top of page

అవకాశాలూ - విలువలూ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Avakasalu Viluvalu' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

అమ్మాయికి సంబంధాలు వెతికేటప్పుడు మొదట్లో వచ్చిన ప్రతి సంబంధంలో ఏవో వంకలు వెతుకుతారు కొందరు.

ఆలా వచ్చిన సంబంధాలను వదులుకుంటారు.

అమ్మాయి వయసుపెరిగే కొద్దీ సంబంధాలు రావడం తగ్గుతుంది.

చివరికి అమ్మాయికి పెళ్లి చేయకుండా అలాగే ఉంచాల్సి వస్తుంది.

ఈ పరిస్థితుల్ని ముందే ఊహించిన కావ్య ఎలాంటి నిర్ణయం తీసుసుకుందనేది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.


చేతిలో శుభలేఖలతో రాధ దగ్గరకు వచ్చింది వసుంధర .

“మా అమ్మాయి పెళ్లి వచ్చే ఆదివారం ఉదయం 9.30 కి, రాజరాజేశ్వరీ గార్డెన్స్ లో..

ఇయర్ ఎండింగ్ కదా! వర్కింగ్ డే లో పెళ్లి పెట్టుకుంటే శెలవులు లేక ఎవరూ రాలేరేమో అనుకున్నాం. ఆదివారం ముహూర్తం కలసివచ్చిందని ఫిక్స్ చేసుకున్నాం.. మీరూ మీ వారూ తప్పక రావాలి రాధగారూ” అంటూ పెళ్లి శుభలేఖ చేతికి అందించింది. తరువాత సెక్షన్ లో మిగతా కొలీగ్స్ అందరికీ శుభలేఖలు పంచే నిమిత్తం అక్కడనుండి మరొకరి సీట్ వద్దకు వెళ్లింది వసుంధర .


‘అరే, వసుంధర కూతురికి అప్పుడే పెళ్లి కుదిరిపోయిందా? ఒక సంవత్సరం క్రితమే కదూ చదువు పూర్తి అయిందని, కేంపస్ సెలక్షన్ లో డెలాయిట్ లో జాబ్ వచ్చిందంటూ స్వీట్లు పంచిపెట్టిం’దంటూ బోల్డంత ఆశ్చర్యపోయింది రాధ..


తన కొలీగ్స్ పిల్లలెవరికైనా పెళ్లిళ్లు కుదిరాయని శుభలేఖలు పంచుతుంటుంటే ఏమిటో ఒకలాంటి అసహనం, ఈర్ష్య రాధ మనసునంతా ఆవహిస్తాయి.. ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా తన కూతురికి ఇంతవరకూ పెళ్లి కుదరడం లేదని..


రాధ కూతురికి మొదట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు చక్కని సంబంధాలే వచ్చాయి.. కూతురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి కంపెనీలో ఉద్యోగం, మంచి పే పేకేజ్ ఉన్నందువలన హై స్టేటస్ సంబంధాలవైపే ఉండేది రాధ దృష్టి ఎప్పుడూ.. తన కూతురి సాలరీ కంటే అబ్బాయి పే పేకేజ్ ఎక్కువ ఉండాలని, అబ్బాయి కుటుంబం కూడా మంచి హోదాలో ఉండాలని..

ఒకరకంగా చెప్పాలంటే వచ్చిన సంబంధాలన్నింటినీ శల్యపరీక్షలు చేస్తుంది రాధ..


అబ్బాయికి అక్కచెల్లెళ్లు ఉండకూడదు… రిటైర్ అయినాక అతని తల్లీ తండ్రీ పిల్లవాడి మీద ఆధారపడకూడదు.. కూతురు తెచ్చే నెలకు లక్షన్నర రూపాయల జీతాన్నిఇంట్లో ఎవరూ ఆశించకూడదు.. ఇవీ రాధ ఆలోచనలు.


పైగా తానేదో దూరదృష్టితో ఆలోచించేస్తున్నానని తన స్నేహితురాళ్లను చుట్టూ కూర్చోపెట్టుకుని ఉపన్యాసాలు దంచుతుంది.. పాపం ఆమె కూతురు కావ్య కూడా తల్లి, తనగురించి సరైన నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకంతో ఆమెకంటూ ఏ స్వంత అభిప్రాయాన్నీ ఏర్పరచుకోకుండా తల్లి నిర్ణయానికే అన్నీ వదిలేసింది.


కొంతమంది కొలిగ్స్ చాటుగా అనుకునే మాట " బంగారపు గుడ్లు పెట్టే బాతులాంటి కూతురిని వదులుకోవడం ఈవిడకే ఇష్టం లేదేమోనని".

పిల్లలకు పెళ్లివయస్సు మీరిపోతుంటే లోకం కూడా అనేక రకాలుగా విమర్శించడం జరుగుతూ ఉంటుంది..


వసుంధర కూతురి పెళ్లికి వెళ్లిన రాధ పెళ్లికొడుకుని చూసి ఆశ్చర్య పోయింది. సంవత్సరం క్రితం తాము చూసుకున్న సంబంధమే. తన భర్త ఆఫీస్ కొలిగ్ చెప్పిన సంబంధం ఇది.. అబ్బాయి బి..ఫార్మసీ చదివి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.. ఈ అబ్బాయి వాళ్లది ఉమ్మడికుటుంబం అని, ఈ అబ్బాయి అన్నగారూ వదినా, పెళ్లి కాని ఆడపడుచూ, మరిదీ అలాగే అతని తాతగారూ, బామ్మగారితోబాటూ అతని తల్లీతండ్రీ అందరూ కలిసే ఉంటారని వింది తాను..


అదీగాకా, తన కూతురి సేలరీ లో సగం జీతం మాత్రమే అతనికి వస్తుందని తెలుసుకుని ఒకరకమైన చిన్నచూపుతో వద్దనుకున్నారు అప్పుడు. ఇప్పుడు వసుంధర అదే సంబంధాన్ని తన కూతురికి చేసుకోవడం ఒకింత ఆశ్చర్యానికి లోనైంది..


కానీ ఆ అబ్బాయి ఎంత అందంగా హుందాగా ఉన్నాడు.. తను అప్పుడు చూసినప్పుడూ ఇలాగే ఉన్నాడా? తను అసలు ఆ అబ్బాయిని సరిగా చూస్తేకదా ? అతని జీతం, అతని కుటుంబం, అతని బాధ్యతలను మాత్రమే పరిశీలించింది..


పెళ్లికి వచ్చిన సునంద రాధతో , వసుంధర చాలా లక్కీనే, వాళ్లమ్మాయి కావాలనే ఈ సంబంధమే చేయమందిట.. నాకంటే సాలరీ తక్కువైతే ఏమిటి మమ్మీ, మంచి చదువు, మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయినా ఒక్కో కంపెనీ ఒకోరకంగా ఉంటుంది.. అందరూ ఐ..టీ జాబ్ లే చేస్తారా ? ఫార్మా ఫీల్డ్ ఎవ్వర్ గ్రీన్ ! రేపు నా ఐ..టీ ఉద్యోగానికి ఎసరువస్తే అతని ఉద్యోగమే నన్ను కాపాడుతుందని అందిట.. ఇంకా నా కూతురు ఏమందో చూడవే అంటూ రేపు నాకు పిల్లలు పుడితే ఏ డేకేర్ లోనో వేసేయనక్కరలేదు, ఇంచక్కా ఇంట్లో పెద్దవాళ్లే పెంచుతారని సంబరపడీ మరీ ఈ పెళ్లి చేసుకుంటానందిట..


ఏమో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా తను మాత్రం ఖచ్చితంగా తన కూతురికి తను అనుకున్నట్లుగానే మంచి హోదాగల అబ్బాయితోనే వివాహం జరిపిస్తుంది, కొంచెం లేటైతే కొంప ములిగేది ఏమీ లేదని దృఢంగా సంకల్పించుకుంది..


మరో ఆరునెలలు కాలం ముందుకు సాగిపోయింది..


అనుకోకుండా రాధ కూతురు పని చేస్తున్న ఐ..టి కంపెనీ సరియైన ప్రోజక్ట్ లు లేక ఆర్ధిక సంక్షోభానికి లోనైంది.. ఆ కంపెనీ ఒక్కటేకాదు.. చాలా కంపెనీలకు ఆ పరిస్తితి ఎదురైంది.. ప్రపంచం మొత్తం అనుకోని ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న మూలాన చాలా ఐ..టి.. కంపెనీలు ఎక్కువ జీతాలు పొందుతున్నవారిని తొలగించి ఆ స్థానంలో ఫ్రెషర్స్ ని తక్కువ పే పేకేజ్ తో నియమించుకుంటే కంపెనీకి ఖర్చులు తగ్గడమే కాకుండా ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుందని భావించుకున్నాయి .. ఆ సందర్భంలో రాధ కూతురు కావ్య కు కూడా పింక్ స్లిప్ చేతికిచ్చారు..


ఉన్నట్టుండి పరిస్తితులు తలక్రిందులయ్యాయి..


రాధకు ఆఫీస్ లోనూ సొసైటీలోనూ తన ప్రిస్టేజ్ ఏదో పోయినట్లుగా ఫీలైంది.. అందరూ తనవైపు జాలిగా చూస్తున్నట్లు భావన.. కావ్య మాత్రం, " మమ్మీ నాకైమైపోయిందని అంతగా బాధ పడ్తావు "? .. నా ఉద్యోగం పోతే నా తప్పా ? ఐ..టి ఫీల్డ్ లో ఇదంతా కామన్ .. నీవొకదానివే ఫాల్స్ ఫ్రిస్టేజ్ కి లోనవుతున్నావుగానీ, అందరికీ ప్రస్తుత పరిస్తుతులు మీద అవగాహన ఉందంటూ తల్లిని కోప్పడింది..


ఎందుకో ఈ మధ్య కావ్యకు తన తల్లి ఆలోచనా ధోరణి, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలపట్ల అసహనంగా ఉంటోంది.. తన క్లాస్ మేట్స్, కొలీగ్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్లలని కనేస్తున్నారు.. బేబీ షవర్లకూ, వారి పిల్లల పుట్టినరోజు ఫంక్షనలకు తనని ఆహ్వానిస్తున్నారు.. అక్కడ హాజరౌతున్న వారందరూ చాలా వరకూ తల్లులే.. తనే పెళ్లి కాని యువతిగా ఒంటరిగా ఉన్నానన్న భావన ఈ మధ్య తరచుగా కలుగుతోంది.. ఆఫీస్ లో తన కొలిగ్స్ కొందరు నీకేమమ్మా మొగుడు, పిల్లల టెన్షన్ లేని ఫ్రీ బర్డ్ వి, నీలా ఇరవై నాలుగు గంటలూ వర్క్ అంటూ కూర్చోలేముగా అనేవారు.. మమ్మీ డాడీకి తన పెళ్లి నిర్ణయాన్ని వారిపైనే వదిలేసి తను తప్పు పనిచేసానా అన్న భావన ఆమె మనసుని కలచివేస్తోంది.. ఉద్యోగం పోయినందుకు తనకు బాధ లేదు.. కొంచెం ఆలస్యమైనా మరో ఉద్యోగం ఎక్కడో తనకు దొరక్కపోదు, కానీ తనకు పెళ్లి ఎప్పుడౌతుందో, అసలౌతుందా అనుకోసాగింది..


ఒకరోజు ఏదో పనిమీద బయటకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన కావ్యకు హాల్లో తన తల్లీ తండ్రీ ఎవరితోనో మాట్లాడడం చూసి మౌనంగా లోపలకు వెళ్లిపోయింది.. ఆ వచ్చినతను వెళ్లిపోయాక కావ్య అడిగింది, ' ఎవరమ్మా వచ్చిం’దంటూ?


“మీ నాన్నగారికి బాగా తెలుసున్నాయన.. నీకో సంబంధం గురించి చెప్పారు. వెంటనే ' నో' అని చెపితే బాగుండదని, రెండు రోజుల్లో ఆలోచించుకుని చెపుతామని చెప్పి పంపించేసాం..”


“ఓ అవునా ? ఇంతకీ ఆ అబ్బాయి వివరాలు ఏమిటంట ?”


“అబ్బాయి జే..ఎన్.. టీ యూ లో మ్యాథ్స్ ఫ్యాకల్టీలో లెక్చరర్ ట.. ఎమ్ ఎస్సీ మేధమెటిక్స్ చదివాడు.. చూస్తూ చూస్తూ దగ్గరగా నెలకు రెండులక్షలవరకు సంపాదించుకుంటున్న నిన్ను ఒక లెక్చరర్ కా అనుకుంటున్నాం..

అబ్బాయి తండ్రి ఏదో గవర్న్ మెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడుట.. అంత పెద్ద ఉద్యోగం ఏమీ కాదని చెప్పాడు వచ్చినాయన.. ఇంకో రెండేళ్లల్లో రిటైర్ అవుతాడుట.. ఒక అక్కకు పెళ్లైందని చెప్పారు.. చెల్లెలు ఎమ్ బి ఏ ఆఖరు సంవత్సరం , తమ్ముడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారుట.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇలా బరువులూ బాధ్యతలూ ఉన్న కుటుంబంలోకి నిన్ను పంపడం నాకూ మీ నాన్నకూ ఇష్టంలేదే కావ్యా! అందుకనే ఆలోచించుకుని చెపుతామని ఒక చిన్న సాకు అంతే !”


" అమ్మా ఇలా ఎన్నాళ్లు నాకు పెళ్లి చేయకుండా ఉంటారు?”


తన కూతురేనా ఇలా మాట్లాడుతోందని రాధ ఒక్క క్షణం తెల్లబోయింది..


“అవునమ్మా, వచ్చిన ప్రతీ సంబంధాన్ని మీకు మీరే నిర్ణయించేసుకుని నచ్చలేదని రిజెక్ట్ చేసేస్తున్నారు..నీకీ సంబంధం ఇష్డమేనా కావ్యా అని నన్ను అడగడంకానీ , నా అభిప్రాయం తెలుసుకోవడం కానీ చేయడం లేదు..ఎందుకమ్మా ? నేనింకా చిన్న పిల్లననా?” “


“అదేమిటి కావ్యా అలా అంటావు ? నీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని, నీకు చాలా గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనేకదా మా ఆరాటం అంతా..”

“ఏమిటమ్మా, నా భవిష్యత్ అంటావు ? నాకు ముఫై ఏళ్లు దగ్గరపడుతున్నా ఇంతవరకూ మీరొక నిర్ణయానికి రాలేకపోయారు.. ఎన్నాళ్లీ వెతుకులాటలు ? చూడమ్మా ఐటి ఉద్యోగాలూ, పెద్ద పెద్ద కార్పొరేట్ జాబ్ లే కావాలనుకుంటూ ఇన్నాళ్లూ వచ్చిన సంబంధాలన్నింటినీ కాదన్నారు .. అవతల వ్యక్తి కి ఎంత పే పేకేజ్, హోదా ఉంటే అంత గొప్పనుకుంటూ భ్రమపడ్డారు నీవూ నాన్నానూ.. మీ ఆలోచనలకూ నిర్ణయాలకూ తల వంచాను.. నాదీ తప్పేనమ్మా, నాకంటూ కొన్ని స్వతంత్రాభిప్రాయాలను ఏర్పరచుకుకోకపోవడం.. “

కూతురి మాటలకు రాధ అలా తెల్లబోతూ చూస్తూ ఉండిపోయింది..


నిన్నటి వరకు ప్రతీ విషయానికి నీ ఇష్టం మమ్మీ అనే కావ్య ఈరోజు ఇలా ఎదురుతిరగడం ఆవిడ జీర్ణించుకులేకపోతోంది.. కావ్య తన మాటలను కొనసాగిస్తూ......


“ఇప్పుడు చూడు, నెలకు రెండు లక్షలవరకూ వస్తున్న జాబ్ ఊడిపోయింది.. ప్రస్తుతం నిరుద్యోగిని .. నేను ఐటి జాబ్ తప్పించి మరో జాబ్ చేయలేను. నాకు ఎప్పుడు జాబ్ వస్తుందో తెలియదు . ఆ మేధ్స్ లెక్చరర్ జాబ్ ఎప్పటకీ శాశ్వతం.. జాబ్ పోయినా పది మంది విద్యార్ధులకు చక్కగా లెక్కలు ట్యూషన్ చెప్పుకుంటూ బ్రతికేస్తాడు.. ఇంక బాధ్యతలంటావా ? నేను అతన్ని అతని కుటుంబాన్ని ప్రేమించగలిగితే బాధ్యతలు అంత బరువనిపించవమ్మా.. నేను మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నాను.. నాకు...... నాకు ఈ లెక్చరర్ అబ్బాయితోనే పెళ్లి జరిపించడమ్మా. లేకపోతే నాకు ఇంక పెళ్లేకాదు” అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోతున్న కూతురివైపు ఆవిడ నిశ్చేష్టితురాలై చూస్తూ ఉండిపోయింది.. కూతురి మాటల్లో తను ఇన్నాళ్లూ అర్ధం చేసుకోలేని నిజమేదో ఉందని తెలుసుకుంది.. .. తను చేసిన తప్పేమిటో అర్ధమై కనువిప్పు కలిగింది..


మరో నెలరోజులలో వారి ఇంట్లో కావ్య పెళ్లి బాజాలు వినిపించాయి మేధ్స్ లెక్చరర్ అయిన మాధుసూదన్ తో..


కావ్య అత్తగారూ వాళ్ళు చాలా సంస్కారవంతులు.. కష్టపడి పైకి వచ్చిన కుటుంబం.. కావ్య తల్లిలా ఎటువంటి భేషజాలూ, ఫాల్స్ ప్రిస్టేజ్ లూ చూపించకుండా ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకడం తెలిసినవారు.. కావ్యకు అత్తగారి కుటుంబ పధ్దతులు అన్నీ చాలా నచ్చేసాయి.. ఒక మూడు నెలల తరువాత ఒకరోజు మధుసూదన్ కావ్యను అడిగాడు.. “కావ్యా తిరిగి జాబ్ చేయాలనుందా లేక కూల్ గా తీసుకుంటావా, నీ ఇష్టం, ప్రెషర్ ఏమీ లే”దని..


“లేదు మధూ, జాబ్ చేస్తాను కొన్నాళ్లు.. మీ చెల్లాయ్ సింధుకి పెళ్లి చేసేద్దాం తనకి ఉద్యోగం రాగానే.. అలాగే మీ తమ్ముడు కూడా ఉద్యోగంలో సెటిల్ అయ్యేవరకు జాబ్ చేయాలనుకుంటున్నా.. మనం అందరం కలసి ఉండడానికి ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవద్దా, అప్పటివరకైనా........” అంటూ అమాయకంగా మాట్లాడుతున్న కావ్య వైపు ప్రేమగా చూసాడు..


రెండురోజుల తరువాత మధూ వాళ్ల డిపార్ట్ మెంట్ హెడ్ కు బాగా తెలిసిన ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి కావ్య తన రెజ్యూమ్ ని ఫార్వర్డ్ చేయడం, కావ్య అనుభవాన్ని, ఆమెకున్న స్కిల్స్ ని పరిగణలోకి తీసుకుని ఆ కంపెనీ కావ్యకు మంచి సాలరీతో జాబ్ ఆఫర్ చేసింది..


ఆరోజు తన తల్లితండ్రులు లెక్చరర్ సంబంధం అంటూ పెదవి విరిచినా తనే ధైర్యంగా మధుని పెళ్లిచేసుకుంటానని అడుగు ముందుకేసింది.. ఆ ఒక్క క్షణంలో తను తీసుకున్న నిర్ణయంలో ఇంత గొప్ప ఆనందపు విలువలుంటాయని ఊహించనేలేదనుకుంది తృప్తిగా.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


64 views0 comments

Comments


bottom of page