వాన కురిసిన రాత్రి
హాస్యకథ, తెలుగు హాస్యకథలు, కుటుంబ కథ, భార్యాభర్తలు, వామనరావు, సుభద్ర, పనసపండు, వాన, వినోదం, నవ్వుల కథ, తెలుగు కథలు, మనతెలుగుకథలు Mana Telugu Kathalu

Vana Kurisina Rathri - Telugu Family Comedy Story | Jeedigunta Srinivasa Rao
వాన కురిసిన రాత్రి - తెలుగు కుటుంబ హాస్య కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 25/07/2026
"దొంగలు వచ్చారని బయటకు వెళ్లాడు... పనసపండు కొట్టేసింది... డాక్టర్ కూడా షాక్ అయ్యాడు... చివరికి కాలనీలోని మగాళ్లంతా ఆ పనసచెట్టు కింద క్యూ కట్టారు! ఎందుకో తెలుసా?"
శ్రీనివాసరావు జీడిగుంట గారి వాన కురిసిన రాత్రి కథను చదవండి.
"అబ్బబ్బా ఏం ఎండలు అండీ, ఏసీ వేసుకుంటే పేలిపోతున్నాయి అంటున్నారు, ఫ్యాన్ గాలి చాలడం లేదు. దానికి తోడు ఉదయం వేసుకున్న చొక్కా చెమటలు పట్టివున్నా మార్చుకోకుండా పడుకుంటారు, నాకు నిద్రకూడా పట్టడం లేదు" అంది సుభద్ర చిరాకుగా భర్త వామనరావుతో.
"ఎండాకాలం ఎండాలని, వానాకాలం వానలని, చలికాలం చలిగా ఉంది అని తిట్టిపోయడమే నీ పని. సంతృప్తి లేదు జీవితంలో నీకు" అన్నాడు పడకగదిలోకి వెళ్తూ.
"ఆగండి, ముందు చొక్కా మార్చుకుని రండి. ఎవరి కంపు వాళ్ళకి ఇంపో? లేకపోతే మీ చెవులతోపాటు ముక్కు కూడా పనిచేయడం లేదో!" అంది.
"కొద్దిగా ఫ్యాన్ స్పీడ్ పెంచుతావా, గాలి రావడం లేదు" అన్నాడు వామనరావు భార్యతో.
"ఫుల్ స్పీడ్‌లో ఉంది, ఇంకా తిప్పితే ఫ్యాన్ ఆగిపోతుందేమో. మాట్లాడకుండా పడుకోండి, కాసేపట్లో కిటికీ నుంచి చల్లగాలి వస్తుంది" అంది సుభద్ర.
"అబ్బా! ఇప్పుడెవరో ఫోన్ చేస్తున్నారు, మీ ఫోనే" అంది.
"ఫోన్ ముందు గదిలో పెట్టానే, వెళ్లి తీసుకుని రా. నేను ఇప్పుడు లేచి వెళ్ళలేను" అన్నాడు.
"ఒక్కపని సరిగ్గా చెయ్యరు. ఫోన్ మీ దగ్గర పెట్టుకోక, ముందు గదిలో పెట్టటం... నన్ను లేచి తీసుకుని రమ్మంటే నాకు మాత్రం ఓపిక ఉండాలిగా!" అంటూ ఉండగా ఫోన్ మ్రోగడం ఆగిపోయింది.
'అమ్మయ్య' అనుకోగానే మళ్ళీ మ్రోగడం విని, విసుగ్గా లేచి ముందు గదిలోకి వెళ్లి ఫోన్ తీసుకుని, "ఇదిగో నీ సుపుత్రుడే" అంటూ, "ఆ చెప్పరా అబ్బాయి, ఏమైనా తిన్నావా?" అని అడిగాడు.
"తిన్నాను. మీరు అప్పుడే పడుకున్నారా? ఫోన్ చేస్తే తీయారు" అన్నాడు చరణ్.
కొడుకు ఫోన్ అనగానే మంచం మీద నుంచి లేచి పరుగున ముందు గదిలోకి వచ్చి, భర్త చేతిలోనుంచి ఫోన్ లాక్కొని, "ఎలా ఉన్నావురా? ఉదయం నుంచి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను" అంది సుభద్ర తన కొడుకుతో.
"ఇప్పుడేగా ఓపిక లేదన్నావు, కొడుకు ఫోన్ అంటే చాలు ఎక్కడలేని ఓపిక వచ్చేస్తుంది" అన్నాడు వామనరావు.
"ఒరేయ్! మీ నాన్న సాధింపులతో చచ్చిపోతున్నానురా. రిటైర్ అయిన తరువాత చాదస్తం ఎక్కువైంది. దానికి తోడు ఎవ్వరు ఫోన్ చేసినా 'డి.ఏ' ఎప్పుడు ఇస్తారు అని అడగటం, బ్యాంకుకు వెళ్లి డబ్బు తెమ్మంటే చెప్పిన వారంకి గాని వెళ్లరు. ఈలోపు పనిమనిషికి నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తాను అని ఆయన ఆలోచన" అంది.
"అబ్బా! ఏమిటమ్మా రాత్రి కూడా నాకు ఈ గొడవ? బాగానే ఉన్నారుగా, ఇక పడుకో. రేపు మళ్ళీ చేస్తాను" అన్నాడు కొడుకు చరణ్.
"ఏం పడుకోమంటావ్? పరుపు పెనంలా వేడిగా ఉంది. ఏసీ వెయ్యండి అంటే 'పేపర్లో వచ్చింది, ఏసీ పేలిపోయి దంపతులు మరణం' అని అంటూ ఏసీ వెయ్యడం లేదు మీ నాన్న. నాకు రిమోట్ దొరకనివ్వడం లేదు" అంది.
"ఎలా ఉన్నారు అని అడుగుదాం అని ఫోన్ చేస్తే, ఎప్పుడూ మీ గొడవ వినాల్సి వస్తోంది" అని విసుక్కున్నాడు చరణ్.
అర్ధరాత్రి విపరీతంగా వర్షం పడటం మొదలైంది. మెలుకువ వచ్చిన వామనరావు, "ఇదిగో సుభద్రా! కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి, లేచి కిటికీ మూసేసి రా" అన్నాడు పక్కకి తిరిగి.
"మీరు ఎలాగో మెలుకువగా ఉన్నారుగా! లేచి ఆ పని మీరే చెయ్యకుండా, నిద్రపోతున్న నన్ను లేపటం... మీరు నన్ను రాసిరంపాన పెడుతున్నారు అనటం నిజమే కదా!" అంటూ లేచి వెళ్లి కిటికీ తలుపులు వేసి వచ్చి పడుకుంది.
"ఏమిటి, ఇంకా చప్పుడు అవుతోంది" అంది సుభద్ర భర్తతో.
"అవును, కిటికీ సరిగ్గా మూసావా?" అన్నాడు వామనరావు.
"చప్పుడు మెయిన్ డోర్ నుంచి వస్తోంది. అర్ధరాత్రి ఎవ్వరు వస్తారు మన ఇంటికి? కొంపదీసి దొంగలు కాదు కదా!" అంది సుభద్ర.
"కాలనీలో సెక్యూరిటీ ఉంటే దొంగలు ఎలా వస్తారే" అంటూ లేచాడు.
"ఎక్కడికి లేచారు? వెళ్లి తలుపు తీద్దామనే? చాలు పడుకోండి, ఏ దొంగో అయితే తల పగలగొడతాడు" అంది సుభద్ర.
"నోర్ముసుకో! నేను సైన్యంలో పనిచేసిన వాడిని, నాకు భయం అంటగట్టకు" అంటూ చేతిలో టార్చిలైట్, హ్యాండ్ స్టిక్ పట్టుకుని మెయిన్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు.
కారు చీకటి, 'కరెంటు పోయినట్టుంది' అనుకుంటూ టార్చిలైట్ వేసి, "ఎవ్వరూ!" అంటూ అరుస్తూ నాలుగు వైపులా చూసి, ఎవ్వరూ లేరే అనుకుంటూ గేట్ తీసి బయటకు వచ్చాడు.
అంతే, నెత్తిన పిడుగులాంటి దెబ్బ పడింది. చేతిలో టార్చిలైట్‌తోపాటు వామనరావు కూడా కిందకి ఒరిగిపోయాడు.
నిద్ర మత్తులో ఉన్న సుభద్రకి భర్త కేక వినగానే కంగారు పడుతూ లేచి, "బాబోయ్! దొంగలు, దొంగలు! మా ఆయనని కొట్టేసారు!" అంటూ అట్లకాడ పట్టుకుని బయటకు వచ్చింది. ఆవిడతోపాటు కరెంటు కూడా వచ్చి, పార్కింగ్ ఏరియా వెలుగుతో నిండిపోయింది.
గేట్ దగ్గర పడిపోయి ఉన్న వామనరావు, ఆయన తల దగ్గర పెద్ద పనసపండుని చూసి, "పనస చెట్టు కిందకి ఎందుకు వెళ్ళారాండీ!" అంటూ అరుస్తూ, సెక్యూరిటీని పిలిచింది.
సుభద్ర అరుపులకి ఇరువైపులా ఉన్న ఇరుగుపొరుగు వాళ్ళు లేచి, "అయ్యో అంకుల్ కి ఏమైంది? అదేమిటి.. అర్ధరాత్రి పనసపండు కొయ్యటం ఎందుకు?" అని ప్రశ్నలు.
"పనసపండు కొయ్యలేదు" అంటూ జరిగిన సంగతి చెప్పింది.
"అయ్యో! ముందు మా కారులో హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం. అందుకే మా ఆవిడ మిమ్మల్ని ఒక పనసపండు ఇమ్మంటే పడిన తరువాత ఇస్తామన్నారు. ఆ నాడే కోసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు" అన్నాడు పక్కింటి ఆయన.
స్పృహ లేకుండా ఉన్న వామనరావుని చూసి డాక్టర్, "ఇదే, నా మొదటి అనుభవం, పనసపండు తలమీద పడిన కేసు చూడటం" అంటూ, “తలంతా జల్లెడలా అయిపోయింది” అని అటెండెంట్‌తో చెప్పి, వామనరావుకి గుండు చేయించి, "పెద్దగా ప్రమాదం లేదు, పనసపండు గుచ్చుకుని తలకి చిల్లులు పడింది. ఆంటిబయోటిక్, ఆయింట్మెంట్ ఇస్తాను, రోజూ తలకి ఆయింట్మెంట్ రాయండి" అన్నాడు.
"మరి మా ఆయనకి స్పృహ ఎలా?" అంది సుభద్ర.
డాక్టర్ ఒక్కసారి నవ్వి, "ఏమిటి మీ ఆయన మిలిటరీలో వంటలు చేసేవాడా? నిన్న రాయక్కరలేదా అమ్మా అప్లికేషన్లో" అన్నాడు.
"ఎవ్వడురా నేను వంటవాడిని అన్నదీ.. నేను సైన్యంలో అధికారిగా చేశాను" అంటూ కళ్ళు తెరిచాడు.
"ఏం అధికారో ఏమిటో, పనసపండుకే ఇంత గొడవ చేశారు. పదండి ఇంటికి" అంది సుభద్ర.
“వంట పనితో పాటు ఈ తలకి ఆయింట్మెంట్ రాసే పనికూడా నాకే పడింది. ఆయింట్మెంట్ మీరు రాసుకోలేరా?" అంది వామనరావు తలకి ఆయింట్మెంట్ రాస్తూ సుభద్ర.
"ఉన్న నాలుగు వెంట్రుకలు తీయించి నా అందం చెడగొట్టావు, కాబట్టి నీకు ఈ సేవ తప్పదు" అన్నాడు వామనరావు.
పదిరోజుల తరువాత బెడ్‌రూమ్ లో నుంచి గట్టిగా కేక పెడుతున్న భర్త అరుపులు విని పరుగున వెళ్లింది, "ఏమైంది?" అంటూ.
"నాలో నీకు ఏమైనా తేడా కనిపిస్తోందా?" అన్నాడు.
"ఆ, బాగా కనిపిస్తోంది! మీ పిచ్చ అరుపులు, పిచ్చ చేష్టలు. ఎందుకైనా మంచిది, ఒకసారి బ్రెయిన్ కి స్కాన్ చేయించుకోండి, పనసపండు కుళ్ళినట్టు బ్రెయిన్ కుళ్ళిపోతోందేమో" అంది విసుగ్గా.
"ఛీ, నోర్ముయ్! ఈ ఇంట్లో ఒక సరదా లేదు. ఎప్పుడూ విపరీత అర్ధాలు తీయడమే. ఇటు చూడు, ఇప్పుడు నా తల మీద జుట్టు ఒత్తుగా రావడం గమనించు. బహుశా పనసపండు గుచ్చుకుని హెయిర్ బడ్స్ తెరుచుకుని జుట్టు రావడం మొదలైంది అనుకుంటా" అన్నాడు వామనరావు.
"తల నల్లగా ఉండటం కనిపిస్తోంది, అది జుట్టు రావడమా లేకపోతే తల దెబ్బతిని కుళ్ళిపోతోందేమో చూడనివ్వండి" అంది సుభద్ర.
"కొద్దిగా తల వంచండి చూస్తాను" అనగానే, "పెళ్ళాం ముందు తలవంచడం మా ఇంటా వంటా లేదు. కావాలి అంటే మంచం మీద కూర్చుంటాను, నీ అనుమానం తీర్చుకో. అయినా నాకు జుట్టు వస్తోంది అంటే నీకు ఏడుపు!" అన్నాడు.
"నిజమేనండి, జుట్టు వస్తోంది. ఆదివరకు రెండు మూడు వెంట్రుకలు ఉండేవి, ఇప్పుడు తల బొగ్గుల కుంపటిలా ఉంది" అంది.
వామనరావు బజార్ వెళ్లి రకరకాల హెయిర్ ఆయిల్స్ కొని తెచ్చుకుని ఉదయం రాత్రి రాసుకోవడం మొదలు పెట్టాడు. "మీ జుట్టు నా ప్రాణం మీదకి వచ్చింది, అడ్డమైన నూనెలు రాసుకుని తల దిండు గలేబులు పాడుచేస్తున్నారు" అని సుభద్ర గొడవ పెడుతున్నా వినలేదు.
"అదేమిటే, కాలనీలో మగాళ్లు అందరూ మన పనస చెట్టు క్రింద నుంచున్నారు" అన్నాడు భార్య సుభద్రతో.
ముసిముసి నవ్వులు నవ్వుతూ, "నేనే మొన్న మహిళా మండలిలో, 'మీకు పనసపండు తలమీద పడటంతో హెయిర్ బడ్స్ తెరుచుకొని ఇప్పుడు జుట్టు జడ వేసుకునేలా పెరిగింది' అని చెప్పాను. బహుశా అందుకే పనస చెట్టు క్రింద నుంచున్నారు అనుకుంటా" అంది.
వెర్రి నానా రకాలు.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
















@Adilaxmi-i2e
• 21 minutes ago
Chala bagundi