గత స్మృతులు
- Srinivasarao Jeedigunta

- 3 hours ago
- 10 min read
గత స్మృతులు, తెలుగు ఆత్మకథ, బాల్య జ్ఞాపకాలు, బామ్మ జ్ఞాపకాలు, గుడివాడ కథలు, పాతకాలపు జీవితం, తెలుగు సాహిత్యం, జె సీతారామా రావు

Gatha Smruthulu - Telugu Family Memories Story | Jeedigunta Seetharama Rao
గత స్మృతులు - తెలుగు కుటుంబ జ్ఞాపకాల కథ | జీడిగుంట సీతారామా రావు
Published In manatelugukathalu.com On 13/07/2026
కాలం ఎంత మారిపోయినా కొన్ని జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. బామ్మ ప్రేమ, చిన్ననాటి అల్లరులు, పల్లెటూరి జీవనం, కుటుంబ అనుబంధాలు, పాఠశాల రోజుల మధుర క్షణాలు, తల్లిదండ్రుల విలువలు—ఇవన్నీ కలగలిపిన ఆత్మీయ రచనే "గత స్మృతులు". జె. సీతారామా రావు గారు తన చిన్ననాటి అనుభవాలను ఎంతో సహజంగా, భావోద్వేగంతో ఆవిష్కరించిన ఈ ఆత్మకథ పాఠకులను వారి బాల్యంలోకి తీసుకెళ్తుంది.
పెద్ద బామ్మ ! అటూ ఇటూగా ఐదడుగుల పల్చటి విగ్రహం, తెల్లని వెండి తీగల్లాంటి నూనె రాసిన జుట్టు, వెనక చిన్న ముడి. పచ్చని చాయ, ముడతలు పడ్డ మొహం, ఏక రంగు సన్నంచు కచ్చా పోసి కట్టుకున్న చీర, తెల్లరంగు జాకెట్టు, ఊదా రంగు ఫ్రేం తో బై ఫోకల్ కళ్ళ జోడు, ఇదీ ఇన్నాళ్ళ తర్వాత ఆవిడ గురించి ఆలోచిస్తే గుర్తొచ్చే రూపం. రోజులో చాలా సార్లు వేళ్ళతో జుట్టు సరి చేసుకుని వదులైన ముడిని చుట్టుకుంటూ కనిపించేది.
ఆవిడ పేరు పారేపల్లి సత్తెమ్మ గారు. భర్త పారేపల్లి జగన్నాథం గారు వున్న అస్తినంతా తన జీవితకాలం లోనే అనుభవించేసి వెళ్లిపోవడంతో పాపం పిల్లలు కూడా లేని పెద్ద బామ్మకి బతకడానికి ఏ ఆధారం లేకుండా పోయింది ఒక్క మా బామ్మ తప్ప.
ఇంక బామ్మ విషయానికొస్తే ఆవిడ అచ్చు పెద్ద బామ్మ లాగానే వుండేది కానీ రంగు కాస్త నలుపు. పేరు సూరమ్మ గారు. జాకెట్టు వేసుకునేది కాదు. కచ్చా పోసి కట్టుకున్న చీర కొంగును చుట్టూ తిప్పి బొడ్లో దోపుకునేది. కుడికన్ను పూర్తిగా లొట్ట పోయి రెండో కన్ను మామూలుగా వుండేది. అయితే చూపు ఏ మాత్రం ఆనేది కాదు పాపం. ఆవిడ పెళ్ళైన కొత్తలో కళ్ళకి ఏదో చిన్న సమస్య వస్తే ఎవరి సలహా మీదో వేడి పిండి కట్టు వేసేసరికి రెండు కళ్ళు దెబ్బతిన్నాయని చెప్పేవాళ్ళు ఇంట్లో.
ఆవిడకి ఇద్దరు కొడుకులు. మా నాన్న పెద్ద కొడుకు. చిన్నాన్న ఒరిస్సాలో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తూ ట్రాన్స్ఫర్ ల మీద అన్ని వూళ్లు తిరుగుతూ వుండేవాడు. బామ్మ కొన్నాళ్ళు గుడివాడలో మాదగ్గర, కొన్నాళ్ళు వెళ్లి చిన్నాన్న దగ్గర వుండేది.
బామ్మ గుడివాడలో వున్నప్పుడు పెద్ద బామ్మ వచ్చి కొన్ని నెలలు గడిపేది. మిగతా రోజుల్లో ఏలూరులో వుండేది. చిన్నాన్న ఆవిడని తాతయ్య నించి వచ్చిన పెంకుటింట్లో తన పోర్షన్లో వుంచి నెలనెలా కొంత డబ్బు పంపుతూ వుండేవాడు. ఆ సమయంలో పనిలో పనిగా ఆవిడ ఏలూరులో చదువుకుంటున్న చిన్నాన్న గారి అబ్బాయి ఆనందుకి కేర్ టేకర్ గా వుండేది. గుడివాడలో వున్నప్పుడు ఆవిడ బాధ్యత పూర్తిగా మాదే, అంటే నాన్నది అన్నమాట.
బామ్మ మా పిల్లల పాలిట హెడ్మిస్ట్రెస్ లా ఉండేది. కళ్ళు కనిపించక పోయినా శబ్దభేది విద్య ఉపయోగించి చెయ్యి విసిరి మమ్మల్ని పట్టుకునేది. అప్పట్లో తలంట్లు పండగలొచ్చినప్పుడే వుండేవి. పిల్లలందరికీ తలంట్లు పొయ్యడం ఆవిడ డ్యూటీ. ఈ పని మీది, ఈ పని నాది అని పంపకాలు ఏమీ లేకపోయినా పనులు ఓ పద్దతిలో జరిగిపోతూ వుండేవి.
దొడ్లో ఇంటికి ఆనుకుని వున్న రేకుల షెడ్డు నీళ్ళగది లో ఓ మూలకి కట్టెల పొయ్యి మీద రాగి డేక్సా లో నీళ్ళు కాగుతూ వుండేవి. ఓ పక్కగా సిమెంట్ తొట్టిలో నీళ్ళు తోడి వుంచేది పని మనిషి పొద్దున్నే. బామ్మ ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుని ఒంటికి కొబ్బరి నూనె పట్టించి, ఏవేవో పిళ్లు కలిపి చేసిన నలుగు పిండితో ఒళ్లంతా కందిపోయేట్టు నలుగు పెట్టేసేది.
ఈ లోపు మాలో ఒకరం కుంకుడు కాయల్ని గుండ్రాయితో కొట్టి వాటితో కొన్ని మందారాకులు కలిపి పులుసు తయారుగా పెట్టే వాళ్ళం. కుంకుడు పులుసు తలమీద పోసి గట్టిగా రుద్దేసి తర్వాత అదే పులుసుతో ఒళ్లంతా తోమేసేది.
సరిగా కండ పట్టని ఒళ్లేమో, ఆవిడ చేతి వేళ్ళ ఎముకలు డొక్కల్లోనూ, గూడు ఎముకలికీ గుచ్చుకుని కొద్దిగా నొప్పి పెట్టినా కుయ్యో మొర్రో అని వంటింట్లో అమ్మ వినేట్టు అరిచే వాళ్ళం. అమ్మ బయటికొచ్చి బామ్మని తిట్టాలని అదో ప్రయత్నం అంతే.
తలంటు పూర్తయ్యే లోపు ఎంతో కొంత పులుసు కళ్ళలోకి పోయి, ఊరంతా వినిపించేలా గోలెత్తి పోయేవాళ్ళం. తల తుడుస్తూ నోట్లో వుప్పు కల్లు కాస్త వేసేది అమ్మ, కళ్ళ మంట, ఎరుపు తగ్గుతాయని. కొద్ది సేపట్లోనే ఆటల్లో పడిపోయి మామూలు అయిపోయేవాళ్ళం.
బామ్మ నెలకోసారి అమ్మకి గుర్తు చేసి మరీ పిల్లలందరికీ ఆవదాలు పట్టించే ఏర్పాటు చేసేది. చేతిలో కొద్దిగా చింత పండు పెట్టి సగం గ్లాసు వేడి కాఫీలో ఆవదం కలిపి చేతికిచ్చి తాగమనేవారు. మొహం ఆవదం తాగే ముందులా పెట్టి గ్లాసులో ద్రవాన్ని గటగటా తాగేసి చింతపండు నోట్లో వేసుకుని హిట్ బారిన పడిన బొద్దింకలాగా అల్లాడి పోయేవాళ్ళం కొంత సేపు.
ఆవదం వాసనతో తేనుపులు. పొత్తి కడుపులో నులి నెప్పులు. తర్వాత ఓ రెండు గంటలు పాటు పాకీ దొడ్డికి రాక పోకలు. వేడి చారు పోసి అన్నం. పొట్ట ఖాళీగా ఉండేదేమో అదే మహా రుచిగా వుండేది. రాత్రికి కారప్పొడితో బాగా నెయ్యి వేసి వేడి వేడి అన్నం. తాగటానికి వేన్నీళ్లు. అప్పత్యం చేస్తే వాతం చేసి కాళ్ళు, చేతులూ పడిపోతాయని భయపెట్టే వాళ్ళు.
బామ్మ కాళ్ళకి లైట్ గా పైలేరియా వుండేది. పాదాలు కొద్దిగా వాచినట్టు వుండేవి. అందువల్ల ఆవిడకి అప్పుడప్పుడు చలి జ్వరంలా వచ్చేది. బీపీ కూడా వుండేది. దానికి ఆవిడ రోజూ బెరిన్ అనే మాత్రలు వేసుకునేది. అంతకు మించి ఆవిడకి డబ్బై ఏళ్ల వయసులో ఏ ఆరోగ్య సమస్యలూ ఉండేవి కావు.
ఆహారం విషయంలో జాగ్రత్తగా వుండేది. మొదటి అన్నంలో పాత ఉసిరికాయ పచ్చడి వుండాల్సిందే. అన్నం బాగా పిసికి తినేది. కలుపుకునేప్పుడు చారు అన్నం ఆవిడ చేతి వేళ్ళ సందుల్లోంచి దూసుకొచ్చి పక్కన అన్నం తింటున్న మా కంచాల్లో పడేది. ఆవిడకి కనిపించదు కాబట్టి మేము బాబోయ్ అని అరిచినా ' భడవ కానల్లారా, ఎక్కడ పడిందీ, లేందే !" అనేది.
ఆవిడ రోజూ పెద్ద బాదం కాయ ఆకారంలో వున్న కంచంలో అన్నం తినేది.
బామ్మ ప్రయాణాలకీ, ముఖ్యమైన వస్తువులు దాచుకోవడానికీ ఓ రంగు వెయ్యని మీడియం సైజు ఇనప ట్రంక్ పెట్టె వుండేది. దాన్లో వుండే మొత్తం వస్తువుల జాబితా తెలీదు కానీ ఒక్కటి మాత్రం నన్ను బాగా ఆకర్షించేది. అది ఒక చిన్న గుండ్రటి రేకు డబ్బా. దాన్లో కొద్దిగా అక్షింతలు, పసుపు కుంకుమతో పాటు దొంతరగా పైసా నుంచి పావలా దాకా నాణేలు వుండేవి. బామ్మ దేవుడి ముడుపు డిబ్బీ అన్నమాట అది.
నిండాక ఏం చేద్దామని ఆవిడ ఉద్దేశ్యమో కానీ ఆ డిబ్బీ ఎప్పటికీ నిండేది కాదు. నువ్వుజీడి, న్యూట్రిన్ ఆరెంజ్ చాక్లెట్, గుప్పెడు బఠాణీలు, కొబ్బరి లౌజు ఏది కొనుక్కు తినాలనిపించినా కోర్కెలు తీర్చే కల్పతరువులా ఉండేది ఆ డిబ్బి. బామ్మకి అస్సలు అనుమానం రాకుండా జరిగిపోయేది పని.
ముడుపు డిబ్బి లోంచి డబ్బు తీస్తే దేవుడికి కోపం వస్తుందేమో అనే భయం వుండేది కాదు. పిల్లలికి బిళ్ళలు కొనుక్కోమని డబ్బులు ఇవ్వడం దేవుడికి కూడా సరదానేమో మరి, ఏ శిక్షలూ పడేవి కావు.
నాన్న తరచూ విజయవాడ వెళుతూ వుండేవాడు లైబ్రరీ కోసం పుస్తకాలు సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇవ్వడానికి. పిల్లలం పడుకున్నాక ఏ పదింటికో వచ్చేవాడు. వస్తూ మాకోసం తింటానికి ఏవో ఒకటి రెండు రకాల, పంచదార అద్దిన రంగు రంగుల జెల్లీ క్యూబులు, నిమ్మ తొనలు లాంటివి తెచ్చి ఆ ప్యాకెట్లు " ఊ.." అంటూ గదిలో ఓ పక్కగా కిందే కూర్చుని కొడుకు రాక కోసం చూస్తున్న బామ్మ మీద నెమ్మదిగా విసిరేవాడు.
ఆవిడ వెంటనే వాటిని తన ట్రంక్ పెట్టిలో పెట్టి మధ్యలో ఉన్న చిన్న గొళ్ళేనికి తాళం వేసేది. తాళం చెవి చీర కొంగుకి ముడి వేసేది. పొద్దున్న లేచిన మాకు ఎవరూ చెప్పకుండానే నాన్న మాకోసం ఏవో తెచ్చి బామ్మకిచ్చాడనీ, అవి ఆవిడ ట్రంక్ పెట్టెలో వున్నాయనీ తెలిసి పోయేది.
ఎందుకంటే నాన్న వూరెళ్ళాడంటే ఆ రాత్రి మా కోసం తింటానికి ఏవో వస్తున్నట్టే. ఆ తెచ్చినవేవో ఖాళీ అయ్యేదాకా బామ్మ చుట్టుపక్కలే తిరిగే వాళ్ళం.
"ఏమిటీ ఒక్కసారిగా ఇంత బుద్ధిమంతులైపోయారు వీళ్ళు !" అనుకునేది ఆవిడ.
"అనుకో అయిపోతుంది లే "
"ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో వున్న వ్యక్తిత్వవికాస సంభాషణలోని వాక్యం ఇది. ఈ సూత్రాన్ని బామ్మ అరవై ఏళ్ల క్రితమే ఆచరించి చూపించింది. పెద్దన్నయ్యకి పియుసి తర్వాత ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ విశాఖపట్నంలో వచ్చినప్పుడు నాన్న అన్నయ్యని పంపటానికి ఎందుకో విముఖంగా వున్నాడుట.
అమ్మకి బయటి విషయాల్లో పెద్దగా నిర్ణయాధికారాలు వుండేవి కావు. బామ్మ నాన్నతో పోట్లాడి అన్నయ్యని తీసుకుని విశాఖపట్నంలో వున్న తన మరిది కొడుకు, గోపాలం చిన్నాన్న ఇంటికి వెళ్ళి ఆయన సహాయంతో ఇంజనీరింగ్ లో చేర్పించిందిట. బామ్మ సంకల్పం ముందు ఆవిడ అంధత్వం కుంటిదైపోయింది.
పెద్దన్నయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాడు.
ఉన్నట్టుండి చిన్నాన్న దగ్గరికి వెళతానని పట్టు పట్టేది బామ్మ. ఆ విషయం మీద బామ్మకీ నాన్నకి మధ్య మాటల యుద్ధం జరిగేది. నాన్నకి బామ్మని అంతదూరం ఒరిస్సా దాకా పంపడం ఇష్టం వుండేది కాదు. వాళ్ళ మధ్య గొడవకి ప్రేమే పునాది అయినా అది వాళ్ళ మాటల్లో అడుగునపడిపోయి చూసేవాళ్ళకి పోట్లాటలా కనిపించేది. చివరికి బామ్మే గెలిచేది.
నాన్న పేరు రాఘవేంద్ర రావు. జీడిగుంట కుటుంబం ఎప్పుడో పాత కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గరలోని జీడిగుంట గ్రామంలో వుండేవారుట. తర్వాతి కాలంలో ఆ పక్కనే వున్న కానూరు అగ్రహారంకి, ఆ తర్వాత తాతయ్య అన్నదమ్ముల చదువులు, ఉద్యోగాల నిమిత్తం ఏలూరు వచ్చి స్థిరపడ్డారు.
తాతయ్య జీడిగుంట శ్రీరామ్మూర్తి గారు ఏలూరు పవర్ పేట దగ్గర్లో ఒక పెంకుటిల్లు కొన్నారు.
నాన్న కొన్నాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసి తర్వాత ఆ ఉద్యోగం మానేసి విశాఖపట్నం వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా కోర్స్ చేసి దాన్లో గోల్డ్ మెడల్ సాధించడంతో వెంటనే కృష్ణాజిల్లా గుడివాడలో కొత్తగా పెట్టిన కాలేజీలో లైబ్రేరియన్ గా ఉద్యోగం వచ్చింది.
కాలేజి వున్నదే ఓ మధ్యరకం బిల్డింగ్ లో. దాన్లో లైబ్రరీ ఓ చిన్న గది. దాన్లో కొన్ని ర్యాకుల్లో కొద్ది సంఖ్యలో పుస్తకాలు. ప్రభుత్వ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వదులుకుని, కుటుంబం నుంచి దూరంగా వెళ్లి చదువు కొనసాగించి, వేరే జిల్లాలో ఓ కొత్త కాలేజీలో చిన్న లైబ్రరీకి అధిపతిగా చేరడం అంటే ఆయనకి అవినీతి, అక్రమ సంపాదన పట్ల వున్న విముఖత, చదువు, సాహిత్యం పట్ల వున్న మక్కువ అర్థం చేసుకోవచ్చు.
కాలేజ్ బేతవోలు దగ్గరలోని భూషనగుళ్ళ అనే గ్రామ శివారులో గుడివాడ నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు పక్కన ఒక ఫర్లాంగు పొడవు వుండి ఓ వైపు ఆడిటోరియం, రెండో వైపు జిమ్నాజియం తో వున్న బిల్డింగుల్లోకి మారింది. ఆ కాలేజిలో సీట్ రావడమంటే చాలా గొప్ప ఆ ప్రాంతంలో.
లైబ్రరీ మొదట ఆడిటోరియం లోని ఒక చిన్న గదిలో వుండేది. త్వరలోనే నాన్న ప్రోద్బలంతో కాలేజీకి పెద్ద లైబ్రరీ బిల్డింగ్ నిర్మించడానికి నిర్ణయం జరిగింది.
నాన్న ఆధ్వర్యంలో, కాలేజీని ఓ పొడవాటి కారిడార్ తో కలుపుతూ వెనక వైపు క్రమ షట్బుజి ఆకారంలో మూడు అంతస్తుల పెద్ద భవనం పూర్తిగా లైబ్రరీ కోసమే తయారైంది. గుoడ్రంగా ఉన్న ఆ బిల్డింగ్ కి ఇంద్రుడికి కళ్ళు లాగా అన్నీ కిటికీలే, చదువుకి వెలుతురు ముఖ్యం అని సూచిస్తూ.
గుండ్రటి క్రింది అంతస్తులో నారింజ తొనల్లా పెద్ద పెద్ద ర్యాకులు, వాటి నిండా తొనల్లో ముత్యాల్లా సబ్జెక్ట్ వారీ పుస్తకాలు, ఆ వైభవం చూడాల్సిందే గానీ చెప్పటం కష్టం. క్రింది అంతస్తులో ఒక వైపు నుంచి మధ్య అంతస్తుకు మెట్లు. రెండో వైపు నుంచి డైరెక్ట్ గా మూడో అంతస్తుకు మెట్లు. మధ్య అంతస్తు ఆడపిల్లలు, మూడో అంతస్తు మగ పిల్లలకి రీడింగ్ హాళ్లు.
ఇలా విడిగా రెండు స్టెయిర్ కేసులు నిర్మించడం బాగా ఖర్చుతో కూడుకున్న పని. అయినా ఆడపిల్లల క్షేమం కోసం అలాంటి నిర్ణయం తీసుకుంది నాన్న కాక ఇంకెవరూ అయివుండరు.
కాలేజీ కి కొంచెం దగ్గరగా గుడివాడ టౌన్ కి ఆనుకుని వున్న బేతవోలు అనే గ్రామంలో ఉండేది మా కుటుంబం. ఏడుగురు సంతానం. ఆరుగురు మగ పిల్లలు, ఆఖర్లో ఒక ఆడపిల్ల.
ఈ రోజుల్లో ఇంట్లో ఒక చిన్న పిల్లో పిల్లాడో వుంటే ఆ ఇంట్లో వుండే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. అటువంటిది ఏకంగా పద్దెనిమిదేళ్లు మొదలుకుని నెలల పిల్ల దాకా సంతానం వుంటే ఆ ఇంట్లో సందడి కి కొదవేముంటుంది. నాకు కొద్దిగా ఊహ తెలిసే ప్పటికి మేము బుర్రా సీతారామమ్మ గారని ఒకావిడ కి చెందిన పెంకుటింట్లో వుండే వాళ్ళం.
అప్పుడు నాకు నాలుగేళ్ల వయసు. ఆ ఇల్లు, పరిసరాలు లీలగా గుర్తున్నాయి. నాకు నాలుగేళ్లప్పుడు అమ్మకి ఆఖరి కానుపులో చెల్లాయి పుట్టింది. పురిటి నీళ్ళప్పుడు ఇంట్లోని పరుపులు, దుప్పట్లు, దిళ్లు వీధి వైపు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో మంచం వేసి దాని మీద ఎండలో వేసినట్టు లీలగా గుర్తుంది నాకు. చెల్లాయికి బామ్మ పేరు పెట్టాలని నాన్న ఆలోచన.
భూత భవిష్యత్ వర్తమాన ద్రష్ట అయిన నాన్నకి ఆడపిల్ల పేరు సూరమ్మ అని గానీ సూర్య తో మొదలయ్యే ఏ పేరు గానీ పెడితే అప్పటి నుంచి ఇరవై ఏళ్ల తర్వాత ఆ పేరుతో వచ్చే చిక్కులు తెలుసు. పైగా అప్పటికే సినిమాల్లో సూర్యకాంతం మాంచి గయ్యాళి గా పేరు తెచ్చుకుంది.
బాగా ఆలోచించి ' పద్మ ప్రియ' అని పేరు పెట్టాడు నాన్న. పద్మ ప్రియుడు సూర్యుడు కదా. బామ్మ సంతోషించిందో లేదో తెలీదు కానీ పద్మ ఇప్పటికీ తన పేరు సూరమ్మ కానందుకు సంతోషిస్తూనే వుంది.
మళ్ళీ నా విషయానికొస్తే అప్పటికి స్కూల్లో జేరలేదు కదా. రోజంతా ఏమిటో పిచ్చి ఆటలు. ఇంటి వరండా కి వున్న మెట్లలో ఆఖరి మెట్టు తర్వాత ఒక తిరగలి రాయి మట్టిలో సగం కప్పడిపోయి వుండేది. అది సగం బయటికి కనిపిస్తూ వుండటంతో దాన్ని నేను చందమామ అనుకునేవాడిని. మొత్తం చందమామ కోసం చిన్న కర్రపుల్లతో రోజూ అక్కడ కూర్చుని చిన్ని చేతుల్తో మట్టి తవ్వి తీస్తూ వుండేవాడిని.
ఆ రోజుల్లో నీళ్ల కోసం భూమిలోకి గొట్టాలు దింపి పైన ఆకు పచ్చ హ్యాండ్ పంప్ బిగించే వాళ్ళు. బోర్ వేసే ఇంజిన్ లు ఇప్పుడొచ్చాయి. అప్పుడు ముగ్గురు నలుగురు కలిసి గొట్టాలని ఓ పెద్ద సుత్తి తో బాది నేలలోకి దిగ గొట్టే వారు. అది చూసి నేను కూడా రాయితో కర్ర పుల్లని నేలలోకి కొట్టి నీళ్ళు వస్తాయని అలా ప్రయత్నం చేస్తూ వుండేవాడిని. చూసే పెద్ద వాళ్ళకి ఆ చిన్న బుర్రలో వున్న అలోచనేమిటో తెలీదు. వాళ్ళకి అది అల్లరి అంతే.
ఇప్పటి పిల్లలు ఊహించను కూడా లేని ఆటలు కొన్ని వుండేవి. అన్నం తింటానికి కూర్చునే పీటని వరండా గట్టు చివరకి తిరగేసి పెట్టి మీద కూర్చునే వాళ్ళం. దాని కింద సైకిల్ దో దేనిదో జెడ్ ఆకారంలో వున్న ఓ ఇనప రాడ్ ని పెట్టి తిప్పే వాడు ఇంకోడు. ఆ పీట ముందుకు జరుగుతూ పోతుంటే ఒకటే సంబరం.
అయిపోయిందా. ఇంటి ముందు వున్న రోడ్డు వారగా కొన్ని పెద్ద బాడిత చెట్లు ఎర్రని పూలు పూసి చూట్టానికి బలే వుండేవి. వాటి ఎండిన కాయల్లోంచి రాజ్మా లావుండే గింజని నాప రాయి మీద బాగా రుద్ది పక్కనే కూర్చుని ఏదో ధ్యాసలో వున్న ఇంకోడి తొడమీద పెట్టే వాళ్ళం. రాపిడి వల్ల వేడెక్కిన గింజ చుర్రు మనడంతో కెవ్వుమని దులుపుకుంటూ లేచే వాడు వాడు.
ఇలా అల్లరి, ఆటలతో రోజులు గడుస్తూ వున్నప్పుడు ఏం జరిగేదో, పెద్ద వాళ్ళు ఎప్పుడు ఆలోచించేవారో తెలీదు కానీ హఠాత్తుగా ఇల్లు మారే వాళ్లం. మళ్ళీ అక్కడ కాస్త వయసు పెరిగిన అల్లరి, ఆటలు.
సీతారామమ్మ గారి ఇంటి నుంచి కోట వారి ఇంటికి మారాం. ఈ సారి అది డాబా ఇల్లు. మూడు పోర్షన్ లలో మధ్య దాన్లో వుండే వాళ్ళం. ఇంటి వాళ్ళు వేరే వూళ్ళో వుండి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు వుంచుకున్న పోర్షన్ లో వుండే వాళ్ళు.
ఇంటికి ముందు ఒక వరండా, కిందికి రెండు మూడు మెట్లు ముందు కాస్త స్థలం ఆ తర్వాత రోడ్డు వుండేవి. ఇంటికి కొద్ది దూరంలో ఒక రావి చెట్టు ఉండేది. దాని మొదలుకుని శివాలయం దాకా కోటగూళ్లు అని పిలిచే చౌడు మైదానం పెద్ద పెద్ద గోతులతో వుండేది. కాస్త ముందుకి వెళితే ఆగ్రయ్య గారి మునిసిపల్ పార్క్ ఆ వెనక తామరాకులు, పూలుతో నిండిన చెరువు వుండేది.
దాన్లో పొద్దున్న పూట తాటి బోదెని తొలిచి ఓ వైపు మట్టిలాంటి పదార్థంతో మూసివేసి చేసిన చిన్న పడవల్లో పొడవాటి వాసంతో తెడ్డు వేస్తూ చెరువంతా తిరుగుతూ తామరాకులు కోసేవాళ్లు అక్కడక్కడ కనిపించేవారు.
అలా కోసిన తామరాకులు చివరికి వీధుల్లో తిరిగి ఇడ్లీలు అమ్మే వాళ్ళ దగ్గరికి చేరేవి. తామరాకు వాసన కలిసిన చెట్నీతో తింటుంటే వేడి లేని ఇడ్లీలు కూడా మహా రుచిగా వుండేవి.
ఇదయింది. చెరువుకి పక్కగా గుండ్రంగా తిరిగిన రోడ్డు మీద అవతలి వైపుకి వెళితే సాతాన్ల కొట్టు వుండేది. అక్కడ బిళ్ళలు, లోకల్ మేడ్ బిస్కట్లు తో పాటు పిల్లల్ని ఆకర్షించే ఆట వస్తువులు వాళ్ళు కొనగలిగే ధరల్లోనే దొరికేవి. వాటిల్లో కొన్ని, ఒక మెలికలు తిరిగిన తీగకి ఎనిమిది ఆకారంలో వున్న రేకు ముక్క గుచ్చి వుంటుంది.
ఎడమ చేత్తో తీగని పట్టుకుని కుడి చేతి వేళ్ళు రేకు కింద పెట్టి సర్రున పైకి లాగితే ఆ రేకు మెలికలు తిరుగుతూ తీగ పైకి వచ్చి హెలికాప్టర్ ఫ్యాన్ లా తిరుగుతూ గాల్లోకి ఎగురుతూ పోతుంది. అది ఒక అద్భుతంలా అనిపిస్తుంది.
ఇంకోటి ఓ అట్ట ముక్క మీద నిలువు గళ్లుగా కట్ చేసి కింది అట్టని అటూ ఇటూ జరిపేట్టు ఏర్పాటు వుంటుంది. పైన బొమ్మలు మార్చి మార్చి కనిపిస్తాయి. ఇలాంటి ఆట వస్తువులు చాలా వుండేవి అక్కడ.
కొద్ది రోజుల్లోనే నా చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకాస్త పెరిగి బేతవోలు మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్లో మొదటి క్లాసులో జేరాను. దానికి ముందు బాలశిక్ష చదివానో లేదో గుర్తు లేదు కానీ మొదటి క్లాస్ బుక్ లో మొదటి పేజీ లో ' హరిః ఓమ్ ' అని పెద్ద అక్షరాలతో వుండేది.
అప్పట్లో టీచర్స్ అంటే బలే భయం వుండేది. చదువు చెప్పటానికి పెద్దగా కష్టపడే వాళ్ళు కాదు కానీ హోం వర్క్ చేయక పోతే కొట్టడానికి రకరకాల కొత్త పద్దతులు ఉపయోగించే వారు. గోడ కుర్చీ వేయించడం, బెంచీ ఎక్కించడం, వీపు మీద గుద్దడం ఇవన్నీ కామన్.
క్లాసు లో కొద్దిగా చదువు అబ్బిన ఒకడిని లీడర్ గా పెట్టి వాడు చెప్పిన వాళ్ళని బెంచీ ఎక్కించడం చేసేవారు టీచర్స్ లేని సమయంలో. వాడు కూడా తనతో ఆడే వాళ్ళని కాక మిగతా వాళ్ళని ఏడిపించడానికి లీడర్ పదవిని బాగా ఉపయోగించే వాడు. అటువంటి లీడర్ ఒకడి చేతిలో పడి రోజు బెంచీ ఎక్కుతూ వుండే వాడిని.
ఇదంతా ఇంట్లో చెబితే ఇంకాస్త పడుతుందనే భయం తో రోజు ఏడుస్తూ స్కూల్ కి వెళ్లే వాడిని. ఆ బాధ తట్టుకోలేక మా నాలుగో అన్నయ్య రఘు కి చెబితే వాడు మర్నాడు స్కూల్ కి వచ్చి ఆ లీడర్ గాడిని ఏడిపించొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నా బెంచీ ఎక్కే బాధ తప్పింది. రఘు అప్పట్లో మా స్కూల్ పక్కనే వున్న మునిసిపల్ హైస్కూల్ లో ఆరో క్లాస్ చదువుతున్నాడు.
మా స్కూల్లో ప్రతి క్లాసు కి విడిగా గదులు ఉండేవి కావు. ఒక పెద్ద హాల్లో నాలుగు మూలలా నాలుగు క్లాసులు జరిగేవి. మా క్లాస్ ఒక మూల లో వుంటే ఆ పక్కనే మూడో క్లాస్ జరిగేది. అక్కడ టీచర్ పిల్లలికి టేబుల్స్ నేర్పుతూ 'రెండు ఒక్కట్ల రెండు, రెండు రెండుల నాలుగు ' అని గట్టిగా అరిపిస్తూ వుండే వారు.
మా క్లాస్ లో చదువు సాగుతున్నా నా ధ్యాసంతా ఆ టేబుల్స్ మీదే వుండేది. అలా వింటూ వింటూ మొదటి క్లాస్ లోనే నాకు పది దాకా టేబుల్స్ వచ్చేసాయి. అప్పట్లో మాకు ప్రతి శనివారం మధ్యాహ్నం హాఫ్ డే స్కూల్ ఉండేది. ఆ రోజు క్లాసులు ఏమీ జరగకుండా హాల్ లో అందరినీ కూర్చోబెట్టి పాటలు, పద్యాలు పాడించే వారు.
ఒక శనివారం హెడ్ మాస్టర్ గారు వచ్చి 'ఎవరికైనా టేబుల్స్ వస్తే లేచి చెప్పండి' అన్నారు. అందరూ గమ్మున వుంటే నేను లేచి పది దాకా టేబుల్స్ గటగటా చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి 'ఎన్నో క్లాసు?' అని అడిగారు. ' ఒకటో క్లాస్ ' అని చెప్పేసరికి మా టీచర్ ని పిలిచి నన్ను అభినందిస్తూ వీపు తట్టారు. నా జీవితంలో మొదటి విజయం అది. ఆ రోజు నుంచి స్కూల్ అంటే భయం పోయింది.
మా స్కూల్ కి దగ్గరలోనే మాలపల్లి అనే హరిజన వాడ ఉండేది. స్కూల్ అయిపోయాక సాయంత్రం మేము కొంతమంది పిల్లలం కలిసి ఆ వాడ లోకి వెళ్లి అక్కడ ఆడే ఆటలు చూస్తూ వుండే వాళ్ళం. అక్కడ ఇళ్లన్నీ తాటి ఆకులతో కప్పిన చిన్న చిన్న గుడిసెలు. ఇళ్ల ముందు పేడతో కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టే వారు.
అక్కడ పెద్ద వాళ్ళు సాయంత్రం వేళల మట్టి కొట్టుకుపోయిన బట్టలతో చిన్న కల్లు ముంతలు పట్టుకుని తాగుతూ, పాటలు పాడుతూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ వుండేవారు. అదంతా మాకు ఒక కొత్త ప్రపంచంలా అనిపించేది.
మా ఇంట్లో నాన్న కి చదువు, పుస్తకాలంటే ప్రాణం. కాలేజీ లైబ్రరీ కోసం వచ్చే ప్రతి కొత్త పుస్తకం మొదట మా ఇంటికే వచ్చేది. నాన్న ఆ పుస్తకాలన్నీ తిరగేసి, నోట్స్ రాసుకుని ఆ తర్వాతే లైబ్రరీ కి పంపే వాడు.
ఇంట్లో ఒక పెద్ద అల్మారా నిండా చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి పత్రికల పాత బైండ్ పుస్తకాలు ఉండేవి. మేము అన్నదమ్ములం అందరం పోటీ పడి ఆ పుస్తకాలు చదివే వాళ్ళం. నాన్న మమ్మల్ని ఎప్పుడూ చదవమని బలవంతం చేసే వాడు కాదు కానీ, మేము చదువుతుంటే చూసి సంతోషించే వాడు.
అమ్మ పేరు సీతామహాలక్ష్మి. పేరుకు తగ్గట్టే చాలా శాంత స్వభావురాలు. అంత పెద్ద సంసారాన్ని, ఏడుగురు పిల్లలని, బామ్మని, పెద్ద బామ్మని ఏ రోజూ విసుక్కోకుండా మేనేజ్ చేసేది.
పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీద వంట చేయడం, పిల్లలకి అన్నాలు పెట్టడం, బట్టలు ఉతకడం.. ఇలా రోజంతా ఆవిడ పనిలోనే గడిచిపోయేది. అయినా మొహంలో ఎప్పుడూ చిరునవ్వు పోయేది కాదు. నాన్న జీతం చాలా తక్కువ అయినా, ఇంట్లో ఏ లోటూ లేకుండా చూసేది అమ్మ.
ఇలా గుడివాడ లోని మా చిన్నతనం, ఆటలు, చదువు, బామ్మల అల్లరి, అమ్మ నాన్నల సంరక్షణ లో ఎంతో హాయిగా గడిచిపోయాయి. కాలం చక్రం లాంటిది. రోజులు గడిచే కొద్దీ పిల్లలందరం పెద్ద వాళ్ళం అయిపోయాం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం వూళ్లు వదిలి వెళ్ళిపోయాం. కానీ ఆనాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పచ్చగానే గుండెల్లో నిలిచి వుంటాయి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

















Comments