top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 20


'The Trap Episode 20' New Telugu Web Series

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

భువనేశ్వర్ కొలీగ్ రాము, కమలను ఇష్టపడుతున్నట్లు చెబుతాడు.

పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి.

రాము ఇండియాకి తిరిగి వచ్చే షరతు మీద పెళ్ళికి ఒప్పకుంటుంది కమలం.

ఇక ది ట్రాప్.. 20 వ భాగం చదవండి…


అన్నమాట ప్రకారం రాము అమెరికాలోని తన కంపెనీకి ముందుమాటగా విషయం చెప్పి, పెద్దల సమక్షాన కమలతో నిశ్చితార్థం జరిగిన తరవాత మిగతా విషయాలు సరిచూసుకుని రావడానికి న్యూజెర్సీ వెళ్లిపోయాడు.


ప్రొఫెషనల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా అతడి ముందున్న లక్ష్యం ఒక్కటే—తానుగా స్టార్టప్ ని ఆరంభించాలి. లేదా—స్కిల్స్ తో నడపబడుతూన్న భారతీయ స్టార్టప్ తో చేరిపోవాలి. అన్నాళ్ళూ తను సముపార్జించుకున్న అనుభవంతో అలవర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ ని పూర్తి స్థాయిలో ఆపరేషన్ కి పెట్టాలి. ఎట్టి పరిస్థితిలోనూ కమల నిరుత్సాహానికి లోను కాకుండా చూసుకోవాలి. వేదమూర్తి కుటుంబానికి తను అన్నివిధాలా తగిన అల్లుడని నిరూపించుకోవాలి. అప్పుడప్పుడు అనుభవాలకన్నా రచించుకున్న పథకాల కన్నా ఉద్వేగాలే కదా మనిషిని ముందుకు నడిపిస్తాయి—నియంత్రిస్తాయి. ఇదే కదా జీవిత సత్యం--


ఇక మరొక ముఖ్యమైన విషయం యేమంటే రాము అలా న్యూజెర్సీ చేరుకున్న మూడు రోజుల తరవాత వాళ్ళకు అనుకూలమైన శుభముహూర్తం చూసి కామేశ్వరరావుకీ వసంతకీ—పరమేశ్వర్ కీ వినోదినికీ అమ్మవారి గుడి ప్రాంగణాన నిశ్చి తార్థం జరిగింది. దాదాపు అంతటా ఊరంతా చెప్పుకునేలా కళ్యాణోత్సవంలా జరిగింది. అప్పుడు మరొక సంఘటన-- అందరూ దాదాపు పూర్తిగా మరచిపోయారనుకున్న పవన్ ప్రేమ వ్యవహారాన్ని తానుగా గుర్తు పెట్టుకుని పరమేశ్వర్ తమ్ముడికి చెప్పాడు. “ఒరేయ్ తమ్ముడూ—నీ విషయమూ ప్రణీత విషయమూ నేను మరచిపోయాననుకునేవురోయ్—“


చిన్నన్నయ్య నోట ఆ మాట విన్నంతనే పవన్ ఎమోషనల్ జెర్కింగ్ కి లోనయాడు. కళ్ళు పెద్దవి చేసుకుని అన్నాడు- “అందరితో బాటు నువ్వు కూడా మమ్మల్ని మరచిపోయావేమోనని భయపడ్డాననుకో— విషయాన్ని యెలా కదపాలో తెలియక తెగ డీలాపడి పోయాననుకో- చాలా థేంక్సురా అన్నయ్యా-- “


“ఓయ్! అన్నదమ్ముల మధ్య పెద్ద పెద్ద మాటలెందుకురా! కొన్ని విషయాలు బాహాటంగా డప్పులా చప్పుడు చేస్తూ జరగాలి. మరికొన్నేమో గుట్టుగా పట్టుదలతో చాకచక్యంతో జరగాలి. పూనుకున్న పనులు పూర్తి అయేంత వరకూ బయట ఏదీ పొక్కకూడదు. ఇప్పుడు అసలు సంగతి విను- మన కిరాణా షాపుని విస్తరించడానికి కావలసిన యేర్పాట్లు దాదాపు పూర్తయాయి. మనూరి ఫైనాన్స్ కంపెనీ నుండి రెండు మూడు రోజుల్లో లోన్ సాంక్షన్ అవుతుంది.


నిజానికి మనం చేయబోయేది షాపుని విస్తరించడం కాదు- మన షాపుని దాదాపు మినీ సూపర్ మార్కెట్టుగా మార్చాలని నిర్ణయించుకున్నాం. వినోదిని తండ్రి దివాకర్ గారు అందులో పార్టనర్ గా చేరబోతున్నారు. ఈ కారణాన ఆయన కంపెనీ మేనేజ్మెంటు సహకారం లభించవచ్చు. ఇకపైన అందులో పకడ్బందీగా కార్పొరేట్ లెవల్ లో పని చేయడానికి నిన్ను నగరంలో మేజర్ సూపర్ మార్కెట్టులో ట్రైనింగు తీసుకోవడానికి త్వరలో హైద్రాబాదు పంపించబోతున్నాం. ఆ తరవాత అందులో నీ రోలే మారిపోబో తుంది. నీ డ్రెస్సింగ్ స్టయిలే మారిపోతుంది.


అన్నయ్యకు కూడా మార్కెటింగ్ స్కిల్ ట్రైనింగు మన షాపులో పని చేస్తుండగానే ప్రాక్టికల్ గా యివ్వబోతున్నాం. నాకూ అన్నయ్యకూ పెళ్ళయిన తరవాత వసంత వదినా వినోదిని వదినా యిద్దరూ మనం ప్రారంభించబోయే మినీ సూపర్ మార్కెట్టులో చేరబోతున్నారు. వాళ్ళిద్దరికీ కంప్యూటర్ సిస్టమ్ గురించి తెలుసు కదా! డిజిటల్ పేమెంట్సు విషయం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరూ నాన్నగారికీ మీకూ వత్తాసుగా ఉంటారు. ఇదంతా రూపం దిద్దుకున్న తరవాత గ్రోసరీ వ్యాపారంలో కుదుట పడ్డ తరవాత ప్రణీత తండ్రి కోదండం నీకు పిల్లనివ్వ డానికి యెలా తిరస్కరిస్తాడో చూద్దాం-- అంతవరకూ నువ్వు కాస్తంత ఓపిక పట్టు- నాన్నను ఒప్పించడం నా వంతు. సరేనా—“


పవన్ నోట మాట రాక నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయి, ఉన్నపాటున చిన్నన్నయ్యను వాటేసుకున్నాడు. ఆ తరవాత నిదానం గా తలెత్తి పరమేశ్వర్ కళ్ళలోకి చూస్తూ అడగాలా వద్దా అన్న సందిగ్ధావస్థలో పడి అభావంతో చూడసాగాడు. అది గమనించిన పరమేశ్వర్ తమ్ముడి భుజం తడుతూ అడిగాడు విషయం యేమిటని.


“తప్పుగా అనుకోవు కదరా అన్నయ్యా !”


ఊఁహు- అన్నాడు పరమేశ్వర్ తల అడ్డంగా ఆడిస్తూ- .


”మరేం లేదురా అన్నయ్యా! నువ్వు ఇద్దరు వదినెలపైనా గంపెడు నమ్మకం పెంచుకుంటున్నావు కదా—మరి వాళ్ళిద్దరూ పెళ్ళయిన తరవాత మనింట్లోనే మనతోనే ఉంటారా? ”


“ఎందుకలా అనుమానంతో అడుగుతున్నావు? “


“ఎందుకంటే—వదినెలిద్దరూ పెద్దింటికి చెందిన వాళ్ళు కదా—మనతో ఇక్కడి సదుపాయాలతో సౌకర్యాలతో సర్దుపోగలరా అని—టీవీ సీరియల్సులో చూస్తున్నాం కదా కొన్నాళ్ళ తరవాత బిడ్డకు తల్లయిన తరవాత వాళ్ళ పుట్టింటి వాళ్ళ వత్తాసులో వేరుపడి వెళ్ళిపోతున్నారుగా! నాకు తెలిసిన ఒకరిద్దరు యిండ్లలో నేను కూడా స్వయంగా చూసున్నానుగా—అలాంటప్పుడు పెద్ద చదువులు చదువుకున్న ఇద్దరు వదినెలూ మనతో బాటు ఉండి మన మినీ సూపర్ మార్కెట్టులో మనతో కలసి పని చేస్తారని యెలా చెప్పగలం? ఎక్కువాశ పడుతున్నామేమో! “


పరమేశ్వర్ నవ్వుతూ కొన్ని క్షణాలు ఊరకుండిపోయాడు. ఈమధ్య సినిమాల ప్రభావం కన్నా టీవీ సీరియల్స్ ప్రభావం యెక్కువగా వ్యాపిస్తున్నట్లుంది. ఎడాపెడా కుటుంబ కథలు, ముఖ్యంగా స్త్రీల కధలు తీసి పారేస్తున్నారుగా! యువకులపైన సహితం వాటి ప్రభావం పడకుండా యెలా ఉంటుంది?


అలా ఆలోచిస్తూ అతడు తమ్ముడికి ధైర్యం చెప్పాడు- “ఆంగ్లంలో ఒక సామెత ఉండనే ఉందిగా- లెటజ్ హోప్ ఫర్ ది బెటర్- అని. ఇప్పటికిప్పుడు వసంత వదినె గురించి యేమీ చెప్ప లేను గాని, మీ చిన్న వదినె వినోది అంతదూరం వెళ్ళదను కుంటాను. నిదానంగా లోతుగా ఆలోచించగలదనుకుంటాను. ఇంకా చెప్పాలంటే— ఇద్దరూ మన కుటుంబ సంప్రదాయాలతో అనుసరించి అణగి మణిగి ఉంటారనే అనుకుంటాను. వాళ్ళ నాన్నలిద్దరూ నాన్నకు క్లోజ్ నేస్తాలు కదా! ఆ విషయంలో అంకుల్స్ యిద్దరూ కూతుళ్ళకు వత్తాసుగా నిలవరనే అనుకుంటాను. ఇవన్నీ తెలిసే కదా ఇద్దరూ మనింటికి కోడళ్లుగా రాబోతున్నారు. రాను రాను మనింటి వ్యవహారాలతో మమేకం కాగలరనే అనుకుందాం.


మొన్నొక సంఘటన జరిగింది. చెప్తాను విను. సిటీలో జోవెడ్ లాంజ్ అండ్ మల్టీ డిజైనర్ స్టోర్ అనే సోషియల్ సంస్థ ఉంది. అది పెద్ద పెద్ద డబ్బున్న కుటుంబాలకు రేట్స్ పధ్ధతిన పెళ్ళిల్లు చేసుకునేవారికి గ్రాండ్ గా ఈవెంట్ యేర్టాట్లు చేసి పెడ్తుంది. పెళ్ళి సంబరంలో ఫొటో గ్రాఫర్స్, క్యాటరర్స్, మేకప్ ఆర్టిస్టులు- ఫంక్షన్ హాల్సు వంటివన్నీ అదే యేర్పాటు చేసి పెడ్తుంది. ఆ సంస్థను నా పెండ్లికి యేర్పాటు చేస్తానని దివాకర్ అంకుల్ ప్రతిపాదించాడు. దానిని అమ్మా బామ్మా అవసరం లేదని అప్పటికప్పుడు కొట్టి పారేసారు. అదంతా మన సంప్రదాయం ప్రకారం సింపుల్ గా జరగాలని ప్రత్యేకంగా పుణ్యక్షేత్రంలో జరగాలని తీర్మానించారు, . దివాకర్ అంకుల్ కిమ్మనకుండా వెళ్ళిపో యాడు.


ఇక విశ్వం అంకుల్ విషయానికి వద్దాం. వసంత వదినెకు మెడనిండా వాళ్ళింట్లో ఉన్న పెద్ద లాకెట్లతో వడ్డాణాలతో చాంతాడుతో, భారీ బంగారు చైన్ లతో సింగారించుకు వస్తామని చెప్పారు. అప్పుడు అమ్మ అంత బరువైన వారాల నగలతో వసంత వదినెను సింగారించనవసరం లేదని, ఉంది కదానని అదంతా బయటకు చూపించనవసరం లేదని-- కుదురుగా సింపుల్ గా అవసరానికి తగ్గట్టు వేసుకుంటే చాలని సూటిగా చెప్పేసింది. విశ్వం అంకుల్ సువర్చల ఆంటీ ఇద్దరూ నిశ్శబ్దందా తలాడిస్తూ వెళ్ళిపోయారు. దీనిని బట్టి యేమి తెలుస్తుంది? ఇప్పుడు గాని ఆ తరవాత గాని అంతా వాళ్ళిష్ట ప్రకారం సాగదనేగా, మన కుటుంబ వ్యవహారలాలో వాళ్ళెవరూ అంత తిన్నగా కలుగ చేసుకోకూడదనేగా-- ఇదంతా నీకు కాబోయే ఇద్దరు వదినెలూ గమనిస్తూనే ఉన్నారుగా!


రేపు మనతో మన కుటుంబ వ్యవహారాలతో యెలా సర్దుకు పోవాలో నీ వదినెలిద్దరూ మెంటలీ సిధ్ధమవుతూనే ఉంటారుగా-- ఒక వేళ అలా కాకుండా నీ వదినెలిద్దరూ మనం ఆరంభించబోయే మినీ సూపర్ మార్కెట్టులో పాలు పంచుకోనంటే మనతో కలసి పని చేయనంటే మనం మాత్రం చేసేదేముంది? మనమే నడుపుకుందాం. వాళ్ళను దూరంగానే ఉంచుదాం.


ఐనా—ఇప్పటికిదంతా ఊహాగానమే కదా! ఇక అసలు విషయానికి వస్తే-- ఎలాగూ నీకూ ఆ తరవాత అన్నయ్యకూ హై బిజినెస్ స్కిల్సులో ట్రైనింగు ఇవ్వబోతున్నాంగా! ఇంకెందుకు మనకీ తడబాటు? మనం ఆరంభించబోయే మినీ సూపర్ మార్కెట్టుని సర్వ సమర్థవంతంగా నడపగలమన్న నమ్మకం నాకుంది. అది నీకుందా లేదా? ”

పవన్ ఆనందంగా నమ్మకంగా నవ్వుతూ మరొకసారి చిన్నన్నయ్యను కౌగలించుకున్నాడు- “ఉందిరా అన్నయ్యా! మరొకటి అడిగేదిరా అన్నయ్యా! “


“ ఇంకా ఉందేమిటి? అడగడుగు“


పవన్ బెరుకుగా చూస్తూనే అడిగాడు- “ఇంతలావు లోన్లు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తీసుకుంటున్నామే—రేపు సమయానికి తిరిగివ్వలేకపోతే చాలా ఇబ్బందులు వచ్చి పడతాయిరా అన్నయ్యా! తిరిగివ్వడంలో జాప్యం జరిగితే జప్తు చేసి ఉన్నదంతా ఊడ్చుకుపోతారురా! పేపర్లో చూస్తూనే ఉన్నాంగా అప్పులివ్వలేక రైతులూ వ్యాపారులూ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో! ”


పరమేశ్వర్ కి తమ్ముడితో అలా సంభాషించడం లోలోన సంతోషంగా ఉంది. తమ్ముడు ఆలోచించ నారంభించాడు; తనకోసమూ తన లవ్ వ్యవహారం గురించి మాత్రమే కాక—కుటుంబం కోసమూ భవిష్యత్తు కోసమూ ఆలోచించనారంభించాడు. ఇది మంచి జీవన సంకేతం.


“చేయబోయే వ్యాపారం చిన్నదా పెద్దదా అన్నది కాదు ప్రశ్న. ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్టు చేసే ప్రతి వ్యాపారానికీ రిస్క్ అన్నది ఉంటుంది. ఎదురు కాబోయే రిస్కుని తగ్గించుకోవడం లోనే ఉంది మన సామర్థ్యం. మన ముందు చూపూను. ఈ విషయంలో మనందరి కన్నా నాన్నగారికి అనుభవం ఉంది. అదే రీతిన మన సూపర్ మార్కెట్టులో పార్టనర్ షిప్పు తీసుకోబోయే దివాకర్ అంకుల్ గారికీ తగిన అనుభవం ఉంటుంది. దీనికోసం మనం బుర్ర పాడుచేసుకోనవసరం లేదు”


ఆమాటతో పవన్ తలూపుతూ కదలి వెళ్ళిపోయాడు.

ఇక విషయానికి వస్తే, కీడెంచి మేలెంచమన్నారు, ఇందుకేగా—ఇటువంటి దూరపు చూపుతో ముందుకు సాగడం ఉత్తమ లక్షణమేగా-

-- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -

సగటు మనిషి జీవితంలో కుదుట పడటానికి, జీవితంలో స్థిరంగా నివసించడానికి మనిషికి ఏడు ఆధారాలు అవసరం అంటారు విజ్ఞులు- ఆధ్యాత్మిక వేత్తలు. మరి యేమిటా యేడు ఆధారాలు? గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత—వీరినే సప్త ప్రకార రక్షకులంటారు. ఇక విషయానికి వస్తే—ఆరోగ్య శాస్త్రం ప్రకారం మానసిక బాధ ఎంత కష్టాన్ని కలిగిస్తుందో, అదే స్థాయిన శారీరిక బాధ కూడా అంతే క్లేశాన్ని కలిగిస్తుంది.


మరి దేహ బాధా నివారణార్థమై వైద్యుని వద్దకు వెళ్ళవచ్చు. ఉపశమ నంపొందవచ్చు. మరి కంటికి అగుపించని మానసిక బాధకు? అందునా-- అంతులేని ఆత్మక్షోభకు లోనవుతూన్న మృదు మన స్కుల విషయంలో-- స్త్రీల విషయంలో ఏమి చేయాలి? నివారణార్థం యెలా ముందుకు సాగాలి? ఇదీ మిలియన్ డాలర్ల ప్రశ్న—


వ్యాపార నేపధ్యానికి చెందిన వరూధిని గత కొన్నేళ్ళుగా కార్పొరేట్ బిజినెస్ ప్రపంచంలో అపారమైన అనుభవం గడించిన వరూధిని మామగారి ఆదేశానుసారం వ్యాపార విస్తరణ కోసం, కంపెనీ అనుబంధ వ్యవస్థగా ట్రేడింగ్ సెంటర్ ఆరంభించడం కోసం స్విట్జర్లాండు వెళ్ళబోతుందన్న వార్త నలుచెరగులా గుప్పున వ్యాపించింది. ఆమె అడపా దడపా విరాళాల సహకారంతో ఆదరిస్తూన్న సాధు సమాజం వారు సహితం విస్మయం చెందారు; విన్న వార్త వాస్తవమా కాదా అన్న ఆశ్చర్యంలో పడి-- సాధారణంగా వ్యాపార విస్తరణ కోసం జరిపే బిజినెస్ బృంద పర్యటనలు వరూధిని మామగారి ఆధ్వర్యానే జరుగుతుంటాయి.


అంతేకాక-- అప్పుడప్పుడు వరూధిని మామగారే వ్యాపార పర్యటనలు చేస్తుంటారు కూడాను. అలా చేయడం అరుదుగా మాత్రమే-- అటువంటిది ఈసారి వరూధిని స్వయంగా పూర్తి స్థాయిన బిజినెస్ పర్యటన చేయడ మేమిటి? అదీను ఏక ధాటిగా ఆరునెలల పాటు ఉన్నఊరు విడిచి పరదేశానికి వెళ్ళి ఉండటమా! అది సాధ్యమేనా? ఇందులో మరొక విస్మయాత్మక విషయం యేమంటే—వరూధిని తమ కంపెనీ ఎగ్డిక్యూటివ్ ల బృందంతో మాత్రమే కాక, తన కూతుర్ని కూడా తన వెంట తీసుకు వెళ్తుంది; తను లేకుండా ఉంటే దగ్గరుండి చూసుకోకపోతే కూతురి ఆరోగ్యమూ చదువూ దెబ్బతింటాయని.


ఇవే కాక—ఇంకెన్నో రూఢి కాని వార్తలు పెల్లుబికాయి- - విస్మయం కలిగించే మరొక విషయం యేమంటే, స్విట్జర్లాండులో ట్రేడ్ సెంటర్ ఆరంభించిన

తరవాత కంపెనీ నుండి ఆమెతో బాటు వెళ్ళబోయే వ్యాపార బృందం తిరిగి వచ్చేస్తుంది వరూధినిని మాత్రం అక్కడే ఉంచి-- ఇది నిజంగా విస్మయాత్మక విషయమే— ముఖ్యంగా ఇది యెంతవరకు వాస్తవం. ఎంతవరకు అవాస్తవం అన్నది కూడా తేల్చుకోలేని అంశమే--


ఆ రోజు దీపాలు పెట్టే వేళకు ముందు వరూధినికి ఎదురు చూడని విధంగా ప్రభావతి నుండి ఫోను వచ్చింది. మొదట భువనేశ్ నుండి ఫోను వస్తుందనుకున్న వరూధిని నిస్పృహ చెందింది. ఐనా దానిని ఆమె కనబర్చలేదు, ప్రభావతి నుండి శుభాకాంక్షలు అందుకుంటూ యధాలాపంగా స్పందించిందామె.


“థేంక్స్ ఎ లోట్ ప్రభా! నేనే స్వయంగా వచ్చి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా! ఈలోపల నువ్వే ఫోను చేసావు. ఉఁ చెప్పు-- విశేషాలేమిటి? కొన్ని రోజులుగా కలుసుకోవడానికి కుదరడం లేదుగా—అందుకే అడుగుతున్నానోయ్! ”


“ఇటీజ్ ఓకే! అప్పుడప్పుడు అలా యెడబాటు సంభవించడం సహజమేగా! ఇక యిప్పుడు నాదొక చిన్న రికెస్టు- వింటావా! ”


“ఎందుకు వినను? ఇంటికి రమ్మంటావా కలసి భోజనాలు చేయడానికి-- ~


“కాదు—గుడికి- త్రిపురాలయానికి.. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి—“


“అరే—ముఖ్యమైన విషయమంటున్నావు. గుడికి రమ్మంటున్నావు- ఏం? ఇంటికి రావచ్చుగా! “


“లేదు. మనం గుడిలోనే మాట్లాడుకుందాం. పాపను తీసుకురాకుండా రా! సరిగ్గా ఆరుగంటలకు ఆలయ ధ్వజస్తంభం వద్దకు వస్తున్నావు” అంటూ ప్రభావతి ఫోను పెట్టేసింది.


వరూధినికి ఖంగు తిన్నట్లయింది. అదేమిటి ప్రభావతి అలా ముఖాన నీళ్ళు చిమ్మినట్లు చప్పున సంభాషణ తెంచేస్తూ పోను పెట్టేసింది—ఏదో అపశకునం ఆకాశ వీధిన విచిత్రంగా ధ్వనించినట్లనిపించింది. భువనేశ్ తో తనకే ర్పడ్డ అఫైర్ బట్టబయలయి పోయిందా! తెలిసిపోయినా ఆమె యిక యేమి చేయగలదులే—తను యెలాగూ గట్టు దాటి వెళ్ళిపో తుందిగా! ఇక చేయగలిగేదేముందిలే--


చెప్పినట్టు వరూధిని గుడికి చేరుకుంది సమయానికి ఒంటరిగా—ఆమె కోసం యెదురు చూస్తూ కూర్చున్న ప్రభావతి లేచి వచ్చింది. ఇద్దరూ మునుపులాగే నవ్వులు చిందిస్తూ చేతులు కలుపుకున్నారు. ఇద్దరూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభానికి నమస్కరించి వచ్చిన తరవాత వరూధిని అంది సౌమ్యంగా స్నేహపూర్వకంగా-- “మనం అలా బయట గుడి తోటలోకి వెళ్ళి మాట్లాడుకుందామా! ఇక్కడ కూర్చుంటే అర్చనలూ గుడిగంటలూ వినిపిస్తూనే ఉంటాయిగా! ”


ఆమెకు యీపాటికి తెలిసే ఉంటుంది మాట్లాడబోయేది గంభీర వ్యవహారమేనని-- ప్రభావతి తల అడ్డంగా ఆడించింది. “లేదు. మనం గర్భగుడి ముందు కూర్చునే మాట్లాడుకుందాం. మూలవిరాట్టు సాక్ష్యంగానే మాట్లాడు కుందాం. సరేనా వరూ! ”


వరూధిని తలూపుతూ గుర్భగుడికి కాస్తంత యెడంగా చోటు చేసుకుని కూర్చుంది;కనురెప్పలు మూయ కుండా తదేకంగా చూస్తూ—ప్రభావతి కూడా ఆమెకెదురుగా కూర్చుంటూ హ్యాండ్ బ్యాగునుండి పుస్తకం తీసి ముందుంచింది. “ఇది మాకుటుంబ పారంపర్య దైవాన్విత పుస్త కం. శివ మంత్రాలతో నిండిన పవిత్ర ప్రాచీన శివ పురాణం. మనిద్దరమూ ఈ పవిత్ర పుస్తకం పైన చేతులుంచి ప్రమాణం చేద్దాం. అన్నీ వాస్తవాలే తప్ప, సత్యాలే తప్ప మరేదీ చెప్పబోమని—“


ఇద్దరూ తడబాటుకి తావివ్వకుండా భక్తితో పుస్తకంపైన చేతులుంచారు. మొదట ప్రభావతి ఆరంభించింది- “థేంక్స్—నామాట పైన నమ్మకం ఉంచి ప్రమాణం చేసినందుకు. ఇక విషయానికి వస్తాను జాప్యానికి తావివ్వకుండా-- నీకూ భువనేశ్ కీ మధ్య అఫైర్ ఉందన్నది వాస్తవం. అది నాకు చాలారోజులుగా తెలుసన్నది కూడా వాస్తవం”


వరూధిని క్షణం పాటు కూడా తటపటాయించకుండా తలూపింది.


“మరొకటి కూడా నాకు తెలుసు. మీ మధ్య ఉన్నది వట్టి శారీరక సంబంధం కాదన్నది కూడా నాకు తెలుసు. ఇది నాకు తెలుసన్నది నీకు తెలుసా! ”


“ఇంత లోతుగా తెలుసుకునేంత మనోశాస్త్ర పరిజ్ఞానం నాకు లేదు ప్రభా! ఐ యామ్ జస్ట్ ఎమోషనల్- అంత వరకే వాస్తవం”

“మంచిది. వయసులో యవ్వనంలో సౌందర్యంతో ఉన్నదానివి. భువనేశ్ ది మగసిరిగల వ్యక్తిత్వం. మీరిద్దరి మధ్యా ఏదో ఒక రూపంలో కెమిస్ట్రీ కుదురుతుందని నాకు తెలుసు. కాని—నాకు కావలసింది అది కాదు. ఎమోషనల్ బాండ్- దృఢమైన మానసిక భావోద్వేగ సంబందం, విడదీయనివ్వని పెవికోల్ వంటిదన్నమాట—“


ఈసారి వరూధిని విస్మయంగా చూసింది- “దాని వల్ల నీకేమి లాభం? ”


“ఔను, పైపైకి చూస్తే నాకు ఇందులో లాభం లేకపోగా నష్టమూ వాటిల్ల వచ్చు. అంతే కదా! ”


వరూధిని పలుకు లేకుండా చూడసాగింది.


“చెప్తాను. నిన్ను మరింత డైలాలామాలో ఉంచకుండా చెప్తాను. మిమ్మల్ని కలపడా నికి మీ మధ్య యెమోషనల్ బాండేజీ నెలకొనేలా చేయడానకి కారణం ఉంది. ఇందులోనే నా ధ్యేయం ఉంది. స్వార్థం ఉంది. అందుకే మనసుని చంపుకుని, నాభర్త పైన నాకున్న ప్రేమను చంపుకుని వెనుక నుంచి చక్రం తిప్పుతూ వచ్చాను.


నేనొప్పుకుంటాను నువ్వు గుణ వంతురాలివని. సౌహార్ద్రత గలదానివని. కాని—నాకు కావలసినవి ఆ గుణాంశాలు కావు. నువ్వు భువనేశ్ తో యెంతగా ఎమోషనల్ ఐపోయావంటి— నేనారోజు- అంటే నా పుట్టిన రోజప్పుడు- ఇంట్లో ఉండగానే నువ్వు అతడికి దూరంగా ఉండలేకపోయావు. ఓపలేకపోయావు. మందాకినిని వేరుగా పడుకోబట్టి భువనేశ్ తో కలిసావు. ఇద్దరూ యేక శయ్యాగతులయారు. నాకు కావలసింది కూడా అదే— నిజానికిది ఆరంభమవడం చాలా రోజులనుంచే చూస్తున్నాను. కాని— అదేమీ పట్టనట్టు మీనుండి తొలగిపోయి దూరాన నిల్చుని చూస్తూండిపోయాను.


అదెలాగని చెప్పమంటావా! గుడిలో ప్రక్కన నేనుండాగానే నువ్వు భువనేశ్ నుదుట బొట్టు పెట్టావు. అప్పుడే తేల్చుకున్నాను మీ మధ్య ఎమోష నల్ బంధం ఆరంభమైందని-- “


వరూధిని చట్టున అడ్డువచ్చింది- “నన్ను మళ్ళీ మళ్ళీ తికమక పెడ్తున్నావు ప్రభా! మా ఎమోషనల్ బాండేజి వల్ల నీకేం ప్రయోజనం? ”


ప్రభావతి షార్పుగా స్పందించింది- “షటప్ అండ్ లిషన్! కారణం ఉందన్నాగా—అది తెలుసుకో ముందు”


ఉఁ అలాగే—అని చెప్పమందామె.


“చాలా విధాలైన చికిత్సలు తీసుకున్నాను. అప్పుడప్పుడు శస్త్ర చికిత్సలు కూడా చేయించు కున్నాను. కాని—లాభం లేకపోయింది. నాకు మరొకసారి గర్భం దాల్చే అవకాశం చాలా దూరానికి వెళ్ళిపోయింది. ఇక నాకు మిగిలిన ఆశా కిరణం ఒక్కటే- నా భర్త రేతస్సు నుండి మరొక స్త్రీ అండం నుండి బిడ్డను పొందడం. ఇప్పుడర్థమైనదా! ”


ఆ మాట విని వరూధిని పక్కున నవ్వబోయి ఆగిపోయింది- “నా కడుపున మాత్రం బిడ్డ కలుగుతుందని నువ్వెలా అనుకోగలవు? అనుకోకుండా ప్రమాదవశాత్తు నాకు నెల తప్పినా భువనేశ్ బిడ్డను మోసి కనడానికి నాకు మూడ్ ఉండాలి కదా! ముఖ్యంగా ఆ అవసరం ఉన్నట్టు నాకు తోచాలి కదా! నీకు పుట్టిన కూతురు చనిపోయుండవచ్చు. ఇక బిడ్డకలిగే అవకాశం కూడా లేకపోవచ్చు, కాని—నాకు నా బంగారు కొండ మందాకిని ఉందిగా—నాకు మరొక కాన్పు యెందుకూ! “


ప్రభావతి వెంటనే బదులివ్వలేదు. మూల విరాట్టుకి అర్చకుడు అందిస్తూన్న హారతి వేపు చూస్తూండి పోయింది. అలా చూస్తూ ఉండిపోయి, కొన్ని క్షణాల తరవాత నోరు విప్పింది- “నువ్వు మాట తప్పి అబధ్ధం ఆడుతున్నావు. నువ్వు స్విట్చర్లాండుకి అంత లావు టూరు ప్రోగ్రాము వేసుకుని అదీను మందాకినిని వెంటబెట్టుకుని ఎందుకు వెళుతున్నావో నాకు తెలియద నుకున్నావా? ”


వరూధిని కళ్ళు పెద్దవి చేసుకుని బిత్తరపోయి చూడాసాగింది నోటమాట రాకుండా--


ప్రభావతి మళ్లీ అందుకుంది- “మా కుటుంబ వంశాంకురం కోసం నేనెంత వరకైనా వెళతాను. దేనికైనా తెగిస్తాను. నా భర్తను పున్నాగ నరకం నుండి తప్పిస్తాను. ఇంతటి తతంగం తెరవెనుక నుండి చేస్తూన్న దానిని నీకు కనిపించకుండానే నిన్ను వెంబడిస్తున్నానన్నది నీకదలికలను గమనిస్తున్నానన్నది విడిగా చెప్పాలా! నీ శరీరంలో పొడసూపుతూన్న మార్పుని గమనించడం లేదనుకుంటున్నావా--


నువ్వు అడపా దడపా ప్రసూతి నర్సింగ్ హోమ్ కి వెళుతున్న సంగతి నాకు తెలియదనుకుంటున్నావా— ఎందుకు అంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా వెళుతున్నావో తెలియదనుకుంటున్నావా? నేను మరొక మారు చెప్తున్నాను- బాగా విను. నా లక్ష్య సాధన కోసం నేనెంత దూరమైనా వెళతాను. మాటల గారడీ ఆపు—“


“బెదిరిస్తున్నావు. ఏమి చేస్తావేమిటి? ”

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..


------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.21 views0 comments

Comments


bottom of page