top of page
Original.png

దెయ్యంతో పెళ్లి

2 hours ago
5 min read

దెయ్యమని భయపడుతున్న వెంకట్ వెనుక టార్చ్ లైట్‌తో నడుస్తున్న నర్స్ కళ్యాణి

Deyyamtho Pelli - Telugu Comedy Story | Jeedigunta Srinivasa Rao

దెయ్యంతో పెళ్లి - తెలుగు హాస్య కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 16/09/2026


అడవిలో రాత్రివేళ తనను వెంటాడుతున్న కొరివి దెయ్యం గురించి భయపడే వెంకట్ కథే ఈ “దెయ్యంతో పెళ్లి”.ఆ దెయ్యం వెనుక ఉన్న అసలు నిజం తెలిసినప్పుడు అతనికి ఎదురైన ఆశ్చర్యం, నవ్వులు, ప్రేమ ఈ కథలో ప్రత్యేక ఆకర్షణ.శ్రీ శ్రీనివాసరావు జీడిగుంట గారు రచించిన ఈ తెలుగు హాస్యకథ కుటుంబ సమేతంగా చదివి ఆనందించదగినది.



అది ఒక ఆదివాసీ ప్రాంతం. రాయించి గ్రామం, మరియా గిరిజన పల్లెకి మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. రాయించి గ్రామంలో పైదయ్య అనే రైతు కుటుంబం అడవిలోకి వెళ్లి కట్టెలు, తేనె తెచ్చుకుని ప్రతి ఆదివారం సంతలో అమ్ముకుని జీవిస్తున్నారు.

అతను తన కొడుకు వెంకట్‌ని గిరిజన స్కూల్‌లో టెన్త్ క్లాస్ వరకు చదివించి, మరియా గిరిజన పల్లెలోని చిన్న బట్టల కొట్టులో గుమస్తాగా పెట్టాడు. రోజూ ఉదయం అన్నం బాక్స్ పట్టుకుని అడవి దాటి తను పనిచేసే బట్టల షాప్‌కి చేరేవాడు.


ఆదివారం సంత ఉన్న రోజు మాత్రం షాపులో గిరాకీ ఉండేది, మామూలు రోజులలో బేరం ఎక్కువ ఉండేది కాదు. బేరం లేకపోయినా షాప్ రాత్రి తొమ్మిది గంటల వరకు మూయడానికి యజమాని అంగీకరించకపోవడంతో, అడవి దాటి పది గంటలకు ఇంటికి చేరేవాడు.


ఆ రోజు శనివారం. ఆదివారం అమావాస్య అవ్వడంతో సంత శనివారం ఉదయం మొదలైంది. చిన్న పల్లె జనంతో నిండిపోయింది. చుట్టుపక్కల పెద్ద గ్రామాల నుండి కూడా సంతలో కొనుక్కోవడానికి వచ్చేశారు. బట్టల కొట్టులో కూడా గిరాకీ బాగుంది. పక్క వీధిలో ఉన్న ఆర్.ఎం.పి. డాక్టర్ కూడా ఇంజెక్షన్స్ మీద ఇంజెక్షన్స్ పొడిచేస్తున్నాడు.


బట్టల కొట్టు తలుపులు మూసివేసి, తాళం యజమానికి ఇచ్చి మెల్లగా తన ఊరి వైపు నడుస్తున్నాడు వెంకట్. యజమాని ఇచ్చిన వెయ్యి రూపాయలు అమ్మకి ఇచ్చి, నాన్నతో పట్నం వెళ్లి నడుం నొప్పికి బెల్ట్ కొనుక్కోమనాలి అనుకుంటూ అడవిలోకి వచ్చాడు. చిక్కని చీకటి, అలవాటైన దారి కాబట్టి చకచకా నడుస్తున్నాడు.


పెద్దగా గాలి రావడంతో ఏదో చెట్టు కొమ్మ విరిగి వెంకట్‌కి దగ్గర్లో పడింది. ఇంకొంచెం ఉంటే నెత్తిన పడేది! ఈ అడవి కూడా ఇళ్లతో నిండితే రెండు ఊళ్లు కలిసిపోతాయి, అప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కోవాలి అనుకుంటూ, తన వెనుక నుంచి అడుగుల చప్పుడు వినిపించడంతో భయంతో వెనక్కి తిరిగి చూశాడు.


దూరంగా కాంతి కదులుతూ వస్తోంది. గాలికి తెల్లగా వెడల్పుగా ఊగుతూ రావడం, అప్పుడే తను చింతచెట్టు దగ్గరికి రావడంతో — "కొంపదీసి దెయ్యం కాదు కదా?" అనుకుని కొద్దిగా ఆగి చూశాడు.


లైట్ కూడా ఆగిపోవడంతో, "బాబోయ్ దెయ్యం!" అనుకుంటూ పరుగులు పెట్టి తన ఊరికి చేరుకుని వెనక్కి తిరిగి చూశాడు. ఇంతవరకు తనని వెంటపడ్డ కొరివి దెయ్యం కనిపించకపోవడంతో ఇంటికి చేరుకుని విషయం తల్లికి చెప్పాడు.


"పూర్వం దెయ్యాలు ఉండేవిట, ఇప్పుడు నీకు కనిపించింది ఏ మెరిసే పురుగో అయివుంటుంది, అవి కూడా వెలుగుతో మన వెంట వస్తాయి. నీకు రేపు మెడలో ఆంజనేయస్వామి త్రాడు కడతాను, నిజంగా దెయ్యం అయినా పారిపోవాల్సిందే" అంది.


ఉదయమే లేచి ఆంజనేయస్వామి పూజ చేసి, కొడుకు మెడలో నల్ల త్రాడు కట్టింది వెంకట్ తల్లి. లంచ్ బాక్స్ పట్టుకుని యథావిధిగా బట్టల షాప్‌కి బయలుదేరాడు. "ఆదివారం కూడా నాకు ఈ ఉద్యోగం తప్పడం లేదు, ఈ రోజు సంత ఉండదు, యజమాని తనని త్వరగా ఇంటికి పంపితే బాగుండును" అనుకుంటూ షాప్‌కి చేరాడు.


గిరాకీ ఉండదు అనుకుంటే జనం బాగానే రావడంతో ఎప్పటిలా రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి బయలుదేరాడు వెంకట్. అడవిలోకి రాగానే గుండెల్లో దడ మొదలైంది, వెనక్కి చూసుకుంటూ అలవాటైన దారిలో నడుస్తున్నాడు. ఇంతవరకు దెయ్యం జాడ కనిపించకపోవడంతో, "ఆంజనేయస్వామి మహత్యం! లంకిణి లాంటి దెయ్యాలనే చంపిన స్వామికి ఈ కొరివి దెయ్యం ఒక లెక్కా?" అనుకుంటూ ఇంటికి చేరాడు.


ఈ రోజు దెయ్యం కనిపించిందా అని తల్లి అడగటం, "లేదమ్మా, నువ్వు కట్టిన త్రాడుతో దెయ్యం పారిపోయింది" అన్నాడు వెంకట్. షాప్‌లో పనితో అలసిపోయి ఏ ఆలోచన లేకుండా ఇంటికి వచ్చేసేవాడు వెంకట్.


ఆ రోజు గురువారం, అడవిలోకి రాగానే దెయ్యం విషయం గుర్తుకు వచ్చి వెనక్కి చూశాడు. గుండె ఆగిపోయింది! దెయ్యం కాంతి తన వెనకే రావడం చూసి పరుగులు తీశాడు. వెనుక నుంచి కాంతి కూడా తన వైపు స్పీడ్‌గా రావడంతో, కంగారుగా తన విలేజ్‌లోని చెరువు గట్టు దగ్గర అరుస్తూ పడిపోయాడు.


అసలే పల్లె, దానికి తోడు రాత్రి తొమ్మిది దాటింది, జనం తిరగడం తక్కువగా ఉంది. వెంకట్ అరుపులు విన్న ఊరి గుడి పూజారి పరుగున వచ్చి, లాంతరు వెలుగులో వెంకట్‌ని గుర్తించి, పైదయ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పి, నలుగురిని తీసుకుని వచ్చి వెంకట్‌ని ఇంటికి చేర్చారు. పూజారి గారు మంత్రించిన నీళ్లు వెంకట్ మొహం మీద చల్లగానే కళ్లు తెరిచి, "దెయ్యం!" అని అరవసాగాడు.


"దెయ్యం ఏమిటిరా? పూజారి గారు, నేను, మీ అమ్మా ఉన్నాం" అన్నాడు కొడుకు పక్కన కూర్చుని పైదయ్య.


"లేదండి, మూడు రోజుల క్రితం నాతో చెప్పాడు అడవిలో ఒక కొరివి దెయ్యం వీడి వెంటపడింది అని" అంది పైదయ్య భార్య.


"మరి నాకు చెప్పలేదే? సహాయంగా సాయంత్రం నేను వాడి షాప్ దగ్గరికి వెళ్లి వెంట తీసుకుని వచ్చేవాడిని" అన్నాడు పైదయ్య.


"భయం లేదు వెంకట్, రేపు గుడిలో శివుడికి పూజ చేసి విభూతి తెచ్చి ఇస్తాను. రోజూ బొట్టు పెట్టుకుని వెళ్లు, దెయ్యం పారిపోతుంది" అని పూజారి గారు ఇంటికి వెళ్లిపోయారు.


భయంతో వెంకట్‌కి జ్వరం వచ్చింది. బట్టల కొట్టుకి రాలేను అని తండ్రితో కబురు పెట్టి, తల్లి ఇచ్చిన మిరియాల కషాయం తాగి పడుకున్నాడు. పూజారిగారు రాత్రి గుడి కట్టేసి విభూతి పొట్లంతో పైదయ్య ఇంటికి వచ్చి, వెంకట్ జ్వరం విషయం తెలుసుకుని, "అయ్యో! పిల్లాడు బాగా దడుచుకున్నాడు అనుకుంటా. మన ఊరి నుంచి ఒక అమ్మాయి గిరిజన పల్లెలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెను వచ్చి ఒకసారి వెంకట్‌ని చూసి ఏదైనా మందు ఇమ్మంటాను" అని వెళ్లిపోయాడు.


ఉదయం ఎనిమిది గంటలకు మెరుపు తీగలాంటి నర్స్, డ్రెస్‌లో వచ్చి వెంకట్ వాళ్ల అమ్మని కలిసి, "పూజారిగారు పంపించారు, మీ అబ్బాయికి ఒంట్లో బాగుండలేదు అని చెప్పారు" అంది. ఆమె పేరు కళ్యాణి.


"రా అమ్మా, రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడు" అని నర్స్‌ని కొడుకు ఉన్న గదిలోకి తీసుకుని వెళ్లి, తను వంటగదిలోకి కాఫీ కలపడానికి వెళ్లింది.


"ఏమిటి ప్రాబ్లెమ్?" అని అడిగింది కళ్యాణి.


"నేను రోజూ మరియా గిరిజన పల్లె నుంచి రాత్రి బట్టల షాప్ మూసివేసిన తరువాత ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా, అడవి మధ్యకి వచ్చేసరికి ఒక కొరివి దెయ్యం నా వెంట పడుతోంది. దానితో నిన్నటి నుంచి జ్వరం పట్టుకుంది" అన్నాడు వెంకట్.


టెంపరేచర్ చూసి, "జ్వరం ఎక్కువ లేదు. నేను కూడా అదే పల్లెలో డాక్టర్ గారి హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్నాను ఒక పది రోజుల నుంచి. మా తల్లిదండ్రులు ఈ ఊరిలోనే ఉండటంతో నాకు పట్నంలో ఉద్యోగం చేయాలని ఉన్నా తప్పనిసరి పరిస్థితి వలన గిరిజన పల్లెలో ఆర్.ఎం.పి. డాక్టర్ దగ్గర నెలకి పది వేలకి ఉద్యోగం చేస్తున్నాను. అది సరే, రాత్రి మీకు దెయ్యం ఎన్నింటికి కనిపిస్తోంది?" అని అడిగింది.


"మా యజమాని బట్టల కొట్టు రాత్రి తొమ్మిది గంటలకు మూసివేసి వెళ్ళిపోతాడు, నేను అప్పుడు బయలుదేరి ఇంటికి చేరుకుంటాను" అన్నాడు వెంకట్.


"అరే! నేను కూడా అదే సమయంలో బయలుదేరుతాను. అడవి దాటి రావడం భయంగా ఉండటంతో రోజూ ఒక వ్యక్తి నా ముందు నడుస్తూ మన పల్లె వైపు వెళ్లడం చూసి, అతని వెనుకే నేను వస్తున్నాను. కొంపదీసి మీరు నన్ను చూసి దెయ్యం అనుకోలేదుగా?" అంది నవ్వుతూ.


"లేదండి, ఆ దెయ్యం లైట్ వెలుగుతో తెల్లగా ఉంది" అన్నాడు.


"అయితే అది నేనే! నా నర్స్ డ్రెస్ తెల్లగానే ఉంటుంది, దారి కనపడటానికి టార్చ్ లైట్ వేసుకుని వస్తూ ఉంటాను. భలేవారే, మనం ఒకరికి తెలియకుండా ఒకరం వెంట నడుస్తున్నాము! మీ వెనుక ఉంటే భయం ఉండదు అని అనుకుంటే, మీరే భయపడి పోయారన్నమాట" అంది నవ్వుతూ.


సంగతి విన్న వెంకట్ తల్లి నవ్వుకుంటూ, "బాగానే ఉంది వరస, బంగారం లాంటి అమ్మాయిని దెయ్యం అని ఎలా అనుకున్నావురా?" అంది.


"నాకేం తెలుసమ్మా? ఆ టైములో మన ఊరికి నేను తప్ప ఎవ్వరూ అడవి దారిలో రారు. సడన్‌గా ఈవిడ వస్తుంది అని నాకు ఎలా తెలుసు?" అన్నాడు.


"సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఆలస్యం అయితే మా డాక్టర్ గారు ఎగిరిపడతారు" అని లేచింది.


"రేపటి నుంచి వచ్చేటప్పుడు మీరిద్దరూ కలిసి రండి" అంది వెంకట్ వాళ్ల అమ్మ.


భర్త ఇంటికి వచ్చిన తరువాత విషయం చెప్పి, "రేపటి నుంచి ఆ అమ్మాయి, మన వెంకట్ కలిసి రమ్మన్నాను" అంది.


"దెయ్యంతో వచ్చినా పర్వాలేదు, పెళ్లికాని పిల్లలు కలిసి వస్తే ప్రమాదం" అన్నాడు పైదయ్య.


అనుకున్నట్టే వెంకట్, కల్యాణి కలిసి అడవి దాటేవాళ్లు. చనువు కూడా పెరిగింది. ఒకరోజు రాత్రి వెంకట్, కల్యాణి చేతులు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ అడవిలో నడుస్తున్నారు.


"వెంకట్, వెనక్కి చూడు! ఏదో లైట్ కాంతి మన వెనకే వస్తోంది. మనమిద్దరం ఇక్కడే ఉన్నాం, కొంపదీసి దెయ్యం కాదు కదా?" అంది కల్యాణి.


"ఎందుకైనా మంచిది, త్వరగా నడుద్దాం" అంటూ వేగం పెంచారు. ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్న తరువాత వెంకట్ తన తల్లికి చెప్పాడు, తమ వెనుక ఏదో లైట్ వెంబడించింది అని.


ఇంతలో లోపలికి వస్తున్న తండ్రి, "ఆ లైట్ నేనే! మీ స్నేహం వివాహంగా మార్చాలనుకున్నాను మిమ్మల్ని చూసిన తరువాత" అన్నాడు.


అనుకోవడం, వెంటనే మాటలు, ఆ తరువాత పెళ్లి జరిగిపోయింది.


"శుభాకాంక్షలు! మొత్తానికి దెయ్యంతో పెళ్లి జరిగింది" అన్నాడు శాస్త్రిగారు.

మనుషుల్లో ఉండే చెడు గుణాల కంటే దెయ్యాలు వేరే ఉండవు కదా!


శుభం



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జీడిగుంట శ్రీనివాసరావు

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
30 /10 /2022  తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page