top of page

సంక్రాంతి సరిగమలు


'Sankranthi Sambaralu' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

మాధవరావు బాస్ ఛాంబర్ డోర్ తీసి " మే ఐ కమిన్ సర్ " అన్నాడు. " ఎస్ కమిన్ " అన్నాడు బాస్ యధాలాపంగా. మాధవరావు లోపలికి వెళ్లి " గుడ్ మోర్నింగ్ సర్ " అన్నాడు. " గుడ్ మోర్నింగ్ . చెప్పండి మిస్టర్ మాధవరావ్ ' అన్నాడు బాస్. " సార్ ... " అంటూ నసుగుతున్న మాధవరావును చూసి " ఎనీ ప్రోబ్లమ్ ? " అడిగేడు బాస్ భాస్కరరావు. “ ఏం లేదు సర్. ఓ నాలుగు రోజులు సెలవు కావాలి.” అసలు విషయం బయటపెట్టేడు మాధవరావు. “ అదేంటి? నిన్న గాక మొన్ననే కదా సెలవునుండి వచ్చేరు. మళ్ళీ అప్పుడే సెలవేంటి?” చిరాగ్గా అన్నాడు బాస్. “ సెలవు కావలసింది ఇప్పుడు కాదు సర్.” “ మరి? “ “ సంక్రాంతికి సర్.” “ పండక్కి ఇంకా చాలా టైము ఉంది కదా! అప్పుడు చూద్దాం లెండి.” చెప్పేడు బాస్. “ అది కాదు సర్.ట్రెయిన్ కి రిజర్వేషన్ లాగే సెలవుకికూడా ముందుగా అప్లయి చేసుకోకపోతే దొరకడం కష్టమని. అందులోనూ ఇదే నేను మొదటి సారిగా పండక్కి అత్తారింటికెళ్ళడం ” తన ఉద్దేశం వెలిబుచ్చేడు మాధవరావు. “ మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.మీదే మొదటి రిక్వెస్ట్ కదా. ఓ కే గ్రాంటెడ్.” అని బాస్ అనగానే దేవుడు వరమిచ్చినట్లుగా ఫీలయిపోయేడు మాధవరావు. థాంక్ యు వెరీ మచ్ సర్.” అన్నాడు. “ చూడండి మిస్టర్ మాధవరావ్! అసలు పండగంటే గుర్తుకొచ్చింది “ అని బాస్ మొదలు పెట్టగానే “ అయ్యబాబోయ్! దొరికి పోయేను. తప్పుతుందా!” అనుకున్నాడు మాధవరావు.

ఇంతలో ఫోన్ మ్రోగింది. “ హలో! నేనే మాట్లాడుతున్నాను.ఏమిటీ! నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో జి. ఎం. గారి ప్రోగ్రామా? “ అని బాస్ మాట్లాడుతుంటే మాధవరావు తన సెలవు గోవిందా అనుకున్నాడు.ఇంతలో బాస్ “ విన్నారు కదా మాధవరావ్! జి. ఎం. గారు వస్తున్నారట.సరిగ్గా పండగ ముందే.మీ సెలవు సంగతి మరి చెప్పలేను.” అన్నాడు బాస్. ‘ వాళ్లకు పండగలూ,పబ్బాలూ ఉండవు కాబోలు.’ సణుక్కున్నాడు మాధవరావు.


ఏంటంటున్నారు? “ అడిగేడు బాస్. “ అబ్బే! ఏం లేదు సర్. జి.ఎం.గారు రావడం తెలీకముందే నాకు సెలవు గ్రాంట్ చేసేసేరు కద సర్.” లా పాయింట్ తీసేడు మాధవరావు. “ అదిగో అదిగో అలాంటి ధర్మసంకటంలో పడేస్తున్నారు నన్ను.ఎప్పుడు అవసరమొస్తుందో చెప్పలేను.గ్యారంటీ ఇవ్వలేను. సరేగాని మీ సెక్షన్ లో పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తేనే మీరు సెలవులో వెళ్ళేది.” కండిషన్ పెట్టాడు బాస్. అయినా ఆమాత్రం భరోసా ఇచ్చినందుకు ఎగిరి గంతేసినంత పని చేసేడు మాధవరావు. ఓ కే సర్ అన్నాడు. “ పండగ అంటే గుర్తుకొచ్చింది. నా ఎర్లీ డేస్ ఆఫ్ మేరేజ్ లో ఏమైందో తెలుసా?” మళ్ళీ మొదలుపెట్టేడు బాస్. “ ఏంటి సార్? మీకు కూడా సెలవు దొరకలేదా?” అని అడిగేడు. “ యు ఆర్ ఎగ్జాట్లీ కరెక్ట్.బాగా కనిపెట్టేరు.” “ మరి అప్పుడేం చేసేరు సర్?” అని మాధవరావు అడుగుతుండగానే మళ్ళీ ఫోన్ మ్రోగింది.”అబ్బ! మధ్యలో ఇదొకటి అంటూ ఫోన్ తీసి “ హలో! ...హలో!...హలో!....అరె! కాల్ కట్ అయినట్లుంది. చూడు మిస్టర్ మాధవరావ్! టెలిఫోన్ బిల్ కట్టేసేరో లేదో చూడండి. లేకపోతె ఇప్పుడు కాల్ కట్ అయింది. తర్వాత టెలిఫోన్ కనెక్షన్ కట్ అవుతుంది.” అన్నాడు బాస్. “ అలాగే సర్ “ అని ఇదే అదనుగా ఆ పని మీద వెళ్తున్నట్లు అక్కడినుండి తప్పించుకున్నాడు మాధవరావు. * * “ ఏమండీ!” మాధవరావు శ్రీమతి లత పిలిచింది భర్తని.” ఎస్ మేడమ్! “ అన్నాడు మాధవరావు. “ అయితే పండక్కి సెలవు సేంక్షన్ అయినట్లేనా?” “ అయినట్లేనా ఏంటి? అడ్వాన్స్ బుకింగ్ అయితే !” “ మీరన్నిట్లోనూ అడ్వాన్స్ డే కానీ ఇక్కడ మాత్రం అడ్వాన్స్ అయిపోకండి. ఇంతకీ మన ప్రయాణమెప్పుడు?” అడిగింది “ ఎక్కడికి?” అన్నాడు మాధవరావు. “ ఇంకెక్కడికి? మా ఇంటికి సారీ! మా పుట్టింటికి అదే మీ అత్తారింటికి.” చెప్పింది “ బాగుంది వరస.పండక్కి మూడు రోజులు సెలవివ్వడమే భాగ్యం.ఇప్పటినుండీ నన్ను నీతో వచ్చేయమంటావా ఏమిటి?” అడిగేడు భార్యని. “ అల్లుడా రమ్మని ఆదరమ్మున పిలువ అని పండక్కి ముందుగా రమ్మని పిలిచేరు కదా మా వాళ్ళు మిమ్మల్ని.” గుర్తు చేసింది. “ నిన్నోక్కర్తెనూ రమ్మంటే బాగుండదని అలా పిలుస్తారు. అంతే కాని ఇప్పట్నుండీ నేనూ నీతో వచ్చి కూచుంటే పండగనాటికి మజ్జిగ పలచనైపోతుంది.” ముందు జాగ్రత్తగా చెప్పేడు మాధవరావు. “ మీకా భయమేమీ అక్కర్లేదు.మావాళ్ళేమీ అలాంటి వాళ్ళు కాదు.” పుట్టింటిని సపోర్ట్ చేసింది లత ఓ కూతురిగా. “ అయినా ముందు నువ్వెళ్ళు.పండగ ముందు రోజు నేను వస్తాను.ఈ లోగా మీ వాళ్ళను పొంగల్ గిఫ్ట్ రడి చేసి ఉంచమను. కట్నం ఎలాగూ లేదు.” అన్నాడు ఓ అల్లుడి లాగ.

“ ఆశ” అంది అర్థాంగి. “ ఏం ఇవ్వరా?” “ ఇవ్వకపోతే ఏం చేస్తారు?” చిలిపిగా అడిగింది ఇల్లాలు. “ అలకపాన్పు ఎక్కుతాను.” “ ఎక్కి ఎంతసేపు ఉంటారు?” అంది భార్యామణి. “ పండగ కట్నం ఇచ్చేవరకూ.”చెప్పేడు. “ అదే ఇవ్వకపోతే?” ప్రశ్నవేసింది కొంటెగా.” “ దిగి వచ్చేస్తాను” అన్నాడు మాధవరావు నవ్వుతూ. “ అలా రండి దారికి.”అంది లత. ‘ నువ్వేమంటావో అని జోక్ చేసేను. అంతే కానీ పెళ్ళిలో కట్నం,పండగలో కట్నం,వస్తే కట్నం,వెళ్ళిపోవడానికి కట్నం ఇలాంటివేవీ నాకు నచ్చవ్.” అన్నాడు ఉత్తమ జామాతలా. “ అందుకే కదా మీరు నాకు నచ్చింది.” మెప్పుకోలుగా అంది సతీమణి. “ ఆ! ఆ! స్టాప్. నీ పొగడ్తలకు నేనుబ్బిపోయి నా షర్ట్ టైట్ అయిపోతుంది కాని ఇంతకీ నీ క్యాంపు ఎప్పుడు?” అడిగేడు భార్యని. “ తమరెప్పుడు పంపిస్తే అప్పుడు. మరి మీ భోజనం?” “ సత్రం భోజనం మఠం నిద్ర తమరొచ్చేవరకూ.” చెప్పేడు. “ పోనీ మనిద్దరం కలిసే వెళ్దాం.” అంది పార్ట్నర్ “ ఎందుకూ? అల్లుడు అమ్మాయిని ముందుగా పంపించలేదని మీ వాళ్ళు అనుకోడానికా?” “ మా వాళ్ళ మాటేమో గాని మా చెల్లాయి అంటుంది ‘ బావగారు అక్కనొదిలి ఉండలేక పంపలేదు’ అని” “ మీ చెల్లెలికీ ఆ మూడు ముళ్ళూ పడితే ఆవిడగారూ మొగుడినొదిలి రాదు.” చురక అంటించేడు బావలా. “ ఆ పుణ్యమేదో మీరు కట్టుకుందురూ “ అని లత అనగానే “ ఏమిటీ మీ చెల్లెల్నీ నేనే కట్టుకోవాలా? తెలుగు సినిమా హీరోనా ఇద్దరు హీరోయిన్లుండడానికి” హాస్యంగా అన్నాడు మాధవరావు. “ అబ్బ! వక్రభాష్యం చెప్పమంటే మీ తర్వాతే. ఇంతకీ ఎప్పుడెళ్ళమంటారు?” మళ్ళీ అడిగింది. “ నీ ఇష్టం. నీకూ సెలవు గ్రాంట్ చెయ్యాలా?” “ మరి ఇంట్లో మీరు నాకు బాస్ కదా” “ అయితే ఓ కే గ్రాంటెడ్.” ఇద్దరి నవ్వులతో ఇంటికి అప్పుడే పండగ కళ వచ్చేసింది. * * “ మేడమ్! మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు.” చెప్పేడు ఆఫీస్ అటెండర్ అప్పారావు సుభాషిణికి. “ పిలిచేరా సర్ “ అంటూ బాస్ ఛాంబర్ లోకి వెళ్ళింది సుభాషిణి. “ ఆ! రండి సుభాషిణి గారూ” “ చెప్పండి సర్” “ “ ఏం చెప్పమంటారమ్మా. రేషన్ కార్డు అప్లికేషన్లూ,గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్లలా ఏమిటీ లీవ్ అప్లికేషన్లూ,ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్లూను.చూడలేక చస్తున్నాను.పండగ అడ్వాన్స్ అంటే జీతంలో కట్ అయిపోయేది కాబట్టి ఇచ్చేస్తాను.కాని సెలవులు ఎంతమందికి ఇవ్వగలను?” అంటూ వాపోయేడు బాస్. “ అందరికీ పండగే కదా సర్ “ సర్ది చెప్పింది సుభాషిణి. “ అలా అని అందరూ సెలవులో వెళ్ళిపోతే మరి ఆఫీస్ నడిచేదేట్లా? అందుకే ఫస్ట్ కం ఫస్ట్ అని వరుసలో పెట్టేను.మీరేమో లాస్ట్ లో వచ్చి ఇప్పుడు సెలవు కావాలంటే ఎలా అమ్మా?” అన్నాడు బాస్. “ వాళ్ళంతా ప్లాన్డ్ గా ముందనుకుని అప్లయి చేసేసేరు సర్.నాకు తెలియదు.అయినా మీరు కాదనరనే నమ్మకంతోనే ...” “ అదిగో ఆ ఆయుధమే వద్దన్నాను.” “ ఏం చెయ్యను సర్. మా ఆయన హైదరాబాద్ లో. నేనిక్కడ.ఉద్యోగరీత్యా తప్పదు కద సర్.ఓ సారి ఆయన సెలవు మీద ఇక్కడికొస్తే ఓ సారి నేను అక్కడికి వెళ్తుంటాను.ఈ సారి ఆయనకు సెలవు దొరకలేదు సర్.అందుకని.” కారణం చెప్పింది. “ అదిగో మళ్ళీ భార్యాభర్తల సెంటిమెంట్ తో కట్టి పడేస్తున్నావ్.” అన్న బాస్ ఆరోపణకు సమాధానంగా సుభాషిణి “గవర్నమెంట్ జాబ్ అయితే ఎలాగోలా అవస్థలు పడి ఇద్దరం ఒకే దగ్గర వేయించుకునేవాళ్ళం సర్ .కానీ ఇద్దరివీ ప్రైవేటు జాబ్ లాయె.అంచేత తప్పలేదు మరి.” విడమరచి చెప్పింది. “ సరే నా సీట్ లో నువ్వే ఉన్నావనుకో.ఇలా అప్లై చేసినవాళ్ళకెంతమందికి సెలవిస్తావ్? అందరూ సెలవు అవసరమనే అంటారు.” టెస్ట్ పెట్టేడు బాస్. “ చెప్పమంటారా సర్ “ ‘ చెప్పమ్మా” అనగానే చెప్పడం ప్రారంభించింది సుభాషిణి. “ బేచెలర్స్ కి ఇవ్వను సర్ . వాళ్ళు ఎక్కడుంటే అక్కడే పండుగ. క్రొత్తగా పెళ్ళయిన వాళ్ళకిస్తాను ఎందుకంటే వాళ్లకి మొదటి పండగ ముచ్చట్లు తప్పనిసరి కాబట్టి. ఇద్దరు పిల్లలు దాటి ఉన్నవాళ్ళకు ఇవ్వను సర్. అప్పటికి వాళ్ళ అత్తగారికి అల్లుడ్ని పిలిచే స్తోమత ఉండదు కాబట్టి. నా కేసులా భార్యాభర్తలు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నవాళ్ళకిస్తాను నాకు స్వానుభవం కనుక. కూతుళ్ళు లేని వాళ్లకివ్వను సర్.” “ ఏం పాపం?” “ వాళ్లకు అల్లుళ్ళు వచ్చేది ఉండదు కద సర్ . వయసు మళ్ళిన వాళ్లకివ్వను. వాళ్లకు పండగ సరదాలు తీరిపోయి ఉంటాయి.” అనగానే “ వండర్ ఫుల్. యు ఆర్ జీనియస్. నా పని సులువు చేసేవు. నీ లీవ్ సేంక్షండ్. సరే నువ్వు చెప్పిన ప్రకారం సెలవులిస్తే మన ఆఫీస్ లో మిగిలే వాళ్లుంటారా? “ అడిగేడు బాస్. “ ఉంటారు సర్. బేచిలర్ బ్రహ్మాజీరావుగారూ, ముగ్గురబ్బాయిలున్న మూర్తిగారూ, సూపరింటేండెంట్ సుబ్రహ్మణ్యంగారూ ఇలా ...” “ చాలు చాలు గాని ఇక మీరు వెళ్ళండమ్మా “ అనగానే “ థాంక్ యు సర్” అంటూ ఛాంబర్ లోంచి బయటకు వచ్చేసింది సుభాషిణి. * * భోగి ముందు రోజు సాయంకాలం పుట్టింట్లో లత గుమ్మం దగ్గర నిలబడి రోడ్డువైపు చూస్తుంది.” అక్కా! వచ్చే బావగారు వీధిలోనే ఆగిపోరు కాని ఎంతసేపు అలా చూస్తావ్? “ అంది లత చెల్లెలు ఉమ. “ ఉమా! ఏమిటే నీ అల్లరి? బావగార్ని ఆటపట్టిస్తే అర్థముంది గాని అక్కతో హాస్యాలేంటి?” మందలించింది తల్లి లలిత. “ రిహార్సల్ వేసుకుంటుందేమోనే “ అంటూ వచ్చేడు తండ్రి రమణమూర్తి. “ ఈయనొకరు.తప్పమ్మా అని చెప్పడంపోయి...” అంది లలిత “ ఎలా చెప్తాను? నీ చెల్లెలు నన్ను ఆట పట్టించలేదూ? “ గుర్తుచేసేడు రమణమూర్తి. “ అల్లుడొస్తే మిమ్మల్ని ఆటపట్టిస్తాడు చూడండి. అది కావాలి,ఇది కావాలి అని.” చెప్పింది ముందు హెచ్చరికగా భర్తకు. “ అల్లుడేం అలా పేచీ పెట్టడు ఏదీ కావాలని అడగడు.” అల్లుడ్ని సమర్ధిస్తూ అన్న భర్తతో “ మామా,అల్లుళ్ళు ఒక్కటైపోయేరా లేక ముందరి కాళ్ళబంధమా?” అంది లలిత. ఇలా వాదించుకుంటుండగా ఇంటి ముందు ఆటో వచ్చి ఆగింది.” అక్కా! బావగారొచ్చేరు “ చెప్పింది ఉమ. “ నువ్వు చెప్తే అది నమ్మదు లేవే.” అంది తల్లి. ‘బావగారూ! బాగున్నారా!’ పలకరించింది ఉమ. “ హాయ్! మిస్సమ్మా!” అన్నాడు మాధవరావు. “ మిస్సమ్మా ఏంటి? నా పేరు ఉమ.” ఉక్రోషంగా అంది “ అదే మరదలా!మిస్ ఉమ “ అనగానే అందరూ ఒక్కసారి నవ్వుకున్నారు. “ ఆ సూట్ కేస్ ఇలా ఇవ్వండి బావగారూ!” అంటూ అందుకోబోతుంటే “ నువ్వు మొయ్యలేవు మరదలా!” అన్నాడు మాధవరావు. “ ఏం అంత బరువుందా బావగారూ! అక్కకోసం సారీ మాకోసం ఏం తెచ్చేరో ఏదీ ఇలా తెండి చూస్తాను.” అంది మరదలు.” చూద్దువుగాని పద “ అన్నాడు బావ.ఇంతలో “ బావగారూ! ఆటోలో ఎదో వదిలేసి వచ్చినట్లుంది.” అనగానే “ ఇంకేం వదిలేస్తాను? సూట్ కేస్ ఒకటే తెచ్చెను “ అన్నాడు మాధవరావు. “ మీరు ఆటో దిగి వచ్చేరంటే సీటు వదిలి వచ్చినట్లే కదా!” జోక్ విప్పింది మరదలు పిల్ల.

తల్లి లలిత “ ఏమిటే గుమ్మంలోనే!” అని మందలిస్తూ అల్లుడితో “ బాగున్నారా బాబూ! ఏమనుకోకండి. దానికెంత తోస్తే అంతా వాగేస్తుంది. ఎంత చెప్పినా వినదు .పెంకితనం ఎక్కువ.” సర్ది చెప్పింది. మామగారు కూడా అల్లుడ్ని పలకరించేరు.

అక్కడున్న కొడుకు బాబీతో “ ఒరేయ్ బాబీ! బావగారు కాళ్ళు కడుగుకోవడానికి చెంబుతో నీళ్ళు తీసుకురా “ అని పురమాయించేరు.” అంతే కదా! మళ్ళీ బావగారికి కాళ్ళు కడుగుతారేమోనని” అంది మరదలు. “ కాళ్ళు కడిగితే కన్యాదానం చెయ్యాలి మరదలా! మీ అక్కయ్య ఒప్పుకుంటుందేమో చూడు.” ఛలోక్తి విసిరేడు బావ. ”ఇంతకీ మీ అక్కయ్యేదీ? “ అడిగేడు. “ అదిగో! మీరు కాళ్ళు కడుక్కోవడానికి అప్పుడే చెంబుతో నీళ్ళు పట్టుకుని రడీగా ఉంది చూడండి.” “ దానితో ఏంటి మీరు పదండి బాబూ.” అంది అత్తగారు. * * భోజనానికి రమ్మని మాధవరావు కి పిలుపు వచ్చింది.” రావోయ్! అల్లుడూ!” అన్నారు మామగారు.” రండి బావగారూ! విందుకు ముందు సందుకు వెనక ఉండాలిట.” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ తీసేసింది.” అదేమిటే! కుర్చీ తీసేస్తున్నావ్! బావగారు కూర్చుంటారు అక్కడ.” అంది తల్లి. “ అందుకే తీసేస్తున్నాను.కూచుని తింటే కొండలైనా తరిగిపోతాయని బావగారే అన్నట్టు గుర్తు.అందుకని.” అంది హాస్యమాడుతూ. “ చూడు.ఉమా! వేళాకోళానికైనా వేళా,పాళా ఉండాలి. సమయం సందర్భం ఉండాలి.హద్దూ,పద్దూ ఉండాలి.” అని అల్లుడితో “ మరేం అనుకోకండి బాబూ!” అంది అత్తగారు. “ పరవాలేదులెండి. బావగారితో హాస్యమాడే లైసెన్స్ మరదలికి ఎప్పుడూ ఉంటుంది.” అన్నాడు ఓ బావగా. “ మంచివారు మా బావగారు. అన్నిటినీ స్పోర్టివ్ గా,ఈజీగా తీసుకుంటారు.” అని సర్టిఫికేట్ ఇస్తూ “ అక్కా! బావగారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు.” అంది.వెంటనే లత “ ఎందుకూ! నువ్వు ఉన్నావు కదా బావగారికి ఏం కావాలో చూడడానికి.” అనగానే “ చూసేరా బావగారూ! అక్కయ్య ఉడుక్కుంటుంది.” అంది ఉమ. * * భోగి రోజు ఉదయాన్నే బావగారికి గుడ్ మోర్నింగ్ చెప్పింది మరదలు.” ఆ! వచ్చేవా తల్లీ! ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను.ఇంకా నాకు బేడ్ మోర్నింగే!” అన్నాడు మాధవరావు. “ ఛ! ఛ! పండగపూటా అవేం మాటలు బావగారూ! రోజూలా ఈవేళ కూడా లేట్ గా లేవకూడదు.తెల్లారకుండానే లేచి తలంటు పోసుకోవాలి.” నాయరాలిలా చెప్పింది. “ నువ్వు నిమిషానికోసారి తలంటు పోసినంత పని చేస్తున్నావు చాలదూ!ఉండు.బ్రష్ చేసుకుని వస్తాను.” అని సూట్ కేసు లో బ్రష్ కోసం వెతికేడు.లేదు.” పరవాలేదు బావగారూ! అందుకే నేను రడీగా తెచ్చేను.నేచురల్ టూత్ బ్రష్.” అంటూ ఓ వేపపుల్ల ఇచ్చింది.” ఇది మా పెరట్లోదే. ప్రశస్తమైనదీ,ఆరోగ్యకరమైనదీను.మిలమిలలాడే దంతాలకు వాడండి నీమ్ టూత్ స్టిక్.ట్రింగ్ ...ట్రింగ్...” “ మిలమిలలాడడంకాదు తల్లీ! దానితో తోముకుంటే నా పళ్ళు జలజలా రాలిపోవడం ఖాయం.” “ ఏం బావగారూ! అంత వీక్ గా ఉన్నాయా? “ అడిగింది మరదలు. “ నీ పుణ్యముంటుంది నన్నొదిలెయ్ తల్లీ!” “ ఆ! అక్క విన్నాదంటే నేనేదో మిమ్మల్ని పట్టుకున్నాననుకుంటుంది. త్వరగా బ్రష్ చేసుకుని రండి. స్నానానికి అన్నీ రడీ చేస్తుంది అక్కయ్య.” చెప్పింది మరదలు పిల్ల. “ ముందు నువ్విక్కడనుండి వెళ్ళు తల్లీ!” “ ఓ కే ఏదైనా కావాలంటే పిలవండి బావగారూ మొహమాటపడకండి.” “ కావలసినా పిలవను.” “ అయితే మీకే నష్టం.” అంటూ అక్కడినుండి మెల్లిగా జారుకుంది ఉమ. * * బావమరది బాబీ బావగార్ని ‘భోగిమంట చూస్తారా’ అని అడిగేడు. “ భోగిమంటకేంగాని బాబీ నా కడుపుమంట ఎవరు చూస్తారు?” అన్నాడు మాధవరావు. “ ఇంకెవరు? అక్కయ్యే! అదిగో! అటు చూడండి.ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకుని నిలబడ్డట్టు అక్కయ్య కాఫీ కప్పు పట్టుకుని నిలబడి ఉంది.” చెప్పేడు బాబీ. “ బలేవాడివోయ్ బామ్మర్దీ! “ అంటూ భార్యతో “ మీ తమ్ముడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే! “ అన్నాడు. “ వాడిమాటకేంగాని ముందీ కాఫీ తీసుకొండి.చల్లారిపోతుంది.” అని కాఫీ కప్పు అందించింది లత. “కాఫీలో ఎనీ థింగ్ స్పెషల్? “ అడిగేడు. “ మీ మరదలు చేసింది కాదు లెండి. నేనే చేసేను. భయపడక్కర్లేదు.” చెప్పింది. “ ఓ కే థాంక్ యు “ అంటూ అందుకున్నాడు. “ బావగారూ! ఎన్నాళ్ళనుండో నాకో డౌటు ఉండిపోయిందండీ. ఎవర్నడిగినా చెప్పడంలేదు.” అన్నాడు బాబీ. ఏంటని అడిగేడు మాధవరావు. “ హనీమూన్ అంటే ఏంటండీ బావగారూ!” అనగానే “ ఛప్! నీకెందుకురా వెధవ ప్రశ్నలూ నువ్వూను.”కసిరింది తమ్ముడ్ని లత . “ చూసేరా! అందరూ ఇదే మాట. ప్లీజ్ మీరైనా చెపుదురూ” అన్నాడు బాబీ.ఇంక తప్పేదిలేదని “ అదో మనిషి పేరోయ్. హనీమాన్ అని హోమియో వైద్యం కనిపెట్టినాయన లేడూ అలాగే హనీమూన్ అనే ఆయన కూడా ఉండి ఉంటాడు. హనీ అంటే ఏమిటి? “తేనె” చెప్పేడు బాబీ. అదే సుధ అని కూడా అంటారు.” మూన్ అంటే? “ అనగానే “ చంద్రుడు “ చెప్పేడు బామ్మర్ది. హనీమూన్ అంటే సుధాచంద్రుడు. సుధాచంద్రన్ అని ఒకావిడ లేదూ అలాగే. అవునూ!మీ ఇంగ్లీష్ టీచర్ ని అడగలేదా ఈ డౌటు?” అన్నాడు.

“ అడిగేను బావగారూ! ఫుల్ మూన్ అంటే పున్నమి బ్లూ మూన్ అంటే అమావాస్య హనీమూన్ అంటే ఆ రెంటికీ మధ్యది అని చెప్పేరు.కాని నాకర్థంకాలేదు.” అన్నాడు బాబీ. “ బాగుంది.వాడితో ఏంటి? ముందు మీరు టిఫిన్ కి రండి.” పిలిచింది లత భర్తని. “ బావగారి సెల్ రింగవుతుంది.ఒరేయ్ తమ్ముడూ! నేను చెప్తే నమ్మరు బావగారు గాని సెల్ తీసుకొచ్చి బావగారికివ్వు.” చెప్పింది ఉమ. మాధవరావు సెల్ తీసుకుని “ హలో! సార్! ఆ! అలాగే.” అంటున్నాడు.

” ఏంటండీ” అడిగింది లత.” అర్జంట్ గా డ్యూటీకి రమ్మని మా బాస్ దగ్గరనుండి కాల్.” చెప్పేడు. “ పండగపూటా డ్యూటీ ఏమిటండీ?” “ మా జి ఎం వస్తారని చెప్పేను కదా. ఆయన వస్తున్నారట.ఏదో అర్జెంట్ వర్క్ ట.వెంటనే రమ్మంటున్నారు.” అని చెప్పి “ మామగారూ!అత్తగారూ! మరి నే బయలుదేరతాను.” అన్నాడు కొత్త అల్లుడు. “ అదేంటి బాబూ!పండగపూటా వెళ్ళిపోవదమేంటి? బాగులేదు.అమ్మాయి కూడా బాధపడుతుంది.పోనీ అంత తప్పనిసరైతే భోజనం చేసి వెళ్ళండి.” అన్నారు మామగారు. “ ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడూ సెలవివ్వడు మా బాస్.” చెప్పేడు “ బావగారూ!మిమ్మల్ని ఇంకా కొన్ని డౌట్స్ అడుగుదామనుకున్నాను .అప్పుడే వెళ్ళిపోతున్నారు.” అన్నాడు బాబీ.” మీ ఇద్దరూ కలిసి ఆయనను ఆట పట్టించేసేరు.” అంది లత. “ ఎంతయినా బావగారు కదా “ అన్నాడు బాబీ. “ పాపం బావగారు వచ్చిన వేళ బాగులేదు.” అంది ఉమ. “ ఆయన వచ్చిన వేళ కాదు నువ్వోచ్చిన వేళ బాగులేదు” అంటూ భర్తతో “ నేనూ మీతో వచ్చేస్తానుండండి.మీరు లేకుండా నాకు మాత్రం పండగేంటి?” అంది సహధర్మచారిణి . “ దటీజ్ అక్కయ్య!! రియల్ బెటర్ హాఫ్ .బావగారికి డ్యూటీ తర్వాతే పండగ. అక్కయ్యకు బావగారితోతే పండగ.” అంది ఉమ ( సమాప్తం ) ( ఈ నా కథ అమెరికా అంతర్జాల పత్రిక "వాస్తవం" లో తే.20.04.2017 దీని ప్రచురితమైంది. )

( సమాప్తం )


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం


57 views0 comments
bottom of page