top of page

ఇది కధకాదు జీవితం

'Idi Kathakadu Jivitham' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త


కోటీశ్వరుడు నాగేంద్ర భూపతి చిన్నకూతురు వైదేహి నిశ్చితార్ధానికి భారీ ఎత్తున ఏర్పాటులు జరిపించాడు .. ఆ అమ్మాయికి కి కాబోయే భర్త వైజాగ్ లోని ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శనరావుగారి ఏకైక పుత్రుడు వంశీకృష్ణ ! ఐఐమ్ కలకత్తాలో మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్ మెంట్ చేసిన వంశీకృష్ణ ముంబాయిలో వెల్సపన్ ఇండియాలో రెండు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి, చివరకు తండ్రి బిజినెస్ ను చూసుకుందామని వైజాగ్ వచ్చి తండ్రి బిజినెస్ ను డెవలప్ చేస్తున్నాడు ! వైదేహి ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ పూర్తిచేసింది.. ఆమెకు స్టేట్స్ వెళ్లి చదువుకోవాలన్న కోరికను నాగేంద్ర భూపతి సాగనివ్వక చదువు ముగియగానే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టడం, పెళ్లి కుదరడం అన్నీ చక చకా జరిగిపోయాయి ! ఆయన భయం ఆయనిది.. చిన్న కూతురు వైదేహి కూడా పెద్దకూతురు వైజయంతి లాగ, ప్రేమ వివాహం అంటూ ఏ అనామకుడినో ప్రేమించి వెళ్లి చేసేసుకుంటుందేమోనన్న భయం !


ఆయన అనుకున్నట్లుగా చిన్నకూతురి నిశ్చితార్ఘం ఒక పెళ్లిలాగానే అంగరంగ వైభవంగా జరిపించాడు.. ఒక నెలరోజుల్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు ! నిశ్చితార్ధానికి నాగేంద్రభూపతి తన బంధువులందర్నీ ఆహ్వానించాడు.. భూపతి చాలా సంతోషంగా ఉన్నాడు.. పెద్దకూతురు వైజయంతి తననుండి దూరంగా వెళ్లిపోయి పదిసంవత్సాలు అయిపోయింది.. ఎక్కడుందో ఏమైందో కూడా తెలియదు, తెలుసుకోవాలన్న కుతూహలం గానీ, ఇష్టం గాని లేవు ఆయన లో.. పెద్దకూతురు ఆయన దృష్టిలో చనిపోయినట్లే. .. పెద్ద కూతురు పుట్టిన పదిసంవత్సరాలకు గానీ మళ్లీ పిల్లలు కలగలేదు ఆయనకు.. వైజయంతిని చాలా గారాబంగా పెంచుకున్నారు భూపతి దంపతులు.. వైజూ పుట్టిన పదిసంవత్సరాలకు కవల పిల్లలు పుట్టారు భూపతి భార్యకు.. ఇద్దరూ ఆడపిల్లలే..వైదేహి, వైష్ణవి !


ఆ తరువాత మూడు సంవత్సరాలకు ఆ జమిందారుకు ఒక వారసుడు పుట్టాడు . వాడిపేరు వైభవ్ ! మామూలుగానే ఐశ్వర్య వంతుడైన భూపతి, పెద్దకూతురు ' వైజూ' పుట్టాకా ఆయన వ్యాపారం కోట్లకు పడగలెత్తింది.. ఇదంతా వైజూ పుట్టిన వేళా విశేషమే అనుకుంటూ పిల్లల పేర్లు అన్నీ ' వై' అక్షరం మీద వచ్చేటట్లు పెట్టుకున్నాడు ! చిన్నకూతురు వైదేహి బుధ్దిగా ఆయన తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటాననడంతో భూపతికి చాలా సంతోషంగానూ గర్వంగా కూడా ఉంది.. బంధువులతో, స్నేహితులతో చాలా ఆనందంగా కబుర్లాడుతూ, చలోక్తులు విసురుతూ అందరూ భూపతి ఇంట్లో పై అంతస్తులో సమావేశం అయ్యారు.. వారందరికీ రాజమర్యాదలు ఏర్పాటు చేసాడు చలపతి.. కబుర్లు, పేకాటలతో భూపతి భవనం లోని గదులన్నీ హడావుడిగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి..


భూపతికి కధల పిచ్చి చిన్నతనం నుండీ ! కధలు చదవడం, స్నేహితులనుండి కధలువినడం అతని హాబీ గా ఉండేది.. మంచి కధ దొరికితే ఒక సినిమా తీయాలని, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయఢంకా మోగించాలని అనుకుంటూ ఉండేవాడు.. ఉన్నట్టుండి భూపతికి ఒక ఆలోచన వచ్చింది.. తన బంధువులందరికీ సరదాగా ఒక పోటీ పెట్టాలనుకున్నాడు.. అందరినీ పేకాటలు కట్టేయమని చెప్పి ఇలా ప్రకటించాడు ! నేను సరదాగా మీకందరికీ ఒక చిన్న పోటీ పెడుతున్నాను.. "" నాకెవరయినా ఒక మంచి కథ చెబితే వాళ్ళకి అయిదు లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు బహుమతిగా ఇస్తాను" అని ప్రకటించాడు తన బంధువులందరి వైపు చూస్తూ."'' బంధువులందరూ ఇదేమి పోటీరా బాబూ అనుకుంటూ ఒకరిముఖంవైపు మరొకరు చూసుకోసాగారు ! బంధువులలో నలుగురు మాత్రం నేను చెబుతాను, నేను చెబుతానంటూ ముందుకు వచ్చారు ! అందరి సమక్షంలో కధ చెప్పాలనుకున్న వ్యక్తులు తమ కధలను ఒక్కొక్కరూ చెప్పడం ప్రారంభించారు..


అంతవరకు ఉత్సాహంతో ఉరకలేసిన ఆ ప్రదేశం అంతా చాలా గంభీరంగా మారిపోయింది.. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం ఆవహించింది అక్కడ ! -----ఃః----- మొదటి వ్యక్తి కధ మొదలు పెట్టాడు, అక్కడ ఉన్న బంధుగణమంతా నిశ్సబ్దంగా కధ విని, అయిపోగానే చప్పట్లు చరిచారు, చాలా బాగుందంటూ ప్రశంసించారు.. భూపతి ఏమీ మాట్లాడలేదు ! రెండో వ్యక్తి కూడా కధ చెప్పనారంభించాడు, కాస్త హాస్యంగా నవ్వులు పండించే కధ చెప్పాడు.. అందరూ సరదాగా బాగుందన్నారు ! అప్పుడు కూడా భూపతి లో ఏ భావమూ లేదు ! అలాగే మూడో వ్యక్తి , విషాదభరితమైన కధను చెప్పి ముగించాడు.. అందరూ అరె రే అంటూ ...... అయ్యో చివరకు అలా అయిందేమిటనుకుంటూ భారంగా నిట్టూర్చారు.. భూపతి లో కూడా సన్నని బాధావీచిక కన బడింది ! నాలుగో వ్యక్తి కధ చెప్పడం మొదలు పెట్టాడు.. ప్రకృతే స్తంభంచిపోయినట్లుగా ఉంది కధనం.. మనసును మెలిపెట్టిన కధ, ఒక ప్రేమ కధ ! ఆ కధను విన్న ప్రతి ఒక్కరూ బరువుగా నిట్టూర్చారు. కధ ముగింపును సుఖాంతం చేయకుండా ప్రశ్నార్ధకంగా వదిలేసాడు..


కూతురు ప్రేమించిన వ్యక్తిని కూతురు తండ్రి చంపించాలన్న ప్రయత్నాలను వినిన అందరూ ఆ తండ్రి కిరాతకత్వానికి ఆ తండ్రిని దూషించారు ! ఆ కధ విన్నభూపతి ముఖంలో నెత్తురుచుక్కలేదు.. ముఖం కందగడ్డలా చేసుకుని, ఇప్పుడే వస్తానంటూ అక్కడనుండి వడి వడిగా ఆయన గదిలోనికి వెళ్లిపోయి తలుపులేసుకున్నాడు ! గదిలోకి వెళ్లిపోయిన భూపతి దిండులో ముఖం దాచుకుని...... ఇదెలా సంభవం, అతను చెప్పిన కధ అచ్చు తన కధే ! తన పెద్దకూతురు వైజయంతి ప్రేమ కధ ! తన బంగారు తల్లి వైజూ ! ఎంతో గారాబంగా పెంచుకున్నారు భూపతీ , అతని భార్య లలితారాణీ ! అందంలోనూ చదువులోనూ అపర సరస్వతీదేవే వైజయంతి ! -------- ------- పదిసంవత్సరాలనాటి గతం గుర్తుకు రాసాగింది భూపతికి ! అక్కడే విజయవాడలో డిగ్రీ పూర్తి చేసిన వైజూ, మద్రాస్ లో స్టెల్లా మేరీస్ కాలేజ్ లో ఎమ్..ఏ.. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతాననేసరికి వద్దన్నా వినదని ఒప్పుకుని మద్రాస్ ఆడపిల్లల కాలేజ్ హాస్టల్లో చేర్చారు వైజూని ! ముందునుండి తను అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం వైజూది.. దానికితోడు చాలా సంవత్సరాల వరకూ ఒక్కర్తే పిల్లన్న అతిగారాబం కూడా వైజూ ని ఆ విధంగా తయారు చేసింది.. కోటీశ్వరుని కూతురు.. మహా అందగత్తే కాకుండా చిన్నప్పటి నుండి నాట్యం మీద ఇష్టం ఉండడంతో భరతనాట్యం, కూచిపూడి , కధక్, కధకళీ అన్నీ అతి సునాయసంగా నేర్చేసుకుంది.. ఏ విద్యనైనా తొందరగా గ్రహించి నేర్చేసుకునే చక్కని తెలివితేటలున్నాయి వైజూ లో !


మొదటి సంవత్సరం ఎమ్..ఏ లో యూనివర్సిటీ టాపర్ గానిలిచింది ! కాలేజ్ యానివర్సిరీ ఫంక్షన్ లో వైజూ నాట్య ప్రదర్శనను చూసిన ఒక ఫిలిం డైరక్టర్ వైజూని ఒక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని నటించమని కోరడంతో వైజూ భూపతికి ఫోన్ చేసి సినిమాలో నటిస్తాను నాన్నా, ప్లీజ్ ఒప్పుకోండి, ఒక్క పిక్చరేనని ఏడ్చి, అలిగి మొత్తానికి ఒకే ఒక పిక్చర్ అని తండ్రి ఒప్పుకోవడంతో ఎగిరి గంతులేసింది.. అందం, అభినయం, నాట్యం తో వైజూ ఆ సినిమాలో బాగా నటించడం, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.. ఆ తరువాత వైజూకి బోల్డన్ని అవకాశాలు రావడంతో భూపతి ససేమిరా వద్దని హెచ్చరించాడు.. నీవు మొండి వేషాలేస్తే చదువు మధ్యలోనే మానిపించేయాల్సి వస్తుందని బెదిరించేసరికి ఇంక చేసేదేమీ లేకా మౌనం వహించి చదువుకొనసాగించింది ! ఇంక రెండునెలలలో వైజూ పీజీ పూర్తి అయిపోతుందని, పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు భూపతి ! వైజూకి ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి.. ఇంకో పదిరోజుల్లో తన బంగారుతల్లి వైజూ చదువుముగించుకుని వచ్చేస్తోందన్న ఆనందంలో ఆ భవన ప్రాంగణం అంతా హడావుడిగా ఉంది !


ఇంతలో ఒక రోజు వైజూ నుండి ఫోన్ ! "నాన్నా, నేను అర్జున్ అనే అతన్ని మనసావాచా ప్రేమించాను.. అతను కూడా పోస్ట్ గ్రాడ్యుయేటే ! ఇక్కడ డిగ్రీ కాలేజ్ లో మాధ్స్ లెక్చరర్ అని చెబుతూ, మీకు చెపితే ఒప్పుకోరనీ తెలిసి ఇద్దరం రిజిస్టర్ మేరేజ్, నా స్నేహితుల సమక్షంలో చేసుకున్నా"మని పెళ్లిఫొటోలు కొరియర్ లో పోస్ట్ చేసానని చెప్పింది.. మీరు మమ్మలని ఆశీర్వదిస్తానంటే అర్జున్ ను తీసుకుని మన ఇంటికి వస్తాను ! లేకపోతే మా జీవితం మాదేనని, ఎప్పటికీ మీకు కనపడనని ఉత్తరం కూడా వ్రాసింది.. భూపతి చాలా ఆగ్రహావేశాలకు లోనైనాడు. వైజూ ని ఒక కోటీశ్వరుని ఇంట కోడలిగా చూడాలనుకున్నాడు ! తనలాంటి ఒక కోటీశ్వరుని కూతురు, ఒక అనామకుడిని, ఆస్తీ అంతస్తూ లేని వాడిని పెళ్లిచేసుకుందని మనసు రగిలిపోతోంది ! అయినా కూతురునీ, అల్లుడినీ రమ్మనమని చెప్పాడు ! కాని మంచి మనసుతోకాదు.. అతని మనసులో ఎన్నో దుష్ట ఆలోచనలు చోటుచేసుకున్నాయి ! తండ్రి మనసులో చోటుచేసుకున్న చెడు ఆలోచనలనేమీ గ్రహించని వైజూ, భర్తను తీసుకుని పుట్టింటికి వచ్చింది ! మేకవన్నెపులి నటనతో కూతురినీ అల్లుడినీ గాఢంగా కౌగలించుకున్నాడు భూపతి.. చదువూ, అందం ఉన్నా ఏ ఆస్తిపాస్తులూ లేని ఒక అనాధనా తన గారాల వైజూ ప్రేమించిందని మనసులో మండిపడి పోతున్నాడు ! అర్జున్ ను నామ రూపాలు లేకుండా చంపించడానికి తన మనుషులద్వారా ప్రయత్నించాడు కూడా..


చివరకు అతని ప్రయత్నం బెడిసికొట్టడం జరిగింది ! ఒకరోజు తెల్లవారి లేచి చూసేసరికి తన కూతురూ, అల్లుడూ కనబడలేదు.. పనిమనిషి ఒక ఉత్తరం చేతికిచ్చింది.. అందులోని సారాంశం...... " నాన్నా, నీవు మా ఇద్దరినీ ఆశీర్వదించావని చాలా మురిసిపోయాం ! మా నాన్న చాలా మంచివాడు అర్జున్ అంటూ మా వారి దగ్గర నీగురించి ఎంతో గొప్పగా చెప్పాను.. కానీ, ఏమిటిది నాన్నా ? నాకు ప్రాణప్రదమైన అర్దున్ ని నీవు నీ మనుషులతో చంపించాలని అనేక ప్రయత్నాలు చేయడం నేను గ్రహించలేదని అనుకోకు ! ఇది నీకు న్యాయంగా ఉందా నాన్నా ? నా మీద నీకు ఎంత ప్రేమైనా ఉండచ్చు, కానీ నాకు అర్దున్ మీద ప్రేమ అంతకంటే ఎక్కువే ఉంది ! నీవు ఏ మనుషులద్వారా నా భర్తను చంపించాలని ప్రయత్నించావో, వారే నా దగ్గరకు వచ్చి కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మమ్మలని నీ నుండి దూరంగా వెళ్లిపొమ్మన్నారు . లోకంలో నీలాగే అందరూ చెడ్డ వాళ్లే ఉండరు నాన్నా . మంచికి కూడా స్తానముంది.. మేము వెళ్లిపోతున్నాం, నీకు ఎప్పటికీ కనపడనంత దూరానికి . అర్జున్ కు నేనూ, నాకు అర్జున్ ఉన్నాడు . సరస్వతీ దేవి కటాక్షంతో ఎలాగోలాగ బ్రతకలేకపోము !


సుఖంగా ఆనందంగా జీవించడానికి కోట్లే ఉండాలా నాన్నా ? కోట్లు లేనివాళ్లుకూడా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని గ్రహించు ! ఉంటాను నాన్నా, ఎప్పటికీ నీకు ఏమీకాని --- " వైజూ " ! ఆ ఉత్తరం ఇంకా తన వద్ద ఉంది.. తన కధే చెప్పిన బంధువు కూడా ఆ ఉత్తరంలోని విషయాన్ని కధలో చెప్పడం ఆశ్చర్యమే ! తరువాత కొంత కాలానికి భూపతికి తెలిసిందేమిటంటే వైజయంతి, అర్జున్ సింగపూర్ వెళ్లిపోయారని ! ఇంక ఆ తరువాత భూపతి వారిని గురించి తెలుసుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు !

----@@@---

తన కధ తన బంధువు ద్వారా విన్న భూపతి మనసులో ఒకరకమైన పశ్చాత్తాపం కలగనారంభించింది ! తను వైజూ భర్త పట్ల జరిపించిన దురాగతాలన్నీ కళ్లముందు కదలాడాయి.. తను మరో దురాగతం కూడా చేసాడు.. అర్జున్ చేస్తున్న లెక్చరర్ జాబ్ ను తన పరపతి ని ఉపయోగించి పీకించేయడం ! ఇది కూడా ఆ కధలో ప్రస్తావించాడు ఆ బంధువు ! కాసేపటికి కొంతవరకు తేరుకున్న భూపతి ఆ బంధువును పిలిచి, కధ చాలా బాగుందని, ఎవరు వ్రాసినదని, ఎక్కడ చదివావని వివరాలు అడగాడు.. ఒక ప్రముఖ తెలుగు వార పత్రికలో సీరియల్ గా వచ్చినపుడు చదివానని చెప్పాడు !


" ఆ రచయిత అడ్రస్ కూడా సేకరించి తనకు వివరాలు చెపితే మరో లక్ష కూడా కలిపి బహుమతిగా ఇస్తానని " ఆశ చూపించేసరికి ఆ బంధువు మరో గంటలో భూపతి దగ్గరకు వచ్చి ఆ రచయిత అసలు పేరు పత్రిక ఎడిటర్ చెప్పలేదని, కేవలం ఎక్కడ ఉంటాడో మాత్రం కొన్ని వివరాలు ఇచ్చాడని చెబుతూ ....... ఆ రచయిత తన కలంపేరు " విరించి " అన్న పేరుతో కధలు వ్రాస్తున్నాడని, ఎంతో గొప్ప రచయిత అని చెపుతూ, అతను వ్రాసిన కధలూ, నవలలెన్నింటినో సినిమాలుగా తీసారని, అవన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలకొట్టి నట్లు చెప్పాడు !


అతను సినీరచయితగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించాడని చెప్పాడు ఆ బంధువు ! భూపతి ఇస్తానన్న అయిదు లక్షల రూపాయలకు మరో లక్ష కలిపి ఆ బంధువుకి అందచేసి తన కృతజ్నతలు సమర్పించుకున్నాడు ! ఇంక భూపతి ఆగలేకపోయాడు !

---@@@--

మర్నాడు ఫ్లైట్ లో బయలదేరి చెన్నయ్ వెళ్లిపోయాడు.. చెన్నయ్ లో నున్న తన స్నేహితునిద్వారా ఆ రచయిత " విరించి" ని కలిసే ఏర్పాట్లు చేసుకున్నాడు ! భూపతి మనసులో తెలియని ఉద్విగ్నత చోటు చేసుకుంది.. తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలన్నీ అక్షరాలా ఒక కధగా మలిచి వ్రాసిన ఆ రచయిత ఎవరో చూడాలన్న ఆత్రుత అతన్ని నిలవనీయడంలేదు . అనుకున్నట్టుగా మద్రాస్ లో " విరించి" ఇంటికి బయలదేరాడు.. ఇంటి ముందు కారు ఆగగానే గేట్ వద్దనున్న గూర్ఖా వివరాలడగడంతో తను అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు చెప్పేసరికి గూర్ఖా కారుని లోనికి పోనిచ్చాడు . చక్కని అధునాతనమైన భవంతి.. విశాలమైన ప్రాంగణం, అందమైన పూలతోట . మెయిన్ డోర్ పక్కన గోడమీద పాలరాతి ఫలకం పై " విరించి " అని బంగారపు రంగు అక్షరాలలో చెక్కింపబడి ఉంది.. అంతలో పనిమనిషి తలుపుతెరుస్తూ భూపతి ని లోనికి ఆహ్వానిస్తూ " అయ్యగారు ఒక అయిదు నిమిషాలలో " వస్తారు, కూర్చోమంటూ లోనికి వెళ్లింది.. మరు నిమిషంలో ఒక ట్రేలో గాజు గ్లాసులో మంచి నీళ్లు, కాఫీ తీసుకుని వచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్లింది.. లోపల హాలు లోనుండి ఎమ్.. ఎస్.. సుబ్బలక్ష్మి ఆలపించిన వేంకటేశ్వర సుప్రభాతం మృదుమధురంగా వినిపిస్తోంది..


ఎవరో పూజ చేసుకుంటున్న చిహ్నంగా సుగంధభరితమైన అగరుబత్తుల వాసన గెస్ట్ హాల్ వరకు వ్యాపిస్తోంది ! గోడలమీద ఖరీదైన పెయింటింగ్స్ ఇంట్లోవారి కళాత్మక ప్రతిభను అద్దం పట్టేలా కనబడుతున్నాయి.. భూపతి భవంతి ఇంతకన్నా పెద్దగా, ఖరీదైన హంగులతో అట్టహాసంగా ఉన్నా, ఎందుకో ఈ ఇంట్లో పొందుతున్న ఒకరకమైన ప్రశాంతత, మనసు కి చేరువౌతున్న ఒక రకమైన ఆత్మీయతా పరిమళాలు తనకు తన ఇంట్లో లభ్యం కావడంలేదని అర్ధమైంది ! మనుషులలోని మంచితనం, సౌజన్యం వారింటికే ఎనలేని సౌందర్యాన్ని తెచ్చిపెడ్తుందన్నది చాలావరకు నిజమన్నది ఆ ఇంటిని చూస్తేనే అర్ఘం అవుతుంది !


భూపతి సోఫాలో కూర్చుని ఏవో ఆలోచనలలో మునిగి ఉండగా, ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఆ ఇంటి యజమాని " విరించి" లోపలనుండి అతిధుల హాలులోకి ప్రవేశించాడు.. పొందూరు ఖాదీ సిల్క్ లాల్చీ పైజామా లో నున్న విరించి వస్తూనే భూపతికి నమస్కరించాడు ! విరించిని చూసిన భూపతి అప్రభతిడైనాడు ఒక్క క్షణం.. ఎక్కడో చూసినట్లుగా...... ఎవరు, ఎవరు అనుకునేంతలో మెదడులో ఒక పెద్ద విస్ఫోటకం ప్రబలి, అణువణువు గా విడిపోయినట్లుగా భావన ! మీరు...... మీరు అర్జున్ కదూ, వైజూ భర్త ...... అని నెమ్మదిగా గొణుగుతున్నట్లుగా !


అవతల విరించి పరిస్తితి కూడా అలాగే ఉంది.. నిన్న విరించి మేనేజర్ విరించితో ఎవరో పెద్దమనిషి భూపేంద్రగారుట, మిమ్మలని కలవడానికి కుతూహల పడుతున్నారని, అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసాననేసరికి...... ఎవరో పెద్దమనిషి సినిమా తీసే ఉద్దేశ్యంతో కధ గురించి అడగడానికి వస్తున్నాడేమో అని మాత్రం అనుకున్నాడుగానీ ఆ వచ్చింది వైజూ తండ్రి అని, తన మామగారని ఊహించనే లేదు. అర్జున్ లో ఎంత మార్పు అని ఆశ్చర్యపోతున్నారు భూపతి గారు.. మరింత రంగుదేలి పచ్చగా దృఢంగా మెరిసిపోతున్నాడు.. ఆ కళ్లు ఎంత స్వఛ్చంగా విజ్ఞానంతో వెలిగిపోతున్నాయో ననుకుంటూ విస్మయం పొందుతున్నాడు..


అర్జున్, విరించి ఇద్దరూ ఒకటేనా అనుకుంటూ సంధిగ్ధంలో ఉన్న భూపతి తో " అవునండీ మీరు కలవాలనుకున్న విరించిని " నేనే అన్నాడు !

---@@--

ఎలా ఉన్నారు, ఏమైనా పని ఉందా నాతో అంటూ మృదువుగా మాట్లాడుతూ...... పనిమనిషిని పిలిచి " పూజ అయిపోతే అమ్మగారిని ఇక్కడకు రమ్మనమన్నానని చెప్పు అంటూ ఆమెను లోపలికి పంపించాడు విరించి "! భూపతి కి మాటలు రావడం లేదు ! ఎంత అశ్చర్యం ? విరించిని కలవాలని వస్తే తన అల్లుడే విరించి ! గతంలో తాను తప్పు చేసానన్న భావన, పశ్చాత్తాపంతో భూపతిగారికి నోటమాట రావడం లేదు ! ఒక్కసారిగా భూమి బద్దలైపోతే బాగుండునన్న భావన ! తను ఇప్పుడు తన బంగారతల్లి వైజూ ముఖం చూడగలడా ? వైజూ తనని క్షమిస్తుందా ? విరించే అర్జున్ అని ముందే తెలిసుంటే తను ఇలా వచ్చేవాడా ? ఇలా ఎడ తెగని ప్రశ్నలను తనే వేసుకుంటూ, సమాధానం తోచక ఆలోచనలతో సతమతమౌతుంటే వైజయంతి ఆ హాలులోకి ప్రవేశించింది.. ఆమె రాకతో ఒక సుగంధపరిమళాన్ని తీసుకువచ్చిందా అన్నట్లుగా......ఒక మధురమైన భావన వ్యాపించింది అక్కడ ! అర్జున్ ఆమె వైపే చూస్తూ...... వైజూ.... ఈయనెవరో గుర్తుపట్టావా అని ప్రశ్నిస్తే అప్పుడు చూసింది భూపతి వైపు ! పదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత తన తండ్రి తన కళ్ల ఎదుట ! తన తండ్రిలో కాస్త వయసు తెచ్చిన మార్పు తప్ప మరేమీ మారకుండా అలాగే ఉన్నాడు !


.......నమ్మశక్యంగా లేక అయోమయంగా తన తండ్రినే చూస్తూ...... ఒక్క ఉదుటున వాయువేగంగా వచ్చి నాన్నా అంటూ భూపతి ఒడిలోకి దూరిపోయి వెక్కి వెక్కి ఏడ్వడం మొదలు పెట్టింది ! ఆమె భుజాల కదలికను చూస్తుంటే ఎంత తీవ్రంగా దుఖిస్తోందో అర్ఘమౌతోంది ! ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా నాన్నా అని వైజూ ఏడుస్తూ అడుగుతుంటుంటే ఆ తండ్రి హృదయం దుఖంతో మెలితిరిగి పోతోంది.. ఇంకా బ్రతికే ఉన్నామా లేదా అని చూడడానికి వచ్చావా నాన్నా. మమ్మల్ని చంపేస్తావా అనగానే ఆయన వైజూ నోటిని తన చేత్తో మూసేస్తూ...... అలా అనకు వైజూ .... నేను చాలా దుర్మార్గుడిని తల్లీ ! ఒకప్పుడు అంత క్రూరంగానూ ప్రవర్తించాను.. నేను చేసిన పాపపు పనులకు కృంగిపోతున్నాను తల్లీ ! నన్ను క్షమించండి ఇద్దరూ !


అర్జున్......బాబూ.... నీవు నన్ను క్షమించాలి, నేను నా స్వార్ధంతో ఆలోచించానే తప్ప , నీలాంటి భర్తను స్వంతం చేసుకున్న వైజూ నీతోనే తన జీవితం పెనవేసుకుపోయిందని అన్నీ త్యజించి నానుండి వెళ్లిపోయింది.. వైజూ ప్రేమ ఎంత గొప్పదో అర్ధమై గర్వపడుతున్నాను బాబూ.. మీ దంపతులిరువురూ నూరేళ్లూ హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఇలా మిమ్మలని కలుస్తాననీ ఊహించలేదురా తల్లీ ! అంతా కాకతాళీయం అంటూ...... జరిగిన సంగతంతా ఇద్దరికీ చెప్పాడు.. తనొక కధను ఒక బంధువు ద్వారా వినడం, ఆకధ తన జీవితఘటనలను పోలి ఉండడం, విరించి పేరుతో వ్రాసిన ఆ రచయితకు ఇవన్నీ ఎలా తెలిసి వ్రాసాడో తెలుసుకుందామన్న నెపంతో వచ్చాననేసరికి అవతల వైజూ, అర్జున్ ఒకరిముఖం మరొకరు చూసుకున్నారు.. నాన్నా, మేము నీకంటికి కనిపించకూడదని, అర్జున్ స్నేహితుడు సింగపూర్ లో బిజినెస్ చేస్తున్నాడని తెలిసి , అతని సహాయంతో మేము సింగపూర్ వెళ్లిపోయాం.. అర్జున్ అక్కడ ఒక అయిదుసంవత్సరాలు బిజినెస్ చేసారు..


మొదటనుండీ ఆయనకు తెలుగు, ఇంగ్లీష్ లిటరేచర్ పట్ల ఎంతో మక్కువ.. కధలు, రచనలు, శీర్షికలూ వ్రాస్తూ తెలుగు, ఇంగ్లీషు మాగజైన్లకి పంపిస్తూ ఉండేవారు విరించి అన్న కలం పేరుతో.. అలాగే ఈయన వ్రాసిన ఒక తెలుగు సీరియల్ ఆంధ్రదేశమంతటా ఒక ప్రభంజాన్ని రేపింది.. ఎందరో నిర్మాతలు సినిమా తీస్తామని మంచి పారితోషికాన్ని ఆఫర్ చేసారు.. అలాగే అర్జున్ వ్రాసిన ఎన్నో కధలకు ఎన్నో అవార్డులు పురస్కారాలు రావడమే కాదు, ఒక మంచి సినీ రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.. సింగపూర్ లోని బిజినెస్ ని వదిలిపెట్టి తిరిగి చెన్నయ్ వచ్చేసాం.. మా నిజ జీవితాన్ని కూడా సీరియల్ గా వ్రాసారు.. ముగింపు ని ప్రశ్రార్ధకంగా వదిలేసారు.. నేను అనుకుంటూ ఉండేదాన్ని, మా నాన్నకు కధలంటే ఇష్టం కదా, ఈ కధ తప్పక చదివే ఉంటాడని.. కానీ ఎవరిద్వారానో మా కధ విని స్పూర్తి పొందిన మీరు ఆ కధ వ్రాసిన విరించి గారిని వెతుక్కుంటూ రావడం నిజంగా ఒక కలలా ఉంది.. నాన్నా...... నీకో అద్భుతం చూపించనా అంటూ...... లోపలికి వెళ్లి ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలను తీసుకువచ్చి భూపతికి చూపించింది.. ఆరేళ్ల వయసున్న బాబూ, మూడేళ్ల పాప.. నీమనవడూ, మనవరాలూ నాన్నా అంటూ, గౌతమ్, ఆద్యా......తాతగారికి దణ్ణం పెట్టండనగానే ముద్దుగా దణ్ణం పెడుతున్న తన చిన్నారి వైజూ పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ముద్దు పెట్టుకున్నాడు!


ఇన్ని ఆనందాలకు భూపతి హృదయం ఉప్పొంగి పోతోంది ! తన చిట్టితల్లి వైజూలో ఎంత మార్పు ! మరింత అందంగా హుందాగా పరిపూర్ణ మైన స్త్రీత్వం తో మహాలక్ష్మిలా మెరిసిపోతోంది ! అనురాగం చూపించే భర్త, ముత్యాల్లాంటి పిల్లలతో ఆనందంగా ఉంది ! ఇంతటి ఆనందాన్నా తను అప్పుడు దూరంచేయాలనుకున్నాడు ? తనమీద తనకే అసహ్యం కలిగింది ! నాన్నా ఇంక జీవితంలో నీవు మమ్మలని క్షమించవనీ, కనపడితే చంపేయాలన్నంత కసి ఉన్న నీలో ఇంతటి గొప్ప మార్పు కి కారణం విరించి వ్రాసిన కధే కదూ? అందులో నీవే ముఖ్య పాత్రగా మొత్తం కధని నడిపించింది.. వైజూ మాటలకు భూపతి సిగ్గుతో తలొంచుకున్నాడు..


ముఖ్యపాత్ర అంటోంది వైజూ, కాదు అందులోని ముఖ్య విలన్ తనే.. నాన్నా " అమ్మా , చెల్లాయిలు, తమ్ముడు ఎలా ఉన్నారన్న" ప్రశ్నకు జవాబిస్తూ, చెల్లెలి వివాహం గురించి చెప్పి, వెంటనే అందరినీ తనతో బయలదేరమన్నాడు భూపతి !


"వస్తాం నాన్నా, ఇప్పుడే కాదు.. పెళ్లికి పదిరోజుల ముందు.. అర్జున్ ఒక సినిమాకు కధ వ్రాస్తున్నారు.. అది పూర్తవ్వాలి, కదూ అర్జున్" అనగానే, "అవును మామయ్యా, ఇప్పటికే ఆలస్యం అయిందంటూ ప్రొడ్యూసర్ తొందరపెడ్తున్నాడు.. అది పూర్తి చేసి వస్తా"మనగానే ...... "మరి నా కధ ఎప్పుడు పూర్తి చేస్తావయ్యా అల్లుడూ, అదే ప్రశ్నార్ధకంగా నీవు పూర్తి చేసిన కధ..".. అలా అనగానే అర్జున్ కంగారుపడడం చూసి........ "అదేనయ్యా నీవు రాసిన సీరియల్ కు ముగింపు భాగాన్ని ఎడిట్ చేయవూ ? మనం అందరం ఇలా కలిసిపోవడం ! నా చిట్టి తల్లి వైజూ ఈ నాన్నను క్షమించేసిందిగా...... మరి నీవు రాసిన సీరియల్ కధ మనలనందరినీ ఇలా కలిపేసినందుకు, ఆ కధను నేను సినిమాగా ప్రొడ్యూస్ చేద్దామనుకుంటున్నాను విరించీ ! సినిమాకు ఎంత బడ్జట్ అయినా ఫరవాలేదు.. మంచి మంచి లొకేషన్స్, చక్కని అందం, నటనానుభవం ఉన్న నటీనటులను ఎంపిక చేయడం మొదలైనవన్నీ నీవేచూసుకో విరించీ ! సినిమా టైటిల్ " ఇది కధకాదు జీవితం " అనగానే ఆ ఇంట నవ్వుల పూలజల్లు కురిసింది !!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.

62 views0 comments

Comentarios


bottom of page