top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 21


'The Trap Episode 21' New Telugu Web Series

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

రాము న్యూజెర్సీ వెళ్లిపోయాడు.

ఇండియా వచ్చెయ్యడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు.

కామేశ్వరరావుకీ వసంతకీ— పరమేశ్వర్ కీ వినోదినికీ అమ్మవారి గుడి ప్రాంగణాన నిశ్చితార్థం జరిగింది.

వరూధినిని గుడికి రమ్మంటుంది ప్రభావతి.

సూటిగా విషయానికి వస్తుంది.

తన భర్తతో వరూధినికి ఉన్న అఫైర్ గురించి తనకు తెలుసునని చెబుతుంది.

తన భర్త ద్వారా బిడ్డను కనమని వరూధినికి చెబుతుంది.

ఇక ది ట్రాప్.. చివరి భాగం చదవండి…


“ఏమైనా చేస్తాను. నువ్వు నా భర్తతో నేను లేనప్పుడు నా గదిలో ఎన్నిసార్లు యేకాంతంగా గడిపావో సిసిటీయస్ కెమారాలో బంధించి ఉంచాను. వాటిని బట్టబయలు చేస్తాను. అడల్టరీ సెక్షన్ క్రింద కేను పెడతాను. ఇంకా ఇంకా మరేదైనా చేస్తాను. నలుగురికీ తెలిసేలా వార్త ఫ్లాష్ చేస్తాను. అప్పుడు మందాకిని గతేమవుతుందో ఆలోచించు”.


వరూధిని బదులివ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిదానంగా చూస్తూ గొణిగినట్లు అడిగింది- “మరి కోర్టులో కేసు పెడితే నీ భర్త భువనేశ్ కి మాత్రం అఫెక్ట్ కాదా? అడల్టరీలో ఇద్దరికీ భాగ ముంటుంది కదా! ”

“ఏదైనా కానియ్యి. నేను ముందే చెప్పాగా ఈ విషయంలో నేను దేనికైనా తెగిస్తానని. చెవులొగ్గి వినడం లేదా! ఇక దీనికి బదులియ్యి- భువనేశ్ నాకు కావలసిన వాడయితే-- నీకు కావలసిన వాడు కాడా— నువ్వత ణ్ణి నగుబాటుకి లోను చేసే సాహసం చేస్తావా-- ”


వరూధిని ఊపిరి తీసుకోవడానికి క్షణం పాటు ఆగి అంది--

“నువ్వు నన్ను యెమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ప్రభా! ”

“అలాగే అనుకో—నాకేమీ ఆక్షేపణ లేదు. తగిన ఆధారాలు సంపాదించి నాపైన కేసు కూడా పెట్టుకో—’

“మొత్తానికి నువ్వు నా స్నేహితురాలిగా సంభాషించడం లేదు ప్రభా! ”


“ఔను. నాకు నువ్వంటే యిష్టం. నీ స్నేహమంటే యిష్టం. కాని దీనికన్నా నాకు నా కుటుంబం ముఖ్యం. నా భర్తకు వంశాంకురం ఉండటం మరీ ముఖ్యం”.


వరూధిని కనుబొమలెగరేసి చూస్తూండిపోయింది. తన స్నేహితురాలు తనను దిగ్భంధించడానికి నిర్ణయించు కున్నదన్నది తెలుస్తూనే ఉంది. ఇక యింత దూరం వచ్చి ముంతలో యేముందని అడగడం దేనికి-- “సరే చెప్పు. నీకేమి కావాలి? ”


“చెప్తాను. ఇరువురికీ- విన్ విన్ సిట్వేషన్ గా ఉండేలా చెప్తాను. ఐతే ఒక షరతుపైన.

అదేమిటన్నట్టు కళ్ళెత్తి చూసింది వరూధిని.


“నేను చెప్పినట్టు చేయాలి. అలా చేస్తే మన స్నేహం బంధాలు చిరస్థాయిగా నిలుస్తాయి”.

ఆమె తలూపింది.

నన్ను చూసి తలూపితే చాలదు. అదిగో అక్కడున్న మూలవిరాట్టు వేపు చూసి ఔనను”.


వరూదిని అలాగే చేసింది. అప్పుడు ప్రభావతి వరూధిని చేతిని చేతులోకి తీసుకుంది. “మొదటిది- నువ్వు విదేశాలకు బయల్దేరే ముందు మందాకినిని మాకు అప్పచెప్పి వెళతావు. కొన్నాళ్ళ తరవాత అక్కడెక్కడో నువ్వు బిడ్డను కంటావు. ఆ తరవాత మరి కొన్నాళ్ళ తరవాత ఇక్కడకు వస్తావు. బిడ్డను మాకప్పగిస్తావు”


ఈసారి సూటిగా చూసింది వరూధిని. “అప్పగించకపోతే? ”

“మందాకిని మాతోనే ఉంటుంది. మరొక సుభాషిణిలా మాయింట్లో పెరిగి పెద్దదవుతుంది. ఇప్పుడు పాయింటు కి వస్తున్నాను. కడుపున పెరుగుతూన్నది నా బిడ్డా నా బిడ్డా అంటున్నావే- నిజానికి అది మాకు చెందిన బిడ్డ కాదూ! మా కుటుంబానికి చెందిన బిడ్డ కాదూ! ”


వరూధిని నోరు మెదప లేదు. తదేకంగా చూస్తూ ఓసారి తలవిదిలించి లేచి నిల్చుంది-


“కాస్తంత ఆగు వరూ! అంత తొందరేమిటి? నువ్వు వచ్చే బుధవారం విదేశీ పర్యటనకు బయల్దేరబోతున్నావు. ఔనా?”

ఆమె ఔనని తలూపింది-

“వెళ్ళడానికి ఒక రోజు ముందు నువ్వు స్వయంగా మందాకినిని మా యింట్లో దిగబెట్టి వెళతావు. ఈలోపల మన మధ్య దైవ సాన్నిధ్యంలో కుదిరిన న్యాయ ఒప్పందం గురించి భువనేశ్ కి వివరించి మానసికంగా సంసిధ్ధుణ్ణి చేస్తాలే—”


ఇక ఆ మాటను చివరిమాటగా స్వీకరించి వరూధిని ఓసారి తలవంచి గర్భగుడి వేపు చేతులు జోడించి నమస్కరించి చకచకా కదలి వెళ్ళిపోయింది. చకచకా అలా వేగంగా నడచి వెళ్ళిపోతూన్న వరూధినిని తదేకంగా చూస్తూ నిల్చుంది ప్రభావతి. మృదు మనస్కురాలైన ఆమెకు తెలుసు, తను తన స్నేహితురాలిపట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నానని. కాని- తనకు అలా చేయడం తప్ప వేరే మార్గం కనిపించ లేదు. ధర్మరాజంతటివాడు ‘అశ్వథ్థామ హత:కుంజర’ అని పలికి అత్యవసర పరిస్థితిలో కార్యం సాధించుకోవడానికి పూనుకోలేదూ!

--------------------------------------------------------------

మంగళవారం రానే వచ్చింది. భువనేశ్ ని ఎక్కడకీ కదలనివ్వకుండా తనతోనే ఉండమంది ప్రభావతి. తేల్చుకోవలసిన ఓ ముఖ్యమైన వ్యవహారం ఒకటుందని తనతోనే గడపమంది. ఆ రీతిన ప్రాణమూ ఊపిరీ అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తూ కాలు కాలిన పిల్లిలా తచ్చాడుతూ గడిపింది ప్రభావతి. మునిమాపు వేళ దగ్గరయింది. ఇక ఉగ్గబట్ట లేక పోయింది ప్రభావతి. నవ నరాలూ ఆరాటంతో జివ్వుమన సాగాయి.


వరూధిని తనతో మైండ్ గేమ్ ఆడటం లేదు కదా! ఇది జీవితమని- రెండు కుటుంబాలకు సంబంధించిన జీవన వ్యవహారమని, మాటకు మాటగా చేతకు చేతగా ఆడుకునే బిజినెస్ రంగం కానే కాదన్నది మరచి పోయిందా! ఇక జాప్యానికి తావివ్వకుండా ఫోనెత్తుకుని వరూధిని యింటికి రింగ్ చేసింది. పనిగత్తె ల్యాండ్ లైన్ అందుకుంది-


“నమస్కారం అమ్మగారూ! ” అంటూ--


అదేమీ లక్ష్యపెట్టకుండా వరూధినిని పిలవమంది--


“అయ్యోరామా! మీకు తెలియదా మేడమ్? అమ్మ గారు తాళం చెవుల గుత్తి నాకు అప్పగించి, సెక్యూరిటీ గార్డుని ఇంటిని చూసుకుంటూ ఉండమని పెద్ద పాటి టెంపోలో సామాను యెక్కించుకు ని మందాకినితో వెళ్ళి పోయిందమ్మా! ఫారిన్ వెళ్తున్నారు కదమ్మా—ముఖ్యమైన సామానుతో వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోయారేమో--”


ప్రభావతి దవడలు బిగించుకుంది. ‘బ్లడీ షిట్! బిజినెస్ మైండ్ గేమ్ చూపించింది! డర్టీ గేమ్ చూపించింది. దీనిని విడవకూడదు. ఏది యేమైతేనేమి-- తాడోపేడో తేల్చుకోవాలి’


వణకుతూన్న చేతులతో ఫోను పెట్టి భువనేశ్ ని పిలిచింది. ”రండి! బండి తీయండి!”

ఎక్కడికి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడు-

“వరూధిని మాఁవగారింటికి”

“అక్కడి కెందుకూ? వాళ్ళ మాఁవ గారి ఇంటి యెడ్రస్ నాకు తెలవదే—”

“నాకు తెలుసు! ”అని ఆమె విసురుగా మెట్లు దిగిందో లేదో ఇంటి ఆవరణ ముందు కారాగింది. దాని వెనుక టేంపో కూడా వచ్చి ఆగింది. కారులో నుంచి నవ్వుతూ దిగిన వరూధిని మందాకినిని నడిపించుకుంటూ వచ్చి భువనేశ్ చేతికి భవ్యంగా అప్పగించింది-


“ప్లజంట్ సర్పరైజ్! ఏంటిదింతా వరూధినీ? రేపు నువ్వు స్విట్చర్లాండు వెళ్ళాలన్నావుగా! ఇప్పుడేమిటి యిలా-- “


“నథింగ్ టు సర్పరైజ్—అంతా ప్రభావతి ఆలోచన ప్రకారమే జరుగుతూంది, ఇప్పుడు నాకు ఫారిన్ టూర్ గట్రా యేమీ లేదు. మిగిలిందంతా లైఫ్ టూరే ! ఇకపైన నేనూ మీ ప్రియ కూతురు మందాకినీ మీతోనే ఉంటాం. ఎన్నాళ్ళ వరకన్నది నాకు తెలియదు. మా అక్క ప్రభావతే చెప్పాలి. ఎప్పుడు వెళ్లిపొమ్మంటే అప్పుడు వెళ్ళిపోతాం. అంతవరకూ మా ఇల్లూ వాకిలీ ఇదే— ఇక పైన నా జీవన మనుగడంతా ఇక్కడే మీ పంచనే—’


ప్రభావతి మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూస్తూ నిల్చుంది. భువనేశ్ అర్థ రహితంగా అగమ్యగోచరంగా చూపులు సారిస్తూ నిల్చున్నాడు. ఇంతకీ ఇప్పుడేమి జరుగుతూంది! ఇకపైన యేమి జరగబోతూంది! మందాకిని సంతోషంతో భువనేశ్ ని వాటేసుకుని యేవో చిట్టిపొట్టి కబుర్లు చెప్తూంది. టెంపోనుండి హమాలీలు వరూధినికి సంబంధించిన సామాను దింప నారంభించారు. వరూధిని నిదానంగా నడచకుంటూ వచ్చి ప్రభావతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది— ఇప్పుడామె పెదవులు కావు; కళ్ళు చెప్తున్నాయి- ”ట్రాప్ చేయడం నీకే కాదు. నాకూ వచ్చు ప్రభా! ”


ప్రభావతి అప్పుడప్పుడే ఆరంభమైన చినుకుల్లో తడుస్తూ కదలిక లేకుండా అలాగే నిల్చుంది మాటా పలుకూ లేకుండా--


***సమాప్తం***


ది ట్రాప్ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత పాండ్రంకి సుబ్రమణి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Linkమనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.


94 views0 comments

Commenti


bottom of page