top of page

గోకే రావు ( హాస్యకథ )


'Gokerao' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

(ఇది కేవలం వినోదానికి మాత్రమే. వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి వ్రాసినదికాదు. అన్యధా భావించవలదు. )

గోకే రావు బుర్ర గోక్కుంటే ఏదో సమస్య వచ్చినట్లే లెక్క. గోకే రావు అంటే బుర్ర గోక్కుంటాడని ఆ పేరు పెట్టలేదు. అతని అసలు పేరు గోవర్థనం కేదారేశ్వర రావు. ఆఫీసులో అందరూ షార్ట్ కట్ గా గో. కే. రావ్ అని పిలుస్తారు. దానికి తగ్గట్టుగా అతనికి ఏ సమస్య వచ్చినా బుర్ర గోక్కుంటేనేగాని పని చెయ్యదు.

" సార్! అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. " అటెండర్ వెంకన్న వార్త అందించేడు గోకే రావుకు.

స్ప్రింగ్ డోర్ దగ్గర నిలబడి " మే ఐ కమిన్ సర్! " అన్నాడు గోకే రావు.

" ఎస్. కమిన్. " అని వినబడడంతో పులిబోనులో దూరినట్లు భయపడుతూ భయపడుతూ బాస్ ఛాంబర్ లోకి ప్రవేశించేడు గోకే రావు. అందరూ గోకే రావు అనే ఇతన్ని, బాస్ జి. కె. రావ్ అని పిలుస్తారు. గోకే రావు తెలుగులో షార్ట్ కట్ అయితే జి. కె. రావు ఇంగ్లీషులో. పేరు మాత్రం ఒకటే.

"చూడండి జి. కె. రావు గారూ! నిన్న మిమ్మల్ని అర్జెంటుగా తయారుచేయమని చెప్పేనే ఆ ఫైలు ఇలా తీసుకురండి".

"అలాగే సర్!" అని మరు క్షణమే సంజీవి పర్వతంతో ఆంజనేయుడిలా ఫైలుతో వచ్చి వాలేడు గోకే రావ్ ఉరఫ్ జి. కె. రావ్.

బాస్ ఫైల్ తెరచి చూసి " ఏంటండీ! ఇది ఫైలా? లేక దేనిదైనా టెయిలా? దీన్నిండా ఈ వెంట్రుకలేమిటీ? ఫైలు తల క్రింద పెట్టుకుని పడుకున్నారా లేక ఫైల్లో తల దూర్చి పని చేసేరా? ముందు ఈ ఫైలు శుభ్రం చేసి తీసుకురండి. " అని టేబుల్ మీదకు గిరాటేసినఫైలు తీసుకుని

"సారీ సర్!" అంటూ పరుగులాంటి నడకతో వచ్చి సీట్లో కూలబడ్డాడు గోకే రావు. జుట్టు పీక్కోబోయేడు కాని అంతలోనే జ్ఞాపకం వచ్చింది గోకితేనే ఇన్ని వెంట్రుకలు రాలితే ఇక పీక్కుంటే ఇంకేమైనా ఉందా? అయ్య బాబోయ్! అని జుట్టు ఊడి పోకుండా ఉండేందుకు మంచి హెయిర్ టానిక్ ఏమిటా అని ఆలోచించబోయి జుట్టు మాట దేవుడెరుగు ముందు ఉద్యోగం ఊడిపోకుండా ఉండాలంటే ఫైలును అర్జంట్ గా బాస్ కి అందజేయాలని గుర్తుకొచ్చి ఫైలును అంతా గట్టిగా దులిపి మరెక్కడా వెంట్రుకలు లేవని నిర్ధారణ చేసుకున్నాక మళ్ళీ ఫైలును బాస్ దగ్గరకు తీసుకెళ్ళేడు.

ఫైలును చూస్తూ బాస్ " చూడండి మిస్టర్ జి. కె. రావు గారూ! మీ డ్రాఫ్టింగ్ బాగుంది. మీ పని మీద నాకు నమ్మకం ఉండబట్టే మీకు ఈ పని అప్పచెప్పేను. అది సరే గాని మీరు మాటాడితే బుర్ర గోక్కోవడం ఏమీ బాగులేదు. చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అంచేత ముందు మీరు ఆ పని మానేయాలి"- బాస్ సలహా.

"అలాగే సర్! తప్పకుండా మానేస్తాను. " అంటూనే మళ్లీ గోక్కోబోయి " వస్తాను సర్" అని బయటపడ్డాడు. సీట్లో చతికిలబడి మళ్ళీ బుర్ర గోక్కుంటున్న గోకే రావును చూసి ప్రక్క సీటు ప్రకాశరావు అడిగేడు " ఏంటి విశేషం?" అని. బాస్ గారి ఉచిత సలహా వివరించేడు గోకే రావు.

"మరి మానేయక మళ్ళీ గోక్కుంటున్నావెందుకు?" గుర్తు చేసేడు సహోద్యోగి శ్రేయోభిలాషిగా.

"అదేనోయ్! వచ్చిన ఇబ్బంది. ఆలోచించాలంటే బుర్ర గోక్కోకుండా ఉండలేను"

" నేనో ఉపాయం చెప్పనా?"

" త్వరగా చెప్పు నాయనా! చచ్చి నీ కడుపున పుడతాను. "

" ఎందుకూ? ఇప్పుడు నీ బుర్ర గోక్కుంటున్నావ్ అప్పుడు నా బుర్ర గోకడానికా?"

"వెధవ జోకులెయ్యక అదేదో చెప్పి ఏడు. "

" అయితే విను. ఆలోచిస్తేనే కదా నువ్వు బుర్ర గోక్కునేది? అంచేత ఇక ముందు ఏ పనైనా ఆలోచించకుండా చెయ్యి. "

"ఏడిసినట్టుంది నీ బోడి చిట్కా. "

* * *

"చూడండి మిస్టర్ జి. కె. రావుగారూ! ఇందాక ఏదో మీ డ్రాఫ్టింగ్ బాగుంది అన్నానని అప్పుడే వళ్ళు మరిచిపోయేరన్నమాట. ఈ లెటర్ వ్రాసిన మీకు బుర్ర ఉందా అని?" బాస్ ఫైరింగ్.

" ఇట్ ఈజ్ టూ మచ్ సర్! బుర్ర ఉండబట్టే కదా గోక్కుంటున్నాను. " గోకే రావ్ జోకేసేడు.

" ఏం వేళాకోళంగా ఉందా? దీని పర్యవసానం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నారా ?" బాస్ బెదిరింపు.

" లేదు సర్! అది . . . . . . అదీ. . . . . . ఆలోచించకుండా వ్రాసేను సర్!. ఆలోచిస్తే బుర్ర గోక్కోవలసివస్తుంది. మరి ఆ పని చెయ్యొద్దని మీరే కద సార్ చెప్పేరు. "

" సరిపోయింది. ఇప్పుడు మీరు బుర్ర గోక్కోవడం మానేస్తే మీరు వ్రాసిన తప్పులు చూడలేక నేను బుర్ర గోక్కోవలసివస్తుంది. మీ జబ్బు నాకు అంటించకండి. ఆ గోక్కునేదేదో మీరే గోక్కోండి. అంతేగాని నేను గోక్కునేలా చేయకండి. యు కెన్ గో. " అన్న బాస్ ఛాంబర్ నుండి బయటపడ్డాడు బుర్ర గోక్కుంటూ సదరు గోకే రావు.

( సమాప్తం )

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం



71 views1 comment
bottom of page