తోలు బొమ్మలు - పార్ట్ 12

Tholu Bommalu - Part 12 - Telugu Serial | Ch. C. S. Sarma
తోలు బొమ్మలు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక | సిహెచ్. సీఎస్. శర్మ
Published In manatelugukathalu.com On 27/11/2026
తోలు బొమ్మలు పార్ట్ 12లో పార్వతీపురం గ్రామంలోని వీరరాఘవయ్య కుటుంబం అనేక సంతోషకరమైన, విషాదకరమైన పరిణామాలను ఎదుర్కొంటుంది. సుశీల వివాహానికి ముందు కట్నంగా పంటభూమిని కోరడం కుటుంబంలో కొత్త ఆందోళనకు కారణమవుతుంది. అనంతరం సుశీల వివాహం, అమృత జననంతో రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే భద్రాచల శ్రీరాముని దర్శనానికి బయలుదేరిన కుటుంబ పెద్దల జీవితాలను గోదావరిలో సంభవించిన పెనుతుఫాను అనూహ్యమైన మలుపు తిప్పుతుంది. చంద్రశేఖర్ బాల్య జ్ఞాపకాల ద్వారా కుటుంబ అనుబంధాలు, మానవ జీవితంలోని అనిశ్చితిని రచయిత హృద్యంగా ఆవిష్కరించారు.
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాక్ష్యాధారాలను బట్టి చంద్రశేఖర్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడుతుంది. జైలు నిశ్శబ్దంలో చంద్రశేఖర్ కలం పట్టాడు. తాత వీరరాఘవయ్య నుంచి మొదలైన జ్ఞాపకాలు చివరికి సుశీల–ధనుంజయరావుల వివాహ ప్రతిపాదన వరకు చేరుకున్నాయి. లో గ్రామానికి వచ్చిన సాంబయ్య తోలుబొమ్మల బృందం అతనిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రదర్శన మధ్యలో ధనుంజయరావు ప్రవర్తనను గమనించిన చంద్రశేఖర్ మనసులో కొత్త సందేహం మొదలవుతుంది. కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర, పంచారామ క్షేత్రాల పురాణ నేపథ్యం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ప్రసిద్ధ శివాలయాల ప్రత్యేకతలను తెలుసుకుంటూ అక్కాతమ్ముళ్లు ఆసక్తిగా వింటారు. అయితే ధనుంజయరావుతో సుశీల వివాహం జరగవచ్చనే సూచనపై సత్యయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. తోలు బొమ్మలు పార్ట్ 10లో పార్వతీపురం గ్రామంలో ప్రదర్శించిన బాలనాగమ్మ వీధి భాగోతం ద్వారా తెలుగు జానపద కళల వైభవాన్ని రచయిత సిహెచ్. సీఎస్. శర్మ ఆసక్తికరంగా ఆవిష్కరించారు. వీరరాఘవయ్య సత్యహరిశ్చంద్రుడిగా నటించిన నాటకంలోని హృదయవిదారక ఘట్టాలు చంద్రశేఖర్ మనసులో చెరగని ముద్ర వేస్తాయి.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు – నవల పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తోలు బొమ్మలు పార్ట్ 12 – గోదావరి యాత్రలో పెను విషాదం
నేను ప్రతిరోజూ సాయంత్రం గోపాలయ్య మాస్టారు గారి ఇంటికి వెళ్ళి శ్రద్ధగా చదవసాగాను. వారి కూతురు చంద్రిక నాకు అర్థం కాని విషయాలను ఒకటి రెండు సార్లు విసుగనేది లేకుండా చెప్పేది. నన్ను ఎంతగానో అభిమానించేది.
ఊరికి విద్యుత్తు వచ్చింది. మా ఇంటి ముందు స్తంభం, లైటు ఏర్పడ్డాయి.
గ్రామానికి రేడియో వచ్చింది. కనిపెట్టినవారు గుగ్లియెల్మో మార్కోని (GUGLIELMO MARCONI), ఇటలీ.
బాబాయ్ గ్రామ్‌ఫోన్‌ను కొన్నారు. కనిపెట్టినవారు థామస్ ఆల్వా ఎడిసన్ (Thomas Alva Edison), అమెరికా.
అంతేకాదు, మా ఇంటికి ఫోన్ కూడా మా బాబాయి తెప్పించాడు. కనిపెట్టినది అలెగ్జాండర్ గ్రహంబెల్ (ALEXANDER GRAHAM BELL). బాబాయ్ పేజర్లను తెచ్చి తాతయ్యకు, నాన్నకు, నానమ్మకు ఇచ్చాడు. కనిపెట్టిన వ్యక్తి విజయ్ మాల్యా (VIJAY MALLYA), బెంగళూరు.
బాబాయ్ అగ్రికల్చరల్ బి.ఎస్సీ. జిల్లా నగరంలో ఉద్యోగం. కారు కొన్నాడు. గోవర్ధనరావు గారి ఇంట్లో, మా ఇంట్లో ఉన్న పైవన్నీ ధనుంజయరావు ఏర్పరిచారు. వారూ కారును కొన్నారు, అంబాసిడర్. మాదీ అదే... తాతయ్య, గోవర్ధనరావు, ధనుంజయరావు, అత్తయ్య సుశీల ఫోన్‌లో మాట్లాడుకొనేవారు. నానమ్మ, గోవర్ధనరావు భార్య, మా తాతయ్య చెల్లి నిర్మలమ్మ ఆనందంగా వంటల గురించి, త్వరలో జరగబోవు ధనుంజయరావు, సుశీల అత్తయ్యల వివాహం గురించి మాట్లాడుకొనేవారు.
నాన్నా, చిన్నాన్నలు తాతయ్యగారి మాట ప్రకారం పెండ్లికి కావలసిన ఏర్పాట్లను పది రోజుల ముందుగానే ప్రారంభించేశారు. మా భవంతిలో బయటా లోపలా రంగులు వేయించారు.
అందరూ ఆతృతతో ఎదురుచూస్తున్న ఆ సుదినం, మా అత్తయ్య పెండ్లి రోజు వారం రోజుల్లో ఉంది.
హుసేన్ సాహెబ్ (దర్జీ) ని మిషన్‌తో సహా మా ఇంటికి పిలిపించి అందరికీ కొత్త బట్టలు కుట్టించారు తాతయ్య.
పెండ్లి రోజు రాబోయే మూడవ రోజు.
ఆ రోజు సాయంత్రం సరాగాల సాంబయ్య మా ఇంటికి వచ్చాడు. సమయం సాయంత్రం ఏడున్నర. అందరం ఇంట్లోనే ఉన్నాము. నేనూ తాతయ్య ఊయల పీటపై కూర్చొని ఊగుతున్నాము.
‘‘అయ్యా!... వీరరాఘవయ్యగారూ!...’’ సాంబయ్య పిలుపు వరండాలో నుండి...
అందరూ సింహద్వారం వైపు ఆశ్చర్యంగా చూశారు.
నేను ఊయల పీటపై నుంచి దూకి పరుగున వరండా వైపుకు వెళ్ళాను. సరాగాల సాంబయ్యను చూశాను.
అందరి ఆశ్చర్యానికి కారణం ఇంతవరకూ ఊరిజనంలో ఎవరూ మా తాతయ్యగారిని పేరు పెట్టి పిలిచింది లేదు. పరుగున వెనక్కు వెళ్ళి...
‘‘తాతయ్యా!... సరాగాల సాంబయ్య వచ్చాడు!...’’ చెప్పాను.
తాతయ్య గోడగడియారం వైపు చూసి ఊయల పీట దిగి వరండా వైపుకు నడవసాగారు.
నాన్నా, బాబాయి, నేను వారి వెనకాల నడవబోయాము.
తాతయ్యగారు వెనుతిరిగి ఎడమచేతిని పైకెత్తి, దించి వరండాలోకి వెళ్ళారు.
నాన్నా బాబాయిలు ఆగిపోయారు. నేనూ ఆగిపోయాను. వరండాలో ప్రవేశించిన తాతయ్య సింహద్వారాన్ని మూశారు.
‘‘ఏం సాంబయ్యగారు ఈ సమయంలో వచ్చారు. కూర్చోండి...’’
వారు కుర్చీలో కూర్చున్నారు. సాంబయ్య వారి ఎదుటి కుర్చీలో భయంతో కూర్చున్నాడు.
నేను, నాన్నా, బాబాయ్ ఇంట్లో వరండావైపుకు ఉన్న కిటికీ గుండా వారిరువురినీ చూస్తున్నాము.
‘‘స్వామీ!... గోవర్ధనరావు పంపగా నేను వచ్చాను!...’’ మెల్లగా చెప్పాడు సాంబయ్య.
‘‘సరే!... విషయం ఏమిటి?...’’
‘‘అయ్యా!...’’ తలదించుకొన్నాడు సాంబయ్య విచారంగా…
‘‘సాంబయ్యా!... చల్లకొచ్చి ముంత దాచకూడదు. నిర్భయంగా విషయం ఏమిటో చెప్పండి...’’
‘‘సామీ!... గోవర్థనరావుగారు మీకు బంధువులు, అభిమానవంతులు, ఆ కారణంగా నన్ను పంపారు...’’
‘‘ఉపోద్ఘాతం అనవసరం. ఈ గ్రామంలో మా రెండు కుటుంబాల మధ్యన నాకు తెలియని విషయం అంటూ లేదు. అనవసర ప్రసంగం ఆపి గోవర్ధనరావు నీకు ఏమి చెప్పి నా వద్దకు పంపాడో ఆ విషయాన్ని మాత్రం చెప్పండి!...’’
‘‘విషయమా అండీ కట్నం విషయం!...’’
‘‘ఎంత కావాలన్నాడు?...’’
‘‘వారికి కావలసింది డబ్బు కాదండి!...’’
‘‘మరేం కావాలట!...’’
‘‘ఏంటి, భూమా!...’’
‘‘ఎంత?..’’
‘‘మీకున్నది ముగ్గురు పిల్లలు!...’’
‘‘అయితే!...’’
‘‘వారు మీ పంటభూమిలో వారి భూమివైపున ఉన్న దానిలో మూడవవంతును కోరుతున్నారండీ!...’’ గడగడా చెప్పేశాడు. తాతయ్య సింహద్వారం వైపు ఒకసారి చూశాడు.
‘‘వివాహానికి ముందు ధనుంజయరావు గారి పేరు మీద స్టాంపు పేపర్ పైన తమరు వ్రాసి ఇవ్వాలని వారి కోరిక!...’’
తాతయ్య సాంబయ్య ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు.
సాంబయ్య భయంతో తలదించుకున్నాడు. అతని వంటికి చెమట పట్టింది.
తాతయ్య నవ్వాడు.
‘‘సాంబయ్యా!... ఇంతేనా!...’’
అవునన్నట్లు సాంబయ్య తల ఆడించాడు.
‘‘పత్రాన్ని రేపు నేను వారి ఇంటికి వచ్చి ఇస్తానని చెప్పండి. ఇక మీరు వెళ్ళవచ్చు!...’’ తాతయ్య కుర్చీనుంచి లేచాడు.
సరాగాల సాంబయ్య తాతయ్యకు నమస్కరించి వేగంగా వెళ్ళిపోయాడు.
పోతూ ఉన్న సాంబయ్యను కొన్ని క్షణాలు పరీక్షగా చూసి తాతయ్య సింహద్వారాన్ని తెరిచి, నేరుగా తన గదికి వెళ్ళిపోయాడు.
హాల్లో ఉన్న నానమ్మ పార్వతి మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించింది. తలుపును మూసింది.
‘‘అన్నా!...’’ బాబాయి పిలుపు.
‘‘ఏం సత్యా!...’’
‘‘సాంబయ్య నాన్నగారితో ఏం చెప్పాడో నాకు సరిగా అర్థం కాలేదు. నీకు అర్థం అయిందా!...’’
‘‘వారు చాలా తక్కువ స్వరంతో మాట్లాడుకున్నారు కదా!... నాకూ విషయం సరిగా అర్థం కాలేదు సత్యా!... ఏది ఏమైనా నాన్నగారు... మనతో చెబుతారుగా!...’’ నాన్నగారి జవాబు.
బాబాయి మౌనంగా తల ఆడించాడు.
పది నిమిషాల తరువాత నానమ్మ గదినుండి హాల్లోకి వచ్చింది.
అందరం ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాము.
‘‘అమ్మా!... భవానీ!...’’
‘‘ఏం అత్తయ్యా!...’’
‘‘వంట పదార్థాలన్నీ డైనింగ్ టేబులు మీదికి చేర్చు. భోజనాల వేళ అయింది కదమ్మా!...’’
‘‘అవునత్తయ్యా, వెళుతున్నా!...’’ అమ్మ వంటగదివైపుకు వెళ్ళింది. తోటే అత్తయ్య సుశీల కూడా వెళ్ళింది.
ఇరువురూ వంటపాత్రలను, కంచాలను డైనింగ్ టేబుల్ పైకి చేర్చారు.
నానమ్మ కంచాలను క్రమంగా డైనింగ్ టేబుల్ మీద ఉంచింది. అందరం డైనింగ్ టేబుల్ వైపుకు నడిచాము.
‘‘అమ్మా సుశీ!... మీ నాన్నగారిని భోజనానికి పిలువమ్మా!...’’ అంది నానమ్మ.
సుశీల అత్తయ్య తాతయ్య గది ద్వారాన్ని సమీపించింది.
తాతయ్య చిరునవ్వుతో ఆమెకు ఎదురైనారు.
‘‘అమ్మా సుశీ!... మీ అమ్మ గొంతు చాలా ఘనమైనది కదమ్మా, నాకు వినిపించింది...’’ నానమ్మ వైపు చూసి నవ్వుతూ తాతయ్య డైనింగ్ టేబుల్ సమీపించి కూర్చున్నారు.
అందరం కూర్చున్నాము. నానమ్మ, అమ్మ వడ్డించడం ప్రారంభించారు. ముందే చెప్పానుగా!... భోజన సమయంలో ఎవరూ మాట్లాడకూడదని, అందరం మౌనంగా ఎవరి ఆలోచనలలో వారు భోంచేశాము. ఎవరి గదులకు వారు వెళ్ళి పడుకున్నాము. సాధారణంగా తాతయ్య భూముల వైపుకు పోరు, ఏ నెలకో ఒక్కసారి వెళతారు మా పాలేరు రాజయ్యతో కలసి.
మరుదినం బాబాయికి ఆదివారం అయినందున టిఫిన్ చేసి నాన్నా బాబాయిలు పొలాలకు వెళ్ళేదానికి బయలుదేరారు ఆ రోజు...
‘‘నాన్నా!... పద్మా!...’’ పిలిచారు తాతయ్య.
‘‘ఏం నాన్నా!...’’
‘‘నేనూ మీతో వస్తున్నాను. పంట కోతకు వచ్చింది కదా!... ఒకసారి చూడాలని ఉంది...’’ అన్నారు తాతయ్య.
‘‘నాన్నా!... ఎండ కదా, మీరెందుకు?... అన్నయ్యా నేను వెళ్ళి చూసి వస్తాంలే నాన్నా!...’’ అన్నాడు బాబాయ్.
‘‘ఏరా సత్యా!... నన్ను ఇప్పుడే ముసలివాణ్ణి అనుకుంటున్నావా!... మొన్న సత్యహరిశ్చంద్ర నాటికంలో చూడలేదా మీ ఈ నాన్న శక్తి సామర్థ్యాలను!...’’ నవ్వాడు తాతయ్య.
‘‘సరే నాన్నా, రండి!...’’ అన్నాడు బాబాయ్.
ముగ్గురూ కలసి పొలాల వైపుకు బయలుదేరారు.
అనుకున్న ముహూర్తానికి అత్తయ్య సుశీల, ధనుంజయల వివాహం ఘనంగా జరిపించారు తాతయ్య, నాన్న, చిన్నాన్నలు. ఊరి జనాన్ని అందరినీ ఆహ్వానించారు. విందు భోజనాలను ఏర్పాటు చేశారు. పేదలకు వస్త్రదానం అత్తయ్య, మామయ్య (ధనుంజయరావు) చేతుల మీదుగా చేయించారు.
జనమంతా ఆ దంపతులను మనసారా దీవించారు.
ఆ రోజు అత్తయ్యను ఆమె అత్తగారింటికి పంపే రోజు...
మా అందరి హృదయాల్లో అత్తయ్య మమ్మల్ని వదిలి వారి అత్తగారింటికి వెళుతుందనే బాధ. కళ్ళలో అశ్రువులు... ముందుగా కన్నీళ్ళతో తాతయ్యను సమీపించి వంగి వారి పాదాలను తాకి కళ్ళకు అద్దుకుంది. తాతయ్య ఆమె భుజాలను పట్టుకొని తన హృదయానికి హత్తుకున్నారు.
అంతవరకూ వారి కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు అత్తయ్య సుశీల తలపై పడ్డాయి. అత్తయ్య తలను పైకెత్తి తాతయ్య ముఖంలోకి కన్నీటితో చూసింది. తాతయ్య తన ఆవేదనను నిగ్రహించుకొని ఆమె కన్నీటిని తుడుస్తూ..
‘‘తల్లీ!... నేను నీ కోరికను నెరవేర్చాను కదరా!...’’ బొంగురుపోయిన కంఠంతో ప్రయాసతో అన్నారు తాతయ్య.
అవునన్నట్లు అత్తయ్య తల ఆడించింది. మెల్లగా ప్రక్కనే నిలబడియున్న నానమ్మ పాదాలను తాకబోయింది. నానమ్మ ఆమె భుజాలను పట్టుకొని ఆపి తన రెండు చేతులతో అత్తయ్య ముఖానికి రెండు వైపులా తన చేతులను చేర్చి ఆమె నొసటిపై కన్నీటితో ముద్దు పెట్టింది. అత్తయ్య కన్నీటిని తుడిచింది.
‘‘మన ఊర్లోనేగా ఉంటావు. నీకు మమ్మల్ని చూడాలనిపించినా... మాకు నిన్ను చూడాలనిపించినా, పది నిమిషాల్లో కలుసుకోగలం కదా తల్లి!...’’ అంది చిరునవ్వుతో... పెదవులపైన నవ్వు, నయనాల్లో కన్నీరు…
అత్తయ్య నాన్నను, అమ్మను సమీపించింది. ఇరువురూ ఆమెను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
‘‘అన్నయ్యా!... వదినా!... నేను ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మీ మనస్సుకు బాధ కలిగించి వుంటే, నన్ను మన్నించండి...’’
‘‘లేదు లేదు’’ అన్నట్లు అమ్మా నాన్నలు తల ఆడించారు. ఆమె నొసటిపై ప్రీతిగా ముద్దులు పెట్టారు. కుడిచేయి ఆమె తలపై ఉంచి దీవించారు.
తరువాత మెల్లగా అత్తయ్య మా చిన్నాన్న ఎదుటికి జరిగింది. వారి కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. కళ్ళల్లో కన్నీరు... అత్తయ్య వంగి వారి పాదాలను తాకబోయింది. ఆపి, ఆమె శిరస్సును తన హృదయానికి హత్తుకున్నాడు చిన్నాన్న…
‘‘అమ్మా!... నీకు ఏనాడైనా అత్తఇంట ఏదైనా బాధ కలిగితే ఈ నీ అన్నయ్యకు చెప్పమ్మా!... అది ఎలాంటి విషయం అయినా నేను పరిష్కరిస్తాను. నీకు ఆనందాన్ని కలిగిస్తాను..’’ ప్రీతిగా తల నిమురుతూ ఆశీర్వదించాడు చిన్నాన్న.
చిన్నాన్న ప్రక్కనే కన్నీళ్ళతో నేను, నా అక్క కావ్య నిలబడి ఉన్నాము. అత్తయ్యనే చూస్తున్నాము. ఆమె మా ముందు మోకాళ్ళపై కూర్చుంది. తన రెండు చేతులతో మమ్మల్ని దగ్గరకు తీసుకొని, ‘‘ఇద్దరూ బాగా చదవాలి. మీ మనస్సులోని కోరికల ప్రకారం కవీ!... నీవు కలెక్టర్ కావాలి. చంద్రా!... నీవు డాక్టర్ కావాలి. అమ్మా నాన్నల ప్రతి మాటను వినాలి. వారు చెప్పినట్లు నడుచుకోవాలి’’ అంది.
ఆమె మా కన్నీటిని తుడిచింది. మేము అత్తయ్య కన్నీటిని తుడిచి ఇరువురం తలలు ఆడించాము.
‘‘సుశీ!... బయలుదేరుదామా!...’’ అన్నాడు ధనుంజయరావు.
అత్తయ్య వారి వంక చూచి, వారిని సమీపించింది.
‘‘మామయ్యా!... వెళ్ళి వస్తాము...’’ తాతయ్యను సమీపించి చెప్పాడు ధనుంజయరావు.
‘‘మంచిది బాబూ!...’’ తాతయ్యగారి సమాధానం.
వీధి వాకిట వరకూ అందరం వారివెనకాలే విచారవదనాలతో నడిచాము.
అత్తయ్య అందరినీ ఒకసారి చూసింది. కార్లో కూర్చుంది. ధనుంజయరావు కారును స్టార్ట్ చేసి వీధిలో ముందుకు నడిపాడు.
సంవత్సర కాలం ప్రశాంతంగా జరిగిపోయింది.
సుశీల అత్తయ్య గర్భవతి అయింది. సీమంతాన్ని ఘనంగా జరిపించారు తాతయ్య, నానమ్మలు.
శుక్రవారం నాడు అత్తయ్య ప్రసవించింది. ఆడబిడ్డ, ఆ పాపకు అమృత అని నామకరణం చేశారు. నామకరణ మహోత్సవాన్ని చాలా గొప్పగా జరిపించారు మా తాతయ్య, గోవర్ధనరావులు.
పాప, దినదినాభివృద్ధితో పెరిగి ఒకటిన్నర సంవత్సరం ప్రాయానికి వచ్చింది. తప్పటడుగులు, ముద్దు ముద్దు పలుకులు. అందరినీ ఎంతగానో ఆకర్షించేది, ఆనందాన్ని కలిగించేది.
కొందరు ఇరుగు పొరుగు మా అమ్మతో... ‘‘చంద్రానికి భార్య పుట్టిందిగా!... అమృత వాడి అత్త కూతురు, చంద్రానికి కాబోయే భార్యేగా!...’’ అనేవారు. నవ్వేవారు.
అమ్మ నవ్వుతూ, ‘‘మనదేముందమ్మ, అంతా సర్వేశ్వరుని సంకల్పం!...’’ అని చిరునవ్వుతో పలికేది.
మా అక్కయ్య కావ్య యుక్త వయస్కురాలయింది. ఆ వేడుకలను తాతయ్య నాయనమ్మలు ఎంతో గొప్పగా జరిపించారు. గోవర్థనరావు గారి కుటుంబం మా కుటుంబం కలిసి ఎంతో ఆనందంగా గడిపిన మరచిపోలేని మంచి రోజది.
తాతయ్యగారు జిల్లా పరిషత్ అధ్యక్షులను సంప్రదించి మా పాఠశాలను హైస్కూలుగా మార్చారు.
మరో మూడు సంవత్సరాలు అతి త్వరగా జరిగిపోయాయి.
అమృత నాలుగేళ్ళు అమ్మాయిగా మారింది. ఆమెకు అక్షరాభ్యాసం చేసి స్కూలుకు పంపారు సుశీల అత్తయ్య ధనుంజయరావులు.
చిన్నవయస్సు నుంచే అమృతకు నేనంటే ఎంతో ఇష్టం. ‘బావా – బావా‘ అంటూ నా వెంటే తిరిగేది. ఒక్కోరోజు రాత్రి మా అమ్మ దగ్గరే పడుకునేది. అప్పుడు అమ్మ అత్తయ్యకు ఫోన్ చేసి...
‘‘సుశీ!... అమృత నిద్రపోయింది. ఇంటికి రేపు పంపుతాలే!....’’ అనేది.
‘‘సరే వదినా!...’’ అత్తయ్య సమాధానం.
ఒకరోజు ఉదయాన్నే గోవర్ధనరావుగారు మా యింటికి వచ్చారు.
తాతయ్యగారు గ్రామ పెద్దలు ఐదుగురితో రానున్న మహాశివరాత్రి ఉత్సవాన్ని గురించి మాట్లాడారు. పూజలు, అభిషేకాలు, రాత్రి ఉత్సవాన్ని, అన్నదానాన్ని ఘనంగా జరిపిద్దాం అని నిర్ణయించారు. వారందరూ లేచి తాతయ్యగారికి నమస్కరించి వెళ్ళిపోయారు.
గోవర్ధనరావు గారు వరండాలో ప్రవేశించారు. మా ఇంటి ముందున్న వరండా పొడవు ముప్ఫై రెండు అడుగులు. వెడల్పు పది అడుగులు. యాభై అరవై మంది కూర్చోవచ్చు. గ్రామ పెద్దలు వరండా మెట్లు దిగారు. గోవర్ధనరావు గారు వరండాలో ప్రవేశించారు.
‘‘రా బావా, రా!...’’ తాతయ్య గారి ఆహ్వానం.
‘‘నమస్తే బావా!...’’ నవ్వుతూ గోవర్ధనరావు తాతయ్యగారి ప్రక్కన కూర్చుని, వారి ముఖంలోకి చూశాడు.
‘‘ఏమిటి బావా?...’’ తాతయ్యగారి ప్రశ్న.
‘‘మరేంలేదు బావా!... భద్రాద్రి శ్రీరాములవారిని దర్శించాలనుంది మీ చెల్లికి!...’’ చిరునవ్వుతో చెప్పాడు గోవర్ధనరావు.
‘‘ఓహో అలాగా!...’’
‘‘అవును బావా!...’’
‘‘సరే, వెళదాం!...’’ నవ్వుతూ చెప్పాడు తాతయ్య...
క్షణం తర్వాత.
‘‘ఎలా వెళ్ళాలని నీ నిర్ణయం?...’’ అడిగారు తాతయ్య.
‘‘ఇక్కడ నుండి రాజమహేంద్రవరం వరకూ రైలు. అక్కడనుండి పడవలో గోదావరి నదిపైన ప్రయాణం. ఇది మీ చెల్లి కోరిక!...’’
తాతయ్య నవ్వాడు, ‘‘బావా!... మనం నా చెల్లి కోర్కెను తీర్చాల్సిందే, అలాగే వెళదాం!...’’
‘‘చాలా సంతోషం బావా!...’’
‘‘మరి ప్రయాణం ఎప్పుడు?...’’
‘‘మంచి రోజు చూచుకొని బయలుదేరుదాం బావా!... రోజును మీరే నిర్ణయించండి!....’’ నవ్వుతూ చెప్పాడు గోవర్ధనరావు.
‘‘అలాగే బావా!...’’
‘‘బావా వస్తాను. వెళ్ళి మీ సమ్మతిని మీ చెల్లికి చెబుతాను. సంతోషిస్తుంది...’’
‘‘అలాగే!...’’
‘‘వస్తాను బావా!...’’ ఆనందంగా కుర్చీనుంచి లేచి గోవర్ధనరావు వారి ఇంటివైపుకు నడిచాడు.
తాతయ్యగారు నానమ్మను పిలిచి విషయాన్ని చెప్పారు.
నానమ్మ పార్వతమ్మ ఎంతగానో సంతోషించింది.
వారి భద్రాచల యాత్రను గురించి తాతయ్య భోజన సమయంలో అందరికీ చెప్పారు.
అమ్మా, నాన్నా, చిన్నాన్నలు సరే అన్నారు.
మంచి రోజున పెద్దలు నలుగురూ, తాతయ్య, నానమ్మ, గోవర్ధనరావు, వారి సతీమణి (మా తాతయ్యగారి చెల్లెలు నిర్మలమ్మ), బస్సులో జిల్లా నగరానికి వెళ్ళి అక్కడినుండి రైల్లో రాజమహేంద్రవరం వరకు ప్రయాణం సాగించారు.
రాజమహేంద్రవరం నుండి గోదావరీ నదిపై పడవ ప్రయాణం. మావారితోటే చాలామంది భద్రాచల సీతారాములను దర్శించడానికి యాత్రికులు ఉంటారని నాన్న చెప్పారు.
మావారు వెళ్ళిన మరుసటి రోజున...
రేడియో వార్తలలో ‘బంగాళాఖాతం (సముద్రం) లో వాయుగుండం నెలకొన్నదని, ఆంధ్ర, తమిళనాడు తీరప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని’ చెప్పారు. వార్తల్లో చెప్పినట్లుగానే మరుదినం వర్షం ప్రారంభమయింది. సాయంత్రానికల్లా గాలీవాన ఉరుములు మెరుపులతో తుఫానుగా మారింది.
నాన్నా, అమ్మ, బాబాయిలు... ‘‘అమ్మా నాన్నలు ఈ తుపానులో ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో!...’’ అని భయపడిపోయారు. వర్షం, ఉరుములు, గాలీవాన ఆగలేదు. మరుదినం అదే పరిస్థితి. రేడియోలో తుఫాను తీరం దాటలేదని, మరో ఇరవైనాలుగు గంటలు వాతావరణం ఇలాగే ఉంటుందనే వార్త!...
అలా మరో రెండు రోజులు గాలి, విపరీత వర్షం కొనసాగింది. అమ్మా నాన్న బాబాయిల వదనాల్లో తాతయ్య నానమ్మలను గురించిన భయం. వదనాల్లో ఆవేదన. వారి స్థితిని చూసి నేను, మా అక్క కూడా మనస్సులో తాతయ్య నానమ్మలు ఏమైనారోనని బాధపడసాగాము. ఆ రెండు రోజులు చాలా భారంగా గడిచినట్లు అనిపించింది.
నాల్గవరోజు పూర్తిగా గాలీవాన ఆగిపోయాయి. అందరి ముఖాల్లో కాంతి.
ఉదయం వార్తల్లో... పెనుతుఫాను కారణంగా భద్రాచలం యాత్రకు బయలుదేరిన పడవ ఒకటి గోదావరి నదిలో పాపికొండల ప్రాంతాన తలక్రిందులైందని, నలభై ఆరుమంది చనిపోయారనే వార్తను విన్నాము.
అంతవరకూ ప్రశాంతంగా ఉండిన అమ్మా నాన్న బాబాయిల వదనాల్లో కలవరం. వారిని చూసి నేనూ, అక్క కూడా తాతయ్య నానమ్మలు ఆ నలభై ఆరుమందిలో ఉండి ఉండకూడదని దేవుణ్ణి కోరుకున్నాము.
ఆ రోజు అందరం దిగులుతో సరిగా భోంచేయలేదు.
మరుదినం ఉదయం తొమ్మిది గంటలకు అంబులెన్స్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది.
ఒక వ్యక్తి వరండాను సమీపించి... ‘‘వీరరాఘవయ్యగారి ఇల్లు ఇదేనా?...’’ అని అడిగారు.
వాకిట్లో ఆగివున్న అంబులెన్స్‌ను చూసి నాన్న, అమ్మ, బాబాయిలు భయపడ్డారు.
బాబాయి అంబులెన్స్ వైపుకు పరుగెత్తాడు.
వారి ప్రశ్నకు సమాధానంగా నాన్న...
‘‘అవునండీ!...’’ గద్గదస్వరంతో మెల్లగా చెప్పారు.
‘‘వారు, వారి సతీమణి పడవ ప్రమాదంలో మరణించారండీ!...’’ చెప్పాడు ఆ వ్యక్తి. క్షణం తరువాత, ‘‘వారే కాదండి, గోవర్ధనరావు, నిర్మలమ్మ దంపతులు ఈ ఊరి వారు మరణించారు...’’ అన్నాడు.
అమ్మానాన్నలు అంబులెన్స్ వైపుకు పరుగెత్తారు. నేను, అక్క వారి వెనకాలే.
దొడ్డిలో గేదెలకు గడ్డి వేస్తున్న మా పాలేరు రాజయ్య, మా పనిమనిషి చెంచమ్మ కూడా విచారవదనాలతో అంబులెన్స్‌ను సమీపించారు.
ఇరుగు పొరుగు ఇండ్లలో ఉన్న ఆడ, మగా కూడా అంబులెన్స్‌ను చుట్టుముట్టారు.
ఆ వ్యాన్ సిబ్బంది తలుపును తెరిచారు. స్ట్రెచ్చర్‌పై తెల్లని గుడ్డతో చుట్టబడిన రెండు ఆకారాలను వారు స్ట్రెచ్చర్‌తో సహా మా ఇంటి వరండాలోకి చేర్చారు.
అమ్మ ఏడుస్తూ వెళ్ళి నట్టింట చాపలు పరిచింది. ఇరుగు పొరుగు మగవారు ఆ రెండు ఆకారాలను చాపలపైకి చేర్చారు. స్ట్రెచ్చర్‌ను తీసుకొని అంబులెన్స్ పనివాళ్ళు వెళ్ళిపోయారు.
తాతయ్య, నానమ్మల స్ట్రెచ్చర్స్ ను దించగా, అంబులెన్స్‌లో మరో రెండు ఆకారాలు తెల్ల గుడ్డలతో ఉన్నాయి.
అంబులెన్స్ డ్రైవర్... ‘‘గోవర్ధనరావు గారి ఇల్లు ఎక్కడ?..’’ అని జనాన్ని అడిగి, అంబులెన్స్‌ను వారి ఇంటి వైపు నడిపాడు.
అందరూ ఏడుస్తూ హాల్లో నానమ్మ, తాతయ్యల మృతదేహాల చుట్టూ చేరిపోయాము.
ఇరుగు పొరుగు అమ్మలు అమ్మను మగవారు నాన్నను బాబాయినీ వారి చేతుల్లోకి తీసుకొని ఓదార్పు మాటలు చెప్పారు. ప్రస్తుత కర్తవ్యాన్ని గురించి ఆలోచించమన్నారు.
కొంతసేపటికి తెప్పరిల్లుకున్న బాబాయ్ మాకు కావలసిన వారికందరికీ ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు.
యథార్థంగా మా నాన్నగారు చాలా పిరికివాడు, సౌమ్యుడు... తాతయ్య, నానమ్మల మాటలను ఏనాడూ జవదాటలేదు. తల్లిదండ్రులంటే వారికి విపరీతమైన అభిమానం. ఇరువురి మధ్య కూర్చొని ఎంతగా ఏడ్చాడో చెప్పలేను..
బాబాయ్ గండాగొండి, ధైర్యశాలి. ఆయనకు అన్న, తల్లిదండ్రులపై సమానమైన ప్రేమానురాగాలు. అందరికంటే ఆయనకు మా సుశీల అత్తయ్య అంటే వల్లమాలిన అభిమానం.
రావలసిన వారంతా రెండు గంటల లోపలే వచ్చేశారు. తాతయ్యను, నానమ్మను ఆ స్థితిలో చూసి బోరున ఏడ్చారు. నాన్నను, అమ్మను ఊరడించారు.
ఇదే స్థితి ఆ ధనుంజయరావు గారి ఇంట్లో ఉండటంతో మా ఇంటివారు ఎవరూ ఆ ఇంటికి పోలేకపోయారు, వారూ మా ఇంటికి రాలేకపోయారు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒకేసారిగా తాతయ్య, నానమ్మల అంతిమ స్మశాన యాత్ర నలుగురు, మరో నలుగురితో మృతదేహాలు స్మశానం వైపు బయలుదేరాయి. ముందు తాతయ్య, వెనుక నానమ్మ. అగ్నిఘటంతో నాన్న ముందు, మాహితులు, ఆప్తులు ముందూ వెనుకా. అందరి హృదయాలు ఆవేదనాభరితాలు. నేనూ, మా అక్కా కూడా వారితో ఏడుస్తూ వెళ్ళాము.
నాన్నగారికి అన్ని విషయాలలో గోపాలయ్య మాస్టర్ అండగా ప్రక్కనే ఉండి సహకరించారు. నాన్నను బాబాయినీ ఓదార్చారు.
ఏడు గంటల ప్రాంతంలో స్మశానంలో మంత్రపూర్వకంగా తాతయ్య, నానమ్మల తోలుబొమ్మలు అగ్నికి ఆహుతైపోయాయి. అదే రీతిగా గోవర్ధనరావు, నిర్మలమ్మలకు ధనుంజయరావు జరిపారు.
మౌనంగా అందరం ఇంటివైపుకు నడిచాము.
మాకు అన్నపానీయాలు గోపాలయ్య గారి ఇంటి నుంచి కర్మకాండలు పూర్తి అయ్యేవరకూ వచ్చేవి.
బాబాయ్, నాన్నగారు సశాస్త్రీయంగా కర్మకాండను శ్రద్ధాభక్తులతో కన్నీటి నివాళులతో జరిపారు.
చితాభస్మాన్ని, అస్థికలను ఇరువురూ కలసి కాశీ వెళ్ళి గంగామాతలో కలిపి శ్రీ కాశీ విశ్వేశ్వరులను, మాతా అన్నపూర్ణమ్మను దర్శించి వచ్చారు. మరుదినం నాన్నగారు ధనుంజయరావు గారి ఇంటికి వెళ్ళి వచ్చారు…
మా తాతయ్య, నానమ్మల శకం ఆ రీతిగా ముగిసిపోయింది!!!....
============================================================
తోలు బొమ్మలు - పార్ట్ 13 త్వరలో మీ ముందుకు వస్తుంది.
============================================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.










Comments