top of page
Original.png

కాగితం పువ్వు

2 hours ago
6 min read

“కాగితం పువ్వు కథలో భర్త రాసిన ఉత్తరాన్ని చదువుతూ విషాదంలో ఉన్న రాధిక”

Kagitham Puvvu - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao

కాగితం పువ్వు - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 27/09/2026


“కాగితం పువ్వు” శ్రీ శ్రీనివాసరావు జీడిగుంట రచించిన సామాజిక సందేశాత్మక కుటుంబ కథ. పేకాట వ్యసనం, ధూమపానం, ఆర్థిక నిర్లక్ష్యం వంటి చెడు అలవాట్లు ఒక మనిషి జీవితాన్నే కాకుండా అతని భార్యా పిల్లల భవిష్యత్తును కూడా ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలో గిరీశం కుటుంబం ద్వారా చూపించారు. చెడు అలవాట్లకు బానిస కావడం వల్ల వచ్చే పరిణామాల గురించి ఆలోచింపజేసే కథగా “కాగితం పువ్వు” పాఠకులకు బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తుంది.



"నోర్ముయ్! జీతం వచ్చిన రోజు ఆలస్యంగా రాకుండా ఇంటికి త్వరగా ఎలా వస్తాను? ఏదో కాస్త సరదాగా గడుపుదాం అని స్నేహితులతో పేకాడుతుంటే, ఇంటి దగ్గర నీ ఏడ్పుతో జీతం కాస్తా పోయింది. అందుకే అన్నారు 'ఇంటి ఇల్లాలు ఏడుపు మొగుడికి కలిసిరాదు' అని" అంటూ చొక్కా హ్యాంగర్‌కి తగిలించి వెళ్లి, డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నం, ఆవకాయ చూసి, "కూర లేదా?" అని అరిచాడు గిరిశం.


"కూర అనేది మానేసి పదిరోజులు అయ్యింది. క్రిందటి నెల సగం జీతం, ఇప్పుడు మొత్తం పోగొట్టుకున్నారు. పాలవాడికి అప్పు, కిరాణా వాడికి అప్పు. ఇంకా ఏ మొహం పెట్టుకుని కూర కూడా వండాలి?" అంది రాధిక.


"నువ్వు ఏడవకుండా ఉండు. వచ్చే నెల పేకాటలో మూడు నెలల జీతం గెలుచుకుంటాను" అన్నాడు.


"పెళ్లిచూపులలో మా బాబాయి మీ నాన్నని అడిగాడు—


'మాకు పిల్లాడు బుద్ధిమంతుడు, కుటుంబం పోషించుకోగలిగితే చాలు' అని. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది మీ మంచితనం. జూదం ఆడి బాగుపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే చెప్తున్నాను, ఈ నెలాఖరున మీ ఆఫీస్‌కి వచ్చి, మీ బాస్‌కి మీ విషయం చెప్పి, జీతం నేను తీసుకుంటాను, గుర్తుపెట్టుకోండి" అంది.


"మా ఆఫీసు ఎనిమిదో అంతస్థులో ఉంది. నువ్వు మా ఆఫీస్‌కి వస్తే అక్కడినుండి తోసేస్తాను, పీడ వదులుతుంది" అన్నాడు గిరిశం.


"అవును, ఇద్దరికీ" అంది.


రోజూ గిరిశం రాత్రి పది గంటలకు రావడం, ఉన్నది తిని పడుకోవడం, ఏదైనా అడిగితే భార్య మీద చెయ్యి చేసుకోవడం జరుగుతోంది.


"పెద్దాడిని స్కూల్‌లో చేర్పించాలి, రేపు ఆఫీస్‌కి సెలవు పెట్టి తీసుకుని వెళ్లి జాయిన్ చేసి రండి" అంది.


దానికి "నేను ఎందుకు? ఇంట్లో ఖాళీగా ఉంటావుగా, నువ్వు వెళ్లు" అన్నాడు.


"వెళ్తాను, తండ్రి ఎవ్వరు అంటే మీరుండాలిగా, అందుకే మిమ్మల్ని వెళ్లమనేది" అంది.


ఉదయం లేచిన తరువాత పెద్ద కొడుకుతో వినాయకుడికి దండం పెట్టించి భర్త గిరిశంతో పంపించింది. "మా అబ్బాయిని స్కూల్‌లో జాయిన్ చేసుకోవాలి" అని స్కూల్ గుమస్తాని అడిగాడు.


"బిల్డింగ్ ఫీజు ఇరవై వేలు కట్టండి" అంటూ అప్లికేషన్ ఫారం ఇచ్చాడు.


"బిల్డింగ్ ఉందిగా, మళ్లీ ఫీజు ఏమిటి? ప్రతి నెల స్కూల్ ఫీజు కడతాను" అన్నాడు గిరిశం.


"అయితే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి, ఇక్కడ కుదరదు" అనడంతో, కొడుకుని తీసుకుని వెళ్లి గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించాడు.


విసుక్కుంటూ ఇంటికి వచ్చిన భర్తతో "ఈ ఒక్కపని అయినా చేశారు, ఏమైనా డొనేషన్ కట్టుకున్నారా?" అంది.


"ఇరవై వేలు అడిగారు. ఈ వెధవ చదివే చదువుకి ఎందుకు అని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేశాను. సాయంత్రం నాకు పనినుంది, నువ్వు వెళ్లి స్కూల్ నుంచి వాడిని తెచ్చుకో" అన్నాడు.


వంగోబెట్టి నాలుగు గుద్దులు గుద్ది, మెడ పట్టుకుని గెంటేయ్యాలి అన్నంత కోపం వచ్చింది రాధకి. "దండుగ అనుకుని మీరనుకున్నారా? లేకపోతే డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేశారా?" అంది.


"రెండూ!" అంటూ "ఏమైనా ఉందా తింటానికి? జీతం వచ్చిన మొదటి వారంలోనే మన ఇంట్లో కుండలు ఢీకొడుతున్నాయి అంటే నువ్వు సంసారం ఎంత బాగా నడుపుతున్నావో తెలుస్తోంది" అన్నాడు విసుగ్గా.


"అసలు జీతమే లేనప్పుడు మొదటి వారం, చివరి వారం అని లెక్కలు కూడానా? సిగ్గులేకపోతే!" అంది.


వెంటనే చెంప ఛెళ్ళుమనిపించాడు గిరిశం.


"ఇంతకంటే మీకు తెలిసింది ఏముంది? మా అన్నయ్యని అడిగి డబ్బులు తెచ్చి పిల్లలకి, మీకు నాలుగు మెతుకులు పెడుతున్నాను.


'ఏమిటే, మీ ఆయన జీతం ఏమవుతోంది?' అని అడిగాడు. నిజం చెప్తే మీ తల ఎక్కడ ఎగురుతుందో అని భయంతో చెప్పలేదు.


ఎంత పనికిమాలిన వాడైనా మొగుడు అనే వాడు ఉండాలిగా ఆడదానికి" అంది ఏడుస్తూ.


"ఛీ! ఇది ఇల్లు కాదు, నరకం!" అంటూ బయటికి వెళ్లిపోయాడు గిరిశం.


ఆఫీస్ లిఫ్ట్ దగ్గర బాగా జనం ఉండటంతో మెట్లు దిగుతున్న గిరిశంకి సడన్‌గా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. పక్కన నడుస్తున్న ఉద్యోగి గిరిశాన్ని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి, "మీ ఆవిడ తలుచుకుంటోందేమో, ఈరోజు పేకాటలో కూర్చోకుండా ఇంటికి వెళ్లండి గిరిశం" అన్నాడు. కిందకి తీసుకువచ్చి ఆటో ఎక్కించాడు.


ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి భర్త దిగడం చూసి, గడియారం వంక చూసి, ఆరు గంటలకే వచ్చేసారు, విచిత్రం అనుకుంది. రాగానే లుంగీ కట్టుకుని మంచం మీద కూర్చొని, "నాకు ఒంట్లో బాగుండలేదు" అన్నాడు భార్యతో.


"కాఫీ తెస్తాను ఉండండి" అంది.


"ఆగు, ఏమైంది అని అడగవా?" అన్నాడు గిరిశం.


"ఉదయం వరకు బాగానే ఉన్నారుగా? కాఫీ తాగి ఇంకా నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లండి" అంటూ కాఫీ కప్‌తో పాటు రెండు వందల రూపాయల నోటు పక్కన పెట్టింది.


కాఫీతో కొద్దిగా ఓపిక వచ్చినట్టు అనిపించి రెండు వందల నోటు జేబులో వేసుకుని క్లబ్‌కి బయలుదేరాడు. రాత్రి తొమ్మిది గంటల లోపు రెండు వందలని రెండు వేలు చేశాడు గిరిశం.


భార్య చేతి నుంచి ఇచ్చిన డబ్బులు అదృష్టం తెచ్చాయి అనుకున్నాడు. 'ఇక చాలు'

అనుకుంటూ లేచి కింద పడిపోయాడు. కంగారుగా పేకాట స్నేహితులు గిరిశాన్ని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి, డాక్టర్ చెప్పిన టెస్ట్స్ చేయించి ఇంటికి తీసుకువచ్చి దింపారు.


నిజంగానే ఏదో అనారోగ్యం తెచ్చుకున్నారు అనుకుని కంగారుగా "ఏమైంది? డాక్టర్ ఏమన్నాడు?" అంది.


"ఏమో, రిపోర్ట్స్ రేపు వస్తాయి. కొద్దిగా విక్స్ ఉంటే ఇస్తావా? ఊపిరి ఆడటం లేదు, లంగ్స్‌కి రాసుకుంటాను" అన్నాడు.


ఒక్కసారిగా మొగుడి మీద జాలివేసింది రాధికకి. ఇంట్లో విక్స్ లేదు, పూజ గదినుంచి కర్పూరం తీసుకుని కొబ్బరినూనెలో వేసి భర్త చెస్ట్ మీద రాస్తూ, "భయపడకండి, తగ్గిపోతుంది. ఏదో తినకూడనిది తిన్నట్టు ఉన్నారు, అసిడిటీ అనుకుంటా" అంది.


భార్య మెత్తటి చేతులు శరీరానికి తగులుతుంటే గిరిశం మనసులో అనుకున్నాడు: 'వెధవ స్నేహితుల వల్ల పేకాట అలవాటు అయ్యింది, దానికి తోడు సిగరెట్లు. డబ్బులు సంపాదించాలి అనే ధ్యాసలో డబ్బులు పోగొట్టుకున్నాను.'


"పాపం, ఇల్లు నడపడంలో ఎంత ఇబ్బంది పడిందో! చివరికి కొడుకుని చదివించలేక గవర్నమెంట్ స్కూల్‌లో పడేశాను. పెళ్లైన కొత్తలో బుగ్గలతో ఉండేది, నేను పెట్టిన బాధలకి ఎలా ఎండిపోయిందో!" అనుకున్నాడు గిరిశం.


"ఏమిటి ఆలోచిస్తున్నారు? రేపు మామూలుగా పేకాటకి వెళ్లవచ్చు, భయపడకండి" అంది.

"లేదు రాధా, ఇక నేను పేకాటికి వెళ్లను. త్వరలోనే మళ్లీ మన పాతరోజులు వస్తాయి, నా మాట నిజం" అన్నాడు.


"సర్లేండి, పడుకోండి" అని దుప్పటి కప్పి తన మంచం మీద పడుకుంది.


ఉదయం నుంచి పనులతో అలసిపోయిన రాధకి నిద్రపట్టేసింది. కానీ ఊపిరి ఆడక, దగ్గుతో వరండాలో కూర్చొని ఇబ్బంది పడుతూ గడిపాడు. ఉదయం తన టైమ్ ప్రకారం లేచిన రాధకి భర్త ఆయాసపడుతుండటం చూసి కంగారుగా ఆటో పిలిచి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లంది. ఐసీయూలోకి తీసుకుని వెళ్తూ కౌంటర్లో డబ్బులు కట్టమని చెప్పారు హాస్పిటల్ వాళ్లు.


చేతిలో వంద రూపాయలు కూడా లేవు. అన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. "వస్తున్నాను, కంగారుపడకు" అని రాధిక అన్నగారు వచ్చి, హాస్పిటల్ వాళ్లకి పది వేలు అడ్వాన్స్ కట్టి, చెల్లెలి దగ్గర కూర్చొని, "వ్యవహారం ఇంత దూరం ఎందుకు వచ్చింది?" అని అడిగాడు.


భర్త పేకాటకి అలవాటుపడి ఇల్లు ఎలా నిర్లక్ష్యం చేశాడో చెప్పింది. "ఇప్పుడు ఈ అనారోగ్యం సమస్య వచ్చింది. నా జీవితం అయోమయంగా తయారయ్యింది" అని ఏడుస్తున్న చెల్లెలిని ఓదార్చి, "నేను బావగారి చెడు అలవాటును మారుస్తాను. నువ్వు చివరిదాకా తెచ్చుకున్నావు, నాకు ముందే చెప్పివుంటే జీవితం వేరేలా ఉండేది. ముందు బావగారు కోలుకోగానే అన్నీ సర్దుబాటు చేస్తాను" అన్నాడు.


ఐసీయూలో డాక్టర్ గారు గిరిశం దగ్గరకి వచ్చి, "మీతో ఎవరైనా కావలసిన వాళ్లు వచ్చారా?" అని అడిగాడు. గిరిశం డాక్టర్ గారి చేతులు పట్టుకుని ఏదో మాట్లాడుతూ ఉండటం ఐసీయూ గ్లాస్ విండో లోనుండి చూసిన రాధిక, "ప్రమాదం లేదనుకుంటా, డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు" అనుకుంది.


మరుసటి రోజు మందులు రాసిచ్చి గిరీశాన్ని డిశ్చార్జ్ చేశారు. "అదేమిటండి, మీలో ఇంకా ఆయాసం కనిపిస్తోంది బావగారు, అప్పుడే ఎలా డిశ్చార్జ్ చేశారు?" అని అడిగాడు బావమరిది.

"ఐసీయూలో కోవిడ్ వాళ్లు ఉన్నారు, అక్కడ ఉండటం మంచిది కాదు. మందులు వాడండి, రెండు రోజులలో మీ బాధ నుంచి విముక్తి కలుగుతుంది అన్నారు" అన్నాడు గిరిశం.

చెల్లెలికి ఒక వారం రోజులకి సరిపడా వస్తువులు కొనిచ్చి, ఒక ఐదు వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు రాధిక అన్నగారు.


"ఇప్పుడే వస్తాను పిల్లాడిని స్కూల్‌లో దింపి" అని భర్తకి చెప్పి వెళ్లి, వచ్చేప్పుడు విక్స్ బాటిల్, బియ్యం కొనుక్కుని ఇంటికి వచ్చిన రాధికకి భర్త మంచం మీద లేకపోవడం— బహుశా రెస్ట్ రూమ్‌కి వెళ్లారేమో అని వంటగదిలోకి వెళ్లి హార్లిక్స్ బాటిల్ మూత తీసి, భర్త కోసం హార్లిక్స్ కలిపి, ముందు గదిలోకి వచ్చి, "అరే, ఈయన బాత్రూంలో ఇంతసేపు ఉన్నారేమిటి?" అనుకుంటూ బాత్రూం తలుపు తట్టింది. జవాబు రాలేదు, బాత్రూంలో ఎవరూ లేరు.


"ఎక్కడికి వెళ్లారు? అన్నగారిచ్చిన డబ్బులు చూసి పట్టుకుని పేకాటకి వెళ్లిపోలేదు కదా?" అనుకుంటూ బట్టల కింద వెతికింది. డబ్బులు అలాగే ఉన్నాయి. దానితో పాటు భర్త చేతిరాతతో ఉన్న కాగితం చూసి కంగారుగా తీసి చదవటం మొదలుపెట్టింది.


"రాధా! నేను స్వతహాగా మంచివాడినే. ఆఫీస్‌లో కొంతమంది స్నేహితులతో పేకాట అలవాటు అయ్యింది. పేకాట ఆడుతున్నంతసేపూ సిగరెట్టు. దీనితో మొన్న ఐసీయూలో చేరినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, నాకు ఒక లంగ్‌కి కాన్సర్ వచ్చింది అని. ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని తెలిసి, నీకు విషయం చెప్పవద్దు అని డాక్టర్ దగ్గర మాట తీసుకున్నాను. ఇవి నాకు ఆఖరి రోజులు అని తెలిసిపోయింది.


చేతిలో చిల్లిగవ్వ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నాంపల్లి రైల్వేస్టేషన్‌కి వెళ్తున్నాను. మీ అన్నయ్య సహాయం తీసుకుని ఆఫీస్‌కి వెళ్లి ఫ్యామిలీ పెన్షన్‌కి అప్లై చేసుకో. ఇప్పుడు నిన్ను ఆఫీస్ నుంచి కిందకి తోసేయడానికి నేను ఉండనులే" అని ముగించాడు.


రాధిక ఒక్కసారిగా కొయ్యబారిపోయింది. అన్నగారికి ఫోన్ చేసి తను నాంపల్లి స్టేషన్‌కి బయలుదేరింది. స్టేషన్‌లో అడుగుపెట్టిన రాధికకి, అన్నగారు పోలీసులతో కనిపించడం చూసి మనసు కీడు శంకించింది.


చెల్లెలిని చూసి దగ్గరగా వచ్చి, "బావ ఇంత పని ఎందుకు చేశాడో తెలియటంలేదు, ఆత్మహత్య చేసుకున్నారు" అంటూ చెల్లెలిని గట్టిగా పట్టుకున్నాడు. రాధిక తన బ్యాగ్‌లోనుండి భర్త రాసిన ఉత్తరం అన్నగారికి అందించింది.


రాధిక అన్నగారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, బావగారి ఆఫీస్‌లో పూర్తి చేయవలసిన పనులు పూర్తి చేసి, చెల్లెలిని తన ఇంటికి తీసుకుని వచ్చాడు.


నెల రోజుల లోపే ఫ్యామిలీ పెన్షన్ నెలకు డెబ్బై ఐదు వేలు శాంక్షన్ అయ్యాయి. అన్నగారికి చెప్పి పిల్లలతో తన ఇంటికి చేరింది.


"కొంతమంది భర్తలు కాగితం పువ్వుల్లాగా అందంగా ఉండి, పూజకు పనికిరాకుండా నిత్యం ముళ్లతో గుచ్చుతూ ఉంటారు. గిరీశం కూడా అదేకోవకి చెందినవాడు. ఏం సుఖపడ్డాడో తెలియకుండానే వెళ్లిపోయాడు" అని భర్త ఫోటో చూస్తూ కళ్లు తుడుచుకుంది.


కొన్ని జీవితాలు బాధలు పెట్టే భర్త నిష్క్రమణ తరువాత సుఖపడుతున్నాయేమో!

చెడు అలవాట్లు చివరికి ఇచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది.


కథ సమాప్తం.



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జీడిగుంట శ్రీనివాసరావు

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page