top of page

'భారతీ'యం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Bharathiyam' New Telugu Story


Written By Bhagavathula Bharathi


రచన: భాగవతుల భారతిఆంధ్రా యూనివర్శిటీ ముందు ఆటో దిగి, నిదానంగా లోపలికి నడిచారు శంకరశర్మ గారు, భార్య, తన మనుమల సహాయంతో.


దర్వాజా పక్కనున్న సరస్వతీ మాత నిలువెత్తు ఫొటో వంక వణుకుతున్న చేతులతో నమస్కరిస్తూ, గతంలోకి జారిపోయారు .

////////////

"నాకు తెలుగు లెక్చరర్ గా పదోన్నతి వచ్చిందండీ. అంతా మీ ఆశీర్వాదమే మాష్టారూ! " అంటూ పాదాలకు నమస్కారించిన ప్రకాష్ ని ఆశీర్వదించి, "ఇంత మంది నా దగ్గర తెలుగు యమ్. ఎ చదివి చక్కటి ఉపాధ్యాయులయ్యారు. మీలో ఒకరైనా

ఓ పద్యం గానీ, చక్కని వచన కవిత గానీ వ్రాస్తే చూడాలనీ విందామనీ, ఎంత ఆశో నాకు. ఎబ్బే.. ఏంటి లాభం... జీవనోపాధి కి ఉపయోగపడింది చదువు.


పోనీలే ...యశస్వీ భవ " అంటూ గోడకి వేలాడుతున్న సరస్వతీ మాత ఫోటో ను రెండు క్షణాలు తదేకంగా చూసారు.


ప్రకాష్ కి తెలుసు,మాష్టారి మదిలో మెదిలే అసంతృప్తికి కారణం. అలాంటప్పుడే ఆయన ఆ ఫొటో వంక చూస్తారనీనూ.


మౌనంగానే మాష్టారి ఙ్ఞాపకాలలో మమేకమౌతాడు ప్రకాష్ అప్పుడప్పుడూ.


శంకర శర్మగారు ,ఉభయభాషా ప్రవీణ.


తెలుగులో మాష్టర్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తెలుగులో ఆయన పాండిత్యం అపారం. భాషమీద మక్కువా ఎక్కువే. కాదంబరి వర్ణనలన్నీ ఆశువుగా చెప్పేసేవారు . ప్రబంధాలూ, కావ్యాలన్నీ కరతలా మలకమే. శతకాలు రాసి గుళ్ళో రామలింగేశ్వర స్వామికి అంకితమిచ్చారు.


ఆయనకి ఇద్దరూ ఆడపిల్లలే. ఆయన సంబరపడిపోతూ భారతి, వాణి అని సరస్వతీ దేవి పేర్లు పెట్టి, పిల్లల మీద శార్దూలపద్యం రాసుకుని అందరికీ వినిపించి మురిసిపోతుండేవారు. ఇలా..

శార్దూలం..

నీ పేరే యిడుకుంటి పిల్లలకు వాణీభారతీరా

రే ప్రేయోరస మూర్తులార యనుచున్ ప్రేపుల్ నివేదించు త

ల్లీ పారాయణమాయె కల్పసుమవల్లీ నీదు నామంబె రా

వే పైతామహ వాక్చతస్ర రసనావిర్భూత హల్లీసకా!


పిల్లలను తెలుగు సాహిత్యంలో, తనంత వారిని చేయాలనుకున్నారు.

కానీ నిరాశే ఎదురైంది.


తల్లీ పిల్లలూ ఇంగ్లీష్ భాషవైపే మెుగ్గుచూపారు. ఇంజనీర్లు అయ్యారు.

వారి చదువుల్లో వారు ప్రవీణులే.


పెళ్ళళ్ళయి, ఇంజనీరింగ్ భర్తలతో, పిల్లలతో

సమస్యలేం లేని, జీవితాల్లోనే స్థిరపడ్డారు.


కానీ శంకర శర్మగారి మనస్సులో ఏదో వెలితి.

తనదగ్గర తెలుగు భాష నేర్చుకుని, కొందరు ఎం. ఎ లు చేసి, ఉపాధ్యాయులుగా, వేరు వేరు రంగాలలో ఉన్న శిష్యులు, కేవలం జీవనోపాధి వెంపర్లాటలోనే ఉన్నారుగానీ,

భాషని భావాన్నీ ,విస్తృతపరిచి, మాతృభాషకు సేవచేయాలనే తపన తను కన్నపిల్లలో గానీ, శిష్యులలో గాని లేదే అని కలత చెందుతూ ఉంటారు.

పైగా "ప్రకాశూ !సురేషూ! ఏ భాషలోనూ లేని ఓ అధ్భుత వరం తెలుగు భాషలో ఉందిరా.

అది కమ్మనైన తెలుగు పద్యం. కష్టపడండి రా, నేర్చుకోండిరా. " అనే మాష్టారి అభ్యర్థన

గాలిలో కలిసిపోయింది.


గతంలోంచి బయటి కొచ్చిన ప్రకాష్ మాష్టారుకి నమస్కారం చేసి, తాను రాసిన చిన్న వచన కవిత ను వినిపించాడు.


మాష్టారు సంతోషించి,"సరస్వతీమ తల్లికి ఓ కన్ను పద్యమైతే, ఓ కన్ను గద్యం.

అభివృద్ధి చేయండి" అని, " ఏమిటో.. అంతా కొసాకుల మేత! " అంటూ నిట్టూర్చారు, ప్రకాష్ వెళ్ళిన వైపే చూస్తూ.


ఫోన్ తెగమోగుతోంది, తీసారు మాష్టారు.


"నాన్నా! నేనూ భారతిని. పద్యం రాయటం నేర్పుతావా నాన్నా " ఉపోద్ఘాతం లేకుండానే మెుదలు పెట్టింది భారతి.


"పద్యమా!?ఎవరికీ?! ఏపద్యం?! ఎందుకూ?!"


"నాన్నా! అదేదో యాడ్ లాగా కాలేజా! నేనా! అనేంత ఎక్ప్రెషన్అక్కర్లేదు. పద్యం నాకే నేర్పాలి. ఎలాగూ పిల్లలకోసం జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి

సెలవుల్లో పిల్లలను తీసుకొని వస్తా.


వాళ్ళకీ, నాకు తెలుగు వ్యాకరణం నేర్పాలి. నాకు పద్యం వ్రాయటం నేర్పాలి

మిగతావివరాలు వచ్చాక చెబుతా! " లొడలొడ మాట్లాడి ఫోన్ పెట్టేసింది భారతి.


అవాక్కై నిలబడి ఉండగానే మళ్ళీ ఫోను.

వాణీ దగ్గరనుంచి.


"నాన్నా నాకు పద్యంరాయటం నేర్పవా? నేను పిల్లలతో వస్తున్నా. అక్క చెప్పేఉంటుందిగా " అని ఫోన్ పెట్టేసింది.


స్థాణువులా నిలబడిపోయిన శంకర శర్మగారు, భార్య వచ్చి పిలిచినా పలకలా.

"ఏమండీ ఏమైపోయారూ "భయంతో భార్య గట్టిగా కుదిపితే గానీ ఈ లోకంలోకి రాలేకపోయారు.


అన్నట్లుగానే ఇద్దరాడపిల్లలు, పిల్లలతో దిగిపోయారు. కుశలప్రశ్నలు అయ్యాయి.

"నాన్నా! టెక్నాలజీ డెవలప్ అయ్యాక, ప్రసార మాధ్యమాల ద్వారా సమాజం మంచినీ, చూస్తోంది, చెడునూ చూస్తోంది.

ఎవరు దేన్ని ఉపయోగించుకుంటే అలా డెవలప్ అవుతున్నారు. పతనమూ అవుతున్నారు. చూసే దృష్టి ని బట్టి... నాలెడ్జ్ మారుతోంది." భారతి మెుదలెట్టింది.


వాణీఅందుకుంది " నాన్నా! అనుకోకుండా మేం ఓ వాట్సప్ గ్రూప్ లోకి పరిచయం అయ్యాం. అందులో కొంతమంది పెద్దల పద్యాలూ, కవితలూ, కథలూ మమ్మల్ని అబ్బురపరిచినాయ్. "


"అవును నాన్నా! దూరదూరంగా ఉన్నప్పటికీ ఇద్దరం, అందులోనే కాబట్టి రోజూ అవన్నీ చదివి చర్చిస్తున్నాం. 'అక్కా! మనిద్దరం ఇలా చర్చించుకోవటం కాదు. మనమూ ఎందుకు డెవలెప్ కాకూడదూ? నాన్న దగ్గరకు వెడదాం. నువ్వు పద్యం, నాకు వంటబట్టేదీ వచనమే కాబట్టి నేను కవితలో టెక్నిక్స్ నేర్చుకుందాం పద' అని వాణీ అంది. వచ్చేసాం "అంది భారతి.


ఇక శంకర శర్మ గారు ఆనందంతో ఉప్పొంగుతున్నవేళ, వయసు, అనారోగ్యం మరిచిపోయి, పిల్లలతో పాటు, భారతికీ వాణికీ వ్యాకరణం, ఛందస్సు పగలూరాత్రీ

నేర్పారు.


చిన్నప్పటినుంచి ఇంట్లో అటూ ఇటూ గెంతుకుంటూ వింటూ ఉన్న ప్రభావం,

భారతి పద్యం వ్రాయటం నేర్చి, మెుదటి పద్యం నాన్నమీదే వ్రాసింది. ఇక అక్కణ్ణించి వెనక్కి చూసుకోలా! పద్యం, వచన కవిత, కథ, వ్యాసం.. ఏదైనా విలక్షణమైన రీతిలో ఆలోచనలకు పదును పెట్టి, వ్రాయటమేకాదు...

వాట్సప్ దాటి బయటికి అడుగుపెట్టింది.


వాణీ కి పద్యం వంటబట్టక పోయినా కథ, వచన కవిత... ఎదురులేకుండా ఉరుకుతూనే ఉన్నారు.


"మాష్టారూ ! మీ ఫోన్ నెంబర్ భారతి దగ్గర తీసుకున్నానండీ. నేనెవరో మీకు తెలీదు.

మీ గురించి మీ పిల్లల పరిచయ వాక్యాల్లో తెలుసుకున్నా.పేపర్లో ఇంటర్వ్యూ లలో మీ గురించి ఎంత గొప్పగా చెప్పారండీ!?


ఇద్దరు సరస్వతులను కన్నారండీ మీరు. ఏ పత్రికలో చూసినా, ఏ పోటీలో చూసినా వాణీ, భారతులేనండీ. మిమ్మల్ని చూడాలనుందండీ "


ఇలా రోజూ అపరిచితులనుండి వచ్చే ఫోన్ కాల్స్ తో శంకర శర్మగారు "తన జన్మ ధన్యమాయె" అనుకుంటూ .... సారస్వత తెలుగు పుస్తకాలు, పిల్లలకు పరిచయం చేస్తూనే ఉన్నారు.


"మాష్టారూ! మన భారతి వ్రాసిన 'తెలుగు భాషా ఔన్నత్యం' అనే సారస్వత గ్రంధం..

మీ సహాయంతోనే రాసిందనుకోండి. అవన్నీ పత్రికలో సీరియల్ గా వస్తున్నాయ్

చూసారా!? ఎంతలో ఎంత ఎదిగారండీ పిల్లలూ. భాషా శిల్పాలుగా తీర్చిదిద్దారండీ, మీ కలలు నెరవేర్చుకున్నారండీ " .

ప్రకాష్ ఫోన్ కి ఉబ్బి తబ్బిబ్బు అవని రోజు లేదు శంకర శర్మగారు.


" రవీంద్రభారతి లో సన్మానం జరిగిందిట, ఇద్దరికీ, చాలా మంది కవులతో పాటుగా .. కానీ నేను అనారోగ్యరీత్యా వెళ్ళలేకపోయాను, ఫొటోలు పంపారు పిల్లలిద్దరూ.. " ఆనందంగా చెప్పుకున్నారందరితో.


"అమ్మాయ్ భారతీ! తెలుగులో శతకాలు నాతో సహా చాలామంది వ్రాసేసారు.


'బుుతువర్ణన' పేరున పద్య సంకలనం తీసుకురా రా ..ప్రకృతి పర్యావరణ ని దృష్టి లో పెట్టుకుని, వ్రాయి. నేనూ సహాయం చేస్తా. నాకూ వయసై పోతోంది. నేను పోయేలోపల ఆ గ్రంథ సంకలనం వస్తే తండ్రిగా కాక తెలుగు భాషాభిమానిగా, జన్మధన్యమైందిపో అనుకుంటా " అని, ఓ గొప్ప కావ్యానికి శ్రీకారం చుట్టించారు శంకరశర్మ గారు.


భారతి పూర్తి చేసింది. అదే సమయంలో వాణి వ్రాసిన, 'ప్రకృతి పండించిన ఫలాలు' అనే గొప్ప వచన కావ్యమూ, పూర్తయింది.

ఇక ఆవిష్కరణ ఆంధ్ర యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా , సన్మానోత్సవ కార్యక్రమం అని నిర్ణయం జరిగింది.

ంంంంంంంంంంం

భారతి ఉపన్యసిస్తోంది.

"మనము ఆంధ్రులము. మనది తెలుగు భాష.

తెలుగు భాషకు ఇంపు సొంపులను గూర్చి, సిద్ధాన్నమును వడ్డించిన మహానుభావులు, పురాణములు వ్రాసి, కావ్యములు వ్రాసి, ప్రబంధములు కూర్చారు.

వారికి బుుణపడితిమి. ఆ బుుణమును తీర్చు కొనవలెను. మానవుడు జన్మమెత్తినందుకు ముఖ్యముగా మూడు బుుణములు తీర్పవలెనట.

బుుషి బుుణము, దైవ,బుుణము, దానితోపాటు భాషా బుుణము తీర్చవలెను.

ఇది మన సంప్రదాయము. విశ్వనాధ సత్యనారాయణ గారు 'కల్పవృక్షము 'వ్రాసి,

అందులోనే వ్రాసినారు. 'ఈ సంసార మదెన్ని జన్మలకునేనీ మౌని వాల్మీకి భాషా

సంక్రాంత బుుణంబు తీర్పగలదా?' అని .


"ఆ బుుణాలు ఈ స్టేజీ మీదే తీర్చగలగటం మా అక్కచెల్లెళ్ళ అదృష్టం.

మెుదటగా ఈ సన్మానోత్సవంలో పుస్తకావిష్కరణలు నాన్నగారి చేతుల

మీదుగా జరిపించాలని మనవి.. అలాగే మేం కూడా నాన్నగారికి చిరుసత్కారం చేసుకోటానికి పెద్దలు అనుమతించాలి. ఇది ఓ తండ్రికి కూతుళ్ళు చేసే సన్మానం కాదు .

తెలుగు మారాణికి పట్టే పట్టం" అంటూ చప్పట్ల మధ్యన సన్మానం జరగగానే ..


వక్త స్టేజ్ మీదకి వచ్చి," ఈ సమయంలో తెలుగు భారతి కి ఓ శుభవార్త. భారతిగారు వ్రాసిన 'ప్రాకృతి రమణీయం' ఖండకావ్యం సారస్వత పరిషత్ వారి పరిశీలనలో,

ఉంది. త్వరలోనే ప్రథమ బహుమతి అందుకుని, ఉత్తమ కవయిత్రి గా, మళ్ళీ మన సన్మానం అందుకోవాలని ఆశిద్దాం " అని ముగించారు.

ఆనందంలో భారతి...

చంపకమాల //

నుడువుగ పద్యకర్తనయి నూత్నమహోత్సవ వేడ్కనందితిన్

పడసితి దివ్యదీవెనలు భాగ్యముగానెరనమ్మితిన్ తగన్

కడుముదమంది సత్కవుల కావ్యరసోర్ములనోలలాడితిన్

వడివడి ధన్యనైతిగద పద్యశతద్వయ కల్పనంబునన్!!


ఆశువుగా చదివిన పద్యం హృద్యమై హృత్ప్రతిష్టితమై ఆ సాయం సంథ్య నీహారికలద్దగా తెలుగు భారతి శోభిల్లింది.


భారతీ, వాణీ సరస్వతి కి రెండు నయనాలుగా ఆనంద భాష్పాలనుండి, మసక మసకగా తోచారు శంకరశర్మ గారికి.

///////////////////

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.75 views0 comments

Comentarios


bottom of page