అంతా మన మంచికే

Antaa Mana Manchike - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao
అంతా మన మంచికే - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 23/09/2026
“అంతా మన మంచికే” అనేది కుటుంబ ప్రేమ, తల్లిదండ్రుల అనుబంధం, దైవ విశ్వాసం మరియు జీవితంలో జరిగే అనుకోని సంఘటనల వెనుక ఉన్న మంచి గురించి చెప్పే హృదయస్పర్శి తెలుగు కథ. ఏది జరిగినా మన మంచికే జరుగుతుందనే విశ్వాసం, కష్టాల్లోనూ ఆశను కోల్పోకూడదనే సందేశం, తల్లిదండ్రులపై పిల్లలకు ఉండే అపారమైన ప్రేమ ఈ కథకు ప్రధాన బలం.
"ఏమండీ, ఈరోజు ఏమిటో గుర్తువుందా?" అని అడిగింది కామేశ్వరి భర్త కృష్ణమూర్తిని.
"ఇంట్లో ఉన్నానంటే ఆదివారం అనేగా, ఏదో ఒకటి అడిగి విసిగించాలని కాకపోతే!" అన్నాడు.
"నా ఖర్మ! ప్రతి సంవత్సరం గుర్తుచేయాల్సిందే, సిగ్గుతో చస్తున్నాను, ఈ రోజు మన పెళ్లిరోజు" అంది.
"అరే, గుర్తుకు రాలేదు, ఈరోజు ఉదయం నుంచి ఇంత ప్రశాంతంగా ఉన్నావేమిటా అనుకున్నాను! పెళ్లిరోజా? సరే, ఉడిపి హోటల్‌లో భోజనం చేద్దాం, నువ్వు ఇంట్లో వండకు"
అన్నాడు కృష్ణమూర్తి.
"నేను ఆ ఉడిపి హోటల్‌కి రాను. ఈ ఒక్కసారి నా మాట వినండి, ఎలాగో నా జీవితంలో యాత్రలు చేసి పుణ్యం సంపాదించుకునే యోగ్యత లేదు. ఇంకో మూడు ఏళ్లలో మీ రిటైర్మెంట్, అంటే ముసలితనం వచ్చినట్టే! అందుకే ఈ ఏడాది పెళ్లిరోజు సందర్భంగా మనం మానస సరోవరం యాత్రకి వెళ్దామండీ" అంది.
"మా ఆఫీసులో ఒక ఇంజనీర్ మానస సరోవరానికి వెళ్లి శివుడిని కళ్లారా చూశాను అన్నాడు. అప్పుడే అనిపించింది, వెళ్తే అటువంటి యాత్ర ఒక్కటి చేస్తే జన్మ ధన్యం అయిపోతుందని. అసలు ఆ యాత్రకి ఎలా వెళ్లాలో ఏమిటో ముందు తెలుసుకోవాలి" అన్నాడు.
"అబ్బాయికి చెప్పాను, 'ముందు మీరు ఢిల్లీ వచ్చేయండి, నాకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు, అన్నీ అతనే చూసుకుంటాడు' అని అన్నాడు. ముందు ఆఫీసుకి రెండు నెలలు సెలవు పెట్టండి, అబ్బాయి దగ్గరికి వెళ్దాం" అంది కామేశ్వరి.
మొత్తానికి ఢిల్లీ విమానాశ్రయంలో దిగి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. వెనుక నుంచి "హాయ్ అత్తయ్యగారు" అంటూ కోడలు అర్చన వచ్చి మామగారి చేతిలో ఉన్న ట్రోలీ బ్యాగ్ తీసుకుంది.
"వాడు రాలేదా?" అని అడిగాడు కొడుకు కోసం చూస్తూ. "లేదు మామయ్యగారు, అర్జెంటు మీటింగ్ ఉంది, 'నువ్వు వెళ్లి ఎయిర్‌పోర్ట్‌కి మా నాన్నా వాళ్ళని తీసుకుని రా' అని చెప్పారు."
"ఎప్పుడు అంతే అత్తయ్యగారు, రవి అందరిని రమ్మనడం, టైమ్‌కి మీటింగ్ ఉంది నువ్వు వెళ్లి రిసీవ్ చేసుకో అనడం" అంది.
సరిగ్గా తెలుగు రాకపోవడం వల్ల తను ఏమందో అర్థం తెలియదు అర్చనకి. అయితే అర్థం అయిన కృష్ణమూర్తికి మనసు చివుక్కుమంది.
ఇంటికి చేరిన తరువాత కోడలే మొత్తం బ్యాగ్స్ అన్నీ లిఫ్ట్ లో పైకి తీసుకునివచ్చి మామగారి కోసం కేటాయించిన గదిలో పెట్టి, "త్వరగా డ్రెస్ మార్చుకుని రండి, బాగా లేట్ అయ్యింది మీకు భోజనానికి" అంది కోడలు.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని "ఏం వండావు అమ్మాయి?" అన్నాడు.
"మీకు ఇష్టం అని దోసకాయ పప్పు, వంకాయ ఉల్లికారం, కొబ్బరి పచ్చడి మామయ్యా" అంది.
కోడలు వంట తమ వంటలా ఉంటుంది అనుకుంటూ తృప్తిగా భోజనం చేశారు కృష్ణమూర్తి దంపతులు.
"కాసేపు తాతయ్యా, బామ్మ రెస్ట్ తీసుకుంటారు, నువ్వు టీవీ సౌండ్ లేకుండా చూసుకో"
అంది కొడుకు చంటితో. "సౌండ్ లేకుండా టీవీ చూడటం ఎందుకమ్మా?" అంటూ టీవీ కట్టేసి కృష్ణమూర్తి పక్కన చేరాడు. "ఒరేయ్ చంటి, కథ చెప్పనా?" అన్నాడు. "వద్దు తాతయ్యా, ఎప్పుడు ఒకే కథ బోర్ కొడుతోంది" అన్నాడు. "అయితే నీకు తెలిసిన కథ చెప్పు, వింటాను" అన్నాడు. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు, మెలుకువ వచ్చేసరికి కొడుకు మాటలు వినిపించి మెల్లగా లేచి హాలులోకి వచ్చాడు.
"బాగా నిద్రపట్టిందా డాడీ? అమ్మ అంటోంది మీరు తనని విసిగిస్తున్నారని, కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి, విసుగంటే ఏమిటో మీ మనవడు చూపిస్తాడు" అన్నాడు రవి. "అంటే అప్పుడే నా మీద చాడీలు చెప్పేసిందా మీ అమ్మ? నాకు ఇప్పటినుంచే దిగులు పట్టుకుంది, రేపు రిటైర్ అయిన తరువాత మీ అమ్మ సాధింపులు తలుచుకుంటే..." అన్నాడు.
"మామయ్యగారు, నేను అత్తయ్యగారి వైపు, అత్తయ్యగారు నేను నోరు ఎత్తకుండా మీకు మీ అబ్బాయికి ఎదురుచెప్పకుండా ఉంటున్నాము. మీ అబ్బాయి కూడా ప్రతిదానికి విసుగు..." అంది అర్చన.
"అమ్మా, మీతోపాటు యాత్రకి మీ కోడలుని కూడా తీసుకుని వెళ్లండి, కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటాము" అన్నాడు రవి భార్య అర్చన వంక చూసి "నువ్వు కూడా వెళ్ళు" అంటూ.
"తప్పురా, యాత్రకి దంపతులిద్దరు కలిసి వెళ్ళాలి, ఒక్కళ్ళే వెళ్ళకూడదు" అంది తల్లి కామేశ్వరి.
వారం రోజులలో రవి తల్లిదండ్రుల మానస సరోవర్ యాత్రకి అన్నీ సిద్ధం చేసి, తన అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు తండ్రికి ఇచ్చి "ఖర్చుకి ఆలోచించకండి, సుఖంగా వెళ్లి రండి" అని నేపాల్ విమానం ఎక్కించాడు.
"ఏమిటో అమ్మకి యాత్రల పిచ్చి, తను వెళ్దాం అనుకుంటే భార్య పిల్లాడిని వదిలి వెళ్ళాలి, సెలవు కూడా ఇబ్బంది, అమ్మకి ధైర్యం నాన్న గురించే, తన భయం ఈ మధ్య షుగర్ హెచ్చు తగ్గులు అవుతోంది" అనుకుంటూ భారంగా ఇంటికి చేరాడు.
"అబ్బాయి, ఈరోజు టిబెట్ లో వీసా ఆఫీసుకి వెళ్తున్నాము, వీసా రాగానే మళ్ళీ మాట్లాడుతాను" అని ఫోన్ చేశాడు కృష్ణమూర్తి. "ఇప్పటి వరకు ప్రయాణం ఎలా ఉంది నాన్నా?" అని అడిగిన కొడుకుతో "బాగానే ఉంది, నాకే ఎందుకో కొద్దిగా నీరసంగా ఉంది, అయితే నువ్వు ఇచ్చిన జ్యూస్ ప్యాకెట్ త్రాగిన తరువాత బాగానే ఉందిలే" అన్నాడు.
అదే తండ్రి నుంచి వచ్చిన ఆఖరి ఫోన్! టీవీలో చూస్తే యాత్రికులు వరదలో కొట్టుకుపోయారు అని, ఎంత మంది చనిపోయారో చెప్పలేము అని న్యూస్ చూసిన రవికి గుండెల్లో దడ మొదలైంది. "నాన్న ఫోన్ చేయలేదు అంటే..." ఆ పైన ఆలోచించడానికి కూడా మనసు ఒప్పుకోలేదు.
భార్య అర్చనకి టీవీలో వచ్చిన న్యూస్ గురించి చెప్పి "అమ్మా నాన్న ఈ ప్రమాదంలో చిక్కుకోలేదు కదా?" అన్నాడు. "అయ్యో అత్తయ్యగారు ఫోన్ కూడా ఇక్కడే వదిలేసారు. మామయ్యగారికి యింకోసారి ఫోన్ చేయండి. వాళ్ళకి ఏమీ కాదు మామయ్యగారు నాతో చాలాసార్లు చెప్పారు, ఆయన తల్లిదండ్రులు తన వెంట ఉండి మన అందరిని కాపాడుతున్నారు" అంది అర్చన.
"అలా అయితే మరి నాన్నా ఎందుకు ఫోన్ చేయలేదు? మనం కంగారు పడతామని తెలుసుకదా! ఏమో నాకు భయంగా ఉంది" అంటూ టీవీలో చూపించిన ఇన్ఫర్మేషన్ బోర్డు వాళ్ళకి ఫోన్ చేశాడు.
"ఇప్పుడే ఏమి చెప్పలేం, వీసా ఆఫీస్ మొత్తం వరదలో కొట్టుకుపోయింది. అది ముందే దాటి వెళ్లిన వాళ్ళు ఎవ్వరో తెలియటం లేదు. మీ పేరెంట్స్ వివరాలు ఇవ్వండి, తెలిస్తే ఫోన్ చేసి చెప్తాము" అని పెట్టేసారు.
"వీసా ఆఫీస్ మొత్తం కొట్టుకుపోయింది అంటే, ఆరోజు నాన్న 'మేము వీసా కోసం వెళ్తున్నాము' అన్నారు అంటే... బాబోయ్ కొంపములిగింది! వద్దంటే యాత్ర పెట్టుకున్నారు, ఇప్పుడు ఎలా?" అని ఏడుపు మొదలుపెట్టాడు. భర్తని ఎలా ఓదార్చాలో అర్థం కాక పక్కనే కూర్చొని చూస్తోంది అర్చన.
"ఎందుకమ్మా నాన్న ఏడుస్తున్నాడు? తాతయ్య ఊరు నుంచి వస్తాడుగా, ఏడవకు నాన్న" అంటున్న కొడుకు వంక చూసి కళ్ళు తుడుచుకుని "అవును చంటి, తాతయ్యా బామ్మా వస్తారు, అప్పుడు మనం తిరుపతి వెళ్దాం" అన్నాడు.
రవి వాళ్ళ పెద్దనాన్న ఫోన్ చేసి "నాలుగు రోజులు అయిపోయింది, చాలా మంది కొట్టుపోయారుట, ఇహ మనమే ఏదో ఒకటి చేయాలి, నువ్వు హైదరాబాద్ వస్తే మంచి శాస్త్రి గారితో తరువాత కార్యక్రమం చేయిద్దాం" అన్నాడు. "పెద్దనాన్న, అసలు ఏ విషయం తెలియకుండా అటువంటి కార్యక్రమం చేయించడం నాకు ఇష్టం లేదు. నాకు అమ్మా నాన్న తిరిగి వస్తారని నమ్మకం ఉంది" అన్నాడు రవి. ఆరోజంతా చుట్టాల నుంచి ఫోనులు, "అర్చనా, నేను కాసేపు కళ్ళుమూసుకొని పడుకుంటాను, ఏ ఫోన్ వచ్చినా నన్ను లేపకు" అంటూ పడకగదిలోకి వెళ్లిపోయాడు.
రోజుకి ఒక్కసారి అయినా నాన్న మాట వినకపోతే ఏదోలా అనిపించే తను ఇంత విపత్తుని ఎలా తట్టుకుని ఉన్నాను అనుకుంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తో ఉండగా మళ్ళీ ఫోన్ చప్పుడు! ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఫోన్లు చేయడం, అంత అభిమానం ఉంటే రావచ్చుగా అనుకుని ఫోన్ తీయలేదు.
ఫోన్ రింగ్ అవుతోంది, కట్ అవుతోంది, రింగ్ అవుతోంది. లాభం లేదు అనుకుని ఫోన్ తీసుకుని "ఇంకా ఏ విషయం తెలియదండి" అన్నాడు. "తెలియకపోవడం ఏమిటి రా, నేను డాడీని!" అన్న తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది. "ఎక్కడ ఉన్నారు? ఫోన్ కూడా చేయాలని తెలియదా? టీవీలో యాత్రికులు కొట్టుకుపోయారు అని చూసి గుండెల్లో ఒక్కటే దడ, ఇంతకి ఎక్కడ ఉన్నారు? అమ్మ ఎలా ఉంది?" అన్నాడు రవి.
"బాగానే ఉన్నాము. టిబెట్ లో వీసా ఆఫీసుకి లైన్లో నుంచున్నాము. అమ్మ కుంటుంటే, నేను గోడ పట్టుకుని నడవటం చూసి మమ్మల్ని ముందుకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. టూరిస్ట్ వాడు మమ్మల్ని వేరే క్యాబ్ ఎక్కించి ఊరికి దూరంగా వాడికి తెలిసిన హోటల్ కి పంపించాడు. ఆ సాయంత్రం ప్రమాదం గురించి తెలిసింది" అన్నాడు.
"ఆ విషయం ఫోన్ చేసి మాకు చెప్పాలి కదా! ఇక్కడ మీరు ఏమయ్యారో తెలియక, మీ ఫోన్ సిగ్నల్ అందక భయపడి వణికిపోతున్నాను" అన్నాడు కొడుకు.
"ఫోన్ ఉంటేగా మాట్లాడటానికి! ఫోన్ కవర్లో నువ్వు ఇచ్చిన క్రెడిట్ కార్డు పెట్టుకున్నాను. అక్కడ ఏదో బ్రిడ్జి మీద నుంచి నది చూస్తూఉండగా ఫోన్ నదిలో పడిపోయింది. నీకు ఫోన్ చేసి 'బాగానే ఉన్నాము, మమ్మల్ని యాత్రకి పర్మిట్ చేయకపోవడంతో వెళ్ళలేదు' అని చెప్పాలి అని హోటల్ అతని ఫోన్ లో ట్రై చేస్తే లైన్స్ అన్నీ జామ్ అయిపోయాయి" అన్నాడు. "చేతిలో ఉన్న డబ్బులు ఢిల్లీ రావడానికి సరిపోవు."
"ఇంతలో మమ్మల్ని తీసుకొని వెళ్లిన టూర్ ఏజెంట్ ఒక్కడే తిరిగివచ్చాడు. అతనితో పాటు వెళ్లిన యాత్రికుల జాడ తెలియలేదు. అతని భార్య కూడా కొట్టుకుపోయింది, తను చివరలో ఉండటంతో మిల్టరీ వాళ్ళు కాపాడారు" అని తన ఫోన్ ఇచ్చి "మీ వాళ్ళతో మాట్లాడుకోండి" అన్నాడు. "అసలు విషయం ఈ ఫోన్ కి ఇరవై వేలు గూగుల్ పే చెయ్యి, ఆ ఏజెంట్ దగ్గర కూడా డబ్బు లేదు, ముగ్గురం కలిసి ఢిల్లీ వస్తాము" అన్నాడు కృష్ణమూర్తి.
"ఇప్పుడే పంపుతాను, వెంటనే బయలుదేరి వచ్చేయండి, పెద్ద గండం తప్పింది" అన్నాడు తండ్రితో.
"అంతా మన మంచికే రా అబ్బాయి! ముందు వాళ్ళు యాత్రకి పర్మిషన్ ఇవ్వకపోతే చాలా కోపం వచ్చింది శివుడి మీద కూడా... ఇప్పుడు తెలిసింది, శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ అయినా కుట్టదు అని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఢిల్లీ వచ్చేస్తాము" అని పెట్టేసాడు.
తల్లిదండ్రులు బాగానే ఉన్నారు అని తెలిసిన తరువాత రవికి చెప్పలేని అనుభూతి కలిగింది. ఫోన్ తీసుకుని తండ్రి అన్నదమ్ములకి ఫోన్ చేసి "నాన్నా అమ్మా క్షేమంగా ఉన్నారు" అని చెప్పి, "అర్చనా అన్నం పెట్టు, ఏమిటో పిచ్చ ఆకలిగా ఉంది" అన్నాడు.
ఆరోజు ఉదయం ఎయిర్‌పోర్ట్‌కి కుటుంబంతో సహా వెళ్లి తల్లిదండ్రులని రిసీవ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి "నీకు మా మీద ఇంత ప్రేమ ఎక్కడిది రా? ఫోన్ చేసినప్పుడు విసుక్కునే వాడివి" అన్నాడు నవ్వుతూ కృష్ణమూర్తి.
"చిరాకు రాదా నాన్నా? నేను ఆఫీసుకి వెళ్లే టైములో ఫోన్ చేసి 'టీవీలో కొన్ని చానెల్స్ రావడం లేదే' లాంటి ప్రశ్నలు అడిగితే! మీరంటే కోపం ఎందుకుంటుంది?" అన్నాడు.
"హమ్మయ్య, బామ్మ వచ్చేసింది, నాకు టొమాటో పచ్చడి చేసి అన్నం తినిపిస్తుంది" అని అంటున్న చంటి మాటలకు నవ్వేశారు.
ఏది జరిగినా మన మంచికే అనుకోవడమే మనిషి పని.
శుభం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















Comments