top of page

ఆనంది


'Anandi' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త


"ఇదిగో ఆనందీ నిన్నే, ఎక్కడున్నా"వంటూ కాస్త విసుగునిండిన స్వరంతో పిలిచింది వసుంధర !


"ఏమిటి అత్తయ్యా.. పిలిచావెందు"కంటూ ఆనంది తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ వసుంధర దగ్గరకు వచ్చింది . ఒక్క క్షణం ఆనంది ముఖంవైపు తేరిపార చూసింది వసుంధర.. ఈ పిల్ల ఎంత పనిచేసినా ఆ ముఖంలో అలసట అన్నది కనిపించదే ! చక్కని నిగారింపుతో, యవ్వనం తెచ్చిన కొత్త అందాలతో ఆనంది మెరిసిపోతోంది.. అసలే చక్కనిది.. ఏ షోకులూ, ముస్తాబులూ లేకపోయినా సహజ సౌందర్యంతో మెరిసిపోతున్న ఆనంది అంటే మనసులో అసూయ.. తన కూతురు దీప్తి ని ఆనంది పక్కన నిలబెడితే వెల వెలబోతుంది.. ఖరీదైన బట్టలు, మేకప్ తో ఉన్నా, ఆనంది కున్నసహజ అందానికి ముందు దీప్తి అందం తీసికట్టుగా ఉంటుంది.. ఎప్పుడూ చిందరవందంగా ఉండే పొడవైన జుట్టుని రబ్బరు బేండ్ తో అలా చుట్టేసినా కూడా ఆనంది చూడడానికి బాగుంటుంది.. తలంటుకుని, జడ వేసుకున్నప్పుడు చూడాలి ఆనందిని . నల్లని ఒత్తైన జుట్టు నిగ నిగ మెరుస్తూ, మెత్తగా కుబుసంలా బారెడు జడ ఆనంది వీపు మీద లయబధ్దంగా ఊగుతుంటే చూడడానికి రెండు కనులూ సరిపోవు..


"చెప్పు అత్తయ్యా, ఎందుకో పిలిచావుగా" అనేసరికి వెంటనే తెప్పరిల్లుతూ " ఆ....ఆనందీ, రేపు ఆదివారం నా స్నేహితులు ఒక పదిమంది దాకా వస్తారు.. చిన్నపాటి గెట్ టుగెదర్ అనుకో ! ఇల్లు నీట్ గా సర్దాలి.. నీకు మెన్యూ చెపుతాను.. ఆ ప్రకారం వంట చేయి.. సరుకులూ, కూరగాయలూ ఏమి కావాలో లిస్ట్ తయారుచేసి మీ మామయ్యకు వాట్సాప్ చేస్తే ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తెస్తా"రని ఆర్డర్ జారీ చేసింది..


ఆనంది మౌనంగా తల ఊపి వెళ్లిపోయింది .

ఆనంది, వసుంధర ఆడపడుచు కూతురు . ఆనంది తల్లీ తండ్రీ ఇద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతే వసుంధర భర్త మోహన్ తన చెల్లెలి కూతురైన ఆనంది బాధ్యతను తను తీసుకుని తమ ఇంటికి తెచ్చాడు.. అప్పటికి ఇంటర్ పాసై ఉంది ఆనంది .. వసుంధరకు మోహన్ చేసిన పని సుతరామూ ఇష్టంలేదు.. మనకెందుకు ఈ తలనొప్పి అన్నా వినిపించుకోలేదు మోహన్..


మనం చూడకపోతే ఎక్కడ ఉంటుంది వసూ పాపం చిన్న పిల్లంటూ భార్యకు నచ్చ చెప్పాడు.. మీ చెల్లెలి అత్తింటి వైపు వారు ఉన్నారు కదా, ఎవరో ఒకరు దగ్గరకు తీస్తారన్నా మోహన్ వసుంధర మాటలను వినలేదు.. ఆనంది కి ఆస్తి ఉంది, వాళ్లా అమ్మా నాన్నదీ.. దానికేమీ మనం పెట్టక్కర్లేదు, మన దీప్తికి తోడుగా ఉంటుదన్నాడు.


ఆనంది తండ్రి కి సొంత ఫ్లాట్ ఉంది.. యాక్సిడెంట్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులూ, బేంక్ డిపాజిట్లు అన్నీ తన పేరుమీద మార్చేసుకున్నాడు మోహన్ .. ఇంజనీరింగ్ చదివిద్దాం మన దీప్తితోబాటు అంటే వసుంధర ససేమిరా ఒప్పుకోలేదు.. పెద్ద పెద్ద చదువులు చదివిస్తే పెద్ద పెద్ద సంబంధాలు తేవాలని, ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని, అంత అవసరమా అంటూ ఆనంది పై చదువులకు ఒప్పుకోలేదు.. ఫలితం ఆనంది ఆ ఇంట్లో జీతం బత్తెం లేని పనిమనిషి అయింది.. ముందు చిన్న చిన్న పనులు మాత్రమే చేయించే వసుంధర, కొన్నాళ్లకు ఆనందికి ప్రమోషన్ ఇచ్చేసి వంటమనిషిగా మార్చేసింది !

పొద్దుటే అయిదుగంటలకు లేచి రాత్రి పదిగంటల వరకు అలా అవిశ్రామంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆనంది.. ఆనంది వయస్సు తోడిదే దీప్తి కూడా.. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతోంది..దీప్తి వాడి పారేసిన బట్టలు ఆనంది ఒంటి మీద మెరుస్తూ ఉంటాయి..


ఆదివారం వసుంధర స్నేహితులందరూ వచ్చారు.. ఆనంది చేసిన వంటలు బాగా కుదిరాయి.. నిజానికి ఆనందే ఆ వంటలన్నీ వండినా, బయట వాళ్లదగ్గర మాత్రం బోల్డంత బిల్డప్ ఇస్తూ, వంటంతా తనే చేసినట్లు చెప్పుకోవడం వసుంధర చాకచక్యం.. అందరి ముందూ ఆనందిని తాము చాలా బాగా చూసుకుంటున్నట్లు ఆనందితో ఆప్యాయంగా మాట్లాడుతూ బోల్డంత ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది.. ఆమె నటనాచాతుర్యానికి అవార్డ్ ఇవ్వాల్సిందే.. ఆనందిని చూసిన వారంతా ఆనంది అందానికి అబ్బుర పడతారు.. ఎంత చక్కనిది ఈ అమ్మాయి అనుకుంటూ ఆనందితో కబుర్లు చెప్పడానికి ఇష్టపడతారు. ఆనంది ఆ చుట్టుపక్కల లేకపోతే, పిలిచి మరీ దగ్గర కూర్చోపెట్టుకుంటారు. అందమైన ఆమె జడను స్పృశిస్తూ ముచ్చటపడతారు. ఇవన్నీ చూస్తుంటే వసుంధర కి చాలా అసహనంగా ఉంటుంది.. కాని ఏ వంకా పెట్టడానికి , తప్పులు వెతకడానికి ఆనంది ఏ అవకాశమూ ఇవ్వదు.. అందుకే తన అసహనాన్ని, అసూయనీ తన మనస్సులోనే దాచేసుకుంటూ పైకి ప్రేమగా ఉంటుంది ఆనందితో .

ఒక రోజు మోహన్ హడావుడిగా ఆఫీసునుండి వస్తూ వసుంధరతో, తొందరగా కాఫీ ఇవ్వు వసూ, నా స్నేహితుడి కొడుకు ముంబై నుండి వస్తున్నాడు.. రిసీవ్ చేసుకోడానికి ఏయిర్ పోర్ట్ కి వెళ్లాలంటూ హడావుడి పడసాగాడు.. వసుంధర లేచేటంతలో ఆనంది వేడి వేడి కాఫీ తయారుచేసి మామయ్యకు కాఫీ కప్పు అందించింది.. మోహన్ మనస్సులో అనుకున్నాడు, ఈ పిచ్చి పిల్లకు ఎంత శ్రధ్ద, అడక్కుండానే చక చకా అన్నీ సమయానుకూలంగా చేసేస్తుందని.. తన కూతురు దీప్తికి ఈ విషయాలు ఏమీ పట్టవుకదా , ఎప్పుడుూ స్నేహితులు, షికార్లు తప్పించితే అని బాధ పడ్డాడు.. ఒక రకంగా తాను తప్పుచేస్తునానన్న గిల్టీనెస్ ! ఆనందిని చదివించకుండా తమ స్వార్ధానికి వాడుకుంటున్నందుకు.. కాని భార్య స్వభావం తెలిసి ఏమీ మాట్లాడలేని అసహాయత . ధాంక్స్ రా ఆనందీ, కాఫీ చాలా బాగుందంటూ కాఫీ తాగడం పూర్తి చేసి బట్టలు మార్చుకోడానికి లోపలికి వెళ్లిపోయాడు .


రాత్రి ఎనిమిది గంటలకు మోహన్, మోహన్ తోబాటు ఒక అబ్బాయి వచ్చారు.. వసుంధరను ఆ అబ్బాయికి పరిచయం చేసాడు.. ఆ అబ్బాయి శరత్ అని సి..ఏ చదివి సివిల్ సర్వీస్ కు ప్రిపేరు అవుతున్నాడని, ఈలోగా ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ వస్తే హాజరు అవ్వాలని వచ్చాడని చెప్పాడు.. వసుంధరకు ఆ అబ్బాయి చాలా నచ్చేసాడు.. ఎంత అందంగా ఉన్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది. స్పురద్రూపి, చనువుగా కొత్తలేకుండా ఆంటీ, అంకుల్ అంటూ గడ గడా మాట్లాడేస్తున్నాడు.. ఈలోగా దీప్తి వస్తే ఏం చదువుతున్నారని, మీ ఫ్యూచర్ ప్లేన్ ఏమిటని చనువుగా అడగడం అదీ చూస్తుంటే వసుంధర మనస్సులో ఏవేవో కొత్త ఊహలు ఊపిరి పోసుకుంటున్నాయి.


దీప్తి పక్కన శరత్ ను ఊహించుకుంటూ కలలు కనడం మొదలు పెట్టింది.. ఈలోగా శరత్ ' ఆంటీ ఒక కప్పు స్టాంగ్ కాఫీ ఇవ్వగలరా ' అని అడిగేసరికి వసుంధర నొచ్చుకుంటూ ఒక్క క్షణం శరత్ అంటూ అలవాటు ప్రకారం 'ఆనందీ' అంటూ పిలిచి 'ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా' అంటూ చెప్పగానే ఆనంది ఫిల్టర్ కాఫీ చేసి వాళ్లు ఉన్న చోటుకి కాఫీ కప్పుతో వచ్చింది.. శరత్ ఆనందిని చూసి అప్రతిభుడైనాడు.. అందమైన ఆనంది ముఖంవైపునుండి దృష్టి మరల్చుకోలేకపోతూ, కాఫీ కప్పు అందుకున్నాడు..


'అబ్బ ఎంత అందంగా ఉందీ అమ్మాయి' అని అనుకోకుండా ఉండలేకపోయాడు.. చక్కని రుచికరమైన ఫిల్టర్ కాఫీ సిప్ చేస్తూ...... 'ధాంక్స్ అండీ, కాఫీ సూపర్' అని మెచ్చుకున్నాడు..


ఈ లోగా దీప్తి, 'తను ఆనంది, మా అత్త కూతు'రని కేజువల్ గా చెప్పడం ఆనంది అక్కడనుండి మెల్లిగా పక్కకు తప్పుకుని వచ్చేయడం జరిగింది.. అలా డిన్నర్ టైమ్ లో కూడా శరత్ కు ఆనంది తటస్త పడడం, శరత్ ఆమె కళ్లల్లోకి రెప్పపాటున చూడడం జరిగిపోయింది !


ఇంటర్వ్యూ అయిపోగానే శరత్ బయలుదేరాడు.. అందరికీ బై చెపుతూ...... 'ఆనంది గారు కనపడరే' అనేసరికి దీప్తి ఆనందిని పిలిచింది.. ఆనంది మెల్లిగా వచ్చి తల ఎత్తి చూసేసరికి క్షణం సేపు ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి..


మనోహరమైన చిరునవ్వు అతని పెదవులపైన లాస్యం చేస్తుండగా...... "బై ఆనందిగారూ, మీ కాఫీ, వంటలు సూపర్ అంటూ ......" వెళ్లిపోయాడు !


ఆనందికి ఏమిటో ఒకలాంటి భావన.. రెండురోజులు ఎందుకో అన్యమనస్కంగా ఉంది.. మాటి మాటికి శరత్ చూపులు తనని వెన్నాడుతున్నట్లుగా అనుభూతి.. శరత్ ఉన్న సమయంలో మాటి మాటికి తనను ఆసక్తిగా చూడడం గమనించింది.. దీప్తి శరత్ తో చాలా చనువుగా మాట్లాడింది.. తను అలా మాట్లాడలేదు.. నిజానికి తను కూడా చాలా బాగా మాట్లాడగలదు.. అమ్మా నాన్నా దారుణమైన రోడ్ ఏక్సిడెంట్ తనను ఒకరకమైన నిర్లిప్తతకు , మౌనానికి గురిచేసింది.. అత్తయ్య స్వభావాన్ని తను బాగానే గ్రహించింది.. తను అత్తయ్య స్నేహితులతోగాని, చుట్టాలుతోగాని చనువుగా మాట్లాడితే ఎందుకో అసహనంగా ఉంటుంది.. తను ఒకానొకప్పుడు ఎంత చలాకీగా ఉండేది ?


" అబ్బ...... ఆనందీ ...... కాసేపు మాట్లాడకుండా ఉండలేవా" అంటూ అమ్మ అంటూ ఉండేది. ఏమైనాయి ఆ మాటలూ, ఒకప్పటి తన చిలిపితనం ? ఇరవై సంవత్సరాలు నిండకుండానే ఒక రకమైన పెద్దరికం, విరాగిణిలా తయారైంది.. తన డాన్స్ చూస్తూ నాన్న మురిసిపోయేవాడు.. మన ఆనంది గొప్ప డాన్సర్ అవ్వాలంటూ అమ్మ దగ్గర అంటూ ఉండేవాడు. ఒకానొకప్పుడు తనలో ఉన్న ఆ సున్నితమైన భావాలు, ఊహలూ, అందమైన కలలూ అన్నీ కరడు కట్టుకుపోయాయి.. ఎందుకో తల్లీతండ్రి, ఒకప్పటి తన జీవితం గుర్తుకువచ్చి ఆనంది కళ్లనుండి కన్నీరు ప్రవహించింది.. 'ఎంతటి దురదృష్టవంతురాలు తను' అనుకుంటూ నిట్టూర్చింది !


కాలానికి వేటితోనూ పనిలేదు.. ఎవరి బాధలు ఎటువంటివైనా నాకేమిటీ అనుకుంటూ ముందుకు పరుగెడ్తూనే ఉంటుంది.. రెండేళ్లు ఏ మార్పూ లేకుండా గడచిపోయింది.. దీప్తి ఇంజనీరింగ్ పూర్తి చే సింది.. ఎమ్..ఎస్ కు అమెరికా వెడ్తానంటోంది.. ఏ కేంపస్ ఇంటర్వ్యూలోనూ సెలక్ట్ అవలేదు.. మరో ఆప్షన్ లేదుకదా యూఎస్ వెడతానని గోల చేస్తోంది.. వసుంధర పెళ్లి చేసేయాలని అనుకుంటోంది.. ఒకరోజు మోహన్ స్నేహితుడు, శరత్ తండ్రి మోహన్ కి ఫోన్ చేసి చెప్పాడు.. శరత్ ఐ..ఏ..ఎస్ కు సెలక్ట్ అయ్యాడని. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడని.. మోహన్ శరత్ కు అభినందనలు తెలియ చేసాడు..


వసుంధరకు ఈ విషయం తెలిసినప్పటినుండి మోహన్ వెంటపడుతోంది.. మన దీప్తికి శరత్ ఈడూజోడూగా చాలా బాగుంటాడని, వెంటనే వెళ్లి అతని స్నేహితునితో సంబంధం కలుపుకునే విషయం మాట్లాడమని.. మోహన్ విసుక్కున్నాడు. తను ఆ పని ససేమిరా చేయనని !వాళ్ల శరత్ ఐఏఎస్ అయ్యాడని చెప్పగానే నా కూతురిని మీ శరత్ కు చేసుకోమంటూ వెంటపడమంటావా అని కోప్పడ్డాడు.. దేనికైనా సమయం , సంధర్భం ఉండాలని, అవకాశం వచ్చినపుడు చూద్దాంలే అని దాటవేసేసాడు..


వసుంధర తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి తల్లిని చూసివస్తానని చెప్పి దీప్తిని తీసుకుని వసుంధర తన అన్నగారి ఊరికి బయలుదేరింది . ఆనందిని ఇల్లు కనిపెట్టుకుని ఉండమని బోలెడు జాగ్రత్తలు చెపుతూ వెళ్లారు..


వసుంధర ఊరికి వెళ్లిన మరుసటి రోజు మోహన్ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేసాడు.. మామయ్యను చూడగానే, ఏం మామయ్యా తొందరగా వచ్చావు, ఒంట్లో బాగానే ఉందికదా అంటూ ఆనంది పరామర్శించింది . ఆ బాగానే ఉన్నాను తల్లీ అంటూ, నీవు తొందరగా రెడీ అవ్వాలి ఆనందీ, మనం ఒక చోటికి వెడ్తున్నాం అనగానే ' నేనెందుకు మామయ్యా' అనగానే ఫక్కున నవ్వుతూ ' అమ్మా ఆనందీ, నీవే రావాలమ్మా అంటూ, క్రిందటి వారం నీకూ, దీప్తికి డ్రెస్సులు కొన్నాను కదా, వాటిలో నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని తయారవ్వు తల్లీ, ఆలస్యం అవుతోం'దని చెప్పి తను తయారవ్వడానికి వెళ్లిపోయాడు మోహన్ .


లైట్ గ్రీన్ కలర్ చూడీదార్ డ్రస్ లో ఆనంది మెరిసిపోతోంది.. ఆనంది ని ఆ డ్రెస్ లో చూసిన మోహన్ కళ్లు చెమ్మగిల్లాయి.. ఏక్సిడెంట్ లో చనిపోయిన తన చిన్నారి చెల్లి సంధ్య గుర్తుకు వచ్చింది.. నన్ను క్షమించు సంధ్యా, ఆనంది ని నేను సరిగా చూసుకోకపోయినా, దానిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాడితో పెళ్లి జరిపిస్తానని మనస్సులోనే మాటఇచ్చాడు.. తన అకౌంట్ లో బధ్రపరిచిన ఆనందికి సంబంధించిన డబ్బునంతటినీ ఆనంది పేరుమీద బేంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసేయాలని నిర్ణయించుకున్నాడు.. ఆనందిని తీసుకుని కారులో తాజ్ బంజారాకు బయలుదేరాడు .


ఆనందికి అంతా విచిత్రంగా ఉంది.. అత్తయ్యా, దీప్తి లేనందువలన ఏదైనా ఫంక్షన్ కు తీసుకువెడుతున్నాడేమో మామయ్య అనుకుంటూ, తన వెడల్పాటి కళ్లతో అంతా ఆశ్చర్యంగా చూస్తోంది ..


తాజ్ బంజారాముందు కారుదిగి రిసెప్షన్ లోకి వెళ్లి ఏదో మాట్లాడి లిఫ్ట్ లో ఆనందితోబాటు అయిదవ ఫ్లోర్ కి వెళ్లి ఒక రూమ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు.. వెంటనే డోర్ తెరుచుకుంది.. ఎదురుగా ' శరత్ ', మరింత అందంగా, హుందాగా మెరిసిపోతున్నాడు.. అసలే స్పురద్రూపి, అందగాడు.. ఐ..ఏ..ఎస్ హోదాలో చూడగానే దిష్టికొట్టేటట్లుగా . మోహన్ ను చూడగానే నమస్కారం అంకుల్ అంటూ, ఆనందిని కళ్లతోనే పలకరించాడు.. చప్పున తలదించుకుంది.. ఇద్దరిని రూమ్ లోనికి ఆహ్వానించాడు.. కుశలప్రశ్నలు, కాఫీ తాగిన తరువాత మోహన్ ఆనందితో ' నేను పది నిమిషాలలో వస్తాను తల్లీ, పనుంది, నీవు శరత్ తో మాట్లాడుతూ ఉండమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.. ఆనంది ఒక్క క్షణం కంగారు పడ్తూ, నేనూ వచ్చేస్తాను మామయ్యా అనగానే శరత్ ' ఆనందీ , మీ మామయ్యను వెళ్లనివ్వండి, ఇప్పుడే వచ్చేస్తారు అనగానే ఏమీ అనలేక బిడియంగా తలవంచుకుంది..


శరత్ మృదువుగా ' బాగున్నావా ఆనందీ ' అనగానే తల ఎత్తకుండానే బాగున్నాంటూ తల ఊపింది.. తల ఎత్తి మాట్లాడు ఆనందీ.. నేను మీ మామయ్సతో నిన్ను ఇక్కడకు ఎందుకు తీసుకు రమ్మనమన్నానో తెలుసా ?

తెలీదంటూ తల ఊపింది..


అలాకాదు, మాట్లాడు ఆనందీ ! మనం ఇప్పుడు మనస్సువిప్పి మాట్లాడుకోవాలి.. మాటలకు బదులుగా ఇలా తలలు ఊపుకుంటుంటే కొంతసేపటికి తలలు ఊడిపోతాయంటూ ఫక్కున నవ్వాడు !


నీకు చదువుకోవాలని ఉందా, నోటితో జవాబు చెప్పాలి మరి !

ఆనంది ఏమనుకుందో మెల్లిగా చెప్పింది, తనకు చదువంటే ప్రాణమని టెన్తె క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చానని, ఇంటర్ లో తొంభై శాతం మార్కులు వచ్చాయని చెప్పింది . తన తల్లీ తండ్రీ రోడ్ ఏక్సిడెంట్ లో చనిపోవడం గురించి చెపుతూండగా ఆమె కంఠం గద్గదమైంది.. కళ్లల్లో సన్నని కన్నీటి తెర .. అది శరత్ చూడకూడదన్న నెపంతో కళ్లు మరింతగా కిందకు దించుకుంది !


వెంటనే శరత్, సో సారీ ఆనందీ...... చూడు ఇటు నావైపనగానే తల ఎత్తింది.. అతని కళ్లు తనవైపే మృదువుగా చూస్తున్నాయి..


హమ్మయ్య అనుకుంది ఆనంది.. నాకు ఇంక ఇతనితో మాట్లాడడానికి భయంలేదనుకుంది .

చూడు ఆనందీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం.. రెండుసంవత్సరాలక్రితం మీ ఇంట్లో మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీవంటే నాకు ఇష్టం కలిగింది.. ఆ ఇష్టమల్లా ప్రేమగా మారి నిన్ను పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను.. కాని అంతకంటే ముఖ్యంగా నా ఆశయం ఐ..ఏ..ఎస్ లో సెలక్ట్ అవ్వాలని.. నువ్వు క్షణం క్షణం గుర్తుకు వస్తున్నా, ఆ ఆలోచనలనుండి బయటకువచ్చి ఐ..ఏ..ఎస్ కు కష్టపడి ప్రయత్నించడం, నేను అనుకున్నది సాధించడం జరిగింది.. తరువాత నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం.. మా అమ్మా నాన్నగారికి చెపితే నీకు నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదన్నారు.. తరువాత మీ మామయ్యకు ఫోన్ చేసి మాట్లాడాను.. ఆయన చాలా సంతోషించారు.. ఆనందితో మాట్లాడి ఆమె అభీష్టాన్ని కూడా అడిగి తెలుసుకుంటానని మీ మామయ్యతో చెప్పగానే ఆయన ఒప్పుకున్నారు.. ఇదిగో నేను ఈ హొటల్ లో దిగగానే మీ మామయ్యతో నిన్ను తీసుకురమ్మనమని చెప్పేసరికి మీ మామయ్య నిన్ను తీసుకుని వచ్చారు ఆనందీ .


ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగేసరికి, ఆనందికి వెంటనే మాట పెగలలేదు.. తరువాత నెమ్మదిగా, మీరేమో ఐ..ఏ..ఎస్.. నేను డిగ్రీ కూడా చదవలేదు.. అటువంటప్పుడు నేను మీకు ఎలా తగినదాన్ని అవుతాను శరత్ గారూ ?

అదంతా వదిలేయ్ ఆనందీ, పెళ్లైనాకా నిన్ను నేను చదివిస్తాను.. నువ్వు ఎంత వరకు చదువుకుంటానంటే అంతవరకు.. సరేనా ? ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమేనా, నన్ను పెళ్లి చేసుకోడానికి నీకేమీ అభ్యంతరం లేదుగా ?


క్షణం సేపు ఆనంది నుండి మౌనం , అలాగే తలవంచుకుని కూర్చుంది..

ఇదిగో తల వంచుకోవడం కాదు.. నాకళ్లల్లోకి చూసి చెప్పాలి !

అప్పటికే శరత్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో వాలిపోతున్న ఆనంది కాటుక కనులు పైకెత్తి శరత్ కళ్లల్లోకి చూసింది.. అబ్బ ఎంత అందమైన కనులని అనుకున్నాడు శరత్.. ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి...... చాలా సేపటివరకు అలాగే ఒకరి కన్నుల్లోకి మరొకరు చూసుకుంటూ ఉండగా, ఆనంది మృదువుగా...... నేను ఇంత అదృష్టవంతురాలిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు శరత్ గారూ, మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నన్ను పెళ్లిచేసుకుంటానంటే, నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు?


నిజంగానా ఆనందీ?


తల్లీ తండ్రి నీ పోగొట్టుకున్న దురదృష్టవంతురాలిని.. మామయ్య చేరదీసాడు.. ఇటువంటి అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుందని కలలో కూడా ఊహించలేదు శరత్ గారూ ..

ఈ గారూ, గీరూ ఏమిటి ? శరత్ అని పిలువు ఆనందీ !


అలాగేనంటూ తలూపుతున్న ఆనందితో నీకు మాటలకన్నా తలూపడం ఇష్టమా ? ఇదిగో నావైపోసారి చూడు..

ఇంక ఎప్పటికీ నీవు దురదృష్టవంతురాలినని అనుకోకు.. నేను లేనూ నీకు ? నీవు నన్ను ఎక్కడ కాదంటావోనని ఎంత భయపడ్డానో తెలుసా ?


నిజానికి మొదటిసారి మిమ్మలని చూసినప్పటినుండి, మీ కళ్లే ఎప్పుడూ నన్ను వెంటాడుతున్నాయని ఎలా చెప్పగలను శరత్ అంటూ మనసులోనే అనుకుంది.. కాని పైకి చెప్పడానికి సిగ్గుపడింది..


ఏం మాట్లాడవే ఆనందీ ? నీవు కాదంటే నిన్ను ఎలా వప్పించాలా అని ఆలోచిస్తున్నాను.. కానీ నా భయాన్ని పటాపంచలు చేసావు.. నేను చాలా అదృష్టవంతుడిని ఆనందీ, నీలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తున్నందుకు..


నిజమా శరత్ ? నేనింకా ఇది కలా, నిజమా అనే భ్రమలోనే ఉన్నాను .

ఓ, అవునా ఆనందీ, మరైతే నీచేతి మీద ఇది నిజమే సుమా అంటూ గిల్లి చూపమంటావా ?

శరత్ మాటలకు అందమైన ఆమె బుగ్గలు సిగ్గుతో మరింత ఎరుపెక్కాయి.. శరత్ అలాగే ఆనంది వైపు చూస్తూ ఉండిపోయాడు.


నాలుగురోజుల తరువాత వసుంధర, దీప్తి తిరిగి వచ్చారు..

ఏమిటో ఇంట్లోని మనుషులు, వాతావరణంలో ఏవో మార్పులు.. మోహన్ ను చూస్తుంటే ఒకటే ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.. కూనిరాగాలు తీస్తున్నాడు.. ఆనంది చక్కని డ్రెస్ వేసుకుని ముస్తాబైంది.. అసలే అందమైన ఆనంది ముఖం సిగ్గుదొంతరల మధ్య మరింత అందంగా, హుషారుగా కనిపిస్తోంది.. అదివరకటిలా భయం భయంగా, ఒద్దికగా కనపడడం లేదు.. స్వేఛ్చావిహంగంలా తుళ్లి తుళ్లి పడుతోంది . మోహన్ ని అడిగింది, ఏమిటీ మార్పు అని ?

వచ్చేవారం శరత్ , శరత్ అమ్మా, నాన్నా వస్తున్నారు మనింటికి.. పెళ్లి మాటలు మాట్లాడుకుని, నిశ్చయ తాంబూలాలు తీసుకోడానికి అనగానే, వసుంధర, మీరెంత మంచివారండీ, అప్పుడు నేను మిమ్మలని శత విధాల పోరాను.. మన అమ్మాయి పెళ్లి శరత్ తో అయ్యేటట్లు మాట్లాడిరండి అని.. నామాట విన్నారుకాదు.. ఇప్పుడు నాతో చెప్పకుండానే అన్ని ఏర్పాట్లూ చేసేసి నన్ను సర్ ప్రైజ్ చేయాలనే కదూ అంటూ గోముగా అడిగేసరికి ........ అవునే పిచ్చిదానా, సర్ ప్రైజే మరి, శరత్ తో మన దీప్తికి కాదు, శరత్ తో నా చెల్లెలి కూతురు ఆనందికి !

నీకు తెలియదుకదూ...... ఆ శరత్, ఐ..ఏ..ఎస్ ఆఫీసర్ మన ఆనందిని ప్రేమించాడుట.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. అదే సర్ ప్రైజ్ మరి ! వింటున్నావా వసూ అనగానే వసుంధరకు నోటమాటరాలేదు . తానొకటి తలిస్తే ఇలా జరిగిందేమిటా అనుకుంటూ, ఇంక చేసేదేమీ లేక, తన పెద్దరికం నిలబెట్టుకుని మర్యాదగా వధూవరులని దీవించడం తప్ప తనకిప్పుడు వేరే దారి లేదని తలచింది. దైవనిర్ణయం అంటే ఇదే కాబోలనుకుంటూ పెళ్లివారికి మర్యాదలు చేయడం గురించిన ఏర్పాటుల గురించి ఆలోచించసాగింది..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


62 views0 comments

Comments


bottom of page