top of page
Original.png

పల్లె పిలిచింది - 19

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #కందము, #తేటగీతి, 3సీసం

Palle Pilichindi - 19 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 13/06/2025

పల్లె పిలిచింది - 19 - తెలుగు కావ్యము ద్వితీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి



6.

కందం.


వరిచేలట నీట మునుగ

కరువులతో జనులు క్రుంగ గ్రామములందున్ 

వెఱపున బ్రతుకుల నీడ్చుచు 

పరితాపము చెందుతుంద్రు బరువుగ పౌరుల్ //


తాత్పర్యము.


వరిచేలు నీటిలో మునిగి పోతుంటే కరువుతో గ్రామవాసులు భయముతో, దిగులుతో బతుకులనీడుస్తూ ఉన్నారు.//


7.

కందము.

సరియగు వైద్యులు లేరట!

పెరిగిన రోగముల తోడ భీతిలి జనులున్ 

విరసముతో నగరాలకు 

పరుగిడుచుందురు కటకట!బావురు మనుచున్ //


తాత్పర్యము.


గ్రామాల్లో మంచి వైద్యులు లేరు. రోగాలు పెరుగుతూ ఉంటే భయంతో ప్రజలు పల్లెలను వదిలి బావురుమంటూ నగరాలకు వెళ్లి పోతున్నారు.//


8.

కందము.


రహదారులు మూసికొనును 

సహియింపగరాని దిగులు జనులకు కలుగున్ 

మహిలో కరువులు పెరుగగ 

నహరహము గడుపుదురు జను లావేదనతోన్ //


తాత్పర్యము.


వరదల్లో గ్రామాలకు వెళ్లే దారులు మూసుకొని పోతాయి. కరువుతో, దిగులుతో ఆ పల్లెల ప్రజలు నిమిషనిమిషము ఆవేదనతో గడుపుతున్నారు.//

9.

తేటగీతి.


పర్వతంబులు,వనములు సర్వమిపుడు 

నాశనంబొంద పల్లెకు నష్టమాయె 

నుష్ణ వాయువుల్ చెలరేగ నుడికె వసుధ 

వివిధమౌగతిఁ జనులెల్ల వెతలు పడిరి.//


తాత్పర్యము.


పర్వతాలు, నదులు, వనములు నాశనం చెందటంతో రాజుపాలేనికి  నష్టం వాటిల్లింది. వేడి గాలులు చెలరేగుతూ ఉంటే జనులు చాలా కష్టాలు పడుతున్నారు.//


10.

సీసం.


ఆ గిరిసీమల నాధారపడుచుండు 

కోయవాండ్ర బ్రతుకు కూలిపోయె 

వనసంపదలు తెచ్చి పాశ్చాత్యుల కిడుచు 

ధనముపై నాశతో దారితప్పి 

గనులను ధూర్తులు కబళించ శోచించి 

కొండలన్ గూల్చగా కూడుచుంద్రు

 పాలకులైనట్టి పాపాత్ము లీనాడు 

పట్టించుకొనరయ్యొ ప్రకృతినిపుడు./


11.

తేటగీతి.


శైలములఁ గూల్చి వైచిన జంతుతతికి 

నిలువ చోటులే దక్కటా!నీచమైన 

బుద్ది పుట్టెనీ దుష్టుల పుఱ్ఱెలందు 

కాల మివ్విధి ప్రకృతిని కాటువేసె.//


తాత్పర్యము.


రాజుపాలెమునకు ప్రక్కన ఉండే పర్వతము మీద ఆధారపడు కోయవాళ్ల బ్రతుకులు కూలిపోయాయి. వనములో దొరికే సంపదలను విదేశీయులకు అమ్ముతూ కొందరు దుష్టులు పర్వతమునందలి గనులను త్రవ్వుచున్నారు. అటువంటి వాళ్ళను పాపాత్ము లైనట్టి పాలకులు పట్టించుకోవటం లేదు. పర్వతములను కూల్చి వేస్తే జంతువులకు చోటు లేదు. మనుషుల బుర్రలో నీచమైన బుద్దులు పుడుతున్నాయి. కాలము ఈ విధంగా ప్రకృతికి హాని చేసింది.//


(సశేషం)


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page