వారు. బయట ఏమి చేసారో, ఏమి తిన్నారో చెప్పి...

“నాన్నమ్మా మీరు గుడికి వెళ్ళారు కదా.. అక్కడ ఏమి తిని వచ్చా”రని అడిగాడు...

“లేదురా కన్నా! నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా! నేను చిన్నగా నడుచుకొని గుడికి వేళ్లేలోపు అక్కడ అన్న ప్రసాదము అయిపోయింది.. ఇంటికి వచ్చి బ్రెడ్ ముక్కలు ఉంటే తిన్నాను” అని చెప్పారు నాన్నమ్మ. బంటికి బాధగా అనిపించింది.

అలాగే బాధ పడుతూ హల్ లోకి వచ్చాడు బంటి.

అక్కడ తన అమ్మ, నాన్న నవ్వుతూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు ...

నేరుగా వారి వద్దకు వెళ్ళి “అమ్మా ! నేను పెద్దవాడిని అవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది?” అని అడిగాడు..

“12 ఏళ్ళు.. అలా పడతాయి కన్నా... అవును ఎందుకు అడిగావు!?... "

" అదేమీ లేదమ్మా!నేను త్వరగా పెద్దవాడిని అయి, మీ కోసం ఇల్లు కట్టాలి కదా.. అందుకు".

" చూసారా అండీ! మన బంటి మన కోసం ఇల్లు కడతాడట.. నా బంగారు కొండ..” అంటు మొహమంతా ముద్దులు పెడుతూ కన్నా! ఇంతకీ మాకు ఇల్లు ఎక్కడ కడతావు?"

" అమ్మా! గుడి పక్కన ఇల్లు కడతాను"

" ఎందుకు రా కన్నా.. గుడి పక్కన ఇల్లు కడతాను అంటున్నావు?” ఆశ్చర్యంగా విక్రమ్, వసు ఇద్దరూ అడిగారు.

“మరేమో.. నేను పెద్ద అయ్యాక , మీ లాగే నేను, నా ఫ్యామిలీతో బయటకు వెళ్తాను.. అప్పుడు మిమ్మల్ని కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అచ్చం మనం ఎలా అయితే నాన్నమ్మ ను ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయామో.. మీరు కూడ ఫుడ్ తినడానికి గుడికి వెళ్ళాలి. ఇల్లు దూరంగా ఉంటే మీరు వెళ్ళెలోపు అక్కడ ఫుడ్ అయిపోతుంది.. అదే దగ్గర ఉంటే మీరు ఈజీగా వెళ్ళి తినవచ్చు కదా” అంటాడు..

విక్రమ్, వసులకి ఎవరో చాచి కొట్టినట్టు అనిపిస్తుంది..

వాళ్ళు ఎంత తప్పు చేసారో అర్థం అయింది... ఇప్పుడు వారు వాళ్ళ పెద్దవారి విషయంలో ఏమి చేశారో తిరిగి వారు ముసిలి వారు అయితే ఎదురయ్యేది ఇదే కదా..

వసు, విక్రమ్ కంట కన్నీరు!

పరుగున వెళ్ళి పెద్దావిడను కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగారు..

“అయ్యో! క్షమాపణ ఎందుకు... మీరు నా పిల్లలు రా. మీరు ఏం చేసినా, కడుపున దాచుకుంటాను”.

వసు పరుగున వెళ్ళి తన అత్తయ్య కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది..

విక్రమ్ ప్రేమగా తన అమ్మకు తినిపించాడు...

“నేను కూడా పెడతాను అత్తయ్యా” అంటు వసు కూడా తినిపించింది..

“నాన్నమ్మ కు నేను కూడా తినిపిస్తాను” అంటూ బంటి కూడా చేరాడు..

తమకి జ్ఞానోదయం చేసిన బంటిని వసు, విక్రమ్ ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకున్నారు.

ఈ సంఘటన తర్వాత వసుంధర, విక్రమ్ లో ఎంతో మార్పు వచ్చింది.. అప్పటి నుంచి వారు ఎప్పుడు బయటికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తారు...

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.

.


241 views1 comment
bottom of page