top of page

అత్తగారి ఏడురాళ్ల దుద్దులు


'Athagari Eduralla Duddulu' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త


“అమ్మాయ్, కాత్యాయనీ ! “


“ఆ... వస్తున్నాను అత్తయ్యా! ఎందుకు పిలిచారు ?”


“నా చెవి దుద్దులు బరువైపోయి చెవి కన్నాలు పెద్దవై సాగిపోతున్నాయి . నేను వాటిని పెట్టుకోలేక నా పెట్టెలో అలా పడేసి ఉంచాను . మీరు ఇవాళ మన పాపకు పెళ్లి నగలు ఏవో కొనాలని బంగారు షాపుకు వెడతామని చెప్పారుకదా !”


“అవును అత్తయ్యగారూ !”


“నా ఈ తెల్ల రాళ్ల దుద్దులు మార్చేసి ఏమైనా తేలికవి బంగారంలో తీసుకోగలవా?”


“అత్తయ్యా, ఈ తెల్ల రాళ్ల దుద్దులు మార్చేయమంటారా ? మీ అత్తగారి అత్తగారి నుండి సాంప్రదాయంగా వచ్చినవని చెపుతూ ఉంటారు కదా, మార్చేస్తే పరవాలేదా మరి ?”


“ఫరవాలేదులే కాత్యాయినీ. వాటిని పెట్టుకోలేక పోతున్నాను.. ఎప్పడివో పాతవి.. అసలు ఏదేనా ధర పలుకుతుందో లేదో కూడాను ! పోనీ నా కోడలిగా నీకిస్తే నీవు పెట్టుకుంటావా చెప్పు.. నీ కసలే నచ్చవు .. అలా పడేస్తావు .. రాళ్లకు రేటు తీసేసినా కాస్త బంగారం ఉంటుంది కదా, చాలా బరువుగా కూడా ఉన్నాయి. ఎంత బంగారం ఉంటే ఆ బరువుకు తగ్గ చెవి దుద్దులు తీసుకోమ్మా” అనగానే కాత్యాయిని సరే నంటూ తీసుకుని, వాటిని బ్రష్ తో శుభ్రం చేసింది. తళ తళ లాడుతున్నాయి. మరీ నాసిరకం రాళ్లుకాదు, నయమే. దగ్గరగా 200 సంవత్సరాల క్రితంవి అయినా ఫరవాలేదనిపించి హేండ్ బాగ్ లో పెట్టుకుంది .


సరస్వతమ్మగారి మనవరాలు శ్రీదేవి కి పెళ్లి నగలు కొనాలని అనుకుంటున్నారు.

సరస్వతమ్మగారి అత్తగారికి అత్తగారు కుటుంబం జమిందారులే ఆ రోజుల్లో. ఏడువారాల నగలు , బోల్డంత వెండి సామాన్లూ ఉండేవిట. ఆ అత్తగారి భర్తగారు బంగారపు కంచంలో భోజనం చేసేవారుట.. అవి కూడా ఆవిడ అత్తగారి నుండి తర తరాలుగా వచ్చినవే అని సరస్వతమ్మగారు కధలు కధలుగా పిల్లలకు చెపుతూ ఉండేవారు .


ఇంట్లో మిగతా అందరూ వెండి కంచాల్లోనే భోజనం చేసేవారుట . ఇంట్లో వెండిగ్లాసులూ, సామాన్లూ అలా విచ్చలి విడిగా పడేస్తూ ఉండేవారుట. కొంతరాలానికి ఆవిడ ఉండగానే బంగారు నగలకు, వెండి సామాన్లకు నెమ్మదిగా కాళ్లూ, చేతులూ వచ్చీ బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయాయిట. ఉమ్మడి కుటుంబాలు, ఉద్యోగాలు చేయకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తింటుంటే కొండలు కూడా కరిపోతాయన్న సామెత వారి పట్ల నిజమైంది. జమీందార్లుగా పేరు పొందిన వంశం, సరస్వతమ్మగారి హయం వచ్చేసరికి వంద ఎకరాల పొలం, తోటలూ గుర్తు లేకుండా మాయమయ్యి " ఉండేవిట " అని చెప్పుకునే స్తాయికి వచ్చారు !

సరస్వతమ్మగారి భర్త పరంధామయ్యగారు తాలూకాఫీస్ లో గుమాస్తాగా చేసి ఉన్న ఒక్కగానొక్క కొడుకుని డిగ్రీ వరకు చదివించి ఏదో బ్రతుకు తెరువు చూపీంచారు. ఏ ఆస్తీ సంపాదించలేదు ఆయన . కానీ ఎలాగోలాగ కష్టపడి ఒక రెండువందల గజాల స్తలం కొనుక్కుని అందులో చిన్న ఇల్లు కట్టుకోగలిగాడు. కొడుకు రైల్వే లో ఉద్యోగం వచ్చి స్తిరపడ్డాడు. తరువాత కొడుకు కి పెళ్లి అవడం ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది !

మనవరాలు ఇంటర్ మీడియట్ లో ఉండగా ఆయన పోయారు. ఆయన కొడుకు విశ్వనాధ్ కూతురిని బి. కామ్ చదివించి ఏదో కంప్యూటర్ కోర్సులు చేయించాడు. ఇంకో కొడుకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు .

సరస్వతమ్మగారి మనవరాలైన శ్రీదేవి నిజానికి బంగారపు బొమ్మే ! " వారిది జమీందారీ వంశమే సుమా, ఎక్కడకు పోతుంది ఆ రాజసం, ఠీవి " అన్నట్లుగానే ఆ అమ్మాయి పచ్చగా, మెరిసిపోతూ ఉంటుంది . ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్న పాలమీగడ మెరుపుతో ఉంటుంది . ఆ అమ్మాయి కళ్లల్లో ఒకరకమైన వెలుగు . నెమ్మదిగా, సౌమ్యంగా ఉండే ఆ ఆ అమ్మాయిని చూసినవారందరూ " ఇటువంటి ఆడపిల్ల ఉన్నందుకు ఆ తల్లితండ్రులు ఎంతటి అదృష్టవంతులో అనుకుంటారు..


ఎంతటి అదృష్టవంతురాలు కాకపోతే, ఆ అమ్మాయిని " ఒక చక్కని సంబంధం వెతుక్కుంటూ వస్తుంది ?"

వీరికి దూరపు బంధువులైన ఒకరికి వీరి గురించి తెలిసిందిట. అమ్మాయి బంగారపు బొమ్మ, మంచి కుటుంబం అని తెలిసి వీరిని వెతుక్కుంటూ వచ్చారు. అబ్బాయి పూనేలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు . అబ్బాయి తల్లీ తండ్రీ కూడా సెంట్రల్ గవర్న్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మాయిని చూసి, ఏ కట్న కానుకలూ వద్దని పెళ్లికి మూహూర్తం పెట్టుకున్నారు .

శ్రీదేవికి అంతవరకూ ఏ నగలూ చేయించలేదు, ఒక్క గొలుసు తప్ప . అప్పుడే పెళ్లిచేద్దామని అనుకోలేదు కూడా . కాని అదృష్టం తలుపుతట్టింది . ఉన్న కాస్త సేవింగ్ తీసేసి, పి. ఎఫ్ . లోన్ పెట్టి, మరికాస్త డబ్బు, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని ఎలాగో అలాగ పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లకు ఏమీ పెట్టకుండా పంపడం ఏమిటని సరస్వతమ్మగారు సణుగుతూనే ఉన్నారు .. ఎంత బంగారం, ఎంత ఆస్తి . తన అత్తగారి హయాం లో హారతి కర్పూరంలా కరగిపోయిందని ఒకటే బాధపడడం.. ఇప్పుడు బంగారం కొనాలంటే మాటలా అని ఆవిడ నిట్టూర్పులు . మంగళ సూత్రం గొలుసూ, నల్లపూసల గొలుసూ అత్తవారు పెడ్తామన్నారు. అమ్మాయి చేతికి రెండుగాజులు, ఒక నెక్లస్ అయినా కొనాలని అనుకున్నారు.

కాత్యాయని అత్తగారికి భోజనం వడ్డించి తను కూడా తినడం పూర్తి అయ్యాక తయారయి బంగారపు షాపుకి బయలదేరింది కూతురిని తీసుకుని, విశ్వనాధ్ తను రాలేనని ఆఫీస్ లో ఇనస్పెక్షన్ ఉందని చెప్పాడు..

అత్తగారి రాళ్ల దుద్దులను తీసి తన బేగ్ లో పెట్టుకుంది..

కాత్యాయినిని సరస్వతమ్మగారు దగ్గరకు పిలుస్తూ " నాకు కొనే దుద్దులపైన ఏమీ అదనంగా పెట్టకు తల్లీ " వచ్చినదాన్లోనే ఎంతొస్తే అంత కొనమని మరీ మరీ చెప్పింది.

ఆవిడ బాధ ఆవిడది. మనవరాలి పెళ్లి ఖర్చులకు డబ్బు సరిపోదేమోనని. అత్తగారి ఛాదస్తానికి నవ్వుకుంది కాత్యాయని !


కూతురికి కొనాలనుకున్న నగలను సెలక్ట్ చేసుకున్నాక, అత్తగారిచ్చిన రాళ్ల దుద్దులను ఆ షాప్ అతనికి ఇచ్చి వీటిని మార్చేయాలనుకున్నట్లు చెప్పింది. .

అతను ప్యూరిటీ ని చెక్ చేసి చెపుతానని తీసుకుని వెళ్లి రెండు నిమిషాలలో తమరిని మా మేనేజర్ రమ్మంటున్నారంటే, కొంపతీసి నకిలీ దుద్దులు కాదుకదా అనుకుంటూ అతని దగ్గరకు వెళ్లగానే కూర్చోమని కుర్చీ చూపించి, అక్కడ హెల్పర్ తో చెప్పి కూల్ డ్రింక్ తెమ్మనమని పురమాయించాడు.

నెమ్మదిగా అడిగాడు, ఆ దుద్దులని ఎందుకు మారుస్తున్నారు మేడమ్ అని.

కాత్యాయని నిజం చెప్పేసింది. అవి ఎప్పటినాటి దుద్దులో అంటూ మా అత్తగారివని, బరువైపోయి ఆవిడ ఇబ్బంది పడుతున్నారని, మార్చి మరోటి తీసుకోవాలుకున్నట్లుగా........

“ఏమైందండీ, వీటికి ఏమీ రావా” అని అనుమానంగా అడిగింది ? రాళ్ల కి ఏమీ రాకపోయినా, బంగారం ఎంతుందో చూసి చెపితే ఆ బరువులో తేలికైనవి తీసుకుంటానని..

అతను నవ్వి, “ఎందుకు రావు, మేడమ్, ఎందుకో నాకు అనుమానం కలిగి మా జెమాలజిస్ట్ కి చూపిస్తే అతను పరీక్షించి అవి మేలిమి వజ్రాల దుద్దులని, నాణ్యత కలిగిన కేరెట్ తో కూడుకున్నాయని చెప్పాడు. విలువ కూడా బాగానే ఉంటుంది. పైగా ఏడురాళ్ల దుద్దులు. తర తరాలుగా వస్తున్నవి . విలువ కట్టి మీకు సర్టిఫికెట్ ఇస్తాడు. మీరు అమ్మకపోయినా పరవాలేదు. అమ్మినా, మీకు ఒరిజినల్ బిల్ వేసి నేటి మార్కెట్ రేట్ ప్రకారం మీ ధర మీకు న్యాయబధ్దంగా ఇస్తా”మని చెపుతుండగా ఆ జెమాలజిస్ట్ వచ్చి మేనేజర్ తో నెమ్మదిగా ఏదో చెప్పడం, ఆ మేనేజర్,”మేడమ్, వేల్యు యేషన్ చేస్తే వీటి విలువ పదిహేను పదహారు లక్షల దాకా వస్తుందిటమ్మా” అని చెప్పేసరికి కాత్యాయని ఆశ్చర్యపోయింది.

ఇంట్లో వాళ్లతో సంప్రదించి మళ్లా వస్తానని తనుకొన్న బంగారు నగలకు బిల్ పే చేసి ఇంటికి వచ్చారు .

కాత్యాయిని ఆ ఆనందాన్ని దాచుకోలేకపోతోంది . అత్తయ్యకు, తన భర్తకు ఈ విషయాన్ని ఎప్పుడెప్పుడు చెప్పేయాలా అని గాలిలో తేలిపోతూ వచ్చిందింటికి ..

విశ్వనాధ్ ఆఫీస్ నుండి అప్పుడే వచ్చినట్లున్నాడు. ఇంట్లోకి రాగానే కాత్యాయని భర్తను, అత్తగారిని హడావుడిగా పిలిచింది.

కొన్న నగలు చూపించడానికేమో అనుకుంటూ ఇద్దరూ వచ్చారు ముందు నగలు చూపించకుండా ఆ డైమండ్ దుద్దులను బయటకు తీసి, వాటి వేల్యుయేషన్ సర్టి ఫికెట్ ను కూడా బేగ్ లో నుండి తీసి అత్తగారి చేతులు పట్టుకుని ఊపేసింది.

భర్త చేతులు పట్టుకుని గిర గిరా తిరుగుతూ ఆ డైమండ్ దుద్దుల గురించి గబ గబా చెప్పేస్తూ, సర్టిఫికెట్ చూపించింది అత్తగారి కళ్లల్లో వజ్రాల మెరుపులు .

ఆ దుద్దులని పెట్టుకోకుండా ఆవిడ తన పెట్టెలో ఒక మూలకు నెట్టేసింది ఇన్నాళ్లూ ! వాటిని చేతుల్లోకి తీసుకుని చూసింది . ఆ జెమాలజిస్ట్ వాటిని దేనితోనో క్లీన్ చేసినట్లున్నాడు. ధగ ధగా మెరిసిపోతున్నాయి . ‘చూసావా? ఇన్నాళ్లూ నన్ను నకిలీ రాళ్లనుకుని నన్ను నిర్లక్యం చేసావుకదూ? మెరిసేవన్నీ వజ్రాలు కావు, మెరవలేనివి కూడా వజ్రాలు కాకమానవు’ అంటూ పరిహసించినట్లు అన్పించిం దావిడకు.

సరస్వతమ్మగారు రెండు క్షణాలు పోయాక మెల్లిగా, " బాబూ విశ్వం, ఇది మన పాప అదృష్టంగా భావిస్తున్నాను . " ! ఆ వజ్రాల దుద్దులతో నాకేమి పని ? నాతో తీసుకుపోలేనుకదా ?

అలా అనగానే కాత్యాయిని “అత్తయ్యా! అవి తర తరాలుగా వస్తున్నాయి. మార్చేయమంటారేమిటి ?” అంది.


అవసరానికి ఉపయోగించని డబ్బు లెందుకు కాత్యాయినీ ? మరో కొన్నాళ్లకు నేను పోయాకా వాటి ధర మరింత పెరుగుతుందనా ? నీ కూతురు పెళ్లికి డబ్బు సరిపోక , అప్పుచేస్తూ , ఆ అప్పు తీర్చుకుంటూ, ఎందుకు హైరాన పడతారు ? ఆ దుద్దులను అమ్మేద్దాం. ఒక మంచి శుభకార్యానికి డబ్బు అక్కరకువచ్చిందన్న తృప్తి దేనిముందూ సాటిరాదు . అప్పులేకుండా మన పాప పెళ్లి చేద్దాం.

ఒరేయ్ విశ్వం, " కాత్యాయినిని చూడు, పాపం వంటిమీద బంగారం లేదు మెడలో ఆ సూత్రం గొలుసు తప్ప " . కాత్యాయినికి గాజులు, మెడలో నల్లపూసలూ , ఇంక ఏమి కావాలనుకుందో అవన్నీ కొను. అలాగే శ్రీదేవికి కూడా మరో గాజుల జత తీసుకోండి.. బంగారం ఎప్పుడూ వృధాకాదు.. పెళ్లికొడుక్కి బంగారపు ఉంగరం, ఒక వెండికంచం , గ్లాసు ఇస్తే గౌరవంగా ఉంటుంది.. పెళ్లి ఉన్నంతలో ఘనంగా చేద్దాం. నీవు పెళ్లికని తెచ్చిన డబ్బుని తిరిగి నీ మిత్రులకు ఇచ్చేయి రా విశ్వం. అప్పు ఉంటే బెంగగా గుండెమీద బరువులా అనిపిస్తుందెపుడూ . ఆస్తులు సంపాదించలేకపోయినా ఫరవాలేదుకానీ, అప్పులు ఉంచుకోకూడదు. మిగతా డబ్బు ఉంటే బేంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకో.. పిల్లలతో ఉన్నావు.. ఏ అవసరానికైనా ఉంటుంది..

అత్తగారి సౌహార్ధ హృదయానికి కాత్యాయిని మనసు అర్ధ్ర మైంది.. ఆవిడపట్ల గౌరవభావం మరింత ఇనుమడించింది.

ఈలోగా ఆవిడ మనవరాలు శ్రీదేవి ' బామ్మా మరి నీకు బంగారు దుద్దులు వద్దా ' ? మరిచిపోయావాఅంటూ బామ్మ మెడచుట్టూ చేతులేస్తూ గారంగా అనేసరికి అందరూ ఫక్కున నవ్వారు . అయ్యో బామ్మ కి కొన్నాకనే మీ అమ్మకు,నీకూనంటూ విశ్వం మురిపంగా కూతురివైపు చూస్తూ జవాబిచ్చాడు..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


79 views0 comments

Comments


bottom of page